అమరనాథ్ దర్శనం
అమరనాథ్ దర్శనం
మేము చేసిన అన్ని యాత్రల్లోకీ కఠినమైనదీ, ప్రమాదభరితమైనదీ ఈ అమరనాథ్ యాత్ర, దీని తరువాత ఆ జాబితాలో రెండవ ప్రమాదభరితమయినదిగా యమునోత్రి వస్తుంది. మిగిలిన అన్ని యాత్రలు దాదాపు కొద్దో, గొప్పో ఒకలాంటివే, కానీ అంత ప్రమాదమైనవి కావు. దానికి తోడు, ఈ అమరనాథ్ యాత్రకు నియమ నిబంధనలూ ఎక్కువే. మా అమరనాథ్ యాత్ర మాత్రం చాలా తమాషాగా, అనూహ్యంగా జరిగింది. మే, జూన్ 2014 లో గుజరాత్, మధ్యప్రదేశ్ లలోని అన్ని దర్శనీయ క్షేత్రాలూ దాదాపు మూడు వారాలపాటు దర్శించుకుని ఇంటికి వచ్చాం. మా పెద్దబ్బాయి మమ్మల్ని చూసి, ఇన్నాళ్లు అదీ మాంఛి ఎండల్లో గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలు తిరిగి వచ్చినా శుభ్రంగా ఫిట్ గా వున్నారు. ఈ వారమే అమరనాథ్ యాత్ర కూడా అనౌన్స్ చేశారు, అక్కడికి కూడా వెళ్ళచ్చు గదా అన్నాడు. అసలు మాకు అప్పటి దాకా మాకు వెంటనే మరో యాత్ర గురించిన ఆలోచన కూడా లేదు. నేనింకా అప్పటికి రిటైర్ అవలేదు. టైం, లీవ్ ఈ రెండూ ఎలా అంటే, వాడు ఫ్లైట్లలో వెళ్తే, ఎక్కువ టైం అక్కరలేదుగా అన్నాడు. మావారికి ఆలోచన రావటమే ఆలస్యం, కంప్యూటర్ తెరిచి బ్రౌజింగ్ మొదలుపెట్టారు. చివరకు అమరనాథ్ యాత్ర కోసం ఏదో ఒక ఆన్ లైన్ ట్రావెల్స్ కంపెనీ దొరికింది. వాళ్ళు ఏమేం కావాలో లిస్ట్ పంపించారు. ఇదంతా విని మా కజిన్స్ ఇద్దరు వస్తామన్నారు. చాలా సంతోషపడి మాకూ కంపెనీ ఉంటుంది అని ఆనందపడ్డాం. ట్రావెల్స్ వాళ్ళు ముందు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు పంపించండి, స్టార్ట్ అవబోయే వారం ముందు మరో ఫిఫ్టీ పర్సెంట్ పంపించండి అన్నారు. నలుగురికీ సగం డబ్బు పంపించేశాం. కానీ ఆ తరువాత కొన్ని ఇబ్బందుల వల్ల ఆ ఇద్దరు కజిన్స్ డ్రాప్ అయ్యారు. పాపం ట్రావెల్స్ వాడు మంచివాడు, ఆ డబ్బు మా రెండో ఇన్స్టాల్మెంటుకి సద్దుకున్నాడు. ఆ తరువాత మరో కండిషన్, BSNL మొబైల్ పోస్ట్ పైడ్ సిమ్ ఉండాలి, మొత్తం యాత్ర ఆ నంబర్ తోనే రిజిస్టర్ చేస్తాం అని. అప్పటికప్పుడు BSNL ఆఫీస్ కి వెళ్లి నా ప్రీపెయిడ్ సిమ్ ని పోస్ట్ పైడ్ సిమ్ గా మార్చుకున్నాం.
సిమ్ కార్డు తతంగం అవంగానే ఇంత పొడుగు లిస్ట్ పంపించారు, ఈ మెడికల్ టెస్టులన్నీ చేయించుకోవాలి అంటూ. ఆ రిపోర్టులను అమరనాథ్ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ వారు ఇచ్చిన లిస్ట్ లో వున్న డాక్టర్లకు చూపించి, వాళ్ళిచ్చిన ఫిట్ నెస్ రిపోర్ట్ పంపించాలీ అని. టైం తక్కువ వుంది. సత్యా డయాగ్నస్టిక్స్ లో ఒకరోజు సాయంత్రం, మరునాడు ఉదయం చేయించుకోవాల్సిన టెస్టులన్నీ చేయించుకుని, ఆ రిపోర్టులు పుచ్చుకుని ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్లాం. ఉస్మానియా నుంచి ఇద్దరు డాక్టర్లు అమరనాథ్ టెంపుల్ బోర్డ్ పానెల్ లో వున్నారు. మా అదృష్టం కొద్దీ, ఒక డాక్టర్ మాకు ఆరోజు దొరికారు. ఆయన మమ్మల్ని, మా రిపోర్టులనీ చెక్ చేసి సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ రిపోర్టులు, సర్టిఫికెట్లు ట్రావెల్స్ వాళ్లకు పంపించాం. ఈ మెడికల్ ఫిట్ నెస్ తతంగమంతా ఆశ్చర్యకరంగా 20 గంటల్లోనే అయిపొయింది.
