శబరిమల-హరిపాద్
శబరిమల-హరిపాద్
ఈ రోజు మా శబరిమల యాత్ర గురించి, అదే యాత్రలో మేము చేసిన కొన్ని సుబ్రహ్మణ్య ఆలయాల గురించి చెప్పుకుందాం. శబరిమల గురించి, అయ్యప్ప గురించి మేము మొట్ట మొదటిసారి విన్నది, 1987 లో సౌత్ టూర్ చేస్తున్నప్పుడు. అప్పటి మా బస్సు డ్రైవర్ అయ్యప్పకు వీర భక్తుడు. రోజూ ఉదయమే మన గాన గంధర్వుడు, కె జె ఏసుదాస్ గారు, అయ్యప్పపై పాడిన తెలుగు పాటలు ఘట్టిగా వినిపించేవాడు. ఆ పాటలు ఈ రోజుకీ నిత్యం మనసులో మెదులుతూనే వున్నాయి. మన్మోహనంగా కర్ణపేయంగా పాడాడు ఏసుదాస్. ఆవిధంగా మాకు అయ్యప్పని పరిచయం చేసిందీ, దగ్గర చేసిందీ కూడా ఏసుదాస్ గారే. ఆ ఆలయ నియమాలు విన్నాక నాకు అప్పటికి ఇంకా అక్కడికి వెళ్లే యోగ్యత రాలేదని అర్ధం అయ్యింది. ఆనాటి ఆ కోరిక, మాకు జులై 2017 లో తీరింది. ఇది కూడా యాదృచ్ఛికం గానే జరిగింది. మళ్ళీ మా కింద అపార్టుమెంట్ ఆయనే వచ్చి తాను శబరిమల చూసి వచ్చానని, ఈ మధ్య ప్రతినెలా ఒక 5 రోజులపాటు ఆలయం తెరుస్తున్నారనీ చెప్పాడు. దాంతో మేమూ సరదాపడ్డాం, ఇద్దరం ఫ్రీనే కదా ఇక వెళ్ళచ్చు అని. ఎందుకంటే ఈ ఆలయానికి ఋతుక్రమం వయసు లోని స్త్రీలు వెళ్ళకూడదు అనే నియమం ఒకటి వుంది. ఆడవాళ్లు చిన్నపిల్లలుగా వున్నప్పుడు, లేదా వృద్ధులైనప్పుడు మాత్రమే వెళ్ళచ్చు అనేది నియమం. ఈ మధ్య ఈ అంశం మీద స్త్రీలు సుప్రీంకోర్ట్ దాకా వెళ్లి తమకూ ఆలయ దర్శన హక్కు కోసం ఇంకా కొట్లాడుతున్నారు. ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. మధ్యలో స్త్రీలకూ దర్శనానికి వెసులుబాటు కలగచేసినా, సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ పై మళ్ళీ స్టే ఇచ్చింది.
ఇక్కడ నేను ఈ విషయంలో నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవటానికి ప్రయత్నిస్తాను. చాలామందికి ఆలయాలంటే ధర్మాన్ని బోధించే, లేదా ధార్మిక కేంద్రాలని అనుకోవటం పరిపాటి అయిపోయింది. కానీ అసలు ఆలయాలు ధార్మిక కేంద్రాలు కానే కావు. అవి మతకేంద్రాలు. ఆలయమంటే ఒక మతానికి చెందిన కొందరు ఒక సమూహంగా ఏర్పడి, వారి మతానికి సంబంధించిన దేవుడిని, వాళ్ల నియమాల ప్రకారం ప్రతిష్ట చేసుకుని, వాళ్ల మతాచారాల ప్రకారం పూజించుకునే ఒక కేంద్రం. అందుకే శైవులకు శివాలయాలు, వైష్ణవులకు వైష్ణవాలయాలు, స్కంధుని పూజించేవారికి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు, అమ్మవారిని పూజించుకునే వారికి శక్తి ఆలయాలూ వగైరా ఏర్పడ్డాయి. కొన్ని ఆలయాల్లో స్త్రీ పూజారులు, కొన్ని ఆలయాల్లో వేరే వేరే కులాలకు చెందిన పూజారులు కూడా వుంటారు. ఉదాహరణకు మన శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడిలో చెంచులే పూజారులు. ఇలా ప్రతి గుడికీ, మన భారతదేశం లాగానే ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు నిత్యపూజలు, ఇతర పూజలు, సేవలు వగైరా ఎప్పుడు, ఎలా, ఏమేమి చెయ్యాలో నిర్దేశించుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమాలన్నీ నియమం తప్పకుండా చేయిస్తూ వుంటారు. మన ఖర్మం కాలి మన హైందవ దేవాలయాలన్నీ ధర్మకర్తల చేతుల్లోంచి ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాళ్లేమో మన సనాతన ధర్మం తాలూకు అన్ని మతాలనీ ఒకే గాటన కట్టి, అన్నింటికీ హిందూ అనే ఒక పేరు తగిలించి, అందరికీ ఒకే ధర్మం, ఒకే రూల్ అనే వాదన వచ్చేలా చేశారు. నిజానికి గమనించి చూడండి, ఒక్కో ఆలయంలో ఒక్కో పద్ధతి ఉంటుంది. కొన్ని చోట్ల స్త్రీలను రానివ్వరు. కొన్ని చోట్ల వస్త్రధారణకు నియమాలుంటాయి. కొన్ని చోట్ల ఆలయ దర్శన సమయానికి నియమాలుంటాయి. అంతే కాదు, అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం మరొకటి వుంది, అది స్త్రీ, పురుష దేహాల మధ్య గల బేధం. పురుషులు సాష్టాంగ నమస్కారం చెయ్యచ్చు, కానీ స్త్రీలు పంచాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలి. స్త్రీలు వారి కుచ, ఉదర, ఊరువులు భూమికి తగిలించకూడదు. కారణం వారిలో వున్న మాతృస్వరూపాన్ని గౌరవించటమే. ఈనాడు పురుషులు చేసే అన్ని పనులూ స్త్రీలు కూడా చేస్తున్నా, అలాగే స్త్రీలు చేసే చాలా పనులు పురుషులు కూడా చేస్తున్నా, ఇద్దరూ ఎవరికి వారు ప్రత్యేకమే, వేర్వేరే. ఋతు కాలంలో ఆలయానికి వెళ్లకూడదన్న నియమం దాదాపు ఈనాటికీ అందరు స్త్రీలూ పాటిస్తారు. ఈ నాటికీ మన హైదరాబాదులో జియాగూడాలో వున్న కేసరి హనుమాన్ ఆలయంలో స్త్రీలకు గర్భగృహ ప్రవేశం లేదు. పురుషులకు వున్నది. ఈ అంతరం గమనిస్తే, ఏ ఆలయపు కట్టుబాటు ఆ ఆలయానిది. వాటిని గౌరవిద్దాం. సనాతన ధర్మాన్ని నిలబెడదాం.
సరే మళ్ళీ మన శబరిమలకు వద్దాం. మేము ఇలా శబరిమల వెళ్తున్నాం అనంగానే మా సత్యవతి వదిన, "ఎంతదృష్టం, ఆ పదునెట్టాంబడి ఎక్కుతారా" అంది. నేనేమో అలా ఎలా కుదురుతుంది, మేము దీక్ష పట్టలేదుగా అన్నా. కానీ ఆవిడ నోటి చలవ వల్లనేమో మాకు ఆ పదునెట్టాంబడి ఎక్కే అదృష్టం కలిగింది. అన్ని రిజర్వేషన్స్ చేయించుకుని అలెప్పీలో ఒకరోజు బోట్ స్టే కూడా బుక్ చేసుకుని ముందుగా కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లో దిగాం. తమిళనాడు అనుభవం వల్ల ఈసారి ముందుగానే, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ వచ్చిన కార్ డ్రైవర్ కావాలని అడిగాం. డ్రైవర్ పేరు థామస్, అతను కొన్నేళ్లు గల్ఫ్ లో పని చేసి వచ్చాట్ట, కాస్త హిందీ తెలుసు. మొదట కాలడి చూపించి అక్కడ నుంచి ఎరుమేలి తీసుకు వచ్చాడు. ఎరుమేలి లో వావర్ స్వామి మసీదు, ఎదురుగా వున్న అయ్యప్ప ఆలయం చూసాం. కొంతమంది ఇరుముడి కట్టుకున్న భక్తులు ఈ గుడిలో పేటతుళ్లి అని డప్పులు, డోళ్లు పట్టుకుని డాన్స్ చేశారు. సరదాగా అనిపించింది. అక్కడి నుంచి ఎరుమేలి లోనే వున్న మరొక అయ్యప్ప ఆలయానికి వచ్చాం. దానిపేరు తత్వమసి. అంటే "అది నీవే అయి వున్నావు" అని. అక్కడే ఒక హోటల్లో భోజనం చేసాం. వాళ్ళు గులాబీ రంగులో వున్న నీళ్లను గ్లాసుల్లో పోసి ఇచ్చారు. అవి అక్కడి వనమూలికలతో కాచిన నీళ్లట. మెడిసినల్ అనీ, అవి తాగితే అక్కడ మంచిదనీ చెప్పారు. ఆ నీళ్ళే తాగాం, బావున్నాయి. నేను ఆ మూలికలు కొన్ని కొనుక్కుని తీసుకువచ్చాను కూడా. అక్కడినుంచి ఎత్తుమానూర్ మహాదేవ ఆలయం మీదుగా నీలక్కల్, పంబ చేరుకున్నాం. ఈ యాత్రలో మేము చూసిన ఎత్తుమానూర్, చెంగన్నూర్, వైకోమ్ మహాదేవ ఆలయాలను గురించి మరో పోస్ట్ లో రాస్తాను. దారిలో ఒక రకం లిచ్చీ పళ్ళ లాంటి చెట్లు, ఆ చెట్లకు వేసిన వలలు కనిపించాయి. ఏమిటని అడిగితే, ఏదో ఫ్రూట్ పేరు చెప్పి, అవి సీజనల్ అనీ, చాలా ఖరీదనీ, కోతులు, పక్షులు పాడు చెయ్యకుండా ఇలా వలలు చుట్టి పెడతారనీ చెప్పాడు. భలే వింతగా అనిపించింది. సరిగ్గా ఇలాగే కురుక్షేత్రంలో కూడా, గీతా ఉపదేశ స్థలంలో ఆ చెట్టుని రక్షించు కోవటానికి వలలు చుట్టి పెట్టారు. పంబ వెళ్తున్నప్పుడు మా డ్రైవర్ చెప్పాడు, ఇష్టం ఉంటే కొండ ఎక్కేముందే, గణపతి ఆలయం దగ్గర దేవస్థానం బోర్డు వాళ్ళే ఇరుముడి కడతారని, అప్పుడు ఆ పదునెట్టాంబడి ఎక్కొచ్చని. ఒక్క సారి వొళ్ళు పులకరించింది, మాకంటే అదృష్టమా అని. సరే, చూద్దాం అక్కడ పరిస్థితిని బట్టి అనుకున్నాం. మా వారికి మాత్రం దీక్ష చేయకుండా ఇలా ఇరుముడి, పదునెట్టాంబడి ఎక్కడం చెయ్యొచ్చా అని పెద్ద సందేహం. నేను మాత్రం దేవస్థానం వాళ్లకు మనం దీక్ష చేయలేదనీ, కాకపోతే మేము శాకాహారులమనీ, చెప్పి వాళ్ళు అనుమతిస్తేనే ఈ ఇరుముడి, పదునెట్టాంబడి చేద్దామని అన్నాను.
పంబ దగ్గర దిగాక ఇక కార్లు పోవు. ఆ మెట్లన్నీ ఎక్కీ దిగీ, నది దాటి వచ్చాము. స్నానం చేద్దామని బట్టలు కూడా తెచ్చుకున్నాం కానీ అక్కడ ఆ నది ఉధృతి, సౌకర్యాలు చూసి వద్దనుకున్నాం. మామూలుగా ప్రోక్షణ చేసుకుంటుంటే డోలీ వాళ్ళు వెంటబడ్డారు. వాళ్ళు చెప్పే ధరకీ, మా ఫ్రెండ్ చెప్పిన ధరకీ చాలా తేడా కనిపించింది. వీళ్ళు దాదాపు మూడు, నాలుగు రెట్లు ఎక్కువ అడిగారు. దానితో మాకు కన్ఫ్యూజన్ వచ్చింది. సరే, ముందు గణపతి ఆలయం చూసి, ఆపైన దేవస్వం బోర్డు వాళ్ళని కలిశాక అప్పుడు మాట్లాడుకుందామని, ఈ డోలీ వాళ్లను వదిలించుకోవాలని, వాళ్లకు టీ తాగించి ఆలయానికి వచ్చాం. గణపతి దర్శనం తరువాత చూస్తే, అక్కడ ఇరుముడి కట్టు స్థలము అని బోర్డు కనపడింది. మావారు వెళ్లి వాళ్ళను కలిశారు. వాళ్లేమో మేము ఆ ఇరుముడి, పదునెట్టాంబడి లకు ఎలిజిబుల్ అని చెప్పి, దేవస్వం బోర్డు వాళ్ళ కౌంటర్ దగ్గర డబ్బు కట్టి రసీదు తెచ్చుకోమన్నారు. అప్పటికీ మావారు స్థిమిత పడలా. మళ్ళీ తన సందేహాలన్నీ ఆ కౌంటర్ లో వున్న ఉద్యోగికి కూడా చెప్పి, అతను కూడా వెళ్లొచ్చు అన్నాకే, డబ్బు కట్టి రసీదులు తెచ్చారు. అతని ద్వారానే డోలీలు కూడా మాట్లాడుకుని వచ్చారు. ఇద్దరం ఇరుముడి కట్టించుకున్నాం. నా చేతే ఆ కొబ్బరికాయల్లో నెయ్యి పోయించారు, ఇరుముడిలో బియ్యం వేయించారు. మావారిని మాత్రం పంచ ఉత్తరీయం వేసుకోవాలని చెప్పారు. నేను ఎప్పుడూ అలవాటుగా బ్యాగులో పెట్టుకునే పట్టు ధోవతీ సెట్ వుంది. తరువాత ఇరుముడి నెత్తిన పెట్టుకుని డోలీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఆ డోలీ వాళ్లు మళ్ళీ వచ్చి రేట్ గురించి తగాదా పెట్టుకున్నారు. చాలా చికాకు వేసింది. ఆ దేవస్వం ఉద్యోగి చెప్పాక కదిలారు, కానీ దారి అంతా సణుగుతూనే వున్నారు. దారి చూసాక ఆశ్చర్యం వేసింది. చక్కటి రోడ్డు. అటూ ఇటూ లైట్లు, మధ్యలో ఎక్కడికక్కడ నీళ్లు, టీలు, టిఫిన్లు. అన్ని సౌకర్యాలూ వున్నాయి. ఈ రోడ్డులో తీసుకెళ్లేందుకా ఈ డోలీ వాళ్ళు ఇంత పేచీ పెడుతున్నారు, అనిపించింది. వీళ్లను ఏ అమరనాథో, యమునోత్రినో తీసుకుపోయి వదిలి, కష్టమంటే ఇదిరా నాయనా, అని చెప్పాలనిపించింది. ఏదో, ఇక్కడ వాళ్లదే రాజ్యం కనుక వాళ్ళ దాదాగిరీ సాగుతోంది. మొత్తం రానూ పోనూ కలిపి ఏడు కిలోమీటర్లు. ఈ దూరానికే వీళ్ళింత ఆగం, అల్లరి చేస్తుంటే ఇక పాపం అమరనాథ్ వాళ్లకి, యమునోత్రి వాళ్ళకి చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించింది. దారిలో మరో తెలుగు వాళ్ళ బృందం తగిలింది. వీళ్ళ ఫిలాసఫీ గురించి కూడా ముందు ముందు రాస్తాను.
పైకి వెళ్ళాక పదునెట్టాంబడి వెళ్లే క్యూలో నుంచున్నాము. మధ్యలో ఒక చెట్టు గట్టు దగ్గర మావారు బట్టలు మార్చుకుని ధోవతీ, ఉత్తరీయం వేసుకున్నారు. ఆ మెట్ల దగ్గరకు వెళ్లేసరికి మేమూ అందరితో పాటు శరణం అయ్యప్పా అని శరణుఘోష పెట్టాం. సన్నని మెట్లు. పాదం సగం బయటే ఉంటుంది. మెట్లు కూడా జారుతూ వున్నాయి. కానీ అటూ ఇటూ పోలీసులు నుల్చుని వుండి, నాలాంటి వారికి ఆ మెట్లపై చెయ్యందించి పైకి లాగుతున్నారు. నెమ్మదిగా పైకి చేరాం. ఈసారి క్యూ పూర్తిగా విడిపోయింది. ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోయారు. కాసేపు మాకు ఎటుపోవాలో అర్ధం కాలా. అప్పుడు ఎవరో ఒకబ్బాయి వచ్చి డబ్బులిస్తావా, గుడి మెట్టు దాకా తీసుకెళ్తా అన్నాడు. సరే అని అతనితో వెళ్లాం. ఆ జనంలో మమ్మల్ని ఎలా తోశాడో ఏమో తెలియలేదు కానీ, ఒక ఐదు నిముషాల్లో లోపల వరకూ వచ్చేసాం. లోపల గర్భగుడికి ఒక ఐదు మెట్లు వున్నట్టున్నాయి. మనం ఆ మెట్ల వరకూ వెళతాం. చిన్న గర్భగృహం. అటూ ఇటూ ధగద్ధగాయ మానంగా వెలిగిపోతూ చెరో ఏడు దీపాలు, మధ్యలో కటి బంధంతో ముద్దులొలుకుతూ బంగారు అయ్యప్ప. నిజంగానే బంగారు శిల్పం, మెరిసిపోతోంది. అయ్యప్పేమో ముద్దుగా వున్నాడు. చూసి దణ్ణం పెట్టుకోవాలా, మురిసిపోయి ముద్దు పెట్టుకోవాలా, కాసేపు తెలియలా. అలా మురిపెంగా చూస్తూ, నెత్తి మీద ఇరుముడి జారిపోకుండా చూసుకుంటూ వెనక్కు చూస్తూ వచ్చేసా. ఇంతవరకూ ఎక్కడా అంత ముద్దు లొలికే విగ్రహాన్ని చూడలేదు. బహుశా ఆ అందమే నాలో వాత్సల్య భక్తిని జాగృతం చేసినట్టుంది. మంచి దర్శనం అయ్యింది. చాలా కంప్లీట్ గా అనిపించింది.
ఇప్పటి దాకా ఆ పదునెట్టాంబడి ఎలా ఎక్కాలి, అయ్యప్పను ఎలా దర్శనం చేసుకోవాలీ ఇంతే ఆలోచన. ఇప్పుడు ఈ ఇరుముడి ఏం చెయ్యాలి, ఈ రాత్రికి బస ఎక్కడా అని కొత్త ఆలోచన మొదలయ్యింది. ఒక గురుస్వామిని అడిగితే, బియ్యం పొయ్యటానికి హుండీలున్నాయి, చూసి దాంట్లో పోసేయండి అని చెప్పాడు. హుండీ చూసుకుని ఇద్దరి ఇరుముడి లోని ఒక మూటలోని బియ్యం పోసేసాం. ఆ తరువాత ఒక కొబ్బరికాయను మాలికాపురత్తమ్మ గుడి ముందు అటూ ఇటూ పారించి అక్కడ వదిలేయమన్నాడు. మా ఆయన వంగలేనన్నారు. దాంతో మావారి కాయను కూడా నేనే మాలికాపురత్తమ్మ గుడి ముందు ఇద్దరి కొబ్బరికాయలూ అటూ ఇటూ దొర్లించా. ఇప్పటికి మా ఇరుముడిలో ఒక మూట అయిపోయింది. ఈ లోపల దార్లో పరిచయమైన ఇద్దరు అబ్బాయిలు డబ్బులు ఇవ్వండి, అరవణ పాయసం డబ్బాలు తెచ్చి పెడతామన్నారు. వాళ్ళు వాళ్ళ సామాను మాకు అప్పచెప్పి వెళ్లారు. వాళ్ళు వచ్చి నెయ్యి కూడా వుంది, అమ్ముతున్నారు అని చెప్పారు. అది కూడా తెమ్మని డబ్బు ఇచ్చాం, కానీ వీళ్ళు మళ్ళీ వెళ్లేసరికి ఆ నెయ్యి అయిపోయి, వాళ్ళు షాప్ మూసేసారుట. పాపం ఖాళీగా వెళ్లి తిరిగిచ్చారు. ఇంకా మా దగ్గర స్వామికి నెయ్యభిషేకం చెయ్యవలసిన కొబ్బరికాయలు, అరవణ పాయసం కోసం మూటలో బియ్యం వున్నాయి.
ఆ తరువాత రూమ్స్ కోసం వెళ్లాం. అదో మహా సముద్రం. అక్కడ అందరూ ముందే బుక్ చేసుకున్నట్టున్నారు. మాలాంటి వారికి రూమ్ దొరకలేదు. ఇంతలో అక్కడ మాకు గణపతి ఆలయం దగ్గర ఎదురైన తెలుగు గురుస్వామి, వారి బృందం కనిపించింది. ఆయన అక్కడ మమ్మల్ని చూసి రూమ్ దొరకలేదా, మా రూములో వుండండి అన్నారు. ఎంత మంచి ఆయనో. ఆయనతో పాటు వచ్చిన వారిలో కొంతమంది దీక్ష తీసుకున్న వారు, కొంతమంది దీక్ష తీసుకోని వారు వున్నారు. మేము దీక్ష తీసుకోలేదనీ, కిందే ఇరుముడి కట్టించుకున్నామనీ, ఆ పదునెట్టాంబడి ఎక్కామనీ చెపితే చాలా బాధ, భయం పడిపోయారు. బాధేమో వాళ్ళు అలా చెయ్యలేక పోయారే అని, భయం ఏమో, అయ్యో దీక్ష తీసుకోకుండా అలా ఎలా అని. నేను వారికి స్పష్టంగా చెప్పాను. అన్నీ కింద ఇరుముడి కట్టేవారికి వివరించే చేశాం అని. ప్రస్తుతం ఈ దేవస్వం బోర్డు వాళ్ళు మాలాంటి వారికి కూడా అఫీషియల్ గానే ఈ సదుపాయం కలగచేశారనీ చెప్పాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదలుకోవటం, మేము నల్ల బట్టలు, తులసి మాలలు, భూశయనం చేయలేదేమో, కానీ మేమిద్దరం ఎన్నో ఏళ్ళ నుంచీ యాత్రా దీక్షలో వున్నవాళ్ళం. ఎటువంటి ప్రీ ప్లాన్ లేకుండా, కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే వచ్చిన వాళ్ళం. లేకపోతే మాకు ఇవన్నీ సాధ్యమా. ఈ అయ్యప్ప రమ్మన్నాడు, వచ్చాం, అని చెప్పా. వాళ్ళు సంతృప్తి పడలేదు. సరే, ఎవరి దృక్పధం వారిది. వాళ్ళేం నా స్టూడెంట్స్ కాదు కదా, నేను చెప్పిన ప్రతి దానికీ తల వూపటానికి. కొన్నేళ్ల పాటు లోపల జీర్ణించుకుని పోయిన ఆలోచనా పీఠం కదలాలి గదా. బహుశా ఈసారి వాళ్ళల్లో కొంతమందైనా నెక్స్ట్ టైం మాలాగే చెయ్యచ్చు.
ఐనా ఈ దీక్షలు, నియమాలు నిరంతరం దేవుని స్పృహలో ఉండటానికి ఏర్పరిచినవి. ఈ కఠిన నియమాలు ఎవరినైనా అలా నిష్ఠగా ఉండేలా చేస్తాయి. దారి తప్పే వాళ్ళూ వుంటారనుకోండి, కానీ వారి శాతం తక్కువ. నేను మాత్రం అయ్యప్పే స్వయంగా మాకీ అద్భుత అవకాశాన్ని ఇచ్చాడని గాఢంగా నమ్మాను. శరణం అయ్యప్పా. తీరా వాళ్ళ రూమ్ అలాట్ అయ్యాక వెళ్లి చూస్తే, వాళ్ళెంత ఉదార హృదయంతో మా రూములో ఉండండి అన్నా, వాళ్ళ రూంలో ఉండటం ఏమాత్రం ధర్మం కాదనిపించింది. చిన్న 10 X 10 గది, ఒక్క బాత్రూమ్. ముందే వీళ్ళు 14 మంది. మేమూ కలిస్తే 16 మంది. మేమూ వాళ్ళతో ఉండటం న్యాయం కాదని అనిపించింది. ఆ బృందానికి తెల్లవారితే అభిషేకం ఉందట, మమ్మల్నీ జాయిన్ అవమన్నారు. మా దగ్గర వున్న రెండో ఇరుముడి లోని వస్తువులు ఏదైనా గురుస్వామికి ఇచ్చి వాళ్ల బియ్యం, నెయ్యిలో కలిపేయాలన్నారు. వీళ్లకు నమస్కారం చెప్పి కిందకు వచ్చాం. గుడి ముందర అన్నీ పెద్ద పెద్ద షెడ్డులు. వాటికి అటాచ్ గా బాత్రూములు. కానీ అక్కడ అంతా ఒక వేపు జనంతో కిక్కిరిసి పోయి వుంది, మరో వైపు పరమ అపరిశుభ్రంగా వుంది. ఆ వైపు షెడ్డులన్నీ కేవలం మల, మూత్ర శాలలుగా మాత్రమే వాడబడు తున్నాయి. పాపం దేవస్వం బోర్డు వాళ్ళు ఎన్ని సదుపాయాలూ కల్పించినా భక్తులు నియమాలూ, నిష్ఠలూ తప్ప, శుచీ, శుభ్రం సంగతి వదిలేసినట్టున్నారు. చాలా బాధ వేసింది. చివరకు అటు వేపు కుక్కలు కూడా పడుకోవటం లేదు. కాసేపు ఆ గట్టున కూర్చుని చర్చించుకున్నాం, ఏమి చేయాలీ అని. దేవుడు మమ్మల్ని చూట్టానికి పిలిచాడు, వచ్చాం. దర్శనం అయ్యింది. అభిషేకం మరొకరు చేస్తారు అనిపించింది. అప్పుడు రిటర్న్ అయి కిందికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాం.
అప్పుడు మళ్ళీ గుడి దగ్గరకు వెళ్లి ఒక బృందం ఇరుముడులు విప్పుకుంటుంటే, చూసి వారికి మా అసహాయత చెప్పి వారి నెయ్యి, బియ్యంలో మావి కూడా కలిపి అభిషేకం చెయ్యమని అడిగాం. వాళ్ళు బియ్యం నా చేత్తోనే, వాళ్ళ బియ్యంలో కలిపించారు. నెయ్యి వాళ్ళ కొబ్బరికాయలు కూడా బద్దలు కొట్టినప్పుడు తీస్తామన్నారు. థాంక్స్ చెప్పి, అవి వారికి అప్పచెప్పి దేవుడికి, ధ్వజస్తంభానికి నమస్కరించుకుని బయటకు వచ్చాం. మా డోలీ వాళ్లకు ఫోన్ చేసి పిలిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ దగ్గరే కూర్చోండి, వస్తాం అన్నారు. ఆ ఆఫీస్ లో కూడా బెడ్స్ వున్నాయి. అన్నీ త్రీ టైర్ సిస్టం ఇనప మంచాలు. వాళ్లను కూడా అడిగి చూసాం. బెడ్స్ ఉన్నాయా అని, లేవన్నారు. కాకపోతే వాళ్ళ పర్మిషన్ తో వాళ్ళ టాయిలెట్లు వాడుకున్నాం. అవి శుభ్రంగా వున్నాయి. ఈ లోపల మా డోలీ వాళ్ళు వచ్చి కిందకు దింపారు. కిందకు వచ్చాక మా డ్రైవర్ ని కలుసుకుని విషయం చెప్పి ఎక్కడైనా రూమ్స్ దొరుకుతాయా అని అడిగితే, అతనూ చాలా ట్రై చేసాడు. ఈ ఒక్క ఐదు రోజులే గుడి తెరుస్తారనటంతో, జనం విపరీతంగా వచ్చినట్టు వున్నారు. లాభం లేకపోయింది. డ్రైవర్ బయల్దేరి పోదాం, దారిలో ఏవూళ్ళో రూమ్ దొరికితే అక్కడ ఆగిపోదాం అన్నాడు. దారిలో అతను చాలా ఊళ్ళల్లో ట్రై చేసాడు. కొన్నిచోట్ల రూముల్లేవు, ఉన్నచోట్ల భయంకరంగా వున్నాయి. ఇలా రూముల ఇబ్బంది ఇంతకు ముందూ ఒకసారి తిరునల్లార్ లో, ఇంకోసారి బాంధవ్ ఘర్ లో వచ్చింది. బాంధవ్ ఘర్ లో మంచి రిసార్ట్ బుక్ చేసుకున్నా, వాడు మోసం చేసాడు. ఇప్పుడు చివరకు ఆదూరు అనే గ్రామంలో ఫరవాలేదనిపించేలా ఒక రూమ్ దొరికింది. అది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆదూర్ గోపాలకృష్ణన్ గారి ఊరట, సంతోషం వేసింది. తెల్లవారి లేచి బయల్దేరి తిరిగి యాత్ర మొదలుపెట్టాం. దారిలో చెంగన్నూర్ మహాదేవుడిని చూసుకుని హరిపాద్ కి వచ్చాం. ఈ హరిపాద్ లో రెండు అద్భుతమైన సుబ్రహ్మణ్య ఆలయాలు వున్నాయి. రెండూ పరశురామ ప్రతిష్టే. అసలు అయ్యప్ప ఆలయంతో సహా ఈ కేరళ అంతా పరశురామ భూమే కదా. అందుకే ఈ రాష్ట్రాన్ని God's own land అంటారు. హరిపాద్ లోని ఈ రెండు ఆలయాలూ సుబ్రహ్మణేశ్వరుడు, నాగరాజు లవి.
