ప్రజ్వాల్యాం వైద్యనాథంచ


5. వైద్యనాథం చితాభూమౌ...... 
ప్రజ్వల్యాం వైద్యనాథంచ...... 

                                   
ఇప్పుడు ఆ శ్లోకంలోని ఐదో క్షేత్రాన్ని చూద్దాం. పైనున్న టైటిల్ చూడగానే ఒక విషయం అర్థం అయ్యుంటుంది మీకందరికీ. ఈ శ్లోకంలో ఈ పాదానికి మాత్రం పాఠాంతరం వుంది. అందుకే ఆ రెండు పాదాలూ రాసాను. ఆ క్షేత్రమే ప్రస్తుతం ఝార్ఖండ్, ఒకప్పటి బీహార్ రాష్ట్రంలోని దేవఘడ్ లోని వైజనాథ్ లేక వైద్యనాథ్ జ్యోతిర్లింగం. అదే విధంగా మహారాష్ట్ర లోని పరలి లేదా పర్లిలో కొలువైన వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా ఆ ప్రాంతవాసులు జ్యోతిర్లింగం అనే అంటున్నారు. ఈ రెండు ప్రాంతాలు కూడా పచ్చగా ఉంటూ స్వచ్ఛమైన గాలీ, నీరూ వున్న ప్రాంతాలు. ఆదిశంకరులు ఈక్షేత్రం గురించి ఈవిధంగా చెప్పారు.

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి || 

ఈ శ్లోకార్ధం ఏమిటంటే, ఈశాన్య దిక్కున, నిత్యమూ వసంతాన్ని తలపిస్తూ వున్న ఈ ప్రదేశంలో దేవదానవులు తన పాదపద్మాలను సేవిస్తూండగా, గిరిజా సమేతుడై, ప్రజ్వలంగా వెలిగిపోతూ వున్న ఆ వైద్యనాథునకు నమస్కారం అని. ఈ శ్లోకం మొదలు అవడమే పూర్వోత్తరే అని మొదలైంది. అంటే ఈశాన్య ప్రాంతం అని స్పష్టంగా చెప్పాడు ఆదిశంకరుడు. మన దేశంలో మహారాష్ట్ర పడమటి దిక్కులో ఉంటే, ఝార్ఖండ్ కొంచం ఈశాన్య దిక్కునే వుంది. అందుకని నేను ఝార్ఖండ్ లోని వైద్యనాథ్ ఆలయానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చి చెప్తున్నాను. కానీ ఈ రెండు దేవాలయాలూ కూడా నిర్మాణం చూడంగానే "ఇవి జ్యోతిర్లింగ క్షేత్రాలు" అని వెంటనే చెప్పేసేలా ఉంటాయి. ఆ ప్రత్యేకత, ప్రాచీనత స్పష్టంగా తెలిసిపోతాయి. అద్భుతమైన నిర్మాణాలు. దైవత్వం ఉట్టిపడేలా, ప్రతి అడుగులోనూ దివ్యత్వం తెలుస్తూ, ఇది తప్పకుండా భగవంతుడు కొలువై వుండే చోటు అనిపిస్తాయి.

 

ముందుగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘడ్ లో వున్న ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయం ముందు ఒక పెద్ద తటాకం ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణం లోపలికి అడుగు పెడితే, అది కొన్ని దేవాలయాల సముదాయం అని వెంటనే తెలుస్తుంది. అన్నింటిలో ప్రధానమైనవి రెండు, ఒకటి వైద్యనాథుని మందిరం, రెండోది పార్వతీ మందిరం. ఈ రెండు మందిరాల గోపుర శిఖరాలపై వున్న పంచ శూలాలను కలుపుతూ చాలా దారాలు కట్టి ఉంటాయి. (మనం పూజలప్పుడు కట్టుకుంటామే తోరాలు అని, అలా ఉంటాయి). పై శ్లోకంలో కూడా ఇక్కడి వైద్యనాథుడు గిరిజా సమేతుడు అన్నారు ఆది శంకరులు. వారిద్దరి బంధం ఈ దారాల ద్వారా ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. తమాషాగా అన్ని శివ పార్వతీ ఆలయాల్లో గోపురాల పైన త్రిశూలాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కచోట మాత్రం పంచశూలాలు ఉంటాయి. అందుకని దీన్ని కవచంగా భావిస్తారు. మహాశివరాత్రికి ముందు ఈ ప్రాంగణం లో వుండే అన్ని గోపురాలపై వున్న ఈ పంచ శూలాలన్నీ దించి శుద్ధి చేసి మళ్ళీ గోపురాలపైన ప్రతిష్ట చేస్తారు. ఆ శూలాలను దించుతున్నప్పుడు వాటిని కేవలం తాకి మొక్కుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారుట.

 శ్రావణ మాసం శివునికి ప్రీతి. అందుకని శ్రావణ మాసంలో భక్తులు కావడి సేవ చేస్తారుట. సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వున్న సుల్తాన్ గంజ్ అనే వూరిలో ప్రవహిస్తూన్న గంగానది నుంచి నీరు రెండు చెంబులతో కావడిలో తెస్తారు. సుల్తాన్ గంజ్ లో గంగ ఉత్తరవాహిని, ఉత్తరం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దూరం అంతా కాలినడకన భుజాలపై కావడి మోస్తూ తెస్తారు. ఒక చెంబులో నీరు వైద్యనాథుడికి అభిషేకం చేస్తే, ఇంకో చెంబులో నీరు ఇంకో 40 కిలోమీటర్ల దూరంలో వున్న వాసుకినాథ్ ఆలయంలో శివునికి అభిషేకం చేస్తారుట. మేము ఒక్క వైద్యనాథుడిని మాత్రమే దర్శించుకున్నాం. మేము అంటే మేము, మా ఇద్దరబ్బాయిలు, రమేష్ గారి బాంకులో ఆయనతోపాటు పనిచేసే శ్రీనివాస్ గారి కుటుంబం, సత్పతి గారి కుటుంబం. మా మూడు ఫామిలీస్ ఒక జీపులో బొకారో నుంచి దేవగఢ్ వెళ్లాం. ఇక్కడి పార్వతి అమ్మవారు 51 శక్తిపీఠాలలో ఒకటి. సతీ దేవి హృదయం ఇక్కడ పడిందని చెప్తారు.
                                             
ఇంతకీ స్థల గాథ ఏమిటంటే, రావణాసురుని తపస్సుకి మెచ్చి శివుడు అతని కోరిక మేరకు ఆత్మలింగాన్ని వరంగా ఇస్తాడు. కానీ దానిని దారిలో ఎక్కడా కింద పెట్టకుండా లంకకు తీసుకువెళ్లి ప్రతిష్ట చేసుకోమని చెప్తాడు. మధ్యలో ఎక్కడ కింద పెట్టినా ఆ లింగం అక్కడే భూమిలో ఉండిపోతుందని, దానిని అక్కడనుంచి కదపలేరనీ కూడా శివుడు హెచ్చరిక చెప్పి పంపిస్తాడు. శివుని ఆత్మలింగం అంత సులభంగా ఇచ్చేయటం చూసి భయపడిన పార్వతీ దేవి విష్ణువుని కాపాడమని అడుగుతుంది. అప్పుడు విష్ణువు వరుణుణ్ణి పిలిచి వుపాయంగా రావణాసురుని పొట్టలో దూరమని చెప్తాడు. ఆ విధంగా పొట్టలో వున్న వరుణుడి కారణం చేత రావణాసురునికి పొట్ట ఉబ్బిపోయి, అత్యవసరంగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. అప్పుడు ఈ లింగాన్ని కింద పెట్టలేక, అక్కడే వున్న ఒక గోపాలబాలునకు లింగం ఇచ్చి పట్టుకోమని, తాను వెంటనే వచ్చేస్తాననీ సహాయం అడుగుతాడు. ఆ గోపాలబాలుడే విష్ణువు. సరే అలాగే సహాయం చేస్తానని మాటిచ్చి, ఎక్కువ సేపయితే పట్టుకోను, కింద పెట్టేస్తానని ముందే చెప్తాడు. వరుణుని ప్రభావం వల్ల రావణుడు వెంటనే రాలేకపోతాడు. ఆతడి మూత్రంతో ఒక పెద్ద తటాకం ఏర్పడుతుంది. (అదే మేము జీపు దిగంగానే చూసిన తటాకం.) అప్పుడు ఆ బాలుడు సమయం చూసుకుని లింగాన్ని కింద పెట్టేస్తాడు. ఆ లింగం అక్కడే భూస్థాపితం అయిపోతుంది. అది సహించలేని రావణుడు కోపంతో లింగాన్ని పెకలించాలని చూస్తాడు. లింగంపై తన బొటనవేలితో గట్టిగా నొక్కిపెట్టి పెకిలించటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ సాధ్యం కాదు. పైగా ప్రయత్నం చేసిన కొద్దీ లింగం ఇంకా ఇంకా భూమి లోకి కుంగిపోయి పైకి చిన్న గుండు మాత్రం మిగులుతుంది. అప్పుడు అతనికి శివుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి దేవతలంతా తనని మోసం చేశారని తెలిసి క్రోధంతో వెళ్ళిపోతాడు. ఇప్పటికీ ఆ లింగం మీద రావణుడి వేలి గుర్తుగా ఒక చిన్న గుంత ఉంటుంది. అభిషేకాలు చేసాక ఆ గుంటలో నీరే తీర్థంగా ఇస్తారు. రావణుడు లింగాన్ని పెకిలించే ప్రయత్నంలో లోనికి బలంగా నొక్కేయటం వల్ల లింగం భూమి పైకి కొంచెమే ఉంటుంది. శివ క్షేత్రం కన్నా ముందే శక్తి క్షేత్రం అక్కడ వెలిసిందని అక్కడి పూజారులు చెప్పారు.

  

తిరిగి వెళ్లే దారిలో ఆనాటి రాణి కట్టించిన రాధాకృష్ణుల మందిరం చూసాం. దాన్ని నవలఖా మందిర్ అంటారు, ఆ రాణి ఆరోజుల్లో తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి ఆ మందిరం నిర్మించిందిట. ఈ మందిరం కూడా చాలా బావుంది. శిల్పమూ, శైలీ అద్భుతంగా వున్నాయి. అక్కడ్నుంచి మేమంతా తపోవన్ కి వెళ్లాం. ఈ తపోవన్ యాత్ర మాత్రం అందరూ భలే ఎంజాయ్ చేసాం. 'రాయీ రప్పల్లో, అడవీ ముళ్ళదారుల్లో' అని అయ్యప్ప పాటలలో విన్నా. ఈ దారి అంతకన్నా అడ్వెంచరస్ గా ఉంది. ఒక చోట అయితే రెండు రాళ్ళ మధ్య వున్న సన్నని చీలిక గుండా దూరి నడిచాం, మరోచోట ఒక చిన్న కంత వుంది అంతే, దాంట్లోంచి దూరితే కానీ అవతలకు చేరం. అలా ఎక్కుతూ, దూకుతూ, పాకుతూ, దూరుతూ ఆ కొండ పైకి చాలా దూరం ఎక్కాం. ఆ పైన అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి, దానిపక్కన ఒక పూజారి వున్నాడు. పక్కన అన్నాను, గమనించండి. అక్కడ ఒక పెద్ద బండే కానీ గుడి నిర్మాణం లేదు. అక్కడ ఒక పెద్ద బండ పిడుగు పడినప్పుడు రెండుగా చీలిందట. ఆ చీలికలో గట్టిగా ప్రయత్నిస్తే ఒక చేయి దూరుతుంది అంతే. అల్లాంటి ఇరుకైన చీలికలో ఆంజనేయస్వామి వెలిసాడు. ఆ రెండు చీలికలపై వున్న శిల్పం, నఖచిత్రం అంటే చాలేమో, ఒకదానికొకటి కాంప్లిమెంటింగ్ గా ఉంటాయి. అంటే ఒక బండపై వున్న బొమ్మను రెండో బండలో నుంచి తొలిచినట్లన్నమాట. ఒకవేళ ఆ రెండు బండలూ కలిస్తే అసలు గాప్ ఏమాత్రమూ లేకుండా మళ్ళీ మామూలు బండ లాగే ఉంటుందన్నమాట. ఆ రెండు బండల్నిండా సిందూరం పూసేసారు. మేము అందరం ఒకరి తరువాత మరొకరుగా ఆ రాయి దగ్గరకు వెళ్లి దణ్ణం పెట్టుకుని వచ్చాం. మరి ఒకసారి ఒకరే వెళ్ళగలరు ఆ దారిలో. తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే దారి. ఈసారి దారి బాగా తెలుసు కనుక చకచకా కిందకు దిగేసాం. అదీ మా దేవగఢ్ యాత్ర. అన్నట్టు ఈ క్షేత్రానికి కూడా అఫిషియల్ వెబ్ సైట్ వుంది. సేవలకు ప్రయత్నించి చూడండి.
 

 

ఇప్పుడు రెండోదైన మహారాష్ట్ర లోని పర్లి క్షేత్రం గురించి చెప్పుకుందాం. మేము మా మహారాష్ట్ర స్టేట్ టూర్ లో భాగంగా ఈ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. పురాతన ఆలయం. లోపలి అడుగు పెట్టంగానే అహల్యాబాయి హోల్కర్ విగ్రహం దానివెనుకే ఒక పెద్ద దీపస్తంభం కనిపించాయి. అహల్యాబాయి దీపస్తంభాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఆవిడ మార్కు స్తంభాలు. పెద్ద సింహద్వారం దాటి లోపలి వెళ్లాం. ఆరోజు ఎవరో స్పెషల్ పూజ చేయించుకున్నట్టున్నారు. అంతా సందడిగా వుంది. తప్పెట్లు, తాళాలు, శంఖాలు, భేరీలు వగైరా శబ్దాలు చాలా హై పిచ్ లో వున్నాయి. గర్భగృహం చాలా పెద్దగా వుంది. మామూలుగా గర్భ గృహాలు చిన్నగా, యిరుగ్గా ఉంటాయి. నాగనాథ్ గర్భగృహంలోనైతే గట్టిగా పదిమంది కూడా పట్టరు ఒక్కసారి. సరే, ఇక్కడ విశాలంగా ఉండటంతో హాయిగా కూర్చుని అభిషేకం, పూజా చేయించుకున్నాం. పక్కనే పార్వతీ దేవి ఆలయం కూడా వుంది. విగ్రహం ప్రిమిటివ్ గా వుంది. ఆ తరువాత బైటకు వచ్చి ఆ పూజారిని అడిగాను, 'ఏమండీ మేము బీహార్ లో ఇంకో వైద్యనాథం చూసాము, ఏది అసలైనది' అని. ఆయన మాత్రం చాలా స్పష్టంగా 'ఎక్కడికక్కడే అమ్మా, ఇది ఇక్కడి వాళ్ల సౌకర్యార్ధం' అన్నాడు. పైగా చార్ ధామ్ అంటే, ఈ రోజుల్లో అందరూ, గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదార్ అనటం లేదా, అసలు చార్ ధామ్ అంటే, రామేశ్వరం, పూరి, ద్వారకా, బదరి కదా అన్నాడు. అవున్నిజమే కదా అనిపించింది. తరువాత నాకు ఆలోచించగా ఆలోచించగా అర్థం ఐన విషయమేమంటే, మొదటి చార్ ధామ్ భారత పరిక్రమ, రెండోది హిమాలయ పరిక్రమ అని. ఈ పర్లి ఆలయానికి దేవాలయ వివరాలు కావాలంటే ఈ వెబ్ సైట్ కొంతవరకు సహాయపడచ్చు. ప్రయత్నించండి.



  

తరువాత బైటకు వచ్చి పక్కనే వున్న శని మందిరం చూసాం. శని పక్కన మరో చిన్న శివాలయం కూడా వుంది, అదీ చూసాం. తిరిగి కారెక్కి అంబాజోగై వెళ్ళాము. అంబాజోగై ఆలయం గోపురం ఎంత అందంగా అద్భుతంగా ఉందో. అంబాజోగై అంటే జోగిని అయిన అమ్మ అని. ఇక్కడి అమ్మవారి రూపం చాలా చాలా ప్రిమిటివ్. కేవలం ముఖం వరకు మాత్రమే ఉంటుంది. ఇల్లాంటి విగ్రహాలు మాహుర్ లోనూ, ఉజ్జయిని లోనూ కూడా చూసాం. ఆ ముఖానికి మొత్తం సిందూరం పట్టించి కళ్ళు ముక్కు చెవులు నోరు అలంకరించి ఉంటాయి. ఈ అమ్మవారికి పూజ చేయాలంటే కేవలం మగవారు మాత్రమే చేయాలిట. రమేష్ గారికి వాళ్ళే మడి ధోవతులు కట్టి, ఆ అమ్మవారి పీఠంపై ఎక్కించి పూజ చేయించారు. నన్ను గర్భగృహంలో ఒక మూల కూర్చోమన్నారు. పిలిచినప్పుడు వచ్చి దణ్ణం పెట్టుకోండి చాలు అన్నారు. ఆహా, ఆయన చేస్తే, నేను చేయకుండానే ఫలితం వస్తుందట. భలే బావుందే షార్ట్ కట్ అనుకున్నా. ఆ తరువాత ఆ గుడి స్థల గాధ చెప్పారు. అమ్మవారు పక్కనే వున్న పర్లి వైద్యనాథుణ్ణి పెళ్లాడదలిచి, శివుని అనుమతితో వివాహానికి అన్నీ సిద్ధం చేసుకుని శివుని కోసం ఎదురు చూస్తుంటే, శివుడు ముహూర్తం దాటిపోయినా రాలేదట. అప్పుడు ఆగ్రహించిన అమ్మవారు, ఇక నేను ఎవరినీ పెళ్లాడను, జోగిని వలే తపస్సు చేసుకుంటాను అని అలా కన్యజోగినిగా వుండి పోయిందట. ఇది కూడా కన్యాకుమారి కథ లాగే వుందే అనుకున్నా. ఈ అమ్మవారు ఎప్పటిది అంటే, అనాది అన్నాడు ఆ పూజారి. సతీదేహత్యాగం కన్నా ముందుది అని కూడా చెప్పాడు.


మొత్తానికి మా మహారాష్ట్ర వైద్యనాథ్ యాత్ర కూడా పూర్తి అయ్యింది. దీనితో మేము దర్శించిన జ్యోతిర్లింగాల సంఖ్య పదమూడుకి మరొకటి చేరి పధ్నాలుగు అయ్యాయి. అంబాజోగై కూడా చెప్తే కానీ పర్లి యాత్ర సంపూర్ణం కాదనిపించి ఆ విశేషాలు కూడా చెప్పాను.

ఓం శ్రీ వైద్యనాథాయ నమః , ఓం శ్రీ పార్వత్యై నమః, 
ఓం శ్రీ అంబాజోగైనమః, ఓం శ్రీ ఆంజనేయాయనమః  

తరువాత డాకిన్యాం భీమశంకరమ్ అనుకుంటూ భీమాశంకర క్షేత్రాన్ని సందర్శిద్దాం. 


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650





























    కామెంట్‌లు

    ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

    నిర్వాణషట్కమ్

    ఓంకారమమలేశ్వరం

    హిమాలయే తు కేదారం