ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనమ్

  

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనమ్ 

లఘు స్తోత్రం

సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమలేశ్వరమ్

ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే

వారాణస్యాం తు విశ్వేశం, త్య్రంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.


Image result for adi shankaracharya

సంపూర్ణ స్తోత్రమ్


సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే || 1 ||

శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ || 2 ||

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ || 3 ||

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే || 4 ||

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి || 5 ||

యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి || 6 ||

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి || 7 ||

యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే || 8 ||

సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || 9 ||

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే || 10 ||

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే || 11 ||

ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే || 12 ||

జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||





ఇది ఆదిశంకరులు చెప్పిన ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రం.  భరతవర్షంలో ఎన్నో, ఎన్నెన్నో ప్రముఖ, మహిమాన్విత లింగాలున్నాయి. అన్నింటిల్లోనూ ఈ పై శ్లోకాలలో చెప్పిన పన్నెండు లింగాలనీ, జ్యోతిర్లింగాలుగా శంకరులు పేర్కొన్నారు. ఆయన చెప్పినదాన్ని బట్టి, ఆయా లింగాలు ఉద్భవించినప్పుడు అవి ఒక ప్రత్యేకమైన జ్యోతితో, అమోఘమైన కాంతితో వెలిగిపోయాయని చెప్పాడు. అందుకే వాటిని జ్యోతిర్లింగాలు అనాలనీ చెప్పాడు. ఆ జ్యోతి అలా చిరకాలం వెలిగి రకరకాల దోషస్పర్శల చేత కాంతిని కొంతవరకు కోల్పోయింది అని అంటారు. అయినప్పటికీ ఆయా లింగాలు తమ ప్రభావం కోల్పోకుండా ఈనాటికీ మనల్ని పరిరక్షస్తున్నాయని ఆస్తికుల భావన. ఆస్తికులు అంటే దేవుడు 'అస్తి' అనుకునేవాళ్లు. అంటే దేవుడు వున్నాడు అనుకునేవాళ్లు. అదే నాస్తికులంటే దేవుడు 'నాస్తి', 'న అస్తి' అనుకునేవాళ్ళు. అంటే దేవుడు లేడు అనుకునే వాళ్ళు. ఒక కవి ఇలా అంటాడు, "ఎరిగిన వారికి ఎదుటే వున్నాడు, ఎరుగని వారికి ఎదలో వున్నాడు". అంటే నాస్తి అన్నవాళ్లకి ఆ నాస్తి ఎప్పటిదాకా అంటే, వారిలో వున్న ఆ దేవుడ్ని తెలుసుకునేవరకూ. తరువాత సర్వం ఈశ్వరమయం, సర్వం సమానం. అంతా ఒక్కటే. 

ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి శివపురాణం లో చెప్పారు. ఈనాటికీ ఈ విషయాలన్నింటికీ
శివపురాణమే ప్రమాణం. శివపురాణం లో చెప్పిన స్తోత్రం ఇది. శివపురాణం లోని శతరుద్రీయంలో ఈ శ్లోకాలు వున్నాయి. శంకరాచార్యుడు చెప్పిన శ్లోకాలకీ వీటికీ స్వల్ప భేదముంది. ఈ శ్లోకాలు ఇవీ.

సౌరాష్ట్రే సోమనాథశ్చ శ్రీశైలే మల్లికార్జునః|
ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారే చామరేశ్వరః ||
కేదారో హిమవత్పృష్టే డాకిన్యాం భీమశంకరః |
నారాయణస్యాం చ విశ్వేశస్త్య్రంబకో గౌతమీ తటే ||
వైద్యనాథశ్చితా భూమౌ నాగేశో దారుకావనే |
సేతుబంధే చ రామేశో ఘుశ్మేశశ్చ శివాలయే ||
అవతార ద్వాదశకమేతశ్చంభో పరాత్మనః |
సర్వానందకరం పుంసాం దర్శనస్పర్శనాన్మునే||

దీనిని తరువాతి రోజులలో శంకరాచార్యులు సంస్కరించి పై శ్లోకాల రూపంలో మనకందించారు. శివపురాణంలో ఈ జ్యోతిర్లింగాలన్నింటి గురించి చాలా వివరణాత్మకంగా చెప్పబడింది.

ఈ జ్యోతిర్లింగాలు అన్నీ చూడాలంటే కొంచం కష్టం కానీ అసాధ్యం మటుకు కాదు. మేము ఆ  పన్నెండు చూసే క్రమంలో పదిహేను చూసాం. ఇదేంటి అని ఆశ్చర్యపోకండి. ఆ వివరాలన్నీ మున్ముందు చెపుతాను. అసలు ఆది శంకరుడు ఏ జ్యోతిర్లింగం ఎక్కడుందో చాలా చక్కగా దాని జాగ్రఫికల్ వివరాలు అన్నీ, ఆ పైన చెప్పిన శ్లోకాలలో చెప్పాడు. ఇప్పుడు మన గూగుల్ మాప్స్ లో లాగా, లొకేషన్ ని శ్లోకాలతో షేర్ చేసాడన్నమాట. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల పోలిక, వివరణ ఒకేలా ఉండటం వల్ల  కొంత తికమక ఏర్పడి, ఈ రోజుల్లో దాదాపు అందరూ ఈ పదిహేను క్షేత్రాలూ దర్శిస్తున్నారు. కొన్ని చోట్ల అసలు మొదట ఉద్భవించిన లింగాలే లేవు. అవి దురాక్రమణలకు లోనై భిన్నమయ్యాయి. అంటే పగలకొట్టబడ్డాయి, ముక్కలైపోయాయి. కాశీలో అయితే పూజారులు శివుడిని రక్షిస్తున్నామన్న భావనలో, లింగాన్ని వారే పెరికి అక్కడి బావిలో వేశారు. అది జ్ఞానవాపిగా నేటికీ ప్రసిద్ధం. ఆ బావిలో (సంస్కృతంలో వాపి అంటే బావి అని అర్థం) నీరే ఇప్పటికీ అందరికీ 
తీర్థంగా ఇస్తుంటారు. ఆ వాపి పక్కనే అప్పటి పెద్ద నంది కూడా దర్శనమిస్తుంది.  

దేవుడు మనల్ని రక్షిస్తున్నాడా, లేక మనమే దేవాలయాలను పరిరక్షిస్తున్నామా అనేది చాలా మందికి ఒక ప్రశ్న. అన్నిచోట్లా వున్న దేవుణ్ణి, (విష్ణు అనే పదానికి అర్ధం సర్వత్రా వ్యాపించి వున్న అని) కొన్నిచోట్ల మంత్రపూతంగా ప్రతిష్ట చేసి మనమే అక్కడ మనకు కావాల్సిన రూపంలో దేవుడిని చూసుకుని ఆనందపడుతున్నాం. వివేకానందుని గురించి ఒక కథ చెబుతారు. ఆయన అమ్మవారిని, 'అమ్మా, నీ దేవాలయాలను దుండగులు నాశనం చేస్తుంటే, అపవిత్రం చేస్తుంటే, నువ్వు వాళ్ళను శిక్షించక ఉపేక్షిస్తున్నావేమిటి,' అని. అప్పుడు అమ్మవారు, "నాయనా, నేను దేవాలయాలను కట్టమని అడిగానా, సంరక్షించామని చెప్పానా, ఎవడి బుద్ధికి తోచింది వాడు చేస్తున్నాడు. చేసే ప్రతి కర్మకీ ప్రతిఫలం ఉంటుంది. మంచిపనికి మంచి ఫలం, చెడ్డపనికి చెడ్డఫలం. అంతే కానీ మీరు కట్టిన నా ప్రతి దేవాలయాన్నీ కాపాడటం నా పని కాదు కదా", అందిట. విపరీతకాలే విపరీతబుద్ధి అని అంటారు అందుకే.  దేవత ప్రత్యక్షమైన ప్రదేశం కనుకనే ఆ ప్రాంతానికి ఆ శక్తి. ముఖ్యంగా చూడాల్సింది క్షేత్ర లేదా తీర్థ మహిమే కానీ అన్ని మహిమలూ, శక్తులూ ఆ విగ్రహానికే ఆపాదించటం కాదు. విగ్రహం అనేది మనలను సగుణం నుంచి నిర్గుణానికి తీసుకుపోయే సాధనం. సాకారం నుంచి నిరాకారానికి వెళ్ళడానికి అది మనకు ఒక నిచ్చెనలా పనిచేస్తుంది. అంతే.    
               
కొన్ని దేవాలయాలలో మూలమూర్తి స్వయంవ్యక్తం, కేదారం, కుంభకోణం, మాహుర్, అంబాజోగై
వంటివి ఈ కోవలోకి వస్తాయి. మరి కొన్నిటిలో దేవ ప్రతిష్ఠితం, పంచారామాలు, రామేశ్వరం వంటి జ్యోతిర్లింగాలు వంటివి. ఇంకొన్ని ఋషి ప్రతిష్ఠితం, బాసర అమ్మవారిని వ్యాసుడు, అగస్త్యేశ్వర లింగాలని అగస్త్యుడు ప్రతిష్టించారు. కాలక్రమేణా వాసర పేరు బాసరగా మారింది. కొన్ని మానవ ప్రతిష్ఠితం, అర్జునుడు ఇంద్రకీలాద్రి మీద ప్రతిష్టించిన మల్లికార్జున లింగం. ఇవి నిత్యం మనం మన కళ్ళెదురుగా చూస్తూనే ఉంటాం. ఈరోజుల్లో ధార్మికులు ఎంతోమంది కూడా శ్రద్ధాభక్తులతో దేవాలయాలు నిర్మించటం చూస్తూనే వున్నాం. 'యద్భావం తద్భవతి' అని మన మనోభావమే ఆ యా దేవతా స్వరూపాలుగా వ్యక్తమవుతున్నాయి. ఆది శంకరులు జన్మించే కాలానికి దేశంలో ఎన్నో మతాలుండి మతకలహాలు పెచ్చుమీరిపోయాయి. అది చూసిన ఆదిశంకరులు ఇన్ని రకాల
మతాలు ఉంటే మన మనుగడకే ప్రమాదమని గ్రహించి, కేవలం షణ్మతాలు, అంటే ఆరు
మతాలని మాత్రం గుర్తించాడు. ఆ ఆరు మతాలసారాన్ని తిరిగి ఒక స్రోతస్సుగా చేసి దానికి అద్వైతం అని పేరు పెట్టాడు. ఈ ఆరూ కాక, మిగిలిన మతాల గురువులను, పెద్దలను తన వాదంతో పరాజితులని చేసి, వారినీ అద్వైతంలోకి తీసుకువచ్చాడు. ఆ ఆరు మతాలూ ఇవి, సౌరం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, స్కాంధం, వైష్ణవం. (కొందరు స్కాందం కాదు కాపాలికం అంటారు) ఈరోజుకీ అద్వైత పీఠాధిపతులందరూ ఈ ఆరు దైవాల పూజా చేస్తారు. ఏ పీఠాధిపతిని గమనించినా, వారు ఆహార్యంలో, అంటే వస్త్రధారణలో, శాక్తేయ పద్ధతిని, విభూతిరేఖలు శైవ పధ్ధతిలోను ధరించి కనపడతారు. ఆశీర్వచనం మాత్రం 'నారాయణ, నారాయణ' అని వైష్ణవపద్ధతిలో చేస్తారు. ఇది ఆది శంకరులు అద్వైత మత ప్రచారకులకు విధించిన నియమం.

ప్రాచీన శివాలయాల్లోని శివలింగాలు చాలావరకు స్వయంభువులే. అది మనకు చాలా స్పష్టంగా కేదారం, కుంభకోణం, ఓంకారేశ్వరం వంటి దేవాలయాల్లో కనపడుతూ ఉంటుంది. ఆ లింగాలు అందుకే, తీర్చిదిద్దినట్టుగా వుండవు. వాటి ఆకారం ఇతర శివలింగాలవలె ఉండదు. శివుడు భక్త సులభుడు. భోళా శంకరుడు. తనను పూజించిన వారెవరైనా సరే వారి వారి కామితములు తీర్చే దేవుడు. ఇటువంటి శివునికి శక్తి తోడయి, వారిద్దరూ జగత్ పితరులుగా ఈ జగత్తును కాపాడుటూ ఉంటారు. అటువంటి ఆ ఆది దంపతులకు "జగతః పితరౌ వందే" అని నమస్కరించుకుంటూ ముందుకు సాగుదాం.

ఇప్పుడు మళ్ళీ మన జ్యోతిర్లింగాల దగ్గరకు వద్దాం. పైన చెప్పిన పన్నెండూ అదృష్టవశాత్తూ
ప్రస్తుతం మన భారత దేశంలోనే వున్నాయి. నేను ముందు ఉదహరించిన ఆ మూడు వస్తువులూ మన దగ్గర ఉంటే ఆ దర్శనం చేసుకోవచ్చు. ఆ దేవదేవుని అనుగ్రహం చేత మేము కొన్నింటికి ఒకసారి, కొన్నింటికి రెండుసార్లు, కొన్నింటికి మూడుసార్లు, కొన్నింటికి ఇంకా ఎక్కువ సార్లు వెళ్లాం. మరి కొన్నింటిని మళ్ళీ చూడాలని వుంది కానీ ఆ మూడూ(పిలుపు, ఆరోగ్యం, డబ్బు) ఉండాలి కదా.

                                   
          ఇక నుంచీ ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేద్దాం. 
 

భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650

కామెంట్‌లు

  1. నమస్కారం అమ్మ 🙏🏻, చాలా బాగా చెప్పారు మీకు నా కృతఙ్ఞతలు తల్లీ,, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి, నాకు శివయ్య అంటే అపారమైన నమ్మకం, ఇష్టము, శివయ్య ఇచ్చిన మా ఈ కుటుంబాన్ని చాలా సార్లు ఆదుకున్నాడు ఆ తండ్రి , ఎప్పుడు శివయ్య పూజ చేసిన మాకు అంత మంచి చేసాడు అమ్మ, ఆ తండ్రి ఉన్నాడు అని నేను ఎప్పుడు కొండంత ధైర్యం తో ఉంటాను అసలు ఒకరకముగా చెప్పాలి అంటే నేను ఎటు చూసిన నాకు శివయ్యే కనిపిస్తాడు, సర్వం శివ మయం జగత్ ☺️, ఆ తండ్రి దయ వల్లే మేము బాగున్నాం, అసలు నాకు ఆ తండ్రే లోకం, ఆ తండ్రే సర్వస్వం.🙏🏻
    నమః పార్వతి పతయే హర హర మహాదేవ 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

తిరువణ్ణామలై-అగ్నిలింగం

శ్రీశైలే మల్లికార్జునమ్