త్య్రంబకం గౌతమీ తటే

10. త్య్రంబకం గౌతమీ తటే......

ఈ ఆలయానికి మేము మొదటిసారిగా షిర్డీ వెళ్ళినప్పుడు వెళ్లాం. అప్పుడు 2002లో షిర్డీ, నాసిక్, శనిశింగణాపూర్, త్య్రంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, ఎల్లోరా, ఔరంగాబాద్ లకు ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకుని వెళ్లాం. ఈ ప్రాంతాలన్నీ చూడటం అదే మొదటిసారి. నేను త్య్రంబకేశ్వర్ చూసిన తొలిసారి అద్భుతమైన అనుభవం కలిగింది. అది ముందు ముందు చెప్తాను. ఎవరికైనా 
త్య్రంబకం అనంగానే ముందుగా  గుర్తొచ్చేది ఈ శ్లోకం. 

త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, 
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 

అంటే, ఆ లయకారకుడైన శివుణ్ణి ప్రార్ధిస్తూ, తండ్రీ, ఏవిధంగా దోసపండు బాగా పండిన తరువాత దానంతట అదే తీగనుంచి సునాయాసంగా ఊడి పడిపోతుందో, అంత సులభంగా నా దేహం కూడా తేలికగా పడిపోయేలా చూడు అని. ఎంత బావుంది కదా ఈ భావం. ఉన్నన్నాళ్లూ హాయిగా జీవించి సునాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టేలా ఆశీర్వదించు నాయనా అని.  ఈ సందర్భంగా మరో శ్లోకం కూడా గుర్తొస్తోంది. దాన్ని శ్లోకం అనేకన్నా ప్రార్ధన అంటేనే బాగుంటుంది.  అదేంటంటే,  

అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, 
దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వర||

ఈ శ్లోకాన్ని ఈమధ్య కొంతమంది రకరకాలుగా వాడుతూ కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఎవరైనా తలచుకోదగిన శ్లోకం. సరే మనం మనకథ లోకి వెళదాం. యధాప్రకారం శ్రీ ఆది శంకరాచార్యుల వారిని  తలచుకుందాం. ఈ క్షేత్రం గురించి ఆయన చెప్పిన శ్లోకం ఇది.  

సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్య్రంబకమీశమీడే ||

పశ్చిమకనుమల్లో వున్న సహ్యాద్రి పర్వతశిఖరాలపై, గోదావరీతీరంలో స్వచ్ఛంగా, ఎల్లప్పుడూ పచ్చగా వుండే  ఆ  త్య్రంబకేశ్వరంలో కొలువై, తనను దర్శించిన భక్తులందరి పాపాలు నాశనం చేస్తున్న  ఆ త్య్రంబకేశ్వరునికి నమస్కరిస్తున్నాను అని. 

ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఆ విషయం మొదటి వీక్షణంలోనే తెలిసిపోతుంది. శిల్పం చాలా బావుంటుంది. మొత్తం ఆలయంలోనే ఒక తెలియని ఆకర్షణ వుంది. ఆ త్య్రంబకేశ్వరుడు మన మీద ఏదైనా వశీకరణ ప్రయోగం చేశాడా అనిపిస్తుంది. అంత ఆకర్షణ ఆ దేవుడిలో, ఆ గుడిలో. మొదటిసారి వెళ్ళినప్పుడు మేము లోపలికి కాలు పెట్టీ పెట్టంగానే, ముఖమంటపం మధ్యలో ఒక పెద్ద కూర్మం. దాన్ని స్పర్శించంగానే ఒక ట్రాన్స్ వచ్చేసింది. పైగా అక్కడ గర్భగృహంలో కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం, అదీ సంప్రదాయ దుస్తులు ధరించిన వారికి మాత్రమే. ప్రస్తుతం ఉదయం ఆరు, ఏడు గంటల వరకు మాత్రమే అభిషేకాలకు అనుమతి. ఆ తరువాత పూజారులకు తప్ప లోనికి ఎవరికీ ప్రవేశం లేదు. పైగా అక్కడ, ఆరోజు ఎవరో మృత్యుంజయ పూజ చేయించి, మృత్యుంజయ జపం చేయిస్తున్నట్టున్నారు. ఆ ముఖ మంటపంలో ఒక మూలగా సుమారు పది, పన్నెండు మంది ఘోషగా ఏకస్వరంతో, ఆపకుండా  మృత్యుంజయస్తోత్రం చదువుతున్నారు. ఆ జపం వింటుంటేనే నాకు పూర్తిగా పక్కన ఏమౌతుందో ఏమో తెలియలేదు. పూర్తిగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. ఎటూ చూడకుండా సూటిగా ముందుకు నడుస్తున్నాను. అక్కడ గర్భగృహం ఒక పది పదిహేను అడుగులు కిందకు ఉంటుంది. పైగా గర్భగృహంలో స్త్రీలకు ప్రవేశం లేదు. నేను అలాగే కిందకు చూస్తూ ఆ లింగాన్ని తదేకధ్యానంతో 
చూస్తూ ముందుకు నడుస్తున్నాను. ఉన్నట్టుండి నా పక్క నుంచి నన్ను దాటి ఒక సాధువు కిందకు ఢామ్మని దూకేసాడు. ఆ దూకటంతో, నాకు ఒక్కసారి విసురుగా గాలి తగిలింది. అప్పుడు స్పృహ వచ్చింది. చుట్టూ చూసుకుంటే, ఒక్క క్షణం దాటితే, నేనూ అలాగే కింద పడిపోయేదాన్ని అని అప్పుడు తెలిసింది. బహుశా ఆ శివుడే ఆ అఘోరాను పంపి నన్ను ట్రాన్స్ లో నుంచి బైట పడేసాడేమో అనిపించింది. ఆ తరువాత మామూలుగా పూజ చేయించుకుని బైటకు వచ్చేసాము. ఈ అనుభూతి ఈ రోజుకీ ఫ్రెష్ గా వుంది నా మైండ్ లో. 'దర్శనం అంటే అదీ' అని నాకు అప్పుడు అనిపించింది. ఇప్పటికీ అనిపిస్తుంది. కానీ అన్నిచోట్ల అలాంటి అనుభూతి రాదు. అప్పటినుంచి ఎప్పుడు ఏ శివాలయానికి వెళ్లినా శివ పంచాక్షరీ స్తోత్రం చదువుకోవటం అలవాటు అయ్యింది. 

తరువాత రెండోసారి వెళ్ళినప్పుడు కూడా మొదటిసారంత అద్భుతమైన అనుభూతి కలగలేదు గానీ, విపరీతమైన సంతోషం మాత్రం స్పష్టంగా తెలిసింది, ఆనందమయ కోశం తెరుచుకుందా అన్నట్టు. మూడోసారి మాత్రం అంతా ముందుగానే ప్లాన్ చేసి తెల్లవారుఝామునే వెళ్లి అభిషేకం చేసుకున్నాం. అక్కడి పూజారులే మడిబట్టలు ఇచ్చి రమేష్ గారి చేత కట్టించి, మమ్మల్ని కూర్చోబెట్టి సంకల్పం చెప్పించి, తరువాత ఆయన్ను కిందకు గర్భాలయానికి తీసుకువెళ్లి, అభిషేకం చేయించారు. ఆయనది ఎంత అదృష్టమో, చక్కగా ఆ లింగాలను తాకి, అందులో మహేశ్వరుని కింద నుంచి ప్రవహిస్తున్న గోదావరిని తాకి ఆ మూడు లింగాలకూ ఎంచక్కా  పంచామృతాభిషేకం చేసి ఆ తరువాత  అలంకరణ చేసి పైకి వచ్చారు. నేను ఇవ్వన్నీ పైనుంచి అద్దంలో చూస్తూ కూర్చున్నా. ఆయన పైకి వచ్చాక మా పూజారి నన్నుకూడా వీలైనంత దగ్గరికి తీసుకు వెళ్లి దర్శనం చేయించాడు. మళ్ళీ ఆ కూర్మం పక్కనే మమ్మల్నిద్దరినీ కూర్చోబెట్టి ఉచ్యైస్వరంతో  యధావిధిగా అర్చన, ఆశీర్వచనం చేసాడు. ఆయన తన కంఠంతో గట్టిగా స్తోత్రాలు, మంత్రాలు చదువుతుంటే, చుట్టుపక్కల అందరూ కూడా కాసేపు అన్నీ ఆపేసి వింటూ ఉండిపోయారు. చాలా, చాలా సంతృప్తి కలిగింది. అసలైన దర్శనం అయ్యింది అనిపించింది. ఆ పురోహితుడు శ్రీ సంకేత్ గురూజీ, 98226 94088. సంకేత్ పూజ చాలా బాగా చేయించాడు. ఆయనకు సంప్రదాయం, పద్ధతులు అన్నీ చక్కగా తెలుసు.  

పూజ తరువాత బైటకు వస్తూనే ఆ మెట్ల పక్కనే వున్న పురాతన కాలపు నమూనా లింగం చూసి దణ్ణం పెట్టుకున్నాం. గర్భగృహంలోకి అనుమతి లేనివారికి, ముఖ్యంగా ఆడవారికి అసలు ఆ లింగం ఎలా ఉంటుందో తెలపాలనో, ఏమో ఆ రోజుల్లోనే ఆలయ ప్రాంగణంలో ఒక నమూనా లింగం బయట ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకత ఏమిటీ, లింగమే కదా అనుకుంటారేమో, కానీ ఈలింగం నిజంగానే ప్రత్యేకమైనది. ఒక పెద్ద పానవట్టం, దానిలో ఒక రుబ్బురోలు లాంటి గుంట, ఆ గుంటలో మూడువైపులా మూడు చిన్న చిన్న సాలగ్రామాలు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా ఉంటాయి. అందులోనూ మాహేశ్వర సాలగ్రామం కింద నుంచి గోదావరీ నది ఒక ఊటలా నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గుంటలో నీరు ఎప్పటికప్పుడు వూరుతూ ఉంటుంది. అదే మనందరికీ తీర్థంలా ఇస్తారు. ఆతరువాత ఆలయం లోని మిగిలిన ఉపాలయాలు కూడా చూసుకుని బయటకు వచ్చేసాం.  



ఈ ఆలయం లో కొన్ని దోషాల పరిహారార్ధం విశేషపూజలు చేస్తారు. కాలసర్పదోషం, పితృదోషం, ఆయుష్షు కోసం మృత్యుంజయ జపాలు, రాహు కేతు పూజలు వంటివి ఇక్కడ చేస్తారు. ఇక్కడ అవి చాలా ప్రసిద్ధం. తరువాత దగ్గర లోనే వున్న కుశావర్తకుండానికి వెళ్లాం. కుంభమేళా జరుగుతున్నప్పుడు ఈ కుశావర్త కుండంలోనే అఘోరాలు, నాగసాధువులు మొదటి షాహీస్నాన్  చేస్తారు. ఆ తరువాతే కుంభమేళా మొదలు అవుతుంది. ఈ కుంభమేళాను కూడా సింహస్థ్ కుంభమేళా అంటారు. సింహరాశిలోకి గురువు మారినప్పుడు ఈ కుంభమేళా జరుగుతుంది. గౌతమమహర్షి తపస్సు ఫలితంగా బ్రహ్మగిరి పర్వతాలపై గోదావరీ నది ఉద్భవించినప్పుడు అది కనిపించినట్లే కనిపించి మరుక్షణంలో మాయమై పోయేదట. అలా రెండు మూడు సార్లు జరిగాక, ఈ కుశస్థలి ప్రాంతం వరకు రాంగానే ఆ మాయమైపోయే నదిని ఆపటానికి గౌతముడు చుట్టూ కుశలు, అంటే దర్భలు వేసి అడ్డుకట్ట వేశాట్ట. దానితో అక్కడ గోదావరి ఆగంగానే, దానిలో గౌతముడు స్నానం చేసి తన గోహత్యాపాతకం పోగొట్టుకున్నాట్ట. అందుకే ఆ కుండం పేరు కుశావర్తం. ఈ త్య్రంబకేశ్వర ఆలయానికి కూడా వెబ్ సైట్ వుంది. ఆ లింక్ ఇక్కడ ఇస్తున్నాను. నాకు మాత్రం ఈఆలయం ఎప్పుడూ ప్రత్యేకమే.  https://www.trimbakeshwartrust.com/  ,  https://trambakeshwar.com/

ఇవన్నీ చూసాక 30 కిలోమీటర్ల దూరంలో వున్న నాసిక్ కి వెళ్లాం. నాసిక్ లో ఎటు చూసినా శ్రీరాముని ఆనవాళ్లే.  ఇక్కడే ఖర దూషణులనీ, వారి పరివారాన్నీ రామలక్ష్మణులు చంపారని అంటారు. ఆ యుద్ధంలో రాముడు కోపంతో నల్లగా అయిపోయాడని, అందుకే అక్కడి రామాలయంలో రాముడు నల్లగా ఉంటాడని అంటారు. ఆ ఆలయంలో వున్న రాముడి పేరు కాలారామ్. ఈ ఆలయంలో ఒక పెద్దగంట కనిపిస్తుంది, భీమాశంకరం ఆలయంలో లాగా. ఇక్కడే పంచవటి, సీతాగుహ, తపోవన్ వున్నాయి. ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కూ, చెవులూ కోశాడని చెప్తారు. అందుకే ఈ వూరికి నాసిక్ అని పేరొచ్చిందిట. సీతాగుహలోనే యుద్ధసమయంలో సీతను దాచి పెట్టాడని అంటారు. మనం కూడా భూగర్భంలో వున్న ఆ గుహలోకి వెళ్లిరావచ్చు. ఆప్రాంతంలో ఐదు వటవృక్షాలున్నాయి. అందుకే అది పంచవటి అయ్యింది. ఆ చెట్లకు నంబర్లు కూడా వేసి పెట్టారు. ఇక్కడి కపాలేశ్వరస్వామి ఆలయంలో ఒక ప్రత్యేకత వుంది. ఇక్కడ నంది శివుడికి గురువు స్థానంలో ఉంటాడు. దానికీ ఒక కథ చెప్తారు. శివుడికి బ్రహ్మతలను తుంచేసిన తరువాత బ్రహ్మహత్యా పాతకం పట్టుకుంది. అది పోవడానికి శివుడు ఎన్నిచోట్ల ప్రయత్నం చేసినా ఆ పాతకం వదలలేదు. ఒకసారి నంది దూడతో శివుడు ఈ గోదావరిలో స్నానం చేస్తే ఆ పాతకం పోతుంది అని చెప్పడం విన్నాడు. వెంటనే శివుడు గోదావరిలో స్నానం చెయ్యంగానే ఆ పాతకం పోయి శివుని చేతికి అంటుకున్న కపాలం ఊడిపోయిందిట. ఇదే కథ మేము బదరిలో వున్న బ్రహ్మకపాలంలో కూడా విన్నాం. అప్పుడు శివుడు నందికి ఆ ఆలయంలో గురువు స్థానం ఇచ్చి గౌరవించాడుట. నాసిక్ లోని ఈ కపాలేశ్వరస్వామి గుడిలో మాత్రం నంది శివుడి ఎదురుగా ఉండదు, పక్కన ఉంటుంది. నాసిక్ లోని ఇతర ప్రదేశాలు కూడా చూశాం. 

అక్కడి నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి అమ్మవారి ఆలయం వుంది. ఈ ఆలయం కొండమీద వుంది. సుమారు పదకొండు, పన్నెండొందల మెట్లు ఎక్కాలి. అందుకే మేము మొదట్లో అన్ని మెట్లు ఎక్కలేక ఆ గుడికి వెళ్లలేకపోయాం. దేవుడి పిలుపు ఉంటేనే దేవాలయానికి వెళ్తాం లేకపోతే వెళ్లలేం అంటూ ఉంటానే, దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ అమ్మవారికి మాపై కృప కలిగింది. అందుకనే ఆవిడ దర్శనానికి వెళ్లగలిగాం. ఆవిడ పిలుపు లేనిదే వెళ్లగలిగేవారమా. ఈ మధ్యనే ఈ గుడికి ఒక రోప్ వే వేశారు. మాకు ఆ విషయం తెలియదు. మా డ్రైవర్ ఆ విషయం చెప్పి, తానూ మాతో గుడికి వచ్చాడు. పైగా గుడిలో అతని కజిన్ పోలీసుట, పైగా ఆ రోజు సెక్యూరిటీ డ్యూటీలో వున్నాడు. మా అదృష్టం కొద్దీ మేము వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ కూడా లేదు. మహారాష్ట్రలో వున్న ఐదు శక్తిక్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. మిగిలిన నాలుగూ అంబాజోగై, తుల్జాపూర్ భవానీ, కొల్హాపూర్ మహాలక్ష్మి, మాహుర్ లోని ఏకవీరిక. ఈ ఏకవీరికనే రేణుకాదేవి అని కూడా అంటారు. చివరి రెండూ అష్టాదశ శక్తిపీఠాలు. మిగిలిన క్షేత్రాలు మూడూ కూడా 51 శక్తి పీఠాల లోనివి. అంబాజోగై మాత్రం దక్షయజ్ఞం కన్నా ముందు నుంచీ వున్న ఆలయం. 


ఈ సప్తశృంగి అమ్మవారు ఉగ్రంగానూ, ప్రసన్నంగానూ కూడా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో...
ఈ దేవతే మహిషాసురమర్ధిని. సప్తశృంగి శిఖరాలలో ఆ మహిషాసురుణ్ని చంపడానికి ఈ దేవత అవతరించిందట. మహిషాసురుడు పారిపోతుంటే, కొండలో నుంచి కూడా ఈ సప్తశృంగి అమ్మవారు రంధ్రం చేసి మరీ దూరిపోయిందట. దానికి సాక్షిగా ఈ రోజుకీ ఆ కొండలో చాలా తమాషాగా, ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది. ఆ అమ్మవారిని చూస్తే మనసు నిండిపోయింది. పద్దెనిమిది చేతులతో వెలసిన మహా శక్తిశాలి. పెద్దవిగ్రహం మొత్తం అంతా సిందూరం పూసి ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. మాకు చాలా మంచి దర్శనం అయ్యింది. ఆ అమ్మవారిని దర్శించుకున్న తరువాత తిరిగి రోప్ వే లో కిందకు వచ్చేసాం. ఆ డ్రైవర్ చెప్పకపోతే మాకు ఈ దర్శనభాగ్యం కలిగేది కాదు. అతనికి మనస్పూర్తిగా థాంక్స్ చెప్పుకున్నా. ఎన్నాళ్ళ నుంచో చూడాలని వున్నా, ఆ మెట్ల సంఖ్యకి భయపడి వెళ్ళలేదు. మా అశక్తత అమ్మవారు గ్రహించి మాకు ఆవిడ దర్శనం సులభం చేసింది. ఆ చల్లని తల్లికి నమస్కారం. ఈ ఆలయానికి వున్న వెబ్ సైట్ లింక్ కూడా యిస్తున్నాను, చూడండి. https://www.saptashrungi.net/                         
ఓం త్య్రంబకేశ్వరాయనమః, ఓం శ్రీరామచంద్రాయనమః,   
ఓం శ్రీ గోదావరీమాతాయైనమః, ఓం శ్రీ సప్తశృంగిమాతాయైనమః 

ఇక ఈ యాత్రను ముగించి హిమాలయేతు  కేదారం అనుకుంటూ తరువాతి జ్యోతిర్లింగ దర్శనానికి వెళదామా. 

   
  
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650







   

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం