శ్రీశైలే మల్లికార్జునమ్
2. శ్రీశైలే మల్లికార్జునమ్......
ఇప్పుడు ఆ శ్లోకంలోని రెండో క్షేత్రాన్ని చూద్దాం. అదే శ్రీశైలంలోని మల్లికార్జునుడు. ఈ క్షేత్రం మన తెలుగు రాష్ట్రాలలోనే వుంది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతంలో వుంది. చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశం అది. స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ పుష్కలం. మనసుకు ప్రశాంతతని ఇచ్చే క్షేత్రం. ఆది శంకరులు ఈ క్షేత్రం గురించి ఈ విధంగా చెప్పారు.
శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రి శృంగేఽపి సదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ||
ఈ శ్లోకార్ధం ఏమిటంటే, శ్రీశైలమనే శిఖరం మీద వివిధ దేవీ దేవతలతో కలిసి ఉంటూ, ఆ కొండ ప్రాంతానికంతా నిత్య వసంతాన్ని కలగచేస్తూ, మల్లిక, అర్జున వృక్షాలతో నిండి వుండి భక్తజనులకు
ఈ సంసారసాగరాన్ని దాటడానికి ఒక వారధి వలే వున్న శ్రీ మల్లికార్జునునకు నమస్కారం అని. అంటే శ్రీశైలము అనే ఆ కొండకొమ్ము అంతా నిత్యవసంతాన్ని తలపిస్తూ అంతా మల్లె, మద్ది చెట్లతో నిండి ఉందని శంకరులు గుర్తుగా చెప్పారు. ఈ కొండకే శ్రీగిరి అనే పేరు కూడా వుంది. సంస్కృతంలో గిరి అన్నా, శైలం అన్నా కొండ అని అర్థం. కొండపై వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. అన్ని సౌకర్యాలూ వున్నాయి. గదులూ, భోజన వసతులూ బావున్నాయి. ఇక్కడి హోటళ్ళని మఠాలంటారు. వాళ్ళే తమ దగ్గర బస చేసిన యాత్రికులకు ఉచిత భోజనం మూడు వేళలా ఇస్తున్నారు. ఆ పక్కనే చక్కటి షాపింగ్ వీధి వుంది. గుడికి, పూజకి సంబంధించి ఏమి కావాలన్నా అక్కడ కొనుక్కోవచ్చు. ఇది అంతా అడవి కనుక మంచి అరుదైన ఔషధ మొక్కలూ, మూలికలూ దొరుకుతాయి. అడవి కనుక రాత్రివేళల్లో జంతువుల భయంతో ఘాట్ దారి మూసేస్తారు. ఘాట్ దారికి వేరే టోల్ టాక్స్ కూడా ఉంటుంది.
ఇక్కడ గర్భగుడిలో వున్న లింగం స్పర్శలింగం. ఎవరైనా తాకొచ్చు. కానీ ఈ మధ్య పెరిగిపోయిన రద్దీ దృష్ట్యా కొన్నినిర్ణీత సమయాల్లో మాత్రమే లింగం వరకు భక్తులను వెళ్ళనిస్తున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత వుంది. అదేమిటంటే, భక్తులు ధూళి దర్శనం చెయ్యచ్చు (చెయ్యాలి). ధూళి దర్శనం అంటే శ్రీశైలం చేరిన తరువాత కాళ్ళైనా కడుక్కోకుండా, పరుగెత్తుకెళ్లి, ఆ దేవుని దర్శనం చెయ్యచ్చు. ఆ శివుడు, తన కోసం వచ్చిన వారిని వారి ఆతృతను గమనించి వెనువెంటనే దర్శనానికి రావడానికి అనుమతిస్తాడట. ఇక్కడ ఒక బావిలో వున్న జలం సరస్వతి నదీ జలం అని ఒక నమ్మిక. ఇక్కడ బసవన్న కూడా చాలా పెద్దది. నిరంతరం గుడిలో శివనామజపం, ఢమరు, మద్దెల, రుంజ, తప్పెట్లు, తాళాలు, శంఖం, ఇత్యాది వాయిద్యాలతో శివభక్తులు భజన చేస్తూనే వుంటారు. ఒక్క క్షణం వీళ్ళే ప్రమథగణాలా అని అనిపిస్తుంది. ఆ ప్రాంతమంతా ఎల్లవేళలా ఒక దైవీభావన మన చుట్టూ అలుముకుని ఉన్నట్టు అనిపించేది.

కేవలం మూడు ప్రాంతాల్లోనే జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ ఒక్క చోటే కొలువై వున్నాయి. ఒకటి ఈ శ్రీశైల క్షేత్రమైతే, రెండోది ఉజ్జయిని, మూడోది వారణాసి. శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబాదేవి. ఈ దేవత గురించి ఇప్పుడు కేవలం తలచుకుంటున్నాను, అంతే. ఆ తల్లి గురించిన ఇతర విశేషాలన్నీ అష్టాదశ శక్తిపీఠాల గురించి వ్రాసినప్పుడు తలచుకుందాం. ప్రస్తుతం భ్రమరాంబాదేవి గురించి మాత్రం వదిలేసి మిగిలిన దేవీ దేవతల గురించి చెప్తాను. ఇక్కడ ముఖ్య దేవతల్లో సాక్షి గణపతి మొదటివాడు. శ్రీశైలంకు వచ్చిన వారు ముందుగా ఈ సాక్షి గణపతిని దర్శించి "స్వామీ, మేము వచ్చాము" అని హాజరు వేయించుకోవటం ఒక ఆచారం. తరువాత మల్లికార్జునుడు, వృద్ధమల్లికార్జునుడు, కుమారస్వామి, వీరభద్రుడు, దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటాం.
ప్రతిరోజూ ఉదయమే సుప్రభాత సేవతో కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ సుప్రభాత సేవకు ఒక మంచి ఆరోగ్యంగా, బలంగా వున్న వృషభం, గోవు, వత్స మూడింటినీ తీసుకు వస్తారు. చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు. వాటితో పాటు పల్లకి, ఛత్ర చామరాదులతో స్వామి, అమ్మవార్ల శయన మంటపానికి వెళ్లి అక్కడినుంచి ఆ ఉత్సవమూర్తులను తిరిగి ప్రధానాలయానికి తెచ్చి నిత్యపూజలు ప్రారంభిస్తారు. అప్పటినుంచీ సేవలు మొదలు. అభిషేకాలూ, అలంకరణలూ, ఆరగింపులూ, పుష్పార్చనలు, కళ్యాణాలూ మొదలైన ఎన్నో సేవలు చేస్తారు. అభిషేకాలు వేరే అభిషేక మంటపంలో, కల్యాణాలు వేరే కళ్యాణ మంటపంలో చేస్తారు. ఇక్కడ జరిపే కళ్యాణం చాలా బాగా చేస్తారు. మేము ఎన్నో చోట్ల సుప్రభాతం, కళ్యాణం చేయించాం కానీ ఈ శ్రీశైలంలో ఆ సేవల అనుభూతి వేరుగా, ఏదో మరో ప్రపంచంలో జరిగే, జరిపే ఒక అద్భుతమైన సేవలాగా అనిపించింది. స్వయంగా ఆ దేవీ దేవతలే వచ్చి కళ్యాణం చేసుకుంటున్నారా అనిపించింది. కళ్యాణం చేసిన రెండుసార్లూ అదే భావన. సుప్రభాత సేవ అయితే, మనమే వెళ్లి తీసుకురావటం వల్లనో ఏమో, " మేలుకోవయ్యా, తూరుపు తెల్లవారే, మేలుకో, స్వామీ మేలుకో, సుప్రభాతం, స్వామీ సుప్రభాతం" అని పిలిచి ఆ ఆదిదంపతులిద్దరినీ లేపి తీసుకువస్తున్న భావన కలిగింది. ఇంతగా స్పందించటం ఈ ఆలయంలోనే జరిగింది.

స్థల పురాణం చెప్పాలంటే, శివుడు ఇక్కడ ఒక తెల్లమద్దిచెట్టు, (దీన్నే సంస్కృతంలో అర్జున వృక్షం అంటారు) రూపంలో ఉద్భవించాడని అంటారు. ఆ మద్ది చెట్టుకి, ఒక మల్లెతీగ చుట్టూ, చిక్కగా అల్లుకుంది. ఆ మల్లె తీగే పార్వతీ దేవి. అందుకే ఇక్కడి శివుడికి మల్లికార్జునుడు అనిపేరు. ఇప్పటికీ అక్కడ తెల్లమద్దిచెట్లు, వాటి మొదట్లో మల్లె తీగలూ చాలానే కనిపిస్తాయి. భక్తులు వాటినే, శివ, శక్తి స్వరూపాలుగా భావించి ప్రదక్షిణలు కూడా చేస్తారు. శివుడు మద్దిచెట్టు రూపంలోనూ, అమ్మవారు మల్లెతీగ రూపంలోనూ అవతరించారని అందరి విశ్వాసం. అన్నదమ్ముల మధ్య ఏర్పడిన తగాదాలో అలిగి ఇక్కడకు చేరిన పుత్రుడు కుమారస్వామిని బుజ్జగించడానికి వచ్చిన శివ పార్వతులు, కుమారుని కోరిక మేరకు ఇక్కడే వెలిశారని స్థలపురాణం. ఇక్కడ కల్యాణాలు చేస్తే శుభాలు జరుగుతాయని, భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు రాకుండా ఉంటాయనీ, వచ్చినా తీరిపోతాయని, సంతానం కావాలని కోరిన వారికి సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. ఈ ఫలితాన్ని మేము ప్రత్యక్షంగా చూసాం. రాత్రివేళ ఆ కళ్యాణం చేసుకున్న వారు తరువాత స్వామివారినీ, అమ్మవారినీ దర్శించుకుని, అక్కడి తోటలో పచ్చని మొక్కల మధ్య కూర్చుని, వారిచ్చిన ప్రసాదాలు తీరిగ్గా తింటూ ఉంటే..... ఇక ఈ జన్మకిది చాలు అనిపిస్తుంది. అక్కడ శివం మనల్ని పరం వైపుకు లాగుతూ ఉంటే, ఇక్కడ భవం మనల్ని ఇహం వైపుకు గుంజుతూ ఉంటుంది. మధ్యలో ఈ జీవుడు అటా, ఇటా అని కొట్టుమిట్టాడుతూంటాడు. శివుడూ, భవుడూ రెండూ ఆయనే కనుక ఎటు వెళ్లినా ఆయన దగ్గరకే కదా.
ఇక దేవాలయనిర్మాణం సంగతికి వస్తే, పెద్ద పెద్ద ప్రాంగణాలూ, అద్భుతమైన శిల్పాలూ, బంగరు పూతల శిఖరాలూ, ఎత్తైన గోపురాలూ, వాటిపై ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్న కలశాలూ, నాలుగు వైపులనుంచీ ద్వారాలూ, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతో చేసిన స్తంభాలూ, వాటి నిండా అందంగా చెక్కిన శిల్పాలూ, ఎటు చూసినా శివమయం. ఆస్తికులైనా, నాస్తికులైనా తప్పనిసరిగా చూడదగ్గ ప్రదేశం. ఏదైనా ప్రదేశాన్ని కానీ, వస్తువును కానీ, కళ్లతో పాటు, మనసుతో కూడా చూడగలిగితే, ఆ ఆనందానుభూతే వేరు. ముఖ్యంగా ఈ శ్రీశైలంలో శిఖరాన్ని చూస్తే పునర్జన్మ రాదనేది ఒక విశ్వాసం. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" అని నానుడి. శ్రీశైలం వెళ్లే దారిలో శిఖరేశ్వరం అనే చోట ఒక చిన్నకొండ పై నుంచి ఈ శ్రీశైల ఆలయ గోపుర శిఖరం చూడాలి అంటారు. అక్కడ పూర్వం ఒక రాతిలో రోలు వలే గుంత చేసి, అందులో ఒక చిన్ననంది ప్రతిమను ఉంచి దానికి రాపిడి ఏర్పడకుండా ఓ గుప్పెడు నువ్వులు వేసి నూరుతూ, దాని దిశను మారుస్తూ నంది కొమ్ముల మధ్యలో నుంచి దూరంగా కనిపిస్తున్న శ్రీశైల గోపుర శిఖరం చూసేవాళ్ళం. బైనాక్యులర్స్ లోనో, టెలిస్కోప్ లోనో మనక్కావల్సిన బొమ్మ స్పష్టంగా కనపడేదాకా తిప్పుతూ ఉంటామే, అలా అన్నమాట. ప్రస్తుతం ఆ నంది భిన్నమై పోయిందట. అప్పుడు మరో నంది ప్రతిమను తెచ్చి వాళ్ళే కావాల్సిన డైరెక్షన్ లో అమర్చి పర్మనంట్ గా ఫిక్స్ చేసేసారు. పాతదేదీ అని అడిగితే, కింద ఇతర రాళ్ళ మధ్యలో చూపించారు. దిగి, దాన్ని తాకి కాసేపు బాధపడ్డా, మళ్ళీ పాత ఏర్పాటు లాంటిది చెయ్యచ్చు గదా అని అనిపించింది. శిఖరేశ్వరం ఆలయంలో గోడమీద ఒక శ్లోకం కనిపించింది. ఆ శ్లోకం ఇది. ఇది మనుస్మృతి లోని శ్లోకం. ఈరోజుల్లో ఎంతమంది అర్చకులకు ఈ లక్షణాలు ఉన్నాయీ, అనిపించింది.
ఇంకొంచం ముందుకు వెళితే, రోడ్డుకు హఠకేశ్వరం ఒకవైపు, పాలధార, పంచధార రెండో వైపు కనిపిస్తాయి. పాలధార, పంచధార చూడాలంటే, చాలా........ మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. అక్కడ పాలవలె స్వఛ్ఛమైన తెల్లని నురుగుతో కూడిన నీరు, పంచ అంటే, ఐదు ధారలుగా కొండల పైనుంచి జలపాతం వలె దూకుతూ కనపడుతుంది. అక్కడే ఒక మూల ఆది శంకరులు తపస్సు చేసుకున్న గుర్తులుగా ఆయన పాదాలు, శివలింగం కనిపిస్తాయి. ఆ శివలింగానికి ఈ ధారలతో నిత్యాభిషేకం . హాఠకేశ్వరంలో శివాలయం, దానికెదురుగా సంతానఫల వృక్షం ఉంటాయి. పిల్లలు లేరని బెంగ పడేవారు అక్కడ పూజ చేయించి రవికలబట్టలో పసుపు, కుంకుమ, అక్షతలు, కొబ్బరికాయ వేసి మూట కట్టి, ఆ ముడుపుని ఆ చెట్టుకు కడతారు. వారికి తప్పక సంతానం కలుగుతుందని ఒక నమ్మిక. ఇది కూడా సత్యమని నాకు ప్రత్యక్ష నిదర్శనం కనిపించింది. అసలు పిల్లలే పుట్టారనుకున్న వారికి కూడా, వారి తరఫున వేరేవారు ప్రార్ధించినా కూడా సంతానం కలిగింది. అందుకే నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోయేరు, అంటారు.
ఇక్కడ ప్రవహించే కృష్ణమ్మను, పాతాళగంగ అంటారు. చాలా కిందకు దిగాలి. సులభంగా వెళ్ళడానికి ఈమధ్య కాలంలో రోప్ వే కూడా వేశారు. కిందకు నీటివరకూ దిగాక బోటులో వెళ్లి అక్కమహాదేవి గుహలు చూసుకోవచ్చు. మాకు కుదరక మేము వెళ్ళలేదు. ఈ అక్కమహాదేవి విగ్రహం మనకు గర్భాలయంలో కూడా కనిపిస్తుంది. ఆమె శివునకు గొప్ప భక్తురాలు, తపస్వి. ఈ ఆలయంలో వున్న ఉపాలయాల్లో అర్థనారీశ్వరమూర్తి, సహస్రలింగం, సోమస్కంధమూర్తి కూడా కనిపిస్తాయి. సోమస్కంధమూర్తి అంటే, స, ఉమ, స్కంధ, మూర్తి అని అర్థం. అంటే ఉమతో, స్కంధునితో కూడిన శివుడు అని. అసలు శివపార్వతులు ఇక్కడకు రావడానికి స్కంధుడే కదా కారణం. ఈ ఆలయ చరిత్రలో ఇక్కడ దేవుణ్ణి, కృతయుగంలో హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపరంలో పాండవులు అర్చించారని వుంది. ఈ ఆలయం గురించిన అన్ని వివరాలూ ఈ లింక్ లో పొందవచ్చు. http://www.srisailamonline.com
శ్రీశైలానికి రావాలంటే, నాలుగు దిక్కులా నుంచి నాలుగు మార్గాలున్నాయి. అవి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధవటం, పడమట అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం. ఈ నాలుగూ శ్రీశైలానికి ప్రధానమైన ముఖద్వారాలు. మేము ఒక్కోసారి ఒక్కోవైపు నుంచి వెళుతూ మేము ఈ నాలుగు దేవాలయాలూ కూడా చూసేసాము. ఈ నాలుగు క్షేత్రాల గురించీ మరో శీర్షికలో వివరంగా రాస్తాను. ఈ నాలుగు కూడా చాలా చక్కటి, చిక్కటి అటవీ ప్రాంతంలో, జలపాతాల మధ్య వుండే ప్రదేశాలు. తపస్సు చేసుకోవటానికి హిమాలయాలు అక్కరలేదు. ఇవి కూడా అందుకు అనువైన ప్రదేశాలే.
ఇక్కడ అడవుల్లో వున్న ఇష్టకామేశ్వరి మరొక మహిమ గల దేవత. ఆ ఆలయానికి అటవీశాఖ అధికారుల అనుమతి లేనిదే వెళ్లలేము. ఒక్కోసారి తొమ్మిది, పదిమందిని గ్రూపులుగా చేసి ఒక జీపులో పంపిస్తుంటారు. అయినప్పటికీ కూడా వెళ్లే వారి అందరి వివరాలూ, ఆధార్ కార్డు నంబర్లతో సహా నమోదు చేసుకుని, ఆతరువాత, గ్రూప్ కి అంతా ఒక ఫోటో తీసుకుని కానీ పంపించరు. ఆ అడవిదారుల్లో జీపులు నడపడానికి బాగా ప్రావీణ్యం, అనుభవం వున్న డ్రైవర్లు వుంటారు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ప్రమాదమే. మనిషికి వెయ్యి రూపాయలు తీసుకున్నారు. ముందర, అమ్మో, అంతా, అనుకున్నా, వాళ్ళు శ్రీశైలం బస్ స్టాండుకి తిరిగి తీసుకువచ్చేసరికి, అప్పటిదాకా ఎక్కడో వున్న ప్రాణాలు తిరిగి శరీరంలోకి వచ్చి చేరాయి. అసలు చాలామంది మమ్మల్ని ముందే వెళ్ళొద్దని భయపెట్టారు, మీరు ఆ కొండ, అడవి దారిలో వెళ్ళలేరు, వద్దు అని. మేమే సాహసించాము. ఎందుకంటే, మాకు ఇటువంటి ప్రయాణాలు, ముఖ్యంగా బాంధవ్ ఘర్ టైగర్ సఫారీకి వెళ్లిన అనుభవం వుంది. ఇద్దరం ఏమీ ఫరవాలేదు, వెళదాము, అనుకున్నాము. ఇల్లాంటి సాహసాలేమైనా చెయ్యాలంటే, మా వారు ఫస్ట్, ఇంతదాకా వచ్చి, ఇది చెయ్యకపోతే ఎలా అని, చాలాసార్లే సాహసాలు చేయించారు మరి. నాకే భయం వేసి మా క్యాబ్ డ్రైవర్ ని మాతో కూడా రమ్మన్నాను. అతడు ఈ ప్రయాణం ఎక్స్పెన్సివ్ అని, ఆ ప్రాంతానికి చెందిన వాడే అయినా ఎప్పుడూ వెళ్ళలేదుట. ఇష్టంగా వచ్చాడు. ఈ ప్రయాణం ఒక మూడు, నాలుగు గంటలు పడుతుంది రానూ పోనూ. అసలక్కడ రోడ్డే ఉండదు. ఆ రాళ్ళ దోవలో అనుభవం వున్నవారే దారిని గుర్తించగలరు. రాళ్లు అంటే మామూలు రాళ్లు అనుకునేరు. పెద్దపెద్ద రోళ్లంత సైజులో వుండే నున్నటి గుండ్రాళ్ళు. మనల్ని ఎక్కడా జీప్ దిగనివ్వరు. జంతువుల భయం మరి. అలా ఈ జీపు మనతో సహా ఆ గుండ్రాళ్ల మీద దొర్లుతూ పోతూ ఉంటుంది. పైగా మధ్య మధ్యలో సుమారు ఇరవై, ముప్ఫయి అడుగులు జుయ్యిమని దిగటం, అలాగే ఎక్కటం. ఇవ్వన్నీ కాక రానూ, పోనూ ఒకటే దారి. ఎదురుగా మరో జీప్ వస్తుంటే, ఒక్కోసారి భయం వేస్తుంది. బండి ఎక్కడా ఆపుకునే లాగానూ ఉండదు. భయానికి మా జీపులో వాళ్ళు, పెద్ద పెద్ద మగవాళ్ళు కూడా గావుకేకలు పెట్టారు. డ్రైవర్ ని బండి ఆపమని గోల పెట్టారు. ఆ భయానికి గుండె ఆగిపోతోందని అరిచారు. ఆపకపోతే జీపు కంపు చేస్తామని గోల. ఆ గోల పడలేక డ్రైవర్ ఒకసారి ఆపాడు. వాళ్ళు దిగి వెళ్లి, పొట్ట ఖాళీ చేసుకుని వచ్చారు. మేము, మాతో వున్న మా క్యాబ్ డ్రైవర్, ఇంకొంత మంది మాత్రం నింపాదిగా జీప్ లోనే కూర్చునివున్నాం. మొత్తానికి గుడికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో జీప్ ఆగింది. అక్కడి నుంచీ నడక, అదీ ఎగుడుదిగుడు రాళ్ళమీద, మధ్యలో ఒక సన్న వాగు పారుతూ ఉంటుంది. నీళ్లు చచ్చే చల్లగా ఉంటాయి. కానీ చుట్టుపక్కల చూస్తే అంతా రమణీయంగా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న వాగులు, సన్నసన్నగా కొండల పైనుంచి జాలువారే సహజ సిద్ధమైన ఔషధీయుక్తమైన జలధారలు, ఒకప్పుడు అక్కడ తపస్సు చేసుకునేవారేమో అనిపిస్తూ, అక్కడక్కడా కొండలలోనే తొలిచినట్టు సరిగ్గా ఒక మనిషి పట్టేంత చిన్నచిన్న గూళ్ళు, వినాయకుడి విగ్రహం, మహాబిల్వం మొక్కలు, ఏవేవో పేరు తెలియని పూల మొక్కలు, ఇవి అన్నీ చూస్తూ నెమ్మదిగా అమ్మవారి గుడికి చేరాము.
ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడి చాలా చిన్నది. అక్కడి చెంచులే పూజారులు. భూమి లెవెల్ కి ఒక ఏడెనిమిది అడుగులు కింద ఉంటుంది. పై నుంచి కిందకు జారాలి. వెంటనే గయలో మంగళగౌరీ ఆలయం గుర్తొచ్చింది. గుడి బయట వున్న చిన్న ప్రాంగణంలో హోమగుండాలు, కొన్ని ఖండిత విగ్రహాలు వున్నాయి. కొంచెం రాళ్ళ మీంచి కిందకు దిగితే ఒక వాగు. హాయిగా నెమ్మదిగా కదులుతున్నాయి నీళ్లు. ఆ నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చుంటే అలసట అంతా పోయింది. కాసిన్ని నీళ్లు తాగితే అమృతంలా వున్నాయి. కొన్ని తాగి, ముఖం కడుక్కుని, కిందకు రాలేని వాళ్ళు బాటిల్స్ ఇస్తే వాళ్లకు నీళ్లు పట్టి, తీరిగ్గా పైకొచ్చాను. అప్పటికి అమ్మవారి దగ్గరకు లోపలకు వెళ్లేవారి సంఖ్యా కొంచం తగ్గింది. ఒక్కసారే రెండు, మూడు లేదా ఇంకా ఎక్కువ జీపులు కలిసి బయలుదేరతాయి మరి. నెమ్మదిగా దారిలో కోసిన మహాబిల్వం ఆకులు, పువ్వులు, కొత్త కుంకుమడబ్బా తీసుకుని నేనూ, మావారూ, మా డ్రైవరూ లోపలకు జారాం. నేను కోసిన పూలు, మహాబిల్వం ఆకులు, మాతో వచ్చిన చాలా మందికి కూడా ఇచ్చాను.


కుంకుమ డబ్బా ఎందుకంటే, ఆ అమ్మవారి నుదుట కుంకుమ పెట్టితే నుదురు మెత్తగా, తగులుతుందట, అచ్చం మనిషికి పెట్టినట్టుగా. అందుకని అందరూ ఆ అమ్మవారికి బొట్టు పెట్టి కోరిక కోరుకుంటారట. ఆ కోరిక 40 రోజుల్లో తీరుతుందట. అందుకే ఆ అమ్మవారి పేరు ఇష్టకామేశ్వరి, ఇష్ట కామ ఈశ్వరి. ఇష్టమైన కామితాలను తీర్చే దేవత. ఈ విషయం అక్కడి చెంచు పూజారి కూడా చెప్పాడు. అమ్మవారికి నమస్కరించుకుని అందరం ఒక్కొక్కరుగా బొట్టు పెట్టాం. ఐదడుగుల ఎత్తున్న గుడేమో, వంగి నుంచోవాల్సి వచ్చింది. నిజంగానే నుదురు మెత్తగా తగిలింది. అదేదో నిజంగా మనిషికి పెట్టినట్టు. రెండు అడుగులెత్తు చిన్న విగ్రహం. చక్కగా చెక్కినట్టు వుంది. రాతి విగ్రహమే. చాలా కళగా, శక్తితో, మళ్ళీ ప్రసన్నవదనంతో కనిపించింది. ఆ చిన్న గదిలో ముగ్గురు, నలుగురు కంటే ఎక్కువ మంది కూర్చోలేము. అమ్మవారికి మళ్ళీ నమస్కరించుకుని జాగ్రత్తగా ఎక్కి పైకి వచ్చాము. తిరిగి జీపు దగ్గరకు నడక, ఆపై మా జీపులో జాగ్రత్తగా కూర్చుని ఆ గుండ్రాళ్లపై ఎగుడు దిగుడు రోడ్డు కాని రోడ్డు పై దొర్లుకుంటూ ప్రయాణించి, మళ్ళీ ఒకసారి అటవీశాఖ వారి ఆఫీస్ దగ్గర హాజరేయించుకుని, అందరం తిరిగి వచ్చేసాం అని ప్రకటించుకుని, శ్రీశైలం బస్టాండ్ చేరుకున్నాం. అమ్మయ్య....అనుకున్నాం. అమ్మ, అయ్యా ఇద్దరూ గుర్తు కొచ్చారు. మా క్యాబ్ డ్రైవర్ సురేందర్ కూడా, 'నేను పదేళ్లనుంచీ డ్రైవ్ చేస్తున్నా, కానీ, ఈ రాళ్ళదారి, ఈ డ్రైవింగ్, అసాధ్యం' అని మా డ్రైవరుకి దణ్ణం పెట్టాడు. ఇదీ మా ఇష్టకామేశ్వరి యాత్ర.
ఈ మొత్తం శ్రీశైల యాత్రలో నేను భ్రమరాంబాదేవిని గురించి ఎక్కువ చెప్పలేదు. ఆ విషయం శక్తిపీఠాలప్పుడు చెబుదామని. అమ్మవారికి కూడా వెళ్ళినప్పుడల్లా కుంకుమార్చన చేసి కానీ రాము. ఎన్నోసార్లు దర్శనం చేసుకొన్న క్షేత్రమిది. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటి దర్శనం చేసుకున్నాక ఒకసారి, అష్టాదశ శక్తిపీఠాలు అన్నింటినీ దర్శనం చేసుకున్నాక మరోసారి, మాపెళ్లి అయ్యి నలభై ఏళ్ళు అయిన సందర్భంగా ఒకసారి, మా మనవరాలు షోడశికి పుట్టు వెంట్రుకలు తీయించేటప్పుడు ఒకసారి, కర్నూల్ జిల్లా సందర్శనకు వెళ్ళినప్పుడు ఒకసారి, మా రెండో కోడలు మానస వెళ్లాలని ఎంతో కోరుకుని వెళ్లలేక పోయినందుకు బాధపడుతుంటే, వాళ్ళు తిరిగి అమెరికా వెళ్ళిపోయాక, వాళ్ళ పేరుతో ఒకసారి........ ఇంకా ఇలా ఎన్నోసార్లు, మాకు కారణాలక్కర్లా శ్రీశైలం వెళ్ళడానికి. నేను ముందు చెప్పిన మూడు (పిలుపు, ఆరోగ్యం, డబ్బు) ఉంటే చాలు. వెళ్లడమే. దగ్గరలో ప్రశాంతత నెలవున్న ప్రదేశం ఈ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం.
ఓం శ్రీమల్లికార్జునాయనమః, ఓం శ్రీభ్రమరాంబాయైనమః,
ఓం శ్రీఇష్టకామేశ్వర్యైనమః
ఓం శ్రీఇష్టకామేశ్వర్యైనమః
ఇక తరువాత ఉజ్జయిన్యాం మహాకాళం వెళదాము.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Super. I must have seen the second one also but do not remember in detail . Now that I know what to look for I will try to go next holidays.
రిప్లయితొలగించండిసంతోషం
రిప్లయితొలగించండిChala baga rasaru aunty... nenu chala miss ayanu anipistundi... eee sari velinapudu anni chustanu
రిప్లయితొలగించండిI will write more about this place in sakthi peethas list.
రిప్లయితొలగించండి