హిమాలయే తు కేదారం

                    
11. హిమాలయే తు కేదారం......

కేదారనాథ్, ఈ ధామం పేరు విన్న కొత్తల్లో యెంత కష్టము, ఖర్చు కదా అక్కడికి వెళ్ళటం అనుకునేదాన్ని. కానీ ఆ పైవాడు తలచుకుంటే ఎటువంటి పని అయినా దానికదే సాధ్యం అవుతుందని తెలిసివచ్చింది. ఒక్కసారైనా వెళ్లగలమా అనుకున్న ఈ క్షేత్రానికి రెండుసార్లు వెళ్లాం. 1995లో ఒకసారి, 2019 జూన్ లో ఒకసారి. 1995 లో చార్ ధామ్ అన్నీ చూసాం. 2019 లో మాత్రం దో ధామ్ మాత్రమే చూశాం. మొదట మా 1995 యాత్ర గురించి చెప్తాను. అది మే నెల. సదరన్ ట్రావెల్స్ వాళ్ళ టూర్ లో వెళ్లాం. అంతకు కొద్దిగా ఒక నెల ముందు మా అమ్మా, నాన్నా ఈ యాత్రకు వెళ్లి అక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రని కేవలం బదరినాథ్ వరకే చేసి వెనక్కు వచ్చేసారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఒంటరిగా వెళ్ళద్దు. ఏదైనా టీమ్ తో వెళ్తే వాళ్ళు అన్నీ అరేంజ్ చేస్తారు అని. దాంతో మేము సదరన్ ట్రావెల్స్ వాళ్లను సంప్రదించి వాళ్ల టీంతో వెళ్లాం. ముఖ్యంగా ఇక్కడ కేదార్ యాత్ర గురించి చెప్తాను. 

ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఈ ఆలయాన్ని పునర్మించారని అంటారు. అక్కడ నుంచే ఆయన స్వర్గారోహణం చేశారని, ఆ తరువాత ఆయన మరి ఎక్కడా కనిపించలేదని అంటారు. ఈ ప్రాంతంలోనే ఆయన తన దండం, కమండలం, కౌపీనం విసర్జించారనీ, హిమాలయాల్లో పైపైకి వెళ్లి బొందితో కైలాసాన్ని పొందారని అంటారు. మహాభారతంలో స్వర్గారోహణపర్వం ఇక్కడ జరిగిందే. అన్నట్టు ఇక్కడ నల్ల కుక్కలు చాలా వున్నాయి. ఇవి పాండవుల స్వర్గారోహణమప్పుడు వారి వెంట నడచిన యమధర్మరాజుకు ప్రతీకలు. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు తమ దాయాదులని చంపామని బాధపడుతూ కులనాశనం చేసినందుకు గాను పరిహారం చూపమని కృష్ణుణ్ణి అడిగారు. కృష్ణుడు అప్పుడు శివుడిని ఆశ్రయించమని చెప్తాడు. పాండవులందరూ ద్రౌపది, కుంతితో సహా వారాణసీ క్షేత్రం చేరుకుంటారు. వీరికి దర్శనం ఇవ్వటం ఇష్టం లేని శివుడు అక్కడ నుంచి హిమాలయాల వైపుకు వెళ్ళిపోతాడు. శివుడ్ని అనుసరిస్తూ పాండవులు కూడా హిమాలయాలకు చేరుకుంటారు. శివుడు అక్కడ ఒక ప్రాంతంలో గుప్తంగా ఉండటంతో ఆ ప్రాంతానికి గుప్తకాశీ అని పేరు వచ్చింది. శివుడి వెనుకనే, ఆ స్థలానికి గంగా, యమునా కూడా వచ్చి చేరాయి. గుప్తకాశీలో ఈ రెండు ధారలనీ ఈ రోజుకీ చూడవచ్చు. పాండవులు అక్కడికి చేరంగానే శివుడు మళ్ళీ మాయమై ఒక ఎద్దుల మందతో చేరిపోతాడు. అప్పుడు పాండవులు ఆ మంద వెనుకనే ప్రయాణిస్తూ ఆ ఎద్దులలో శివుడిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. చివరికి భీముడు శివుడిని కనిపెట్టి తన భీమబలంతో ఎద్దు రూపంలో వున్న శివుడి మూపురాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పటికే శివుడు తన దేహంలో మిగిలిన భాగాలను తలా ఒక చోట వదిలేస్తాడు. ఆ ప్రాంతాలే పంచకేదారాలుగా ప్రసిద్ధి చెందాయి. తల నేపాల్ లోని పశుపతినాథ్ లో పడిందని కూడా చెప్తారు. అప్పుడు శివుడు వీళ్ళను కరుణించి తన మూపురానికే పూజలు చేసుకోమని, వారి పాపాలన్నీ దగ్ధమైయ్యాయనీ చెప్పి మాయమైపోతాడు. తరువాత పాండవులంతా ఆప్రాంతంలో గుడి నిర్మించి పూజలు చేశారు. ఆ ప్రాంతమే ఈ కేదారనాథ్. ఆ విధంగా ఇక్కడ మొదట గుడి కట్టింది పాండవులు. 


  
                                     
పాండవులు మొదట ఇక్కడ శివుడికి గుడి నిర్మించారు కనుక ఇప్పటికీ ఆలయం ముఖమంటపంలో పంచపాండవులు, ద్రౌపది, కుంతి, వీరభద్రుడు, కృష్ణుడు విగ్రహాలతో పాటు నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. లింగం మాత్రం కేవలం ఒక పెద్ద మూపురం. దాన్ని పూర్తిగా చేతులతో చుట్టాలంటే చేతులు సరిపోవు. అంత పెద్దది. మేము మొదటిసారి వెళ్ళినప్పుడు నీటితో అభిషేకం చేసాక రెండు చేతులతో ఆ లింగాన్ని చుట్టి పట్టుకుని, "రామా" అని గట్టిగా అనుకున్నా. 'శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే' కదా, అందుకేనేమో. అయినా నాకు ఏ పని చేసినా, నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, పని మొదలుపెట్టినా, పని ముగించినా "రామా" అనుకోవటం అలవాటు. కేదారుణ్ని చేతులతో బంధించటం కూడా గొప్ప పనే. అందుకేనేమో, అలా పట్టుకున్నాక "రామా" అనుకున్నా. అమ్మవారి విగ్రహం గర్భాలయపు గోడలలోనే ఉంటుంది. శివుడికి జరుగుతున్న సేవల నన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్టు. ప్రతి జ్యోతిర్లింగక్షేత్రంలోనూ అమ్మవారి విగ్రహం ఇదేవిధంగా గర్భాలయపు గోడలలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో అన్ని రాళ్ళూ ఇదే ఆకారంలో మూపురం లాగానే ఉంటాయి. అన్ని చోట్లా శివుడే వున్నట్లు. 

మేము 1995 లో గౌరీకుండ్ దగ్గర బస చేసి కొద్ది మాత్రం సామాన్లు తీసుకుని గుర్రాలపై కేదారనాథ్ వెళ్ళాము. గౌరీకుండ్ వద్ద ఒక వేడినీటి కుండం వున్నది. పార్వతీదేవి ఈ ప్రాంతం లోనే శివుడికోసం తపస్సుచేసిందనీ, హిమవంతుడు అప్పుడు తన కుమార్తె కోసం ఈ వేడినీటి కుండాన్ని ఏర్పాటు చేశాడనీ అంటారు. ఈ వివరాలన్నీ శివపురాణంలోను, స్కాందపురాణం లోను కనపడుతాయి. ఆ వేడినీటి కుండంలో  పిల్లలూ, మేమూ స్నానాలు చేసి గుర్రాలెక్కాము. ఆడవారికీ, మగవారికీ స్నానాలకీ, బట్టలు మార్చుకోవడానికీ  వేరువేరుగా ఏర్పాట్లు వున్నాయి. కిందనే మాకు ఒక షాప్ నుంచి చిన్న ఆక్సిజన్ సిలిండర్ ఇప్పించారు, ఊపిరి ఆడకపోతే వాడమని. పైకి వెళ్తున్నకొద్దీ మంచులో ప్రాణవాయువు శాతం చాలా తక్కువ. ఆ సిలిండర్ వాడకపోతే రిటర్న్ చేస్తే తిరిగి డిపాజిట్ ఇచ్చేస్తామనన్నారు. మాకు ఆ సిలిండర్ల అవసరమే రాలేదు. పక్కనే మరో చిన్న పందిరి కింద వెదురు కర్రలకు ఇనపముక్కులు తొడిగి అమ్ముతున్నారు, మంచులో నడిచేటప్పుడు కాలు జారకుండా ఈ కర్రను గుచ్చి నడవటానికిట. భలే వున్నాయి అవి. నలుగురికీ నాలుగు కొనుక్కుని గుర్రాలెక్కాం. ఆ రాత్రి మాకు కేదారనాథ్ లోనే బస. ఆ కర్రలు నచ్చి అవి వాపసు ఇవ్వకుండా ఇంటికి పట్టుకొచ్చాను. మా ఆయన ఇదేం పిచ్చి నీకు అన్నారు. అప్పుడప్పుడు ఒక్కోటీ ఒక్కొక్కళ్ళు తీసుకుపోగా ఇప్పటికీ ఇంకా ఒకటి మిగిలింది, అప్పటి మా యాత్రకు గుర్తుగా. పైకి ఎక్కుతున్నప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు. అక్కడే టీ, చపాతీలు, సమోసాలు దొరికాయి. మాకూ, మా గుర్రాల వాళ్లకు ఆ పూటకు అదే భోజనం. ఇప్పుడు ఆ జంగల్ చట్టీ, రాంబరా, గరుడ చట్టీ ఈ ప్రాంతాలేవీ ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకు పోయాయంటే చాలా బాధ వేసింది. ఏడుపు వచ్చింది. గుడికి దగ్గరలోనే మరో ఉష్ణకుండం వుంది. నీళ్లు చాలా వేడిగా ఉంటాయి. అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకుని గుడికి వెళ్లాం. ఇప్పుడు ఆ ఉష్ణకుండం లేనే లేదు. అసలు అప్పటి కేదారనాథే మారిపోయింది. ఇప్పుడంతా సిమెంట్ తో, రాళ్లతో మైదానం అంతా కప్పేశారు. గుడి మాత్రం అలాగే వుంది. ఏమీ మారలేదు. బైట వున్న రాతి నంది మాత్రం కొంచెం బెదరి, చెదరి, వుంది, అంత మహా జలప్రళయం చూసి కాబోలు.  ఆ ఉగ్రం తగ్గించడానికా అన్నట్టు గుడి అంతా, అన్ని విగ్రహాలకూ, గోడలకూ కూడా నందితో సహా విపరీతంగా నెయ్యి పూస్తున్నారు. 

రాత్రిపూట ప్రత్యేక అలంకారం చేశారు. ఎంత అద్భుతంగా ఉందంటే, పొద్దున్న మేం చూసిన లింగం ఇదేనా అనిపించింది. బోల్డు దీపాలు, పూలు, తోరణాలు, అబ్బో, ఎన్నో. పొద్దున్న యోగశివుడు, రాత్రి భోగశివుడు. ఇద్దరి దర్శనం అయ్యింది. గుడి ప్రాంగణంలో పెద్ద పెద్ద త్రిశూలాలు వున్నాయి. గుడి నుంచి కొంచం పైకి ఎక్కితే అక్కడ శంకరాచార్య ఆశ్రమం వుంది. తలుపులు వేసేసి వున్నా కూడా దర్శనం అయ్యేలా కిటికీ లన్నీ తెరిచి ఉంచారు. లోపల పాలరాతి శంకరాచార్య విగ్రహం, పాలరాతి లింగం వున్నాయి. ఆయన దండం, కమండలం కూడా వున్నాయి. బైటనే ఒక పాలరాతి ప్లాట్ ఫార్మ్ మీదఒక పాలరాయి గోడలో ఆయన దండం కమండలం శిల్పంగా మలచి వుంది. మేము అక్కడ ఫోటోలు తీసుకున్నాం.  ఇప్పుడు అవేవీ అక్కడ లేవు. ఆ తేడా స్పష్టంగా కనిపించింది. నాకు హిమాలయాలు చూడటం అదే మొదటిసారి. అంత చల్లని ప్రదేశం, ప్రశాంతంగా, హాయిగా వుంది. రిటైర్ అయ్యాక హిమాలయాల్లోకి వెళ్లి తపస్సు చేసుకోవాలని అనిపించింది. అక్కడే సరస్వతీనది, మందాకినీనది, ప్రవహిస్తూ ఉంటాయి. ఆ రెండింటి సంగమం తరువాత అది అలకనందగా మారుతుందని చెప్పారు. మహా ఉధృతంగా ప్రవహిస్తున్నాయవి. ఆ నదులే కేదారనాథ్ ను ముంచెత్తేశాయట. అతి శీతల వాతావరణం వల్ల ఈ ఆలయాన్ని సంవత్సరంలో ఆరునెలలు మాత్రమే తెరచి వుంచుతారు. మిగిలిన ఆరునెలలు కింద వున్న ఊఖీమఠ్ లో ఛడీ, చత్రీ, ఉత్సవవిగ్రహాలు పెట్టి పూజలు అక్కడ చేస్తారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు ఆలయం తెరచి కార్తీక శుద్ధ పాడ్యమి నాడు తిరిగి మూసివేస్తారు. అప్పుడు పెట్టిన అఖండ జ్యోతి ఈ ఆరునెలలూ వెలుగుతూనే  వుంటుందట. 
                       
ఇంతకీ ఎప్పుడూ చెప్పుకున్నట్లుగా మన ఆది శంకరాచార్యులు ఈ ప్రదేశం గురించి ఏమి చెప్పారో చెప్పుకోలేదు కదా. ఆ శ్లోకం ఇప్పుడు చూద్దాం. దాని అర్థమూ తెలుసుకుందాం.

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే || 

మహాగిరులైన హిమాలయాల్లో రమ్యమైన చోట సురులు, అసురులు, మునులు, యక్షులు, నాగులు పూజిస్తుండగా కొలువైవున్న ఆ కేదారనాథుడికి వందనం అని చెప్పాడు.

ఇక మా రెండోసారి యాత్ర గురించి చెప్తాను. ఈ యాత్ర ఈ మధ్యనే చేశాం. ఢిల్లీ నుంచి కార్ లో హరిద్వార్ చేరుకున్నాం. అక్కడ ముఖ్యమైన గంగా ఘాట్ ని హరికీ పౌరీ అంటారు. అక్కడ స్నానం చేశాం. గంగాజలాన్ని సేకరించాం. మా ఇంట్లో ఒక నాలుగయిదు అంగుళాలది నర్మదా బాణలింగం వున్నది. మా వారు రోజూ దానికి గంగా జలంతో, కొన్ని మామూలు నీళ్లు కూడా కలిపి అభిషేకం చేస్తారు. అందుకని ఎక్కడికి వెళ్లినా ఆ ప్రత్యేక జలాలను సేకరించి తెస్తూ ఉంటాం అభిషేకానికని. గంగాజలం సేకరించాక అక్కడ వున్న గుళ్లన్నీ చూసాం. కిందటి  సారి చూసినట్టు ఈసారి మానసాదేవి మందిరానికి వెళ్లలేక పోయాం. ఒక రోజంతా పడుతుందన్నారు. ఈ హరికీ పౌరీ వద్దే గంగా హారతి చేస్తారు రోజూ సాయంత్రం. ఒక పెద్ద శివ విగ్రహం కొత్తగా ఏర్పాటు చేశారు. చాలా బావుంది. మరునాడు పొద్దున్నే క్యాబ్ లో బయల్దేరి ముందు ధారీదేవి మందిరానికి వెళ్లాం. ఆ అమ్మవారినే చాలా కింద నుంచి డామ్ రిజర్వాయర్ లో మునిగిపోకుండా పైకి తెచ్చి వేరే ఆలయం కట్టి ప్రతిష్టించారు. ఆ అమ్మవారిని కదిపినందుకే 2013 లో అంత మహాప్రళయం వచ్చిందని చెప్పుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం చాలా డామ్ లు కట్టారు. ముఖ్యంగా ఈ ఆలయం దగ్గర రిజర్వాయర్ చాలా లోతుగా ఉంటుందిట. అందుకని ఆ అమ్మవారు మునిగిపోకుండా భైరవునితో పాటు పైకి తెచ్చి, అక్కడే ఆ నీటిలోనే ఒక మందిరం కట్టారు. మనలాంటి వాళ్ళు వెళ్ళటానికి ఒక బ్రిడ్జ్ వంటిది కట్టారు. ఈ ధారీ అమ్మవారు ఆ ప్రాంతపు గ్రామదేవత. పక్కనే భైరవుడు. చాలా శక్తిగా వుంది అమ్మవారు. చూడగానే ఆమె శక్తి స్పష్టంగా తెలిసింది. ఫోటో తీసుకోవచ్చా అంటే, పూజారి వద్దు, ఒకవేళ తీసుకున్నా అది వెనక్కు వచ్చేస్తుంది అన్నాడు. అర్థం కాలేదు. మళ్ళీ అడిగినా అదే చెప్పాడు. సరే, వద్దు అన్నాక ఫోటో తీయటం తప్పుకదా అని తీసుకోలేదు. ఆ అమ్మవారిని, 'అమ్మా, ఈ విధంగా కోపించకు, కరుణించు, అంతా నీ పిల్లలే కదా, శాంతించు' అని  ప్రార్ధించి బయటకు వచ్చాం. 



                                                                  ఇక్కడ ఎక్కడ చూసినా గంగా నదిపైన హాంగింగ్ బ్రిడ్జెస్ కనిపిచ్చాయి. లక్ష్మణ్ ఝూలా, రామ్ ఝూలా లాగా అన్నమాట. నది కాస్త సన్నగా వున్న చోట అక్కడి వూళ్లవాళ్లు అవసరానికి ఇలాంటి బ్రిడ్జెస్ కట్టేసుకున్నారు. చూడ్డానికి భలే బావున్నాయి. అక్కడి నుంచి గుప్త కాశీ వెళ్లాం. గుడిని చూసిన తరువాత తిరిగి హోటల్ కి వెళ్లి మరునాడు పొద్దున్నే హెలిపాడ్ కి వెళ్లాం. అక్కడ మాలాగానే చాలా మంది వున్నారు. ఒక చిన్న హోటల్ లాంటిది వుంది. అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేసాం. వేడి వేడిగా చేసి పెట్టాడు. అక్కడ ఒక మ్యాప్ చూసాను. ఆ మ్యాప్ లో పాతరూట్, కొత్తరూట్ రెండూ  చూపించారు. అప్పుడు మేము రాంబారా లో భోజనం చేసిన విషయం గుర్తు వచ్చి చాలా బాధ వేసింది. ఆ ప్రదేశాలేవీ ఇప్పుడు అస్సలు లేవుట. గంగలో శిథిలాల్లో కలిసిపోయాయట. పాపం వాళ్లంతా, ఏమైయ్యారో  కదా, జంతువులు కూడా మిగల్లేదట. అక్కడ చాలా హెలిప్యాడ్లు వున్నా, మాకు టికెట్ అన్నిటికన్నా దూరంగా వున్న గుప్తకాశీ నుంచి దొరికింది. దానివల్ల మాకు హెలికాఫ్టర్ రన్నింగ్ టైం, టికెట్ ఖరీదు రెండూ పెరిగాయి.



మా వంతు వచ్చేసరికి ఉదయం 9 అయ్యింది. 20 నిముషాల్లో కేదారనాథ్ చేరుకున్నాం. హెలిపాడ్ నుంచి గుడి 2, 3 కిలోమీటర్లు ఉంటుంది. అంతే. హాండ్ బాగ్స్ తప్ప వేరే లగేజ్ లేదు కదా. నెమ్మదిగా నడిచి ఆలయం చేరుకున్నాం. దారిలోనే బ్రహ్మాండమైన వేగంతో నదులు ప్రవహిస్తున్నాయి. అక్కడ నుంచి కూడా రెండు సీసాల్లో జలం తీసుకున్నాం. అక్కడే  మందాకినీ, సరస్వతీ మాతలకు మందిరం కూడా వుంది. అన్నీ కొత్త కట్టడాలే. చూద్దామన్నా మునుపటి వీధులు, హోటళ్లు, బజారు, షాపులు కనిపించలేదు. అయ్యో, అనుకుంటూ ముందుకెళ్లాం. ఆలయానికి ముందు అంతా పూర్తిగా రాళ్లు, సిమెంట్ తో చప్టా చేసేసారు. సుమారు యాభై మెట్లున్నాయి ఆలయం చేరడానికి. చిన్నఎత్తున్న మెట్లు. కష్టం అనిపించలేదు ఎక్కడానికి. అన్నట్టు హెలిపాడ్ నుంచి నడవలేని వారికి డోలీలు కూడా వున్నాయి. ఆ మెట్ల మీద ఒక పూజారి కనిపించి మాకు సంకల్పం చెప్పించి అభిషేకం చేయించి గుడిలో అన్నీ చూపించి బయటకు తెచ్చి, ఆ మహా జలప్రళయం ఆలయం మీదకు రాకుండా ఆపిన, ఆ భీమశిలను చూపించి వెళ్లిపోయాడు. తమాషాగా ఆ ప్రాంతమంతా చిన్న చిన్న రాళ్లు పేర్చి ఇళ్లు కట్టుకున్నారు భక్తులు. నేనూ కట్టాను. ఆ రాయికి పూజలు చేస్తున్నారు. కుంకాలు, సిందూరాలు పూశారు. మనం అందరం గుడినీ, దేవుడినీ  కాపాడమని ఆశ్రయిస్తుంటే, ఆ రాయి ఆ గుడినీ, దేవుడినే కాపాడింది. గుడి కన్నా పెద్ద వెడల్పుతో సుమారు పన్నెండు అడుగులు ఎత్తు, ఆరడుగుల అడ్డం, నలభై, యాభై  అడుగుల పొడవుతో వున్న ఏకశిల అది. వరద గుడి మీదకు వెళ్లకుండా ఇరువైపులకూ మళ్లించి, గుడిని కాపాడింది అదే. అంత నీటి ఉధృతాన్నీ తానే భరించి, తన ఇరుపక్కలనుంచి నీరు వెళ్లిపోయేలా చేసింది. "రాయి నైనా కాకపోతిని....", అనే పాట గుర్తుకొచ్చింది. శివుడలా ఆజ్ఞ ఇచ్చాడేమో దానికి. ఆ రాయికి మేమూ దణ్ణం పెట్టుకున్నాం. 2013 జూన్ 17 రాత్రి సుమారు ఏడున్నరకు, గుడి దగ్గర వున్న ఉష్ణకుండంలో వున్నట్లుండి పెద్ద శబ్దంతో ఒక పిడుగు వంటిది పేలి, ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా క్షణాల్లో నీరు ముంచెత్తిందిట. ఇక అంతే, ఈశ్వరేచ్ఛ. ప్రకృతికి కోపం వస్తే, సైంటిస్ట్ కూడా ఏమీ చేయలేడు. ఆలయంలో  మిగిలిన ఆ కేదారేశ్వరునికే తెలుసు ఏమి జరిగిందో.  

నాకు ఏ యాత్రకు వెళ్లినా అక్కడినుంచి రాళ్లు తెచ్చుకుని పెట్టుకోవటం, కొన్నాళ్ళయ్యాక వాటిని మొక్కల తొట్లల్లో వేయడం అలవాటు. అలాగే ఇక్కడి నుంచి కూడా ఒక రాయిని తీసుకువెళదామంటే, ఎక్కడా సిమెంట్ తప్ప రాళ్లు లేవు. అప్పుడు అక్కడ ఒక ఎంక్లోజర్ లో కొందరు కూలివాళ్ళు రాళ్లు పగలకొడుతుంటే చూసి ఒక చిన్నరాయి గుర్తుగా ఇమ్మని అడిగా. ఒక పిల్లవాడు ఒక రాయి తెచ్చి ఇచ్చాడు. అదే సమయంలో ఇంకో చిన్న రాయి, గుప్పిట్లో పట్టేంత చిన్నది ఎగిరి వచ్చి, నా ముందు పడింది.  చూద్దునుకదా, ఆ రాయి ఆకారం  అచ్చం గుడిలోని కేదారనాథుడి లాగా, మూపురం లాగానే వుంది. ఆయనే స్వయంగా ఇచ్చినట్లు అనిపించింది. మహాప్రసాదం అనుకుంటూ ఆ రాళ్లు తెచ్చుకున్నా. ఆ చిన్న శిలారూప కేదారేశ్వరుడేమో మా పూజా మందిరంలో చేరితే, ఆ రెండో రాయి మా బ్రహ్మకమలం మొక్కల తొట్లలో చేరింది. దేవుడే మాతో వచ్చినట్లనిపించింది. ధన్యోస్మి అనుకున్నా.

అక్కడ భిక్షుకులు, సన్యాసులు అందరూ క్రమశిక్షణతో లైన్ లో కూర్చుని, తమ భిక్షాపాత్ర ముందు పెట్టుకు కూర్చున్నారు. ఎవరూ ఏమీ అడగలేదు. వారికి వీలైనంత దానం చేసి, టీ తాగి తిరిగి బయల్దేరాం. మళ్ళీ హెలికాఫ్టర్ దొరికేసరికి కొంచం టైం పట్టింది. ఈ లోపల సన్నగా వాన జల్లులు మొదలైయ్యాయి. కాస్సేపు భయం వేసింది, వాతావరణం పాడైతే హెలికాఫ్టర్లు రావేమోనని. కానీ ఆ జల్లుల్లోనే హెలికాఫ్టర్ వచ్చి మమ్మల్ని ఎక్కించుకుని గుప్తకాశీకి తీసుకువచ్చింది. ఆ రోజు గుప్తకాశీ లోనే పడుకుని మరునాడు ఊఖీమఠ్ వెళ్ళాం.


         

ఈ ఊఖీమఠ్ లోనే కేదారేశ్వరుడికి చలికాలం ఆరు నెలలూ పూజలు జరుగుతాయి. కేదారనాథ్ జలప్రళయం అప్పుడు కూడా ప్రధాన పూజారి వెంటనే ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడకు తెచ్చేసాడు. కేదారనాథుణ్ణి కూర్చోపెట్టే సింహాసనం కూడా చూసాం. ఈ వూరు అసలు పేరు ఉషామఠంట. పేరు మారి మారి ప్రస్తుతం ఊఖీమఠ్ అయింది. ఇక్కడే ఉషాదేవికీ అనిరుద్ధుడికీ వివాహం జరిగిందట. కానీ నేను ఇదే కధ అస్సాం లోనూ విన్నాను. ఈ గుడి గోపుర ప్రాకారాలపై అగస్త్యుడు కూడా వున్నాడు. ఈ ప్రాంగణంలోనే పంచ కేదారనాథుల లింగాలు వున్నాయి. చలికాలంలో పంచకేదారాల నుంచీ ఆ ఉత్సవ విగ్రహాలూ, ఛడీ, చత్రీలు ఇక్కడికి చేరతాయి. పంచ కేదారాలూ తిరగలేని వారు ఇక్కడకు వచ్చి వీటిని దర్శించుకుంటారుట. అక్కడినుంచి దిగి ఘాట్ దారిలో జోషీమఠ్ కి వచ్చాం. ఆ మధ్య దారిలో ఒక పసుపు పచ్చని చాలా పొడవైన పాము చనిపోయి, ఒక నీటిగుంటలో పడి వుంది. సుమారు 10 అడుగులు వుంది అది. అప్పుడనిపించింది ఈ కొండల్లో ఎంత విషపూరితమైన భయంకరమైన పాములున్నాయోగదా అని. ఒక్కసారి ఒళ్ళు ఝల్లుమంది. నేనప్పటిదాకా అంత పచ్చని పసుపురంగు పామును చూడలేదు. కుక్కె వెళ్లే దారిలో ఒకసారి తెల్లని పొడవైన పామును చూసాను. కానీ అది బతికుంది, ఇది చనిపోయింది. అంతే తేడా.
 
