ఖజురహో-ఓర్ఛా

ఖజురహో-ఓర్ఛా 

ఖజురహో దేవాలయాల గురించి రాస్తాననంగానే చాలామంది ఛి ఛీ అన్నారు. చాలా విషయాల్లో మనం మనకు తెలియకుండానే ఇతరులు చెప్పినదాన్ని విని ప్రభావితమవుతూ ఉంటాం. ఇది కూడా అంతే. వెళ్లి చూస్తేనే కానీ తెలియదు. వెళ్ళాలి, చూడాలి, అర్ధం చేసుకోవాలి. అప్పుడు దాని వెనుక దాగున్న ఫిలాసఫీ మనకు తెలుస్తుంది. అంతే కానీ, ఈ పోస్ట్ చదవకుండానే దయచేసి మూసేయకండి. అద్భుతమైన శిల్పకళ, ఆనాటి జన జీవితం, ఆనాటి వారి కళాపిపాస, కళాపోషణ, వారి యోగం, భోగం, భక్తి, రక్తి, ముక్తి ఈ అంశాలనన్నింటినీ స్పృశించేదే ఖజురహో. ఆనాటి కాలంలో అక్కడ ఖర్జూర వృక్షాలు ఎక్కువగా ఉండేవట. ఈ ఆలయాల సముదాయాన్ని కనుగొన్నప్పుడు, నాలుగువైపులా వున్న గేట్లకు అటూ ఇటూ బంగారపు ఖర్జూర చెట్లు, బంగారపు ఖర్జూర ఫలాలతో ఉన్నాయని రాసివుంది. ఇప్పుడు ఆ ఛాయలేవీ కనిపించవు. కానీ ఆ రిచ్ నెస్ ఆ దేవాలయాల్లో, ఆ శిల్పాల్లో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 

సుమారు 80, 90 ఆలయాల్లో ఈనాటి వరకూ దొరికినవి ఒక పాతిక, ముఫై వరకు మాత్రమే. వాటినే నాలుగు సముదాయాలుగా విభజించి మనకు చూపిస్తూ వుంటారు. మేము వెళ్ళింది జూన్ మొదటి వారంలో. విపరీతమైన ఎండ. తల నుంచి కాళ్ల వరకూ కాల్చేసే ఎండ. MP టూరిజం వాళ్ళ టెంట్ కాటేజ్ లో ఉండలేక లోపల రూములోకి మారాం. ఆ రోజు అక్కడ టెంపరేచర్ యాభై డిగ్రీలుట. టెంట్ కంటే రూమ్ లో కొంత వరకు నయం. ఈ వూళ్ళో వున్న మరొక సంప్రదాయమేమంటే, ఏ దేవాలయం అయినా సరే సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం వరకు మాత్రమే తెరచి ఉంటాయి. సూర్యుడు ఇలా అస్తమిస్తాడో లేదో, అన్ని గుళ్ళూ మూసేస్తారు. అన్నీ చూడాలంటే కొన్నైనా సరే మిట్ట మధ్యాన్నం వేళల్లో చూడాల్సిందే. లేకపోతే ఎక్కువ రోజులు వుండి చూడాలి. మాకేమో అంత టైం లేదు. దాంతో ఇష్టంగా కష్టపడి వీలైనన్ని గుళ్ళు చూసేసాం. ఇక్కడ అన్ని ఆలయాల్లో గుడి లోపల కన్నా గుడి బయటే ఎక్కువ గడపాలి. గుడి లోపల ఆర్భాటం తక్కువే. ఎంతైనా ASI ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయ సముదాయం కదా. అన్నట్టు మధ్యప్రదేశ్ లో సాంచి, భీమ్ బేత్కా, ఖజురహో, ఈ మూడూ, యునెస్కో వారి ప్రపంచ వారసత్వ గుర్తింపు వున్న పర్యాటక స్థలాలు.


                        

ముందర దూరంగా వున్న ఆలయాలు చూసొచ్చాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడి ఆలయాల్లో వున్న మెట్లు. ఈ ఆలయాలన్నీ సుమారు ఒక అంతస్తు ఎత్తులో ఉంటాయి. అంటే అవి ఎక్కటానికి కనీసం 20 మెట్లు ఉండాలి,  కానీ ఇక్కడ మాత్రం ఏడో, ఎనిమిదో మెట్లు మాత్రమే  ఉంటాయి. అంటే ఒక్కో మెట్టూ జాగ్రత్తగా ఎక్కాలి. కాళ్ళు, ముఖ్యంగా మోకాళ్ళకి ఎక్కువ శ్రమ. పాపం మావారు కొన్ని మెట్లయితే ఎక్కలేక, కింద నుంచే దూరంగా నిలబడి చూసారు. మొదట్లో ఎక్కినా, నేనూ తరువాత కొన్ని మెట్లు ఎక్కలేక, కింద నుంచే ఫోటో తీసేసుకున్నా. జైన మందిరాలు చాలా వున్నాయి. అక్కడ శిల్పాలన్నీ యెంత నాజూగ్గా ఉన్నాయో. దిగంబర శిల్పాలే అయినా ఆ దిగంబరత్వం కనపడదు. జైనులు చాలావరకు దిగంబరులు కదా. వారి ఫిలాసఫీకి తగినట్టుగా ఆ శిల్పాలన్నీ అలాగే వున్నాయి. చూద్దామన్నా అసభ్యత, అశ్లీలం కనపడని శిల్పాలవి. 

తరువాత ముఖ్య ప్రాంగణానికి వచ్చాం. అక్కడ అన్నీ విపులంగా చూపించటానికి, చెప్పటానికి గైడ్లు వున్నారు. విదేశీ అతిధుల పుణ్యమా అని వీళ్ళ రేట్లూ ఎక్కువే. ఇక్కడ ప్రధానమైన ఆలయాలలో కంధరియా మహాదేవ మందిరం, విశ్వనాథ మందిరం, (అన్నట్టు మరో విశేషం, కేదార్, కాశీ, గయ తరువాత ఈ ఖజురహో ఆలయం అంత ప్రముఖమైనది అని చెప్పారు), ధూలదేవ మందిరం,  చిత్రగుప్త మందిరం, లక్ష్మణ మందిరం, వరాహ మందిరం, చతుర్భుజ మందిరం ముఖ్యమైనవి. బ్రహ్మ స్థాపించిన బ్రహ్మ మందిరంలో చతుర్ముఖ శివుడు ఉంటాడు. అంటే, ఒక పెద్ద లింగానికి నాలుగు వైపులా నాలుగు ముఖాలు ఉంటాయి. చతుర్భుజ మందిరంలో విష్ణుమూర్తి ఉంటాడు. చక్కటి పనితనంతో వున్న శిల్పం అది. లక్ష్మణాలయంలో కూడా విష్ణుమూర్తే. చిత్రగుప్త ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఆ ఆలయం కూడా వుంది. మన హైదరాబాదులో కూడా, డబీర్ పురా, కందికల్ గేట్ దగ్గర ఒక పురాతనమైన చిత్రగుప్త ఆలయం ఉందండోయ్. మేము చూసాం. కొన్నే ఆలయాలలు బయటపడితేనే ఇంత బాగుంటే, ఇక మొత్తం మిగిలిన ఆలయాలు అన్నీ కూడా బయట పడితే ఇంకెన్ని అద్భుతాలు బయట పడతాయో. మేము వెళ్ళినప్పుడు కొన్ని ఆలయాలకు రిపేర్ వర్క్ జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఈ ఆలయాలు అన్నింటినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ASI వాళ్ళు. అల్లాగే వాళ్ళు వీటిని కేవలం కట్టడాల లాగా కాక మందిరాలుగా కూడా చూస్తే, ఇంకాస్త ఇవి హృదయానికి చేరువవుతాయేమో అనిపించింది. 


 

ధూలదేవ్  మందిరంలో, శివుడు సహస్రలింగమూర్తి. ముఖ మంటపంలో కానీ, గర్భగుడిలో కానీ ఎక్కువ శిల్పం కనిపించదు. శిల్పం అంతా బయటే. ఆ వరాహ, నంది మూర్తులు ఎంత పెద్దవంటే మనం వాటి పీఠం దగ్గరకు వస్తామంతే.  ఈ గుళ్లన్నీ కట్టించిన చందేలా రాజులకి, మనసులో ఒక ఊహా జంతువు కూడా వుంది. ఊహా జంతువంటే అది నిజంగా లేదు. వారు ఒక జంతువుని మనసులో ఊహించి, శిల్పులకు చెప్పి, ఆ జంతువుని రాతిలో చెక్కించారంతే. ఆ జంతువుకి సింహం, గుర్రం, ఏనుగు, పులి, నక్క, పాము వంటి లక్షణాలన్నీ ఉంటాయి. స్త్రీలు కూడా ఆ పురుషమృగాలకు దాసోహమంటాయి. ఇదీ వారి వూహ. తమాషా అనిపించింది. అటువంటి హైబ్రిడ్ జంతువుని వారు ఊహించి ఆనాటి శిల్పులతో చెప్పి శిల్పాలను చెక్కించుకున్నారు. వారి జంతువుల విగ్రహాలన్నీ భారీగానే ఉంటాయి. మళ్ళీ గోపురాలపై శిల్పాలు మహా నాజూగ్గా ఉంటాయి. ఆ భారీ సైజు విగ్రహాలూ ఆ ఎత్తెత్తు మెట్లూ చూస్తే ఆ రోజుల్లో మనుషులు యెంత ఆజానుబాహులో కదా అనిపిస్తుంది. ఈ చందేలా రాజులే ఓర్ఛా లో కూడా ఎన్నో కోటలు, మందిరాలు నిర్మించారు. అవి కూడా చాలా బాగుంటాయి. వాటి గురించి కూడా చివరిలో చెప్పుకుందాం. అన్నట్టు ఇక్కడ మధ్యప్రదేశ్ ప్రత్యేకతల్లో ఒకటైన చందేరీ చీరలు కూడా బాగా దొరుకుతాయి. నాలాంటి వాళ్లేమో గుళ్ళు, గోపురాలు, శిల్పాలు, స్థలపురాణాలూ అంటుంటే ఈ చీరల వాళ్ళు, చెవిలో జోరీగల్లాగా, మా దగ్గర కొనండి అంటే మా దగ్గర కొనండి, అని గోల పెడుతూ వుంటారు. మరి గులాబీలకు ముళ్ళు ఉండాలి గదా. నా గోలేమో ఈ చీరలు నేను కావాలనుకుంటే హైదరాబాదులో నైనా కొనుక్కోవచ్చు, కానీ ఈ కట్టడాలను అక్కడ చూడలేను గదా అని. కానీ కొన్నిసార్లు తప్పదు. అవి కూడా బాగుంటాయి. కానీ ప్రధాన ఆకర్షణ మాత్రం చీరలదెప్పుడూ కాదు. 

   
                                                      
ఇక ఇప్పుడు మనం బయట వైపున్న శిల్పాల దగ్గరకు వెళ్దాం. ఇక్కడ ప్రధానంగా ప్రతి గోపురం మూడు భాగాలుగా ఉంటుంది. ఆచ్చం మన లాగానే, కాళ్ళు, మొండెం, తల లాగా. గోపురం యొక్క కింది భాగమంతా మన కాళ్ళు లాగా అన్నమాట, ఆధారశిల్పాలూ, భారవాహిక శిల్పాలూ, పీఠభాగాలూ ఉంటాయి. ఆ పై భాగం అంతా మనం చెప్పుకోబోతున్న అన్నిరకాల శిల్పాలూ వుంటాయి. ఆ పై గోపుర విభాగమంతా శిల్పాలు లేకుండా నిరామయంగా నాగర శైలిలో ఉంటుంది. ఆకసాన్ని చుంబిస్తున్నట్టున్న, ఈ గోపురాలు మానవుడు ఎల్లప్పుడూ తన బుద్ధిని ప్రచోదనం చేసి, ఆ పైనున్న లోకాలను తాకుతూ ఊర్ధ్వ గమనం చెయ్యాలి, అని సూచిస్తున్నట్టు ఉంటాయి. బుద్ధిం యానః ప్రచోదయాత్. మానవుడు ఎప్పుడూ ఊర్ధ్వముఖుడై ఉండాలి, జీవితంలో కింది భాగాల్లో అన్నీ సాధించాక నిరామయంగా ఉంటూ,  ఊర్ధ్వదృష్టితో పైపైకి ఎదగాలి అని ఈ గోపురాలు మనకు చెప్తున్నాయా అన్నట్టుగా వున్నాయి, అని నాకు అనిపించింది. కింద వున్న పీఠభాగాల్లోనే ముఖమంటపాలూ, గర్భాలయాలూ ఉంటాయి, ఇహాన్నీ, పరాన్నీ కలుపుతున్నట్టు. దేహం ఉంటేనే కదా ఏదైనా సాధ్యం. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. దేహమూ వుండాలి, దేహానుభావాలూ ఉండాలి. ఈ దేహం తోనే కదా అన్ని కార్యక్రమాలూ చెయ్యాలి. ఇహాన్ని అనుభవిస్తూ పరాన్ని సాధించాలి. ఇప్పుడు అత్యంత చర్చనీయం, వివాదాస్పదం అయిన గోపురాల మధ్య భాగం లోకి వద్దాం.  

    

గోపురాల మధ్య భాగం లో అనేక రకాల శిల్పాలు ఉంటాయి. ఆ శిల్పాలు చూడంగానే మొట్టమొదట కలిగే భావం ఏమిటంటే, ఏ ఒక్క చిన్న వివరమూ వదలకుండా ఆ నాటి శిల్పులు ఎంత బాగా ఎంత జాగ్రత్తగా చెక్కారో కదా, అనిపిస్తుంది. మన బేలూరు, హళేబీడు, రామప్ప, సింహాచలం ఆలయాలు గుర్తొస్తాయి. ఒక్క చిన్న ముక్క విరిగినా కూడా వారు అనుకున్న భావం, భంగిమ రావు కదా. ఎంత తపస్సుతో, దీక్షతో చెక్కి తీర్చిదిద్దారో ఈ శిల్పాలను. వాళ్లకు నమో నమః. తరువాత చాలామంది భావిస్తున్నట్టు మొత్తం శిల్పాలన్నీ వాత్సాయన మహర్షి కామసూత్రానికి సంబంధినవి కావు. మొత్తం శిల్పాల్లో పది శాతం, కేవలం పది శాతం మాత్రమే ఈ కామ భంగిమలతో కూడినవి. మిగిలిన 90 శాతం శిల్పాలు మాత్రం దేవీ దేవతలు, వివిధ సంగీత పరికరాలు వాయిస్తూ స్త్రీలు, పురుషులు, రకరకాలైన నృత్య భంగిమల్లో నర్తకీ మణులు, పిల్లలతో స్త్రీలు మొదలైన అంశాలకు సంబంధించినవి. వీటన్నింటిలో కూడా ఎక్కడా అశ్లీలత, అసభ్యత కనిపించదు. మనం నిత్యం చూసేవే కదా అనిపిస్తుంది. కాకపోతే ఆనాటి కాలంలో దుస్తులు శరీరం పై భాగాల్లో ధరించేవారు కాదనుకుంటా. ఈ రోజుల్లో మాత్రం వంటినిండా దుస్తులు ధరించేవారు ఎంతమంది? ఈ కామసూత్ర భంగిమలు మాత్రం ఇక్కడున్న గైడ్లు ప్రత్యేకంగా చూపిస్తేనో, లేక మనమే వాటి కోసం ప్రత్యేకంగా వెదకితేనో, గానీ కనపడవు. వీటిల్లో కూడా సామూహిక కామకేళికి సంబంధించిన శిల్పాలు ఎక్కువ వున్నాయి. ఈ కార్యక్రమంలో రతికేళిలో పాల్గొనే, ప్రధాన స్త్రీ పురుషులు మాత్రమే కాకుండా వారితో పాటు వారి సహాయకులు కూడా, వున్న శిల్పాలు కూడా వున్నాయి. సాధారణ మానవ జీవితంలో కామం కూడా ఒక ముఖ్య విషయమేగా. కానీ ఒక్క విషయం నిస్సందేహంగా ఒప్పుకోవాలి, ఈ ఖజురహో ఆలయ శిల్పులు పనితనంలో అగ్రగణ్యులు.

   

మనకున్న నాలుగు పురుషార్ధాలలోనూ కామం కూడా వుంది కదా. ధర్మంగా అర్ధాన్ని అంటే ధనాన్ని సంపాదించాలి. ఆలా సంపాదించిన ధర్మార్థంతో కామాన్ని తీర్చుకోవాలి. కామం అంటే కేవలం శృంగారం అని కాదు, దానితో పాటు మన ఇతర కోరికలు కూడా. ఇటువంటి మొదటి మూడు ప్రధాన పురుషార్ధాలనూ సాధించిన తరువాత, మోక్షానికి పురుషప్రయత్నం చేయాలి. ధర్మ అర్ధమూ, ధర్మ కామమూ ఎప్పుడూ తప్పుగా మన సంప్రదాయం చెప్పలేదు. అంతేకాక ప్రతి మనిషీ పుడుతూనే కొన్ని రుణాలతో పుడతాడు. అవి ముఖ్యంగా మూడు. దేవఋణం, ఋషిఋణం, పితృఋణం. ఇందులో దేవఋణాన్ని, దైవభక్తితో పూజాదికాలు చేస్తూ తీర్చుకోవచ్చు. ఋషిఋణాన్ని, బుద్ధి చేత మనం సంపాదించిన విజ్ఞానాన్ని సరియైన పధ్ధతిలో వాడుతూ తీర్చుకోవచ్చు. పితృరుణాన్ని మనం మాతా పితరుల పట్ల గౌరవంగా ఉండటం, వారికి చెయ్యవలసిన అన్ని పితృకార్యాలూ చెయ్యటంతో పాటు, వివాహం చేసుకుని పిల్లలని కని వంశాభివృద్ధి చేయటం ద్వారా మాత్రమే తీర్చుకోగలుగుతాము. ఈ ఋణం తీర్చుకోవటానికి ధర్మ కామమే సరియైన మార్గం. ఈ రుణాలు తీరని గృహస్తు రుణాలతోనే జీవితం ముగిస్తాడు. చివరకు అగస్త్యుడు కూడా వంశాభివృద్ధి కోసం, పితృఋణం తీర్చుకోవటం కోసం, లోపాముద్రను వివాహం చేసుకున్నాడు. సన్న్యాసం తీసుకున్న సాధువుల సంగతి వేరే. ప్రస్తుతం అది అప్రస్తుతం, అందుకని చర్చించటం లేదు. సన్యాసి ధర్మాలూ, సంసారి ధర్మాలూ పూర్తిగా వేరే వేరే అనేది మాత్రం కచ్చితమైన విషయం. ఇదీ మా ఖజురహో యాత్ర విశేషాలు.

ఖజురహో తరువాత మేము ఓర్ఛా వెళ్ళాము. ఈ రెండు రాజ్యాలూ బుందేల్ ఖండ్ ప్రాంతం లోవే. చందేలా రాజులు పరిపాలించినవే. ఈ ఓర్ఛా నగరం బేత్వా నది ఒడ్డున వుంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు రాజారామ్ మందిరం, లక్ష్మీ మందిరం, పాలకీ మహల్, జహంగీర్ మహల్ మొదలైనవి. మా కారు డ్రైవర్ సోనూది కూడా ఈ వూరే. దాంతో అతను మాకు ఇక్కడ అన్ని విశేషాలూ చెప్పుతూ చూపించాడు. ముందు లక్ష్మీ మందిరం చూసి రాజారామ్ మందిరానికి వెళ్లాం. ఈ లక్ష్మీ మందిరం ఒక కోణంలో చూస్తే చతురస్రంగా, మరో కోణంలో చూస్తే వర్తులంగా ఉంటుంది. తమాషాగా అనిపించింది. రాజారామ్ మందిరంలో రాణీగారి కోరిక మేరకు రాముడే బాలుడివలె, స్వయంగా వచ్చాడని చెపుతారు. అక్కడ రాధాకృష్ణులే స్వయంగా రాసకేళీ నృత్యాలు చేశారని చెపుతూ గోడలపైన, సీలింగ్ పైన వున్న అనేక పెయింటింగులు చూపించాడు. సుమారు 1570 లలో కట్టిన ఆ ఆలయపు పెయింటింగులు ఈ నాటికీ అలాగే వున్నాయి. అవి ఎంత బాగున్నాయో మాటల్లో వర్ణించటం కష్టం.

   

రాణీగారు వుండే పాలస్ ని పల్లకీ వలే  కట్టారు. సున్నంతో కట్టినా ఎక్కడా చెక్కుచెదరలేదు. జహంగీర్ గుర్తుగా జహంగీర్ మహల్ కట్టారుట. ఇక్కడ మరో రెండు మనసుకి నచ్చిన అంశాలున్నాయి. అందులో ఒకటి ఆనాటి రాత్రి మేము చూసిన సౌండ్ అండ్ లైట్ షో. ఓంపురి తన గంభీరమైన కంఠస్వరంతో ఆ కోట చరిత్ర, అక్కడ జరిగిన యుద్ధాలూ, ఆ ప్రాంతమంతా ఎలా వున్నత స్థితికి ఎదిగింది, మళ్ళీ ఎలా విధ్వంసానికి గురి అయ్యిందీ, మళ్ళీ ఎలా ఆ కష్టాలన్నీ దాటుకుని నేటి స్థితికి వచ్చిందీ, చెప్తుంటే మంత్రముగ్ధులమై విన్నాం, చూసాం. నేను చూసిన ఇటువంటి అన్ని షోలలో ఇది మరపురానిది, ప్రత్యేకమైనది. ఓంపురి గారి గొంతులో ఏదో మైమరపించే లక్షణం వుంది.


   

ఓర్ఛా లో నాకు నచ్చిన మరో విషయమేమంటే, మేము దిగిన గెస్ట్ హౌస్ లో ఎటు చూసినా గోరింట చెట్లే. లాన్ కి బార్డర్ లాగా విపరీతంగా గోరింట మొక్కలు పెంచారు. అవి చూసి నేను ముచ్చట పడుతుంటే, అక్కడి అటెండర్లు బోల్డంత ఆకు కోసి ఇచ్చారు. థాంక్స్ చెప్పి తీసుకున్నా. ఎందుకంటే, ఆ రోజే మేము హైదరాబాద్ తిరిగి వచ్చేస్తున్నాం. సోనూ వాళ్ళింట్లో కూడా గోరింటాకు ఉందని తెచ్చియిచ్చాడు. ఎయిర్ పోర్ట్ కి వచ్చే దారిలో సతార్ లో చంద్రశేఖర ఆజాద్ స్మారకం చూశాం. ఆయన తన అజ్ఞాతవాసంలో వున్నప్పుడు కేవలం ఒక సామాన్య బ్రాహ్మణుడి వలె సంచరిస్తూ, ఈ ప్రదేశంలో తన పూజా పారాయణల్లో ఉండగా, ఆయన్ని కనిపెట్టి బ్రిటీషువారు చంపారు, అని అక్కడ రాసి వుంది. ఎంత బాధ వేసిందో. ఇప్పుడు ఏమి చెయ్యగలం, దుఃఖించటం తప్ప. దేశం గర్వించదగ్గ ఒక గొప్ప స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆ విధంగా దేశం కోసం ప్రాణాలర్పించాడు.


ఇదీ మా ఓర్ఛా యాత్ర. మొత్తానికి ఖజురహో, ఓర్ఛాలు చూసుకుని హైదరాబాదు చేరాం. ఈ మూడు వారాలలో ఇంకా ఇంకా ఎన్నెన్ని చూసామో చెప్పాలంటే, ఎన్ని పోస్టులు పెట్టినా పూర్తి కావు. ముఖ్యమైనవి మాత్రం చెప్పాలని చెప్తున్నా, అంతే. ఇక ముగిస్తాను.

ఓం కంధరియామహాదేవాయనమః, ఓం విశ్వనాథాయనమః, 
ఓం రాజారామాయ నమః, 
చంద్రశేఖర  ఆజాద్ కీ జై 

వీటన్నింటితోపాటు వాత్సాయనాయనమః అని కూడా అందామా. ఈసారి శబరిమల గురించి చెప్పుకుందాం.  


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650








కామెంట్‌లు

  1. Superb ga rasaru aunty...
    For the first time i am hearing very positive about kajuraho, because everyone talks about only one kind of sculptures leaving all other beautiful art and heritage.

    Thank u so much for the detailed portrayal.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్ యు సునీతా, నిజంగా ఒక కొత్త outlook తెద్దామనే రాసాను. యద్భావం తద్భవతి అంటారు కదా. మనం ఏమి చూడాలనుకుంటే అదే చూస్తాం. ఒక్క 10% ని పట్టుకుని అంతా అదే అంటే ఎలా, పైగా అవి ఎక్కడుంటాయో ఎవరైనా చూపించాలి, లేదా మనం ప్రతి శిల్పామూ వెదకాలి. అందుకే అలా రాసాను.
      గోపురాన్ని ఊర్ధ్వదృష్టితో చూడాలి కానీ మరో పర్పస్ కోసం కాదనేది నా భావన.

      తొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం