శ్రీశైలే మల్లికార్జునమ్
2. శ్రీశైలే మల్లికార్జునమ్...... ఇప్పుడు ఆ శ్లోకంలోని రెండో క్షేత్రాన్ని చూద్దాం. అదే శ్రీశైలంలోని మల్లికార్జునుడు. ఈ క్షేత్రం మన తెలుగు రాష్ట్రాలలోనే వుంది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో వుంది. చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశం అది. స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ పుష్కలం. మనసుకు ప్రశాంతతని ఇచ్చే క్షేత్రం. ఆది శంకరులు ఈ క్షేత్రం గురించి ఈ విధంగా చెప్పారు. శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రి శృంగేఽపి సదా వసంతమ్ | తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ || ఈ శ్లోకార్ధం ఏమిటంటే, శ్రీశైలమనే శిఖరం మీద వివిధ దేవీ దేవతలతో కలిసి ఉంటూ, ఆ కొండ ప్రాంతానికంతా నిత్య వసంతాన్ని కలగచేస్తూ, మల్లిక, అర్జున వృక్షాలతో నిండి వుండి భక్తజనులకు ఈ సంసారసాగరాన్ని దాటడానికి ఒక వారధి వలే వున్న శ్రీ మల్లికార్జునునకు నమస్కారం అని. అంటే శ్రీశైలము అనే ఆ కొండకొమ్ము అంతా నిత్యవసంతాన్ని తలపిస్తూ అంతా మల్లె, మద్ది చెట్లతో నిండి ఉందని శంకరులు గుర్తుగా చెప్పారు. ఈ కొండకే శ్రీగిరి అనే పేరు కూడా వుంది. సంస్కృతంలో గిరి అన్నా, శైలం అన్నా కొండ అని అర్థం. కొండపై వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. అన్ని స...