జోషీమఠ్ లో చూడాల్సినవి చాలా వున్నాయి. శంకరాచార్య మఠం, ఉత్తరామ్నాయ పీఠం. తరువాత భవిష్య కేదారనాథ్ మందిరం, ఆ తరువాత బదరీనాథుడు చలికాలం ఆరునెలలు బస చేసే శ్రీ లక్ష్మీనృసింహ మందిరం. చలికాలం ఆరునెలలు బదరీనాథ్ ఆలయం కూడా మూసివేస్తారు. ఆ ఆరునెలలూ ఆ దేవుడి ఉత్సవ విగ్రహాలు, ఛడీ, ఛతరీ ఈ లక్ష్మీనృసింహస్వామి మందిరానికే తెచ్చి పూజిస్తారు. ఆ గుడిలో దేవుడు వాసుదేవుడని, కాలక్రమేణా ఆ మందిరం నశించిపోయి ఈ లక్ష్మీనృసింహ మందిరం వచ్చిందనీ అంటారు. ఈ మందిరం నుంచి శంకరాచార్య మఠానికి వచ్చాం. కిందనే మాకు భవిష్య కేదార్ మందిరం కనిపించింది. భవిష్యత్తులో అసలు కేదారనాథ మందిరానికి మంచు వల్ల వెళ్లలేనప్పుడు ఇక్కడకు ఆ కేదారనాథ ఆలయం తరలిస్తారని ఒక విశ్వాసం. అచ్చం కేదార లింగం లాగానే రెండు లింగాలు పెద్దపెద్దవి పక్కపక్కనే వున్నాయి. నంది కూడా వుంది. కానీ ఆ గది చాలా చిన్నది. అంత పెద్ద ఆలయం ఇక్కడకు ఎలా మారుతుందో అర్థం కాలేదు. మొత్తానికి ఈ ఊరితో బదరీనాథునికి, కేదారనాథునికీ కూడా సంబంధం వుంది.

ఈ భవిష్య కేదార్ మందిరం వున్న ప్రదేశం నుంచి కొంచెం పైకెక్కితే, శ్రీ శంకరాచార్య మఠం వుంది. కొంచం పైకే ఎక్కాలి. మరో దారి లేదు. మధ్యలో సన్నని మెట్లు కూడా వున్నాయి. అక్కడ ఎక్కాక ఒక కల్ప వృక్షము, అమ్మవారి గుడి, దాని పక్కనే ఒక గది వున్నాయి. ఆ గదిని పరిశీలిస్తే అది ఒక కొండలో తొలిచిన గుహ. ఆది శంకరాచార్యులవారు ఆ గుహలోనే తపస్సు చేసుకున్నారట. అప్పుడు ఆయన చేసే ఓంకార నాదానికి ఆ గుహ పైనున్న కొండపై 'ॐ' అని ఆకారం ఏర్పడిందిట. వారి శిష్యుడు మాకు ఆ ఆకారాన్ని గుహపై చూపించాడు కూడా. ఆ తపస్సులో వున్నప్పుడు ఆయనలో జ్యోతి వెలిగిందట. అందుకే అక్కడ ఒక మఠం స్థాపించి దానికి జ్యోతిర్మఠం అని పేరు పెట్టారు. అదే ఆయన స్థాపించిన మొట్టమొదటి మఠం. కాలక్రమేణా ఆ పేరు కాస్తా జోషీమఠ్ గా మారింది. పక్కనే వున్న కల్పవృక్షం  5000 ఏళ్ళకన్నా పురాతనమైనది అని పరీక్షల్లో తేలింది. ఆ రావి చెట్టునే కల్పవృక్షం అంటారు. దాని  కింద కూర్చుని ధ్యానం చేసుకుని కోరిక కోరుకుంటే తీరుతుందని నమ్మకం. ఆది శంకరాచార్యుల వారికి అక్కడే అమ్మవారు ప్రత్యక్షం అయి బదరీనాథుడు అలకనందా నదిలో మునిగి వున్నాడని, ఆ విగ్రహాలు తీసి ఆ ఆలయాన్ని పునరుద్ధరించమని చెప్పిందట. ఆ శక్తి కూడా తానే ఆయనకు ఇస్తానని, ఆ గుడిలో తిరిగి పూజలు ప్రారంభించమని అమ్మవారు చెప్పాక, శంకరులవారు ఆ బృహత్కార్యం చేపట్టారు.

మానససరోవరంలో స్నానం చేస్తున్నప్పుడు ఆది శంకరాచార్యుల వారికి  నాలుగు స్ఫటిక లింగాలు దొరికాయి. ఆ నాలుగు లింగాలనూ తన నాలుగు పీఠాలలో స్థాపించి తన నలుగురు ప్రధమ శిష్యులనూ, ఆయా మఠాలకు పీఠాధిపతులను చేసాడు. ఉత్తరామ్నాయ పీఠమైన, జ్యోతిర్మఠానికి మొదటి పీఠాధిపతి తోటకాచార్యులు. మేము వెళ్ళినప్పుడు ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మఠంలో లేరు. యాత్రలో వున్నారు. వారి శిష్యులు ఆది శంకరాచార్యులవారు ప్రతిష్టించి పూజించిన స్ఫటిక లింగాన్ని చూపించారు. కటిక చీకటి గుహలో కూడా దీపం దాని వెనుక పెట్టంగానే, ఆ లింగం జ్యోతిర్లింగమై ధగధగా వెలిగిపోయింది. అద్భుతం, పరమాద్భుతం. కన్నీళ్లతో నమస్కరించుకున్నాం. శరీరం అంతా రోమాంచితమైంది. మాక్కూడా లోపలి జ్యోతి వెలిగినట్లైంది. ఓం నమః శివాయ. ఇంకే కోరికా లేదనిపించింది. బరువెక్కిన అనాలో, తేలికైన అనాలో, తెలియని ఒక ట్రాన్స్ లో బయటకు, కిందకు వచ్చాను. కిందనుంచి పైకి చూస్తే  ఆ గుహ, ఆ చెట్టు కనిపిస్తూనే వున్నాయి.


అక్కడినుంచి ఋషీకేశ్ వచ్చాం. ఈ మొత్తం దారిలో మాకు ఆరు ప్రయాగలు కనపడ్డాయి. అవి విష్ణు, దేవ, నంద, కర్ణ, రుద్ర, సోన్ ప్రయాగలు. అన్నీ పైనుంచే చూసాం కిందకు దిగే ఓపిక లేక. రుషికేశ్ లో చూడాల్సిన ముఖ్యమైనవి కిందటి యాత్రలో చూసేసాం. ఆ జలప్రళయంలో ఒక పెద్ద శివవిగ్రహం కొట్టుకుపోయిందన్నారు కదా అని మా డ్రైవర్ ని అడిగితే  తనకు తెలియదన్నాడు.  లోకల్స్ ని అడిగినా, ఒక్కోరూ ఒక్కోలా చెప్పారు. రామ్ ఝూలా దగ్గర ఆ విగ్రహం ఉందిట. కొట్టుకుపోయిందని కొందరు, పాడైతే బాగు చేయించారని కొందరు, మరేదో చిన్న శివ విగ్రహాన్ని పెట్టారని మరి కొందరూ చెప్పారు. శివానంద ఆశ్రమానికి వెళ్లి కాసేపు కూర్చున్నాం. అక్కడ అందరూ ధ్యానం చేసుకుంటున్నారు. నేనూ కాసేపు ధ్యానం చేసుకుని ఆ తపోభూమి నుంచి బయటకు వచ్చాను. అక్కడినుంచి హరిద్వార్ కి, హరిద్వార్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాదు కి వచ్చాం. బదరి వివరాలు ఇక్కడ చెప్పలేదు. అవి వేరేగా విష్ణు క్షేత్రాలు చెప్పేటప్పుడు రాస్తాను. మొత్తం వారం రోజుల పర్యటన.  అన్నీ సంతృప్తిగా  చూసి ఇల్లు చేరాం. ఇదీ కేదారనాథ్ జ్యోతిర్లింగ యాత్ర కథ.

ఓం నమః శివాయ, ఓం శ్రీ  ధారీదేవ్యైనమః, ఓం శ్రీ గంగాయై నమః 
ఓం శ్రీ ఆది శంకరాచార్యాయైనమః 

ఇక ఈ యాత్ర తరువాత మిగిలిన ఆఖరి జ్యోతిర్లింగం ఘృష్ణేశంచ శివాలయే అనుకుంటూ మహారాష్ట్రలో ఎల్లోరా గుహల దగ్గర వున్న ఘృష్ణేశ్వర్ చూసి వద్దామా. 




భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650



























కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం