లింగరాజమందిరం-ఠేడామహాదేవమందిరం

 

లింగరాజమందిరం-ఠేడామహాదేవమందిరం 

మేము సంబల్పూర్ లో ఉండే రోజుల్లో 1979 లో ఈ హుమా ధామ చూడటం జరిగింది. ఈ పేరు పైన రాయలేదేమా అని అనుకోకండి. ఇదే ఠేడా మహాదేవ మందిరం. దీన్నే అక్కడ స్థానికులు బొక్రో మందిరో అంటారు, అంటే వక్ర మందిరం అని. మన తెలుగు అజంత భాష, మన పదాలన్నీ అకారాంతంతో ముగుస్తాయి. అదే ఒడియా భాష అయితే, ఒకారంతో ముగుస్తాయి. మనం వక్ర  అంటే, వాళ్ళు బొక్రో అంటారు మన  అనే అక్షరాన్ని వాళ్ళు  అని పలుకుతారు. ఈ ఆలయం సంబల్పూర్ నుండి ఓ 30 కిమీ దూరంలో వుంది. పక్కనే మహానది శాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మహానది పైనే హీరాకుడ్ డాం వుంది. డాం పక్కనే వున్న సంబల్పూర్ యూనివర్సిటీ లో నేను M.Sc. (మాథ్స్) చదువుకుంటూ ఉండేదాన్ని. చాలాకాలం కింద సంగీత సామ్రాట్ తాన్ సేన్ అని ఓ సినిమా చూసాను. అది 1962 లో విడుదల అయ్యింది. దాంట్లో తాన్ సేన్ గా భరత్ భూషణ్ వేసాడు. ఆ సినిమాలో మొదట్లోనే, మేము తాన్ సేన్ గురించి కొంత పరిశోధన చేసి ఈ సినిమా తీస్తున్నాము అని రాసుకున్నారు. ఆ సినిమా ప్రకారం తాన్ సేన్ బాల్యంలో మూగవాడు. ఆ ఊరి శివాలయంలో శివుణ్ణి పూజించి మాట వచ్చేలా వరం పొందాడు. అప్పుడు ఆ ఆనందంలో గొంతెత్తి శివుడిని తన గానంతో కీర్తిస్తుంటే, ఆ పాటకు ముగ్ధుడైన శివుడు, శివాలయం భూకంపం వచ్చినట్టు ఊగిపోయాయి. అలా ఊగుతున్న ఆ శివాలయం అలాగే వంపు తిరిగి వంకరగా ఉండిపోయింది. శివుడు కొంచెం భూమి లోకి దిగిపోయాడు. ఆ దశలో, పాట ఆగంగానే, అన్నీ అలాగే వంకరగా ఉండిపోయాయి. సినిమా లో మొదటి 5, 10 నిముషాల్లో ఇదంతా చూడచ్చు. ఆ దేవుడిని అప్పటినుంచీ ఠేడా మహాదేవుడని పిలిచారు. నిజానికి తాన్ సేన్ గ్వాలియర్ లో పుట్టినట్టు చరిత్రలో చెపుతారు. మరి మేము హుమాలో చూసిన మందిరం ఆ సినిమా ఉదహరించిన మందిరం ఒక్కటవునో కాదో నాకైతే తెలియదు కానీ, ఈ ఆలయం గురించి రాస్తుంటే ఆ సినిమా, ఆ తాన్ సేన్, ఆ శివాలయం గుర్తొచ్చాయి.