దాంతో మావంతు పని అయిపోయింది. డబ్బులిచ్చేసాం, రిపోర్టులు ఇచ్చేశాము, BSNL మొబైల్ ఫోన్ పోస్ట్ పైడ్ నంబర్ ఇచ్చేసాం. ఆ తరువాత జులైలో సెకండ్ సాటర్ డే, చూసుకుని, శుక్ర, శని, ఆది, సోమ, నాలుగు రోజులు ఫిక్స్ చేసుకున్నాం. నేను శుక్ర, సోమవారాలు సెలవు పెట్టాను. అమ్మయ్య అనుకుని ఈ విషయమే పూర్తిగా మర్చిపోయాం. ఇదంతా జరిగింది జూన్ లో. మళ్ళీ ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇంకేమీ మెసెజ్ పంపించలేదు. మేమే మళ్ళీ జులై మొదటి వారంలో ఫోన్ చేసి రిజర్వేషన్స్ గురించి అడిగితే, సెకండ్ ఇన్స్టాల్మెంటు డబ్బులేవీ అన్నాడు. అన్నీ మళ్ళీ వివరంగా చెప్పాక, అప్పుడు సరి చూసుకుని, ఫ్లైట్ వివరాలు, మమ్మల్ని శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకునే డ్రైవర్ నంబర్ మెయిల్లో పెట్టారు. ఏమేం తెచ్చుకోవాలో ట్రావెల్స్ వాళ్ళూ చెప్పారు, దేవస్థానం వాళ్ళూ వాళ్ళ వెబ్ సైట్ లో పెట్టారు. ఈ టూర్ కి చాలా కండిషన్స్ వున్నాయి. కడుపుతో వున్న వాళ్ళు, 13 ఏళ్ళకన్నా చిన్నవాళ్లు, 75 ఏళ్ళకన్నా పెద్దవాళ్ళు, మెడికల్ ఫిట్ నెస్ లేని వాళ్ళు, ఈ యాత్ర చేయడానికి పనికిరారు. మేము లక్కీగా ఈ క్యాటగిరీ ల్లోకి రాలేదు కనుక అన్నీ అప్రూవ్ అయిపోయాయి. మేము ఏ ఇతర యాత్రకీ కూడా, ఈ అమరనాథ్ యాత్రకు చేసినట్టు ప్రిపరేషన్ చేయలేదు. అంత ప్రత్యేకమైన యాత్ర ఇది.
కావాల్సిన వుల్లెన్ బట్టలు, ముందే వున్నాయి. బూట్లు కొనుక్కున్నాం. ఇంకా లోపల వేసుకునే వుల్లెన్ అండర్ గార్మెంట్స్ కొనుక్కున్నాం. దాంతో ప్రయాణానికి తయారు. ఈ యాత్రకు డెబిట్ మా బాంక్ లో నుంచే అయినా, యాత్రకు ప్రోత్సహించిన క్రెడిట్ మాత్రం మా పెద్దవాడిదే, అందులోనూ మాకు కొంచం కూడా ఐడియా లేనప్పుడు, మమ్మల్ని ప్రోత్సహించి మరీ పంపించాడు. శుక్రవారం ఉదయం బయల్దేరి హైద్రాబాద్ నుంచి ఢిల్లీకి, మళ్ళీ ఢిల్లీ నుంచి శ్రీనగర్ కి సాయంత్రాని కల్లా చేరాం. డ్రైవర్ వచ్చి పిక్ అప్ చేసుకున్నాడు. మా అమరనాథ యాత్ర అలా మొదలైంది. ఈ యాత్ర లోనే కాశ్మీరేతు సరస్వతీ అంటారు కదా, సరస్వతీ మాత దర్శనం కోసం కూడా నేను ఆరాటపడ్డాను. సరే, ప్రయత్నిద్దాం అని కాశ్మీర్ టూరిజం వారి డైరెక్టర్ కి నెల ముందరి నుంచే మెయిల్స్ పెడుతూ, కాల్స్ చేస్తూ వచ్చాను. వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ. మాకు ఎంతో సమాచారమిచ్చారు. తన PA నంబరిచ్చి, శ్రీనగర్ వచ్చాక కాంటాక్ట్ చేస్తే గైడ్ చేస్తాడని చెప్పారు. ఈ సమాచారంతో యాత్రకు బయల్దేరాం. అమరనాథ్ గుహతో పాటు పక్కనున్న మందిరాలు కూడా చూడాలని మా ఆలోచన. శ్రీనగర్ 2006 లోనే చూసేసి వున్నాం కనుక, ఒక్క రోజు మాత్రం ఎక్స్ట్రాగా ఉంచుకుని మొత్తం నాలుగు రోజులు ఈ యాత్రకు కేటాయించుకున్నాం. నిజానికి వెళ్లేముందు అమరనాథ్ తప్ప మిగిలిన ఏ సమాచారమూ మాకు లేదు. ఒకదాని తరువాత ఒకటి అల్లుకుంటూ వచ్చామంతే. అయినా, అమ్మవారి మందిరాలు మూడూ, అమరనాథ్ గుహ దర్శనం, ఆపైన నా హనుమత్ దీక్షతో సహా ఏదీ అడ్డం రాలేదు, అన్నీ సవ్యంగా జరిగాయి. యాత్రా ఫలితం ఇదేనేమో.
డ్రైవర్ మమ్మల్ని డైరెక్టుగా సోన్మార్గ్ తీసుకువెళ్లి ఒక హోటల్లో ఉంచాడు. ఆ హోటల్ కి సరిగ్గా ఎదురుగా, మహోధృతంగా ప్రవహిస్తున్న జీలం నది. వాళ్ళు దాన్ని 'జాలిమ్' అంటున్నారు. ఆ నది మీదుగా దాటడానికి ఒక వంతెన. చూడంగానే ఆనందమూ, ఆహ్లాదమూ రెండూ కలిగాయి. ఆ రాత్రి ఆ నదిని చూస్తూ చాలాసేపు కూర్చున్నాం. చలి వుంది కానీ మరీ తట్టుకోలేనంతగా లేదు. ఆ చలి కూడా వేగంగా ప్రవహిస్తున్న జీలం నది గాలుల వల్ల వచ్చిందే. రూంలో వెచ్చగానే వుంది. పొద్దున్న 6 గంటల కల్లా తయారుగా ఉండమని డ్రైవర్ చెప్పాడు. ఆ రాత్రి భోజనం, మరునాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆ హోటల్లోనే. మరునాడు బ్రేక్ ఫాస్ట్ అని 4 బ్రెడ్ స్లైసులు, వెన్న ఇచ్చాడు. ఓ పెద్ద గ్లాసుడు టీ ఇచ్చాడు. ఈ వెన్న పూసిన నాలుగు స్లైసులు ఎంత ఎనర్జీ ఇచ్చాయంటే, చూడాల్సినవన్నీ చూసి, తిరిగి ఖీర్ భవానీ మాత మందిరంలో ప్రసాదం తినేంత వరకూ కూడా, మేం మళ్ళీ ఏమీ తినే అవసరం రాలేదు. మళ్ళీ కారులో హెలిపాడ్ వరకూ తీసుకువెళ్లి క్యూలో నుంచోబెట్టాడు. అక్కడ వాళ్ళు మా సర్టిఫికెట్లు, బరువు చూసి పాస్ ఇచ్ఛారు. హ్యాండ్ బాగులు, వులెన్ బట్టలు, గొడుగులు తప్ప వేరే లగేజ్ లేదు ఎవరి దగ్గరా. ఆ నైట్ స్టే చేయాలనుకున్న వారు మాత్రం కొన్ని బట్టలు కూడా తెచ్చుకున్నారు. బరువు 100 కిలోల కంటే ఎక్కువుంటే రెండు టిక్కెట్లు పే చేయమన్నారు. మాతో వచ్చిన ఒకతను 110 కిలోల బరువుండటంతో, అతనితో రెండు టిక్కెట్ల డబ్బు కట్టించుకుని ఆ ఫ్లైట్లో ఐదుగురిని పంపించారు. మామూలుగా అయితే ఆరుగురిని పంపిస్తారు.
మాక్కూడా హెలికాఫ్టర్ అనుభవం అదే మొదటిసారి. కానీ ఏమీ భయం వేయలేదు, పైగా సరదాగా కూడా అనిపించింది. హెలికాఫ్టర్ లో కూడా ముందు సీట్లో ఎవరు కూర్చోవాలి, వెనుక సీట్లో ఎవరు కూర్చోవాలో కూడా వాళ్ళే నిర్ణయించి కూర్చోబెట్టారు. మా హాండ్ బాగులన్నీ వెనక వున్న లగేజ్ బూట్లో వేశారు. మా హెలికాఫ్టర్ నీలగ్రథ్ నుంచి పంచతరణి వరకూ, మొత్తం 15 నిముషాల ట్రిప్ అది. ఎక్కేముందే మా డ్రైవర్ చెప్పాడు, అక్కడ పైన చాలా లంగర్లు ఉంటాయి. ఎక్కడా తినకండి. వెంటనే రిటర్న్ హెలిపాడ్ కి వచ్చేయండి, ఆలస్యమైతే కష్టం అని. ఎందుకంటే అక్కడ వాతావరణం సడెన్ గా మారిపోతూ వుంటుందట. దానితో హెలికాఫ్టర్లు కాన్సల్ చేస్తారట. అప్పుడు ఒక నైట్ అక్కడే ఆగిపోవాల్సి వస్తుందిట. మాక్కూడా విషయం అర్థం అయ్యింది. పైకి చేరాక తెలిసిందేమంటే, గుహ హెలిపాడ్ నుంచి ఇంకా 6 కిలో మీటర్లు పైనే పైన ఉందని. అక్కడికే డోలీల వాళ్లు, ఘోడాల వాళ్ళు వచ్చారు. నాకేమో ఆ డోలీ కుర్చీల్లో కూర్చోవడానికి భయం వేసింది. అది మామూలు ప్లాస్టిక్ కుర్చీ. ఎక్కే సమయంలో జారిపోతేనో అనిపించింది. గుర్రాల వాళ్ళను మాట్లాడుకున్నాం. గుర్రాల దాకా నడవడం కూడా ఎంతో కష్టం అనిపించింది, ఎందుకంటే అంతా మంచు, తడి, నల్లని మన్ను, రొచ్చు రొచ్చుగా వుంది. తరువాత వాళ్ళే చెప్పారు, ఆ మన్ను గుర్రాల లద్దె అట. అక్కడ మంచు కనీసం 10 కిలోమీటర్ల మందంగా వుందనీ, మొత్తం ఆ ప్రాంతం అంతా గ్లేసియర్ అనీ చెప్పారు. మొత్తానికి గుర్రాలెక్కాము. ఒకటే చమట, చికాకు, లాభం లేదని వుల్లెన్ దుస్తులన్నీ తీసేసాం. అన్నీ పాపం ఆ గుర్రమే మోసింది. హాయిగా నాకు అలవాటైన పట్టుచీరలో సుఖంగా గుర్రాలపై వెళ్లాం. కొంత దూరం వెళ్లేసరికి మిలటరీ వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచీ గుర్రాలు వదలం, మీరు దిగాలి అని చెప్పారు. దాంతో తప్పనిసరిగా దిగి, మళ్ళీ డోలీలు ఎక్కాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంకా పైన గుహ 2 కిలోమీటర్ల దూరంలో వుంది. ఆ మంచులో 2 కిలోమీటర్లు కాదు కదా 2 అడుగుల దూరం నడవటం కూడా కష్టమే. కాలు జారిపోతుంది. ఈ గుర్రాల వాళ్ళు, డోలీల వాళ్ళు స్నేహితులే. వాళ్ళే, డోలీల వాళ్ళతో, మా గురించి జాగ్రత్తలు చెప్పి, పూర్తిగా గుహలో దర్శనాలయి మళ్ళీ మమ్మల్ని గుర్రాల వాళ్ళకు అప్పచెప్పేదాకా, బాధ్యత అప్పచెప్పి పంపించారు. ఆ డోలీలు మోసే పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు. అందరూ సుమారు 20 నుంచి 40 ఏళ్ల లోపు ముస్లిం యువకులు. ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా, బాధ్యతగా వున్నారు. మాజీ అని తప్ప మరో రకంగా సంబోధించలేదు. డోలీలో సుమారు 2 కిలోమీటర్లు ఎక్కాక, మళ్ళీ దింపారు. అప్పుడు తెలిసింది, అక్కడి నుంచీ గుహకు సుమారు 400 మెట్లు, అవీ పెద్ద పెద్ద మెట్లు ఎక్కాలీ అని. ఎక్కగలమా అని నీరసం వచ్చేసింది. ఇంత దాకా వచ్చాక దర్శనం చేసుకోకుండా వెనుదిరగటమా, ఈ మీమాంసలో పడి కాసేపు అయోమయం అయిపోయింది.
ఇటువంటప్పుడు మావారు డెసిషన్ తీసేసుకుంటూ వుంటారు. నేను సరే అని ఫాలో అవుతూ ఉంటాను. "ఏం ఫరవాలేదు. ఎక్కెయ్, కావాలంటే, నెమ్మదిగా వెళదాం. అంతే గానీ ఆగొద్దు", అన్నారు. మా డోలీ కుర్రాళ్ళు కూడా "మాజీ, ఎక్కండి, మేం మీ చెయ్యి పట్టుకుని నడుస్తాం, మీకు హిమలింగం దర్శనం చేయించి కిందకు దింపే భరోసా మాది", అని ధైర్యం చెప్పారు. దాంతో కాస్త ఓపిక తెచ్చుకుని ఎక్కడం మొదలుపెట్టాం. కానీ ఆ మెట్ల దాకా కూడా అర కిలోమీటరు మంచుపై నడవాలి. బూటు కాలు జారిపోతోంది. అప్పుడు ఆ కుర్రాడు, 'మాజీ, కాలు జారితే నా కాలు మీద జారేలాగా చూసుకోండి. నేను ఆపుతా, మీరు అయ్యో నా కాలుతో ఇతన్ని తగలటం ఏమిటీ అని మొహమాటపడి వేరే చోట కాలు పడితే, మనిద్దరమే కాక, ఆ దారిలో వున్న వందలాది మంది కూడా మన వలన జారి పడిపోతారు, చచ్చిపోవచ్చు కూడా. కనుక మంచుపై కాలు జారుతుంటే, నా మీదకే జారండి,' అని స్పష్టంగా చెప్పాడు. నిజమే గదా అని అతన్ని ఫాలో అయ్యా. మధ్యలో మా వారు కనిపించలా, భయం వేసింది. మా ఇద్దరినీ మొత్తం దారి అంతా కలిపే తీసుకెళ్లాలని మొదటే ఒప్పందం అయ్యింది. నేను భయపడుతుంటే, ఆ అబ్బాయి, "అదుగో మాజీ, మనకన్నా ముందు వున్నారు" అని చూపించాడు. అమ్మయ్య అనుకుని ఆ మెట్లు ఎక్కడం మొదలు పెట్టాం. మధ్యలో మూడు, నాలుగుసార్లు ఆగాము. ఒకచోట మిలటరీ వాళ్ళు కూర్చోబెట్టి వేడినీళ్లు ఇచ్చారు. వేడినీళ్లు తాగితే ఆక్సిజన్ పీల్చుకునే శక్తి పెరుగుతుందట. ఒకచోట నేను ఎక్కలేకపోతుంటే, ఆ పిల్లవాడు "మాజీ నా వీపు మీద ఎక్కుతావా, అన్నాడు, ఉప్పుమూటలాగా". అప్పుడు ఇంకా భయం వేసింది. 'వద్దు బాబోయ్, నేనే ఎక్కుతాను', అని చెప్పి నెమ్మదిగా ఎక్కాను. తీరా పైదాకా ఎక్కేసరికి అసలు ఓపిక అనేది మిగల్లేదు. అప్పుడు నిస్సహాయంగా ఆ దేవుడికి దణ్ణం పెట్టుకున్నా, సంపూర్ణ స్పృహతో దర్శనం చేసే శక్తి నివ్వు తండ్రీ అని. ఒక పదిమెట్ల ముందు బూట్లు, సాక్స్ విప్పేయమన్నారు. కాళ్ళ దాకా వంగటానికి కూడా శక్తి లేదు. అప్పుడు ఆ అబ్బాయే, "మాజీ మీరు కూర్చోండి నేను విప్పుతా", అని పాపం విప్పి పెట్టాడు. అక్కడే మా హాండ్ బాగ్, ఫోన్లు, కెమెరాలు తీసేసుకున్నారు. ముందరే వుల్లెన్ దుస్తులన్నీ డోలీ లోనే వదిలేశాం కనుక ఆ భారం లేదు. అసలు చలి వెయ్యలేదు సరికదా, చమట కూడా పోసింది. బూట్లు విప్పాక కూడా హాయిగానే వుంది. పది మెట్ల కిందే వున్నా కూడా లింగం కనిపించటంలేదు. ఇంకో ఐదు మెట్లు ఎక్కాక కాస్త మంచు కరిగిన నీరు కాళ్లకు తగిలి చల్లదనం తెలిసింది. అప్పటి దాకా చలి అన్నది తెలియలేదు.
ఈ యాత్ర ఎప్పుడూ ఆషాడ మాసం మొదట్లో మొదలై, శ్రావణపూర్ణిమతో ముగుస్తుంది. మొత్తం 45 రోజుల యాత్ర. మేము సరిగ్గా ఆషాఢపూర్ణిమ నాడు అమరనాథుడ్ని దర్శనం చేసుకున్నాం. గురుపూర్ణిమ నాడు గురువులకే గురువైన ఆ సదాశివుడ్ని దర్శనం చేసుకున్నాం. శివాయ గురవే నమః. మరో ఐదు మెట్లు ఎక్కుతూనే, ఆ మహా హిమలింగం దర్శనం అయ్యింది. చూడంగానే నా చుట్టూ వున్న సమస్తమూ మాయమైపోయి, దేహం లోకి సంపూర్ణ శక్తి వచ్చేసింది. నా నీరసం, నా నిస్తేజం ఎక్కడకు పోయాయో కూడా తెలియలేదు. ఒక్కసారిగా ప్రజ్ఞ వచ్చేసింది. ఎంత చక్కని దర్శనమో, దాదాపు రెండు మూడంతస్థుల ఎత్తు, దానికి తగ్గ వెడల్పు, ఆ తలపైన చంద్రవంక, అన్నీ స్పష్టంగా ఏర్పడ్డాయి. ఆ పక్కనే మరో రెండు చిన్న చిన్న మంచు మూర్తులున్నాయి. అవి గణేశుడు, పార్వతి అని చెప్పారు. అమరనాథ లింగానికి, ఈ రెండు ఆకారాలకీ టెక్సచర్ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మంచు కరిగిపోతుంది కనుక ధూప దీప అర్చనలు ఏమీ వుండవు. కేవలం దర్శనమే. ఉదయాన్నే ఒకసారి ప్రధాన పూజారి మాత్రం వెళ్లి ఆ సేవలన్నీ చేసి వెనక్కు వచ్చేస్తారుట. అందరూ లింగం దగ్గరకు వెళ్లి ముట్టుకునే ప్రయత్నం చేయకుండా పూర్తిగా ఒక కటకటాల దడి అడ్డం పెట్టారు. కానీ తమాషా ఏమిటంటే, మనం శివుడ్ని చూస్తుంటే, మధ్యలో వున్న ఆ అడ్డాలేమీ కనపడవు. ఆ మహా హిమలింగం కళ్లెదుట సాక్షాత్కరిస్తే, మనల్ని మనమే మర్చిపోతాం. ఇంత దాకా పడ్డ కష్టం అంతా హుష్ కాకీ అన్నట్టు ఎగిరిపోయింది. ఆ సదాశివుడ్ని చూసాక ఇంక ఏమీ అక్కర్లేదు, జీవితానికి ఈ ఒక్క క్షణం చాలు అనిపించింది. ఎంత పరిపూర్ణ దర్శనం అంటే, మళ్ళీ వెనక్కు తిరిగి చూడాలని కూడా అనిపించలేదు. అంత మనసు నిండిపోయింది. మనసు తీరా, తనివితీరా అనే మాటకు అసలైన అర్థం ఏమిటో అప్పుడు తెలిసింది. ఆ ఆషాఢపూర్ణిమ మాకు అలా కోరిక తీర్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, "చాలా మంది ఇంతమంది దేవుళ్ళని చూసీ అందర్నీ నీ కోరికలతో ఒక ఊపు ఊపావ్ అన్నారు". కానీ నిజాయితీగా చెప్తున్నా, అసలైన దేవుడి దర్శనం అయితే, మనసులో ఏ కోరికా ఉండదు. ఏ ఇతర ఆలోచనా ఉండదు. ఆదడగాలి, ఇదడగాలి అని అనిపించదు. ఇది నాకు ప్రత్యక్ష నిదర్శనం. ఇంకా ఇలాంటి అనుభూతి పొందినవాళ్లు కూడా చాలామంది ఉండొచ్చు. వాళ్లకు మాత్రం ఈ భావం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఆ అమరనాథ్ దేవస్థానం వాళ్ళ వెబ్ సైట్ లింక్ ఇదీ. ఈ వెబ్ సైట్ నిజంగానే చాలా చాలా చాలా ఉపయోగకరం. http://www.shriamarnathjishrine.com
ఆ గుహలో పావురాలు కూడా చూసాం. నేనే వాటిని చాలా మందికి చూపించా. ఆ గుహలో మనల్ని ఎవరూ వెళ్ళమనరు, ముందుకి కదలమనరు. కానీ మనకే మనసు నిండిపోయి, తృప్తిగా బయల్దేరి పోతాం. ఆ పది మెట్లు దిగి కిందకు వస్తే, అక్కడ మరో సహజంగా ఏర్పడ్డ మంచులింగం వుంది. అదే ఉత్సవ విగ్రహం అన్నమాట. ఆ లింగానికి మనం కోరిన అర్చన చేసి, ప్రసాదం నివేదన చేసి మళ్ళీ మాకు ఇచ్చేశారు. కిందకు మళ్ళీ మెట్లు దిగాం. ఈ సారి నీరసం, నిస్సత్తువ రాలేదు. ఆ పిల్లలు మాత్రం మా పక్కనే వున్నారు. మళ్ళీ జాగ్రత్తగా డోలీల దాకా వెళ్ళాం. అక్కడి నుంచి గుర్రాల దాకా వెళ్లాం. ఆ పిల్లలు మాకు ఎంత ఆత్మీయులై పోయారో, డబ్బులిచ్చాం కదా అనుకునే వారికైతే, నేనేం చెప్పలేనుగానీ, వాళ్ళు చూపించిన శ్రద్ధ, కేర్ వాటికి డబ్బులివ్వలేం కదా. మా డ్రైవర్ చెప్పినట్లే, మేం ఎవరు పిలిచినా, ఏ లంగరు లోనూ భోజనానికి ఆగలేదు. అయినా మాకు ఆకళ్ళూ లేవు. కడుపు, మనసూ పూర్తిగా పైనే నిండిపోయింది కదా మరి. మేము గుర్రాల వాళ్ళ దగ్గరకు వచ్చి తిరిగి హెలిపాడ్ కి బయల్దేరాం. దార్లో ట్రాఫిక్ జామ్ అయింది. పైకి, కిందకు నడిచేవాళ్ళు, గుర్రాలు, డోలీలు అన్నీ ఆ సన్నని దారిలోనే కదలాలి మరి. మావారి గుర్రమైతే మూడు కాళ్ల మీదే నుంచుంది. నాకు భయం వేసింది, ఈ లోపల గుర్రాల వాళ్ళు "అమ్మా, డ్రై ఫ్రూట్స్ తెచ్చారా" అని అడిగారు. తెచ్చాను, కానీ చేతులతో బాగ్ జిప్ తీసి ఇవ్వగలిగే ధైర్యం లేదు. గుర్రం మీంచే చేతులు తీయాలంటే భయం వేసింది. వాళ్లకే బాగ్ లో, అవి ఎక్కడ పెట్టానో చెప్పి, వాళ్లనే తీసుకోమన్నాను. వాళ్ళే తీసుకుని, మాకూ వాళ్ళ ఫ్రెండ్స్ కీ కూడా పెట్టారు. ఇక ఫోటోలు ఏం తీయను. అందుకే ఈ యాత్రలో ఎక్కడా ఫోటోలు లేవు. పై నుంచి ఒక సోల్జర్ జారుకుంటూ వేగంగా మా దగ్గరకు వచ్చాడు. అందరూ భయపడిపోయి రావద్దు, రావద్దు అని కేకలు పెట్టారు. అతను మాత్రం చాలా కంట్రోల్డ్ గా జారుతూ వచ్చి మా దగ్గర ఆగాడు, అతనికే కనుక ఆ కంట్రోల్ లేకపోతే ఆ దారిలో వున్న అందరూ పడిపోయేవాళ్లు. ఆ సోల్జర్ రాగానే పరిస్థితి వెంటనే చక్కబడింది. కిందకు దిగేవారిని మంచుగోడ వైపుకి నెట్టేశాడు, పైకి ఎక్కే వాళ్ళకు పైకి దారి వదిలి పంపించాడు. ఆ తరువాత మమ్మల్ని కిందకు వదిలాడు. ఈ లోపల వేరే వైపుల నుంచీ ఇంకో ముగ్గురు సోల్జర్స్ కూడా వచ్చారు. పావుగంటలో అంత ట్రాఫిక్ జామ్ నీ కూడా సరిదిద్దేశారు. ఎట్టకేలకు హెలిపాడ్ చేరుకొన్నాక, అప్పుడు టీ తాగాం. మళ్లీ హెలికాఫ్టర్ రిజిస్ట్రేషన్ చేసుకుని కిందకు నీలగ్రథ్ చేరుకున్నాం. అక్కడ నుంచి సోన్మార్గ్ కి వచ్చాం.
మేము అడిగిన దాన్ని బట్టి డ్రైవర్ మమ్మల్ని తుల్లాముల్లా లోని ఖీర్ భవానీ మందిరానికి తీసుకువెళ్ళాడు. సుమారు రెండు గంటల ప్రయాణం అది. ఖీర్ భవానీ అమ్మవారు ఒక పుష్కరిణి మధ్యలో ఉంటుంది. అందరూ ఆ దేవతను స్మరిస్తూ ఆ నీటిలో పాలు పోస్తూ అభిషేకం చేస్తారు. ఈ దేవత ప్రసక్తి కల్హణుడి రాజతరంగిణిలో కూడా కనిపిస్తుంది. ఈ దేవత పాండవులను కూడా ఆశీర్వదించింది అని కూడా చెప్పారు.
ఆ మందిరంలో లింగం ఆదిశంకరాచార్య ప్రతిష్ట. ఆ కొండ పేరు కూడా ఆయన పేరు మీదే శంకరాచార్య పర్వతం అంటారు. ఆయన అక్కడ వుండి తపస్సు చేసుకున్నాట్ట. ఆ దారి కూడా, ఒక మహానగరం మధ్యలో వుండి కూడా, కొండ దారి అంతా అడవే, అన్నీ పెద్ద పెద్ద చెట్లు, మబ్బులు, చల్లని నీడ. అలసట తెలియలేదు కానీ ఆయాసం వచ్చింది. ఆ మందిరంలో గర్భగృహానికి వెళ్ళడానికి ఇంకా పెద్ద పెద్ద మెట్లున్నాయి, కాకపొతే అవి పది మాత్రమే. మొత్తానికి లోపలికి వెళ్ళాం. అది ఒక పెద్ద శివలింగం, ఎంత పెద్దదంటే, మేము దాని పెడస్టల్, పీఠం వరకు మాత్రమే వచ్చాం. దాన్ని చూస్తూనే సమ్మోహితులై పోయాం. మమ్మల్ని అభిషేకం చేస్తారా అని అడిగి, వాళ్ళే నీళ్లు ఇచ్చి అభిషేకం చేయించారు. నేనూ ఆ నీళ్లపాత్ర ముట్టుకోబోతే, స్త్రీలకు ఆ హక్కు లేదు, మీరు మీవారిని భుజంపై పట్టుకోండి, అని కొంచం కోపంగానే చెప్పారు. మరి నేను ఇంట్లో అభిషేకం చేసుకుంటానే, అని చెప్తే, వీల్లేదు అన్నారు. సరే, అభిషేకం మా ఇద్దరిలో ఎవరు చేస్తే ఏమిటిలే అనుకుని, నేను మావారి భుజం పట్టుకున్నాను అభిషేకం జరుగుతున్నంత సేపూ. ఓం నమః శివాయ అనుకుంటూ. నేను ఏ శివాలయానికి వెళ్లినా శివ పంచాక్షరీ స్తోత్రం చదువుకోవటం అలవాటు. ఇక్కడా అలాగే చదువుకున్నాను.
ఇదీ మా శంకరాచార్య, అమరనాథ్, ఖీర్ భవానీ మందిరాల యాత్ర కథ. ఒకటి 2006 లో, ఇంకోటి 2014 లో. కిందకు వచ్చి కాసేపు దాల్ సరస్సులో షికారాలో తిరిగి మొఘల్ గార్డెన్స్ దగ్గరికి వచ్చాం. అక్కడ ఒక షాప్ లో ఉంగరంలో దూరే షాల్స్ చూసి, మా కాలేజీ వాళ్లందరికీ కొన్నాను, మా కరెస్పాండెంట్ నుంచి, మా వాచ్ మాన్ దాకా, నా రిటైర్మెంట్ రోజున అందరికీ గుర్తుగా ఇవ్వాలని. దానితో మా యాత్ర ముగిసి మర్నాడు బయల్దేరి హైదరాబాద్ వచ్చేశాం. ఈ రోజుకీ ఇవ్వన్నీ గుర్తున్నాయంటే, ఆ యా సన్నివేశాలు మా మనస్సుల్లో ఎంత స్థిరంగా, దృఢంగా ముద్ర వేసాయో గమనించండి. ఈ వ్యాసం చాలా పెద్దది, ఇప్పటికే ఎంతో తగ్గించి, కుదించి, కొన్నింటిని శక్తి క్షేత్రాల విభాగానికీ, మరి కొన్నింటిని మరో ఆహ్లాదకరమైన ప్రదేశాల విభాగానికీ కేటాయించి కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పాను. ఇక ఇక్కడ ముగిద్దాం.
ఓం శ్రీ అమరనాథాయనమః, ఓం శ్రీ ఖీర్ భవానీ దేవ్యై నమః, ఓం శ్రీ హనుమతే నమః
తరువాత శ్రీలంక లోని త్రికోణేశ్వరుడి గురించి ఓం శ్రీ త్రికోణేశ్వరాయనమః అంటూ
ఆ విశేషాలు చెప్పుకుందాం.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Intha detail ga ... each and every point...meeku bale gurthunayi aunty...superrr
రిప్లయితొలగించండిVery well explained akka. This is a great guide for the first timers. It requires a lot of courage for this yatra.
రిప్లయితొలగించండి