శ్రీకాళహస్తి-గుడిమల్లం

  శ్రీకాళహస్తి - గుడిమల్లం 

ఇప్పటివరకూ నాలుగు పంచ భూత ఆలయాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిగిలిన అయిదో పంచభూత క్షేత్రమైన శ్రీకాళహస్తి లోని వాయులింగాన్ని దర్శిద్దాం రండి. మేము ఈ ఆలయాన్ని కనీసం పది, పదిహేను సార్లైనా చూసి ఉంటాం. మేము తిరుపతికి వెళ్లిన ప్రతిసారీ కాకపోయినా కొన్నిసార్లైనా ఇక్కడికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వాయుదేవుడు కర్పూరంతో శివలింగాన్ని తయారుచేసి ఆ కర్పూర లింగానికి ఎంతో శ్రద్ధతో పూజలు చేసాడట. వాయుదేవుడి భక్తికి మెచ్చిన శివుడు ఆ ప్రాంతం లోనే వాయుదేవుడితో సహా లింగరూపంలో కొలువుంటానని వరం ఇచ్చాడట. ఇక్కడ వాయువు ఉన్నదనటానికి సాక్ష్యంగా, ఈ శివుడు ఊపిరి పీలుస్తుండటం నిదర్శనంగా చెపుతారు. ఈ ఆలయంలో పైకప్పు నుంచి వేళ్ళాడుతున్న రెండు అఖండ దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. అందులో ఎడమవైపు పెట్టిన దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. అదే సమయంలో కుడివైపున పెట్టిన దీపం స్థిరంగా నిల్చి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ శివుడికి వాయువుతో వున్న అనుబంధానికి ఇదే నిదర్శనం. ఇదే విధంగా శ్వాసించే నారసింహమూర్తి నల్గొండ జిల్లా వాడపల్లిలో ఉంది. ఆ విశేషాలు వైష్ణవ క్షేత్రాలలో చెప్పుకుందాం. 
 ఈ శ్రీకాళహస్తి లింగం సన్నగా పొడవుగా ఉంటుంది. ఈ లింగాన్ని పూజారులు కూడా తాకరు. లింగం చుట్టూ ఒక పొడవైన బంగారు కవచం ఉంటుంది. అభిషేక సమయాల్లో మాత్రం ఈ కవచాన్ని ఒక పుల్లీ సహాయంతో పూజారులు పైకి ఎత్తుతూ, దించుతూ వుంటారు. ఆ కవచానికి వరుసకు మూడు చొప్పున తొమ్మిది వరుసల్లో బంగారు నక్షత్రాలు ఉంటాయి. ఇవే అశ్వని నుంచి రేవతి వరకూ గల 27 నక్షత్రాలు. అందుకే ఈ ఆలయం లోని శ్రీకాళహస్తీశ్వరుడుని దర్శిస్తే ఎటువంటి నక్షత్ర దోషాలైనా పోతాయని చెప్తారు. అన్ని నక్షత్ర దోషాలనూ, జాతక దోషాలనూ పరిహరిస్తాడు కనుక ఈ మహాదేవుడే జ్యోతిషాంపతి. ఓం జ్యోతిషామ్ పతయే నమః. 

 
       
