గోకర్ణం-కుక్కి

గోకర్ణం-కుక్కి 

గోవా రాష్ట్రంలో పణజికి కొద్ధిగా ముందు మంగేష్ సంస్థాన్ ఉంది. ఇక్కడ ఆలయంలో దేవుడు మంగేష్, ఈశ్వరుడు. ఈ మంగేష్ లింగం ఇక్కడకు తీసుకుని రాకముందు ముర్మగోవా లోని కుశస్థలి అనే ప్రాంతంలో ఉండేది. ఆ రోజుల్లో అప్పటి పోర్చుగీసుల పాలనలో అనేక హిందూ ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, కొల్లగొట్టబడ్డాయి. ఆ సమయంలో ఆ క్రిస్టియన్ దాడులకు, మతాంతరీకరణలకు భయబడి, అప్పటి పూజారులైన గౌడ సారస్వత బ్రాహ్మణులు ఈ మంగేష్ లింగాన్ని ప్రియాల్ అనే గ్రామానికి తెచ్చి అక్కడ ప్రతిష్ట చేశారు. ఆ తరువాత ఆ ప్రియాల్ అనే వూరు పేరు, ఈ దేవుడి పేరు మీద మంగేష్ సంస్థాన్ గా మారింది. ఈ ఆలయంలో పార్వతి, గణపతి ఉపాలయాలు కూడా వున్నాయి. ఒక ఆకర్షణీయమైన, పెద్ద దీపస్తంభం కూడా ఆ ఆలయంలో కనిపిస్తుంది. ఆలయం కూడా చాలా ఆకర్షణీయంగా, ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. లతా మంగేష్కర్ గారి తండ్రి, దీనానాథ్ మంగేష్కర్ గారు ఈ ఊరివాడేనని అక్కడ చెప్పారు. ఈ ఆలయంలో కూడా డ్రెస్ కోడ్ వుంది. గోవా పూర్వనామం కూడా గోమాంతక్. ఆ పేరు నెమ్మదిగా మారి గోవా అయ్యింది. మళ్ళీ మన వూళ్లన్నింటికీ మన అసలు పేర్లు ఎప్పుడొస్తాయో కదా.

 

మంగేష్ఇ ఆలయం చూసుకున్నాక, గోకర్ణం దర్శనం కోసం బయలుదేరాం. మధ్యలో కాస్త ఆలస్యం అయ్యింది. గోకర్ణం ఆలయంలో అభిషేకం చేయించుకోవాలని మా కోరిక. కానీ ఆ ఆలయంలో అభిషేకాలు 12 గంటల కల్లా ఆపేస్తారు. అందుకని ఎలాగో ఒకలాగా 12 లోపల గోకర్ణం చేరుకోవాలని మా ఆశ. మా డ్రైవర్ కూడా బాగా సహకరించాడు, పాపం చాలా వేగంగా, డ్రైవ్ చేసాడు, సేఫ్ గానే అనుకోండి. ఎప్పుడూ నా హ్యాండ్ బ్యాగ్ లో వుండే మావారి పట్టు పంచెల సెట్, ఆ రోజు ఎందుకో వేరే సూటుకేసులో పెట్టాను. కార్ లోనే వున్నా పెట్టెలు తెరిచే అవకాశం లేదు, అవి డిక్కీలో వున్నాయి. ఇక ఏమి అయితే అది అవుతుంది, అని దేవుడి మీద భారం వేసి గణపతి మంత్రం జపం మొదలుపెట్టా. నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ నా జపమాల ఉంటుంది. ఏ విఘ్నమూ రాకుండా మాచేత గోకర్ణేశ్వరునికి అభిషేకం చేయించు స్వామీ, అని గణపతికి జపం చేస్తూ కూర్చున్నా. దేవుడు మనం ఏదైనా ఆర్తితో కోరితే తీరుస్తాడు కదా అని నాకు ఒక గొప్ప విశ్వాసం. గోకర్ణంలో అభిషేకం చేసుకునేవారికి మాత్రమే ఆ గోకర్ణేశ్వర లింగాన్ని చూసే అవకాశం వుంది. అన్నట్టు గోకర్ణంలో వున్న ఈ శివుడి పేరు మహాబలేశ్వరుడు. మా కారు ఆ ఆలయం వున్న స్ట్రీట్ లోకి తిరిగింది, అంతే, ఎదురుగా ఒక పెద్ద మహాగణపతి విగ్రహం, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు, ఆహ్వానిస్తున్నట్టు. అప్పుడు అనిపించింది గణపతి నా జపం అందుకున్నాడని. మా కార్ ఆగటం ఆలస్యం, ఒక పురోహితుడు పరుగు పరుగున వచ్చి, ఎవరో పంపించినట్టు 'అభిషేకం చేసుకుంటారా' అని అడిగాడు. అంతే, మా ఇద్దరికీ నోట మాట రాలేదు. సరిగ్గా 12 అయ్యింది. నేను వెంటనే అవును, చేస్తాం అన్నా. 

      

ఆయన వెంటనే లోపలికి రండి, టైమైపోతోంది అన్నాడు. నేనేమో పట్టు పంచెలు పెట్టెలో వున్నాయండీ, తియ్యాలి అన్నా. ఆ పురోహితుడు వెంటనే, "సరే, మీరు అవి తీసుకుని వెనకాల రండి, మేమిద్దరం వెళ్లి టికెట్ కొంటాం" అని మా వారిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. నేను ఆనందంగా, గబగబా పెట్టె తెరచి, పంచెలు తీసుకుని డ్రైవరుకి చెప్పి లోపలికి పరిగెత్తా. ఈ లోపల అక్కడ మావారు ఆ పురోహితుడు సాయంతో టికెట్ కొనేసి వున్నారు. అమ్మయ్య, ఇంక హడావుడి లేదు. గణపతికి మరోసారి దణ్ణం పెట్టుకుని, ఆ పురోహితుడు చూపించిన చోట కూర్చున్నా. ఆయన యధావిధిగా సంకల్పం చెప్పించి, నన్ను ఆ పక్కనే వున్న బావిలో నుంచి నీళ్లు తోడి తెమ్మన్నాడు. అది అక్కడి పద్ధతిట. ఎవరి అభిషేక జలం వారే ఆ బావి నుంచి తోడి తెచ్చుకోవాలిట. నేను వెళ్లి తెచ్చా. ఆ తరువాత మా గోత్ర నామాలతో అక్కడే అర్చనాదులు చేసాడు. తరువాత మమ్మల్ని గర్భాలయం లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ లింగం పానవట్టం కన్నా చాలా లోపలికి ఉంటుంది. మాచేత, నమక చమకాలతో, పంచామృతాలతో, అనేక ద్రవ్యాలతో ఆ గర్భగుడిలోని లింగానికి అభిషేకం చేయించాడు. తరువాత శుద్ధజలంతో కూడా చేయించాడు. నేను తెచ్చిన ఆ బిందెడు నీరు ధారగా ఆ లింగంపై పోస్తూ మంత్రాలు చదివాడు. తరువాత మమ్మల్ని ఆ లింగం తాకి చూడమన్నాడు. చిన్న లింగం, గచ్చకాయంత వుంది. ఆ పానవట్టం మధ్యలో చెయ్యి పెడితే చేతికి తాకింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. జన్మ ధన్యం అనిపించింది. ఈ దర్శన, స్పర్శనాల కోసమే కదా ఇంతసేపూ తపన పడింది అనిపించింది. మనసారా మరోసారి, ఆయనకు నమస్కరించుకున్నాం.

ఇప్పుడు ఈ క్షేత్ర గాధ తలచుకుందాం. రావణుడు తన తల్లి అయిన కైకసి పూజ కోసం మహాదేవుని ఆత్మలింగాన్ని పొందటానికి తపస్సు చేస్తాడు. రావణుడి భీషణ తపస్సుకి మెచ్చి శివుడు తన ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తాడు. మిగిలిన కథ మామూలే. వినాయకుడు బాలుని రూపంలో వచ్చి ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. అప్పుడు రావణుడు తన మహాబలంతో ఆ లింగాన్ని భూమిలోకి కుంగిపోకుండా ఆపటానికి ఒక మహా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు శివుడు ఆ రావణుడి చేతుల మధ్యలో నుంచి ఒక ఆవు రూపంలో జారుకోవటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రావణుడు ఆ గోవు చెవి పట్టుకుని గట్టిగా లాగుతాడు. అప్పటికి ఆ లింగం చిన్నముక్క మాత్రం మిగులుతుంది. ఈ ప్రయత్నంలో లింగం నుంచి ఎన్నో తునకలు అటూ ఇటూ పడిపోతాయి. ఆ ప్రదేశాలన్నీ కూడా శివ క్షేత్రాలుగా ప్రసిద్ధి అయ్యాయి. రావణుడంత మహాబలిని కూడా, శివుడు నిస్సహాయుడిని చేసాడని, ఇక్కడి శివుడిని మహాబలేశ్వరుడు అంటారు. ఆవు చెవి అంటే, గోకర్ణం వున్న ప్రదేశం కనుక ఈ ఊరి పేరు గోకర్ణం అయ్యింది. ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో కూడా ప్రసక్తి వుంది. బయటకు వచ్చాక ఆ పురోహితుడు మాకు తీర్థ ప్రసాదాలిస్తూ ఒక  రుద్రాక్ష కూడా ఇచ్చాడు పూజలో పెట్టుకోమన్నాడు. త్రయంబకంలో కూడా ఇలాగే పూజ అయిపోయాక ఒక రుద్రాక్ష ఇచ్చారు. ఇలా మా దగ్గర ఎన్నో ప్రత్యేక రుద్రాక్షలు చేరాయి. ఈ మధ్యనే ఇలాంటి రుద్రాక్షలన్నీ కలిపి వెండితో ఒక పెద్ద మాల కూడా చేయించాం. 

తరువాత ఆలయ ప్రాంగణంలోనే వున్న అమ్మవారిని దర్శించుకున్నాం. మా మహాగణపతిని కూడా దర్శించుకున్నాం. ఆ పక్కనే గోకర్ణ ఆలయ దేవస్థానం వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన హాల్ కి వెళ్లాం. అక్కడ భోజనం చేసి తిరిగి అన్నదానానికి డబ్బు కట్టాం. కర్ణాటకలో దాదాపు ప్రతి ప్రసిద్ధ ఆలయం లోనూ ఇలాగే నిత్యాన్నదానాలు జరుగుతుంటాయి. ప్రతిచోటా ఆ భోజనాన్ని ప్రసాదంగా భావించి తినటం, ఆ తరువాత అక్కడ అన్నదాన కార్యక్రమానికి మాకు వీలైనంత సహాయం చెయ్యటం అలవాటు అయిపోయింది. కౌంటర్లు ఉంటే అక్కడ కట్టడం, లేదా హుండీలుంటే వాటిల్లో డబ్బు వెయ్యటం మాకు అలవాటయింది. ఆ తరువాత పక్కనే వున్న బీచ్ కి నడిచి వెళ్లాం. కాసేపు ఆ బీచ్ లో కూర్చుని, అన్నీ చూసి తిరిగి వచ్చేసాం. బీచ్ కూడా ప్రశాంతంగా వుంది. 

ఇప్పుడు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి చెప్పుకుందాం. మామూలుగా మేము ఎక్కడికి వెళ్లినా ఆ క్షేత్రంలో దర్శనాలు, పూజాదికాలు, భోజనాలు అవుతూనే, చేతిలో కారుంటుంది కనుక, వెంటనే బయల్దేరి పక్క క్షేత్రానికి  వెళ్లిపోయేవాళ్ళం. కుక్కి వెళ్లేముందు సాధారణ దర్శనం, పూజ తప్ప వేరే మరో ఆలోచన లేదు మాకు. ఆ రోజు మేము కార్లో కుక్కి వెళ్తుంటే ఏదో పనుండి మా కజిన్, ఎందుకో ఫోన్ చేసాడు. తనకి మేము ఇలా టూర్ లో వున్న సంగతి తెలియదు. ఆ మాటల్లో మా కజిన్ 'మీ ఫామిలీకి ఏదో సర్పదోషం ఉందని అన్నావు కదా, ఎలాగూ కుక్కి వెళ్తున్నారు కదా, అక్కడ సర్పసంస్కార అని ఒక పూజ ఉంటుంది, ఆ పూజ చేయించుకోండి' అని సలహా ఇచ్చాడు. మేము కూడా అవును కదా, అలాగే చేద్దాం అనుకున్నాం. వెంటనే మావారు ఆ ఆలయం గురించి నెట్ లో చూస్తే, ముందరే బుక్ చేయించుకోవాలి అని కనిపించింది. ఆయన వెంటనే వాళ్ళ బ్యాంక్ కుక్కి బ్రాంచికి ఫోన్ చేసి, ఏమైనా సహాయం చేయగలరా అని అడిగారు. వాళ్ళు కాసేపటి తరువాత, వివరాలు కనుక్కుని ఫోన్ చేసి వీలైతే పూజ చేస్తారట, కానీ ఆ ఆలయానికి కొన్ని నిబంధనలున్నాయి అని చెప్పారు. సరే, దేవుడి మీద భారం వదిలేసి, కుక్కి చేరుకున్నాం. హోటల్ లో సామాన్లు పెట్టేసి ముందర గుడికి వెళ్లాం. అక్కడ కౌంటర్లో మావారిని కొన్ని ప్రశ్నలు అడిగి టికెట్ ఇచ్చేసారు. ఆ నిబంధనలు ఆ ఆలయానికే ప్రత్యేకం. మొదటిది, అక్కడ పూజ కేవలం బ్రాహ్మణులే చెయ్యాలి. ఇతర కులస్తులైతే,  వారి బదులుగా, ఒక బ్రాహ్మణుడిని ఆలయమే ఏర్పాటు చేసి, ఈ భక్తుల పేరు మీద, ఆ బ్రాహ్మణుడితో, ఆ పూజ చేయిస్తుంది. ముందరే బుకింగ్ ఎందుకంటే, అర్హతగల బ్రాహ్మణులూ అవైలబుల్ గా ఉండాలి గదా మరి, అందుకు. తరవాతి నిబంధన ఏమంటే, ఆ పూజ చేసుకునే వారికి తల్లితండ్రులు వుండకూడదు. అంటే వారు అంతకు ముందే తమ తల్లితండ్రులకు కర్మకాండలు చేసిన వారై ఉండాలి. ఒకవేళ ఆ తల్లి తండ్రులలో ఎవరైనా ఒక్కరు జీవించి ఉన్నా, వారి పేరు మీదే ఈ సర్పసంస్కార పూజ చేయించాలి, అంతే కానీ తల్లి కానీ, తండ్రి కానీ, ఇద్దరూ కానీ జీవించి ఉన్నట్లయితే, అటువంటి పిల్లలు డైరెక్ట్ గా, ఈ పూజ  చేసుకోకూడదు. మాకు ఈ రెండు నిబంధనలూ అడ్డు కాలేదు, కనుక మావారికి టికెట్ ఇచ్చారు. ఆ విధంగా ఆ పూజ చేసుకోవటానికి ఆ రోజు మేము అర్హులమయ్యాము. కాకపోతే మమ్మల్ని ఒకటిన్నర రోజు వరకూ, ఆ వూరు దాటి బయటకు వెళ్లకూడదని చెప్పారు. మేము సరే అనుకుని దోష నివారణ పూజకు సంకల్పించాం. ఈ పూజ వల్ల తరతరాలుగా వున్న సర్పదోషాలైనా, కుజ దోషాలైనా, పోతాయని ప్రతీతి. ఈ ఆలయంలో ఆశ్లేషా నక్షత్రం రోజున ఆశ్లేషబలి అనే మరో పూజ కూడా చేస్తారు. దాదాపు ఆ పూజ కూడా ఇటువంటిదే. మేము మాత్రం సర్పసంస్కార పూజకి టికెట్ తీసుకున్నాం. మా భట్టిప్రోలు కుటుంబంలో మూడు తరాల క్రితం నుంచి ఈ సర్పదోషం ప్రబలంగా ఉందిట. మంచిదే కదా, మొత్తం కుటుంబం ఈ దోషాల నుంచి బయట పడుతుంది అని ఆనందపడ్డాం.  

   

ముందుగా అక్కడ వున్న కుమార ధార అనే నదిలో స్నానం చేసి రమ్మన్నారు. ఈ కుమారధార గురించి స్కాంధ పురాణంలో కూడా వున్నది. కుమారస్వామి తారకాసుర సంహారం తరువాత కుక్కి కి వచ్చాడట. ఇంద్రుడు కుమారస్వామి విజయానికి ఎంతో సంతోషించి, తన కుమార్తె దేవసేనని ఇచ్చి వివాహం చేసాడు. ఆ వివాహంలో కుమారస్వామిని అభిషేకించటానికి అన్ని ప్రాంతాల నుంచి పుణ్య నదీ జలాలను తీసుకు వచ్చారుట. ఆ నీరే ఈ కుమారధారా నది అని కథ. మేము దారిలో ఒక మహా గణపతి ఆలయం కూడా చూసి, ఆయనకు కూడా మా కుటుంబానికి వున్నదని చెప్తున్న ఆ సర్పదోషాన్ని ఈ పూజ తో నివారించాలని కోరుకుంటూ, పూజ చేయించుకుని వచ్చేసాం. పక్కనే వనదుర్గా మాత గుడి. చాలా పురాతన ఆలయాలు ఈ రెండూ కూడా. వనదుర్గా మంత్రం కూడా వుంది నాకు. నేను జపం చేసే మంత్రాధిదేవత ఆలయం కనిపించగానే చాలా సంతోషంగా, అదో శుభసూచకంగా భావించి వెళ్లి ఆ వనదుర్గా మాత దర్శనం కూడా చేసుకున్నాం. కుమారధారలో అర్ఘ్యం విడిచి, ఆ తరువాత సుబ్రహ్మణ్య ఆలయానికి వచ్చాం. ఇక్కడ సుబ్రహ్మణ్య ఆలయాలు రెండు వున్నాయి. ఒకటి, పాతది, అక్కడ ఆలయంలోని గర్భాలయంలో  ఒక అతి పెద్ద పుట్ట ఉంటుంది, అంతే. అసలు ఆ పుట్టని చూస్తేనే, దాన్లో ఎన్ని వందల, వేల జాతి నాగుపాములు ఉన్నాయో కదా అని ఎవరికైనా అనిపించటం మాత్రం ఖాయం. అంత గంభీరంగా ఉంటుంది ఆ పుట్ట. మహోన్నతమైన పుట్ట, చాలా రంధ్రాలు, ఆలయ పూజారి కూడా, చాలా పెద్దాయన, అవసరానికి మాత్రం లోపలికి వెళ్లి, మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడు. ఆ పుట్టమట్టి ప్రసాదంగా ఇచ్చారు. నాకు చెవి సమస్య ఉండటంతో నేను ఆ కొంచెం పుట్ట మట్టిని చెవికి పెట్టుకున్నా. పూజకు ముందర అందరినీ ఈ పాత ఆలయం చూసి రమ్మన్నారు, లేకపోతే అది క్లోజ్ అయిపోతుందిట. ఈ పుట్ట ఆలయం మాత్రం చూస్తే కాస్త భయం వేస్తుంది, దడ పుడుతుంది. ఆ మాట మాత్రం నిజం. 

          

తరువాత కొత్త ఆలయానికి వెళ్లాం. ఈ ఆలయంలో గర్భాలయంలో ఒకదానిపైన మరొకటిగా మూడు మూర్తులు. అన్నింటి కన్నా కింద ఆదిశేషుడు, ఆ పైన మధ్యలో వాసుకి, ఈ రెండింటి పైనా వున్న మూర్తి సుబ్రహ్మణ్యుడు. తారకాసుర సంహారం తరువాత సుబ్రహ్మణ్యుడు కుక్కి కి వచ్చినప్పుడు సర్పాలన్నీ ఆయనని శరణు వేడి గరుడుని నుంచి రక్షించమని కోరాయిట. అప్పుడు వాటిని కనికరించి సుబ్రహ్మణ్యుడు, మీ సర్పాలనన్నీ పైన వుండి రక్షిస్తానని మాట ఇచ్చి, ఇక్కడే నిలిచి పోయాడని చెప్పారు. ఆలయం లోపలకు వెళ్తూనే ఒక పెద్ద గరుడ స్థంభం ఉంటుంది. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి రమ్మన్నారు. ఆ గరుడ స్థంభం మనల్ని సర్పాల నుంచి రక్షిస్తుందని, ఒక నమ్మకం. ఆ తరువాత ఆలయం లోపలకు వెళ్లాం. ఈ కొత్త ఆలయంలో కూడా దర్శనం అయిపోయాక సర్ప సంస్కార పూజలు చేసే హాలు వున్న ప్రాంతానికి వెళ్లాం. ఈ ఒకటిన్నర రోజూ మేము భోజనం కూడా వాళ్లతోనే మడిగా చేయాలనేది ఆలయ నిబంధనల్లో ఒకటి. మా టికెట్ చూపించాక ఆ నంబర్ ప్రకారం మాకు ఒక స్థలం కేటాయించారు. ఆ తరువాత మాకు కన్నడం రాదని తెలిసాక, మా స్థలం మార్చి ఒక హిందీ తెలిసిన బ్రాహ్మణుడు, భట్ గారి పక్కకి మార్చారు. ఎందుకంటే ఆ పూజ అంతా కన్నడంలో చెప్పి చేయిస్తారుట. భట్ గారు మాకు ఒకటే చెప్పారు, నేనేమి చేస్తే, ఎలా చేస్తే మీరూ అలా చేయండి అని. ఇంకా ఏమైనా ఉంటే నేను మీకు చెప్తాను అన్నారు. ఆయనకు థాంక్స్ చెప్పి మేము కూడా పూజ మొదలుపెట్టాం.  

   

ఇంతకీ ఈ పూజ ఏమంటే, మనం కానీ, మన పూర్వీకులు కానీ, ఎప్పుడైనా ఏ సర్పాన్ని అయినా, ఏ కారణం చేత అయినా చంపితే, ఆ దోష పరిహారార్ధం మన చేత రెండు జంట సర్పాలకు కర్మకాండ అంతా చేయించి, ఆ తరువాత వాటికి దహన సంస్కారం చేయించి, ఆ రోజుకి మైల పాటించి,  తిరిగి రెండవ రోజు, ఆ సర్పాలు తిరిగి జన్మించినట్టు భావించి, వాటికి పూజ చేయిస్తారు. మామూలుగా కూడా పామును చంపితే దాన్ని దహనం చేయాలని మా నాన్న కూడా ఒకసారి చెప్పారు. ఇక్కడ మేము ఎప్పుడూ ఏ పామునీ చంపకపోయినా, మూడు తరాల క్రితం ఎవరో చంపారని, ఆ దోషం మా కుటుంబం మీద వున్నదని జ్యోతిష్యులు చెప్పటం వల్ల మేము ఈ పూజకు సంకల్పించాం. నిజానికి ఇదేమీ మేము ప్లాన్ చెయ్యలేదు. అనుకోకుండా కర్ణాటక టూర్ లో ఈ కుక్కికి కూడా వచ్చాం. వూహించకుండా, మా కజిన్ మాకు ఈ విషయం ఆ రోజే గుర్తు చేసాడు. ఈ విషయాలన్నీ యాదృచ్ఛికంగానే జరిగాయి. మాకైతే ఆ నాగరాజే మాకుటుంబాని కున్న ఈ దోషం పోగొట్టాలని ఇలా ప్లాన్ చేసాడెమో అనిపించింది. మొదటి రోజు పూజ అంతా చేయించారు. అన్నీ హోమ గుండాల్లో వేయించారు. పిండాలని ఆ హాలు బయట వున్న ఒక అగ్నిగుండంలో వేయించారు. ఆ పక్కనే ఒక చెట్టు కింద కొన్ని లింగాలు కూడా వున్నాయి. కుక్కి లింగాలను మొదట్లో ఒక్క చోట పెట్టి పూజించేవారుట, తరువాత ఇలా గుడి వెనుక పెట్టారుట. రెండో రోజు పూజ కూడా చాలా బాగా సంప్రదాయ బద్ధంగా జరిగింది. మా అందరి చేతా మళ్ళీ నాగపూజ చేయించి దానాదులు చేయించారు. ఇక మీ మైల అయిపొయింది, వెళ్ళవచ్చు అన్నారు. ఈ పూజ అయ్యాక మమ్మల్ని అందరినీ మళ్ళీ సుబ్రహ్మణ్య ఆలయానికి తీసుకుని వెళ్లి అక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజారులే, ఒక జంట నాగుల విగ్రహాన్ని ప్రతిష్ట చేసి, మా అందరితో కూడా పూజ చేయించి అందరికీ ఆశీర్వాదం, ప్రసాదం ఇచ్చి మళ్ళీ ఆలయంలో దర్శనాలు చేయించి పంపించారు. ఆ సమయంలో ఆ ఆలయ గజరాజు కూడా అక్కడికి వచ్చింది. అది ఆలయంలో హారతి సమయంలో గంటలు కొడుతుంటే ఆ గంటలకు లయబద్ధంగా చాలా సేపు డాన్స్ చేసింది. భలే ఆశ్చర్యం, ఆనందం వేసింది. కొంచెం భయం కూడా వేసింది. అది కనుక విజృంభిస్తే తప్పుకోవటానికి కూడా, ఆప్రాంగణంలో అవకాశం లేదు. మా గుంపు నుంచి చాలా మంది వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. తరువాత మీ పూజ అయిపోయింది, వెళ్ళచ్చు అని చెప్పారు. ఇదీ మా కుక్కి, గోకర్ణం, మంగేష్ సంస్థాన్ యాత్రల వివరాలు. 

తిరిగి వెళ్లి, హోటల్ ఖాళీ చేసి ధర్మస్థలకు బయల్దేరాం. అసలైతే ఆ రోజు హోరనాడు వెళ్లి అన్నపూర్ణను చూడాలి. కుక్కీలో ఒకటిన్నర రోజు ఎక్సట్రాగా ఉండి పోవాల్సి రావటం చేత మాకు ఈ అన్నపూర్ణ దర్శనం వీలుపడలేదు. కాకపోతే, ధర్మస్థలలో శ్రీరామక్షేత్ర చూడటానికి వెళ్ళినప్పుడు మొట్ట మొదటి దర్శనం ఈ హొరనాడు అన్నపూర్ణదే. దాంతో ఆ అమ్మ కూడా ఆశీర్వదించింది అనిపించి తృప్తి కలిగింది. మొత్తం పూజ ఇంత నియమ నిష్టలతో, ఇంత సంప్రదాయంగా జరగటం చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇటువంటి పూజ మేము ఇంతవరకూ ఎక్కడా వినలేదు, చూడలేదు, చేయలేదు. ఇదే మొదటిసారి. ఎంత మాట్లాడినా, ఎంత తృప్తిగా, శాంతంగా, హాయిగా అనిపిస్తున్నా, ఎక్కడో నిజంగా ఈ పూజ ఆ సుబ్రహ్మణ్యుడిని చేరి మా కుటుంబం దోషం పరిహారం అయ్యిందా, ఇంకా మా కుటుంబంలో ఇటువంటి దోషాల వల్ల ఇబ్బందులు ఏవీ, ఎవరికీ రావు కదా అని ఎక్కడో ఓ మూల, ఓ చిన్న సందేహం. దాంతో పైకే ఓ మాట అప్రయత్నంగా  అనేసా, మా డ్రైవర్ లక్ష్మణ్ కూడా వినేట్టు. దేవుడా, మేము చేసిన ఈ పూజ పరిపూర్ణమైతే, నీవు ఈ పూజను స్వీకరిస్తే, మాకు ఈ దారిలో ఒక సర్పం కనిపించేలా అనుగ్రహించు, అన్నా. ఇది కూడా అతి తేలిక కోరిక. ఎందుకంటే మేము ఒక దట్టమైన ఆగుంబె కీకారణ్యంలో  ప్రయాణిస్తున్నాం. పాములేమిటి, పులులు కనిపించినా ఆశ్చర్యం లేదు. అక్కడ అనకొండ వంటి పాములుంటాయని, డిస్కవరీ ఛానెల్, జాగ్రఫికల్ ఛానెల్ వాళ్ళు కూడా వచ్చి ఆ జంతువులు బయటకు వచ్చేదాకా వేచి వుండి వీడియోలు తీసుకుంటారట. ఇవన్నీ మా డ్రైవర్ ఇక్కడకు వచ్చే దారిలోనే చెప్పాడు. బహుశా అదే నా మనసులో మెదులుతూ వుండి పోయిందేమో. మా డ్రైవర్ కూడా అదేమిటమ్మా, అందరూ పాములంటే భయపడుతుంటే, మీరేమో అవి కనపడాలని కోరుకుంటున్నారు, అన్నాడు. 'కాదు, నిజంగా అలా అనాలనిపించింది' అన్నాను.

నిజంగానే తిరుగుదారిలో, నేను కోరుకున్న ఆ  నిదర్శనం కనిపించింది, ఏదో మామూలుగా కాదు, అద్భుతంగా, ఆశ్చర్యపోయేట్టుగా. చివరకు మా డ్రైవర్ కూడా, ఇటువంటిది తానెన్నడూ చూడలేదని ఒప్పుకున్నాడు. అమ్మా, మీలో ఏదో శక్తి వుంది అన్నాడు. మేము మామూలుగా వెళ్తున్నాం. ఉన్నట్టుండి, రోడ్డు పక్కన వున్న పొదలలో నుంచి ఒక తెల్ల నాగు, శ్వేతనాగు, సన్నగా, చాలా చాలా పొడుగ్గా వుంది. సరసరా వచ్చి మా కారు ముందర అయిదారడుగుల దూరంలో పడగ విప్పి, భూమి మీద నుంచి సుమారు రెండు అడుగులు  తల ఉండేలా ఎత్తి నిల్చుంది. మా డ్రైవర్ చటుక్కున కారు ఆపేసాడు. ఏమిటీ అని అడిగితే, మేడమ్, పాముని చూడండి అన్నాడు. నేను, మావారు ఇద్దరం చూసాం. ఈ లోపు ఎదురుగుండా ఇంకో కారు వస్తుంటే, మా డ్రైవర్ హార్న్ మోగించి వాళ్ళను అలెర్ట్ చేసాడు. అయినా ఆ పాము కదలలేదు, బెదర లేదు. మేము కూడా ఆశ్చర్యంతో, ఆనందంతో చూస్తున్నాం. ఆ మైకంలో ఫోటో కూడా తీసుకోలేదు. అది సుమారు 10 నిముషాల పాటు అలాగే ఉండిపోయింది. ఆ పాము కోపంగా లేదు, ఏదో పనిలాగా మాకు కనిపించటానికి వచ్చినట్టు అనిపించింది. కాసేపు ఆగాక మా ఎదుటి కారు నెమ్మదిగా, రోడ్డు కొంచం దిగి చోటు చేసుకుని వెళ్ళిపోయింది. ఆ కారు పక్కనుంచి వెళ్లటంతో, మా శ్వేతనాగుకి కాస్త ధ్యానం సడలినట్లు అనిపించిందేమో, నెమ్మదిగా తలాడించి, పడగ ముడిచి మళ్ళీ రోడ్డు దాటేసి వెళ్ళిపోయింది. ఫోటో తీయాల్సింది, ఎవరం తీయలేదు. పాముని, అందునా శ్వేతనాగుని చూసిన ఆశ్చర్యంలో వున్నాం. మా డ్రైవరే ముందు తేరుకుని కార్ స్టార్ట్ చేసాడు. మా డ్రైవర్, "నేను ఈ అడవిలో ఎన్నిసార్లొచ్చినా, ఎప్పుడూ శ్వేతనాగుని చూడలేదు. నిజంగానే మీ పూజ ఖచ్చితంగా ఫలించింది" అన్నాడు. మాకూ అదే అనిపించింది. చాలా పరిపూర్ణమైన ఆనందం కలిగింది. ఎంతో సంతృప్తి, ఎంతో శాంతం హాయిగా అనుభవిస్తూ, వెనక్కు వాలి కూర్చున్నాం. నేనూ, మావారూ ఒకళ్ళనొకళ్ళం చూసుకుంటూ హాయిగా నవ్వుకున్నాం. 

ఓం శ్రీ మంగేశాయ నమః, ఓం శ్రీ మహాబలేశ్వరాయనమః 
ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శ్రీ శ్వేతనాగాయనమః 

తరువాత హంపి లోని విరూపాక్షాలయం గురించి, హంపి కట్టడాల గురించి, హళేబీడు లోని హోయసలేశ్వర ఆలయం గురించి చెప్పుకుందామా. 


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650





కామెంట్‌లు

  1. mee photo collection too good aunty

    pooja procedure antha chala clear ga, in detail ga baga rasaru aunty

    రిప్లయితొలగించండి
  2. Vijaya, you are blessed. We had been to Kukki and enjoyed very wonderful darshan of Subramanya swamy and had done Devine pujas ..But we did not know about the special puja you have performed.
    May be because we have performed elaborate Puja and Naga prathishta in Rameswaram temple, not samuhikam, exclusively for our Bhattiprolu family , and it's welfare.

    Your narration is excellent. Yes in the forest we find so many wild animals and I am happy that you have received blessings from Swetha nagu on behalf of bhattiprolu family.

    రిప్లయితొలగించండి
  3. థాంక్స్ అక్కా. నిజంగానే ఈ పూజ చేసాక చాలా satisfaction కలిగింది.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం