సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు 

భట్టిప్రోలు విజయలక్ష్మి



 

తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు చాలా ప్రత్యేకమైనవిగా పేరు పడ్డాయి. వీటినే ఆరుపడైవీడు అంటారు. అవి పళని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుత్తణి, తిరుప్పరంకుండ్రం, పళియముదిర్ చోళై. వీటిల్లో మేము ఆ మొదటి అయిదు క్షేత్రాలు మాత్రమే దర్శించుకోగలిగాం. ఎందుకో ఆ ఆరోది మిస్ అయ్యింది. ఈ అన్ని క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యుడు ఎంతో అందంగా, సమ్మోహనంగా ఉంటాడు. ఈ క్షేత్రాలను గురించి వరుసగా చెప్పుకుందాం.  


ఆరుపడైవీడులో మొదటిది పళని క్షేత్రం. మేము 1987లో సౌత్ టూర్ లో భాగంగా చూసాం. దండాయుధ పాణి, వేలాయుధ పాణి అని ఇక్కడి దేవుడికి పేరు. ఇక్కడ దేవుడు బాల సుబ్రహ్మణ్యుడు, కౌపీనధారుడు. నున్నటి గుండుతో చిన్న గోచీతో, ఒక చేతితో శూలాన్ని పట్టుకుని, మరో చెయ్యి నడుం మీద పెట్టుకుని రుద్రాక్షమాలలు ధరించి ముద్దుగా ఉంటాడు ఈ బాల సుబ్రహ్మణ్యుడు. ఈ విగ్రహాన్ని నవపాషాణంతో భోగార్ అనే భక్తుడు తయారుచేశాడు. నవపాషాణం అంటే తొమ్మిది విషపదార్ధాలు కలిపిన ఒక ధాతువు. ఈ తొమ్మిది విషపదార్ధాలను ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో కలిపితే, అప్పుడు అది ఒక శిలారూప ఔషధంగా మారుతుంది. అందువల్ల సాక్షాత్తూ ఈ విగ్రహమే ఒక ఔషధం. చాలాకాలం ఈ విగ్రహం తొడ భాగం నుంచి విభూదిని తీసి చర్మ వ్యాధులున్న వారికి ఇచ్చేవారు. రాను రాను విగ్రహం తొడ భాగం అరిగిపోతుండటంతో ఆపేసారు. ప్రస్తుతం అభిషేక తీర్ధమే ఔషధంగా ఇస్తున్నారు. ఇక్కడి అరవణ పాయసం ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది. తిరుపతి లడ్డూ లాగా ఈ అరవణపాయసం కూడా చాలా ప్రసిద్ధి.

ఈ క్షేత్రానికి ఒక చరిత్ర వుంది, అగస్త్య మహర్షి శిష్యుడు ఎడుంబన్ అనే ఒక రాక్షసుడు గురువుగారి ఆదేశంతో రెండు కొండలను ఒక కావడిలో పెట్టుకుని, గురువుగారిని అనుసరిస్తూ సత్యలోకానికి బయలుదేరతాడు. దారిలో ఈ ప్రాంతానికి చేరినప్పుడు కావడిలో ఒక వైపున్న కొండ చాలా బరువెక్కి పక్కకు ఒరుగుతుంది. అప్పుడు ఎడుంబన్ ఎందుకు ఇలా జరిగిందా అని చూసి,  ఆ కొండపై ఎక్కి కూర్చున్న బాలసుబ్రహ్మణ్యుడిని గమనించి దిగమని గద్దిస్తాడు. కోపించిన బాలుడు ఎడుంబన్ ని  సంహరిస్తాడు. అప్పుడు అగస్త్యుడు సుబ్రహ్మణ్యుడిని ప్రార్ధించి తిరిగి ఎడుంబన్ ని బ్రతికించుకుంటాడు. సుబ్రహ్మణ్యుడు అప్పుడు ఎడుంబన్ ని కరుణించి, తన ఆలయం ఎదురుగా ఉండమని అనుమతించాడు. ఇప్పటికీ పళనిలో ఎడుంబన్ ని చూసాకే ప్రధాన ఆలయానికి వెళ్ళటం ఒక సంప్రదాయంగా నిలిచిపోయింది. అంతేకాక అప్పటి నుంచీ ఎడుంబన్ మోసిన కావడికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడి ఆలయానికి కావడి సేవ మొదలైంది. తరువాత ఇక్కడే కాక ఇతర సుబ్రహ్మణ్య ఆలయాల్లో కూడా ఈ కావడి సేవ ప్రారంభమైంది. పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, కావడి మోస్తూ ఎన్నో మైళ్ళ దూరం నుంచి కూడా భక్తులు గుంపులు గుంపులుగా మొక్కుకుని నడిచి వస్తూ ఉంటారు. మేము రైల్వేకోడూరులో ఉన్న 1980-84 రోజుల్లో ఈ కావడి దీక్ష తీసుకున్న వాళ్ళు, చంకల్లో చంటి పిల్లలతో సహా నడిచి వెళ్లడం చూస్తూ ఉండేవాళ్ళం. సంతానం కలగకపోతే ఇలా దీక్ష చేస్తామని మొక్కుకుని, సంతానం కలిగాక, పిల్లలతో ఆ మొక్కు తీర్చటం ఓ ఆనవాయితీ. ఆ కావడిలో నీరు, నెయ్యి, విభూది వగైరా అభిషేక ద్రవ్యాలు తెచ్చి సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తారు. అంతేకాక ప్రత్యేకమైన మొక్కులు మొక్కుకున్నవాళ్ళు, పళనిలో వింతగా శరీరంపై సూదులు, ఇనుప చువ్వలు గుచ్చుకుని కావడి పట్టుకుని నృత్యం చేస్తూ దేవాలయం లోకి వెళ్ళటం కూడా ఒక ఆచారంగా మారింది.

సుమారు 1000 మెట్లు ఎక్కితే అప్పుడు కానీ ఈ పళని కొండ పైకి  చేరుకోలేం. అప్పుడు కానీ ఈ దేవుడు కనబడడు. కాకపోతే మెట్లు ఎక్కలేని వారికి వించ్ ట్రైన్, రోప్ వే కూడా వున్నాయి. గణపతికి గణాధిపత్యం ఇవ్వడంతో అలిగిన సుబ్రహ్మణ్యుడు కైలాసానికి విడిచి పళని చేరుకున్నాడు. అప్పుడు శివుడు, పార్వతి, గణపతి ముగ్గురూ వచ్చి అలక తీర్చడానికి ఎంతో ప్రయత్నించారు. శివుడు అప్పుడు కుమారస్వామితో అతడే స్వయంగా బ్రహ్మ జ్ఞానఫలం అని చెప్పి సముదాయించాడు. ఆ ఫలం అన్న పదమే కాలక్రమేణా పళని అయ్యింది. అప్పటి నుంచీ ఈ ప్రాంతానికి పళని అన్న పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయంలో విశాలమైన ప్రాకారాలు, వినాయక మందిరం, శివ మందిరం కనిపిస్తాయి. మయూర మండపం, కుక్కుట మండపం కూడా  ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి దేవుడికి నెమలి, కోడి రెండూ వాహనాలే. నిత్యమూ రాత్రివేళల్లో అద్భుతంగా ప్రాకారోత్సవం జరుగుతుంది. ఈ ప్రాకారోత్సవంలో ఆలయం లోని విశాలమైన ప్రాకారంలో ఉత్సవ విగ్రహాలని బంగారు రథంలో ఊరేగిస్తారు. కన్నుల పండుగగా వుంటుందీ ఊరేగింపు. అదేవిధంగా సుబ్రహ్మణ్యషష్ఠి ఉత్సవం కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఈ బాలసుబ్రహ్మణ్యుడిని చూడాలంటే మాత్రం మదురై దగ్గర ఉన్న పళని వెళ్లాల్సిందే.

               

ఆరుపడైవీడు లోని మరొక క్షేత్రం స్వామిమలై. ఇక్కడి సుబ్రహ్మణ్యుడి పేరు స్వామినాథన్. ఈ ఆలయానికి మన పంచాంగం లోని 60 సంవత్సరాలకి ప్రతీకగా 60 మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టుకీ ఒకో సంవత్సరం పేరు ఉంటుంది. మెట్లు చక్కగా విశాలంగా ఉంటాయి. తేలికగా ఈ మెట్లు ఎక్కి మధ్యలో శిల్పాలు, కుడ్యచిత్రాలు చూసుకుంటూ పైన ఉన్న గర్భాలయానికి చేరుకోవచ్చు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడే స్వయంగా తన తండ్రి అయిన మహాదేవునికి ఓంకార మంత్రం బోధించి దాని భావార్ధం చెప్పాడు. అందుకని ఈ ఆలయంలో శివుడు సుబ్రహ్మణ్యుని కన్నా కొంచెం తక్కువ ఎత్తులో ఉంటాడు. శివుడి భుజాలపైకి ఎక్కి చెవిలో ప్రణవాక్షరిని బోధిస్తూ సుబ్రహ్మణ్యుడు, భక్తిశ్రద్ధలతో తన పుత్రుడు నుంచి ప్రణవమంత్ర ఉపదేశం స్వీకరిస్తూ శివుడు కనపడతారు. గురు స్థానంలో పుత్రుడు, శిష్య స్థానంలో తండ్రి వుంటారు. స్వామినాథుడు కొలువై ఉన్న ఈ కొండను స్వామిమలై అంటారు. సాక్షాత్తూ శివుడే తన పుత్రుడి జ్ఞానాన్ని చూసి పుత్రోత్సాహంతో మురిసిపోయిన స్థలం ఇది. అందుకే ఇక్కడి సుబ్రహ్మణ్యుడిని స్వామినాథన్ అనీ, గురుగుహుడనీ, గురునాథుడనీ అంటారు. ముత్తుస్వామి దీక్షితార్ మొదటి కీర్తన పాడింది ఇక్కడే. అందుకే, ఆయన అన్ని కీర్తనల్లోనూ గురుగుహ అనే పదం మకుటంగా వాడే వారని అంటారు. అద్భుతమైన కుడ్య తైలవర్ణ చిత్రాలు ఈ ఆలయం ప్రత్యేకత. ఇది కుంభకోణానికి దగ్గర. ఇక్కడ గణపతికీ, శివ పార్వతులిద్దరికీ కూడా ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి మేము రెండు సార్లు వెళ్లాం.


ఆరుపడైవీడులో మేము చూసిన ఇంకొక క్షేత్రం తిరుప్పరంకుండ్రం. ఇది కూడా మధురైకి దగ్గర గానే ఉంది. రెండుసార్లు వెళ్లాం కానీ ఒక్కసారే దర్శనమైంది. రెండోసారి ఆ రోజే కళ్యాణ ఉత్సవం జరిగి దేవుడు ఉరేగింపుకి వెళ్ళాడు. ఊరంతా కోలాహలంగా ఉంది. అందరూ ఎంతో సంబరంగా హడావుడిగా తిరిగేస్తున్నారు. మూలమూర్తులు గుళ్లోనే ఉంటాయి కదా అని చూద్దాం అనుకుంటే, వాళ్ళు దేవుడు ఊళ్లోకి వెళ్తే, గుళ్లో ఎలా ఉంటాడు, అని ఎంతో శ్రద్ధగా ఎదురు ప్రశ్నించారు. అంటే, ఉత్సవమూర్తే, ఊరేగటానికి వెళ్లినా, మూలమూర్తే వెళ్లినట్టు భావన చేస్తూ దేవాలయం మూసేసారు. ఈ విధంగా మాకు రెండుసార్లు నాగలాపురంలో కూడా అయింది. నిజంగా అదే అసలు పధ్ధతి కదూ. మన రాష్ట్రంలో తిరుమలలో కూడా ఉత్సవాలు ఉత్సవాలే, దర్శనాలు దర్శనాలే అన్నట్టు ఉంటాయి. ఒకచోట కళ్యాణం జరుగుతూ ఉంటుంది, మరొక చోట మరో సేవ జరుగుతుంటే, ఆలయంలో మాత్రం యధావిధిగా తోపుడు దర్శనాలు జరిగిపోతూనే ఉంటాయి. తిరుప్పరంకుండ్రం ఆలయంలో సుబ్రహ్మణ్యుడు కూర్చుని ఉంటాడు. ఇంద్రుని కుమార్తె దేవసేనతో సుబ్రహ్మణ్యుడి వివాహం ఇక్కడే జరిగిందని అంటారు. సూరపద్ముడనే రాక్షసుని సంహరించిన తరువాత ఇంద్రుడు తన కూతురు దేవసేనని మురుగన్ కి ఇచ్చి ఇక్కడే వివాహం చేస్తాడు. తమాషాగా ఇదే విషయం మాకు చెప్పారు. ఇక్కడ కూడా కుడ్య చిత్రాలు విశేషంగా కనపడతాయి. ఇంద్రుడు కన్యాదానాన్ని చేస్తున్న చిత్రం కూడా కనిపిస్తుంది. గర్భాలయంలో మధ్యలో ఆసీనుడైన మురుగన్, ఒక పక్కన నారదమహర్షి, మరొక పక్కన కొత్త పెళ్లికూతురు దేవసేన కూర్చుని ఉంటారు. ఇంద్రపుత్రి దేవసేనని పెళ్ళాడి సుబ్రహ్మణ్యుడు దేవసేనాపతి, దేవసైన్యాధ్యక్షుడు అవుతాడు. తమిళ కవి, భక్తుడు నక్కీరన్ కొలిచిన దేవుడు ఈయనే.


ఆరుపడైవీడులో తరువాత మేము చూసిన క్షేత్రం తిరుచెందూర్.  ఇది ఒక్కసారే 1987లో చూసాం. ఇది మిగిలిన సుబ్రహ్మణ్య క్షేత్రాలకు దూరంగా, కన్యాకుమారికి దగ్గరగా ఉంటుంది. ఈ క్షేత్రం లోనే
ఆరు కృత్తికలచే బాల్యంలో సుబ్రహ్మణ్యుడు పెంచబడ్డాడని చెప్తారు. ఆరు కృత్తికల వద్దా ఆరు  
ముఖాలతో స్తన్యపానం చేసాడట సుబ్రహ్మణ్యుడు. అందుకే ఈ దేవుడికి ఆరుముగం, షణ్ముఖ మొదలైన పేర్లు వచ్చాయి. అంతేకాక కృత్తికలు పాలిచ్చి పెంచాయి కనుక కార్తికేయుడయ్యాడు. మిగిలిన అయిదు ఆలయాలు కొండల మీద ఉంటే, ఈ ఆలయం ఒక్కటీ మాత్రం సముద్రం ఒడ్డున ఉంటుంది. తూర్పు దిక్కున సముద్రం ఉండటంతో, ద్వారం మాత్రం పశ్చిమానికి ఉంటుంది. 1648 లో డచ్చివాళ్లు భారతదేశం వదిలిపోతూ పోతూ ఈ ఆలయాన్ని దోచుకుని, చివరకు మూలమూర్తిని కూడా ఎత్తుకెళ్ళి, తమ ఓడలో వేసుకుని బయల్దేరారు. ముందే చెప్పాగదా, సుబ్రహ్మణ్యుడు, మహా అందంగా, సమ్మోహనంగా ఉంటాడని. బహుశా వాళ్ళు ఆ అందానికే ముగ్ధులైపోయి, స్వామి విగ్రహాన్ని కూడా ఎత్తుకుపోయి ఉంటారు. కానీ మార్గమధ్యంలో ఆ ఓడ విపరీతంగా బరువైపోయి మునిగిపోయే స్థితికి వచ్చిందట. అప్పుడు ఇదంతా ఈ దేవతా విగ్రహం మహాత్మ్యం అని ఆ డచ్చివారు భావించి, భయపడి, విగ్రహాన్ని అక్కడే సముద్ర మధ్యంలో నీళ్ళల్లో వదిలేసి వెళ్లిపోయారట. చాలాకాలం పాటు గుడిలో మూర్తి లేదు. కొన్నాళ్ల తరువాత మరొక మూర్తిని తెచ్చి ఉంచి పూజలు ప్రారంభించారు.  1653లో ఆ ప్రాంతానికి అధికారి అయిన వడమలయప్పన్ పిళ్ళై అనే వ్యక్తి ఉండేవాడు. చాలా విశేషంగా,  పిళ్లై కి ఒక కల వచ్చి, ఆ కలలో స్వయంగా సుబ్రహ్మణ్యుడే కనపడి తన విగ్రహం ఎక్కడ ఉన్నదో చెప్పాట్ట. అప్పుడు వడమలయప్పన్  పిళ్ళై కొంతమంది సహాయకులతో వెళ్లి, సముద్రంలో ఆ చోటుని గుర్తించి విగ్రహాన్ని వెలికి తీయించి తిరిగి ఆలయంలో ప్రతిష్ట చేసాడట. ఈ వివరాలన్నీ చక్కగా నమోదు చేయబడ్డాయి. ఇప్పటికీ ఈ వివరాలన్నీ తెలిపే కుడ్య తైలవర్ణ చిత్రాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సూరపద్మాసుర సంహారం అనే ఒక ఉత్సవాన్ని స్కందషష్ఠి నాడు దసరాల్లో జరుపుకునే రామ్ లీలా తరహాలో వైభవంగా, కోలాహలంగా జరుపుతారు. ఇలాంటి విశేషాలు వింటూ ఉంటే, ఇది కదా ఈ భరతఖండం అస్మిత(అస్తిత్వం) అనిపించింది. ఇక్కడ ఎందుకో చిలకమర్తి వారు గుర్తొస్తున్నారు. వారి పద్యం ఒకటి ఉదహరిస్తాను.

భరతఖండంబు చక్కని పాడియావు 
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ 
తెల్లవారను గడసరి గొల్లవారు 
పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి 

తెల్లవారను అనే శ్లేషలోనే, తెల్లదొరలు అనీ, తెల్లవారుతూనే అనీ అర్ధాలు వచ్చేలాగా, శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ పద్యం చెప్పారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమీ మారలేదేమో. అప్పుడు కొందరు, ఇప్పుడు వేరే మరి కొందరు నల్లవారు, తెల్లవారు  కూడా మిగిలిన వారు లేగదూడల వలే ఏడుస్తున్నా పట్టించుకోకుండా తమకు కావాల్సిన వాళ్లకి పాలు పితుక్కుని తరలించుకుని పోతూనే ఉన్నారు.


ఇక మేము చూసిన మరో క్షేత్రం తిరుత్తణి. వళ్లితో సుబ్రహ్మణ్యుడి వివాహం జరిగిన స్థలం తిరుత్తణి అని చెప్తారు. ఈ ఆలయంలో కూడా శివుడు, పార్వతి, గణపతి ఉంటారు. ఇది కూడా కొండ పైనే ఉన్న క్షేత్రం. ఈ కొండకు 365 మెట్లు, సంవత్సరంలో వున్న 365 రోజులకు ప్రతీకగా ఉంటాయి. కానీ రిక్వెస్ట్ చేస్తే కారుని పై వరకూ తీసుకుపోనిస్తారు. ఈ మధ్య 2019 సెప్టెంబర్లో  మేము మా మనవరాలు షోడశి పుట్టువెంట్రుకలు తిరుమల హుండీలో వేయాలని వెళ్లాం. తరువాత తిరుమల, తిరుపతి నుంచి కారులో ముందుగా తిరుత్తణి, ఆ తరువాత కంచి చేరాం. తిరుత్తణిలో కొండ మీద వున్న సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి వెళ్ళాం. ఇప్పటికే ఈ ఆలయాన్ని కనీసం నాలుగైదు సార్లు చూసి ఉంటాం. అక్కడ సుబ్రహ్మణ్యుడు, హనుమంతుడు స్నేహితులు కాబోలు, ఎన్ని కోతులు ఉన్నాయో. కానీ ఎవరినీ ఏమీ చేయటం లేదు. నేను మాత్రం నా హనుమత్ మంత్రం మననం చేసుకుంటూ ముందుకెళ్లా. ఆలయంలోకి వెళ్లి అర్చన చేయించాం. ఆలయం వెలుపలే హుండీలో వెయ్యటానికి మొక్కుల కోసం వెండితో చేసిన రకరకాల సామాన్లు అమ్ముతున్నారు. మేమేమీ కొనలేదు. ఆలయంలో సుబ్రహ్మణ్యుడు ఎంత అందంగా, ముద్దుగా వున్నాడో చెప్పలేను. ఒక్కసారిగా ఆ సుబ్రహ్మణ్యుడిపై వాత్సల్యభక్తి కలిగింది. ఈ క్షేత్రంలో శనైశ్చరునికి కూడా ఒక ఉపాలయం ఉంది. అక్కడ అందరూ ఉప్పు, మిరియాలు దిష్టి తీసుకుని పడెయ్యటం ఒక ఆనవాయితీ. ఇక్కడ వల్లీ, దేవసేనా సమేతంగా స్వామి దర్శనమిస్తాడు.  దుర్గ, శివ ఆలయాలు కూడా ఇక్కడ వున్నాయి. తిరుత్తణి సుబ్రహ్మణ్యుడిని చూసాక ఎందుకో చాలా తృప్తిగా ఉంది అన్న ఫీల్ కలిగింది.

చిట్టచివరి క్షేత్రం పళియముదిర్ చోళై. తిరుప్పరంకుండ్రం, మదురైల పక్కనే ఉన్నా కూడా ఈ ఆలయాన్ని ఎందుకో మేము దర్శించుకోలేక పోయాం. తమిళ భక్తురాలు, కవయిత్రి  అవ్వయ్యార్ పూజలందుకున్న మురుగన్ మందిరం ఇది. శిలప్పదికారం వంటి అద్భుతమైన ప్రామాణికమైన నాట్యశాస్త్ర నవలారాజం రచించబడింది ఇక్కడే. ఈ ఆలయం చూడకపోయినా శిలప్పదికారం గ్రంధం ఆధారంగా తీసిన కణ్ణగి, పూంపుహార్ వంటి చిత్రాల గురించి తెలుసు. కణ్ణగిగా కన్నాంబ గొప్పగా నటించిన చిత్రంఅది. అదంతా అప్రస్తుతం కానీ, అవ్వయ్యార్ కథ మాత్రం చాలా తమాషాగా ఉంటుంది. చెప్పుకుందాం. అవ్వయ్యార్ వృద్దురాలు, అవధూత, కవయిత్రి. ఈమెను ఈ ప్రాంతంలోనే బాల మురుగన్ పరీక్షిస్తాడు. ఆ వృత్తాంతము అంతా చాలా వింతగా ఉంటుంది. ఇంతా చేస్తే, వడ్లగింజలో బియ్యపుగింజ. ఒకరోజు అవ్వయ్యార్ ఎండలో నడిచి వస్తూ అలసిపోతుంది. ఆలయం దగ్గరకు వచ్చేసరికి ఆకలి, దాహము వేస్తుంది. పళియముదిర్ చోళై ఆలయమున్న కొండ ప్రాంతమంతా చక్కటి పళ్ళ చెట్లు ఉన్నాయి. అవ్వయ్యార్, పాపం వృద్ధురాలు చెట్ల మీద నుంచి పళ్ళు కోసుకోలేకపోతుంది. అప్పుడు ఒక పిల్లవాడు కనిపించి, 'అవ్వా, పళ్ళు కావాలా' అని అడుగుతాడు. అవ్వయ్యార్ కావాలంటుంది. మళ్ళీ ఆ పిల్లవాడు, 'వేయించిన పళ్ళు కావాలా, వేయించని పళ్ళు కావాలా' అని అడుగుతాడు. అవ్వయ్యార్ కి అర్ధం కాదు. వేయించని పళ్ళు ఏమిటి, వేయించిన పళ్ళు ఏమిటి అని తికమక పడుతుంది. సర్లే, ఏదో, చిన్న పిల్లవాడు తెలిసీ తెలియక అడిగాడులే అనుకుని, 'వేయించని పళ్ళు ఇవ్వు' అంటుంది. ఆ పిల్లవాడు చెట్టు కొమ్మ ఊపి జలజలా పళ్ళు రాలుస్తాడు. అవ్వయ్యార్ ఆ పళ్ళని తీసుకుని, దాని మీద ఉన్న మట్టిని ఊదుకుంటూ తింటుంటుంది. ఆ పిల్లవాడు అప్పుడు, 'అవ్వా, వేడి పళ్ళను ఊదుకుని చల్లార్చుకుని తింటున్నావా' అంటాడు. అవ్వయ్యార్ ఉలిక్కిపడుతుంది. ఉన్నట్టుండి ఆ పదాలలోని అంతరార్ధం బోధపడుతుంది. 'బాబూ నువ్వెవరు, నీ అసలు రూపం చూపించు' అని వేడుకుంటుంది. అప్పుడు మురుగన్ దర్శనమిస్తాడు. అవ్వయ్యార్ జన్మ ధన్యం అయ్యింది. అవ్వయ్యార్ అవధూత, పునర్జన్మ లేకుండా ఉండాలని, జన్మరాహిత్యం కావాలని తపిస్తూ ఉంటుంది. వేయించిన పళ్ళు అంటే ఆ పళ్ళల్లోని గింజ ఇక మొలకెత్తదు. అదే వేయించని పళ్లైతే వాటిల్లోని గింజ మళ్ళీ జన్మిస్తుంది. అదే అంతరార్ధం. మనం జన్మరాహిత్యం కోరుకుంటే, గింజల్ని వేయించెయ్యాలి, లేదా ఉడికించేయ్యాలి. అదే వడ్లగింజలో బియ్యపుగింజ అంటే కూడా. వడ్లు  మొలకెత్తుతాయి, బియ్యం మొలకెత్తదు. సంపూర్ణ ముక్తి వడ్లగింజ బియ్యపుగింజగా మారినప్పుడే కదా.

ఇదీ ఆరుపడైవీడు క్షేత్రాల ముచ్చట. మా యాత్రల గురించి రాష్ట్రాల వారీగా రాసుకొస్తున్నాను. వెనక్కు తిరిగి చూసుకుంటే, మధ్యప్రదేశ్ లోని పంచ్ మఢీలో నేను రెండు గొప్ప శివాలయాల గురించి చెప్పటం మర్చిపోయాను. ఆ రెండూ, బడా మహాదేవ్, గుప్త మహాదేవ్ ఆలయాలు. స్వచ్ఛమైన పచ్చటి అరణ్యంలో, జలపాతాల నడుమ ఉన్న ఆ ఆలయాల గురించి తరువాతి పోస్టులో చెప్పుకుందాం.

ఓం శ్రీ దండాయుధపాణినే నమః, ఓం శ్రీ స్వామినాథాయ నమః,
 ఓం శ్రీ దేవసేనాపతయే నమః, ఓం శ్రీ కార్తికేయాయ నమః,
 ఓం శ్రీ షణ్ముఖాయ నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తిరువణ్ణామలై-అగ్నిలింగం

శ్రీశైలే మల్లికార్జునమ్