నాగేశం దారుకావనే
ఇప్పుడు ఆ శ్లోకంలోని ఎనిమిదవ క్షేత్రాన్ని చూద్దాం. ఇది కూడా రెండు చోట్ల ఉందని తెలిసింది. అందువల్ల రెండూ చూశాం. దీనితో మేము పదిహేను ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలనూ చూసినట్లయింది. ఒకటి మహారాష్ట్ర లోని ఔంధ్ లో వున్న నాగనాథ్ అయితే, రెండోది గుజరాత్ లో వున్న నాగేశ్వర్. ఆ రెండు ప్రాంతాల వారు కూడా వారిదే అసలైన జ్యోతిర్లింగ క్షేత్రమని అంటున్నారు. రెండూ కూడా చాలా అద్భుతమైన మందిరాలే. ఆదిశంకరులు తన సంపూర్ణ స్తోత్రంలో ఈక్షేత్రం గురించి ఈవిధంగా చెప్పారు.
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||
ఈ శ్లోకార్ధం ఏమిటంటే, సదంగమనే రమ్యమైన నగరంలో, చక్కగా ఆభరణ భూషితుడై, సకల భోగాలను అనుభవిస్తూ, సద్భక్తులకు ముక్తిని ప్రసాదించే శ్రీనాగనాథుణ్ని శరణం వేడుతున్నాను అని. ఈ లక్షణాలున్న ఆ రెండు క్షేత్రాలను గురించీ తెలుసుకుందాం. మొదటగా ఔంధా నాగనాథ్ గురించి చెప్పుకుందాం.
ఔంధ్ అనే పట్టణంలో ఈ నాగనాథాలయం వుంది. మేము పర్లి, అంబాజోగై చూసిన తరువాత ఈ ఔంధ్ నాగనాథ్ ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం కూడా బైట నుంచి చూసీ చూడంగానే, ఇది జ్యోతిర్లింగ క్షేత్రమని తెలిసిపోయేటట్టు వుంది. లోపల ప్రాంగణం కూడా చాలా పెద్దది. అన్నీ విశాలంగా వున్నా గర్భగృహం మాత్రం చాలా చాలా చిన్నది. ఒకసారి ఏడెనిమిది మంది కంటే పట్టరు. పైగా ఈ గర్భగృహం పాతాళంలో అంటే, భూమి లెవెల్ కన్నా ఓ ఆరడుగులు కిందకి వుంటుంది. లోపలకు వెళ్లాలంటే కిందకు కొంచెం దూకాలి. అంత ఎత్తుకీ కలిపి ఓ రెండో, మూడో మెట్లు ఉంటాయి. కాకపోతే ఓ బలమైన మోకు కట్టారు, పట్టుకుని ఎక్కడానికీ, దిగడానికీ. లోపల కూడా వంగుని నుంచోవాలి, లేదంటే కూర్చోవాలి. మేము అభిషేకం చేయిస్తామంటే, మమ్మల్ని కూర్చోమని అన్నారు. చాలా ఇరుకుగా కూర్చున్నాం. అభిషేకం మాత్రం చాలా వివరంగా చేయించాడు. ఒకవైపు మేము ఇద్దరం కూర్చుని అభిషేకం చేస్తుంటే, మరోవైపు మరో పురోహితుడు ఇంకొక కుటుంబానికి అభిషేకం చేయిస్తున్నాడు. మెట్ల వైపు నుంచి కేవలం దర్శనం కోసం వచ్చి పోయే భక్తులకి వదిలారు. చిన్న 2x2 అడుగులున్న కంత మార్గం ఒక్కటే అందరికీ లోపలికి రావటానికీ, బైటకు పోవటానికీనూ. ఓ ఇద్దరు వాలంటీర్లు కూడా అక్కడే వుండి కావాల్సిన వారికి పైకి గెంతటానికి, కిందకు దూకటానికీ సహాయం చేస్తున్నారు. అభిషేకం, అర్చన చేశాక ఆ నిర్మాల్యంలో నుంచి వెండివి మారేడు దళాలు తీసిచ్చి, ఇంట్లో పూజకు వాడుకోమన్నాడు. అన్నీ ముగించుకుని నెమ్మదిగా ఆ తాడు సహాయంతో బైటకు చేరాం. ఆ నాగనాథ లింగం చాలా పురాతనమైనదిగా తెలుస్తోంది. పెద్ద పానవట్టం, పైగా అభిషేక జలం పోవటానికి ఓ మార్గం, దానిలో నుంచి పెద్ద పెద్ద పాములు వచ్చి శివలింగాన్ని చుట్టుకుని వుంటాయని, మనుషుల అలికిడైతే, వెళ్ళిపోతాయనీ, నాగులు పూజిస్తున్నాయి కనుకే ఈ శివుణ్ణి నాగనాథుడంటారనీ, పూర్వం ఈ ప్రదేశమంతా దారుకా వనమనీ చెప్పాడు మా పురోహితుడు.