ఈ దేవుడికి శ్రీ కాళహస్తీశ్వరుడనే పేరు రావడానికి ఒక కథ వుంది. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ ఈ స్వామిని ఎంతో భక్తిగా తమ తమ పద్ధతులలో సేవించాయి. స్వామి మీదకు దుమ్మూ, ధూళీ చేరకుండా సాలెపురుగు రోజూ శివలింగంపై చిక్కగా గూడుని అల్లేది. ఒక ఏనుగు రోజూ పక్కనే వున్న సువర్ణముఖీ నది నుంచి తొండంతో జలాన్ని, కొన్ని బిల్వపత్రాలనూ తెచ్చి నిత్యం స్వామికి అభిషేకం చేసి స్వామిపై బిల్వపత్రాలు ఉంచేది. అదే విధంగా ఒక పాము కూడా వచ్చి ఈ ఏనుగు పెట్టిన బిల్వపత్రాలను తోసేసి నాగమణులు పెట్టి శివుడ్ని పూజించేది. మణులు, సాలెగూళ్ళు నచ్చని ఏనుగు, ఆ మణులను  తోసేసి,  సాలెగూడుని తీసేసి, మళ్ళీ నీటితో శివుడిని అభిషేకించి బిల్వపత్రాలతో పూజించేది. ఆ సాలెపురుగు వచ్చి మళ్ళీ ఓపికగా శివలింగంపై గూడు అల్లేది. ఒకరోజు పాముకి ఈ ఏనుగు పైన కోపం వచ్చి, దాని తొండంలో దూరి బాధ పెట్టింది. అప్పుడు ఏనుగు ఆ బాధకి శివలింగంపై తలతో మోదుకుంది. దానితో తొండంలోని పాము చనిపోయింది. విషప్రభావంతో ఏనుగు చనిపోయింది. గూడు అల్లుతున్న సాలెపురుగు కూడా లింగానికి ఏనుగుకి మధ్య నలిగి చనిపోయింది. మూడు జీవాలూ ఏకకాలంలో చనిపోయాయి. మహాదేవుడు వాటి భక్తికి మెచ్చి వాళ్ళ పేరు మీదే తానక్కడ పూజలు అందుకుంటానని వరం ఇచ్చాడు. అందుకే ఈ ఈశ్వరుడు శ్రీ,  కాళ,  హస్తి,  ఈశ్వరుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు అయ్యాడు. 

 

ఇక్కడే బోయ తిన్నడు కూడా శివ సాయుజ్యాన్ని పొందాడు.  తిన్నడు ఈ శివుడిని చూసి ముగ్ధుడై నిత్యమూ శివుడికి మద్యమూ, మాంసమూ నైవేద్యంగా పెట్టేవాడు. పుక్కిలి నిండా సువర్ణముఖీ జలాలను తెచ్చి లింగాన్ని కడిగేవాడు. ఒకరోజు శివుడు ఈ భక్తుడిని పరీక్షించదలచి, ఆ బోయ తెచ్చిన ఆహారం ముట్టుకోలేదు. తిన్నడు ఏమైందా లోపం అని ఖంగారు పడ్డాడు. తీరా చూస్తే శివుడి ఎడమ కంటి నుంచి రక్తం కారుతోంది. అయ్యో, పాపం శివుడికి ఎంత కష్టం వచ్చిందీ అని తిన్నడు బాధ పడ్డాడు. కన్నుకు కన్నే మందు అని ఆలోచన చేసి బాణంతో తన ఎడమ కన్నుని పెరికి శివుడికి అమర్చాడు. వెంటనే ఆ కంటిలో కారే రక్తం ఆగిపోయింది. శివుడి బాధ తగ్గి పోయిందని తిన్నడు ఆనందపడే లోపు, కుడి కన్నులో నుంచి రక్తం కారటం మొదలైంది. అప్పుడు తిన్నడు ఏమాత్రం జంకకుండా తన కుడి కన్నుని కూడా శివుడికి పెట్టడానికి పెరకబోయాడు. అప్పుడు సందేహం కలిగింది, ఈ కన్నూ పోతే నేను స్వామికి కన్ను ఎలా సరియైన చోట అమర్చగలనూ, అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు శివుని కుడికంటి వద్ద తన కాలును గుర్తుగా తన్ని పెట్టి రెండవ కన్నుని కూడా పెరికి శివుడికి అమర్చబోయాడు. అప్పుడు శివుడు తిన్నని అమాయకపు భక్తికి మెచ్చి అతనికి కైలాసం చేరుకునే వరం ఇచ్చాడు. ఇది బోయ తిన్నని కథ. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన పాటలో ఇలా రాశాడు. "కరి, పురుగు, పాము, బోయ, మొరలిడగా వినలేదా, కైలాసము దిగి వచ్చి కైవల్యము నిడలేదా...." అంటాడు ఆయన, తన "శివ శివ శివ అనరాదా, శివ నామము చేదా" అనే గీతంలో.

