అమర్ కంటక్
అమర్ కంటక్
అమర్ కంటక్, నిజాయితీగా ఒప్పుకోవాలంటే ఈ పేరే ఎన్నడూ వినలేదు నేను. కాళిదాసు ఋతుసంహారంలో అమరకూట అని, ఈ ప్రాంతం గురించి చెప్పాట్ట. (ఆ అమరకూట అనే పదమే నేడు అమర్ కంటక్ అయ్యింది.) నేనా కాళిదాసు ఋతుసంహారమూ చదవలేదు. మావారి బ్యాంకులో ఒకసారెవరో కొలీగ్ ని కలిసినప్పుడు, ఆయన మేము అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలూ చూసేసాం అని చెప్పారుట. ఈయనేమో 'మేమూ అన్నీ చూసాం' అని చెప్పారట. కానీ లెక్కలో కొన్ని చూడలేదని తెలిసి, ఇంటికి వచ్చాక ఏవేవి చూడలేదు అనే లిస్ట్ తయారుచెయ్యమని నాకు చెప్పారు. నేను అప్పుడు మేము అంతవరకూ చూడని జ్యోతిర్లింగాలు మూడింటిని గురించి చెప్పాను. అవి మధ్యప్రదేశ్ లో వున్న మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, గుజరాత్ లో వున్న సోమనాథ్ అని చెప్పా. మావారు ఈసారి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు వెళదాం, ప్లాన్ చెయ్యమని చెప్పారు.
సాధారణంగా ఏమేమి ప్రాంతాలకి వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి, ఆ వూరు, గుడి, నది, సముద్రం, కోట, తోట, జలపాతం, జూ వగైరాల ప్రత్యేకత ఏమిటి అని ఒక డాక్యుమెంట్ తయారుచేయటం నా బాధ్యత, దానికి కావాల్సిన రిజర్వేషన్లు, బుకింగులు చేయటం ఆయన బాధ్యత. గూగుల్ లో చూసి మ్యాప్ వేసుకుని వెళ్లటం అలవాటు. గూగుల్ మ్యాప్ లలో ఏ ప్లేస్ ముందు, ఏ ప్లేస్ వెనుక అనేది ప్లాన్ చేసి, 2014 మే, జూన్ లలో సుమారు మూడు వారాల పాటు ముందు గుజరాత్, తరువాత మధ్యప్రదేశ్ వెళ్లాం. గుజరాత్ లో మాతో నాగరాజ్ అనే డ్రైవర్, మధ్యప్రదేశ్ లో మాతో సోనూ అనే డ్రైవర్ మాతో వచ్చారు. ఆ యా రాష్ట్రాల్లో మేము చూడాలని అనుకున్నవీ, అవే కాకుండా దారిలో కానీ, లేదా కొంచం డీవియేట్ అయితే కానీ వచ్చే ప్రత్యేకమైన ప్రదేశాలేమన్నా ఉంటే కూడా, చూపించాలనేది వాళ్లకు ఒక కండిషన్.
అలా చూసిన ప్రదేశాల్లో ఈ అమర్ కంటక్ ఒకటి. జబల్పూర్ లో బేడాఘాట్ చూసి, ఆ చలువరాతి కొండల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదలో బోట్ ప్రయాణం చేసి ఆ నర్మదని చూసి ముచ్చటపడి, తరువాత ఈ అమర్ కంటక్ చేరుకున్నాం. అప్పటికి ఈ ఊరి గురించి మాకు తెలిసిందల్లా ఇక్కడ నర్మదానది పుట్టిందని, నర్మదను శివుడి పుత్రికగా వ్యవహరిస్తారని మాత్రమే. మావారు అమర్ కంటక్ లో కొంచెం చేంజ్ గా ఉంటుందని టెంట్ కాటేజ్ బుక్ చేశారు. నిజంగానే అది చాలా బాగుంది. చూడ్డానికి బైటకు టెంట్ లా వున్నా లోపల ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, వగైరా వసతులన్నీ వున్నాయి. ఇట్లాంటి కాటేజ్ లే ఖజురహో, ఓర్ ఝా లలో కూడా బుక్ చేశారు. ఒక్క ఖజురాహోలో మాత్రం, ఆ వేడికి ఈ ఏసీ చాలక వేరే రూంకి షిఫ్ట్ అయ్యాము. అమర్ కంటక్ లో మా కాటేజ్ ల చుట్టూ అందమైన మొక్కలు పెంచి వున్నాయి. అవి వేసవిలో కూడా చక్కగా పూలు పూస్తున్నాయి. ఎంతైనా నర్మద పారుతున్న ప్రాంతం కదా. మనసుకు హాయిగా ఆహ్లాదంగా అనిపించింది. వాతావరణం అంతా శాంతంగా, ప్రశాంతంగా ఉంది. లోపలా, బైటా కూడా ఒక రకమైన వర్ణింపలేని ఆనందం. అనుభూతికి మాత్రమే అర్ధమైయ్యే తృప్తితో కూడిన ఆనందం. మావారికి థాంక్స్ చెప్పుకున్నా. నాకైతే ఓపికుంటే ఈ ప్రాంతానికి మళ్ళీ వెళ్లాలని వుంది.
ఈ నదులు వింధ్యా సాత్పురా పర్వత శ్రేణుల మధ్య, మైకాల్ పర్వతం నుంచి ఉద్భవిస్తున్నాయి. అమర్ కంటక్ సందర్శనకు బయల్దేరాం. ముందుగా సోన్ముడా లోని నర్మదా ఉద్గమ్ స్థానానికి బయల్దేరాం. అక్కడకు వెళ్ళాక తెలిసిందేమంటే అదే ప్రాంతంలో నర్మద, శోణ, భద్ర, జోహిలా అనే నదులు కూడా ఉద్భవించాయని, అందులోనూ ఈ శోణానదిని బ్రహ్మకు కుమారుడిగా భావిస్తారనీ అక్కడ వున్న బోర్డుల ద్వారా తెలిసింది. శోణానది భద్రానదిని తనలో కలుపుకుని శోణభద్రానదిగా మారిందని, ఆ శోణభద్రానదిలో ఆ పైన ఎక్కడో జోహిలానది కూడా కలిసి, ఆపై అది శోణానది పేరుతోనే తూర్పుకి ప్రవహిస్తుందనీ, పాట్నా దగ్గర ఈ శోణానది గంగలో కలుస్తుందనీ తెలిసింది. శోణానది గంగకు యమున తరువాత ఇదే అతి పెద్ద ఉపనది. శోణానదిని పురుషనది అనీ మిగిలిన రెండింటినీ స్త్రీ నదులనీ కూడా చెప్పారు. అంతవరకూ బ్రహ్మపుత్ర ఒక్కటే పురుషనదిగా తెలుసు. ఇప్పుడు ఈ శోణానది కూడా పురుషనది అని కొత్తగా తెలిసింది. శోణానది నీటిలో బంగారం శాతం ఎక్కువనీ, అందుకే దానికి సోనా అనే పేరు వచ్చిందనీ చెప్పారు.
నర్మదకూ, శోణకూ వివాహం తలపెడితే ఏవో అడ్డంకులు వచ్చాయనీ, అప్పుడు నర్మద బాధతో విడిపోయి తానొక్కటీ వ్యతిరేకంగా పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలిస్తుందని చెప్పారు. ఇంకో తమాషా ఏమంటే ఈ నర్మద సోన్ముడా లోని ఒక పూదోటలో పుట్టి ఆ పూబాలలతో స్నేహం చేసి అక్కడ నుంచి అదృశ్యమైపోయిందట. అప్పుడు ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కపిలమహర్షిని ప్రార్ధిస్తే ఆయన కపిలధార అనే ప్రాంతంలో నర్మదను పట్టుకుని తిరిగి అందరకూ మామూలుగా ప్రత్యక్షం కమ్మని ప్రార్ధించాడనీ అంటారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో కపిలధార అనే జలపాతం వుంది. ఆ నది శాంతించి తిరిగి ప్రస్తుతం నర్మదామందిరం వున్న చోట ఒక కుండంలో కనిపించి అక్కడే మరో రెండు కుండాల్లో కనిపించి ఒక పెద్ద నదియై ఉధృతంగా దూకుతూ, పారుతూ ఆ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేసిందిట. ఈ నర్మదానది దూకుడుగా ప్రవహిస్తున్నప్పుడు ఆ నీళ్లు చూడ్డానికి పాలనురుగు వలె కనపడతాయి. అలా ఏర్పడిందే దుగ్ధ ధార, లేదా దూధ్ ధార జలపాతం. ఈ జలపాతాలకు కింది దాకా దిగి చూడచ్చు గానీ, మేం దిగలేకపోయాం. అన్నట్టు ఇక్కడ కపిలమహర్షి స్థాపించిన కృత యుగం నాటి జ్వాలేశ్వర్ మందిర్ కూడా వుంది. ఈ ప్రాంతం మొత్తంలో ఎక్కడ చూసినా దివ్యత్వం ఉట్టిపడుతూ ఉంటుంది.
సోన్ ముడాకి వెళ్లాలంటే మళ్ళీ చాలా బోల్డు మెట్లు దిగాలి. మెట్ల పొడవునా మన పూర్వజులు, అంటే మర్కట సమూహాలు, వాటిని దాటుకుంటూ దిగాలి. మళ్ళీ ఎక్కాలి. వద్దులే బాబూ నేను రాను అంటే, అసలు చూడాల్సిన ప్రాంతం అంతా కిందే ఉంటుంది అని చెప్పారు. ఇక చేసేదేముంది, నిదానంగా దిగటం మొదలుపెట్టాం. నిజంగానే దిగకపోతే, చాలా మిస్ అయ్యేవాళ్ళం. అక్కడ వున్న పూదోటను మాయీ కా బాగ్ అంటారు. అక్కడ పార్వతీదేవి కి ఒక గుడి వుంది. అదే సోనాక్షి శక్తిపీఠం. సతీదేవి కుడి పిరుదు భాగం అక్కడ పడిందట. ఇది 51 శక్తిపీఠాల జాబితాలోకి వస్తుంది. నర్మద కోసం పార్వతే ఆ తోటను పెంచిందట. సోన్ ముడాలో వీరభద్రుడు, శివుడు, హనుమంతుడుకి కూడా ప్రత్యేకతతో కూడిన విగ్రహాలున్నాయి. శోణానది ఉద్గమస్థానం పక్కనే నీరు ఉద్భవిస్తున్న మరో మూడు కుండాలు కూడా చూసాం. తిరిగి పైకి ఎక్కి వచ్చేసాం. దారిలో సగం కడుతున్న జైనమందిరం ఉంటే అది కూడా చూసాం. చలువరాయిమీద ఆ శిల్పులు చెక్కే శిల్పాలు, డిజైన్లు మహాద్భుతంగా వున్నాయి. ముందు మందపాటి ప్లాస్టిక్ షీట్ పై స్టెన్సిల్ తయారుచేసుకుని, దాన్ని రాతిపలకల మీద ఉంచి సన్నగా, మృదువుగా చెక్కుతున్నారు.
అన్నట్టు సోన్ముడాలోని మరో విశేషం గులేబకావళి మొక్కలు. చిన్నప్పుడు గులేబకావళి కథ సినిమాలో రాజుగారికి కళ్ళు పోతే రాజకుమారుడు వెళ్లి ఈ గులేబకావళి పువ్వు తెచ్చి రాజుగారికి కళ్ళు తెప్పిస్తాడు. అప్పుడది జానపద కథ, ఎంత బావుందో అనుకున్నాం. కానీ ఆ కథలో కొంత భాగం నిజం అని మాకు ఈ అమర్ కంటక్ వెళ్ళినప్పుడే తెలిసింది. బహుశా ఆ సినిమా రచయితో, దర్శకుడో, నిర్మాతో ఎవరో ఇక్కడకు వచ్చి చూసి మిగిలిన కథను అల్లుకుని వుంటారు. కింద పెట్టిన మొక్కల ఫోటో అదే. ఈ గులేబకావళి మొక్కలు నర్మదకు బాల్య స్నేహితురాలట. ఆ పువ్వులు పూసినప్పుడు చూట్టానికి నర్మద ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుందట. ఆ పువ్వులు మేము వెళ్లిన సీజన్లో లేవు, మొక్కలు మాత్రం వున్నాయి. ఆ పూల నుంచి వేపరైజేషన్ తో ఒక ద్రవాన్ని తయారు చేస్తారు. ఆ ద్రవం కళ్ళల్లో ఒక చుక్క వేసుకుంటే చాలు, కళ్ళకు ఏ బాధ వున్నా తగ్గించేస్తుంది. దానికి ఎక్సపయిరీ డేట్ కూడా ఉండదన్నారు. ఈ మందు, ఐ డ్రాప్స్, 2014 లో తెచ్చినా, ఈ రోజుకీ చక్కగా పనిచేస్తున్నాయి. కళ్ళు దురదగా వున్నా, భారంగా వున్నా, గరగరమన్నా ఇది చాలా చక్కని మంచి మందు. శుక్లాలకు కూడా పని చేస్తాయన్నారు. భలే సరదా వేసింది వింటుంటే. ఇవి ఇప్పుడు "గుల్ బకావళి అర్క్" పేరుతో ఆన్ లైన్ లో కూడా దొరుకుతున్నాయి. ఈ అమర్ కంటక్ ప్రాంతమంతా చిక్కటి అరణ్యం అవడంతో, చాలా వనమూలికలు దొరుకుతాయి. అక్కడ సిద్ధ వైద్యశాలలు కూడా చాలా వున్నాయి. ఋషులు, మునులు, వాళ్ళ ఆశ్రమాలు ఇక్కడ ఎక్కడ చూసినా ఉంటాయి. నిజంగా తపస్సు చేసుకోవాలంటే ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.
అమర్ కంటక్ లో వున్న మరొక ప్రధానాలయం అమరేశ్వర మందిరం. ఒక పెద్ద పొడవైన శివలింగం ఉంటుంది అక్కడ. ఆ ఆలయం కూడా చాలా ప్రభావవంతంగా, శక్తివంతంగా ఉంటుంది. ఆ అనుభూతి ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇవి అన్నీ చూసాక నర్మదానది గుడికి వచ్చాం. గంగా స్నానం, తుంగా పానం, నర్మదా ప్రదక్షిణం అంటారు. మా అదృష్టం కొద్దీ మాకు ఈ మూడూ దక్కాయి. నర్మదానదికి కొందరు సాష్టాంగ నమస్కారాలతో కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇటువంటి సాష్టాంగ ప్రదక్షిణాలు అరుణాచలం లోనూ, గోవర్ధన గిరి లోనూ చూసాం. టిబెట్ లోని కైలాసపర్వతానికి కూడా చేస్తారని విన్నానే కానీ చూడలేదు. మేము మాత్రం నర్మదానదికి కారులోనే ప్రదక్షిణం చేసాం. ఆ వెసులుబాటు కూడా వుంది అక్కడ. ఆ తరువాత గుడికి వచ్చాక గుడిలో ప్రదక్షిణం చేసాం. ఆ గుడి ఆవరణలోనే స్నానాలు చేయటానికి ఒక కోనేరు, బట్టలు మార్చుకోవటానికి చిన్న చిన్న క్యూబికల్స్ వున్నాయి. అక్కడ పాములకు ప్రసిద్ధి. నర్మదకి, త్రాచుపాములకీ స్నేహంట. అవి గుళ్లోనూ, నదిలోనూ, నది ఒడ్డునా, నది పొడుగూతా ఎక్కడ చూస్తే, అక్కడ కనిపిస్తాయి. మేము స్నానానికి దిగిన కోనేరులో మా పక్కనే ఒక పొడవైన గోధుమరంగు త్రాచు కనిపించింది. త్వరత్వరగా స్నానం చేసుకుని బయట పడ్డాం. గుండె గుబగుబ లాడింది. కానీ అవేవీ చేయవని అక్కడ అందరికీ అదో ధైర్యం. అలాగే గుడిలో ప్రదక్షిణ అప్పుడు కూడా రెండు నల్ల పిల్ల నాగులు, అవీ మాతో పాటు సరసరా ప్రదక్షిణాలు చేసేస్తున్నాయి. ఆ వేగానికి మా కాళ్ళ కింద అవి ఎక్కడ పడతాయో యని మహా భయం వేసింది.
మొత్తానికి భయపడుతూనే ఎలాగో ప్రదక్షిణం పూర్తి అయ్యిందనిపించుకుని ప్రధాన ఆలయానికి వచ్చాం. నర్మదా అమ్మవారు, ఎదురుగా గుడిలో శివపార్వతులు, అటు చూస్తే నర్మద, ఇటు చూస్తే ఆది దంపతులు. చాలా చూడ ముచ్చటగా వున్నారు. కూతురంటే వారికి చాలా ప్రేమట, అలా ఎదురుగుండానే వుండి చూసుకుంటూ ఉంటారుట. నర్మద శివుడు తాండవం చేసేటప్పుడు శివుని స్వేదం నుంచి ఉద్భవించిందిట. ఈ నదికి వాహనం మొసలి. ఆ ప్రధాన పూజారిని పాముల సంగతి అడిగాం. ఆయన అవేం చేస్తాయి, ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారి చీరలో, బ్రహ్మాండమైన కాలనాగు వుంది, చీర మార్చేటప్పుడు పక్కకు వెళ్తుంది, చీర మార్చాక మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అన్నాడు. గుండె మళ్ళీ డుబుక్కు డుబుక్కు మంది. నెమ్మదిగా బైటకు వచ్చి అక్కడ నర్మదా ఉద్గమ కుండం చూసి తల పక్కకు తిప్పి చూస్తే నవగ్రహాలు వున్నాయి. ప్రతి గ్రహం లింగాకారంలో వుండి వాటిపైన తొమ్మిది కుండలు ధారా పాత్రలుగా పెట్టారు. అద్భుతం. నవగ్రహాలకు ఆవిధంగా అభిషేక ఏర్పాటు ఇక్కడ తప్ప ఎక్కడా చూడలేదు. చూడగానే ఫోటో తీయాలనిపించింది. ఈ ప్రాంగణం ఎదురుకుండా పురాతన ఆలయాల సముదాయం ఒకటి ASI వాళ్ల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోంది. అక్కడికి వెళ్లాం. చాలా ఆలయాలు వున్నాయక్కడ. వాటిల్లో ప్రధానమైనది, ఆదిశంకరుడు ప్రతిష్టించి పూజించిన పాతాళేశ్వర్ మందిరం. అది చూడాలంటే కొన్ని మెట్లు దిగి వెళ్లి చూడాలి. ఈ ప్రదేశాలన్నీ ఆదిశంకరుడు తిరిగినవే. అన్నట్టు ప్రతి సాయంత్రం కాశీ, హరిద్వార్ లలో గంగా హారతి లాగానే, ఇక్కడ నర్మదా హారతి కూడా ఉంటుంది. మేము ఆగలేదు. అసలే ఎక్కడ చూసినా పాములు. చీకట్లో ఈ నల్ల పాములు ఎంత కనిపిస్తాయో తెలియదు. తిరిగి వచ్చి రూంకి చేరుకున్నాం.
మేము అమర్ కంటక్ లో చూసిన మరో పరమాద్భుతం శ్రీయంత్ర మహామేరు మందిరం. భారతీయ ప్రాచ్య యోగ శోథ సంస్థాన్ వారు ఈ ఆలయాన్ని కట్టిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన తిధి వారాలు కలిసిన రోజు మాత్రమే కట్టుబడి చేస్తారట. ఆ కాలం అయిపోగానే కట్టడం ఆపేస్తారుట. చాలాదూరం నుంచీ ఈ నాలుగు ముఖాల అమ్మవారి రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది. ఈ నాలుగు ముఖాలూ అమ్మవారి నాలుగు అవతార రూపాలకు సంకేతం. లోపల ప్రాంగణం అంతా ఎక్కడ చూసినా అమ్మే. ఇక్కడ ప్రధాన ఆకర్షణ గర్భగుడిలో వున్న విగహాలు కావు. చుట్టూ ఆవరించి వున్న ప్రతిమలు, వాటిల్లో కొట్టొచ్చినట్టు కనపడే దైవత్వం. కొట్టొచ్చినట్టు అనే మాట తప్పు. ఆవిడేమీ మనల్ని కొట్టదు కదా. చుట్టూ ఎటు చూసినా ప్రసన్నంగా మనల్ని కరుణిస్తూ వివిధ రూపాల్లో కనిపించే అమ్మవారు. ఈ ఆలయం చూడటం ఎన్నో జన్మల పుణ్యఫలం అనిపించింది.
చుట్టూ ప్రాకారం అంతా ఒక మహా సర్పం చుట్టుకున్నట్టు ఉంటుంది. దాని లోపల భాగం అంతా హంసలు, వాటి మధ్యలో అమ్మవారి నామ దేవతలని చెక్కాలిట. ఎప్పుడు చెక్కుతారో ఏమిటో. ప్రాకారం అంతా దేవీ రూపాలే, శివ-శక్తి రూపాలు. మనం వేరే లలితా సహస్ర నామ స్తోత్రం, త్రిశతి, ఖడ్గమాల చదువుకోవఖ్ఖర్లా. అమ్మవారి అక్కడ తానే స్వయంగా అన్ని రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎంత చూసినా తనివి తీరని ఆలయం. కన్ను తిప్పుకోలేము, వదలలేము. సర్వత్రా అమ్మవారే. అమర్ కంటక్ వెళ్లిన వాళ్ళు ఈ ఆలయం తప్పక చూడండి. ఈ ఆలయం వాళ్ళు ఎప్పుడు పూర్తి చేస్తారో గదా అనిపిస్తుంది. ముఖ్య దేవతా ప్రతిష్ట అయిపొయింది. ఆ విగ్రహాలకు పూజాదికాలు జరుగుతూనే వున్నాయి.
ఇలా ఎంత రాసినా, పేజీలకు పేజీలు రాస్తూనే ఉండచ్చు అమర్ కంటక్ గురించి. కానీ ఎక్కడో అక్కడ ముగించాలి గదా, తప్పదు. ఈనాటికి ఈ అమర్ కంటక్ విశేషాలు ముగించి తరువాతి పోస్ట్ లో ఖజురాహో గురించి చెప్పకుందాం.
ఓం నర్మదామాతయై నమః, ఓం అమరలింగేశ్వరాయనమః,
ఓం కపిలాయనమః, ఓం సోనాక్షీదేవ్యైనమః,
ఓం శ్రీ మహా మేరు యంత్రాయైనమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి