ప్రయాణోపనిషత్

 ప్రయాణోపనిషత్ 


ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం , ఆయుఃకామార్థసిద్ధయే



                                                             మునుముందుగా నా మనసులోని మాటలు, అసలు ఇలా యాత్రలు ఎందుకు చేయాలనిపించిందో, ఎలా చేసామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఏమేమి చూసామో, మాఅనుభవాలు, అనుభూతులు, అన్నీ అందరికీ చెప్పాలనిపించి, కొంచం సాహసం చేసి ఈ రచనా కార్యక్రమం మొదలుపెట్టాను. 

                                             కాకుంటే, 2012 అక్టోబర్ ముందు వరకూ చేసిన ప్రయాణాలన్నీ మాకూ, పిల్లలకూ సెలవులు దొరికినప్పుడు సాగేవి. బొకారోలో వుంటున్నప్పుడు అక్కడినుంచి కూడా చాలా ప్రదేశాలు చూశాం. అంతేకాదు, ఏ వూరు ట్రాన్స్ ఫర్ అయినా ఆ చుట్టుపక్కల ఏమేమి చూడచ్చు అని ఆలోచించేవాళ్ళం. వీలైనంతవరకు చూసేవాళ్ళం. అప్పుడు చూసినవి అన్నీ ఒకదాని వెనుక ఒకటి ముందు ముందు భాగాలలో ప్రస్తావిస్తాను. 

                                        చిన్నప్పట్నుంచీ హిస్టరీ, జాగ్రఫీ చదివినప్పుడల్లా, ఈ ప్రదేశాలన్నీ చూడగలిగితే బాగుండు అన్న ఆలోచన మనసులో ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. దానికి తోడు మావారి బాంకులో ఎల్టీసీ సౌకర్యం కూడా ఉంది. 2012 వరకు చేసిన ప్రయాణాల్లో దాదాపు 60 శాతం ఎల్టీసీ సహాయంతో చేసినవే. ఎల్టీసీ అన్నప్పటికీ బ్యాంకు వాళ్ళు కేవలం టికెట్ ఖర్చు మాత్రం ఇస్తారు. మిగిలిన హోటల్ రూమ్స్, భోజనాలు, ఎంట్రన్స్ టికెట్లు, పూజ టికెట్లు, దక్షిణలు, సంభావనలు, అన్నదానాలు వగైరా ఎన్నో, ఎన్నెన్నో, అన్నీ మా పాకెట్ నుంచే. బ్యాంకు వాళ్ళు 10 రూపాయలు ఇస్తే, మాకు మరో 20 రూపాయలు ఖర్చు అయ్యేవి. 2012 డిసెంబర్ తరువాత అంటే రమేష్ గారు రిటైర్ అయినాక చేసిన ప్రయాణాలన్నీ పూర్తిగా మా సొంత ఖర్చుతో చేసినవే. 2002 నుంచే పిల్లలు మాతో రావడం మానేశారు. వాళ్ల చదువుల్లో, ఉద్యోగాల్లో ఈ టూర్స్ కి సమయం కుదరలేదు. చేసిన ప్రతి యాత్రలో ఆ తీపి గుర్తు ఎప్పటికీ నిలిచిపోవాలని, ఫోటోలు తీసేదాన్ని. ఫోటోలు తీయటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఈరోజుకీ ఆ ఫోటోలు చూస్తుంటే ఆనాటి సంగతులన్నీ వెంట వెంటనే గుర్తు వచ్చేస్తాయి. అవి అన్నీ నాకు ఒక మధుర స్మృతుల బాంక్. 

                                                                  ఇక మావారికి తన బ్యాంకులో ఒకసారి ఇన్స్ పెక్షన్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు. ఆ పోస్టులో వున్నన్ని రోజులూ ప్రయాణాలూ, రూములూ, ఎప్పుడూ ఏదో ఒక ప్రయాణమూ, ఆయనకీ బాగా అలవాటు అయ్యాయి. వాళ్ళ టీమ్ వాళ్ళు అందరూ  ఉదయం, సాయంత్రం ఆ చుట్టుపక్కల యాత్రా ప్రదేశాలు అన్నీ చూసి వచ్చేవాళ్ళు. ఈ రకంగా మావారికీ ప్రయాణాలంటే ఇష్టం ఏర్పడింది. ఇద్దరి అభిరుచీ ఒకటే అయ్యింది. అప్పుడే ఈ మా ప్రయాణోపనిషత్ కి బీజం పడింది. 


భారతదర్శనం............ 




                                              ఎన్నాళ్ళో ఎదురుచూసి, ఎంతో ప్లాన్ చేసి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, అదే ధ్యాసగా, ధ్యానంగా, కొన్నేళ్ళ పాటు శ్రద్ధగా ప్రయత్నించి పూర్తి చేసుకుంటున్న ఒక గొప్ప కష్ట సాధ్యమయిన కార్యక్రమం ఇది. అన్నీచేసాక తెలుసుకున్న సత్యం ఏమిటంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు మాత్రమే, మనం ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళగలం కానీ, మనం యాత్ర చేయాలనో, దేవుణ్ణి చూద్దామనో అనుకుంటే చేయగలిగే యాత్రలు కావవి. దేవుడు మనలను చూడాలనుకుని మనల్ని పిలిస్తేనే ఇవి సాధ్యపడతాయి. చాలామందికి ఇందులోని భావం అర్ధం కాకపోవచ్చు. "మనం దేవుడ్ని చూస్తున్నామని అనుకుంటూ ఉంటాం కానీ, నిజంగా అక్కడ జరిగేది ఏమిటంటే ఆ దేవుడే మనకు తనని చూడటానికి పర్మిషన్ ఇస్తున్నాడు. అంటే ఆయన మనల్ని చూస్తున్నాడు కానీ, అదేదో మనం ఆయన్ని చూసే ప్రయత్నం కాదది."

                                                              ఈ యాత్రలు, ముఖ్యంగా తీర్థయాత్రలు చేయాలంటే, ఉండాల్సినవి మూడు అంశాలు. అవి 1. దేవుని పిలుపు, 2. శరీరంలో ఆరోగ్యం, 3. జేబులో డబ్బు. వీటిల్లో మొదటిది ఉంటేనే యాత్ర సాధ్యపడుతుంది. రెండోది కూడా ఉంటే ఇబ్బందులు వుండవు. మూడోది కూడా ఉంటే యాత్ర సౌకర్యంగా చేయచ్చు. ఇది సత్యం, ఇదే సత్యం. అన్నీ మనమే చేస్తున్నాం, చూస్తున్నాం, అనుకుంటే అది కేవలం ఒక భ్రమ. ఏదో ఒక శక్తి మనతో ఈ పనులు అన్నీ చేయిస్తోంది అనే విషయం మాత్రం ఖచ్చితంగా నిజం. ఆ శక్తి ఏదో తెలుసుకోవాలంటే మాత్రం దాన్ని మనం అనుభూతిలో మాత్రమే తెలుసుకోగలం. మనం అనుకోనివి కొన్ని చేస్తూ ఉంటాం, అనుకున్నవి కొన్ని ప్లాన్ చేసినా కూడా చేయలేకపోతాం. కొన్ని మనకు ఎంతో అపురూపమయినవి కొన్ని చోట్ల రోడ్ల పక్కన విపరీతంగా చూస్తాం. కొన్ని మనకు ఎప్పుడంటే అప్పుడు లభ్యమయ్యేవి, కొన్ని ప్రాంతాల్లో అపురూపం. మనం ఎంతో అపురూపంగా తొట్టెల్లో పెట్టి జాగ్రత్తగా పెంచుకునే గులాబిచెట్లు, గుల్మార్గ్ కి వెళ్ళేదారిలో దారి పొడవునా ఇరువైపులా గులాబీ చెట్లు, వాటికి నిండా పువ్వులు కనిపిస్తూనే ఉంటాయి. కీసరకి వెళ్తే ఎటు చూసినా లింగాలే, ఎంత విపరీతంగా ఉంటాయంటే, కొన్ని లింగాలు ఇళ్ల పునాది గోడల్లో కూడా కనిపిస్తాయి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకప్పుడు మనకు ఫ్రిడ్జిల్లో మాత్రమే కనిపించే మంచు కొండలు, లడ్డాఖ్ వెళ్తే, మన కాళ్ళ కిందే. కనుచూపు మేర దాకా అంతా మంచే, ఎంతైనా అవి హిమాలయాలు కదా. రామేశ్వరంలో అయితే సముద్రంలో మామూలుగా నడిచెయ్యచ్చు. బట్టలు తడుస్తాయనుకోండి, అది మాత్రం తప్పదు. 

                                              ఈ యాత్రల్లో భాగంగా మేము ఎన్ని రకాల వాహనాల్లో ప్రయాణించామో గుర్తు చేసుకుంటే మహా ఆశ్చర్యం, మహా అద్భుతం, మహా ఆనందం. విమానం, హెలికాప్టర్, రోప్ వే, కేబుల్ కార్, రైల్, ట్రామ్, కార్, జీపు, బస్సు, మినీబస్సు, ఆటో, బ్యాటరీ రిక్షా, మామూలు రిక్షా, గుర్రబ్బండి, ఎద్దుల బండి, లాగుడుబండి, స్టీమర్, బోట్, నాటుపడవ, పుట్టి, గుర్రం, కంచర గాడిద, ఒంటె, జడలబర్రె, డోలీ, నడక, నడక కూడా నీటిలో నడుము పైన లోతులో పుష్పగిరిలో, మోకాలు లోతు మంచులో ఖర్దూన్గ్లా పాస్, గడ్డ కట్టి కాలు జారే ఐస్ లో అమరనాథ్ లో, కాలు మునిగిపోయే ఇసుకలో గంగా సాగర్ లో, జైసల్మీర్ లలో...... ఇలా తలుచుకుంటుంటేనే ఎంత ఉద్వేగంగా వుందో ..... మాటలకందని భావాలు ఎన్నో, మరిచిపోయిన సంగతులెన్నో.  మేధోమధనం చేసి అవన్నీ చెప్పాలని ఒక ప్రయత్నం. 

                                            ఇది అంతా కేవలం దైవకృప. అంతా సృష్టి గొప్పదనం. ఏదో ఒక అతీత శక్తి ఎప్పటికప్పుడు 'నేనున్నా' అని మనకు తెలియచేస్తూ ఉంటుంది. మనం ఎంతో సాధించేసాం అనుకున్న ప్రతిదీ ఆ దేవుని శక్తి సంకల్పాల సహాయంతోనే చేస్తున్నాం. అలా అని మనం కాళ్ళు చాపుకుని కూర్చోవచ్చా అంటే, అదీ కాదు. దేవుడు సోమరిగా ఉంటే ఏ సహాయానికీ ముందుకు రాడు. మనం చైతన్యవంతంగా ఉంటే ఆయన చురుకుగా కదిలి ముందుకు వస్తాడు, ఎందుకంటే మనం సోమరి అయితే, ఆయన సోమరి. మనం చైతన్యమూర్తులమైతే, ఆయన కూడా చైతన్యమూర్తే. ఎందుకో తెలుసా, ఆయనే మనం, మనమే ఆయన కనుక. గీతలో ఆయనే ముమ్మారు చెప్పాడు మరి, "త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః" అని. శ్రీ కృష్ణుడు అర్జునునితో, అంటే నారాయణుడు నరునితో చెప్పాడు. దేవుడు నారాయణ స్వరూపం ఐతే మనం నరులం అంతే.


ఇక వివిధ క్షేత్రాల సందర్శనం లోకి వెళదామా . 


 భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

తిరువణ్ణామలై-అగ్నిలింగం

శ్రీశైలే మల్లికార్జునమ్