షిరిడి-ఉంఖేశ్వర్

షిరిడి-ఉంఖేశ్వర్ 

మేము 2013 లో మహారాష్ట్రలో ఐదు జ్యోతిర్లింగాలున్నాయి, రెండు శక్తిపీఠాలున్నాయి, ఇంకా కూడా పంధర్ పూర్, మనం దీన్నే పండరీపురం అంటాం, తుల్జాపూర్, అమ్బాజోగై, షిరిడి ఇలా ఓ పెద్ద లిస్ట్ పెట్టుకుని బయల్దేరాం. డా. శైలజ గారు ఆదిలాబాద్ జిల్లాలో ఈ మధ్యనే ఒక సిద్ధేశ్వరాలయం బయటపడింది. అది కూడా చూసి రండి అన్నారు. మొత్తం ప్లాన్ సిద్ధం అయింది. ఇంటి నుంచి టాక్సీ తీసుకుని బయల్దేరాం. అలా చూసిందే సిద్దేశ్వరాలయం. పురాతనమైన ఆలయం, చిన్న గ్రామంలో వుంది. ఇన్నేళ్ళుగా దిబ్బలా పడి వుండి, చుట్టూ విపరీతంగా చెట్లు, దుబ్బులు మొలిచి అక్కడేదో గుడి వంటిది ఉన్నదని కూడా ఎవరికీ తెలియలేదట. ఎలాగో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వాళ్లకు తెలిసి, వాళ్ళు దాన్ని వెలికి తీసి తిరిగి, ఒక ఆలయంలాగా రీ కన్ స్ట్రక్ట్ చేస్తున్నారు. పూజలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. 


చుట్టూ ఎక్కడ చూసినా విరిగి పోయిన శిల్పాలు, లింగాలు, పానవట్టాలు, స్తంభాలు పడి వున్నాయి. చాలావరకు ఆలయం తయారయిపోయింది. మిగిలిన లింగాలను, పానవట్టాలను మ్యాచ్ చేసి పని పూర్తి చేయాలి కాబోలు. ఇలా చూడంగానే చాలా బాధ వేసింది. ఎవరిదైనా సంపదను, అందులోనూ సాంస్కృతిక సంపదను నాశనం చేయటానికి చేతులెలా వస్తాయో కదా. ఇటువంటి పాపాలకు ఇప్పటికిప్పుడు ఫలితం రాకపోవచ్చు. కానీ ఏదో ఒకనాటికి తప్పక ఫలితం అనుభవించాల్సిందే. "అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభామ్" అని నేనెప్పుడూ నమ్ముతాను. అంటే పుణ్యకర్మ చేసినా, పాపకర్మ చేసినా ఆ పుణ్య, పాప ఫలితాలను అవశ్యం అంటే, తప్పకుండా అనుభవించ వలసిందే. ఆ భయం ఈ పాపం చేసిన వాళ్లకు లేదు కాబోలు. లేకపోతే ఇప్పటికే అనుభవించ వలసినదేదో అనుభవించేసారేమో. ఆ తిరిగి కట్టిన గుడిలో వున్న ఆ లింగానికే నమస్కరించుకుని వచ్చేసాం. అక్కడి నుంచి నాందేడ్ కి, ఆపై మాహుర్ చూసుకుని ఉంఖేశ్వర్ చేరుకున్నాం. మాహుర్ గురించి శక్తి క్షేత్రాల్లో రాస్తాను. ఇప్పుడు ఉంఖేశ్వర్ గురించి చెప్పుకుందాం.


ఉంఖేశ్వర్ మహారాష్ట్ర లోని మాహుర్ క్షేత్రానికి దగ్గరలో వున్న ఒక చిన్న గ్రామం. ఆ వూరు అక్కడున్న శివాలయం కన్నా, అక్కడ వున్న వేడినీటి బుగ్గలకి, అక్కడ నడుస్తున్న ఉచిత ఆయుర్వేద వైద్యశాలకీ ప్రశస్తి. అన్ని వ్యాధుల కన్నా ముఖ్యంగా అక్కడ సోరియాసిస్ అనే చర్మ వ్యాధికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇస్తారు. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు శరభంగుడు అనే ఋషికి వున్న ఈ చర్మవ్యాధిని నిర్మూలించటానికి ఈ వేడినీటి ఔషధ బుగ్గలను తన బాణంతో పైకి తెచ్చాడు అని పేరు. ఈ ఉంఖేశ్వర్ లో శరభంగుడనే మహర్షి శ్రీ రామచంద్రుడికై తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమైనా, నాకు రాముడే కావాలి అని తపస్సుని ఇంకా తీవ్రం చేశాడు. తీరా ఆ శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రత్యక్షమయ్యే సరికి తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. రాముడది చూసి, అక్కడ భూమిలో బాణం వేశాడు. ఒక జల ఉబికింది. ఆ నీటిలో శరభంగుణ్ణి స్నానం చేయమన్నాడు. ఆ స్నానం చేసాక శరభంగుడికి ఆ చర్మవ్యాధి సంపూర్ణంగా పోయిందిట. శ్రీరామచంద్రుడే మరో బాణం వేసి ఆ వచ్చిన జలంతో అక్కడ శరభంగుడు పూజిస్తున్న శివలింగాన్ని కూడా అభిషేకించాడు. అదే ఈ ఉంఖేశ్వర్ ఆలయం. ఇది ఆదిలాబాదు నుంచి సుమారు 45 కిమీ దూరంలో వుంది. 


ఆ తరువాత శరభంగుడే స్వయంగా ఆ వేడినీటితో వ్యాధిగ్రస్తులచేత స్నానాలు చేయించి ఎంతో మందికి చర్మవ్యాధులను పోగొట్టాడు. అదే పరంపర నేటికీ నడుస్తోంది. ఇప్పటికీ అక్కడ ఒక ఉచిత వైద్యశాల నడుస్తోంది. వ్యాధిని చూసాక, ఎన్నాళ్ళు వుండి  స్నానాలు చెయ్యాలో చెప్తారు. అక్కడే వున్న ఆయుర్వేద డాక్టర్లు కొన్ని మందులు కూడా తయారు చేస్తున్నారు. అవి ఇష్టం, అవసరం, నమ్మకం వున్నవారు కొనుక్కోవచ్చు. ఈ వూరు చిన్న గ్రామం అవటం వల్ల వసతి సదుపాయాలూ అసలు లేవు. కానీ వైద్యం కోసం వచ్చిన వారికి ఆ వైద్యశాల వాళ్ళే అక్కడే గదులు ఇస్తున్నారు. మగవారికి, ఆడవారికీ విడివిడిగా స్నాన సదుపాయాలు వున్నాయి. అసలు ఓపిక లేనివారికి హెల్పర్స్ కూడా వున్నారు. మేము అక్కడ స్నానమైతే చేయలేదు కానీ మామూలుగా ఆ నీళ్లు ప్రోక్షించుకున్నాం. చాలా వేడిగా వున్నాయి నీళ్లు. సుమారు 40 నుంచి 45 డిగ్రీల వరకూ టెంపరేచర్ ఉంటుందిట. తరువాత ఉంఖేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి ఆ శివాలయానికి వెళ్లాం. ఆ పక్కనే వున్న శరభంగుడి సజీవ సమాధి మందిరం కూడా చూసాం. ఆసుపత్రి అక్కడే ఆ వేడినీటి బుగ్గల పక్కనే షెడ్లలో ఉన్నది. అది కూడా చూసాం, ఏదో తల నొప్పులకీ, కాళ్ల నొప్పులకీ బామ్ లు తీసుకుని వచ్చేసాం.  

ఇక ఇప్పుడు షిరిడి గురించి చెప్పుకుందాం. షిరిడీకి ఇప్పటికి చాలాసార్లు వెళ్లాం. కానీ మొదటిసారి షిరిడి వెళ్ళింది 2002 లో. అప్పటికీ ఇప్పటికీ ఆలయ నిర్వహణలో చాలా మంచి మార్పులు వచ్చాయి. చాలా అభివృద్ధి జరిగింది. ఒకప్పటి కంటే దర్శనం వ్యవస్థ చాలా మారిపోయింది, సులభమైంది. 2019 లో వెళ్ళినప్పుడు సీనియర్ సిటిజన్ హోదాలో చాలా చక్కగా దర్శనం అయ్యింది. కానీ దర్శనం ఏ కోటాలో జరిగినా, అక్కడ ఎవ్వరూ తోసుకోవటాలూ, పొమ్మని తొయ్యటాలూ లేవు. అది నచ్చింది. ఇక్కడ రోజుకి నాలుగుసార్లు హారతి కార్యక్రమం జరుగుతుంది. కాకడ హారతి, మధ్యాన్న హారతి, ధూప్ హారతి, సేజ్ హారతి అని రోజుకి నాలుగు సమయాల లోనూ హారతి జరుగుతుంది. మేము మాత్రం దర్శనానికే ప్రాముఖ్యత ఇచ్చి హారతుల కార్యక్రమం ఎప్పుడూ చూడలేదు. ఒక రకంగా జనం ఎక్కువగా వుండి తోపుడు అవుతుందో అనే భయం మాకు మనసులో వుంది. వెళ్తూనే ముందుగా సాయిబాబా సమాధిని దర్శించుకోవడం అలవాటు. ప్రధాన మందిరంలో సాయి విగ్రహం, ఆ విగ్రహానికి ఎదురుగా కింద సాయిబాబా సమాధి ఉంటుంది. సాధారణంగా ఆ సమాధి మీద ఏ వస్త్రం కప్పితే, అలాంటి వస్త్రమే మరొకటి విగ్రహానికి కప్పి ఉంటుంది. ఆ శేష వస్త్రాన్ని కావలసిన వాళ్లు ఆఫీసులో కొనుక్కోవచ్చు. ఆ తరువాత బయటకు వచ్చి మేనేజిమెంట్ ఆఫీసులో వున్న కౌంటర్ల ద్వారా అన్నదానానికి డబ్బులు కట్టి, ఆ తరువాత శేషవస్త్రం అమ్మే కౌంటర్ దగ్గర కెళ్ళి, నచ్చిన వస్త్రాలు కొనుకునే వాళ్ళం. షిరిడి నుంచి తిరిగి వచ్చాక ఈ వస్త్రాలని దగ్గర వాళ్లకి ప్రసాదం లాగా ఇచ్చేవాళ్ళం. మళ్ళీ తరువాత గురుస్థానం చూసి అక్కడ వున్న వేపచెట్టుకి ప్రదక్షిణం చేసుకోవటం ఒక అలవాటు. గురుస్థానంలో ఆనాటి నింబవృక్షం, అంటే వేపచెట్టు, ఆ పక్కనే ఒక చిన్న చలువరాయి కట్టడంలో అఖండ దీపం, సాయిబాబా ఫోటో వున్నాయి. అక్కడే ఒక శివలింగం, ఎదురుగా నంది వున్నాయి. ఆ వేప చెట్టు ఆకులు ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చాలామంది ఆ చెట్టుమీద భక్తితో దాడి చేస్తుంటే ఈ మధ్యలో ఆ చెట్టు కింద అంతా వల వేసి ఉంచారు. 

తరువాత ఆ పక్కనే ముఖ దర్శనం చేసుకునేవాళ్ళం. ఆలయంలోకి వెళ్లేంత సావకాశం లేనివారికి, రష్ ఎక్కువ వున్నప్పుడు బాబా దర్శనం చేసుకునే వారికి వీలుగా ఈ ముఖ దర్శనం చేసే చోట ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ లోంచి బాబా విగ్రహం, ప్రత్యేకంగా ముఖం చక్కగా కనపడుతుంది. కావాల్సినంత సేపు దర్శనం చేసుకోవచ్చు. ఆ పక్కనే పెద్ద చప్టా లాగా ఒక ప్లాటుఫారం వుంది. అక్కడ కూర్చుని చక్కగా ఏమైనా స్తోత్రం, జపం, ధ్యానం చేసుకునే దాన్ని. ఇక్కడే కాకుండా వెనుక నించి వెళ్తే మళ్ళీ బాబా మందిరం లోనికి వెళ్తాం. కానీ దర్శనం చేసుకోవచ్చు కానీ, విగ్రహం దగ్గరకు వెళ్లలేం, మధ్యలో కమ్మీలు అడ్డం ఉంటాయి. అక్కడ ఒక డయాస్ ఉంటుంది. అక్కడ కూర్చుని కూడా నేను జపం చూసుకునేదాన్ని. చాలా శాంతంగా ఉంటుంది ఈ డయాస్ వున్న ప్రాంతం. బయటకు వచ్చాక ఆ ప్రాంగణం లోనే వున్న హనుమంతుడి ఆలయానికి వెళ్లాం. ఈ హనుమ దక్షిణ ముఖంగా ఉంటాడు. పైగా నల్లని విగ్రహం. అలాగే కొద్దిదూరంలో గణపతి, శని, శివుడు ఆలయాలు వున్నాయి. అవీ దర్శించుకున్నాం. 

ఇక్కడ నుంచి బయటకు వచ్చి చావడికి వెళ్లాం. ఇది ఆడవారికి, మగవారికీ వేర్వేరుగా ఉంటుంది. ఇక్కడ బాబా వాడిన కొన్ని వస్తువులు కనిపిస్తాయి. ఆ తరువాత వెళ్ళేది ద్వారకామాయికి. ఎన్నిసార్లు వెళ్లినా ఈ ద్వారకామాయికి మాత్రం మేము ఎప్పుడు వెళ్లినా రష్ ఉండేది. అందుకే కొన్ని సార్లు చూసే వాళ్ళం, కొన్నిసార్లు చూడకుండానే వెనక్కు వచ్చేవాళ్ళం. ఈ ద్వారకామాయి ఒకప్పుడు పాడుపడిన మసీదు. సాయిబాబా షిరిడీకి పెళ్లి బృందంతో వచ్చినప్పుడు ఆయన అక్కడే దిగాడు. దాంట్లోనే చివరివరకు వున్నాడు. మధ్యలో అప్పుడప్పుడు చావడికి వెళ్ళటమే కానీ ప్రధానవసతి ద్వారకామాయినే. మసీదులో ఉంటూ కూడా హిందూ దేవతాపూజలు, పండుగలు నిర్వహించటం సాయిబాబా చేసేవారు. ఏమన్నా అంటే, "దానికి ఆ పేరు పెట్టింది కూడా సాయే. ఈ ద్వారకామాయి లోనే, బాబా పెట్టిన ధుని ఉంటుంది. బాబా వాడిన మరి కొన్ని వస్తువులు కూడా కనిపిస్తాయి. అంతే కాదు బాబా నిరంతరం కూచునే ఒక పెద్ద బండరాయి కూడా కనిపిస్తుంది. కాకపోతే ఏవీ తాకలేము, అన్నీ గాజు పెట్టెల్లో ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రధానమందిరం కూడా కనిపిస్తుంది. బాబా ఎప్పుడూ "సబ్ కా మాలిక్ ఏక్ హై" అని అనేవాడు. అంటే అందరి దేవుడూ ఒక్కడే అని చెప్పటం. అంతే కాదు, సాయి ఎప్పుడూ అందరికీ శ్రద్ధ, సబూరి చాలా ముఖ్యం అని కూడా చెప్పేవాడు. సబూరి అంటే సహనం అని అర్ధం. ఈ రెండు పదాలూ సమాధి మందిరంలో కూడా బాబా విగ్రహానికి అటూ ఇటూ స్తంభాలపై కూడా కనపడతాయి. నిజమేగదా ప్రతివారికీ ఈ శ్రద్ధ, సబూరి వుండాలి గదా. చివరగా, మళ్ళీ సరిగ్గా చెప్పాలంటే తీరిగ్గా అన్నీ చూసాక లెండీబాగ్ కి వెళ్ళేవాళ్ళం. సాయి సచ్చరిత్ర చదివినప్పుడు ఈ ప్రాంతాలన్నీ చాలా దూర దూరంగా ఉన్నట్టు అర్ధం అయ్యాయి. కానీ ఇక్కడ స్వయంగా తిరుగుతుంటే అన్నీ పక్కపక్కనే కనిపించాయి. బహుశా ఆ రోజుల్లో ఇదే పెద్ద దూరం కాబోలు. బయటకు వచ్చేటప్పుడు ప్రతివారికీ సాయిబాబా ప్రసాదంగా విభూది, బూందీ ఇస్తున్నారు. ఇక్కడ భక్తులకు చేస్తున్న ఏర్పాట్లు, సౌకర్యాలు ఒకసారి కన్నా ఒకసారికి చక్కని అభివృద్ధి జరగటం గమనిస్తే సంతోషం కలిగింది. 

బయటకు వస్తుంటే ఒక పెద్ద హాలు, అక్కడ ఒక డయాస్, దానిమీద ఎప్పుడూ భజనలు, ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ నిర్వహణ అంతా చాలా అద్భుతంగా వున్నాయి. ఎంతోమంది భక్తులు అక్కడే కూర్చుని, పడుకుని విశ్రాంతి తీసుకోవటం కనిపించింది. ఇక మరో ముఖ్య ఆకర్షణ, ఆ మందిరానికి నాలుగు వైపులా వున్న దుకాణాల సముదాయం. అక్కడ ఎన్నెన్ని వస్తువులు, అందమైనవి, అవసరమైనవి, ఆకర్షణీయమైనవి, కళాత్మకమైనవీ, పిల్లలు, పెద్దలు ఆడుకునేవి, గృహాలంకరణ సామగ్రి దొరుకుతాయి. ఏమీ కొనుక్కోకుండా బయటకు రావటం చాలా కష్టం. కాదు కాదు, చాలా చాలా కష్టం. సిటీ సెంటర్ దగ్గర ఖండోబా మందిరం వుంది. ఈ ఖండోబా ఈ గ్రామ దేవత. అందరూ వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఖండోబాకు అటూ ఇటూ రెండు స్త్రీ మూర్తులు ఉంటాయి. ఖండోబా పద్మాసనంలో కూర్చుని ఉంటాడు. ఈ విగ్రహాల వస్త్రధారణ పూర్తిగా మరాఠీ పద్ధతిలో ఉంటుంది. ఈయన్ని దర్శించిన తరువాత ఊరి పొలిమేరలో కొత్తగా మన తెలుగు భక్తులు కట్టిన పంచముఖ విష్ణు గణపతి ఆలయానికి కూడా వెళ్లాం. విగ్రహాలన్నీ చాలా బాగా వున్నాయి. కానీ ఇంకా ఎంతో పూజ జరగవలసిన అవసరం వుంది. ఏ దేవీ దేవతల విగ్రహాలకైనా శక్తి  ఉత్పన్నం కావాలంటే, ఆ దేవుడికి ఎంతో జపం చేయాల్సి ఉంటుంది. మనం ఎంత జపం చేస్తే, ఆ దేవుడికి అంత శక్తి వస్తుంది. అందుకే దేవాలయాల్లో శంఖుస్థాపన నుంచీ ప్రతిష్ట వరకూ, కూడా నిరంతరం ఎంతో జపం జరుగుతూ ఉంటుంది. అందుకే కొన్ని దేవాలయాల్లో శక్తిప్రవాహం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మరి కొన్ని చోట్ల మామూలుగా అనిపిస్తాయి. 

ఆ తరువాత మేము చూసింది సకూరి లోని ఉపాసనీ బాబా ఆశ్రమం, దీనినే కన్యాకుమారి ఆశ్రమం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఆశ్రమంలో ఆడవాళ్ళకి ఆశ్రయం ఇస్తారు. అక్కడే వుండి సాయి సేవ చేసుకోవచ్చు.  ఈ ఉపాసనీ బాబా గురించి సాయి సచ్చరిత్రలో చదివే వుంటారు కదా. ఇక్కడ ఏక ముఖ దత్త ఆలయం కూడా వుంది. ఈ దత్తుడు శ్రీ మహా విష్ణువు లాగా నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా, పద్మాలని ధరించి ఉంటాడు. ఇక్కడే ఒక రావి చెట్టు కాండంలో గణపతి ఆకారం ఏర్పడింది. ఉపాసనీ బాబా తన తరువాత వారసురాలిగా గోదావరీ మాతను నియమించారు. ఆమె కూడా డివైన్ మదర్ లాగా అందరినీ ప్రేమగా చూసుకున్నారు. వీరిద్దరి సమాధులు కూడా అక్కడే వున్నాయి.



షిరిడి నుంచి ఏవలా అనే ఊరు 30 కిమీ దూరంలో వుంది. ఆ వూళ్ళో పైథానీ చీరల మగ్గాలు వున్నాయి. అక్కడ చీరలు బాగా దొరుకుతాయి అని మా డ్రైవర్ చెప్పాడు. మాకు ఎలాగూ టైం వుంది కదా అని ఏవలా వెళ్లాం. అక్కడ చీరలు నిజంగానే బాగా నచ్చాయి. నా స్కిన్ కి అన్ని చీరల టెక్సచర్ పడదు, కానీ ఈ చీరలు నాకు బాగా సరిపోయాయి. దాంతో ఆ చీరలు కొనుక్కున్నాను. ఆ తరువాత కూడా ఆ షాప్ వాళ్లకు ఫోన్ చేస్తే కొరియర్ లో ఇంటికి పంపించే వాళ్ళు. ఈ ఏవలా కి వెళ్లే దారిలో రేణుకామాత మందిరం కూడా చూసాం. ఇది కూడా చాలా పురాతన ఆలయం. ఇవీ మేము షిరిడి టూర్ లో చూసినవి. 

ఇంతటితో షిరిడి ఉంఖేశ్వర్ యాత్ర పూర్తి అయింది. ఇక ఈసారి భువనేశ్వర్ లోని లింగరాజమందిరం, సంబల్పూర్ దగ్గర హుమా లోని ఠేడామహదేవ  మందిరం చూసొద్దాం. 

ఓం శ్రీ సాయినాథాయనమః, ఓం ఉంఖేశ్వరాయనమః 
ఓం శ్రీ సిద్ధేశ్వరాయనమః, ఓం శ్రీ రేణుకాదేవ్యైనమః 
ఓం దత్తాత్రేయాయనమః 


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం