సేతుబంధే తు రామేశం
7. సేతుబంధే తు రామేశం.......
ఇప్పుడు ఆ శ్లోకంలోని ఏడవ క్షేత్రదర్శనానికి వెళదాం. అది రామేశ్వరం. తమిళనాడులో రామనాథపురం జిల్లాలో వుంది. దాన్ని చేరడానికి సముద్రం దాటాలి. కాకపోతే అక్కడ వున్న సముద్రం బాక్ వాటర్స్ కనుక ఎక్కువ లోతుండదు. రైల్ మార్గంలో దాటొచ్చు. మేము ఈ క్షేత్రానికి నాలుగు సార్లు వెళ్లాం. చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ ప్రదేశం. ఆది శంకరులు ఈ క్షేత్రం గురించి ఇలా చెప్పారు.
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ||
తామ్రపర్ణీ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో, శ్రీ రామచంద్రుడు ఎన్నో బాణాలతో నిర్మించిన సేతువు వద్ద ప్రతిష్టితమైన ఆ రామేశ్వరునకు నమస్సులు అని. ఈ శ్లోకంలో శ్రీరామచంద్రుడే శరములతో సేతువు నిర్మించినట్టు వుంది. రావణబ్రహ్మను వధించిన తరువాత రామునకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఆ పాతకం పోవటం కోసం శివలింగ ప్రతిష్ఠ చేస్తే పరిహారమవుతుందని నిర్ణయించి, ఈ క్షేత్రంలో లింగం ప్రతిష్టించటం, రాముడు ప్రతిష్ట చేసిన లింగం కనుక రామేశ్వరుడనీ, రామనాథస్వామి అనీ పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి పేరు పర్వతవర్ధని. ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు వున్నాయి. ఇక్కడ ప్రతి ఉదయం స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. మూలమూర్తి మాత్రం సీతాదేవితో తయారు చేయబడిన సైకతలింగమే. ముహుర్తాని కన్నా ఆలస్యంగా చేరటంతో హనుమంతుడు తెచ్చిన లింగాన్ని రాముడే మళ్ళీ సైకతలింగం పక్కనే వున్న ఉపాలయంలో ప్రతిష్ట చేసాడు. పైగా ఎలాగైతే తిరుమలలో వరాహమూర్తిని దర్శనం చేశాకే శ్రీనివాసుని చూడాలని నియమం ఉందో, అలాగే ఇక్కడ కూడా హనుమత్ లింగాన్ని చూసాకే మూలలింగాన్ని చూడాలని నియమం వుంది.
ఈ క్షేత్రం చార్ ధామ్ లలో ఒకటి. తూర్పున పూరీలో, దక్షిణాన రామేశ్వరంలో, పడమరన ద్వారకలో, ఉత్తరాన బదరికాశ్రమంలో నాలుగు ప్రాంతాల్లోనూ నాలుగు పీఠాలను స్థాపించిన శంకరాచార్యుడు, ఈ నాలుగింటినీ కలుపుతూ తానూ భారతదేశ పరిక్రమ, అంటే ప్రదక్షిణ, చేసాడు. ఆనాటి నుంచి సనాతన సంప్రదాయం ఆచరించేవారికి ఈ పరిక్రమ ఒక ప్రాధమ్యం అయిపోయింది. తన ప్రధాన శిష్యులు నలుగురినీ ఒక్కొక్కచోట ఒక్కో పీఠానికి అధిపతులుగా నియామకం చేసాడు. రామేశ్వరం నుంచి దక్షిణామ్నాయపీఠం శృంగేరికి ఎప్పుడు మారిందో తెలియదు కానీ ప్రస్తుతం దక్షిణామ్నాయపీఠం శృంగేరిలో, ఉత్తరామ్నాయపీఠం బదరీనాథ్ దగ్గర వున్న జోషిమఠ్ లో వున్నాయి. మిగిలిన రెండూ పూరి లోను, ద్వారకలోనే వున్నాయి. రామేశ్వరంలో రాముడి ఆగ్రహం చూసిన తరువాత సముద్రుడు శాంతించి సేతువు కట్టే మార్గం చూపాడని రామాయణంలో చెప్తారు. ఆ మాట నేటికీ నిజమే అనిపించేలా ఇక్కడ సముద్రం ఏ అలలు లేకుండా శాంతంగా ఉంటుంది, ఎంత దూరం వెళ్లినా సముద్రం నిశ్చలంగానే ఉంటుంది. ఇక్కడకు దగ్గరలో వున్న ధనుష్కోటి నుంచే రాముడు సేతువు నిర్మించాడు అని అంటారు.
ప్రస్తుతం రామేశ్వరం సముద్రంలో ఒక లంక. ఈ లంకకు చేరటానికి రైల్వేవారు పాంబన్ నుంచి ధనుష్కోటి వరకూ ఒక రైల్వేబ్రిడ్జిని 1914 లో నిర్మించారు. దానినే పాంబన్ బ్రిడ్జ్ అంటారు. 1964 లో ఒక పెను ఉప్పెన వచ్చేవరకూ రైలు ధనుష్కోటి వరకూ వెళ్ళేది. ఆ పెను తుఫానులో మొత్తం ధనుష్కోటి మాత్రమే కాక ఈ రైలు వంతెన రైలుతో సహా కొట్టుకుపోయింది. వేలాది మంది మరణించారు. అప్పటినుంచి రైలు మార్గం కేవలం రామేశ్వరం వరకు మాత్రమే నడుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ధనుష్కోటి ప్రాంతాన్ని ఒక దురదృష్టకరమైన స్థలంగా ప్రకటించి వదిలివేసింది. కానీ పర్యాటకులు ఈ రోజుకీ ఏదో ఒక ప్రైవేట్ వాహనం పట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్లి రామ సేతువు శకలాలను దర్శిస్తూనే వున్నారు. అక్కడకు రోడ్ వేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వారు పరిశీలిస్తున్నారు. ఆ రోడ్ ఎప్పటికి వస్తుందో, ఏమో. ఇవ్వన్నీ పక్కకు పెడితే ధనుష్కోటి యాత్ర చాలా బాగుంటుంది. దాదాపు నాలుగు అడుగుల ఎత్తు నీటిలో బస్సులు, జీపులు, మనుషులు మామూలు రోడ్డుపై వెళ్తున్నట్టే వెళ్తుంటారు. అతి సహజంగా ఆ నీళ్ళల్లో నడిచేవారిని చూస్తుంటే, ఆశ్చర్యం కూడా వేస్తుంది. మనం నడుస్తాం కూడాను. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకతను తనతో చాలా గుర్రాలను నీటిలో తీసుకువెళ్తూ కనిపించాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో విరిగి ముక్కలైపోయి మిగిలిన శిధిలాలు మాత్రం వున్నాయి. కొద్దిమంది జనాభా వుంటున్నారు. అక్కడ సముద్రాన్ని కూడా చూసి వచ్చేసాం. రామసేతువు శిధిలాలను చూడాలన్న మా కోరిక తీరలేదు. అక్కడ మేము వెళ్లిన రోజు చాలా నీళ్లు ఉండటంతో అధికారులు మమ్మల్ని ముందే ఆపేసారు.
పాంబన్ నుంచి రామేశ్వరం లంకను కలుపుతూ కట్టిన ఇందిరా బ్రిడ్జి 1988 లో ప్రారంభం అయ్యింది. రామనాథస్వామి ఆలయమే కాక, అక్కడ చూడటానికి ఎన్నో విశేషాలున్నాయి. రామపాదం కూడా ఒకటి. ఈ ఆలయం ఆ ప్రాంతాని కంతా ఎత్తైన ప్రదేశంలో వుంది. దీనినే గంధమాదన పర్వతం అని కూడా అంటారు. ఇది రెండు అంతస్థుల ఆలయం. అక్కడి నుంచి చూస్తే మొత్తం రామేశ్వరం కనపడుతుంది. అది చేరాలంటే వెళ్లే దారి కూడా ఎంతో రమణీయంగా ఉంటుంది. అటూ ఇటూ సముద్రం, మధ్యలో రోడ్డు. కోదండ రామాలయంలోనే రాముడు విభీషణునికి కిరీటం పెట్టి, లంకారాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడని అక్కడ గోడలపై శిల్పాలలో చెక్కి వుంది. రామతీర్థం, లక్ష్మణ తీర్థం కూడా వున్నాయి. రామతీర్థం దగ్గర ఆలయంలో రాముడి జన్మ రాశి చక్రం కూడా కనిపిస్తుంది. రామేశ్వరంలో ఎక్కడ ముట్టుకున్నా, ఏమి చూసినా రాముడి కథలు, గాధలే కనపడతాయి, వినపడతాయి. 2004 సునామీ సందర్భంగా చాలా రామ సేతువు రాళ్లు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అవి అన్నీ, ఎంత పెద్దవయినా సరే నీళ్ళల్లో తేలుతూ ఉంటాయి. ఇక్కడ అన్ని ఆలయాల్లో ఆ దృశ్యాన్ని చూడొచ్చు. కావాలంటే అమ్ముతున్నారు కూడా. మేమూ చిన్న చిన్న రాళ్లు కొనుక్కొచ్చాము. చిన్నవి ఎందుకంటే తక్కువ బరువుంటాయని. సరదాగా అనిపించింది. ఇవి అన్నీ పోరస్, అంటే రంధ్రాలతో ఉంటాయి, బహుశా అందుకే అవి నీళ్ళల్లో తేలుతున్నాయేమో.
ఆలయంలో మరో ప్రత్యేకమైన విశేషం ఏమంటే, అక్కడి బావులలో స్నానం. ఈ పధ్ధతి ఇంకే గుడి లోనూ చూడం. ఆలయంలో మొత్తం 21 బావులున్నాయి. ఇక్కడ వీటిని తీర్థాలంటారు. అన్ని బావుల్లో స్నానం చేసి ఆతరువాత రామనాథస్వామిని దర్శించుకోవడం ఒక సంప్రదాయం. ఇంకొక తీర్థంగా సముద్రం బీచ్ నే అగ్నితీర్థం అని అంటారు. ఈ అగ్నితీర్థాన్నే మొదటి బావిగా భావిస్తారు. మిగిలిన తీర్థాలన్నీ ఆలయం లోపలే ఉంటాయి. మొత్తం స్నానం చేయాల్సిన బావులు 22 వున్నాయి. అసలు మొత్తం బావులు 64 ఉన్నాయిట, కానీ అన్నీ అందుబాటులో లేవు. కొన్ని బావులు చెడిపోతే, కొన్ని పూడిపోయాయిట. రామకృష్ణ మిషన్ వారు కొన్నాళ్ళనుంచీ ఆ బావులన్నింటినీ బాగుచేసి, తిరిగి ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కనిపించకుండా పోయిన పాండవులు, ద్రౌపది స్నానం చేసిన ధర్మార్ తీర్థాన్ని కూడా ఆలయం వారు ఇచ్చిన మ్యాపులు, స్థానిక వృద్ధుల సహాయంతో తవ్వి తీసి పునరుద్ధరించారు. ఈ విధంగా ఎన్నో సంస్థలు ఇక్కడ సేవ చేస్తూనే వున్నాయి. ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి కానీ తమిళేతరులకు కొంచం భాషా సమస్య ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన వెబ్ సైట్ లింక్ ని ఇక్కడ ఇస్తున్నాను. అన్ని వివరాలూ తెలుస్తాయి. http://www.rameswaramtemple.tnhrce.in
మేము 2014 అక్టోబర్ లో కాశీ, ప్రయాగ వెళ్ళాము. అప్పుడే మేము కాశీ రామేశ్వరం యాత్ర పూర్తి చేయాలని సంకల్పించాం. కాశీ రామేశ్వరం యాత్ర అంటే సంపూర్ణ తీర్థయాత్ర అంటారు. అంటే కాశీ నుంచి గంగాజలం తీసుకువచ్చి, రామేశ్వరం లోని సముద్రంలో కలపాలనీ, తిరిగి రామేశ్వరం సముద్రంలో నుంచి ఇసుకను తీసుకు వచ్చి, కాశీలోని గంగలో కలపాలనేది నియమం. అదీ ఈ మొత్తం కార్యక్రమం 6 నెలల లోపల పూర్తి చేయాలనేది కూడా ఒక నియమం. అప్పుడు కొంతమంది మమ్మల్ని, ఇదేమి పిచ్చి ఆచారం అని నవ్వారు కూడా. కానీ మేము ఈ కార్యక్రమం చేపట్టదల్చుకున్నాం. మంచి సంకల్పంతో చేస్తే, అన్నీ దేవుడే చూసుకుంటాడని మా నమ్మకం. 2014 అక్టోబర్ లో కాశీ నుంచి గంగాజలం తెచ్చుకున్నాం. అప్పుడు నేను కాశీలో లక్షవత్తుల నోము కూడా చేసుకున్నాను. మళ్ళీ 2015 ఫిబ్రవరిలో, మా శ్రీలంక యాత్రకు వెళ్లేముందు రామేశ్వరం వెళ్లాం. అప్పుడు మేము తెచ్చిన గంగాజలంతో రామేశ్వరునికి అభిషేకం చేశాం. కొంచం గంగాజలం కోదండరామస్వామి ఆలయం వద్ద మేమే స్వయంగా సముద్రంలో కలిపాం. ఆ తరువాత అగ్నితీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు, అక్కడ ఒక పురోహితునికి మా సంపూర్ణ తీర్థయాత్ర కాన్సెప్ట్ చెప్పి, మావద్ద నున్న గంగాజలం ఇచ్చి పూజ చెయ్యమని అడిగాం. ఆయన చాలా చక్కగా, మా చేత సముద్రంలో నుంచి ఇసుక తెప్పించి, ఆ ఇసుకతో మెట్లు మెట్లుగా మూడు లింగాలు చేసి, మూడింటికీ కలిపి ఆ ఇసుకతోనే ఒకే పానవట్టంలో మూడు లింగాలూ వచ్చేలా చేసి
మాతో చక్కగా ఆ లింగాలకి పంచామృతాభిషేకం చేయించాడు. పూజ అంతా అయిన తరువాత ఆ పెద్ద లింగాన్ని సముద్రంలో కలిపి రమ్మన్నాడు. చిన్న లింగాన్ని తనకు దానం ఇమ్మన్నాడు. మధ్యలో లింగాన్ని, ఎక్కడి నుంచి తెప్పించాడో కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్ తెప్పించి ఇచ్చి, దానిలో పెట్టించి మమ్మల్ని తీసుకువెళ్లి కాశీ గంగలో కలపమన్నాడు. ఈ పని అంతా 6 నెలల లోనే పూర్తి కావాలని ఆయన్న హెచ్చరించాడు. తరువాత 2015 ఫిబ్రవరిలో కాశీ వెళ్లాం, మా మామగారి తద్దినం పెట్టడానికి (ఆయన సరిగ్గా ఉగాది రోజునే పోయారు). ఆ సందర్భంలో మళ్ళీ కేదార్ ఘాట్ కి వెళ్లి అక్కడ మా కాన్సెప్ట్ చెప్పి పూజ చెయ్యమని పురోహితుని అడిగాం. ఆయన మాతో గంగాస్నానం చేయించి, మేము తెచ్చిన ఇసుకతో ఒక పెద్ద శివ లింగం చేసి, మళ్ళీ అన్ని పూజలూ, అభిషేకాలూ యధావిధిగా చేయించి ఆ లింగాన్ని మాచేత గంగలో కలిపించాడు. దానితో మా సంపూర్ణ తీర్థయాత్ర, కాశీ-రామేశ్వరం- కాశీ, సంకల్పం పూర్తి అయ్యింది. ఓం నమశ్శివాయ.
అగ్ని తీర్థం స్నానంతో మొదలుపెట్టి, ఆలయంలో వున్న అన్ని బావుల్లో కూడా స్నానం చేసి రామేశ్వరుణ్ణి, పర్వతవర్ధని అమ్మవారినీ దర్శించుకుని బయటకు వచ్చాం. బావుల్లో స్నానం అంటే మామూలు స్నానం కాదు. ప్రతి బావికీ నీళ్లు చేది మన నెత్తిన పోసేందుకు ఒక సహాయకుడు ఉంటాడు. ఆలయం వారు ఈ అన్ని స్నానాలకూ ఒక టికెట్ పెట్టారు. అయినప్పటికీ మనం పైన వేరే డబ్బులిస్తే, మనతో పాటు వచ్చేందుకు మనుషులుంటారు. వీళ్ళ సహాయం మాకు నిజంగా చాలా తోడుగా ఉపయోగపడింది. ఆ మనిషి మా బాగులు పట్టుకుని మాతోనే వస్తూ అన్ని బావుల్లో చక్కగా స్నానం చేయించాడు. చివరి బావి పేరు కోటి లేదా కోడి తీర్థం. తమిళం వాళ్ళు 'ట' ను 'డ' అని పలుకుతారు. ఇక్కడ బావిలో నుంచి నీరు మన నెత్తిన స్వయంగా ఆలయ పురోహితుడే పోస్తాడు. ఆ తరువాత బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు వున్నాయి. ఆ తరువాత గుడిలో మేము తెచ్చిన గంగాజలంతో దేవుడికి అభిషేకం చేయించాక మాకు సహాయంగా వచ్చిన మనిషి వెళ్ళిపోయాడు. నిజంగా మాకు చాలా హెల్ప్ ఫుల్ గా వున్నాడు.
బయటకు వచ్చాక అక్కడ వున్న బోట్ లో సముద్రంలో ఒక గంట తిరిగి వచ్చాం. ఆ తరువాత ధనుష్కోడి చూట్టానికి వెళ్లాం. అన్నట్టు ఈ వూళ్ళో ఇంకో ఆకర్షణ కూడా వుంది. ఇది మన పూర్వ రాష్ట్రపతి కలాం గారి జన్మస్థలం. వారి ఇంటికి వెళ్లాం. అక్కడ కలాం గారి అన్నగారు ఒక షాప్ నడుపుతున్నారు. ఆ షాప్, వారింట్లో వున్న మ్యూజియం చూసాం. ఆ షాప్ లో నేనొక దక్షిణావృత శంఖం కూడా కొనుక్కున్నా. మొత్తం మీద చాలా చాలా సంతృప్తికరంగా మా రామేశ్వర యాత్ర ముగిసింది.
ఓం శ్రీ రామచంద్రాయ నమః, ఓం శ్రీ రామేశ్వరాయనమః
ఇక తరువాత నాగేశం దారుకావనే అనుకుంటూ నాగేశ్వరున్ని చూసి వద్దాం. ఈ నాగేశ్వర క్షేత్రాలు కూడా రెండు. ఒకటి గుజరాత్ లోని ద్వారక దగ్గర ఉంటే, మరొకటి మహారాష్ట్రలోని ఔంధ్ లో వుంది.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి