వారాణస్యాం తు విశ్వేశం
9. వారాణస్యాం తు విశ్వేశం......
కాశీ, వారాణసి, బెనారస్, అవిముక్త క్షేత్రం, ఆనందవనం ఈ పేర్లన్నీ ఈ నగరానివే. 'క' అంటే శివుడు. కనుక ఇది శివపురి, శివధామం. ఇక్కడ అంతా శివమయం. పుట్టెడు ధాన్యం తీసుకుని వెళ్లినా, కాశీలో ఒక్కొక్క లింగం ముందు ఒక్కొక్క గింజ పెడితే, లింగాలే మిగిలిపోతాయి కానీ, ధాన్యం చాలదు అని ప్రతీతి. నిజ్జంగా నిజం అంతే. మేము ఈ క్షేత్రానికి నాలుగు సార్లు వెళ్ళాము. బొకారో నుంచి ఒకసారి, హైదరాబాద్ నుంచి మూడుసార్లు. ఒకసారి వెళ్ళినప్పుడు లక్షవత్తుల నోము నేను కాశీలోనే చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. మరోసారి వెళ్ళినప్పుడు 12 రోజులున్నాము. ఎన్నెన్ని అనుభవాలు, అనుభూతులు కాశీతో పెనవేసుకుని ఉన్నాయో మాకే తెలుసు. అక్కడి గల్లీ గల్లీ, చెట్టు పుట్ట, గుడీ గోపురం ఎన్నెన్ని తిరిగామో, ఎంతెంత తిరిగామో మాకే తెలుసు. ఎంత నడిచామో, ఎన్నిసార్లు రిక్షాలు, ఆటోలు, పడవలు ఎక్కి దిగామో మాకే లెక్క లేదు. ఇప్పుడు ఈ క్షేత్రం గురించి వ్రాయాలంటే, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది ఒక పెద్ద ప్రశ్న నాకు. చూద్దాం, ఏమేమి చెప్పగలనో, విశ్వనాథుడు ఏమేమి చెప్పిస్తాడో. ఆ విశ్వేశ్వరునికి నమస్కరించి ప్రారంభిస్తాను. ఓం నమో విశ్వేశ్వరాయనమః. మొదటగా ఈ క్షేత్రం గురించి ఆది శంకరాచార్యుల శ్లోకంలో ఏముందో చూద్దాం.
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||
దాని ప్రకారం 'మేరుపర్వతం తనకన్నా పెద్ద పర్వతం, దాని చుట్టూ సూర్యుడు ప్రదక్షిణం చేస్తాడు' అని నారదముని ద్వారా తెలుసుకున్న వింధ్య, "నేనేం తక్కువ, నేనూ పెద్దగా ఎదుగుతాను" అని బాగా ఎత్తుగా పెరిగిపోయేసరికి సూర్యుడు దాన్ని దాటలేక మిగిలిన ప్రాంతాన్నే పరిభ్రమించాడుట. దాంతో దక్షిణ భారత ప్రాంతమంతా పూర్తిగా చీకట్లో ఉండిపోయిందిట. దానితో దక్షిణ భారత దేశంలో సూర్యోదయం, సూర్యాస్తమయం లేకపోవటంతో తిధులు, వారాలు, నెలలు, సంవత్సరాలు మారలేదు. ఉత్తర భారతంలో అయితే మామూలుగా సంవత్సరాలు మారిపోతున్నాయి. అప్పుడు దేవతలంతా ఈ ఇబ్బంది గురించి ఇంద్రుడి దగ్గరకు వెళ్లి చెప్పుకుంటే, ఆయన అగస్త్యుడిని ఎన్నుకుని వింధ్యపర్వతం ఎత్తు అణచమని అడిగాడట. అప్పుడు అగస్త్యుడు దేవతల ఆదేశంతో తన కుటుంబంతో సహా దక్షిణ భారత పర్యటనకు బయలుదేరి, వింధ్యపర్వతాల వద్దకు రాగానే, వింధ్య పర్వతం అగస్త్యుని చూసి వంగి దణ్ణం పెట్టాడు. అప్పుడు అగస్త్యుడు వింధ్యపర్వతాన్ని ఇదే విధంగా వంగి ఉండమని, లేకపోతే తనవంటి పొట్టివాళ్లకు వింధ్యని దాటి వెళ్ళటం కష్టమవుతుందని, తాను దక్షిణభారత యాత్రలు చేసి తిరిగి వస్తానని చెప్పాడు. దానితో తిరిగి, వింధ్యపర్వతాలు మళ్ళీ పొట్టిగా