వడక్కునాథన్-పరమెక్కావుభగవతి-త్రిసూర్

వడక్కునాథన్-పరమెక్కావుభగవతి-త్రిసూర్ 

శ్రీలంక యాత్రకు వెళ్లేముందు 2015 ఫిబ్రవరిలో కేరళలో కాలడి, గురువాయూర్, త్రిసూర్, తిరువనంతపురం, తమిళనాడులో రామేశ్వరం చూడాలని సంకల్పించాం. అందులోనూ ఎలాగూ శ్రీలంకకి వెళ్లాలంటే మద్రాస్ దాకా వెళ్ళాలి కదా, ఇంకో వారం ముందర బయలుదేరితే ఈ ప్రాంతాలు కూడా చూడచ్చు అనేది ఒక ఆలోచన. త్రిసూర్ రైల్వేస్టేషన్ లో దిగి రిటైరింగ్ రూమ్ తీసుకున్నాం. టాక్సీలో వూరు చూట్టానికి బయలుదేరాం. ముందర ఒక గణపతి గుడికి వెళదాం అని ఆ డ్రైవరే సజెస్ట్ చేసాడు. ఆ తరువాత ఆ వూళ్ళో మాకు వడక్కునాథన్ ఆలయం, పరమెక్కావు భగవతి ఆలయం తిరువంబాడి కృష్ణుడి ఆలయం వగైరా చూపించాడు. కేరళ గురించి ఒక్క విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి. కేరళలో రోడ్లు సన్నగా వున్నా, శుభ్రంగా వున్నాయి. డ్రైవర్లు అందరూ చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. వారి మానర్స్ కూడా బావుంది. రైల్వేస్టేషన్ దగ్గర టాక్సీ అయినా సరే, అతను మాకేం కావాలో తెలుసుకుని చక్కగా అన్నీ చూపించాడు, వివరాలూ చెప్పాడు. అంతే కాదు, మావారికి కాలు నొప్పని ఎప్పటికప్పుడు వీలైనంత దగ్గరగా ఆపేవాడు. పిక్ అప్ చేసేటప్పుడు కూడా ఎక్కడికి వస్తే సులువో  చెప్పేవాడు. అందువల్ల అన్నీ చక్కగా చూడగలిగాం.

 
                                                          
