ఉజ్జయిన్యాం మహాకాళం

3. ఉజ్జయిన్యాం మహాకాళం......
                                                  
ఇప్పుడు ఆ శ్లోకంలోని మూడో క్షేత్రాన్ని చూద్దాం. అదే ఉజ్జయినిలో మహాకాళుడు. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లో వుంది. ఇది కూడా అటవీప్రాంతంలోనే వుంది. క్షిప్రానది ప్రవహించే దేశం. స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ కూడా పుష్కలం. ఆదిశంకరులు ఈక్షేత్రం గురించి ఈవిధంగా చెప్పారు.

అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశమ్ ||


ఈ శ్లోకార్ధం ఏమిటంటే, అవంతిక అనే ప్రాంతంలో కొలువై, సజ్జనులందరికీ ముక్తిని ఇస్తూ, తనను సేవించిన వారందరికీ అకాలమృత్యువు రాకుండా కాపాడే, ఆ దేవదేవుడైన మహాకాళునకు నమస్సులు అని. ఈ ఉజ్జయినికి వున్న ఎన్నో పేర్లలో అవంతిక అనే పేరు ఒకటి. ఈ నగరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మొదటి ప్రత్యేకత ఇది ఒక మోక్షపురి. ఈ కింది శ్లోకం గరుడపురాణంలో పదహారో అధ్యాయంలో వుంది.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా
పురీ ద్వారవతీ జ్ఞేయా సప్తై తా మోక్షదాయకాః

ఈ గరుడ పురాణం ప్రకారం 'మోక్షమార్గానికి దారులు ఏవి' అని గరుడుడు అడిగితే, భగవానుడు స్వయంగా ఈ సప్త మోక్షపురాల గురించి చెప్పాడు. ఉజ్జయిని ఆ సప్త మోక్షపురములలో ఒకటి. ఈ నగరానికి వచ్చి ఇక్కడ మహాకాళునకు చేసే భస్మహారతి చూసినవారికి మోక్షం వస్తుందని ఒక ప్రగాఢ విశ్వాసం. అంతేకాక ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగమూ వుంది, శక్తిపీఠమూ వుంది. ఇంకా ఇక్కడ ప్రతి పన్నెండుఏళ్లకు ఒకసారి కుంభమేళా కూడా జరుగుతుంది.

  

కర్కటరేఖ, Tropic of Cancer, ఈ ఉజ్జయినీ నగరం గుండా పోతుంది. ఈ కర్కటరేఖ వల్లే ఈ ప్రాంతంలో ఎండలు కూడా ఎక్కువ. ఈ రేఖ సరిగ్గా ఇక్కడ వున్న కర్కటేశ్వర్ ఆలయం ద్వారా పోతుంది. యుగాల కిందనే ఈ కర్కటరేఖ పోయే మార్గాన్ని గుర్తించి అక్కడే ఆ పేరు మీద ఒక ఆలయం నిర్మించటం చూస్తుంటే, ఎవరన్నారు - భారతదేశం వెనుకబడిందని, అని గట్టిగా అరవాలనిపించింది, 'ఆకాశంలో ఊహారేఖలను గుర్తించి వాటి అక్షాంశాలు, రేఖాంశాలు సైతం విస్పష్టంగా చెప్పగలిగే పాండిత్యం మన పూర్వీకుల సొత్తు అని' గర్వంగా అనిపించింది. అంతే కాదు, ఇక్కడ మంగళ్ నాథ్ మందిర్ కూడా వుంది. నవగ్రహాలలోని మంగళుడు ఇక్కడే పుట్టాడని మత్స్యపురాణంలో కనిపిస్తుంది.(ఈయన్నే కుజుడు, అంగారకుడు అని కూడా అంటారు). ఇక్కడ వున్న నవగ్రహ మందిరం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రతి గ్రహానికీ ఆ గ్రహం రంగులోనే ఒక్కో గోపురం ఉంటుంది. ఈ మందిరాలన్నీ చాలా సమ్మోహనంగా వున్నాయి.

  


ఇక్కడ జైపూర్ మహారాజా జైసింగ్ II కట్టించిన వేధశాల, అబ్జర్వేటరీ, వుంది. జైసింగ్ కట్టించిన అన్ని వేధశాలలన్నింటిల్లో ఇది పెద్దది, విస్తారమైనది. నేను మాథమెటిక్స్ దాన్నేమో, ఆ కట్టడాలు, ఆ జామెట్రీ, ఆ కోణాలు, ఆ కర్వ్స్, వాటిని ఒక ప్రత్యేకమైన యాంగిల్ లో చూడ్డానికి మెట్లు, సూర్య గమనాన్ని అనుసరించి కాంతిరేఖలు, నీడల్ని బట్టి, కాలం లెక్కించడానికి, కాలం అంటే కేవలం టైం మాత్రమే కాదు, నెలలు కూడా, గ్రహణాలు, తిధులు అన్నీ. మొత్తం పంచాగాన్నీ, గ్రహగతుల్నీ ఇక్కడినుంచే తెలుసుకోవచ్చు. 1725లో ఇంత ఖచ్చితత్వంతో కాలగమనాన్ని లెక్కించగలగటం గొప్ప విశేషం. ఆ వేధశాలలో ఎన్నో యంత్రాలున్నాయి. యంత్రాలంటే కట్టడాలు. చూస్తుంటే కళ్ళు తిరిగిపోయాయి. ఇది కదా మన సంపద అనిపించింది.

 

ఇక్కడ నుంచి చింతామణి గణేష్ ఆలయం కొద్ధి దూరంలోనే వుంది. ఆ గుడిలో గర్భగృహంలోని మూలమూర్తి కొంచం వింతగా అనిపించింది. ఒక మూడు, మూడున్నర అడుగుల ఎత్తున ఒక పొడవాటి కొండరాయికి అడుగుకి ఒకటి చొప్పున మూడు శిఖరాలున్నాయి. మొదటి పెద్ద శిఖరాన్ని, మూపు అంటే చాలేమో, చింతామణి గణపతి అనీ, రెండో కొమ్ముని ఇచ్ఛామణి గణపతి అనీ, మూడోది, చిన్నది అయిన కొమ్ముని సిద్ధిగణపతి అనీ అన్నారు. ఆ ఒక్క రాయికే పూర్తిగా సిందూరం పూసి మూడు గణపతి ఆకారాలను అలంకరణతో తీర్చిదిద్ది పూజిస్తారు. ఇదేకాక ప్రధాన నగరంలో బడాగణేష్ అని ఇంకో మందిరం వుంది. అక్కడ గణేష్ విగ్రహం చాలా పెద్దది. బహుశా అందుకే ఆ పేరు.

ఈ నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణ సాందీపని ఆశ్రమం. ఇక్కడే, శ్రీకృష్ణుడు, బలరాముడు, సుదాముడు కలిసి సాందీపని దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆ ఛాయలు కనిపించే ఎన్నో ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తాయి. శ్రీ ద్వారకాధీశ్ మందిర్ కూడా ఇక్కడ వుంది. ఇక్కడ ISKCON వారు చక్కటి పూజలు, భజనలు నిర్వహిస్తూంటారు. ఈ నగరంలో మరొక విశేషమేమంటే భర్తృహరి గుహలు. ఆ రోజుల్లో భర్తృహరి విరాగియై తమ్ముడైన విక్రమార్కుడికి రాజ్యం అప్పచెప్పి ఈ గుహల్లోకి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడని చెప్తారు. గుహలు చాలా ఉంటాయి. ఎంతోమంది అక్కడ తపస్సు చేసుకున్నట్టు మనకు రుజువులు కనిపిస్తూ ఉంటాయి. ఆ గుహల్లో కొద్దిపాటి వెలుగును ఏర్పాటు చేశారు కానీ ఆక్సిజన్ చాలా తక్కువ. అటువంటి చోట చాలాకాలం తపస్సు చేసారంటే బహుశా ఆనాటి వాళ్ళ లంగ్ పవర్ ఎక్కువ అయి ఉండాలి. మనం ఎక్కువ సేపు ఉండలేము. ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అక్కడ. నిజంగానే అక్కడ తపస్సుకి ఎటువంటి అడ్డంకీ ఉండదు అనిపించింది.

 

ముఖ్యంగా చెప్పుకోవలసిన మరో ఆకర్షణ సిప్రా లేక క్షిప్రానది గురించి. అన్ని ఘాట్లలోకి రామ్ ఘాట్ చాలా ముఖ్యమైంది. అక్కడ స్నానాలు చేసి పిండప్రదానాలు కూడా చేస్తారు. సిప్రానది ఒడ్డునే ఒక పురాతన సిద్ధవటం ఉంది. స్కాంధపురాణం ప్రకారం ఈ వృక్షం కిందే కుమారస్వామిని దేవసేనాధిపతిగా అభిషేకించి తారకాసుర సంహారానికి పంపారు. ఈ సిద్ధవటానికి పూజలు చేస్తారు. చెట్టు మొదలు అంతా రకరకాల సిందూరాలు పూసేసి చాలా అలంకరణ చేసి ఉంటుంది. కాసేపు పాపం ఆచెట్టుకి ఊపిరి ఎలా ఆడుతుందో అనిపించింది. ఈ సిప్రానదికి మరో ప్రత్యేకత వుంది. ఇక్కడే ప్రతి పన్నెండేళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది. ఆ రోజుల్లో ఈ నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత వుంటుంది. అప్పుడు సాక్షాత్తూ ఆ నదీజలం అంతా అమృతమయమై పోతుందని ఒక నమ్మకం. దీనినే సింహస్థ కుంభమేళా అని కూడా అంటారు, ఎందుకంటే అప్పుడు గురుగ్రహం సింహరాశిలోకి ప్రవేశిస్తుంది. సముద్రమంధన సమయంలో ఆవిర్భవించిన అమృతపు కలశం కోసం దేవదానవులు కలహించుకుంటున్నప్పుడు, ఆ కలహ సమయంలో నాలుగు చుక్కలు అమృతం, భూమిమీద నాలుగు ప్రదేశాలలో, (నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగ) పడ్డాయనీ, ఆ సందర్భగానే ఈ కుంభమేళా జరుపుతారని అంటారు. ఆదిశంకరుల చరిత్రలో కూడా ఆయన ఈ కుంభమేళాలో స్నానం చేసినట్టు వుంది. ఈ ఉత్సవంలో వేలల్లో దిగంబర నాగసాధువులు వచ్చి స్నానాలు చేసేసి వెళ్లి పోతుంటారు. ప్రపంచంలో ఎక్కువమంది ధార్మికులు ఒక్కచోట చేరే జాతరగా ఈ కుంభమేళాలకు ఒక రికార్డ్ వుంది చెప్తారు.

 

                                                              ఇక నదిని వదిలి ఊళ్లోకి వస్తే పిల్లలనూ, పెద్దలనూ కూడా ఆకర్షించే విక్రమార్క సింహాసనం, అది వున్న పెద్ద ఆడిటోరియం, బహుశా ఆ రోజుల్లో అది సభాస్థలి కావచ్చు. ఆ ప్రాంతం చూడగానే చిన్నప్పుడు చదివిన విక్రమార్క సింహాసనం కధలు, చందమామలో సీరియల్ గా వచ్చే బేతాళుడి కధలు గుర్తొచ్చాయి. ఇప్పటికీ అక్కడ ఒక పురాతనమైన సింహాసనాన్ని చూపించి దానికి పూజలు కూడా చేస్తున్నారు. ఆ సింహాసనం చుట్టూ సాలభంజికలు కూడా ఉంటాయి. ఈ మధ్యన 2016లో జరిగిన కుంభమేళా సందర్భంగా ఒక భవ్యమైన మందిరం నిర్మించి, అందులో సింహాసనంలో ఆసీనుడై వున్న విక్రమాదిత్యుడి శిల్పాన్నీ, గంటం పట్టుకుని రచన చేస్తున్న కాళిదాసు శిల్పాన్నీ పెట్టారు. కాళిదాసు నవరత్నాలలో ఒకడు. కాళిదాసు విక్రమాదిత్యుడి సభలో కవి అనీ చెప్తారు, భోజరాజు సభలో ఉన్నట్టుగా కూడా చెప్తారు. సరియైన చారిత్రిక ఆధారాలు లేవు. విక్రమాదిత్యుడు మాత్రం శకపురుషుడు. అతనిపేరుతోనే విక్రమశకం ఆరంభమయ్యింది.



ఉజ్జయిని శక్తిపీఠమని కూడా చెప్పాను కదా. కానీ ఇక్కడ శక్తి క్షేత్రాలు రెండు వున్నాయి. ఏది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటో తేల్చుకోవటం కొంచం కష్టమే. ఒకటి కాళిదాసుని కరుణించిన దేవత గఢ్ కాళిక అయితే మరొకరు విక్రముణ్ణి కరుణించిన దేవత హరసిద్ధిమాత. ఈ రెండు శక్తిక్షేత్రాల గురించి అష్టాదశశక్తిపీఠాల గురించి చెప్పినప్పుడు వివరంగా చెప్తాను.



 

మరో ముఖ్యమైన మందిరం కాలభైరవుడిది. ఈ కాలభైరవుడే ఇక్కడినుంచే వారణాసికి వెళ్లి అక్కడ శివుని ఆజ్ఞతో క్షేత్రపాలకుడయ్యాడని చెప్తారు. ఈ కాలభైరవుడికి భక్తులు మద్యం సమర్పిస్తూ ఉంటారు. ఒక పాత్రలో మద్యాన్ని పోసి ఈ కాలభైరవ విగ్రహం పెదవులకు తాకిస్తే ఆ మద్యం విగ్రహం నోటిలోకి పోతుంది. ఆ మద్యం ఎక్కడికి పోతోందో ఎవరూ ఇంతవరకూ కనిపెట్టలేక పోయారని అంటారు. మిగిలిన మద్యాన్ని అది తెచ్చినవారికే తిరిగి ప్రసాదంగా ఇచ్చేస్తారు. ఇక చూడాలి, ఆ భక్తుల గోల, ఆ ప్రసాదాన్ని పూర్తిగా తాగేసి, తూలుతూ, వాగుతూ గుడి బయట నానా గోల చేస్తుంటారు. అకారణ కలహాలు కూడా అయిపోతూ ఉంటాయి. కొంచం భయంగానే ఉంటుంది అక్కడి వాతావరణం. జాగ్రత్తగా వెళ్లి రావాలి ఈ మందిరానికి.

ఇప్పుడు అసలైన జ్యోతిర్లింగానికి వస్తున్నాను. ఇక్కడ వెలసిన శివుడు మహాకాళుడు. ఈ మందిరం చాలా ప్రాచీనమయినది. స్వయంగా బ్రహ్మయే ఈ ఆలయం నిర్మించాడని బ్రహ్మపురాణంలో వుంది. ఈ ఆలయం మొత్తం మూడు అంతస్థుల కట్టడం. మొదటి అంతస్థులో మహాకాళేశ్వర లింగం, రెండో అంతస్థులో ఓంకారేశ్వర లింగం, మూడో అంతస్థులో నాగచంద్రేశ్వర ఆలయం ఉంటాయి. ఒకటి, రెండు అంతస్థుల వరకూ అందరూ వెళ్లి దర్శనాలూ, ఇతర పూజలూ, సేవలూ చేసుకోవచ్చు. నాగచంద్రేశ్వర ఆలయం మటుకు కేవలం శ్రావణ శుద్ధ పంచమి అంటే నాగపంచమి నాడు మాత్రమే తెరుస్తారు. మిగిలిన రోజులన్నీ సర్పాలే అక్కడ ఉంటూ ఆ దేవుడిని సేవించుకుంటూ వుంటాయని ప్రతీతి. ఎవరూ ఆ జోలికి పోరు. శివపార్వతులిరువురూ ఐదు తలల తక్షకుడిపై కూర్చుని వుంటారు. పక్కనే గణేశుడు, కుమారుడు కూడా వుంటారు. ఈ నలుగురి వాహనాలు కూడా కనిపిస్తాయి. నాగ పంచమి నాడు ఈ మూర్తిని దర్శిస్తే, అన్ని కాలసర్పదోషాలూ పోతాయని చెప్తారు. ఈ శిల్పం చాలా బాగుంటుంది. నేపాల్ నుంచి ఈ శిల్పాన్ని తెప్పించారని చెప్పారు. మేమైతే దర్శనం చేసుకోలేకపోయాం. నాగపంచమి రోజు విపరీతమైన రష్ వుంటుందట.


మహాకాళేశ్వర మందిరం గర్భగృహంలో మధ్యగా పెద్ద లింగం, మూడు వైపు గోడల్లో అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి వార్ల మూర్తులు కనిపిస్తాయి. ఎదురుగా ఒక మంటపంలో నంది ఉంటుంది. దాన్ని నంది మంటపం అంటారు. అభిషేకాలు తప్ప మిగిలిన అన్ని సేవలూ భక్తులు ఈ నంది మండపం నుంచే చూస్తూ వుంటారు. తెల్లవారుజాము నాలుగుగంటల నుంచీ రాత్రి పదకొండుగంటల దాకా గుడి తెరిచి ఉంటుంది. ఇక్కడి భస్మహారతి చాలా ప్రసిద్ధం. దానికోసం భక్తుల సంప్రదాయ దుస్తులు ధరించి పొద్దున్న మూడింటి నుంచే ఆలయం దగ్గరకు చేరుకుంటారు. నాలుగింటినుంచీ ఆ భస్మ హారతి టికెట్ వున్న వారందరినీ లోనికి పంపిస్తారు. ఈ సేవ ఉచితమే గానీ ముందుగా బుక్ చేసుకోవాలి. భక్తులు ముందు మహాకాళుడ్ని దర్శించుకుని అక్కడే వున్న నీటితో జలాభిషేకం చేసి, నందిమండపంలో కూర్చుంటారు. సుమారు ఒక గంటన్నరపాటు ఈ పూజ సాగుతుంది. మేము ఆరోజు నంది వెనకనే, మొదటి లైన్లో కూర్చున్నాం. ఒక పూజారి ఆ సీట్ బుక్ చేసే సహాయం చేసాడు. ఆ తరువాత లింగానికి ఎన్నో ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత పూజ చేశారు, అలంకరణ చేశారు. అప్పుడు ఒక నాగ సాధువు , వీళ్ళనే అఘోరా లంటారు, వచ్చి భస్మం తెచ్చి ఇచ్చాడు. ఈ భస్మం ఆ కిందటి రోజు కాలిన తాజా చితిలోని భస్మం. ఈమధ్య కాలంలో ఆవుపేడ నుంచి చేసిన విభూతితో కూడా ఈసేవ చేస్తున్నారని చెప్పారు. ఆ తరువాత ఒక తెల్లటి బట్ట మూటలో ఆ భస్మాన్ని ఉంచి ఆ మూటను వేగంగా దులుపుతూ లింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు. ఆ తరువాత ఎన్నో రకాలుగా హారతులిచ్చారు. ఈ గుడిలో కూడా సేవలు ఆన్ లైన్ లో చూసే సౌకర్యం వుంది. ఆ లింక్ ద్వారా రోజూ ఇంట్లో నుంచే తెల్లవారు జాము నాలుగింటినుంచే భస్మ హారతితో సహా అన్ని కార్యక్రమాలూ లైవ్ లో చూసుకోవచ్చు. ఆ లింక్ ఇదీ.

ఈ భస్మహారతి కార్యక్రమాన్ని ఎందుకో మరి, ఆడవాళ్లను చూడనివ్వరు. నన్ను కూడా ఒక పూజారి వచ్చి చెంగుతో తల, మొహం కప్పుకోమని చెప్పాడు. నేను ఎప్పుడూ గుళ్లకు వెళ్ళేటప్పుడు తప్పకుండా పట్టుచీరలు కట్టుకుంటా, మడిక్కూడా పనికొస్తాయని. అంత లావు కంచిపట్టుచీర, దాన్నిండా జరీ, ఆ చీరలో నుంచి మామూలుగా కూడా ఏమీ కనపడదు. ఐనా ఆ రోజు నాకు ఆ భస్మహారతి ఆ చీర చెంగులో నుంచి కూడా స్పష్టంగా కనిపించింది. మహాకాళుడే నన్ను చూడమని అనుజ్ఞ ఇచ్చాడు అనిపించింది. ఆ హారతి తరవాత ఆ అఘోరా, గర్భగుడిలో చుట్టూ పడిపోయిన బూడిదను సేకరించాడు. తిరిగి బైటకు వచ్చి ఆ బూడిదను కొందరికి ప్రసాదంగా ఇచ్చాడు. కొందరికి పూలు ఇచ్చాడు. అందరూ ఆయనకు నమస్కారాలు పెట్టాం. ఆ అఘోరా మాత్రం ఎవరితో ఏమీ మాట్లాడలేదు. కాస్సేపు అక్కడే కూర్చుని ధ్యానం చేసుకున్నా.

ఈ లోపు మా పూజారి మమ్మల్ని మళ్ళీ వెనక్కు పిలిచి మా గోత్రనామాలతో మహాకాళ లింగానికి యధావిధిగా పంచామృతాలతో అభిషేకం చేయించాడు. మొత్తం అన్నీ అనుకున్నట్టే జరిగాయి. చాలా సంతోషంగా అనిపించింది. ఒక చిన్న పొరపాటు మాత్రం జరిగింది, అయినా అది మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదనుకోండి. అదేమిటంటే, మేము నెట్ లో చూసి హోటల్ విక్రమాదిత్య లో రూమ్ బుక్ చేసుకున్నాం. తీరా అక్కడికెళ్తే, ప్రతి గది బయట ఒకటి, రెండు, మూడు, ఐదు, పది ఇలా మన కాలభైరవ ప్రసాదం ఖాళీ సీసాలు చాలా కనిపించాయి. ఇక భయం వేసింది. అప్పుడు మా డ్రైవర్ సాయంతో గుడికి సరిగ్గా ఎదురుగా వున్న ఒక హోటల్లో గది తీసుకుని వున్నాం. హోటల్ ఎదురుగా ఇంట్లోంచి భోజనం వగైరాలు వచ్చాయి. చిన్నరూమ్ అయినా సద్దుకుని వున్నాము. మొత్తానికి ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న ఉజ్జయిని సందర్శనం, మహాకాళుని భస్మ హారతి చూడ్డం సంపూర్ణం అయ్యింది.

ఓం శ్రీ మహాకాళేశ్వరాయనమః


ఇక ఇప్పుడు నాలుగో జ్యోతిర్లింగం ఓంకారమమలేశ్వరం చూద్దాం.


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650












కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

తిరువణ్ణామలై-అగ్నిలింగం

శ్రీశైలే మల్లికార్జునమ్