వంగిపోయాయి. అప్పటినుంచి సూర్యుడు యధావిధిగా పరిభ్రమణం మొదలుపెట్టాడు. దానితో దక్షిణభారత దేశంలో తిరిగి సంవత్సరాలు మారటం మొదలైంది. ఈ కారణం చేతే మనకు వాళ్లకు ఇన్ని సంవత్సరాల తేడా వుంది. నేను కాశీలో సంకల్పం చెప్తుంటే అప్పుడే ఆగి సంవత్సరం తప్పు చెప్తున్నారని అడిగాను, కానీ ఆ పురోహితుడు సరిగా కారణం చెప్పలేక పోయాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత మా గురువుగారు, శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి వారు చెప్పిన ఒక ప్రవచనంలో ఈ చిక్కుముడి నాకు వీడింది. ఈ టైం డిఫరెన్స్ రహస్యం మీతోనూ పంచుకుంటున్నా.
కాశీలో ఎక్కడికి వెళ్లినా ప్రతిసారీ సంకల్పంలో ఒక శ్లోకం చెప్తారు. ఆశ్లోకం ఇదీ. ఈశ్లోకం ద్వారా కాశీలో వున్న ప్రముఖ స్థానాల పేర్లు తెలుస్తాయి. వీటన్నింటి గురించి ముందు ముందు ఒక్కొక్కటీ తెలుసుకుందాం.
విశ్వేశం మాధవం డుంఢిమ్, దండపాణించ భైరవం|
వందే కాశీమ్ గుహాం గంగాం, భవానీం మణికర్ణికాం ||
అన్ని ప్రముఖ దేవాలయాల్లాగానే, కాశీ నగరం కూడా ముసల్మానుల దండయాత్రలో విధ్వంసం పాలైంది. అప్పుడు ఇండోర్ రాణి అహల్యాబాయి కాశీ ఆలయాన్ని పునరుద్ధరించి నర్మదా బాణ లింగాన్ని తెచ్చి, ఇక్కడ పాత ఆలయంలోని ఒక గదిలో ప్రతిష్టించి పూజాదికాలు ప్రారంభించింది. అహల్యాబాయి మహా శివ భక్తురాలు. ఆమె గురించి మాహేశ్వర్ గురించి చెప్పుకున్నప్పుడు తలచుకుందాం. తరువాత కాలంలో మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయ గోపురాన్ని పూర్తిగా స్వర్ణకవచం వేయటానికి బంగారం ఇవ్వటంతో, గుడి మొత్తం స్వర్ణాలయం అయ్యింది. ఈ నగరం సప్త మోక్షపురాలలో ఒకటి. ఉజ్జయిని గురించి చెప్పినప్పుడు మోక్షపురాల గురించి చెప్పాను. ఇక్కడ శ్లోకం మాత్రం చెప్పి ముందుకు వెళదాము.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా
పురీ ద్వారవతీ జ్ఞేయా సప్తై తా మోక్షదాయకాః
ఈ కాశీ మోక్షపురాలలో నాలుగోది. కాశీలో గంగానదిలో స్నానం చేసి, విశ్వేశ్వరుణ్ణి దర్శించి గంగాజలంతో అభిషేకం చేస్తే మోక్షం వస్తుందని నమ్మకం. ఇక్కడ అహల్యాబాయి తరువాత మరో కొత్త విశ్వనాథ మందిరాన్ని బిర్లావాళ్లు కట్టారు. దాన్ని బిర్లా మందిరం అని అంటారు. ఈ బిర్లా మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, BHU, ప్రాంగణంలో వుంది. చాలా బాగుంటుంది ఈ మందిరం. సనాతన ధర్మం, మన పురాణాలు, కావ్యాలు అన్నీ వివరంగా కుడ్యచిత్రాలు, శిల్పాల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. మా పెద్దపెదనాన్నగారు, మా పెద్ద బాబాయి, మా నాన్న కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. అక్కడ బయట ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ వుంది.
కాశీకి రాంగానే ముందు సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళటం ఒక అలవాటు. కానీ పై శ్లోకంలో డుంఢి గణపతి గురించే చెప్పారు. ఇంకో గణపతి చింతామణి గణపతి. సాక్షి గణపతి, డుంఢి గణపతి విశ్వనాథ మందిరం పక్కనే ఉంటే, చింతామణి గణపతి మందిరం మాత్రం అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా ప్రాచీన మందిరం. సాక్షి గణపతి, డుంఢి గణపతిలవి దేవాలయాలనే కంటే, చిన్న వైశాల్యంతో వున్న మంటపాలనచ్చు. అంత చిన్నవి. విగ్రహాలు మాత్రం శతాబ్దాల పురాతనమైనవి. దగ్గరకు వెళ్తే వాటి శక్తి మనం కూడా ఫీల్ అవుతాం. దండపాణి ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈయన ఇక్కడ నగరానికి కొత్వాలు లాంటి వాడు. వెళ్లిన భక్తులను దండంతో అక్కడ కొడుతూ వుంటారు, నెమ్మదిగానే అనుకోండి.
తప్పనిసరిగా దర్శించవలసిన మరో ఆలయం కాలభైరవ ఆలయం. ఈ కాలభైరవుడి ఇక్కడి క్షేత్రపాలకుడు. ఈ ఆలయంలో కూడా మద్యం ఛాయలు కొంచం కనపడతాయి. కాశీ దారాలు కట్టేదిక్కడే. కుక్కలు, అవీ, నల్లకుక్కలు చాలా కనపడతాయి. ఈ కాలభైరవ ఆలయానికి దగ్గర లోనే మృత్యుంజయ ఆలయం ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, అకాలమృత్యువు రాదనేది ఒక విశ్వాసం. ఈ మృత్యుంజయ ఆలయం ప్రాంగణం లోనే, పురాతన ఆలయాలు చాలా కనపడతాయి. దీన్ని ఒక ఆలయం అనే కన్నా, ఆలయాల సముదాయం అంటే చక్కగా సరిపోతుంది. ఇక్కడే మనకు ధన్వంతరి బావి కనపడుతుంది. బావిలో నుంచి నీళ్లుతోడి, గ్లాసుల్లో పోసి ఇచ్చేవారుంటారు. ఆ నీళ్లు తాగితే ఏ రోగాలూ రావనీ, రోగాలు వున్నా పోతాయని ఒక నమ్మకం. అక్కడ వరండాల్లో పడుకుని, అక్కడే ఉండిపోయేవాళ్లు కూడా చాలామంది కనపడతారు. మాకు అక్కడ ఒక పెద్దాయన కనపడి ఏయే ఆలయాలకు ఎలా వెళ్ళాలో దారి చెప్పాడు. తాను కాశీలోనే వుండి జపం, తపం చేసుకోవటానికి వచ్చాట్ట. చాలా తపశ్శక్తి ఆయనలో కనిపించింది.
మరొక చక్కని ఆలయం సంకటమోచన్ హనుమాన్ మందిరం. చాలా మహత్తు గల దేవుడని చెప్తారు. విగ్రహం మాత్రం చాలా ప్రిమిటివ్ దని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నిరంతరం పూజలు జరుగుతూనే ఉంటాయి. తులసీదాస మందిరానికి కూడా సాధారణంగా అందరూ వెళ్తూ వుంటారు. తులసీదాస్ ఇక్కడే రామచరితమానస్ రాసాడని అంటారు. నిరంతరం రామనామ జపం జరుగుతూ ఉంటుంది. సంకటమోచన్ ఆలయంలో వున్న రామాలయంలో రాముడు కనపడే విధంగా కూర్చుని తులసీదాస్ రాసాడని అంటారు. ఈయన పేరుతో తులసీఘాట్ కూడా వుంది. మరొక ఆలయం గవ్వలమ్మ ఆలయం. ఈ దేవతనే కౌడీబాయ్ అని కూడా అంటారు. చాలా చిన్న ఆలయం. అక్కడి పురోహితులు దళితులు. ఈ దేవతను విశ్వనాథునికి చెల్లెలని చెప్తారు. అక్కడ గవ్వలు వేసి మన యాత్రా ఫలితం చెప్తూ వుంటారు ఆ పురోహితులు. ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్పటం నేను స్వయంగా చూసాను. అందుకే గవ్వలు సరదాగా వేస్తే వేయించుకోండి కానీ, సీరియస్ గా కాదు.