                                                                                                                   
సరే ఇప్పుడు మన హుమా ధామా ఆలయానికి వద్దాం. ఈ ఆలయం సుమారు 17 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇటలీ లోని పీసా టవర్ కూడా, ఇంత వంగి ఉండదు. దాని వంపు కోణం 5 డిగ్రీలు, పైగా అది రోజు రోజుకీ వంగి పోతోంది. ఈ ఆలయం అలాకాదు, ఎన్నేళ్ల నుంచో ఆ వంపు కోణం మారకుండా అలానే వుంది. గర్భాలయంలో ద్వారం కూడా వంకర గానే ఉంటుంది. శివుడు మాత్రం పానవట్టం కన్నా లోతుగా ఉంటాడు. ఇక్కడికి ఎంతమంది శాస్త్రజ్ఞులు, పరిశోధకులు వచ్చి చూసినా దీని మూలకారణం ఏమిటో చెప్పలేకపోయారు. వాళ్ళు అదే ప్రాంగణంలో ఇంకొక గుడి కూడా కట్టి చూసారు. అది కూడా వెంటనే వంగిపోయింది. ఆ ప్రాంగణంలో వున్న అన్ని కట్టడాలూ అలాగే వంగే వున్నాయి. ఆ ప్రాంగణం బయట కట్టిన కట్టడాలు మాత్రం మామూలుగానే నిలిచిఉంటాయి. ఇదే అక్కడి ప్రత్యేకత. ఒక పాలవాడు రోజూ అతని ఆవు ఈ రాయి దగ్గరకొచ్చి పాలు ధారగా కురిపించటం చూసి అందరికీ చెప్తే ఈ శివుడు బయటపడ్డాడు అని మరొక కథనం. ఈ ఆలయంలో శివుడు బిమలేశ్వరుడు, అంటే మన తెలుగులో విమలేశ్వరుడు, అంటే మలినం లేని నిర్మలమూర్తి అని అర్ధం. అమ్మవారు పార్వతీదేవి. ఈ ఆలయంలో మరొక ఆకర్షణ మహానది లోని చేపలు. రంగు రంగుల పెద్ద పెద్ద చేపలు. మహా హడావుడిగా ఆ నది ఒడ్డున తిరిగేస్తూ ఉంటాయి. మనం ఏమన్నా ఆహారం పెడితే తింటాయి. అమృతసర్ సరస్సులో కూడా ఇలాంటి చేపలే ఉంటాయి. మొత్తం మీద ఈ శివాలయం, గర్భాలయం వంకర తిరిగి ఉండటంతో ఈ దేవుణ్ణి వక్ర శంకర అనీ ఠేడా మహాదేవ అనీ అంటారు. 

అన్నట్టు మనకు ఇలా వంగిపోయినా కూడా స్థిరంగా వున్న ఆలయం మరొకటి కాశీలో కూడా కనిపిస్తుంది. అది రత్నేశ్వరమందిరం. దీన్నే మాతృరుణ మందిరం అని కూడా పిలుస్తారు. దీని గురించీ ఒక కథ చెపుతారు. ఒక తల్లి తన చివరి రోజుల్లో వారణాసిలో గడపాలని అనుకుని, కొడుకుకి చెప్తుంది. అప్పుడు ఆ కొడుకు తల్లి కోసం అక్కడ గంగా నది ఒడ్డున ఒక చక్కటి ఆలయం నిర్మించి, తల్లిని రోజూ అక్కడ శివుడిని సేవించుకోమని చెప్తూ, "అమ్మా, ఇంత గొప్ప ఆలయం కాశీలో నీకోసం కట్టటంతో నాకు మాతృరుణం తీరింది" అంటాడు. వెంటనే గుడి వంగిపోయిందట. పైగా శివుడు, తల్లి ఋణం ఏనాటికీ ఎన్ని గుళ్ళు, గోపురాలు కట్టినా తీరదు, అని చెప్పాట్ట. ఇదీ ఆ కథ. ఈ వంగిపోయిన ఆలయాన్ని గంగానది ఒడ్డున కాశీలో నేటికీ సింధియా ఘాట్, మణికర్ణికా ఘాట్ల మధ్యలో చూడచ్చు.  

 

ఇప్పుడు ఒడిశా రాజధాని అయిన భుబనేశ్వర్/భువనేశ్వర్ వెళదాం. భువనేశ్వర్ ను సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అంటారు. ఊరంతా ఆలయాలు, ఒక్క లింగరాజ మందిరం ప్రాంగణంలోనే రెండు, మూడొందల మందిరాలు ఉంటాయి. పక్క పక్కనే చిన్న చిన్న మందిరాలు బోల్డు ఉంటాయి. మన విశ్వనాథ్ గారు ఈ ఆలయాన్ని తన స్వర్ణకమలం సినిమాలో కూడా చూపించారు. ఈ లింగరాజ మందిరం మొత్తం ఒరిస్సా రాష్ట్రంలోనే పురాతనమైనది, విశాలమైన పెద్ద ప్రాంగణం గల ఆలయం. ఆ గుడిలో వున్న అన్ని లింగాలకు రాజు అని ఈ శివుడిని లింగరాజు అంటారు. అంతే కాదు, ఈ ఊరిపేరు భువనేశ్వర్. అంటే ఈ వూరిలో శివుడు త్రిభువనాలకీ ఈశ్వరుడు, రాజు అని మరొక అర్ధం చెప్తారు. 

ఇక్కడి అమ్మవారు భువనేశ్వరి. దశమహావిద్యల్లో ఒక శక్తి. చాలా ఎత్తయిన గోపురం కళింగ శైలిలో ఉంటుంది. ఆలయంలో పూజాదికాలన్నీ కళింగ పద్ధతిలోనే ఉంటాయి. ఇక్కడి పూజారులను పండాలంటారు. పండాలు, పాండేలు ఇక్కడి పూజారులు. సమున్నతమైన గోపురం, దానిపై శిల్పాలు. అన్నట్టు స్త్రీ పురుష సంభోగాన్ని సూచించే శిల్పాలు ఇక్కడ కూడా ఉంటాయి. కానీ పాపం ఎందుకో, ఖజురహో, కోణార్క కి వచ్చినంత పేరు ఇక్కడి ఈ శిల్పాలకు రాలేదు. లింగరాజ మందిరం ప్రాంగణంలోకి ప్రవేశించాక, దారి చూపించే వారు లేకపోతే కాసేపు ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వైపు వెళ్ళాలో తెలియదు. మందిరంలోకి వెళ్ళాక గర్భగుడిలో లింగం చిన్నదే కానీ మహా శక్తివంతంగా కనిపిస్తుంది. దానిమీద నీరు ఉంటుంది. ఆ నీటినే మనకు తీర్థంగా ఇస్తారు. లింగం అంతా గొగ్గులు పడిపోయి వుంది. అయ్యో అనిపించింది. పూరి జగన్నాధుని దర్శనం కన్నా, ఇక్కడ ఇంకొంచం తేలికగా, తోపుడు లేకుండా దర్శనం అయ్యింది. అభిషేకం కూడా చేయించుకోగలిగాం. మొత్తానికి అన్ని లింగాలకూ రాజయిన ఈ లింగరాజ మందిరంలో మా పూజలు ముగించుకుని బయటకు వచ్చాం. పార్వతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. భువనేశ్వర్ లోనే మరొక అద్భుతమైన ఆలయం రాజారాణి ఆలయం. అక్కడ కూడా శివుడే, కానీ రాళ్లు రెండు రంగుల్లో ఉండటం చేత రాజా, రాణీ అంటారు. ఈ వూళ్ళో వున్న అన్ని ఆలయాలూ కళింగ పద్ధతిలోనే ఉంటాయి. ఒకే లాగా వున్నా, ఎక్కడో అక్కడ తేడా కనపడుతుంది. భువనేశ్వర్ ను ఆలయాల పట్టణం అని ముందే చెప్పా కదా. ఎన్ని చూసినా మొత్తం పూర్తి కావు. కాశీలో లాగా ఎక్కడో అక్కడ మనమే ముగింపు పలకాలి. లేకపోతే యాత్ర ఎప్పటికీ పూర్తి కాదు. 

 

ఈ లింగరాజ మందిరానికి దూరంగా, వూరికి బయట భువనేశ్వరి అమ్మవారి ఆలయం వుంది. ఈ దేవత భువనాలకే ఈశ్వరి, భువనేశ్వరి. ఈ ఆలయం ప్రత్యేకంగా వెళ్లి చూడాలి. మేము వెళ్లేసరికి చీకటి పడి దీపాలు పెట్టేసారు. అయినా వెళ్లి ఆ ఆలయ సముదాయం లోని ఆలయాలన్నీ కూడా చూసాం. అన్నీ చూసాక చాలా తృప్తి కలిగింది. బహుశా ఈ తృప్తినే యాత్రాఫలం అంటారేమో. దశమహావిద్యల ఆలయాలగురించి చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి భువనేశ్వరీ దేవిని స్మరించుకుందాం.

ఇంతటితో ఈ లింగరాజమందిరం, హుమా బిమలేశ్వరస్వామి వక్ర మందిరం దర్శనాలు అయినాయి కదా. తరువాత మురుడేశ్వర్, ధర్మస్థల గురించి చెప్పుకుందాం.

                                            
ఓం లింగరాజాయనమః, ఓం బిమలేశ్వరాయనమః 
ఓం భువనేశ్వర్యై నమః 


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం