తిరువణ్ణామలై-అగ్నిలింగం
తిరువణ్ణామలై-అగ్నిలింగం
పంచభూత లింగాలలో ఇంతవరకు పృధ్వీ లింగం, జల లింగం, ఆకాశ లింగం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అగ్ని లింగం గురించి చెప్పుకుందాం. ఆ తరువాత వాయు లింగం గురించి చెప్పుకుందాం. అన్నట్టు ఇక్కడ నేను ఇంతవరకూ చెప్పని మరో విషయం కూడా చెపుతాను. అది మన పంచేద్రియాలకూ, పంచభూతాలకూ గల సంబంధం. పంచభూతాలూ మన పంచేంద్రియాలతో ఎలా పని చేయిస్తున్నాయో చూడండి.
ఆకాశం నుంచి శబ్దం ఉత్పన్నం అవుతోంది, దాన్ని మనం చెవుల ద్వారా వినగలం. మధ్యలో వున్న స్పేస్, లేదా మీడియం ద్వారా మాత్రమే శబ్దం పయనిస్తుంది. అదే ఆకాశం. అంటే ఆకాశం మన శ్రవణేంద్రియం పనిచేసేలా చేస్తోంది. ఇక మనకు గాలితో స్పర్శ తెలుస్తోంది, అంతేకాక గాలి శబ్దాన్ని వినగలం కూడా. ఇక్కడ గాలి తన స్పర్శ చేత త్వక్ (చర్మము) ఇంద్రియాన్ని, శ్రవణేంద్రియాన్ని పనిచేయిస్తోంది. ఆ తరువాత అగ్ని, ఈ అగ్నికి శబ్దం, స్పర్శ మాత్రమే కాక రూపం కూడా వుంది. మనకు హోమ గుండంలో ఎన్నెన్ని రూపాలు కనిపిస్తాయో కదా. కనుక అగ్ని మన త్వక్ ఇంద్రియాన్ని, శ్రవణేంద్రియాన్నే కాక, చక్షువులు కూడా పనిచేసేలా చేస్తోంది. అంటే మనం అగ్ని రూపాన్ని చూడగలం, శబ్దాన్ని వినగలం, స్పర్శనూ అనుభవించగలం. ఇక నీరు, నీటికి పై అన్ని ధర్మాలతో పాటు రుచి కూడా వుంది. అంటే మన నాలుకను కూడా పని చేసేలా చేస్తోంది నీరు. నీటి శబ్దాన్ని వినగలం, తాకగలం, వీక్షించగలం, రుచి కూడా చూడగలం. చివరగా భూమి, ఇది మనను వాసనను ఆఘ్రాణించేలా చేస్తుంది. మట్టి వాసన అంటామే, అదే. దీని వల్ల అన్ని ఇంద్రియాలూ పనిచేస్తాయి. కనుక ఈ పంచభూతాలూ ఆకాశం శబ్దాన్ని, గాలి శబ్దంతో పాటు స్పర్శని, అగ్ని శబ్దం, స్పర్శలతో పాటు, రూపాన్ని, నీరు శబ్దం, స్పర్శ, రూపంతో పాటు రుచినీ, చివరగా పృధ్వి శబ్దం, స్పర్శ, రూపం, రుచితో పాటు వాసనను కూడా మనకు తెలియ చేస్తున్నాయి. మన దేహానికీ, పంచ భూతాలకీ విడదీయరాని అనుబంధమిది. అందుకే ఈ దేహంలో వున్నఅణువులో వాటితో ఏర్పడ్డవే. ఈ దేహం సంపూర్ణంగా పాంచభౌతికమైనది.


ఇప్పుడు అగ్ని లింగం వద్దకు వద్దాం. లింగోద్భవగాధను ముందే చెప్పానుకదా. బ్రహ్మ, విష్ణువు తామిద్దరిలో ఎవరు గొప్పా అని కలహిస్తున్న సమయంలో, వారిద్దరి మధ్యలో నుండి ఒక గొప్ప అగ్నిస్తంభం పుట్టి ఆకాశంలోకి పైకెగసిపోయింది. ఇద్దరూ ఈ కొత్త శక్తి ఏమిటి అని తెల్లబోయారు. అప్పుడు బ్రహ్మ ఆ అగ్ని స్తంభం ఎంత పైకి పోయిందో చూద్దామని హంస రూపంలో పైకి ఎగిరి వెళ్లాడు. అలాగే విష్ణువు ఆదివరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ, ఆ అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దామని కిందకు వెళ్ళాడు. ఆది, అంతాలు ఇద్దరికీ దొరకలేదు. అప్పుడు బ్రహ్మ అబద్ధం చెప్పాలని చూస్తే, శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు లేకుండా శాపం ఇచ్చాడు. విష్ణువు బుద్ధికి సంకేతమైతే, బ్రహ్మ అహానికీ, శివుడు ఆత్మకీ ప్రతీకలు. కింది చిత్రంలో చూడండి, హంస, వరాహం, శివుడు అన్నీ కనపడతాయి. ఆ అగ్ని లింగమే ఈ అరుణాచల లింగం. ఈ రోజుకీ ఈ ఆలయం గర్భగుడి లోనికి వెళ్లి నుంచుంటే, వేడిగా సెగ తగులుతుంది. ఈ లింగోద్భవం మనకు, ఆత్మకు ఏవిధంగా ఆది, అంతం లేదో, ఎలా అది నిరంతరం జ్వలిస్తూ ఉంటుందో చెప్తుంది.
ఇప్పుడు అరుణాచలేశ్వరస్వామి ఆలయానికి వెళదాం. ముందుగా స్వామివారిని దర్శించడానికి వెళ్ళాం. అందరినీ గర్భగుడి లోనికి పోనీయరు. దానికి కొంత డబ్బు కడితే లోపలికి వెళ్లనిచ్చారు. అగ్ని సెగ స్పష్టంగా తెలిసింది. చెమట కూడా పోసింది. అగ్ని లింగ రూపంలో వున్న శివుడిని దర్శించాక అమ్మవారి ఆలయానికి వెళ్ళాం. ఇక్కడి అమ్మవారి పేరు, అపీతకుచాంబ. పేరు కొత్తగా వున్నా, దీనికో కథ వుంది. వినాయకుడు బాల్యంలో అమ్మవారి ఒడిలో చేరి స్తన్యం తాగుతూ, ఆటగా రెండవ స్తనం కోసం తన తొండంతో వెతికాడుట. ఇక్కడ వున్నది అర్ధనారీశ్వరుడవటంతో ఆ వైపున శివుడు వున్నాడు, అక్కడ స్తనం లేదు. వినాయకుడు గాభరాగా ఆ రెండవ స్తనం కోసం వెతుక్కున్నాడుట. ఆ రెండవ స్తనంతో అమ్మవారు మన బుల్లి గణపతికి పాలివ్వలేకపోయింది కదా, అందుకని ఆ అమ్మ అపీతకుచాంబ. పాలివ్వని కుచము గల తల్లి. కొంతమంది ఇదే కథను షణ్ముఖుని గురించి కూడా చెపుతారు. షణ్ముఖునికి పాలిచ్చి పెంచింది ఆరు కృత్తికా నక్షత్రాలు గదా. అందుకే ఆయన కార్తికేయుడయ్యాడు కూడాను. అమ్మవారిని దర్శించుకుని వచ్చి యధావిధిగా అన్ని ఉపాలయాలూ చూసాం. ఆ తరువాత బయటకు వచ్చే ముందు, పక్కనే ఒక పాతాళ లింగాలయం కనపడింది. లోపలికి దిగి వెళ్లి చూసాం. అక్కడే ఎన్నో రోజులు రమణుల వారు తపస్సు చేసుకున్నారట. శిధిలమై పోయిన ఆలయాన్ని తిరిగి ఉద్ధరించారుట. మేము వెళ్ళినప్పుడు బాగానే వుంది.
ఈ అరుణాచల క్షేత్రంలో మరో విశేషం, ఇక్కడి అరుణాచలం అని పిలువబడే కొండ. స్వయంగా ఈ కొండే శివుడని కొలుస్తారు. ఈ కొండకు ప్రదక్షిణం చేస్తారు. ఇటువంటి గిరి ప్రదక్షిణాలే, మానస సరోవరం పక్కనున్న కైలాసశిఖరానికీ, మధుర దగ్గర వున్న గోవర్ధన పర్వతానికి, సింహాచలంలో ఆ సింహగిరికీ, అమరకంటక్ లో నర్మదానదికీ చూసాను. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణా పథం మొత్తం దూరం 14 కిమీ. ప్రతి రోజూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూనే వుంటారు. పౌర్ణమి రోజుల్లో ఈ ప్రదక్షిణా కార్యక్రమం మరింత ఎక్కువ మంది చేస్తారు. కార్తీక పున్నమి నాడైతే చాలా ప్రత్యేకంగా లక్షల మంది ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణా పథంలో మొత్తం 101 ఆలయాలు కనపడతాయి. ముఖ్యంగా ఎనిమిది దిక్కులా ఆయా దిక్పాలకుల ఆలయాలు కనపడతాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం వరుసగా ఆయా దిక్కుల్లో కనపడతాయి. ఈ దారి లోనే రమణమహర్షి ఆశ్రమం కూడా కనపడుతుంది. ఈ కొండ కృతయుగంలో అగ్నిరూపంలో, త్రేతాయుగంలో మరకత రూపంలో, ద్వాపరయుగంలో సువర్ణ రూపంలో ఉండేదని, ఇప్పుడు కలియుగంలో రాయి రూపంలో ఉందనీ చెప్తారు. మేము మాత్రం అంత దూరం నడవలేక, మనసులో ఆ అరుణాచలేశ్వరుని ధ్యానిస్తూ కారులో కూర్చుని ప్రదక్షిణం చేసాం. నవ్వకండి, పీతకష్టాలు పీతవి, సీత కష్ఠాలు సీతవి, టోపీ తల కష్టాలు టోపీ తలవి. టోపీ అలవాటైన వారు అది లేకుండా బయటకు రాలేరు. లోపల ఉక్క, బైటకు పోజు. అదీ టోపీ తల కష్టం అంటే.
