ఎత్తుమానూర్-చెంగన్నూర్-వైకోమ్-ఛోటానిక్కర మహాదేవ-భగవతి
ఎత్తుమానూర్-చెంగన్నూర్-వైకోమ్-ఛోటానిక్కర
మహాదేవ-భగవతి
జులై 2015 లో శబరిమల వెళ్ళేటప్పుడు మా డ్రైవర్ మమ్మల్ని ముందుగా కొట్టాయం దగ్గరలో వున్న ఎత్తుమానూర్ మహాదేవ ఆలయం అనే ఒక పెద్ద గుడికి తీసుకువెళ్ళాడు. ఈ ఆలయం ఏమిటి, దీని చరిత్ర ఏమిటి, అని అడిగితే కేరళలో వున్న నాలుగు శివాలయాలు ఒక లింక్ లో ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి, ఈ నాలుగు ఆలయాలను ఒకేసారి వెంట వెంటనే చూస్తే కోరికలు తీరుతాయని పేరు, ఆ నాలుగు ఆలయాలు ఎత్తుమానూర్, చెంగన్నూర్, వైకోమ్, కడుతురుతి అని చెప్పాడు. మా టూర్ లో వీలైనన్ని చూపిస్తా అన్నాడు. 'మాకు ప్రధానం శబరిమల, ఆ తరువాత దారిలో ఏవి వస్తే అవి చూపించు'అని చెప్పి ఆలయం లోనికి వెళ్లాం. ఇక్కడ అన్ని ఆలయాలలో శివుడి పేరు మహాదేవుడే, అలాగే అన్ని ఆలయాల్లో అమ్మవారి పేరు భగవతే. కనుక ప్రతి చోట ఆ వూరు పేరు తోనే ఆ ఆలయం సంగతి చెప్పుకోవాలి తప్పదు. అలాగే మేము ఛోటానిక్కర అనే ప్లేస్ లో ఇంకో భగవతి అమ్మవారి గుడి కూడా చూసాం. ఆ గుడి గురించి కూడా చెప్పుకుందాం. అది కూడా అద్భుతమైన గుడి. మేము చూసిన ఆర్డర్ లోనే అవి పరిచయం చేస్తాను.
మొదటగా ఎత్తుమానూర్ మహాదేవ దేవాలయం. దిగుతూనే కళాత్మకంగా వున్న ఒక పెద్ద మూడు అంతస్థుల మండపం. ఆ లోపలకు వెళ్ళంగానే మరో ముఖ మండపం, దానిలో ఒక పెద్ద త్రాసు, తులాభారానికి లాగా వుంది. ఆపైన ఒక పెద్ద శివుడి పెయింటింగ్. దానిలో ఒక శాంత స్వరూప శివుడు, మూడు చేతుల్లో త్రిశూలం, పరశువు, అగ్ని పట్టుకుని, నాలుగో చేత్తో అభయముద్ర. ఇదంతా బాగానే వుంది, కానీ ఆ శివుని వెనుక నీడలా మరో శివుడు ఎనిమిది చేతులతో కరాళనృత్యం చేస్తూ ఉంటాడు. ఒక్క క్షణం అర్ధం కాదు. సరిగ్గా చూస్తే అర్ధం అవుతున్నట్టు ఉంటుంది. రెండు రూపాలూ ఆయనవే. ఒకచోట శాంతుడు, అంటే శివుడు. కానీ ఆ వెనుకే ఆయన రుద్రుడు కూడా. రక్షించనూ గలడు, శిక్షించనూ గలడు. అదీ శివ తత్వం. లోపలికి వెళ్లాం. ఆ సమయానికి అభిషేకం చేస్తున్నారు. మంచి పవిత్రమైన వాతావరణం. ఆ దేవుడిలో శక్తి ఉట్టి పడుతోంది. అందుకే ఆయన్ని శక్తికి పతిని చేసామేమో. చాలాసేపు నియమబద్ధంగా, శ్రద్ధగా, అనేక రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మాకు అసలు ఈ దారిలో, ఈ పేరుతో ఒక బ్రహ్మాండమైన శివాలయం వున్నదనే ఒక అరగంట క్రితం వరకు తెలియదు. ఈ క్షణాన్న అక్కడ ఆ మహాదేవుడి ఎదురుగుండా నుంచుని ఆయన్ని అభిషేకిస్తుంటే మురిసిపోతూ చూస్తున్నాం. ఇదే కదా దేవుడి పిలుపు అంటే. దాదాపు గంట సేపు అభిషేకం చూసి, అదే ప్రాంగణంలో వున్న భగవతిని కూడా దర్శించుకుని బయటకు వచ్చాం. ఈ ఎత్తుమానూర్ ఆలయం లోనే ఆది శంకరుడు సౌందర్యలహరి రచించాడని అంటారు.
శబరిమల చూసుకున్న తరువాత అలెప్పీకి వెళ్లే దారిలో వున్న చెంగన్నూర్ కి వచ్చాం. ఈ ఆలయంలో కూడా మేము వెళ్లేసరికి మహాదేవుడికి హారతి ఇస్తున్నారు. ఎన్నో రకాలుగా హారతి ఇచ్చారు. చాలా ఆనందం వేసింది. ఏ ప్లాన్ లేకుండా వచ్చినా ఇలా ఇన్ని ప్రత్యేక సేవలు చూడగలగడం మా అదృష్టం అనిపించింది. ఇది కూడా చాలా పెద్ద ప్రాంగణం. ఇక్కడ మహాదేవుడి కన్నా భగవతి గురించే ఒక అద్భుతమైన విశేషం వుంది. మనకు అస్సాం రాష్ట్రంలో కామాఖ్యాదేవి ఆలయం వుంది. అది అష్టాదశ శక్తిపీఠాల్లోకి వస్తుంది. అక్కడ అమ్మవారు యోని రూపంలో ఉంటుంది. ఆ అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి రుతుస్రావం అవుతుంది. ఆ సమయంలో అంబువాచి అని కామాఖ్యలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇక్కడా అదే విధంగా ఈ అమ్మవారికి కూడా రుతుస్రావం జరుగుతుందిట. ఇదివరకు ప్రతి నెలా వస్తే, ఇప్పుడు మూడు, నాలుగు నెలలకు ఒకసారి రుతుక్రమం వస్తోందట. రోజూ ఆలయ ప్రధానపూజారి, ప్రధాన పూజారులను కేరళలో తంత్రి అంటారు, అమ్మవారి దుస్తులు పరీక్షించి మరక కనిపిస్తే, వారి ఇంటి నుంచి స్త్రీలను పిలిపించి పరీక్ష చేయిస్తాడు. వాళ్ళు అది నిర్ధారించిన తరువాత, అమ్మవారి విగ్రహాన్ని వేరే గదిలోకి మారుస్తారు. అమ్మవారి ఆలయం ఆ మూడు రోజులు మూసివేస్తారు. నాలుగో రోజున అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా పంబానదికి తీసుకువెళ్లి స్నానం చేయించి తిరిగి గుడిలో ప్రవేశ పెడతారట. ఆ నాలుగు రోజులు ఊరంతా ఉత్సాహంగా ఉత్సవాలు జరుపుతారట. ఇదీ సంగతి. కానీ ఇది నిజంగా అక్కడ ఈనాటికీ జరుగుతోంది. ఆ వస్త్రాన్ని కూడా ప్రసాదంగా ఇస్తారట. మేము వెళ్లినప్పుడు ఇవేమీ లేవు, మామూలుగా అమ్మవారిని చూసుకుని వచ్చేశాము. బయటకు వచ్చాక తెలిసిన విశేషం ఇది. తమాషాగా అనిపించింది. ఆసక్తి వున్నవారు ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ ఆలయం అలెప్పీ నుంచి సుమారు 40, 50 కిలోమీటర్ల దూరంలో వుంది.
తరువాత మేము అలెప్పీ నుంచి వైకోమ్ మహాదేవ ఆలయానికి వచ్చాం. ఇది కూడా ఎంతో పెద్ద ప్రాంగణం. కార్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళటానికి మధ్యాన్నం అవటంతో కాళ్ళు కాలిపోయాయి. పరిగెత్తాం లోపలికి. ఎత్తైన దీపస్తంభాలు. వాటి కన్నా ఎత్తైన ధ్వజస్తంభాలు ఈ ఆలయం ప్రత్యేకత. ఎంతో దూరం నుంచే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడా మహాదేవుడు, భగవతి ప్రధాన దేవతలు. ఇక్కడి మహాదేవుడు త్రేతాయుగం నాటి వాడని స్థలపురాణం. ఖరుడనే రాక్షసుడు చేసిన తపస్సుకి ప్రత్యక్షమైన శివుడు అక్కడ లింగరూపంలో వెలిసాడు. తనను సేవించినవారికి మోక్షాన్నిస్తానని ఖరుడికి వరం ఇచ్చాడు. తరువాత కాలాంతరంలో అక్కడ నదిలో పడి వున్న మోక్షాన్నిచ్చే ఈ మహాదేవుడిని పరశురాముడు చూసి ఆ లింగాన్ని నదిలో నుంచి తీసి ఆలయంలో పునః ప్రతిష్ట చేసాడట. ఇక్కడ నంబూద్రీలు పూజారులు. నంబూద్రీల గురించి నాకు తెలిసింది కొంచం చెప్పాలనుకుంటున్నా. నంబూద్రీలు ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్లిన బ్రాహ్మణులు. ఎన్నో వేల ఏళ్ళ క్రితం వెళ్ళిపోవటం వలన పూర్తిగా కేరళీయులయిపోయారు. వీరు ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ దగ్గర వున్న నంబూరుకి చెందిన సనాతన బ్రాహ్మణులు. వీరు చాలా నిష్టాపరులవటం వల్ల ఆదిశంకరుడు కూడా వీరిని తనతో పాటు బదరికాశ్రమంలో పూజారులుగా నియమించాడు. పరశురాముడు కేరళ ప్రాంతాన్ని సృష్టించినప్పటి నుంచి ఈ నంబూద్రీలు కేరళ లోనే వున్నారని అనేవారూ వున్నారు. ఆ తరువాత ఈ ఆలయంలో కూడా భగవతిని దర్శించుకుని వచ్చేసాం.
ఆ తరువాత మేము ఛోటానిక్కర అనే వూరిలో వున్న భగవతి ఆలయానికి వచ్చాం. ఇది రెండు లెవెల్స్ లో వున్న ఆలయం. అతి పెద్ద ప్రాంగణం. ముందర పై లెవెల్లో వున్న ఆలయం వస్తుంది. ఇక్కడి అమ్మవారి పేరు మూకాంబిక. ఇక్కడ ఆలయంలో రకరకాల మొక్కులు మొక్కుతుంటారు, తీరుస్తుంటారు. అక్కడ కూడా ప్రత్యేకమైన పెద్ద పెద్ద దీపస్తంభాలు వున్నాయి. అక్కడ పిల్లల కోసం మొక్కుతారు కాబోలు, చిన్న చిన్న వుయ్యాలలు అమ్ముతున్నారు. అక్కడ ఆలయం చూరులకు వుయ్యాలలు వేలాడదీశారు. ఆ తరువాత మెట్లు దిగి కిందవున్న భగవతి ఆలయానికి వెళ్లాం. అది ఇంకా విశేషంగా కనిపించింది. ఇక్కడ అమ్మవారిని ఉదయం మహాసరస్వతి పేరుతో, మధ్యాన్నం మహాలక్ష్మి పేరుతో, సాయంత్రం మహాకాళి పేరుతో కొలుస్తారు. అమ్మవారి విగ్రహం చాలా కళగా వుంది. పెద్ద పెద్ద చేటల్లో రకరకాల ధాన్యాలు, పసుపుకొమ్ములు వగైరా వస్తువులు వేసి అమ్మవారికి మొక్కులుగా చెల్లిస్తారట. ఆ చేటలన్నీ లైనుగా పెట్టారు. అంతా వింతగా వుంది. మొత్తానికి ఈ కేరళ ప్రాంతమంతా తంత్రం, తాంత్రిక పూజలు ఎక్కువగా కనిపించాయి. బహుశా అందుకే నేమో వాళ్ళు ప్రధాన పూజారులను తంత్రి అంటారు అన్ని ఆలయాల్లోనూ. ఆ రోజు చాలా పెద్దవాన కురిసింది. తప్పనిసరిగా మేము కింద ఆలయంలో ఆగిపోవాల్సి వచ్చింది. చాలాసేపు ఆగాము. ఆ మెట్లపై నుంచి వాననీరు ఉధృతమైన జలపాతంలా దుముకుతూ ఉంటే, ఒక్క క్షణం భయం, ఒక్క క్షణం వినోదం. దాదాపు గంట తరువాత వాన నిలిచాక పైకి తిరిగి రాగలిగాం.
మేము ఇక్కడ, అంటే కేరళలో చూసిన మరో విశేషం, చర్చీలలో ధ్వజస్తంభాలు, అదీ బంగారపు పూతతో. దూరం నుంచి చూస్తే హైందవ దేవాలయం అనుకుంటాం. దగ్గరకు వెళితే ఆ ధ్వజస్తంభం పైన గోల్డెన్ క్రాస్ కనిపిస్తుంది. సరదాగా ఓ ఫోటో తీసా. మీరూ చూడండి. మన వాళ్ళు, వాళ్ళను చూసి నేర్చుకుని రెండు చేతులతో దేవుడికి దణ్ణం పెట్టే బదులు, ఆ చేత్తోనే ముద్దు పెడుతుంటే, వాళ్లేమో మనల్ని చూసి ధ్వజస్తంభాలూ, సుప్రభాతాలూ, స్తోత్రాలూ మొదలు పెట్టారు. ఏదైతేనేంలే, ఇద్దరికీ పొరుగింటి పుల్లకూర రుచి. ఈ ఆలయాలే కాక మేము చాలా వైష్ణవాలయాలు కూడా ఈ యాత్రలో చూసాం. వాటి గురించి వైష్ణవ దేవాలయాల జాబితాలో తెలుసుకుందాం.
ఇంతటితో మా మహాదేవ, భగవతి ఆలయాల సందర్శనం ముగిసింది. మేము చూసిన ఎత్తుమానూర్, చెంగన్నూర్, వైకోమ్, ఛోటానిక్కర ఆలయాలన్నీ విశాలమైన ప్రాంగణాలున్నవి. అన్నీ శక్తి కేంద్రాలే. ఆ దేవతా విగ్రహాలన్నింటికీ వున్న శక్తి అక్కడికి వెళ్లినప్పుడు మాకు స్పష్టంగా అనుభూతి లోకి వచ్చింది. కేరళలో ఈ ఆలయాలన్నీ ఉన్నట్టు మాకు ఇక్కడకు వచ్చిన దాకా తెలియదు, అయినప్పటికీ ఏనాడో మేము చేసుకున్న పూజాఫలం మాకు ఈ దర్శనాలని ఇచ్చింది. ఆ దివ్య శక్తికి సదా ప్రణామాలు.
ఓం ఎత్తుమానూర్ మహాదేవాయనమః
ఓం చెంగన్నూర్ మహాదేవాయనమః
ఓం వైకోమ్ మహాదేవాయనమః
ఓం ఛోటానిక్కర భగవత్యై నమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Nice one aunty...
రిప్లయితొలగించండిDo we need to visit all these 4 temples on the same day???
Avunu, they told like that only. But we visited only 3 of them in three days.
తొలగించండి