కుంభకోణం

కుంభకోణం 

కుంభకోణం తమిళనాడులోని ఒక ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రం. ఇక్కడ లెక్కలేనన్ని దేవాలయాలు వున్నాయి. అసలు ఈ వూరే పుణ్యక్షేత్రాల నగరం. కాశీలో లింగాలు ఎన్ని ఉన్నాయో చెప్పటం ఎంత కష్టమో, ఈ వూళ్ళో  మొత్తం ఎన్ని దేవాలయాలున్నాయో చెప్పటం కూడా  అంత కష్టం. పైగా దాదాపు అన్నీ పురాతన ఆలయాలే. ఇక్కడ వున్న ప్రధానాలయం, ఆది కుంభేశ్వరాలయంలో ఉన్న కుంభేశ్వరస్వామి పేరు మీదే ఈ ఊరును కుంభకోణం అని పిలుస్తున్నారు. ఇక్కడ వున్న అన్ని ఆలయాల గురించీ చెప్పటం కూడా అసాధ్యం. ఒకవేళ చెప్తే, అదే ఒక మహాభారతం అంత పెద్ద గ్రంథం అవుతుంది. మనం కొన్ని శివాలయాలు గురించి మాత్రం ముచ్చటించుకుందాం. సుమారు 20 కిమీ పరిధిలో చోళరాజుల కాలంలోనే నిర్మించబడ్డ ఇతర దేవతల ఆలయాలు కాకుండా కేవలం శివాలయాలే సుమారుగా 37 వున్నాయి. అన్నింటిలో ముఖ్యమైన ఆది కుంభేశ్వరాలయం గురించి ముందుగా చెప్పుకుందాం.  

 
                        
యుగాంతమప్పుడు ఈ సకల సృష్టి ఆ మహాప్రళయంలో లయించిపోతూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుని సలహా మేరకు ఇసుకను అమృతంతో తడిపి, దానితో ఒక కుండను చేసి, ఆ కుండ నిండుగా ఔషధులు, బీజాలు, వేదాలు, మామిడి, బిల్వ పత్రాలు వేసి, ఆ కలశం పైన ఒక కొబ్బరికాయను పెట్టి, దానిని దారాలతో కట్టి ప్రళయంలో వదిలేస్తాడు. ఆ కుండ, కుంభం, వరదలో కొట్టుకుపోతూ ఈ కుంభకోణమున్న ప్రాంతానికి వచ్చి ఆగిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఒక కిరాతుని రూపంలో వచ్చి ఆ కుంభాన్ని బాణంతో కొడతాడు. అలా ఆ కలశం నుంచి వెదచల్లబడిన మామిడి ఆకులతో మామిడి చెట్లు, బిల్వపత్రాలతో మారేడు చెట్లు, కొబ్బరికాయతో కొబ్బరిచెట్లు ఉద్భవించి పెరిగాయి. అన్ని రకాల బీజాలతో ఆయా సంతతి పెరిగింది. అప్పుడు ఆ కుండ నుంచి పడిన అమృత జలంతో కుంభకోణంలో ఒక పెద్ద కోనేరు ఏర్పడింది. అదే మహామహం పుష్కరిణి. ఆ కుండ నుంచి బయటపడ్డ ప్రతి అణువూ, ప్రతి వస్తువూ ఒక ఆలయమైంది. అందుకే ఈ వూళ్ళో అన్ని ఆలయాలు. చివరకు ఆ కుండే స్వయంగా ఆది కుంభేశ్వరుడైయ్యాడు. ఆ లింగం కొంచెం శంఖువు ఆకారంలో ఉంటుంది. అమ్మవారు వచ్చి ఎడమవైపు చేరంగానే, ఆమెను చూడటానికి శివుడు అటువైపు కొంచం వంగాడుట. దాంతో ఆ శంఖువు ఆకారంలో వున్న లింగానికి ఎడమవైపు కొంచెం కోణం ఏర్పడింది. అదే కుంభకోణం. ఇటువంటి లింగాన్ని మనం ప్రపంచంలో వేరెక్కడా చూడం. ఈ కోణాకృతిలో వున్న కుంభరూప మహాదేవుడే శ్రీ ఆది కుంభేశ్వరుడు. ఈ ఊరుకి, ఆ ఆలయానికి ఆ పేరు రావడానికి కారణమైనవాడు.
                                      
   

మేము 2017 లో రెండోసారి కుంభకోణం వెళ్ళినప్పుడు, కుంభేశ్వరస్వామి ఎదురుగా ఒక మధ్య వయసు వ్యక్తి నుల్చుని గంభీరంగా, భక్తిగా దేవునిపై పాట పాడుతున్నాడు. అతని కంఠంలో మంచి గమకాలు, సంగతులు పలుకుతున్నాయి. భాష తమిళమో, మలయాళంమో అర్ధం కాలేదు కానీ, భక్తి, శ్రద్ధ, పాండిత్యం మాత్రం స్ఫష్టంగా తెలుస్తున్నాయి. చాలా శ్రద్ధగా భక్తిగా పాడుతున్నాడు. గొంతులో నుంచి గమకాలే కాకుండా, రకరకాల వాయిద్యాల నాదాలు కూడా వినిపిస్తున్నాయి. ఆశ్చర్యానందాలతో వింటూ ఉండిపోయాం. పాట అయిపోయాక పూజారి హారతి ఇచ్చి తీర్ధం ప్రసాదం ఇచ్చాడు. మేమూ తీసుకున్నాం. కానీ నా మనసింకా అతని భక్తిగీతం మీదే వున్నది. అతని తరువాత పూజారి మాపేరుతో కూడా అర్చన చేసాడు. ఈ ఆలయంలో చైత్ర మాసంలో సూర్య కిరణాలు సూటిగా మహాదేవునిపై పడి  అర్చన చేస్తాయని చెప్పారు. ఈ ఆలయాన్నిఎంత గొప్ప శాస్త్రీయ పద్ధతిలో ఆనాటి శిల్పాచార్యులు కట్టారో కదా అనిపించింది. ఆ తరువాత పక్కనే వున్న అమ్మవారి ఆలయానికి వెళ్లాం. అక్కడ అతను వున్నాడు. నేను నన్ను పరిచయం చేసుకుని ఆయన పాట మమ్మల్ని ఎంతగా సమ్మోహితులని చేసిందో చెప్పాను. అలా రకరకాల వాయిద్య ధ్వనులని గొంతులో, పాటలోనే ఎలా పలికించారని అడిగితే, అతడు చెప్పిన సమాధానం అద్భుతం. నేను గొంతుతో శబ్దాన్ని మాత్రం పలికిస్తాను, దాన్ని నాదం అయ్యేలా చేస్తోంది ఆ దేవుడే అన్నాడు. అప్పుడు అతనికి మళ్ళీ నమస్కరించాను. కేరళలో ఎలక్ట్రిసిటీ బోర్డులో పని చేస్తున్నాడుట. యాత్ర కోసం వచ్చానన్నాడు. ఆతను వెళ్ళిపోయాక మేము అమ్మవారి గుడిలోకి వెళ్ళాం. ఇక్కడి అమ్మవారి పేరు మంత్రపీఠేశ్వరి మంగళాంబికై. ఇక్కడి అమ్మవారికి శివుడు మంత్రశక్తులన్నీ ఇచ్చాడట. అందువల్లనే ఆ పేరు. ఈ అమ్మవారు 51 శక్తిపీఠాల్లో మొదటిది. అక్కడ కూడా అర్చన అయ్యాక బైటకు వచ్చాం.  ఆలయం చాలా విశాలమైనది. పెద్ద వరండాలూ, స్తంభాలూ, శిల్పాలూ లెక్కలేనన్ని. ఆలయంలో గోడలపై చాలా శిలా శాసనాలున్నాయి. వాటిని బట్టే, ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానిదనీ, చోళరాజులు కట్టించారనీ తెలుస్తోంది. 

     

యధాప్రకారం ఇక్కడ కూడా అన్ని ఉపాలయాలూ చూసుకుని బయటకు వచ్చాం. మిగిలిన ఆలయాల గురించి కూడా కొంచెం క్లుప్తంగా చెప్తాను. సోమేశ్వరాలయం----ఇక్కడ శివుడ్ని చంద్రుడు ఆరాధించాడుట, అందుకే ఆ పేరు. ఐరావతేశ్వరాలయం----ఈ ఆలయంలో శాపవశాత్తూ నల్లగా అయిపోయిన ఇంద్రుని తెల్లని ఏనుగు ఐరావతం ఈ దేవుణ్ణి పూజించి, తిరిగి శాపవిమోచనం జరిగి తెల్లగా అయ్యిందట. నాగేశ్వరాలయం---ఇక్కడ కాలసర్ప దోషాలున్న వారు వచ్చి పూజ చేసుకుంటే, ఆ రాహు, కేతు దోషాలు పోతాయిట. అభిముక్తేశ్వరాలయం---ఇది మహామహం కోనేరుకి ఎదురుగా ఉంటుంది, అందుకే ఆ పేరు. కాశీ విశ్వనాథర్ ఆలయం---ఇది వీరికి కాశీ విశ్వనాథ ఆలయంతో సమానం. కాశీలో అయితే ఎలా సర్వ తీర్ధాలూ, క్షేత్రాలూ ఉన్నాయో, ఈ కుంభకోణంలో కూడా అన్నీ వున్నాయి. ఈ ఆలయం పక్కనే మహామహం పుష్కరిణి వుంది. ఇవేకాక ఇంకా ఎన్నో పురాతన, విశేష ఆలయాలు వున్నాయి. ఏ ఆలయ చరిత్ర ఆ ఆలయానిదే.  కాకపోతే అన్నీ ఆ కుంభం నుంచే వచ్చాయి. ఆ కుంభం నుంచి ఏ శకలం ఎక్కడ పడినా అక్కడ ఒక ఆలయం వెలిసింది. సూర్య, శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, కార్తికేయ  ఆలయాలు చాలావున్నాయి. ఇవేకాక ఈ చుట్టుపక్కలే నవగ్రహ ఆలయాలు కూడా వున్నాయి. ఈ నవగ్రహ ఆలయాల గురించి ముందే చెప్పాను కదా, అందుకే ఇక్కడ మళ్ళీ చెప్పటం లేదు. 

అంతేకాక ఇక్కడ ఆ కుంభంలోని అమృత జలంతో ఏర్పడిన ఒక పెద్ద పుష్కరిణి వుంది. దాని పేరు మహామహం. ఈ పుష్కరిణి కూడా ఎంతో మహాత్మ్యం కలది. దీని గురించి చెప్తా. ఈ మహామహం పుష్కరిణి అతి పెద్దది. ఈ పుష్కరిణి నాలుగు వైపులా నాలుగు పెద్ద వీధులు ఉన్నాయి. ఆ వీధులన్నింటిలో ఎన్నో ప్రముఖ ఆలయాలున్నాయి. ఈ కోనేరులో పడిన అమృతజలం వల్ల ఈ నీటికి ఆ ప్రత్యేకత, విశిష్ఠత వచ్చాయి. కుంభమేళాల్లో, పుష్కరాల్లో ఎలా అయితే పుణ్య స్నానాలు చేస్తారో. ఈ కోనేరులో కూడా అలానే పుణ్య స్నానాలు చేస్తారు. ఈ నీటిలో గంగ, యమున, సరస్వతి, నర్మద, గోదావరి, కావేరి, కృష్ణ, సరయు నదుల నీరు వచ్చి చేరుతుందని ఒక నమ్మకం. ప్రతి సంవత్సరం మాఘపూర్ణిమ నాడు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తారు. దాన్ని మాఘ స్నానం అంటారు. ప్రతి పన్నెండేళ్ళకూ ఒకసారి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే రోజు కూడా ఈ పుణ్యస్నానాలు చేస్తారు. దీన్ని మహామాఘ స్నానం అంటారు. ఆ ఒక్కరోజు మాత్రమే చేసే ఈ స్నానాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ వుంటారు. ఆ రోజుల్లో ఊరంతా కిక్కిరిసి పోయి ఉంటుంది. ఈ కోనేరు చుట్టూ లోపలికి దిగటానికి వీలుగా మెట్లు ఉంటాయి. ఆ మెట్లపై చుట్టూ 16 చిన్న చిన్న శివాలయాలు వున్నాయి. కోనేరు లోపల కూడా 21 బావులున్నాయిట. మేము చూసి ఇంత చిన్న కోనేరులో ఒక్కరోజులో లక్షల మంది ఎలా స్నానాలు చేస్తారో కదా అని ఆశ్చర్యపోయాం. నాసిక్ లోనూ అంతే, కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసే కుశావర్త కుండం దీని కన్నా కూడా చాలా చిన్నది. జయలలిత అక్కడ ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఈ మహామాఘం వస్తే, ఆమె భద్రత కోసం అంటూ, ఆమెకీ, శశికళకీ కోనేరులో గల ఒక భాగం మూసేస్తే, ఆ సంవత్సరం తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయారు కూడాను. ఆ విషయం గుర్తు వచ్చి బాధేసింది. మేము స్నానాలు చేయలేదుకానీ, ఆ నీటిని ప్రోక్షించుకుని వచ్చేశాము. ఇవీ కుంభకోణం లోని శివాలయాలు, మహామహం పుష్కరిణి వివరాలు. అన్నట్టు ఇక్కడ ఎక్కువ ఆలయాలు రథాల రూపంలో ఉంటాయి. వాటిని ఏనుగులూ, గుర్రాలూ లాగుతున్నట్టు ఉంటాయి. 

 

ఇక ఈ కుంభకోణం లోని ఇతర విశేషాలు చెప్పుకుందాం. మన భారతదేశ గణితశాస్త్ర మేధావి, శ్రీనివాస రామానుజం గారు పుట్టిన ఊరూ ఇదే. చాలా శతాబ్దాలపాటు కామకోటి పీఠం ప్రధాన కేంద్రం ఇదే. తరువాత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి పీఠాధిపతిగా వున్న కాలంలో దీని హెడ్ ఆఫీస్ కంచికి తరలించారు. ఇప్పటికీ మెయిన్ ఆఫీస్ ఇక్కడే వుంది. Master  CVV గారి జన్మభూమి, కర్మభూమి కూడా ఇదే. 

 

పతంజలి రాజయోగాన్ని దర్శించి ప్రబోధిస్తే, అది శాఖోపశాఖలై వర్ధిల్లింది. రాజయోగం నుంచి, తారక రాజయోగం, తారక రాజయోగం నుంచి భృక్త రహిత తారక రాజయోగం వచ్చినాయి. ఈ భృక్త రహిత తారక రాజయోగం సంపూర్ణంగా మాస్టర్ CVV గారి దర్శనం. ఆయన పూర్తి పేరు కంచుపాటి వెంకటరావు వెంకాసామిరావు. 1868 ఆగస్టు 4 న పుట్టి 1922 మే 12 న ఆయన నిష్క్రమించే వరకూ ఈ యోగాని ఆయన తన శిష్యులందరికీ నేర్పారు. తాను దేహాన్ని చాలించినా కూడా తన ఆత్మతో శిష్యులతో బంధాన్ని ఏర్పరచుకుని తన యోగాని బోధించారు. మాస్టర్ CVV ఒక గొప్ప ఋషి, దార్శనికుడు, గురువు, ధన్వంతరి. తన ఇంటినే ఒక ప్రయోగశాల గానూ, ప్రార్ధనా మందిరం గానూ, ధ్యాన మందిరం గానూ మార్చేశారాయన. ఎందరికో తన ధ్యాన శక్తితో వ్యాధులు కుదిర్చారు. తన భార్య సుబ్బమ్మ గారిని ఒక మీడియంగా చేసుకుని భృక్త రహిత తారక రాజయోగమనే కొత్త యోగ మార్గాన్ని ఆవిష్కరించారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు , రామకోటయ్యగారు, మాస్టర్ EK గారు మొదలైన వారు ఆయన ప్రముఖ శిష్యులు. 

 

మాస్టర్ CVV గారు 1910 లో హేలీ తోకచుక్క వచ్చినప్పుడు ఆ తోకచుక్క నుంచి శక్తిని ఎలా తీసుకోవాలా అని పరిశోధన చేసి, ఆ శక్తిని గ్రహించి, తద్వారా విశ్వం నుంచి మానవుడు అనంతమైన శక్తిని ధ్యానం ద్వారా గ్రహించే యోగ మార్గాన్ని కనుగొని దానికి భృక్త రహిత తారక రాజయోగం అని పేరు పెట్టారు. ఈ పధ్ధతి ద్వారా ముఖ్యంగా "మాస్టర్ CVV నమస్కారం" అని చెప్పి నమస్కరించుకుని సుఖాసనంలో కూర్చోవాలి. ఆ తరువాత కనులు మూసుకుని మౌనంగా ఉంటూ లోపల ఏమి జరుగుతోందో గమనించాలి. ఇది మాస్టరు గారి మొదటి ప్రేయర్. మొట్ట మొదటిసారి ఇంగ్లీష్ లో ప్రేయర్ మంత్రాలను ప్రవేశ పెట్టింది మాస్టరుగారే. ఈ ప్రేయర్స్ సహాయంతో ఎంత ఇబ్బందినైనా అధిగమించవచ్చు అనేది వీరి శిష్యుల నమ్మకం. ఈ ప్రేయర్ ను ఎవరైనా చేయొచ్చు. కానీ నియమానుసారం, పొద్దున్న ఆరింటికి, సాయంకాలం ఆరింటికి చేస్తే చక్కని ఫలితాలుంటాయని చెప్తారు. 

 

మేము కుంభకోణం వెళ్ళినప్పుడు ఎంతో వెతుక్కుని వీరింటికి వెళ్లాం. అంత గొప్ప ఋషి, ద్రష్ట. వారి గురించి తెలుసుకోవటమే కాదు, వారి ప్రేయర్స్ చెయ్యటమే కాదు, వారు ఈ యోగమార్గాన్ని కనుక్కున్న చోటు, దానిని సాధన చేసిన చోటు, దానిని నలుగురికీ బోధించిన చోటు చూడగలగడం మా అదృష్టం. మాస్టరుగారు ధ్యానం చేసుకున్న ఆ గదిలో కాసేపు అయినా కూర్చుని ధ్యానం చేసుకోగలగటం నా పూర్వజన్మ సుకృతం, మాస్టరుగారు దయతో నాకు ఇచ్చిన వరం, అవకాశం. కానీ ఇప్పుడు అక్కడ వాతావరణం మాస్టరుగారు వున్నప్పటిలా లేదు. అక్కడ వుండే సిబ్బంది ఎవరో వున్నారంతే. బహుశా ఎవరైనా ఆరు గంటలకి వెళ్తే, అందరూ వస్తారేమో. ఆ స్థలం ఎంత ప్రశాంతంగా ఉందంటే, లేచి కదిలి రా బుద్ధి వేయలేదు. అయినప్పటికీ లేచి మాస్టరుగారికి సంబంధించిన ఫోటోలు, పుస్తకాలు కొనుక్కుని వచ్చేసాం. మీకు కూడా ఎవరికైనా మాస్టరుగారి యోగమార్గంలో ధ్యానం చేసుకోవాలనిపిస్తే, సుఖాసనంలో కూర్చుని, కళ్ళు మూసుకుని "మాస్టర్ CVV నమస్కారం" అనుకోండి. మౌనంగా కూర్చోండి. మీ లోపల్లోపల ఏమవుతుందో గమనించండి. మనలోని వివిధ లోపాలకు మాస్టారుగారు రిపేర్ వర్క్ చేస్తారు. ఎంత సేపు కూర్చోగలిగితే అంత సేపు కూర్చోండి. ఇంకా వీలైతే సమయనియమం కూడా పాటించండి. మాస్టరుగారు మిమ్మల్ని తన యోగ మార్గంలో అనుమతిస్తే, మీకే ఆ విషయం తెలుస్తుంది. "మాస్టర్ CVV నమస్కారం."

అన్నట్టు 2017 ట్రిప్ లో మేము కుంభకోణం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు దారిలో తిరువారూరు, తిరువయ్యారు కూడా చూశాం. చూశామంటే, చూశామంతే, మీతో విశేషాలు పంచుకునేంత వివరంగా ఈ రెండు ఊళ్ళూ కూడా చూడలేకపోయాం. సంగీతాభిమానులు ఎవరైనా ఉంటే, మమ్మల్ని ఒక్కసారి క్షమించేసి వదిలేయండి. ఈసారి వెళ్లినప్పుడు సమయం తప్పకుండా ఈ ఆలయాలకూ కేటాయిస్తాం. అసలు ఏమైందంటే, మా డ్రైవర్ ఏమాత్రం ముందుగా మమ్మల్ని హెచ్చరించకుండా, సడెన్ గా ఇదే అభిరామి, ఇదే తిరువారూరు, ఇదే తిరువయ్యారు అని చెప్తూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మాకు అతను ఆ దారిలో వెళతాడని తెలియదు. అందుకే ఆ రెండు చోట్లా ఆలయ సమయాలు మ్యాచ్ అవలేదు. అక్కడికీ తిరువారూర్ లో సరిగ్గా ఆలయం ముందు నుంచే వెళుతుంటే, కార్ ఆపి, లోపలికి వెళ్లి, ఆలయ మ్యూజియం, పుష్కరిణీ చూశాం. ఈ తిరువారూర్ లోనే ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజు జన్మించాడు. ఈ తిరువారూర్ త్యాగరాజేశ్వర ఆలయం లోని శివుని పేరు మీదే, త్యాగరాజుకి నామకరణం జరిగింది. ఆ తరువాత త్యాగరాజు గారి కుటుంబం జీవనోపాధి కోసం తిరువైయ్యారు చేరారు. తిరువైయ్యారులో కూడా, ఈ డ్రైవర్ మాకు 'ఇదే కావేరీనది, ఆ మెట్ల పక్కనే త్యాగరాజు గారి ఇల్లు వుంది, నిత్యమూ త్యాగరాజు ఈ దారిలోనే కావేరీనదికి వెళ్ళేవాడు', వగైరా విషయాలు తమిళంలో  చెప్పాడు. ఆవిధంగా ఈ రెండు ప్రముఖ ప్రదేశాలూ చూడలేకపోయాం. సాధారణంగా మేము ఎక్కడికి వెళ్లినా ఆ డ్రైవర్ కి ఖచ్చితంగా మాకు వచ్చిన తెలుగు, హిందీ ఇంగ్లీష్ భాషలలో ఏదో ఒక్క దాంట్లో అయినా కనీసం వర్కింగ్ నాలెడ్జ్ వుండాలని ముందే చెప్పి పెట్టుకుంటాం. ఈసారీ అలాగే చెప్పాం. ఈ డ్రైవర్ మహానుభావుడు తనకు ఇంగ్లీష్ వచ్చని వాళ్ళ ఆఫీసులో చెప్పాడట. అతనికి మాకు ఒక్కటైనా కామన్ భాష లేకపోవటం తో వచ్చిన ట్రబుల్ అది. దాంతో వాళ్ళు ఈ అబ్బాయిని మాకు కేటాయించారు. మీకు చెపితే నవ్వుతారు కానీ, నేను కార్ ఎక్కేముందే, "డు యు నో ఇంగ్లీష్?" అని అడిగితే, అతను వెంటనే, తడుముకోకుండా, "ఐ నో ఇంగ్లీష్" అన్నాడు. అబ్బో ఇంగ్లీష్ లో మాట్లాడాడు కదా అని అమాయకంగా కార్ ఎక్కేసాం. నో అంటే, అతని ఉద్దేశం NO, మా ఉద్దేశం KNOW. ఈ అడ్డగోలు ఇంగ్లీష్ తో మాకు తిరునల్లార్ కూడా మిస్ చేసాడు. మొత్తానికి ఈ ట్రిప్ వలన మా డ్రైవర్ కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాలేదు కానీ, నాకు మాత్రం తమిళంలో కాస్త వర్కింగ్ నాలెడ్జ్ వచ్చింది. ఇదీ మా కుంభకోణం యాత్ర ముచ్చట.  
 
ఇక మా కుంభకోణం యాత్రా విశేషాలు ఇక్కడితో ముగిస్తాను. ఈసారి తమిళనాడులో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య క్షేత్రాలైన ఆరుపడైవీడు గురించి చెప్పుకుందాం. నమస్కారం. 


ఓం శ్రీ ఆది కుంభేశ్వరాయనమః, ఓం మంత్రపీఠేశ్వరి మంగళాంబికాయై నమః 
మాస్టర్ CVV నమస్కారం



భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

తిరువణ్ణామలై-అగ్నిలింగం

శ్రీశైలే మల్లికార్జునమ్