కార్తీక పౌర్ణమినాడు సాయంకాల ప్రదోష సమయంలో, ఈ కొండ కొమ్ము మీద ఒక జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి కొన్ని కిలోమీటర్ల వరకూ కనిపిస్తుంది. కొన్ని రోజుల పాటు వెలుగుతుంది. సుమారు మూడు, నాలుగు వేల లీటర్ల ఆవునేతితో తడిపిన వెయ్యి మీటర్ల తెల్లటి బట్టని ఈ కార్తీక దీపానికి వాడతారు. కార్తీకమాసంలో చంద్రునికి కృత్తికా నక్షత్రం దగ్గరగా ఉంటుంది. అందుకని ఆ కృత్తికానక్షత్రం కనిపించే రోజునే ఈ కార్తీకదీపాన్ని వెలిగిస్తారు. ఆరోజు ఈకృత్తికాదీపం చూడటానికి ఎంతో మంది అక్కడ చేరతారు. చాలామంది ఆ రోజు కొండ కూడా ఎక్కుతారు. ఈ దీపాన్ని ఒక పెద్ద స్థూపాకారంలో వుండే పాత్రలో, ఈ ఆవునేతితో తడిపిన బట్టను కాగడాలతో వెలిగిస్తారు. ఈ దీపం వెలుగుతుంటే, సాక్షాత్తూ అగ్నిలింగమే ఆకాశానికి ఎగసిందా అన్నట్టు ఉంటుంది. అదే సమయంలో కొండ కింద ఉత్సవమూర్తుల ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఆరోజు భక్తులు అందరికీ కొండ కిందా పైనా కూడా కన్నుల పండుగే.


ఈనాటికీ ఈ కొండపై ఎంతో మంది సిద్ధులు, ఋషులు తపస్సులు చేసుకుంటూ వుంటారు. ఆ కొండపై ఎన్నో గుహలు ఉన్నాయి. సామాన్యజనం వెళ్లలేని ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట నిశ్చలంగా భగవంతునిమీదే దృష్టి నిలిపి తపోదీక్షలో, ధ్యానదీక్షలో వుండే యోగులెందరో. రమణులు చిన్నతనం లోనే అరుణాచలం వచ్చేసి ఇక్కడే తపస్సులో వుండి పోయారు. రమణమహర్షి అని మనం పిల్చుకునే వేంకటరమణులు 1879 లో జన్మించారు. పదహారేళ్ళకే ఆత్మజ్ఞానం పొంది తపస్సు చేసుకోవటం కోసం అరుణాచలం చేరుకున్నారు. అరుణాచలేశ్వర ఆలయంలో, చాలాకాలం పాతాళ లింగేశ్వరాలయంలో తపస్సు చేసుకున్నారు. తరువాత అరుణగిరి పైకి చేరి అక్కడ తపోదీక్షలో వున్నారు. మొదట్లో అందరూ ఆ బాలుడ్ని బ్రాహ్మణస్వామి అని పిలిచేవారు. మొదటిసారి కావ్యకంఠ గణపతిముని రమణుల లోని జ్ఞానదీపాన్ని గుర్తించి ఆయనను రమణమహర్షి అని పిలవమని అందరికీ చెప్పారు. రమణాశ్రమంలో కొన్నాళ్ళు కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠం స్థాపకుడు మౌనస్వామి కూడా తపస్సు చేసుకున్నారు. పరమహంస యోగానంద కూడా వచ్చి రమణులను సందర్శించారు. ఎందరో యోగులు, ఋషులు, సిద్ధులు రమణాశ్రమంలో రమణుల వద్దనే ఉంటూ తమ తపస్సును సాగించారు. రమణుల కుటుంబం కూడా ఆయన వద్దకే చేరింది. రమణుల తల్లి, సోదరుడు జ్ఞాపకార్ధం అక్కడ ఆలయాలు కూడా నిర్మించబడ్డాయి.