వడక్కునాథన్ ఆలయం ప్రత్యేకత ఏమంటే, ఈ రోజుల్లో ఇంతవరకు ఎవరూ అసలు లింగాన్ని చూడలేదు. ఎప్పుడూ నెయ్యి అభిషేకంతో నిండా మునిగిపోయి వుంటుంది లింగం. ఈ గుడిలో కేవలం నేతితోనే అభిషేకం. కొన్ని వందల, వేల ఏళ్ళ నుంచీ ఇదే పద్దతి. ఈ నేతి లింగం దాదాపు రెండు అంతస్థుల ఎత్తు ఉంటుంది. ఆ లింగం మీద ఒక నిలువెత్తు బంగారు కవచం లాంటిది పెడతారు. ఆ కవచానికి 13 చంద్రవంకలు వుండి ఆ పైన మూడు శేషనాగులు ఛత్రం లాగా ఉంటాయి. ఈ పొడుగాటి కవచాన్ని ఆ నేతి లింగానికి గుచ్చి ఉంచుతారు. ఒక్కోసారి ఈ కవచాన్ని తొలగిస్తారు కానీ, నెయ్యిని మాత్రం తొలగించరు. ఆ నేతినే అందరికీ ప్రసాదంగా ఒక చిన్న అరటి ఆకు ముక్కలో పెట్టి ఇస్తారు. అడిగినవారికి ఉచితంగానే ఆ నెయ్యి ఒక చిన్న సీసాలో కూడా పెట్టి ఇస్తున్నారు. మేమూ తీసుకున్నాం. ఆ నెయ్యి ఎన్నో ఏళ్ళ పాతదైనా వాసనా వెయ్యదు, పాడూ కాదు. అదే ఆ శివుడి మహిమ. ఈ శివుడిని ఊరేగింపుగా బయటకు ఉత్సవమూర్తిని కూడా తీసుకెళ్లరు. మొత్తం కేరళలోనే ఇది మొట్టమొదటి ఆలయంగా భావిస్తారు. స్వయంగా కైలాస శివుడే తన పరివారంతో ఇక్కడ కొలువు తీరాడని నమ్మకం. కేరళలో తన స్వంత భూమిని సృష్టించుకున్న తరువాత పరశురాముడు కైలాసానికి వెళ్లి శివుడినే పార్వతీ, గణపతీ, సుబ్రహ్మణ్యుడు, ఇతర శివ గణాలతో వచ్చి అక్కడే నివసిస్తూ ప్రజలను చల్లగా కాపాడమని కోరుతాడు. పరశురాముని కోరికను మన్నించి అతని వెంట వచ్చిన శివుడు త్రిసూర్ ప్రాంతంలో ఒక మర్రిచెట్టు కింద లింగ రూపం ధరించి నిలిచిపోతాడు. ఈ ఆలయం గురించి బ్రహ్మాండపురాణంలో కూడా వుంది. ఆ తరువాత చాలా ఏళ్లకు ఈ లింగ మహత్యం గుర్తించిన కొచ్చిన్ రాజులు అక్కడ ఆలయం కట్టి లింగాన్ని అక్కడ ప్రతిష్ట చేశారు. అప్పటినుంచీ ఆ ఆలయంలో శివునికి, శివ పరివారానికి యధావిధిగా పూజలు జరుగుతున్నాయి. ఈ రోజుకీ శివుడు మొదట వెలసిన ఆ మర్రిచెట్టును అక్కడ వున్న తోటలో చూడచ్చు. ఈ ఆలయానికి చాలా పెద్ద ఆవరణ వుంది. పెద్ద తోట కూడా వుంది. టిప్పుసుల్తాన్ ఎన్ని ఆలయాలు ధ్వసం చేసినా ఈ ఆలయం జోలికి మాత్రం రాలేదట. పైగా ఈ ఆలయం పాత్రలు తన సైన్యానికి వంటకు వాడుకున్నందుకు గాను బదులుగా ఒక పెద్ద కంచు దీపస్తంభం బహుమతిగా కూడా ఇచ్చాట్ట. ప్రధాన ఆలయమూ పెద్దది, ఉపాలయాలు కూడా పెద్దవే. సమయం కొద్దిగా ఉండటం వల్ల (పన్నెండు గంటలకల్లా మూసేస్తారు మరి), ఒకరకంగా మిగిలిన ఆలయాలు పరిగెడుతూ చూసాం. అవన్నీ చాలా దూరంలో వున్నాయి, విశాలంగా వున్నాయి. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి. గణపతి, కుమారస్వామి ఆలయాలు ముఖమంటపం దగ్గర వున్నాయి. కృష్ణ, పరశురామ, రామ, అయ్యప్ప, మందిరాలే కాక శంకరనారాయణ మందిరం కూడా వుంది. ఈ శంకరనారాయణ మూర్తి హరిహర తత్వానికి సంకేతం. 

  

మరో విశేషమైన సంగతి, ఆదిశంకరుని తల్లితండ్రులు శివగురు, ఆర్యాంబలు ఈ వడక్కునాథుణ్ణే సేవించి వరంగా శంకరుణ్ణి సంతానంగా పొందారుట. ఈ ఆలయంలో శంకరాచార్యుడికి కూడా ఉపాలయం వుంది. ఇక ఇక్కడ ఏటా జరిగే పూరం అనే ఉత్సవం, సుమారుగా ఏప్రిల్, మే నెలలలో జరుగుతూ ఉంటుంది. పూరం నిర్వహించటం అంటే ఒక పెద్ద సంబరం. వూళ్ళో వున్న దాదాపు పది ఆలయాల నుంచి ఉత్సవమూర్తులు ఏనుగుల నెక్కి వస్తాయి. ఏ ఆలయం ఎన్ని ఏనుగులు పంపిస్తే అంత గొప్ప. ఆ ఏనుగులని మహా భారీగా, కళాత్మకంగా అలంకరిస్తారు. వాటి ముఖానికీ, అంబారీకి తొడిగే అలంకార ఆభరణాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేసే కళాకారులు వున్నారు. అలాగే ఏనుగులపై ఉంచే భారీ అందమైన గొడుగులు కూడా ఒక ప్రత్యేకత. అవన్నీ ఎంత అందంగా వుంటాయో వర్ణించలేం. ఈ పూరం ఉత్సవంలో, చాలా ఆర్భాటంగా మృదంగాలు, డోళ్లు, బాకాలు, బాజాలు వాయిస్తారు. టపాసులు కాలుస్తారు. సుమారు రోజున్నర పాటు సాగే ఉత్సవమది. దీని గురించి వినటం, పేపర్లలో చదవటం, టీవీల్లో చూడటం తప్పితే ప్రత్యక్షంగా చూడలేదు మేము. కానీ పూరం గురించి చెప్పకుండా త్రిసూర్ వడక్కునాథన్ గురించి చెప్పితే విషయం సంపూర్ణం కాదు. అందుకే చెప్పా.