మొదట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చాం. లోపలకు వెళ్లి అర్చించుకోవటానికి మగవారికి ధోవతీలతో వస్తే అనుమతి ఇచ్చారు. మావారు లోపలకు వెళ్లి అర్చన చేయించారు. నేను ఆ పూజ చూస్తూ బయట నుంచున్నా. ఈ బంగారు విగ్రహం కూడా చాలా సమ్మోహనంగా వుంది. ఏమిటో, ఈ సుబ్రహ్మణ్యుడు కూడా భలే ముద్దొచ్చాడు. తిరుత్తణిలో సుబ్రహ్మణ్యుడూ అంతే. దీనిని దక్షిణ పళని అంటారట. తల్లి పార్వతి ఇచ్చిన శక్తి ఆయుధం పట్టుకుని నిలుచుని ఉంటాడు. తలపై ఐదు బంగారు చంద్రవంకలు, ఛత్రంతో చాలా తపోదీక్షలో ఉన్నట్టు కనిపించాడు. ఈ దేవత దర్శనం తరువాత హరిపాద్ లోనే వున్న మన్నారశాల శ్రీ నాగరాజ మందిరానికి వచ్చాం. దీని అసలు పేరు మందారశాల అట, చాలా మందార చెట్లు వుండేవిట, అందుకే ఆ పేరు. రానురానూ అదే మన్నారశాల అయ్యింది. ఇక్కడ స్త్రీలే పూజారులు. ఏ కుటుంబం లోనైతే ఈ నాగరాజు పుట్టాడో, ఆ కుటుంబంలోని వృద్ధ మహిళలే నేటికీ ఇక్కడ పూజారులు. ఇక్కడ ప్రధాన దేవుడు అనంతుడు, ఆయనే నాగరాజుగా పూజలందుకుంటున్నాడు. పక్కనే వున్న మరో రెండు ద్వారాల్లో నాగయక్షి, నాగ చాముండి వున్నారు. గుడి నిండా ఎక్కడ చూసినా నాగ విగ్రహాలే. చెట్టు గట్లమీదా, పాదుల్లోనూ, కాంపౌండ్ గోడల మీదా, ఇక్కడా, అక్కడా అని కాదు అన్ని చోట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టిన నాగదేవత విగ్రహాలే. క్షణం సేపు ఒళ్ళు గగుర్పొడిచింది. అక్కడ వాళ్ళను అడిగితే మొత్తం 30 వేల పైనే విగ్రహాలున్నాయి అన్నారు. యధా ప్రకారం మావారు లోపలికి వెళ్లి అర్చన, అభిషేకం చేయించుకుని వచ్చారు. 'జై నా బ్యాగులో పట్టుపంచలకీ' అనుకున్నా, నవ్వుకుంటూ. ఈ ఆలయంలో మాత్రం ఖచ్చితంగా మహాసర్పాలు, దేవతాసర్పాలు వుంటాయని అనిపించింది. సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే, తప్పక సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. మొత్తం మీద ఒక పవిత్ర ప్రదేశం చూసాం అనిపించింది. మన చుట్టూ దేవుడు వున్న భావన ఆ ఆలయంలో కాలు పెట్టినప్పటినుంచీ స్పష్టంగా తెలుస్తూనే వున్నది. ఆలయంలో గోడలు కప్పు అంతా దారు శిల్పమే. కింద చూస్తే మటుకు రాతి నాగదేవతా విగ్రహాలు. ఈ ఆలయంలో కూడా పూజాదికాలు అయ్యాక బయటకు వచ్చి మళ్ళీ యాత్ర మొదలు పెట్టాము.
తిరుగు ప్రయాణంలో వైకోమ్ మహాదేవుడిని దర్శించాం. అవన్నీ తరువాతి పోస్టులో పెడతాను. ఈ రకంగా మా శబరిమల యాత్ర ముగిసింది. అలెప్పీ చేరుకున్నాం. అక్కడా, ఆ తరువాత త్రివేండ్రం లోనూ, చాలా చూసాం. ముఖ్యంగా ఈ యాత్రలో పరశురామాలయం చూడగలిగాం. ఆ వివరాలు అన్నీ దశావతారాల క్షేత్రాలలో రాస్తాను.
ఓం అయ్యప్పదేవాయనమః, ఓం సుబ్రహ్మణ్యాయనమః,
ఓం నాగరాజాయనమః, ఓం పరశురామాయనమః
ఓం నమః శివాయ
తరువాతి పోస్టులో కేరళ లోని మూడు గొప్ప మహాదేవ ఆలయాల గురించి చెప్పకుందాం. అవి ఎత్తుమానూర్ మహాదేవ, చెంగన్నూర్ మహాదేవ, వైకోమ్ మహాదేవ ఆలయాలు. యెంత పురాతనమైనవో, యెంత పెద్దవో. ప్రస్తుతానికి ఈ పోస్టు ముగిద్దాం.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Brahmandamgaa undi sabarimalai darsanam
రిప్లయితొలగించండి