శ్రీకాళహస్తి-గుడిమల్లం
శ్రీకాళహస్తి - గుడిమల్లం ఇప్పటివరకూ నాలుగు పంచ భూత ఆలయాల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ మిగిలిన అయిదో పంచభూత క్షేత్రమైన శ్రీకాళహస్తి లోని వాయులింగాన్ని దర్శిద్దాం రండి. మేము ఈ ఆలయాన్ని కనీసం పది, పదిహేను సార్లైనా చూసి ఉంటాం. మేము తిరుపతికి వెళ్లిన ప్రతిసారీ కాకపోయినా కొన్నిసార్లైనా ఇక్కడికి వెళ్తూ ఉంటాం. ఇక్కడ వాయుదేవుడు కర్పూరంతో శివలింగాన్ని తయారుచేసి ఆ కర్పూర లింగానికి ఎంతో శ్రద్ధతో పూజలు చేసాడట. వాయుదేవుడి భక్తికి మెచ్చిన శివుడు ఆ ప్రాంతం లోనే వాయుదేవుడితో సహా లింగరూపంలో కొలువుంటానని వరం ఇచ్చాడట. ఇక్కడ వాయువు ఉన్నదనటానికి సాక్ష్యంగా, ఈ శివుడు ఊపిరి పీలుస్తుండటం నిదర్శనంగా చెపుతారు. ఈ ఆలయంలో పైకప్పు నుంచి వేళ్ళాడుతున్న రెండు అఖండ దీపాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. అందులో ఎడమవైపు పెట్టిన దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. అదే సమయంలో కుడివైపున పెట్టిన దీపం స్థిరంగా నిల్చి వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ శివుడికి వాయువుతో వున్న అనుబంధానికి ఇదే నిదర్శనం. ఇదే విధంగా శ్వాసించే నారసింహమూర్తి నల్గొండ జిల్లా వాడపల్లిలో ఉంది. ఆ విశేషాలు వైష్ణవ క్షేత్రాలలో చెప్పుకుందాం....