పశుపతినాథ్---ఖాట్మండు
పశుపతినాథ్---ఖాట్మండు
నేపాల్ మేము రెండు సార్లు చూసాం. 1993 లో ఒకసారి, 2018 లో ఒకసారి. 1993 లో వెళ్ళినప్పుడు మాతో మా పిల్లలు, మా అమ్మానాన్నా, మా పెద్ద చెల్లెలు, మరిది, వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. మొత్తం పదిమంది. మా అమ్మకి బుద్ధుడంటే చాలా ఇష్టం. లుంబిని చూడాలని అడిగింది. అప్పుడు మేము బొకారోలో ఉండేవాళ్ళం. అందరం గోరఖ్ పూర్ లో కలుసుకున్నాం. అక్కడ గోరక్షానాథుడి మందిరానికి వెళ్లాం. మానాన్న మమ్మల్నందరినీ గీతాప్రెస్ కి కూడా తీసుకెళ్లాడు. ఆ తరువాత అందరం లుంబిని వెళ్లి అక్కడ బుద్ధుడు జన్మించిన స్థలం చూసాం. మాయాదేవి ఒక తటాకం ఒడ్డున చెట్టు కొమ్మని పుచ్చుకుని నుంచుని బుద్ధుడిని కంటుంది. ఆ దృశ్యం అక్కడి శిల్పాల ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు ఆ తటాకం అంతా ఎండిపోయి వుంది. అక్కడ గైడ్ 'ఆ రోజుల్లో మాకు పురావస్తు తవ్వకాలు ఎలా జరపాలో తెలియక చాలా పురాతన సంపద పాడుచేసుకున్నాం' అని చెప్పాడు. ఇప్పటికీ అక్కడ ఒక చెట్టు వుంది. ఆ చెట్టు, ఆ తటాకం, ఆ శిల్పాలు చూసి బయల్దేరాం. ఆ తరువాత పోఖ్రా, ఖాట్మండు వెళ్లాం. పోఖ్రా లోని తాల్ వారాహి గురించి శక్తిపీఠాల విభాగంలో రాస్తాను. అంతే కాదు, ఖాట్మండులోని గుహ్యేశ్వరి మాతా మందిరం, నేపాల్ గంజ్ లోని బాగేశ్వరి మాతా మందిరం గురించి కూడా అప్పుడే చెప్పుకుందాం.
ఖాట్మండు లో ప్రధానమైనవి పశుపతినాథ దేవాలయం, భక్త్ పూర్, జనక్ పూర్, కాష్ఠమండపం, స్వయంభూనాథ్, బూఢానీలకంఠ్, కుమారీఘర్, ఎవరెస్ట్ శిఖర దర్శనం. వీటిల్లో దర్బార్ స్క్వేర్ లోని కాష్ఠమండపం 2015 లో వచ్చిన భయంకర భూకంపంలో సమూలంగా నేల మట్టమయి పోయింది. పూర్తిగా కట్టెలతోనే, అందులోనూ ఒకటే చెట్టు కట్టెలతో గోరఖ్ నాథుడు నిర్మించిన కట్టడం అది. చెక్క తప్ప ఎక్కడా ఒక్క మేకు కూడా వాడకుండా నిర్మించారు. ఈ కట్టెలమండపం వల్లే ఈ వూరికి కాఠ్ మండు అని పేరు వచ్చింది. అదే ప్రాంతంలో కుమారీఘర్ కూడా ఉంటుంది. వజ్రయాన బౌద్ధుల ఆచారం ప్రకారం ఒక చిన్న పిల్లను ఇక్కడి తలెజూ అమ్మవారి అవతారంగా భావించి, ఆ పాప పెద్దదయ్యేవరకూ దుర్గగా భావించి పూజిస్తారు. అచ్చం మన మాతంగి లాగా అన్నమాట. ఇక్కడ ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే వరకూ దేవతగా చూస్తారు, అక్కడ పెద్దమనిషి అయ్యేవరకూ అమ్మవారి లాగా చూస్తారు. ఇలాంటి పాపను కుమారి అన్నప్పటికీ ఇది బాలలకే పరిమితం. ఇప్పుడు ఆ కుమారీ ఘర్ కూడా లేదు. భూకంపం వచ్చినప్పుడు ఎక్కువ దెబ్బ తిన్న ప్రాంతం ఈ దర్బార్ స్క్వేర్. ఇక్కడ ఎలా అయితే చిన్నపాపను అమ్మవారు చేస్తారో, అలాగే టిబెట్ లో చిన్నఅబ్బాయిలను దలైలామాలుగా చేస్తారు. వాళ్లను భావి దలైలామాలుగా భావిస్తారు. దలైలామా టిబెట్ వదిలి భారత్ వచ్చినప్పటి నుంచీ ఈ ఆచారం మొదలైంది. అన్నట్టు నారాయణహితి రాజప్రాసాదం నిర్మించేవరకూ, రాజకుటుంబం ఈ కాష్ఠమండపం లోనే వుండేదిట. ఇప్పుడు నారాయణహితి ఒక మ్యూజియం.
స్వయంభూనాథ్ స్తూపం. ఇది బౌద్ధంలో వజ్రయానానికి సంబంధినది. ఈ స్తూపంపై నాలుగు వైపులా బుద్ధుడి కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు పెయింట్ చేయబడి ఉంటాయి. రెండు కళ్ళ మధ్యలో మూడవకన్ను కూడా ఉంటుంది. దేవనాగరి లిపిలో ఒకటి సంఖ్యను ముక్కు లాగా గీస్తారు. చాలా పెద్ద ప్రాంగణం. ఈ స్తూపం లోపల బుద్ధమందిరం వుంది. ఈ స్తూపం చుట్టూ జపమాలలు తిప్పుతూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ వుంటారు. ఆ తరువాత మేము చూసింది బూఢా నీలకంఠ్, ఈయన్నే జలనారాయణ్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్లోటింగ్ విష్ణువుగా ప్రసిద్ధుడు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై పడుకొని ఉంటాడు. నాలుగు చేతుల్లోనూ, చక్రం, శంఖం, గద, సాలిగ్రామం ఉంటాయి. ఆ ఆదిశేషుడు ఎన్ని మెలికలు తిరిగి ఉంటాడో. ఆమధ్యలో హాయిగా సుఖంగా విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు. ప్రత్యేకత ఏమిటంటే, ఈ విగ్రహం నీటిపై తేలుతూ ఉంటుంది, కానీ కదలదు. మనం వంగుని చుస్తే, నీటిలో ఈ మొత్తం విగ్రహం ప్రతిబింబం కనపడుతుంది. అదే విచిత్రం. ఇంత పెద్ద రాయి నీటిపై ఎలా తేలుతోందా అని. 1993 లో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని విగ్రహం దగ్గర దాకా పోనిచ్చారు. మా నాన్న దాదాపు దాని మీదకు వెళ్లి అక్కడ నుంచి కుంకుమ తీసి మా అందరికీ పెట్టాడు. అందరం తాకి దణ్ణం కూడా పెట్టుకున్నాం. అప్పుడు చెప్పిన ప్రకారం రాజు ఈ ఆలయానికి ఎప్పటికీ రాడట. అందుకని దీనికి మరొక చిన్న నకలు జలనారాయణ్ మూర్తిని, ఆ ఊరి ప్రధాన ఉద్యానవనంలో నిర్మించుకుని, అక్కడికి వెళ్లి నమస్కరించుకుంటాట్ట. కానైతే, అక్కడ పూజా పురస్కారాలేవీ వుండవు. దీనికి ఒక కారణం కూడా చెప్పారు. నా విష్ణుః పృథివీ పతిః అని ఒక నమ్మకం. రాజు ఎవరైనా సరే, అతడిలో విష్ణు అంశ ఉంటుంది, మనల్ని పాలించేవాడు విష్ణువే అనేది ఒక నమ్మకం. రాజు కనుక ఈ జలనారాయణ్ మందిరానికి వస్తే, ఈ శయన విష్ణువు రాజుని, నువ్వా, నేనా రాజుని, అని అడిగి ఈ మనుష్య రాజుని మింగేస్తాట్ట. అందుకని రాజులెవ్వరూ ఈ ఆలయానికి రారుట. విచిత్రంగా వున్నా జరుగుతున్న నిజం మాత్రం ఇదే. సరే, ఇప్పుడు రాజ్యాలూ లేవు, రాజులూ లేరు అనుకోండి.
భక్త్ పూర్, జనక్ పూర్ నగరాలు కూడా ఈ రాజ్యానికి సంబంధినవే. అక్కడి ఆలయాలు, శిల్పాలు అద్భుతంగా అపూర్వంగా ఉంటాయి. తన హరేరామ హరేకృష్ణ సినిమా దేవానంద్ ఈ భక్త్ పూర్ లోనే ఎక్కువ తీసాడు. కాష్ఠమండపం కూడా ఆ సినిమాలో కనిపిస్తుంది. జనక్ పూర్ మిథిలా ప్రాంతం లోని విదేహ రాజ్యం. ఆ మిథిలా ప్రాంతం కొంత మన బీహార్ వరకూ విస్తరించింది. ఇది జనకుడు పాలించిన దేశం. అన్నట్టు ఆ రాజ్యం రాజులందరూ జనకుడు అనే పేరుతోనే ప్రసిద్ధులు. సీత తండ్రి అసలు పేరు సీరధ్వజుడు. ఇక్కడే సీతా రాముల పెళ్లి జరిగింది అని ఒక మండపం కూడా చూపిస్తారు. సీత పెళ్ళికి పసుపు దంచిన గుంట, అని ఒక చిన్న గుంటని కూడా చూపిస్తారు. అవును మరి, అదంతా మిథిలా రాజ్యం. సీత అందుకే జానకి, వైదేహి, మైథిలి. ఇంతవరకూ చెప్పినవన్నీ 1993లో చూసినవే. 2018 లో ధ్యాస అంతా మానససరోవరం మీద వుండి, ఖాట్మండు చూసాం కానీ మిగిలిన వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. చుట్టుపక్కల ఊళ్ళు అసలే చూడలేదు.
మేము 2018 లో వెళ్ళినప్పుడు మాకు ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది యతి ఎయిర్ లైన్స్ ద్వారా, మేము ఖాట్మండు నుంచి ఒక పది మంది కూర్చునేంత చిన్న ఫ్లైట్ లో వెళ్ళాం. ఆ ఫ్లైట్ అటెండెంట్ మాకు అన్ని వివరాలూ చెప్పింది. సరిగ్గా ఎవరెస్ట్ శిఖరం కనిపించేటప్పుడు మా అందరినీ ఒక్కొక్కరుగా పైలట్ కేబిన్ లోకి తీసుకుని వెళ్లి బైనాక్యులర్స్ ఇచ్చి మరీ చూపించారు. మాలాంటి వాళ్ళం ఎవరెస్ట్ ఎక్కలేం సరికదా, చూడటం కూడా అసాధ్యం అనుకునే వాళ్ళం. అలాంటిది ఇలా ప్లేన్ ని వీలైనంత దగ్గరగా తీసుకెళ్లి చూపించడం అనేది అద్భుతం, మేము ఎప్పుడూ ఊహించనిది. చాలా థ్రిల్ అయిపోయాం. అసలు ప్రాడక్ట్ మానస సరోవరం దర్శనం అయితే ఈ ఎవరెస్ట్ వీక్షణం ఒక బైప్రాడక్ట్. అంత చిన్న ప్లేన్ చూడటం కూడా ఇదే మొదటిసారి.
ఇక మన అసలు శీర్షిక పశుపతినాథ దేవాలయానికి వద్దాం. ఈ పశుపతినాథ దేవాలయం బాగమతీ నదీ తీరంలో వుంది. కొత్తగా ఈ బాగమతి నదికి సాయంత్రం హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారట. ఈ ఆలయం ఎప్పుడు కట్టబడిందో తెలియదు. కానీ మహమ్మదీయుల దండయాత్రల్లో పాడైపోయిన ఆలయాల్లో ఇదీ ఒకటి. ఎప్పటికప్పుడు తిరిగి నిర్మించబడుతూ వుంది. కేదారనాథ్ అప్పుడు చెప్పుకున్న కథే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అప్పుడు భీముడు బలంగా పట్టుకుంటే గుప్తకాశీ నుంచి ఆ వృషభం కొమ్ము వచ్చి ఇక్కడ పడిందని అంటారు. అది భూమిలో ఉండిపోతే, రోజూ ఒక ఆవు వచ్చి అక్కడ పాలు కురిపించేదిట. అది చూసి అక్కడ తవ్వి చూస్తే ఈ లింగం దొరికిందని అంటారు. పశుపతినాథ లింగం ఒక పంచముఖ లింగం. ప్రతి ముఖానికి రెండు చేతులు, కుడిచేతిలో రుద్రాక్షమాల, ఎడమచేతిలో కమండలం ఉంటాయి. ఈ ఆలయానికి గోపురం పగోడా తరహాలో ఉంటుంది. గోపురం స్వర్ణ తాపడం చెయ్యబడి వుంది. ఆలయానికి నాలుగు ద్వారాలు వున్నాయి. ప్రతి ద్వారం వైపు ఒక ముఖం ఉంటుంది. ఐదవ ముఖం ఆకాశం వైపుకి ఉంటుంది. తూర్పున వున్న ముఖాన్ని తత్పురుష అనీ, పడమరన వున్న ముఖాన్ని సద్యోజాత అనీ, వుత్తరం వేపు వున్న ముఖాన్ని వామదేవ అనీ, దక్షిణంవైపుకి వున్న ముఖాన్ని అఘోర అనీ, ఈ నాలుగింటికీ పైన వున్న ముఖాన్ని ఈశాన అనీ అంటారు.
ప్రధాన ద్వారం మాత్రం పడమర వైపున వున్నదే. అక్కడ ఒక పెద్ద నంది ఉంటుంది. ఆ నందిని బంగారునంది అంటారు. సాధారణంగా అంత పెద్ద నందిని చూడటం అరుదు. ఈ మార్గంలోనే సామాన్య జనం అంతా ప్రవేశిస్తారు. రాజుగారు, ఇప్పుడు లేరు కానీ, మేము 1993 లో వెళ్ళినప్పుడు వున్నారు, రాజు ప్రవేశించే ద్వారంలో ఒక పెద్ద స్తంభంపై ఒక గరుడపక్షి శిల్పం ఉంటుంది. రాజుగారు ఆ గరుడుడికి నమస్కరించి లోపలికి వస్తారట. ఈ నాలుగు ద్వారాల్లో నుంచీ దర్శనం, అభిషేకం అన్నీ ఉంటాయి. మేము 2018 లో కూడా ఈ నాలుగు ద్వారాలనుంచీ కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడి ప్రధాన పూజారులు అందరూ కర్ణాటక నుంచి వచ్చిన బ్రాహ్మణ భట్ట సాంప్రదాయం వారు. ఈ ప్రధాన పూజారులకు మాత్రమే పశుపతినాథ లింగాన్ని తాకే అర్హత ఉంటుంది. మిగిలిన అందరూ సహాయకులే, ఈ సహాయకులను భండారీ లంటారు. ఇలా ప్రధాన పూజారులను స్థానికులను కాకుండా బైట నుంచి తెచ్చుకోవటానికి కూడా ఒక కారణం చెప్పారు. రాజు ఎప్పుడైనా మరణిస్తే, ప్రజలందరికీ సూతకం వస్తుందిట. అటువంటి సందర్భంలో పశుపతి
నాథుడికి పూజలు ఆగిపోకుండా బైటవాళ్ళను ప్రధాన పూజారులుగా తెచ్చారుట. మరణం గురించి, సూతకం గురించి, అంత ముందు ఆలోచన వీరికి. ఇక్కడ మరణిస్తే ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలకు అతీతంగా మరుజన్మ వస్తుందని ఒక నమ్మకం. అందుకే ఎక్కడ చూసినా వృద్ధులు కనపడుతూ వుంటారు. బాగమతి ఒడ్డున శవదహనాలు జరుగుతూనే ఉంటాయి. శివుడుండే చోట రుద్రభూమి గదా, మరణం సామాన్యం. ఈ ఆలయం వెబ్ సైట్ లింక్ ఇదీ.
ఇక్కడ ఉపాలయాలు చాలా వున్నాయి. మేము సూర్యనారాయణ, వాసుకి, హనుమ, జ్వరేశ్వరుడు వంటి కొన్ని చూసాం. ప్రతి ద్వారానికి రెండు, ప్రతి మూల లోనూ రెండు ఉపాలయాలు ఉంటాయి. అంతేకాక ఈ గుడి ప్రాంగణం చుట్టూ, చాలా చిన్న చిన్న శివాలయాలు లెక్కలేనన్ని వున్నాయి. అదృష్టవశాత్తూ భూకంపం మాత్రం ఈ ఆలయాన్ని తాకలేదు. బహుశా శివుడాజ్ఞ అయ్యి వుండదు. హైందవేతరులకు మాత్రం ఆలయంలో ప్రవేశం లేదు. కానీ వారు కూడా దర్శనం చేసుకునే వీలుగా గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా మెట్లు కట్టారు. అవి ఎక్కి చూసుకోవచ్చు. నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ పశుపతినాథుడిని చూసే భాగ్యం కలగదు. దర్శనం అయినాక చాలా తృప్తిగా అనిపించి బైటకు వచ్చాం. అన్నట్టు ఇక్కడ రుద్రాక్షలు బాగా నమ్మకంగా అమ్ముతారు. ఆసక్తి కలవారు కొనుక్కోవచ్చు. మొత్తానికి మా పశుపతినాథ యాత్ర ఈ విధంగా చక్కగా ముగిసింది.
ఓం శ్రీ పశుపతినాథాయనమః, ఓం శ్రీ జలనారాయణాయనమః
ఓం శ్రీ బుద్దాయనమః
పశుపతి నాథుడిని చూసాం కదా, రేపు
ఓం కైలాస శిఖరాయనమః, ఓం మానససరోవరాయనమః
అనుకుంటూ శివుడు కొండ రూపంలో వున్న కైలాస శిఖరాన్నీ, దాని పక్కనే వున్న మానససరోవరాన్నీ చూసొద్దామా.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Excellent Vijaya.So much information! Thank you so much for sharing.
రిప్లయితొలగించండిWonderful aunty!!!
రిప్లయితొలగించండిChala baga rasaru...Malli velochinatu undi naku...motham 2018 trip antha rewind ayindi okasari