 

ఆ తరువాత పరమెక్కావు భగవతి ఆలయానికి వెళ్లాం. కావు అంటే పుణ్యస్థలం అని. ఈ ఆలయం పరమెక్కావు, అంటే పరమ పవిత్రమైన పుణ్యస్థలం అని అర్ధం. భగవతి అమ్మవారి ఆలయాలు ఎన్ని వున్నా ఈ ఆలయానికే పెద్దపీట.  మేము వెళ్లేసరికి ఆలయం మూసి వుంది. పక్కనే ఒక దారి ఉంటే, ప్రాంగణం లోపలికి వెళ్లి కూర్చున్నాం. ఆ రెండు గంటలసేపు ఆ ఆలయంలో కూర్చుని, పడుకుని సేదదీరాం. చుట్టూ బోల్డన్ని పెయింటింగ్స్, బ్రాంజ్ ఫ్రేమ్ పై చెక్కిన చిత్రాలు వున్నాయి, అన్నీ చాలా బావున్నాయి. అవన్నీ చూస్తూ కాలక్షేపం చేసేశాం. అమ్మవారి గుడి అయిదింటికి తెరిచారు. లోపలికి వెళ్లి పూజ చేయించుకున్నాం. చాలా అందమైన, గంభీరమైన మూర్తి. ఎందుకో నాకు దేవుడి విగ్రహాల్లో, వాళ్ళ భావాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఒక్కోసారి అలసిపోయినట్టుగా, ఒక్కోసారి ఉత్సాహంతో, ఒక్కోసారి నవ్వుతూ, ఒక్కోసారి తేజస్సుతో, అలా కనిపిస్తాయి నాకు. హైదరాబాద్ లో వున్న సంఘీ ఆలయానికి వెళ్లి చూడండి, ఆ శివుడు రాజసంతో కనిపిస్తాడు. ఆగలేక నేను ఆ పూజారిని అడిగా, నాకు అలా రాజులా ఠీవిగా లింగం కనిపిస్తోంది, ఏమిటి అని. అప్పుడు ఆపూజారి నాకేసి ఆశ్చర్యంగా చూసి గర్భగుడి మీద వున్న పేరు చూపించాడు. ఆ శివుడు రాజరాజేశ్వరుడు. శిల్పులు అంత బాగా భావం ఉట్టిపడేలా చివరకు లింగాలను కూడా ఎలా చెక్కుతారో కదా. అలాగే పరశురాముడు విగ్రహం కూడా. ఈయన గురించి దశావతారాలలో చెప్పుకుందాం.  పూరం ఉత్సవంలో ఈ భగవతి ఆలయం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది.     

   

ఇంకో విశేషం, ఈ కేరళలో అన్ని ఆలయాల్లో దీపాల గురించి చెప్పుకోవాలి. ప్రతి ఆలయం లోనూ దేవాలయం చుట్టూరా గోడలన్నింటి పైనా ప్రతి అడుక్కీ నిలువూ వెడల్పూ వరుసల్లో అన్ని దీపాలూ పెడతారు. ఉత్సవదినాల్లో రాత్రిపూట వస్తే, లక్షల దీపాల్లో వెలిగిపోతున్నఆలయాలని చూడచ్చు. అసలు ప్రతి గోడకీ అలా చెక్కపట్టీలు, వాటిపై ఇత్తడి ప్రమిదలూ శాశ్వతంగా అమర్చి ఉంటాయి. ఇంతటితో ఈ వడక్కునాథన్ ఆలయం, పరమెక్కావు భగవతి ఆలయాల గురించి ముగిస్తాను.

ఓం వడక్కునాథాయ నమః, ఓం పరమెక్కావు భగవత్యై నమః 
ఓం పరశురామాయనమః, ఓం ఆది శంకరాచార్యాయనమః  

                       ఇక తరువాత మేముచూసిన కొన్ని శనిక్షేత్రాల గురించి చెప్పుకుందాం.


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం