మన నవ గ్రహ ఆలయాలు
మన నవ గ్రహ ఆలయాలు
నవగ్రహాలు దాదాపుగా ప్రతి శివాలయంలో కనిపిస్తాయి. కొన్ని ఆలయాల్లో మామూలు విగ్రహాలుగా కనిపిస్తే, కొన్ని ఆలయాల్లో ఆ విగ్రహాలు వాటి వాహనాలపై కూర్చుని కూడా కనిపిస్తాయి. మరి కొన్ని ఆలయాల్లో, ఆ నవగ్రహాలు భార్యా సమేతంగా కూడా కనిపిస్తాయి. కొన్నిచోట్ల లింగాకారంలో కనపడతాయి. మేము హైదరాబాద్ దగ్గర వున్న గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ చూడని రీతిలో వున్న నవగ్రహాలను చూసాం. అలాగే దత్తాలయ గుట్ట వెళ్ళినప్పుడు అక్కడ నవ జంటనాగుల శిల్పాలను అచ్చం నవగ్రహాల లాగానే ప్రతిష్ట చేసినవి చూసాం. ఇలాంటి కొన్ని అరుదైన నవగ్రహ క్షేత్రాలను చూసినప్పుడు నాలో కలిగిన అనుభూతులు, నాకు కలిగిన అనుభవాలు అందరితో పంచుకుందామని ఇది రాస్తున్నా.
అమరకంటక్: ముందుగా మీతో అమరకంటక్ ఆలయంలోని నవగ్రహాల ఫోటోతో మొదలుపెడతా. అప్పటిదాకా నవగ్రహాలను లింగాకారంలో చూసాం కానీ, ఈ విధంగా సింపుల్ గా నిరంతర అభిషేకం చెయ్యచ్చని చూసి అబ్బురపడింది ఇక్కడే. ప్రతి గ్రహం చుట్టూ ఒక ట్రైపాడ్, దానిపై కుండ, దానిలో ఒక చిన్న రంధ్రం, కుండ నిండా నర్మదానదీ జలాలు. అంతే, ఆ లింగాకారంలో ఉన్న నవగ్రహాలకు ఎప్పుడూ అభిషేకమే.
దత్తాచలం: హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర వున్న ఈ దత్తాచల క్షేత్రంలో ఏక ముఖ దత్తుడున్నాడు. ఇక్కడ నామధారకులవారు తపస్సు చేసుకున్నారని, ఇక్కడే సిద్ధి పొందారనీ చెప్పారు. నృసింహ సరస్వతి స్వామి కొద్దిరోజులు ఇక్కడ రహస్యంగా తపస్సు చేసుకున్నారని కూడా చెప్పారు. ఇప్పటికీ ఆ నామధారకుల వంశం వారే పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఆ ఆలయంలో ఒక వేదికపై నవ గ్రహాల వలెనే తొమ్మిది జంట నాగులను ప్రతిష్ట చేసి పూజలు చేస్తున్నారు. గ్రహాల స్థానంలో సర్పాలు ఇంతవరకూ మేమెక్కడా చూడలేదు. ఇది కూడా అబ్బురంగా అనిపించి ఇక్కడ రాయాలనిపించింది. ఆసక్తి వున్నవారు ఈ లింక్ లో ప్రయత్నించండి.
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం, దుండిగల్ : హైదరాబాదు లోని దుండిగల్ లో, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో నవగ్రహాలను కొత్తపద్ధతిలో పెట్టారు. నవగ్రహాలకీ ఒక్కో దానికీ ఒక్కో చిన్న వేదిక, దానిపక్కనే ఆ గ్రహానికి అనుసంధానమైన మొక్క పెట్టి పెంచుతున్నారు. ఆ వేదికపై ఆ గ్రహం, దానికి ఆ గ్రహానికి అనుసంధానమైన రంగులో ఒక ఛత్రం వున్నాయి. విగ్రహాలు కూడా చాల వివరంగా వున్నాయి. చుట్టూ బోర్డర్ లో మొక్కు కొబ్బరికాయలు వేళ్ళాడుతున్నాయి. ఈ విధంగా మొక్క, విగ్రహం, రంగు వివరాలన్నీ చక్కగా తెలిసేలా ఒక పెద్ద ప్రాంగణంలో ఈ నవగ్రహాలను స్థాపించారు. భలే సంతోషం వేసింది. అవకాశమున్నవారు వెళ్లి చూడండి.
ఓంకారక్షేత్రం
ఓంకారం: కర్నూల్ జిల్లాలోని ఓంకార క్షేత్రంలో వున్న శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్దేశ్వర స్వామి ఆలయం త్రేతాయుగం నాటిది. రాముడు కూడా ఈ శివుడ్ని పూజించాడని అంటారు. చాలా పురాతన దేవాలయం. ఇక్కడ కాశినాయన అనే అవధూత కొన్నేళ్ళక్రితం వరకు నివసించి వచ్చిన అందరికీ నిత్యాన్నదానం చేసేవాడట. అదే ఆనవాయితీ ఈ నాటికీ కొనసాగిస్తూ ఆ ట్రస్ట్ బోర్డు వాళ్ళు నిత్యాన్నదానం చేస్తున్నారు. శివుడిని అభిషేకించుకున్న తరువాత, బయటకు వచ్చి ప్రాంగణంలో వున్న ఇతర శిల్పాలు, మంటపాలు చూస్తున్నాం. ఉన్నట్టుండి ఒక రధం లాంటి కట్టడం కనపడింది. ఏమిటా అని దగ్గరకు వెళ్లి చూస్తే, తొడల వరకే కాళ్ళున్న అనూరుడు రథం తోలుతున్నాడు. లోపల నవగ్రహాలూ వారి భార్యల విగ్రహాలతో పాటు, వాటి వాహనాలపై కూర్చుని వున్నారు. నిత్యపూజలు జరుగుతున్నట్టు సాక్ష్యంగా ఆ విగ్రహాల నిండుగా గంధం, కుంకుమ అలంకరించి వున్నాయి. సూర్యుడైతే ఉష, ఛాయా ఇద్దరు భార్యలతో కూడా వున్నాడు. కానీ ఒక్కటే సందేహం, ఎవరూ తీర్చలేదు. సూర్యుడిని "సప్తాశ్వారథమారూఢం" అని కొలుస్తాం కదా. ఇక్కడ మాత్రం ఐదు గుర్రాలే కనిపించాయి. మరి గ్రహాధిపతి సూర్యుడు ఒక్కడే ఉంటే ఏడు గుర్రాలేమో, నవగ్రహాలన్నీ ఉంటే ఐదు గుర్రాలేమో తెలియదు. మొత్తానికి ఆ రధం, ఆ అనూరుడూ, లోపల వున్న నవగ్రహ విగ్రహాలూ ఎంత ఆకర్షణీయంగా, దివ్యంగా, అద్భుతంగా, మహా శక్తివంతంగా వున్నాయంటే మాటల్లో చెప్పలేను. అవి అలా ఇనుముని అయస్కాంతం గుంజినట్టుగా, నన్ను అక్కడ ఉన్నంతసేపూ వాటి వైపుకి ఆకర్షించుకుంటూనే వున్నాయి. ఓం నమో మిత్రాయ.
శంకరమఠం: మామూలుగా నేను ఎక్కువగా ప్రవచనాలు వినను. ఎందుకంటే నా 10, 12 ఏళ్ళప్పటి నుంచీ కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, శృంగేరి శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామి, పుష్పగిరి శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి, కుర్తాళం శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామి, సాధుపరిషత్ లో పరిచయమై తొలిసారిగా సరస్వతి, రామ మంత్రాలు నాకు ఉపదేశం చేసిన తొలి గురువు శ్రీ సదానంద సరస్వతీ స్వామి, వీరి ప్రవచనాలు వింటూ పెరిగాం మేము. ఇప్పటి వారి ప్రవచనాలు వింటుంటే, చెప్పినవే చెప్పుతూ వుంటారు, లేదా తెలిసినవే చెప్పుతూ వుంటారు. తెలియనిది తెలుసుకోవాలి కానీ తెలిసినదే ఎందుకు, అందుకే నేను సాధారణంగా ఎవరి ప్రవచనాలూ వినను, ఒక్క మా గురువుగారు కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి వారివి తప్ప. ఒకసారి టీవీ బ్రౌజింగ్ లో అకస్మాత్తుగా శ్రీ చాగంటి వారు ప్రవచనం చెప్పుతూ కనపడ్డారు. ఆ సమయానికి వారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని ఉదహరిస్తున్నారు. దాంతో కాసేపు విన్నా. అప్పుడు ఆయన చెప్తున్నారు, కంచి స్వామీజీ వారి సూచనలతో శృంగేరి వారు గుంటూరు శంకరమఠంలో కట్టిన నవగ్రహ మంటప ప్రత్యేకత గురించి. అలా అనుకోకుండా విన్న విషయం మమ్మల్ని గుంటూరు తీసుకువచ్చింది. కేవలం ఈ మంటపం చూట్టానికే మేము గుంటూరు వెళ్ళాము. ఇవే ఆ ఫోటోలు. కింద ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి అనుసంధానమైన ఆకారం గోపురం లోని ఆ విభాగంలో పైన వచ్చేలా కట్టిన చిన్న గోపురం అది. ఎంత సింపుల్ గా ఉందో, అంత ప్రత్యేకంగా వుంది. మహాత్ముల ఆలోచనలు ఎలా విభిన్నంగా వుంటాయో కదా అనిపించింది.
హరసిద్ధిమాత మందిరం: ఉజ్జయిని లోని హరసిద్ధి మాత మందిరంలో వెనుక వైపున వున్న ఉపాలయంలో వున్నది ఈ నవగ్రహ వేదిక. మొత్తం నవగ్రహాలను సూచిస్తూ తొమ్మిది లింగాలు, వాటికి బంగారు తొడుగులు, అప్పుడే కడిగినట్టు కనిపిస్తున్న వేదిక, చూట్టానికి మహా బ్రహ్మాండంగ వున్నాయి, బహ్మానందాన్ని కలిగిస్తున్నాయి. ఇంత స్పెషల్ గా, రిచ్ గా, నవగ్రహాలను ఎప్పుడూ చూడలేదనిపించింది. చాలా బావున్నాయి. నమస్కరించుకుని వచ్చేశాం.
శ్రీ నవగ్రహ శనిదేవ్ మందిర్: ఉజ్జయినిలో విక్రమాదిత్యుని చేత స్థాపించబడిన మందిరం ఇది. ఈ మందిరం లో కూడా ప్రతి గ్రహం వున్నచోట కప్పుపై ఆ గ్రహాన్ని సూచించే రంగులో విడివిడిగా గోపురాలు కట్టారు. శనికి ప్రత్యేకమైన స్థానం. నిత్య పూజలు జరుగుతున్నాయి. కాశీ కానీ, ఉజ్జయిని కానీ, ప్రయాగ కానీ, మధుర కానీ, హరిద్వార్ కానీ, కాంచీపురం కానీ తిరుపతి కానీ, ఇలా కొన్ని ఊళ్ళు నిత్యం వచ్చి పోయే భక్తులతో మహా కోలాహలంగా ఉంటాయి రాత్రింబవళ్ళు. ఈ ఆలయంలో కూడా అటువంటి సందడి కేమీ తక్కువుండదు. మహా కాళుణ్ణి, మహా కాళిని చూసే భక్తులు ఇక్కడకూ వస్తూ వుంటారు. నన్ను ఈ గోపురాలు ఎంతో ఆకర్షించాయి. అలా చూస్తూనే వున్నా చాలాసేపు.
నవగ్రహ ఆలయం: ఈ ఆలయం గౌహతీలోని చిత్రాచలంలో వుంది. కామాఖ్యా మాతను దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయం చూసాం. గోపురం కామాఖ్యా ఆలయ గోపురం లాగే తేనెపట్టు లాగా వుంది. కొన్ని మెట్లు పైకి ఎక్కాక ఒక పెద్ద హాలు, అదే గర్భాలయం. ఇంకా వేరే ముఖమంటపాలు లేవు. ఒక పెద్ద హాలు, దానిలో నవగ్రహాలని సూచిస్తూ తొమ్మిది పెద్ద పెద్ద లింగాలు, వాటికి విడివిడిగా పానవట్టాలు. కళ్ళు రెండూ చాలటం లేదు అనే పద ప్రయోగం ఇక్కడ కరెక్ట్ గా సరిపోతుంది. నిజంగా అంత పెద్ద కాన్వాస్ ని చూడాలంటే ఒక్క చూపు (గ్లాన్స్) సరిపోదు. కళ్ళు విప్పారించి చూస్తూనే వున్నా. అప్పుడే అభిషేకాలు, అర్చనలు పూర్తి అయ్యినట్టున్నాయి, అన్ని లింగాలూ అద్భుతమైన అలంకరణలో మెరిసిపోతున్నాయి. వాటికి ఆయా రంగుల్లో వస్త్రాలు, పూలు అలంకరించి వున్నాయి. వాటి నుంచి వచ్చే కాంతి, శక్తి ఎంతో కొలవటానికి నా బుద్ధి, నా శక్తి చాలలేదు. అపారమైన వర్ఛస్సుతో, తేజస్సుతో, కాంతితో, ప్రతి లింగం చుట్టూ ఒక తేజో మండలం కనిపించింది. హిప్నోటైజ్ అయిపోయినట్టుగా వుంది నాకు. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు నాకు, మామూలు లింగాకారంలో వున్న నవగ్రహాలకు ఇంత అందమా, ఇంత శక్తా, ఇంత ప్రభావమా, ఇంత ఆకర్షణా అని. అలా చూస్తూనే వున్నా. ఇంతలో ఒక పురోహితుడొచ్చి ఏ లింగానికి ఎటు నుంచి, ఎటు తిరుగుతూ, ఎలా ప్రదక్షిణం చెయ్యాలో చెప్పాడు. మేము అలా ఆయన చెప్పినట్టే ప్రదక్షిణాలు చేసాం. గుడి లోపల సోలార్ సిస్టం చెక్కి ఉంటుంది. గౌహతీలో మిస్ అవకూడని ప్రదేశాల్లో ఇదీ ఒకటి. గౌహతి ఖగోళ, జ్యోతిష శాస్త్రాలకు ఒక గొప్ప కేంద్రం. పూర్వం దీని పేరు ప్రాగ్జ్యోతిష పురం. అంటే తూర్పు వైపున్న జ్యోతిష కేంద్రం అని అర్ధం. నరకాసురుడు పాలించిన ప్రదేశం. భూమాత పుత్రుడు కదా, అందుకే కాబోలు, ఇక్కడి భూమికి ఇంత ఆకర్షణ.
కుంభకోణం: ఇక మిగిలింది తమిళనాడులో కుంభకోణం చుట్టుపక్కల వున్న నవగ్రహాల ఆలయాలు. ఎనిమిది తమిళనాడులో ఉంటే, ఒకటి పాండిచ్చేరి లోని కరైకల్ లో వుంది. చివరిదైన తిరునల్లార్ శని ఆలయం గురించి శని క్షేత్రాల జాబితాలో చెప్పాను గదా. ఇప్పుడు మిగిలిన ఎనిమిది ఎక్కడెక్కడున్నాయో చెప్తాను. సూర్య ఆలయం ఆదుతురైలో, చంద్రుని ఆలయం తింగనూర్ లో, అంగారకుడు, అంటే కుజుడు లేదా మంగళుడు వైదీశ్వరన్ కోయిల్ లో (వైదీశ్వరన్ మా ఇంటి దేవుడు కూడా), బుధుని ఆలయం తిరువేంకాడులో, గురువు, లేదా బృహస్పతి ఆలయం అలంగుడిలో, శుక్రుని ఆలయం కంజనూర్ లో, శని ఆలయం తిరునల్లార్ లో, రాహు ఆలయం తిరునాగేశ్వరంలో, కేతువు ఆలయం కీళపెరుంపళ్ళంలో వున్నాయి. అన్ని ఆలయాల్లో శివుడే ప్రధాన దేవత. ఆ శివుని పక్కన ఉపాలయంలో ఆ ప్రత్యేక గ్రహం. సూర్యాలయంలో సూర్యుడు, శివుడు అయితే ఎదురెదురుగానే ఉంటాయి. తల అటుతిప్పితే శివుడు, ఇటు తిప్పితే సూర్యుడు ఉంటారు.
ముఖ్యంగా ఈ ఆలయాల్లో వున్న అన్ని నవగ్రహాలకూ ఏలినాటి శని దోషాన్ని నివారించే వరం వుంది. కొంతమంది ఈ తొమ్మిది ఆలయాలూ ఒకేరోజు చూడాలని నియమం పెట్టుకుని చూస్తూ వుంటారు. ఉదయం ఆరింటికి మొదలుపెట్టి వరుసగా చంద్ర, గురు, రాహు, సూర్య, శుక్ర, కుజ, బుధ, కేతు, శని ఆలయాలు ఒకే రోజులో చూస్తారు. అలా చూపించే బస్సులు, జీపులు కూడా ఇక్కడ ఉంటాయి. కానీ మేము అలా చూడలేదు, తమిళ నాడులోని ఎనిమిది 2013లో, తిరునల్లార్ ఒక్కటి 2017 లో చూసాం. ఆ విధంగా మేమూ ఈ తొమ్మిది నవగ్రహ క్షేత్రాలనూ చూసాం.
ఇక్కడితో నా ప్రత్యేక నవగ్రహ ఆలయాల సందర్శనం, పరిచయం ముగిస్తాను. తరువాత షిరిడి గురించి దానితో పాటు ఉంఖేశ్వర్ ఆలయం గురించి చెప్పుకుందాం.
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
mee observation super aunty...
రిప్లయితొలగించండి