సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు
సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు భట్టిప్రోలు విజయలక్ష్మి తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు చాలా ప్రత్యేకమైనవిగా పేరు పడ్డాయి. వీటినే ఆరుపడైవీడు అంటారు. అవి పళని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుత్తణి, తిరుప్పరంకుండ్రం, పళియముదిర్ చోళై. వీటిల్లో మేము ఆ మొదటి అయిదు క్షేత్రాలు మాత్రమే దర్శించుకోగలిగాం. ఎందుకో ఆ ఆరోది మిస్ అయ్యింది. ఈ అన్ని క్షేత్రాల్లో సుబ్రహ్మణ్యుడు ఎంతో అందంగా, సమ్మోహనంగా ఉంటాడు. ఈ క్షేత్రాలను గురించి వరుసగా చెప్పుకుందాం. ఆరుపడైవీడులో మొదటిది పళని క్షేత్రం. మేము 1987లో సౌత్ టూర్ లో భాగంగా చూసాం. దండాయుధ పాణి, వేలాయుధ పాణి అని ఇక్కడి దేవుడికి పేరు. ఇక్కడ దేవుడు బాల సుబ్రహ్మణ్యుడు, కౌపీనధారుడు. నున్నటి గుండుతో చిన్న గోచీతో, ఒక చేతితో శూలాన్ని పట్టుకుని, మరో చెయ్యి నడుం మీద పెట్టుకుని రుద్రాక్షమాలలు ధరించి ముద్దుగా ఉంటాడు ఈ బాల సుబ్రహ్మణ్యుడు. ఈ విగ్రహాన్ని నవపాషాణంతో భోగార్ అనే భక్తుడు తయారుచేశాడు. నవపాషాణం అంటే తొమ్మిది విషపదార్ధాలు కలిపిన ఒక ధాతువు. ఈ తొమ్మిది విషపదార్ధాలను ఒక ప్రత్యేకమైన నిష్పత్తిలో కలిపిత...