సౌరాష్ట్రే సోమనాథంచ


1. సౌరాష్ట్రే సోమనాథంచ......  

ఇప్పుడు ఆ శ్లోకం లోని మొదటి క్షేత్రాన్ని చూద్దాం. అదే సౌరాష్ట్రం లోని సోమనాథుడు. ఇది ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ప్రభాస క్షేత్రానికి దగ్గరలో వుంది. పూర్తిగా సముద్రం ఒడ్డు. సముద్రం నుంచి అర కిలోమీటర్ కూడా దూరం ఉండదేమో. మేము దర్శనం చేసుకుని వచ్చి మా రూమ్ బాల్కనీ లో కూర్చుంటే, సముద్రపు నీటి తుంపరలు వచ్చి చక్కగా తడిపేసాయి. సముద్ర స్నానం అయిందన్నమాట. ఆది శంకరులు ఈ క్షేత్రం గురించి ఈ విధంగా చెప్పారు. అందువల్లే మనం ఈ రోజు ఈ ప్రాంతాన్ని సోమనాథక్షేత్రంగా గుర్తిస్తున్నాము.

సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||

ఈ శ్లోకార్ధం ఏమంటే, సౌరాష్ట్రదేశంలో వున్న ఈ సోమనాథుడు జ్యోతిర్మయముగా వెలుగుతూ, చంద్రకళను తలపై ధరించి శరణుజొచ్చిన భక్తులను కృపతో చూస్తున్నాడు అని. ఈ క్షేత్రంలోనే 
సోముడు, అంటే చంద్రుడు, తనకు దక్షశాపం వల్ల వచ్చిన క్షయ వ్యాధిని, శివుణ్ణి  సేవించి  
పోగొట్టుకున్నాడు. ఆ తరువాత దయామయుడైన శివుడు ఆ సోముణ్ణి కృపతో, తన తలపై ధరించి 
సోమనాథుడనే నామంతో ప్రసిద్ధుడైయ్యాడు. సోమశేఖరుడు, చంద్రశేఖరుడు, రాజశేఖరుడు, శశిశేఖరుడు మొదలైన నామాలు శివుడికి ఆ విధంగా వచ్చి  చేరాయి. సోముణ్ణి ఉద్ధరించిన క్షేత్రం కనుక ఇది సోమనాథ క్షేత్రం. మొట్టమొదటి జ్యోతిర్లింగం ఇది. ఈ క్షేత్రం నుంచి అంటార్కిటికా వరకూ పూర్తిగా సముద్రమే, భూమి లేదు. ఆ విశేషాన్ని సూచించే ఒక బాణస్తంభము, యారో పిల్లర్, కూడా అక్కడ వుంది. మొదట ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో, అది శిధిలమయ్యాక రావణుడు వెండితో, అదీ శిధిలమయ్యాక శ్రీకృష్ణుడు చెక్కతో, ఆ తరువాత కలియుగంలో భీమదేవుడనే రాజు రాతితో నిర్మించారని చెబుతారు. 



దుఃఖం కలిగించే విషయమేమిటంటే, మహమ్మద్ గజినీ ఈ దేవాలయాన్ని పదిహేడు సార్లు పూర్తిగా ధ్వంసం చేసి సోమనాథ లింగాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ ఆలయంలో వున్న స్వర్ణ, రజత, రత్న సంపదనంతా దోచుకెళ్ళాడు. పూజారులు, భక్తులు, చివరకు అప్పటి రాజు కూడా ఈ దోపిడీ,
విధ్వంసం ఆపలేకపోయారు. అడ్డు వచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపుతూ తన కోరిక
తీర్చుకుని, విజయాన్ని ప్రకటించుకున్నాడు. ఆ తరువాత సంవత్సరాలలో  ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ ఒక నర్మదా బాణలింగాన్ని (నర్మదానదిలో దొరికే లింగాకారపు రాళ్లను బాణాలు అంటారు) అక్కడ ప్రతిష్టించిన తరువాత, భక్తులు చాలాకాలం దానినే సోమనాథుడిగా భావించి పూజించుకున్నారు. ఆ దేవాలయం ఇప్పటికీ అక్కడ వుంది. స్వయంగా తాకి అభిషేకం చేసుకోవాలనుకునే వారు ఈ ఆలయంలోనే అభిషేకాలు చేస్తారు.    

మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఈ సోమనాథ క్షేత్రాన్ని పునర్నిర్మించాలని అనుకున్నాడు. ఆ దేవాలయాన్ని తిరిగి భారతదేశమే కట్టాలన్న తన ప్రస్తావనను గాంధీ ముందు పెడితే, గాంధీ ఆ దేవాలయాన్ని నిర్మించడానికి ప్రభుత్వధనం ఖర్చు చెయ్యద్దనీ, కావాలంటే ప్రజలనుంచి చందాలు సేకరించి గుడి కట్టుకోమనీ అన్నాడు. పటేల్ మనసు కష్టపెట్టుకున్నా, ప్రజలు మాత్రం ఎంతో భక్తితో, ఆనందంగా విరాళాలిచ్చారు. ఆ దేవాలయం పటేల్ జీవితకాలంలో పూర్తికాక పోయినా, తదనంతర కాలంలో ఆయన కోరిక మాత్రం నెరవేరి ఒక భవ్య సుందర దేవాలయం ఏర్పడింది. ఈ కొత్తగా నిర్మించిన  ఆలయంలో లింగాన్ని భక్తులని తాకనివ్వరు. మనలాంటి భక్తులు గర్భగుడి ఎదుగా నుంచుని ఒక కలశంలో నీరు పోస్తే 
అది పైపులద్వారా వెళ్లి లింగాభిషేకం జరుగుతుంది. మేమూ అదే విధంగా సోమనాథుడికి అభిషేకం చేసుకున్నాము. 

అంతేకాక ఈ ఆలయంలో "లైవ్ దర్శన్" అని గర్భగుడిని , అందులో జరిగే నిత్య పూజలనూ
ప్రత్యక్షప్రసారం చేస్తున్నారు. ఆసక్తి వున్నవారు ఇంట్లోనుంచే నిత్యం సోమనాథ దర్శనం చేసుకోవచ్చు, సేవలు చూడవచ్చు. ఇక్కడ ఇస్తున్న లింక్ లో ఈ సౌకర్యం వుంది. కొత్త కొత్త టెక్నాలజీల వల్ల వచ్చిన ఆనందాల్లో ఇది ఒకటి. https://somnath.org/Home/Live-Darshan.
ఇక్కడ ఇంకొక ఆకట్టుకునే విషయమేమిటంటే, ప్రతి రాత్రి ఆ గుడి, చరిత్ర గురించి ఒక సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది. మన అమితాబ్ బచ్చన్ గారు తన గంభీరమైన గళంతో ఆ కథ అంతా చెబుతారు. సుమారు ఒక గంట ప్రదర్శన అది. మూడు భాషల్లోనూ వివిధ సమయాలు కేటాయించి చూపిస్తారు. చాలా అద్భుతంగా వుంది ఆ షో. నిజంగా ఆనాడు ఈ గుడి ఎటువంటి దుర్మార్గాలకు,
దురాక్రమణలకు లోనైయ్యిందో తెలిస్తే, హృదయం ఆర్ద్రమవుతుంది. వెళ్ళిన ప్రతివారు చూడదగ్గ షో ఇది. ఏది ఏమైనప్పటికీ, తొలుత చంద్రుణ్ణి కరుణించి, కటాక్షించి ప్రత్యక్షమైన ఆనాటి లింగం ఇప్పుడక్కడ లేదు. అయినా క్షేత్రం అదే కదా. ఇక్కడ క్షేత్ర ప్రాధాన్యతే ముఖ్యం కానీ, లింగ ప్రాధాన్యం కాదు. ఆ ప్రాంతమంతా సోమనాథమే. ఓం శ్రీ సోమనాథాయనమః.

ఈ ప్రాంతంలోనే కొద్ధిదూరంలో  ఒక త్రివేణీ సంగమం వుంది. హిరణ్య, కపిల అనే రెండు  నదులు, వాటిల్తోపాటు సరస్వతిని మూడవనదిగా భావించి దీనిని త్రివేణీ సంగమం అన్నారు. ఇక్కడ పితరులకు పిండ ప్రదానం కూడా చేస్తారు. చక్కగా కూర్చునేందుకు చాలా సిమెంట్ చప్టాలు, వాటిపై గొడుగులూ కట్టారు. చూట్టానికి బావుంది. 


 
ఇంకొక ప్రధానమైన దర్శనీయ స్థలం "భాల్కా తీర్థం". దీనినే "మోక్షద్వారక" అని కూడా అంటారు. 
ఇక్కడే ఈ సముద్రం ఒడ్డునే యాదవ వీరులందరూ  దూర్వాసశాపం వల్ల ఒకరినొకరు తుంగలతో కొట్టుకుని మరణించారు. బలరాముడు కూడా తన పాంచభౌతిక దేహాన్ని వదిలి, యోగమార్గంలో తిరిగి తన అనంత శేష రూపంలో ఒక బిలంలో దూరి వెళ్లిపోయాడని చెప్తారు. ఆ చిన్నగది, అందులో బలరాముని పెద్ద విగ్రహం, దాని తలపై ఒక పెద్ద పడగ, ఒక పెద్ద చీకటి బొరియ ఉంటాయి. ఒక్క క్షణం ఆ దృశ్యం చూడగానే ఎందుకో ఒకసారి గుండె ఝల్లుమంది. చటుక్కున బైటకు వచ్చేసాను . ఆ పక్కనే ఒక పాలరాతి పీఠంపై చెక్కిన కృష్ణ పాదుకలు కనిపించాయి. పక్కనే ఒక గీతా మందిరం వుంది. మొత్తం భగవద్గీతను పాలరాతి గోడలపై చెక్కారు. అంతా కృష్ణమయం. ఇంకొంచం పక్కకు వెళితే శ్రీకృష్ణుడు దేహోత్సర్గం, అంటే దేహత్యాగం, చేసిన ప్రదేశం వస్తుంది. 


    

శ్రీకృష్ణుడు ఒక రావి చెట్టు కింద కాలిపై కాలు వేసుకుని పడుకుని ఉండగా, ఆపాదాలకు వున్న ఎర్రని లత్తుకను, పారాణిని, చూసి జర అనే బోయవాడు అదేదో జంతువని భ్రమించి బాణం వేయగా, ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు నిర్యాణం చెందుతాడు. నిజం తెలిసాక పొరబాటయ్యిందని 
ఆ బోయ చాలా బాధపడతాడు. క్షమాపణలు అడుగుతాడు. అప్పుడు స్వయంగా శ్రీకృష్ణుడే, ఆ బాణపు ములికి దూర్వాస శాప ఫలితంగా పుట్టిన ముసలంలో మిగిలిపోయిన ముక్క అనీ, ఆ బోయవాడు పూర్వజన్మలో వాలి అనీ, రాముడి రూపంలో చెట్టుచాటు నుంచి వాలిని చంపినందుకు ప్రతిగా, అతడు ఈ జన్మలో ఈ విధంగా శ్రీకృష్ణుడిని చెట్టుచాటు నుంచి చంపాడనీ చెప్పి, రోదిస్తున్న ఆ బోయవాడిని ఓదారుస్తాడు. ఇప్పటికీ ఆప్రాంతంలో ఒక రావి చెట్టు, కింద బాణం గుచ్చుకున్న శ్రీకృష్ణుడు, ఎదురుగా రోదిస్తున్న బోయవాడూ అన్నీ విగ్రహ రూపంలో కనిపిస్తాయి. ఈ సన్నివేశం చూసేసరికి హృదయం చాలా భారమైపోయింది. కొత్తగా ఇప్పుడే మళ్ళీ బలరామ కృష్ణులను పోగొట్టుకున్న భావన కలిగింది. ఎంత బాధ వేసిందో మాటల్లో చెప్పలేను. ఆ భావనా ప్రపంచం నుంచి బైటకు రావటానికి ఎంతో ప్రయత్నం చేయాల్సి వచ్చింది. రూమ్ కి తిరిగి వచ్చి స్నానం చేసి బాల్కనీలో కూర్చుంటే సముద్రపు గాలి నీటి తుంపరలను పంపించి ఓదార్చింది.   



అన్నట్టు సర్దార్ పటేల్ గారు గుజరాత్ లోని జునాగఢ్ రాజ్యాన్ని మన భారతదేశంలో కలపక పోయినట్లైతే ఇప్పుడీ ప్రాంతం అంతా ఏ పాకిస్దాన్ లోనో వుండి ఉండేది. అందుకే ఇంతకు ముందు కూడా అన్నాను, ఈ పన్నెండు జ్యోతిర్లింగాలూ అదృష్టవశాత్తూ ప్రస్తుతం మన భారత దేశంలోనే వున్నాయి అని.

కనుక నేను శ్రీసోమనాథాయనమః, శ్రీకృష్ణాయనమః, తో పాటు శ్రీఅహల్యాబాయినేనమః, శ్రీవల్లభభాయినేనమః అని చెప్పుకుంటూ సోమనాథ దర్శనం వివరాలు ముగిస్తాను.


  తరువాత శ్రీశైలే మల్లికార్జునమ్ చెప్పుకుందాం.  


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

తిరువణ్ణామలై-అగ్నిలింగం

శ్రీశైలే మల్లికార్జునమ్