ఓంకారమమలేశ్వరం
4. ఓంకారమమలేశ్వరం......
ఇప్పుడు ఆ శ్లోకంలోని నాలుగో క్షేత్రాన్ని చూద్దాం. అదే మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరంలో వున్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. నర్మదానది ప్రవహించే ప్రాంతం. నర్మదానది ఇక్కడ వున్న ఒక కొండ వల్ల రెండుగా చీలి నర్మదా, కావేరి అనే రెండు పేర్లతో ప్రవహించి మళ్ళీ ఇక్కడే ఆ రెండు పాయలూ కలిసి తిరిగి నర్మదగానే ప్రవహిస్తుంది. ఈ కొద్ది ప్రాంతం అంతా ఒక లంక వలే ఏర్పడి నదికి ఒకవైపు కొండమీద ఓంకారేశ్వర లింగం, నదియొక్క రెండోవైపు భూమిమీద మమలేశ్వరలింగం ఉంటాయి. ఈ కావేరి వేరు, కర్ణాటక, తమిళనాడులో ప్రవహించే కావేరీనది వేరు. కేవలం పేరు ఒక్కటే, అంతే. స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ కూడా పుష్కలం. ఈ కొండ ॐ అనే ఆకారంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా ఓంకారేశ్వరం అంటారు. ఆదిశంకరులు ఈక్షేత్రం గురించి ఈవిధంగా చెప్పారు.
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ||
ఈ శ్లోకార్ధం ఏమిటంటే, నిత్యమూ వసంతాన్ని తలపించే ప్రదేశంలో కావేరీ, నర్మదా నదుల సంగమ స్థలమైన మాంధాతృపురిలో సజ్జనులందరినీ తరింప చేయటానికి వెలసిన ఓంకారేశ్వరునకు ప్రణామాలు అని. ఇక్కడ మధ్యప్రదేశ్ టూరిజం వారి హోటల్ వుంది. అక్కడ అన్ని వసతులూ వున్నాయి. మేము అక్కడ దిగి మా యాత్ర మొదలుపెట్టాము. అక్కడ నర్మదను దాటితే కానీ జ్యోతిర్లింగ మందిరం చేరుకోలేము. నదిని దాటడానికి పడవలు చాలా వున్నాయి. ఆ పడవల్లోనే నర్మదానదీ పరిక్రమ కూడా చేశాము. అప్పుడు ఆ కొండ ఓంకార ఆకారంలో ఉందని ఆ పడవలు నడిపేవారు చూపిస్తారు. మమ్మల్ని కాస్త లోపలికి పెద్ద పెద్ద రాళ్లు వున్న ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ స్నానం చేయమన్నారు. నిజంగానే అక్కడ లోతు ఎక్కువ లేదు. మేము మామూలుగానే అలవాటుగా ఎందుకైనా మంచిదని, తోడుంటాడని, మా క్యాబ్ డ్రైవర్ సోనూని మాతో తీసుకు వెళ్లాం. రమేష్ గారు కొంచం నీళ్ళల్లోకి జారారు. సోనూ వెంటనే పట్టుకున్నాడు. మునిగిపోయే లోతూ, ప్రమాదమూ లేదు కానీ, పడితే దెబ్బలు తగులుతాయి కదా. థాంక్స్ టు సోను. స్నానాలు అయ్యాక మమలేశ్వర్ సేతు ద్వారా నడిచి కొండ మీదకు డైరెక్ట్ గా చేరుకున్నాం. ఈ మమలేశ్వర్ సేతువు నిర్మాణంలో ఎక్కడా పిల్లర్లు లేవు. ఇటు భూమీ, అటు కొండా రెండు వైపుల నుంచి గట్టి లావైన ఇనపమోకులతో గట్టిగా బిగించి కట్టబడి ఉంటుంది. ఐదారుగురు మనుషులు నడవగల వెడల్పుతో ఉంటుంది. దీన్ని భక్తుల సౌకర్యార్థం 2004 కుంభమేళా సమయంలో నిర్మించారట.
ఆ బ్రిడ్జి దాటి కొండకు చేరగానే ఒక సన్నని త్రోవ మనల్ని గుడి దగ్గరకు తీసుకువెళ్తుంది. మేము వెళ్లిన రోజు ఎక్కువమంది జనం లేరు. మేము చాలాసార్లు దర్శనం చేసుకున్నాం. అక్కడ ఒక పూజారి మమ్మల్ని తీసుకువెళ్లి స్థలగాధ చెప్పి, ఒక మండపంలో కూర్చోబెట్టి సంకల్పం చెప్పించి మాంధాత విగ్రహం చూపించాడు. శ్రీరాముడి పూర్వీకులైన ఇక్ష్వాకు కుల రాజు మాంధాత ఈ కొండపై తపస్సు చేసుకుని ఓంకారేశ్వరుడు ప్రత్యక్షమైయాక ఆ దేవుణ్ణి అక్కడే కొలువై ఉండమని కోరాట్ట. అప్పటినుంచీ మాంధాత కోరిక మేరకు ఓంకారేశ్వరుడు ఇక్కడే స్థిరంగా వుండి భక్తులను కరుణిస్తున్నాడట. ఆ ఊరిపేరు ఆరాజు పేరు మీద మాంధాతృపురి అని వచ్చిందని చెప్పాడు. అందుకే కాబోలు ఆది శంకరులు తన శ్లోకంలో ఈ లింగాన్ని తన తరువాత తరాల వారు కూడా తేలికగా గుర్తించటానికి వీలుగా కావేరీ నర్మదా నదీ సంగమం వద్ద మాంధాతృపురిలో అని చెప్పాడు. తరువాత మమ్మల్ని లోపలి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వద్దకు తీసుకువెళ్ళాడు. నిరంతర అభిషేకాలు, రాపిడి వల్ల లింగం అరిగిపోతోందని చుట్టూ గాజుపలకలతో దడి లాగా కట్టి ఉంచారు. కానీ లింగానికి అడుగు దూరం వరకూ వెళతాము. అభిషేకాలు చేయటానికి సోమనాథ్ లో లాగా చిన్న చిన్న పైపులు పెట్టారు. మనం మనదగ్గర వున్న పాత్రలో నీరు పోస్తే అది పైపుల ద్వారా స్వామిని అభిషేకిస్తుంది. అక్కడి నుంచే అభిషేకం పూజా చేయించారు. అన్నీ సంతృప్తిగా జరిగాయి. లింగం చిన్నదే గానీ చూడంగానే స్వయంభూలింగం అని తెలుస్తోంది. ఒక రకం దివ్యమైన శక్తి, స్పర్శ స్పష్టంగా తెలిసింది. బైటకు వచ్చినా మనసు నిండక మళ్ళీ మళ్ళీ వెళ్లి దర్శనం చేసుకున్నాం. అయినా చివరకు వదలలేక వదలలేక వెళ్లినట్టు బయటకు వచ్చాము.
ఆ రాత్రి అక్కడ నిద్ర చేసి, మరునాడు వూళ్ళో వున్న ఇతర ముఖ్య దేవాలయాలను చూసుకుంటూ మమలేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళాము. పూర్వకాలంలో నర్మదానది ఉధృతంగా ప్రవహిస్తూ వున్న రోజుల్లో కొండ మీది ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకోవడం అసాధ్యమయ్యేదట. ఆదిశంకరులు తన గురువు గోవిందపాదుణ్ణి మొదటిసారిగా కలుసుకుని సన్యాసదీక్ష తీసుకున్నది ఇక్కడనే అని శంకరచరిత్రలో కనపడుతుంది. అప్పుడు అది శంకరులు చెప్పిన నిర్వాణషట్కము ఇక్కడి ఆలయం గోడలమీద చెక్కించారు. శంకరులు ఈ ప్రాంతంలోనే ఎన్నో స్తోత్రాలూ, రచనలూ చేసాడని ప్రతీతి. నిరంతరమూ ఓంకారేశ్వరుణ్ణి దర్శించుకునేవారికి ఎటువంటి వ్రతభంగమూ కలగకుండా, ఆదిశంకరులు ఒడ్డుపైన మమలేశ్వరుణ్ణి ప్రతిష్టించి, ఈ మమలేశ్వరుణ్ణి దర్శనం చేసినా ఓంకారేశ్వరుణ్ణి దర్శనం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పారు. అప్పటినుంచీ అందరూ ఈ క్షేత్రాన్ని కూడా సందర్శించడం అలవాటు అయిపోయింది. కానైతే ఈ రోజుల్లో నది ఉధృతంగా వున్నప్పుడు కూడా నదిని దాటే సౌకర్యాలు వచ్చాయి. ఇక్కడ రెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసినందువల్ల మేము దర్శనం చేసిన జ్యోతిర్లింగాల సంఖ్య ఒకటి పెంచాను. మరో రెండు కూడా, ఇలాగే రెండు రెండు చూసాము. అందుకే మొత్తం పదిహేను జ్యోతిర్లింగాలను చూశామని ముందు మాటలో చెప్పాను.
ఇక్కడ అదిశంకరుల గుహ వున్నది. ఆది శంకరులు చాలాకాలం ఇక్కడ తపస్సు చేసాడు. ఇక్కడ ఋణముక్తేశ్వర ఆలయం కూడా వుంది. ఆ ఆలయంలో స్వామిని పూజిస్తే జన్మజన్మల ఋణం తీరిపోతుందనీ, ఋణాలు తీరిపోవటం వల్ల మోక్షప్రాప్తి కలుగుతాయనీ చెప్పారు. ఈ క్షేత్రంలో కూడా ఆలయానికి ఒక వెబ్ సైట్ వుంది. లైవ్ దర్శన్ కూడ వుంది. కానీ అది అంత చక్కగా పని చేయటం లేదు. అయినా ఒకసారి ప్రయత్నించి చూడండి. లైవ్ దర్శనం కాకపోయినా, కనీసం ఆలయం ఇతర వివరాలూ, బుకింగ్ సౌకర్యాలూ తెలుస్తాయి.
ఓం శ్రీ మహాకాళేశ్వరాయనమః, ఓం శ్రీ మమలేశ్వరాయనమః,
ఓం శ్రీక్షిప్రాయైనమః
ఓం శ్రీక్షిప్రాయైనమః
తరువాత మనం వైద్యనాథ్ ధామ్ గురించి చెప్పుకుందాం.
భట్టిప్రోలు విజయలక్ష్మి9885010650
భీమశంకరం అక్షరాలు తగిన సైజులో ఉన్నాయి. తేలికగా చదవగలిగాను.
రిప్లయితొలగించండి