రమణమహర్షికి తల్లితండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. చిన్ననాటి నుంచీ వేంకటరామన్ ప్రత్యేక ప్రవర్తనతో ఉండేవాడు. సుమారు పదహారు, పదిహేడు సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఎందుకో ఉన్నట్టుండి అతనికి మరణమంటే విపరీతమైన భయం కలిగింది. అప్పుడు అతనిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మరణం ఎవరికి, నాకా, నా దేహానికా, నేనెవరు, నేను మరణిస్తే నశించేది ఏమిటి, నాలోని ఆత్మకు మరణం ఎప్పటికీ లేదు కదా, ఈ దేహం కోసం నేనెందుకు భయపడుతున్నాను, మొదలైన ప్రశ్నలు ప్రారంభమైనాయి. ఆ తరువాత ఆ బాల వేంకటరామన్ కి ఒక్కసారిగా ఆత్మజ్ఞానం కలిగింది, నేను ఎవరో తెలిసింది. ఇక మృత్యుభయం పోయింది. తన దారేమిటో తెలిసింది. ఈ లోపు ఎవరో అరుణాచల శివ అనటం వినిపించింది. అంతే, అన్ని బంధాలూ క్షణంలో వదిలేసి అరుణాచలం చేరుకున్నాడు. తిరువణ్ణామలైకి రాక ముందు వేంకటరామన్ వేరు, వచ్చాక ఆత్మజ్ఞానంతో పరిణితి చెందిన రమణమహర్షి వేరు. ఎన్నో బోధలు చేసి, ఎందరికో జ్ఞానాన్ని పంచి, దారి చూపిన రమణులు 1950 లో ఈ దేహాన్ని వదిలేశారు. అయినప్పటికీ ఈ రోజుకీ రమణాశ్రమంలో రమణుల ఉనికిని అనుభూతి చెందేవారు ఎందరో. ఆ సమాధి హాల్ లో ధ్యానం చేసుకునే వారెందరో. దేవుడూ, దెయ్యమూ లేడనే మన తెలుగు రచయిత గుడిపాటి వెంకటాచలం రమణమహర్షిని ఒకసారి చూసాక ఆయన శిష్యుడైపోయి తన జీవితశేషం అక్కడే గడిపాడు. ఎందరినో ప్రభావితం చేసిన రమణుల బోధనలు ఈ రోజుకీ ప్రచారంలో వున్నాయి.


ఇంతటితో ఈ తిరువణ్ణామలై కథ ముగిద్దాం. ఎంత చెప్పినా తరగని గని ఈ అరుణాచలేశ్వరుని చరిత్ర. కొన్ని చదవాలి, కొన్ని వినాలి, కొన్ని చూడాలి, కొన్ని ధ్యానంలో అనుభూతి చెందాలి. ఇవి అన్నీ కలిపితే ఈ అరుణాచలం. ఇక మనం మిగిలిన అయిదవ పంచభూత లింగమైన వాయు లింగేశ్వరుడు శ్రీ కాళహస్తీశ్వరుని తరువాత కథలో చూసొద్దాం.
ఓం అరుణాచలేశ్వరాయనమః, ఓం అపీతకుచాంబాయైనమః
ఓం అరుణగిరి రూప శివాయైనమః
ఓం రమణమహర్షినేనమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
శివరాత్రి రోజున శివమహాదేవుని కథలతోపాటూ సిధ్ధులూ యోగులూ మహర్షులూ అందునా రమణమహర్షి వీరందరినీ స్మరింపచేసిన నీవ్యాసం చాలా బావుంది. యాత్రలు చేయలేని నాలాంటి వారికి అరుణాచలం చూసిన అనుభూతి కలిగింది. విజయలక్ష్మి కి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినీక్కూడా శివరాత్రి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిExcellent Vijaya. When we have visited Arunachalam, we were fortunate enough that we were able to do Giri pradakshina with out footweare. As you rightly said some places are meant to experience great spiritual awareness and Arunachalam is one such Devine place.
రిప్లయితొలగించండిజ్యోతీ, గూగుల్ మెయిల్ లో సైన్ ఇన్ చేసి కామెంట్స్ పెట్టినప్పుడు మీ పేరు కూడా కనిపిస్తుంది.
రిప్లయితొలగించండి