ఇక్కడి గంగానది కాశీ పొడవునా పారుతూనే ఉంటుంది. గంగానది పొడవునా ఘాట్స్ వున్నాయి. వరుణ, అసి నదుల సంగమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడి ఘాట్లు వరుణాఘాట్ తో మొదలెడితే, అస్సీఘాట్ తో ముగుస్తాయి. ఈ ఘాట్లలో కొన్ని ముఖ్య ఘాట్లున్నాయి. ఆ ఘాట్లలో తప్పకుండా స్నానం చేయాలని అంటారు. అవి అస్సీఘాట్, దశాశ్వమేధఘాట్, మణికర్ణికాఘాట్, పంచగంగఘాట్, ఆదికేశవఘాట్. ఉదయం అస్సీఘాట్ లో గంగాహారతి చేస్తారు. కళ్ళకు హాయిగా ఉంటుంది. అలాగే సాయంత్రం దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్ లలో కూడా చేస్తారు. మేము ఈ హారతులను ఒడ్డు మీద కూర్చునీ చూసాము. నదిలో నుంచి పడవలో కూర్చునీ చూసాము. ఆ హారతులను చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు. మేము కళ్లజోళ్లు పెట్టుకుని నాలుగేసి కళ్లతో చూశామనుకోండి.
విశ్వనాథుడు కాశీలో, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, వాళ్ళు మరే ఇతర పుణ్యక్షేత్రం చూడాలన్నా కాశీ వదిలి బయటకు వెళ్లకుండా, అన్ని క్షేత్రాలూ కాశీలోని ఉండేలా వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల కాశీలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలూ, ద్వాదశ ఆదిత్యులు, వగైరా అన్ని ధామాలూ ఇక్కడే ఉన్నాయి. మేము కూడా కాశీలో కొన్ని ఆదిత్య ఆలయాలూ, కొన్ని శక్తిపీఠాలూ, కొన్ని దశమహావిద్యలు, అన్ని జ్యోతిర్లింగాలూ చూశాం. అన్నపూర్ణ ఆలయం విశ్వనాథుని మందిరం దగ్గర లోనే ఉంటుంది. ఆ మందిరం లోనే వెనుక వైపు వున్న భాగంలో చాలా ఆలయాలు వున్నాయి. అందులో ఒక ఉపాలయం శ్లోకంలో చెప్పిన భవానీ అమ్మవారిది. మొత్తం కాశీలో ఇక్కడ ఒక్కచోటే భవానీ అమ్మవారు వున్నది. ఆ తరువాత ఈ ఆలయంలోనే ప్రదక్షిణా మార్గంలో చక్రేశ్వరస్వామి లింగం వుంది. ఆ లింగంపై శ్రీచక్రం లిఖించబడి ఉంటుంది. దానికి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇటువంటి లింగం మేము చూసింది ఇదొక్కటే.
లోలార్క
ఈ అన్నపూర్ణ ఆలయం లో మన తెలుగువారే కాశీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ నడుపుతున్నారు. అక్కడ ఉచితంగా రెండు పూటలా వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. కింద కూర్చోలేని వారికి టేబుల్ మీల్స్ కూడా వున్నాయి. మేము చాలాసార్లు అక్కడ అన్నదానం కోసం పే చేసాం. దాన్ని ప్రసాదంగా భావిస్తూ భోజనం కూడా వెళ్లిన ప్రతిసారీ కనీసం ఒక్కసారైనా చేస్తాం. చాలా మంచి శుభ్రమైన భోజనం పెడతారు. ఈ అన్నపూర్ణ ఆలయానికి, విశ్వేశ్వర ఆలయానికీ మధ్యలో శనైశ్చర ఆలయం వుంది. ఇంకా చాలా ఇతర మందిరాలు కూడా ఈ మధ్యలో కనపడతాయి. ఇక్కడ అడుగుకు ఒక దేవాలయం ఉంటుంది. త్రైలింగస్వామి మఠం లేదా ఆశ్రమం కూడా చెప్పుకోదగ్గదే. ఈ త్రైలింగస్వామి మన తెలుగువారే. ఈయన 280 ఏళ్ళు బతికాడని ఆశ్రమం రికార్డుల్లో వుంది అన్నారు. ఆయనది చాలా భారీ శరీరం. గంగలో ఆయనకు దొరికిన ఒక అతి పెద్ద లింగాన్ని గంగాఘాట్ నుంచి సుమారు రెండు మూడొందల అడుగుల ఎత్తుకు భుజం మీద మోసుకుని వచ్చి తన ఆశ్రమంలో ప్రతిష్ట చేసాడు. ఆ లింగం మనం ఈ నాటికీ చూడొచ్చు. బహుశా ఈ సంఘటన రాజమౌళికి నచ్చి బాహుబలిలో ఒక పెద్ద లింగాన్ని హీరో భుజాల మీద ఎత్తి తీసుకువచ్చినట్టు చూపించారేమో అనిపించింది.
ఇక్కడ వున్న శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారిది. ఈ పీఠం గురించి మన శక్తిపీఠాల శీర్షికలో చెప్తాను. ఇక్కడ మరొక దివ్యమైన ఆలయం వుంది. అది వారాహీ ఆలయం. అది భూగర్భంలో ఉంటుంది. ఈ ఆలయం పొద్దున్న మాత్రమే తెరుస్తారు. అదీ ఉదయం 8, 9 గంటల వరకే. ఆ అమ్మవారు గ్రామ దేవత, రాత్రి అంతా గ్రామసంచారం చేసి ఉదయాన్నే పడుకుంటుంది అని నమ్మకం. నైట్ షిఫ్ట్ అన్నమాట. పొద్దున్నే పూజారులు ఆలయంలో పూజ చేసి బయటకు వచ్చేస్తారు. మరెవ్వరికీ ఆలయ గర్భగృహంలోకి ప్రవేశం లేదు. మన లాంటి సామాన్యులందరూ, కిందనున్న రెండు రంధ్రాల ద్వారా అమ్మవారిని చూస్తాం. ఆ వారాహీ అమ్మవారు ఉగ్రదేవత అనీ, అందుకే ఈ ఏర్పాటు చేశారు అని చెప్తారు. ఇక్కడ మరో శక్తి కూడా జన్మించింది. ఆమే మణికర్ణిక, రాణి ఝాన్సీలక్ష్మిబాయి. ఈ మధ్యనే ఆమె మెమోరియల్ ఒకటి ఏర్పాటు చేసి చక్కగా నడుపుతున్నారు. అది కేదార్ ఘాట్ దగ్గరలోనే వుంది.
మరో గొప్ప విషయం, ఇది మన భారతరత్న బిస్మిల్లాఖాన్ గారి వూరు కూడా. ఆయన పుట్టి పెరిగింది ఇక్కడే. ఆయన ముస్లిం అయినా, రోజూ గంగా స్నానం చేసి అక్కడికి దగ్గరలో వున్న బాలాజీ ఆలయం ముందు కూర్చుని రోజూ షహనాయ్ వాయించే వారు. ఒకరోజు ఆయన అలా వాయిస్తుంటే సరస్వతీదేవి తెల్లనివస్త్రాలు ధరించి వచ్చి ఆశీర్వదించిందిట. ఆ తరువాత ఆయన ఇంకా ఇంకా సాధన చేసాట్ట. అన్య మతస్థుడని గుడిలోకి రాకూడదని గుడి వాళ్ళే ఆయన కోసం పక్కనే ఒక గది కేటాయించారు. ఆయన అక్కడ కూర్చుని నిత్యమూ దేవుడికి షహనాయి సేవ చెసేవాడుట. 'సుర్ సే సరస్వతీ' అని అనేవాట్ట. ఈ విషయాలన్నీ వారి పెద్దబ్బాయి మాకు చెప్పాడు. కానీ దురదృష్టకరంగా బిస్మిల్లాఖాన్ గారి తరువాత ఆ ఇంట్లో మరెవ్వరికీ ఆయన సంగీత వారసత్వం రాలేదు. మేము ఆయన ఇంటికి కూడా వెళ్ళాం. కానీ అప్పటికి ఆయన లేరు. ఆయన పెద్దకొడుకు వున్నారు. ఆ ఇంట్లో అప్పుడు కూడా పాతిక మంది బంధుజనం ఉన్నారు. బిస్మిల్లాఖాన్ గారు వుండే రోజుల్లో అయితే వందమందికి పైగా ఉండేవారట. మేము రెండోసారి వెళ్ళినప్పుడు ఆ పెద్దకొడుకూ లేడు. ఆయన కొడుకూ, మేనల్లుడూ వున్నారు.
బిందుమాధవుడు, ఆదికేశవుడు ఇక్కడి వైష్ణవ దేవతలు. అవి కూడా చూసాం. అన్ని చోట్లా శక్తి మేరకు అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు చేసాం. ఇక్కడ జంగంవాడి మఠంలో శైవ భక్తులకు గదులున్నాయి. ఆ మఠంలో కోటి శివలింగాలున్నాయని అంటారు. మేము కూడా వెళ్లి చూసాం. గౌడియా మఠంలో కూడా గదులున్నాయి. నేను లక్షవత్తుల నోము చేసుకున్నది ఈ గౌడియా మఠంలోనే. ఈ రెండు మఠాలూ మెయిన్ రోడ్డులో ఉండటం వల్ల అన్ని వాహనాలూ అక్కడే దొరుకుతాయి. ఇక్కడ ఈ కాశీ చుట్టూ కాశీఖండంలో చెప్పిన పంచకోసీ యాత్ర చేస్తూ వుంటారు. మేము మాత్రం అంతంత దూరాలు నడవలేక చిత్రమయ అంగయాత్ర చేసాం. అంటే మొత్తం కాశీని మూడు భాగాలుగా చేసి ఓంకారఖండము, విశ్వేశ్వరఖండం, కేదారఖండం అని పేరు పెట్టారు. ఈ యాత్రలో మొత్తం 19 ప్రాచీన శివాలయాలు దర్శించడం. ఆ దేవాలయాలన్నీ పూర్తి చేసేసరికి పటంలోని శివుని చిత్రం గ్రాఫ్ లో లాగా ఏర్పడుతుంది. ఆ చిత్రం పైన జత చేశాను, చూడండి.
కాశీలో యాత్ర పూర్తి అయిన తరువాత వ్యాసకాశీ చూసి వెళ్లాలని ఒక నియమం. అప్పుడే యాత్రా ఫలితం దక్కుతుందని ఇంకొక నమ్మకం. మేమూ వ్యాసకాశి వెళ్లాం. అది రామ్ నగర్ లో వున్న, కాశీరాజు కోట నుంచి మరో పది కిలోమీటర్ల దూరంలో వుంది. కోటలో ఒక మ్యూజియం, గుడి వున్నాయి. ఈ గుడినే వ్యాసకాశి అని చూపించేస్తున్నారు. మేము అసలైన వ్యాసకాశీ ఆలయాన్ని వెతికి పట్టుకుని మరీ వెళ్లాం. కోట బయట ఈ వివరం తెలియచేసే పెద్ద బోర్డు కూడా వుంది. అయినా చాలామంది యాత్రికులు ఆటోలు, కాబ్ ల వాళ్ళ మాటలు విని, కోటలోని గుడిని చూసి వచ్చేస్తారు. ఈ వ్యాసకాశీ ఆలయం చందోలీలో వుంది. దారిలో పురాతన వనదుర్గా మందిరం మహాద్భుతమైనది వుంది. ఆ గుడి దగ్గర ఆగి ఆ ఆలయం చూసాం. ఎంత చక్కని శిల్పమో, ఎన్నెన్ని శిల్పాలో, ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. ఫోటోలు తీస్తూనే వున్నా. శతాబ్దాల పాత అతి పురాతన ఆలయం అది. ఆ గుడిమీద అప్పటి కాశీరాజు శాసనాలు కూడా కనిపించాయి. నిజంగా చాలా తృప్తి కలిగింది. నేను ఆ రోజుల్లో వనదుర్గామంత్రం జపం చేస్తున్నా. యాత్రాఫలితం దక్కి, నా మంత్రదేవత దర్శనం ఇచ్చింది అనిపించింది. ఆ దేవత అంతకు ముందు కూడా నా పై అపారకృపతో నాకు ప్రత్యక్ష దర్శనం కూడా ఇచ్చింది. మనసు తృప్తితో నిండిపోగా తిరిగి బరువైన హృదయంతో, రూంకి వచ్చాం. గుండె గొంతులో కొట్లాడుకోవటం అంటే ఏమిటో అనుభవించాను.
ఆ తరువాత మా కాశీ-రామేశ్వరం-కాశీ సంపూర్ణ తీర్థయాత్ర సందర్భంగా రామేశ్వరం నుంచి మేము తెచ్చిన ఇసుకతో లింగార్చన చేసి, ఆ ఇసుకను గంగలో కలిపాము. ఆ పురోహితుడు కూడా మళ్ళీ మాతోనే లింగాన్ని చేయించి, ఆ లింగానికి, పంచామృతాలతో, గంగాజలంతో అభిషేక, అర్చనలు చేసి, దానిని తిరిగి గంగలో కలిపించారు. ఈ కార్యక్రమాన్ని కేదారఘాట్ లో వున్న ఒక బ్రాహ్మణుడు, ధూళిపాళవారు, చేయించారు. ఆ బ్రాహ్మణుడి పద్ధతీ, సంప్రదాయం మాకు నచ్చింది. అందువల్లే, ఆయన దగ్గరే మేము ఒక సంవత్సరం మా మామగారికి, మరో సంవత్సరం మా అత్తగారికి వారి తద్దినాల రోజునే వారికి కాశీలో తద్దినాలు పెట్టాం. అది కూడా చాలా తృప్తిని ఇచ్చింది. మా తమ్ముడు USA నుంచి వచ్చినప్పుడు కూడా ఆ బ్రాహ్మణుడి చేతనే మా అమ్మ, నాన్నలకు కూడా కాశీలో పిండప్రదానాలు చేయించాను. అప్పుడే మా తమ్ముడు బిస్మిల్లాఖాన్ గారి ఇంటికి కూడా వెళ్లి ఆయన షహనాయిలలో రెండింటిని కొనుక్కున్నాడు. ఆ రూపంలో ఆ ఇంటివారికి కూడా ఆదాయం ముట్టి ఆనందపడ్డారు. ఈరోజుకీ వాళ్ళు అప్పుడప్పుడు "బాగున్నారా దీదీ", అంటూ అని కాల్ చేస్తూ వుంటారు. ఆయన ఇల్లు వుండే ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు కానీ కనీసం ఆ బోర్డు కి కూడా సరైన మర్యాద లేదు. బాధ వేసింది.
ఇక మిగిలింది, అసలైనది, ఎన్ని చెప్పినా అన్నీ దీని తరువాతే అనిపించేదీ, శ్రీ విశ్వనాథ మందిరం. ఆ భయంతోనే అన్నీ చెప్పిన తరువాతే ఈ మందిరం గురించి చెప్తున్నా. ప్రస్తుత ఆలయం పక్కనే పురాతన ఆలయం వుండేది. ఇప్పుడు అక్కడ మసీదు వుంది. ఆ విషయం పాపం ఆ అమాయకపు భక్తుడు నందీశ్వరుడికి ఇంకా తెలియదా, అన్నట్లుగా ఆ పురాతన కాలపు నంది ఆ గోడ వైపే తిరిగి ఉంటుంది. పాపం ఆ నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుందో. పూర్తిగా సిందూరం పూయబడిన ఆ పెద్ద నంది విగ్రహం పక్కనే ఒక పెద్ద బావి వుంది. దానినే జ్ఞానవాపి అంటారు. ఆ జ్ఞానవాపి లోనే పురాతన శివాలయంలోని లింగాన్ని అప్పటి ప్రధాన పూజారి ముసల్మానుల దండయాత్రలో భయపడి లింగంతో సహా దూకేశాడని అంటారు. ఇప్పటికీ ఆ బావి లోని నీటినే తీర్థంగా భక్తులకు ఇస్తారు. ఈ విశ్వనాథ మందిరం లోనే ఎన్నో లింగాలు, నందులు, ఉపాలయాలు వున్నాయి. వాటిలో కొన్ని దండపాణి, అవిముక్తేశ్వరుడు, సత్యనారాయణుడు, గణేశుడు, గౌరీ మొదలైనవి.
విశ్వనాథ ఆలయం అని ఈనాటికీ మనం చూస్తోంది ఆనాడు అహల్యాబాయి స్థాపించినదే. ఈ ఒక్క చిన్న లింగం కొన్ని కోట్ల మందిని ఆకర్షిస్తూ, వారిని తన వద్దకు చేర్చుకుంటూ, వారిని పరిరక్షిస్తూ, కూడా అక్కడ ఒక వెండి పానవట్టంలో చక్కగా కూర్చుని యెంత సింపుల్ గా సాదా సీదాగా వున్నాడో గదా అనిపించింది. ఈ మోక్షపురిలో విశ్వనాథుడు, మరో మోక్షపురిలో జగన్నాధుడు నమ్మిన మనందరికీ రక్షగా వున్నాడు. తమాషాగా విశ్వం అన్నా, జగత్తు అన్నా ఒక్కటే. ఈ విశ్వనాథుణ్ణి చూడాలనిపిస్తే ఈ కింద ఇచ్చిన లింక్ లో చూడండి. ఈ ఆలయం యొక్క అన్ని వివరాలూ ఈ లింకులో కనిపిస్తాయి.
మేము కూడా విశ్వనాథుడికి అభిషేకాలు చేసుకున్నాం. సుప్రభాతసేవ చేసుకున్నాం. దర్శనాలు ఎన్నిసార్లు చేసుకున్నామో, మేము కూడా లెక్క కట్టలేము. ఒకసారి కేదారేశ్వరాలయంలో ఓ యాభై రవికల బట్టలు, పసుపు, కుంకుమ, గాజులు అక్కడ వున్న ముత్తైదువులకు ఇచ్చి వాళ్లకు నమస్కరించుకున్నాను. మరోసారి రెండు మూడు చుట్టల గాజులు కొని అవి విశాలాక్షి గుడిలో పంచాను. ఉన్నన్నాళ్లూ విశ్వనాథుణ్ణి రోజూ రెండు మూడుసార్లు కూడా దర్శనం చేసుకున్నాం. గంగాస్నానాలు, దైవదర్శనాలు, లేదంటే, వూళ్ళో కెళ్లి మా చిత్రమయ అంగయాత్ర లోని దేవాలయాలను సందర్శించడం. రోజులు క్షణాల్లో అయిపోయాయి. అది ఏమిటో ప్రతిసారీ కొత్తగానే ఉండేది. ఎప్పుడూ కొత్తగా మరో ఆలయం ఆ దారి లోనే కనిపించేది. అరే, ఇంతవరకూ దీన్ని ఎలా చూడలేదు అనిపించేది. కాశీలోని పురాతన ఆలయాలు ఎన్ని చూసినా, ఇంకా ఎన్నో ఆలయాలు చూడాల్సినవి ఉండేవి. మొత్తానికి మేము ఎప్పుడు కాశీయాత్ర చేసినా ప్రతిసారీ ఎంతో ఆనందంగా, తృప్తిగా వెనుతిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం.
ఓం విశ్వనాథాయనమః, ఓం అన్నపూర్ణాయైనమః, ఓం విశాలాక్షినేనమః,
ఓం వారాహీ దేవ్యై నమః, ఓం కాలభైరవాయనమః, ఓం గంగాయైనమః
దీనితో కాశీ యాత్ర ముగించి తరువాత త్య్రంబకం గౌతమీ తటే అని ప్రారంభిద్దాం.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
చాలా అద్భుతంగా వివరించారు ఆంటీ చాలా ఓపికగా చరిత్ర అంతా చక్కగా రాసి వివరిస్తున్నారు నా లాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది నేను కాశి చూడలేదు వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి దీన్ని చదువుకుని వెళ్ళాలి అప్పుడు యాత్ర పరిపూర్ణం అవుతుంది మీకు చాలా ధన్యవాదములు
రిప్లయితొలగించండి