 
ఈ ఆలయం కట్టేటప్పుడు ఒక వింత జరిగేదని స్థలగాధ. ఆలయం కట్టిన శిల్పులందరూ ప్రతి రోజూ పని అయ్యాక సువర్ణముఖీ నదిలో స్నానం చేసేవారట. అప్పుడు ఆ శిల్పులందరికీ ఆ రోజు వారెంత పని చేస్తే అంత బంగారం భత్యంగా చేతిలోకి వచ్చేదట. నది పేరే సువర్ణముఖి, స్వర్ణముఖి కదా. ఆ సువర్ణముఖి కార్మికులందరికీ వారి పనికి తగిన సువర్ణం ఇచ్చేది. ఇక్కడ ఆలయంలో ఎక్కడా చూడని పొడుగాటి వరండాలు ఉంటాయి. ఆ వరండా పొడవునా స్తంభాలు, వాటిపై పెద్ద పెద్ద శిల్పాలు. అన్నీ మహా అద్భుతంగా ఉంటాయి. నిజానికి ఈ ఆలయంలోని శిల్ప సంపద అంతా వివరంగా చూడాలంటే ఒక్కరోజు సరిపోదు. ఆ పెద్ద పెద్ద వరండాలలో నయనారుల మూర్తులు, వివిధ దేవీ, దేవతలచే, ఋషులచే, రాజులచే ప్రతిష్టించబడిన లింగాలు, సహస్రలింగం మనకు కనపడతాయి. రాయలకాలం నాటి నిలువెత్తు రాజగోపురం గంభీరంగా ఉండేది. 2010లో వచ్చిన తుఫానుకి అది కూలిపోయింది. తిరిగి 2017లో ఆ రాజగోపురాన్ని పునః నిర్మించారు. అప్పుడే ఆలయానికి కూడా కావలసిన మరమ్మత్తులన్నీ కూడా చేసారు. స్వామి వారిని దర్శించుకున్న తరువాత అమ్మవారిని దర్శించుకోవటానికి వెళ్ళాం.

                                           
ఇక్కడి అమ్మవారి పేరు శ్రీ జ్ఞానప్రసూనాంబ. నిలువెత్తు విగ్రహం. ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకనే కాబోలు, ఎదురుగా ఒక మంటపం ఉంటుంది. అక్కడ నుంచుని అమ్మవారిని చాలాసేపు చూసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడల్లా ఏ మాత్రం అవకాశం వున్నా, అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉంటాము. ఈ అమ్మవారి ఆలయ ప్రత్యేకత ఏమంటే, గర్భగుడి ఎదురుగా వున్న వరండాలో, సరిగ్గా అమ్మవారికి ఎదురుగా పై కప్పుపై 12 రాశుల చక్రం తైలవర్ణ చిత్రం ఉంటుంది. ఆ అమ్మవారిని చూస్తూ ఆ తైలవర్ణ చిత్రం చూసి నమస్కరించుకుంటే గ్రహదోషాలు, రాశిదోషాలు పోతాయిట. అందుకే ఏ జ్యోతిష్యుడైనా గ్రహ, నక్షత్ర దోషాలేమైనా ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి అంటూ వుంటారు. పూజలు చేయించుకోకపోయినా, పైసా ఖర్చుపెట్టలేని పేదలైనా ఇక్కడికి వచ్చి ఈశ్వరుడిని చూస్తే, నక్షత్ర దోషాలు, అమ్మవారిని చూస్తే రాశి దోషాలు, మొత్తం మీద అన్ని గ్రహదోషాలు, జాతకదోషాలూ పోతాయట. ఎంత కనికరం ఆ దంపతులకు, తమ భక్తులమీద అనిపిస్తుంది. అందుకే, "జగతః పితరౌ వందే, పార్వతీ పరమేశ్వరౌ", అంటూ ఉంటాం. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా పూజలు జరుగుతాయి. దేశంలో అన్ని ఆలయాలూ గ్రహణం వచ్చేముందు నుంచీ, వెళ్లిపోయే సమయం దాకా మూసేస్తారు, ఈ ఒక్క ఆలయం తప్ప. అప్పుడు ప్రత్యేకంగా గ్రహణ శాంతి పూజలు జరుగుతాయి. 

దీనికీ ఒక కథ వుంది. సముద్ర మధనం అప్పుడు అమృతం కూడా వచ్చింది కదా. అప్పుడు విష్ణువు మోహినీ అవతారంతో వచ్చి, ఆ అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే దక్కేలా పంచుతూ ఉంటాడు. ఈ తేడా కనిపెట్టిన స్వరభాను అనే సర్పరూపంలో వున్న రాక్షసుడు దేవతా రూపంలో వచ్చి, ఆ అమృతాన్ని తానూ తీసుకుంటాడు. ఇది కనిపెట్టిన సూర్య చంద్రులు మోహినితో చెప్పగానే వెంటనే తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తల ఖండిస్తాడు విష్ణువు. కానీ అప్పటికే అమృతపానం చేసినందువల్ల అమరుడైన ఆ రాక్షసుడికి దేహం తలా వేరైనా కూడా రెండు భాగాలూ విడి విడిగా బతికే ఉంటాయి. తలతో వున్న భాగాన్ని రాహువు అనీ, తోకతో వున్న భాగాన్ని కేతువు అనీ అంటారు. ఇవి రెండూ విష్ణువు అనుగ్రహం వలన నవగ్రహాలలో చేరాయి. అయినా ఈ రాహుకేతులు సూర్య చంద్రుల మీద కోపంతో వాటిని మింగటానికి ప్రయత్నం చేస్తూ వుంటాయని, ఆ సూర్య చంద్రులు కూడా అమృతం తాగటం వలన, వారిని చంపలేక తిరిగి వదిలేస్తూ ఉంటాయనీ, అవే గ్రహణాలనీ పురాణ కథనం. ఈ ఆలయంలో శ్రీ కాళహస్తీశ్వరుడూ, శ్రీ జ్ఞానప్రసూనాంబా ఇద్దరూ అన్ని గ్రహదోషాల నుంచీ భక్తులను రక్షిస్తూ వుంటారు కనుక, రాహు కేతు గ్రహ దోషాలు ఉన్నవారు ఇక్కడ ఆ పూజలు చేయించుకుంటారు. మేమూ రెండుసార్లు చేయించుకున్నాం. ఒకసారి గుడి లోపల మంటపంలో చేసారు. రెండవసారి ఈ పూజలకు గాను ప్రత్యేకంగా కట్టిన మంటపంలో చేశారు.

యధావిధిగా ఉపాలయాలన్నీ, పాతాళగణపతితో సహా చూసుకుని మళ్ళీ బయల్దేరాం. పాతాళగణపతి మెట్లు భయపడి దిగకుండా, పై నుంచే వంగి చూసి, దణ్ణం పెట్టుకుని వచ్చేసాం. ఈసారి గుడిమల్లం వెళ్ళడానికి. ఈ గుడిమల్లం ఇప్పటికి మూడు నాలుగు సార్లైనా చూశాం. మొదటిసారి మాత్రం ఎంతో వెతుక్కుని వెతుక్కుని వెళ్లి మరీ చూసాం. మావారు విసుక్కున్నారు కూడానూ. ఎక్కడా లేనివన్నీ చెప్తావు, అని. తిరుమల టాక్సీ స్టాండ్ లో వున్న ఒక చాలా సీనియర్ డ్రైవర్, ఈ గుడి రేణిగుంట ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో వెళ్తే వస్తుందని, పాపానాయుడుపేట అని అడగాలని చెప్పాడు. నేను ఈ గుడి గురించి ఒక పేపర్ లో చదివి, ఈ గుడిని చూడాలని అనుకున్నా. అప్పటికి ఈ గుడి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. పూజాదికాలూ లేవు. ఆలయం తాళంచెవులు ASI ఆఫీసర్ దగ్గరే ఉండేవి. ఆయనే స్వయంగా వచ్చి మాకు ఈ ఆలయం అంతా చూపించి దాని ప్రత్యేకతను వివరించారు. ఆ ఆఫీసర్ ఆలయం గురించి అంత శ్రద్ధాసక్తులతో వచ్చినందుకు మమ్మల్ని చూసి ఎంతో ఆనంద పడిపోయాడు. ఈ ఆలయం కూడా సువర్ణముఖీ నది ఒడ్డునే వుంది. 

 
                                                                     
ఈ గుడిమల్లం ఆలయంలో గర్భగుడి ఒక మూడు నాలుగు అడుగుల పల్లంలో వుంది కనుక ఈ గుడికి గుడిపల్లం అని పేరొచ్చిందని, తరువాత అదే రాను రాను గుడిమల్లంగా మారిందనీ చెప్పాడు. ఆలయం గోపురం గజపృష్ట ఆకారంలో ఉంటుంది. లోపల మూడు ప్రాకారాలు వున్నాయి. ఈ ఆలయ ప్రాంగణం లోనే సూర్యుడు, గణపతి, సుబ్రహ్మణుడు, అమ్మవారు ఆనందవల్లి కీ ఉపాలయాలున్నాయి. ఆలయ ప్రాంగణం లోనే ఆనాడు తవ్వకాలలో దొరికిన వివిధ ఖండిత భాగాలూ, శిలా శాసనాలూ పెట్టారు. ఆ శిలా శాసనాల ఆధారంగానే ఈ గుడి సుమారు మూడవ శతాబ్దం నాటిదని, మొత్తం దేశంలోనే బహుశా ఇదే మొట్టమొదటి శివాలయమనీ తెలిసిందట. ఆలయంలోని ఒక ప్రాకారంలో సీక్రెట్ లాకర్లు వున్నాయి. గోడలో ఒక రాయిని తొలగించి ఆయనే మాకు ఆ లాకర్లను చూపించాడు. ఆ ప్రాంతం మాత్రం చిమ్మచీకటిగా ఉంటుంది. బ్యాటరీ లైట్ సహాయంతోనే ఆ ప్రాకారం దాటగలం. ఆ రోజుల్లో దొంగలకు భయబడి ప్రజలు తమ విలువైన వస్తువులు దేవుడి దగ్గరే దాచుకునే వారట. గర్భగుడి చుట్టూతా నలువైపులా విగ్రహాలున్నాయి. దాంట్లోనే దక్షిణామూర్తి విగ్రహం కూడా వుంది. గర్భాలయం నుంచి నీరు వెలుపలకు పోయే సన్న కాలువ కూడా వుంది. 

    
                                               
గర్భగుడిలోకి పన్నెండేళ్లకు ఒకసారి సువర్ణముఖీ నది నుంచి నీరు దానంతట అదే వచ్చి శివుడికి అభిషేకం చేస్తుందట. ఆ నీరు తిరిగి వెళ్లిపోయే తూము మార్గం కూడా అక్కడే వుంది. ఎన్ని ఏర్పాట్లతో ఆనాటి కాలంలో ఈ గుడి కట్టారు కదా అని అనిపించక మానదు. ఈ ఆలయంలో ప్రధాన మూర్తిగా త్రిమూర్తులు ఒకే శిలలో వుంటారు. ఈ శిల్పం చెక్కిన రాయి నవపాషాణం అనే శిల అని ఆ ఆఫీసర్ మాకు చెప్పాడు. కింద బ్రహ్మ ఒక మరుగుజ్జు రాక్షస రూపంలో ఉంటాడు. ఆ పైన పరశురాముని రూపంలో విష్ణువు ఒక దిగంబర వేటగాడి రూపంలో ఉంటాడు. ఆ వేటగాడి భుజంపై గొడ్డలి ఉంటుంది. ఒక చేతిలో అప్పుడే చంపిన దుప్పి ఉంటుంది. రెండో చేతిలో ఉట్టి, ఆ ఉట్టిలో మద్యం కుండ ఉంటాయి, శివుడికి నైవేద్యంగా. ఆపైన లింగరూపంలో మహేశ్వరుడు ఉంటాడు. ఈ లింగం పూర్తిగా పురుషలింగం ఆకారంలో ఉంటుంది. ఈ విధంగా పురుషలింగం రూపంలో శివలింగం కనిపించే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి.
స్థలగాధ ప్రకారం తల్లి తల నరికిన పాపం పోవడానికి పరశురాముడు శివార్చన చేసుకుని, ఆ పాపం పోగొట్టుకోవటం కోసం ఇక్కడికి వచ్చాడు. ఆ పక్కనే ఒక మహిమ గల విచిత్ర పుష్కరిణి ఉండేదట. ఇప్పుడు లేదు. ఆ విచిత్రపుష్కరిణిలో రోజూ ఒక బ్రహ్మకమలం విరిసేదట. పరశురాముడు నిత్యమూ ఆ పుష్పాన్ని తెచ్చి శివుడికి పూజలో సమర్పించేవాడట. ఆ పుష్పంతో పాటు ఒక కుండ నిండా మద్యము, అప్పుడే చంపిన ఒక దుప్పిని తెచ్చి శివుడికి నిత్యమూ నైవేద్యం పెట్టేవాడట. బ్రహ్మ శాపవశాత్తూ ఆ పుష్కరిణిలో చిత్రసేనుడనే పేరుతో ఒక మరుగుజ్జు రాక్షసుని రూపంలో జీవిస్తున్నాడు. తన చెరువులో పువ్వు తనకు దక్కకుండా రోజూ తీసుకుపోతున్న పరశురాముణ్ణి ఒక 
శత్రువుగా భావించి యుద్ధం చేస్తాడు బ్రహ్మ. బ్రహ్మా, విష్ణువు ఇద్దరూ చాలా తీవ్రంగా భీషణ యుద్ధం చేస్తుండగా వారి మధ్యలోకి శివుడు ప్రత్యక్షమై, అచ్చం లింగోద్భవం దృశ్యం లాగా, మనం ముగ్గురం త్రిమూర్తులం, మనం ఒక్కటే అని చెప్పి, వారికి సాయుజ్యాన్ని ప్రసాదించి, ఆ ఇద్దరితో పాటు ఏకశిలలో ఇక్కడ వెలిశాడుట. పరశురాముడు పూజించిన ఆలయం కనుక ఈ ఆలయం పేరు పరశురామేశ్వరాలయం. ఇదీ కథ.

 

నిత్యం పూజా పునస్కారాలు లేకపోయినా గ్రామం వారంతా మహాశివరాత్రికి మాత్రం వచ్చి చాలా సంబరంగా జాతర చేసుకుంటారుట. ఈ గుడిమల్లం గుడి అంతా సుమారు ఒక గంట పాటు మాకు చూపించి, అన్నీ వివరించిన ఆ ASI అధికారికి కృతజ్ఞతలు. ఆయనకు థాంక్స్ చెప్పుకుని బయటకు వస్తుంటే, మాలాగే మరో జంట అప్పుడే కారు దిగుతోంది. మావారు చూసి నవ్వుతూ, 'నీలాంటి పిచ్చోళ్ళు ఇంకా వున్నారు' అన్నారు. నాకూ నవ్వొచ్చింది. అంటారు కానీ, నా పిచ్చి ఆయనకూ ఇష్టమే, లేకపోతే మేము ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రాంతాలు తిరగ గలిగే వారమా. ఇదీ మేము మొదటిసారి గుడిమల్లం చూసినప్పటి ముచ్చట. ఆ తరువాత ఆ గుడిలో పూజలు మొదలైనాయి. పూజారి వచ్చేసాడు. దాంతో దేవుడు ఒక్క పూజారికి తప్ప, మరెవ్వరికీ తాకరాని వాడయ్యాడు. ఆ గుడి విశేషాలు కూడా ఇప్పుడు ఎవరూ చూపించటం లేదు. అసలు వారికి తెలుసో తెలియదో. నేను మాత్రం వెళ్లిన ప్రతిసారీ నాకు తెలిసిన విశేషాలన్నీ అప్పుడు అక్కడ వున్న అందరికీ చెప్పి వస్తూ ఉంటా. ఇప్పుడు వున్నవారికి  పూజా పద్ధతీ తెలుసేమో కానీ,  గుడి ప్రత్యేకత తెలుసా, సందేహమే. 

ఇంతటితో నా కాళహస్తి, గుడిమల్లం పర్యటన వ్యాసం పూర్తి అయ్యింది. దీనితో మొత్తం అయిదు పంచభూత లింగాల ఆలయాల సందర్శనం కూడా పూర్తి అయ్యింది. తిరిగి మరో అతి పురాతన లింగం ఆదికుంభేశ్వరుడు కొలువైన కుంభకోణంలో కలుసుకుందాం.

ఓం శ్రీ కాళహస్తీశ్వరాయనమః, ఓం శ్రీ జ్ఞానప్రసూనాంబాయి నమః 
ఓం శ్రీ పరశురామేశ్వరాయనమః     


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650

కామెంట్‌లు

  1. Beautiful narration. Kalahasti temple is huge temple. Long back when we have visited for the first time , there was no crowd. We were able spend good amount of time in the temple.
    Slowly the crowd is increasing.
    But still when ever we visit Tirupathi, we go to Kalahasti.
    Recently when I have visited Kalahasti, I have the opportunity of going inside nearer to the Ammavaru. Ammavai vigraham has a round crown, on which navagrahas are engraved. Beautiful murthy.

    రిప్లయితొలగించండి
  2. అక్కా, నీ అదృష్టం. మాకు అమ్మవారి దగ్గరకు వెళ్లే అవకాశం రాలేదు. కిరీటంలో నవగ్రహాలున్నాయన్న సంగతీ నాకు తెలియదు. చెప్పినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  3. జై సీతారామ్ ! మీ వ్యాసం ఆసాంతం చదువుతుంటే మా ఆత్మీయ అమ్మమ్మ కదా చెప్పినట్లు అనిపించింది ...చాలా చాలా బాగుంది అండీ...శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళ హస్తీశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా పొందేందుకు పడే తాపత్రయం సిద్ధించునుగాక !! చివరగా చిన్న ...ఉపాలయాలు (వుప కాదు) గుడి ప్రాంగణం అన్న దగ్గర ఆలయ ప్రాంగణం అనాలి ...రాను రాను గుడి పల్లం గుడి మల్లం గా మారడం కూడా మంచిదే ఎందుకంటే పల్లం అంటే లోతట్టు ప్రాంతం ...మల్లం అంటే మడి పొలం అంటే నీరు నిలువ ఉండే అవకాశం ఉన్న ప్రాంతం ...అమంగళం ఐన మంగళ వారమును అమంగళ వారం అనడం కంటే మంగళ వారం అనడం మంచిదికదా...(మరో విషయం దినాధిపతి మంగళుడు అంగారకుడు కుజుడు ... ఆయన పేరు మీద మంగళవారం భౌమవాసరః అని అది వేరే )అలాగే గుడి పల్లం గుడి...పల్లం అనేకంటే గుడి మల్లం అనడం మంచిదే...

    రిప్లయితొలగించండి
  4. గూగుల్ మెయిల్ లో సైన్ ఇన్ చేసి కామెంట్స్ పెట్టినప్పుడు మీ పేరు కూడా కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

తిరువణ్ణామలై-అగ్నిలింగం

శ్రీశైలే మల్లికార్జునమ్