ఈ ఆలయం పాండవులు కట్టినదనీ, తరువాత కాలంలో ఔరంగజేబు ధ్వంసం చేస్తే, అహల్యాబాయి హోల్కర్ తిరిగి ధ్వంసం చేసిన భాగాల్ని పునః నిర్మించిందట. కింది అంతస్తులు మాత్రం ఎక్కువ దెబ్బ తినలేదు. శిల్పం మాత్రం అద్భుతంగా వుంది. చాలా వివరంగా మైన్యూట్ వర్క్ కనిపించింది శిల్పంలో. గట్టి రాతి కట్టడం. నామదేవ్ కూడా ఇక్కడే శివుణ్ణి సేవించాడు. ఈ ప్రాంతవాసుల్ని దారుకుడనే అసురుడు హింసిస్తూ ఉంటే, వాడిని వధించి భక్తులను రక్షిస్తూ నాగనాథుడనే పేరుతో ఇక్కడే ఉండిపోయాడని స్థలగాధ. ఈ ఆలయం వెబ్ సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. ఆలయానికి వెళ్లాలనుకునే వారికి సహాయంగా ఉంటుంది.
ఇప్పుడు గుజరాత్ లో వున్న నాగేశ్వర్ మందిరానికి వెళదాం. ద్వారక, సోమనాథ్ చూడడానికి వెళ్లే టూర్ లో భాగంగా ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాం. ద్వారక నుంచి నాగేశ్వర్ వచ్చాం. దూరం నుంచే ఒక పెద్ద శివుని విగ్రహం కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే దానిమీద నెమళ్ళున్నాయి. కాసేపటికి చూస్తుండగానే, ఎగిరిపోయాయి. మేము లోపలికి వెళ్లి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాం. అక్కడ అభిషేకం చేసుకుంటాం అని అడిగితే, మగవాళ్ళు మాత్రం చేసుకోవచ్చు, అది కూడా వాళ్ళిచ్చిన మడి ధోవతులు కట్టుకున్నాక అని చెప్పారు. మేము సరే, అనంగానే పూజారులు మావారిని లోపలకు తీసుకు వెళ్లి ధోవతి కట్టి కూర్చోపెట్టారు. నేను కూడా ఆ లోపలే పాలరాతి గట్టుమీద కూర్చున్నా. చక్కగా విధి విధానంగా అర్చన, అభిషేకం చేసుకున్నాం.

ఆలయం అంతా కొత్తగా ఇప్పుడే కట్టించినట్టుగా వుంది. మరి పురాతన జ్యోతిర్లింగమంటున్నారు, లింగం మాత్రం సాలగ్రామం, చూస్తేనే తెలుస్తోంది. ఆ పూజారిని ఈ విషయమే అడిగితే, పురాతన ఆలయం పూర్తిగా శిధిలమైపోతే, T-Series అధినేత గుల్షన్ కుమార్ ఈ మందిరాన్ని తానొక్కడే ఖర్చు అంతా భరించి పునర్మించాడని చెప్పాడు. ఆతడు మధ్యలో హత్యకు గురి అయితే, అతని కుటుంబ సభ్యులు పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారట. గుల్షన్ కుమార్ ని తలచుకుంటే ఎంతో బాధ వేసింది. అక్కడ ఔంధ్ లో అహల్యాబాయి హోల్కర్ చేసిన పని ఇక్కడ గుల్షన్ కుమార్ చేశాడు అనిపించింది. ఇంత అద్భుతమైన ఆలయం కట్టించిన గుల్షన్ కుమార్ ఇంకా బతికి ఉంటే ఇంకెన్ని చేసేవాడో అనిపించింది. ఇక్కడ కూడా దారుకుడనే రాక్షసుడి కథే చెప్పారు. ఇది కూడా దట్టమైన చెట్ల మధ్యే వుంది. ఈ ఆలయం వెబ్ సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. చూడండి.
ఈ క్షేత్ర దర్శనంతో మొత్తం పదిహేను జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నట్టు అనిపించింది.
ఓం శ్రీ నాగనాథాయనమః, ఓం శ్రీ నాగేశ్వరాయనమః
నేను మాత్రం ఇంకా నాలుగు జ్యోతిర్లింగాల గురించి వ్రాయాలి. ఇప్పుడు తొమ్మిదవ జ్యోతిర్లింగం వారాణాస్యాంతు విశ్వేశం అని స్మరిస్తూ కాశీ వెళదాం.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి