మురుడేశ్వర్-మంజునాథేశ్వర్
మురుడేశ్వర్-మంజునాథేశ్వర్
మా కర్ణాటక టూర్ లో భాగంగా ఈ ఆలయాలు రెండూ చూసాం. ముందుగా మురుడేశ్వర్, ఆ తరువాత ధర్మస్థల వెళ్లాం. మురుడేశ్వర్ లో చూడవలసినది ఒక్క ఆలయమే, కానీ అదే బ్రహ్మాండమైన, వర్ణించటానికి ఎన్నో, ఎన్నెన్నో విశేషాలున్న ఆలయం. అదే ధర్మస్థల లో అయితే మంజునాథుడితో పాటు ఎన్నో విశేషాలున్నాయి. గొప్ప గొప్ప ఆలయాలున్నాయి. ముందుగా మురుడేశ్వర్ గురించి చెప్పుకుందాం. ఈ ఆలయం కొత్తగా కట్టారు. కానీ స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతం అంతా త్రేతాయుగం నాటిది. రావణాసురుడు శివుడ్ని మెప్పించి ఆత్మలింగం పొందిన తరువాత, ఆ లింగాన్ని లంకకు తీసుకువెళ్తుంటే, అది వినాయకుడు యుక్తిగా కింద నేల మీద పెట్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఆత్మలింగమే గోకర్ణంలో వున్న లింగమని ఇక్కడ చెపుతారు. సరిగ్గా బీహార్, ప్రస్తుతం ఝార్ఖండ్, వైద్యనాథ్ లో కూడా ఇదే స్థలగాధ చెప్పారు. నిజంగా ఆ ఆత్మలింగం భూమిపై పెట్టిన ప్రదేశమేమిటో ఆ శివునికే తెలియాలి. సరే, మన కథలోకి వద్దాం. రావణుడు ఆ ఆత్మలింగాన్ని పెకలించే ప్రయత్నంలో ఆ లింగం భిన్నమై ఎన్నో ముక్కలు అటూ ఇటూ పడ్డాయి. ఆ ముక్కలు పడిన ప్రతి ప్రాంతం లోనూ ఒక శివాలయం వెలిసింది. అలాగే ఈ మురుడేశ్వర్ లోని ఆలయం కూడా ఆ ఆత్మ లింగం శకలం పడిన ప్రదేశాల్లో ఒకటి.
ఈ మధ్యకాలంలో ఆ పాత ఆలయం చుట్టూ ఎన్నెన్నో కొత్త సొబగులు చేసి 123 అడుగుల మహా మురుడేశ్వరుని విగ్రహాన్ని, ఇంకా శని మందిరం, రామలింగేశ్వర ఆలయం వంటి ఆలయాలను కట్టారు. సూర్యరథం, గీతోపదేశం, గంగావతరణం, సముద్రమధనం, సప్త ఋషులు తపస్సు చేసుకుంటున్న దృశ్యం, రావణుడి నుంచి బాలుడి రూపంలో గణేశుడు ఆత్మలింగాన్ని అందుకుంటున్న దృశ్యం, వ్యాసుడు, గణపతి కూర్చుని మహాభారతాన్ని రచిస్తున్న దృశ్యం మొదలైన శిల్పాలను ఎంతో అందంగా, హృద్యంగా, కమనీయంగా కట్టారు. అత్యద్భుతంగా 20 అంతస్థులలో 237 అడుగుల రాజగోపురాన్ని కూడా కట్టారు. అంత ఎత్తైన రాజగోపురం ఎక్కటానికి ఒక లిఫ్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ లిఫ్ట్ లో పై అంతస్థు దాకా వెళ్లి చూస్తే మూడు వైపులా అరేబియా సముద్రము, కింద ఈ బ్రహ్మాండమైన ఆలయము, ఆ ఆలయం చుట్టూ ఇప్పుడు నేను చెప్పిన విశేషాలు కనిపిస్తాయి. అంతా బంగారు రంగు పెయింట్ వేసారేమో, ఏ స్వర్ణపురి లోనో అనిపిస్తుంది.
ఆలయంలోకి కాలు పెట్టీ పెడుతూనే మనల్ని రెండు పెద్ద ఏనుగులు ఆహ్వానిస్తాయి. సరిగ్గా ఇటువంటి ఏనుగులే ఇండోర్ అహల్యాబాయి రాజ్ వాడాలో కూడా చూసాం. ఆ వెనుకే బ్రహ్మాండమైన రాజగోపురం. ముందు ఎక్కడికి వెళ్ళాలో కాసేపు అయోమయంలో పడ్డాం. ఆ తరువాత ముందుగా రాజగోపురం ఎక్కి ఏమేమున్నాయో చూసుకుని అప్పుడు దిగి అవన్నీ చూసాం. మాలాంటి వారికి వీలుగా కారు పైదాకా వెళ్లే ఏర్పాటుంది. ఎక్కడా ఎక్కువ నడవటం, ఎక్కటం, దిగటం ఉండదు. తేలిగ్గానే వెళ్లి రావచ్చు. ఆ మహా శివుని విగ్రహాన్ని చుట్టుకున్న పాముల్ని చూస్తే, ఈయన నాగభూషణుడు కదా, ఆ పేరు సార్ధకమైంది అనిపించింది. తరువాత కిందకు దిగి లోపలి ఆలయాల లోకి వెళ్ళాం. కొత్తవి, పాతవి అన్ని ఆలయాలూ చూసాం. శని దేవాలయంలో పూజ చేయించాం. ఆ తరువాత మృడేశ మందిరానికి వెళ్లాం. దానినే ఇప్పుడు మురుడేశ్వరుడు అంటున్నారు. అక్కడ లింగం కూడా గోకర్ణంలో లాగానే భూమి కిందకు ఉంటుంది. అయినా దీపాల కాంతిలో కనపడుతుంది. మేము వెళ్ళినప్పుడు ఆలయంలో ఏదో కంస్ట్రక్షన్ జరుగుతోంది, అంతా ఇసుక, సిమెంట్ పడి వున్నాయి. అంతా ట్యూబులతో నీళ్లు పోసి కడుగుతున్నారు. జాగ్రత్తగా బయటకు వచ్చాము. తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం. ఈ ఆలయం పాత కొత్తల మేలు కలయిక.
ఇప్పుడు ధర్మస్థల చూసొద్దాం. ధర్మస్థలలో ముఖ్యంగా చూడాల్సినవి మంజునాథస్వామి ఆలయం, బాహుబలి విగ్రహం, శ్రీరామక్షేత్రం, నేత్రావతి నది, అన్నప్ప బెట్ట. కానీ మనం మంజునాథస్వామి గురించి చెప్పుకోవాలంటే, ముందు ఆ లింగం దొరికిన మంగళూరు దగ్గర వున్న కద్రోలి గోకర్ణనాథ క్షేత్రం గురించి కూడా చెప్పుకోవాలి. ముందుగా కద్రోలి గోకర్ణనాథ క్షేత్రం గురించి చెప్పుకుందాం. ఈ ఆలయంలో ప్రధాన దేవత గోకర్ణేశ్వరుడు. ఇది మనం సాధారణంగా చెప్పుకునే గోకర్ణం కాదు. ఈ ఆలయం కూడా ఏనాటిదో. ఆ గోకర్ణం గురించి ఇంకో కథలో చెప్పుకుందాం. ఈ ఆలయం వెనుక భాగంలో 9 బావులు ఉన్నాయి. వీటి పక్కనే కాశీ భాగీరథీ తీర్థం అని చెప్తున్న ఒక సహజంగా ఊరుతున్న జల వుంది. అది గోముఖం ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఆ నీరు కాశీ నుంచి వస్తోంది అని ఒక నమ్మిక. ఆ తీర్థం నుంచి పక్కనే వున్న బావుల్లోకి చేరుతుంది. దాంట్లోనే అందరూ స్నానాలు చేస్తారు. బావులు అంటారు కానీ అవి తొట్టెల్లాగా ఉంటాయి. ఆ బావుల్లో స్నానం చేసి, అక్కడ ప్రధానాలయంలో వున్న మంజునాథ లింగాన్ని దర్శనం చేసుకుంటారు భక్తులు. ఒకరోజు అనుకోకుండా అన్నప్ప అనే ఒక భక్తుడికి స్నానం చేస్తున్న సమయంలో ఒక నర్మదా బాణలింగం వంటి లింగం చేతుల్లోకి దొరికింది. ఆ లింగాన్నే మంజునాథస్వామిగా భావించి అన్నప్ప ధర్మస్థలకు తిరిగివచ్చి ఆ లింగాన్ని ధర్మస్థల మంజునాథ ఆలయంలో ప్రతిష్ఠ చేసాడు. అదే ఈ నాడు మనం చూస్తున్న ధర్మస్థల మంజునాథస్వామి.
ఇప్పుడు ధర్మస్థలకు వద్దాం. ముందుగా అన్నప్ప బెట్ట కు వెళ్లాం. ఇది మంజునాథుణ్ణి ధర్మస్థలకు తెచ్చిన అన్నప్ప గౌరవార్ధం కట్టినది. కొండపై ఉంటుంది. మంజునాథ ఆలయ ప్రధమ ధర్మాధికారి శ్రీ బీర్మన్న ప్రగ్గడే కూడా సన్యసించి ఇక్కడికే చేరారు. ఆ తరువాత మంజునాథ ఆలయానికి వెళ్లాం. ఇది ఒక గుడి లాగా ఉండదు. రాజప్రాసాదం లాగా ఉంటుంది. నిజం కూడా అంతే. ప్రస్తుతం హెగ్డేలని పిలవబడుతున్న, అప్పటి ప్రగ్గడేల కుటుంబంలో, అప్పటికి పెద్దవాడైన బీర్మన్న ప్రగ్గడేకు నలుగురు ధర్మ దేవతలు కలలో కనపడి వారి సంస్థానమయిన నీల్లియాది బీడు అనే గృహాన్ని, ఆ ధర్మదేవతలకు ఆలయంలాగా మార్చమని ఆదేశించారుట. స్వతహాగా ఈ ప్రగ్గడేలు జైనులు అయినప్పటికీ, ఆ ధర్మదేవతల కోరిక మన్నించి, బీర్మన్న ప్రగ్గడే దంపతులు వెంటనే తమ కుటుంబాన్ని వేరే చోటికి తరలించి, తమ ఇంటిని ఆ నలుగురు ధర్మదేవతలైన కాలరాహు, కాలార్కయి, కుమారస్వామి, కన్యాకుమారి లకు ఆలయంగా మార్చేశారు. ఈ ధర్మదేవతలు కొలువున్న స్థలం కనుకే ఈ వూరుకి ధర్మస్థల అనే పేరు వచ్చింది. వారే అన్నప్ప అనే భక్తుడిని మంజునాథ స్వామి లింగాన్ని తెమ్మని గోకర్ణ క్షేత్రమైన కద్రోలికి పంపించారు. అన్నప్ప తెచ్చిన లింగాన్ని మంజునాథుడనే పేరుతో ఆ ఆలయంలోనే ప్రతిష్టించారు. అప్పటినుంచి ఆ ఆలయం మంజునాథస్వామి ఆలయంగా పేరు పొందింది. ప్రధానాలయంలో శివుడితో పాటు జైన దేవతలు కూడా కనిపిస్తారు ఇక్కడ. అంతేకాదు ఆ నలుగురు ధర్మదేవతలు కూడా కనిపిస్తారు. చాలా ధార్మిక ఆలయాల్లో మాదిరిగా ఈ ఆలయంలో కూడా సాంప్రదాయిక దుస్తులు ధరించాలనే నియమం వుంది. ఇప్పటికీ ఆ కుటుంబం వారే ఈ ఆలయ ధర్మాధికారులు. ప్రస్తుత ధర్మాధికారి శ్రీ వీరేంద్ర హెగ్డే. ఈయన చేసే సమాజ సేవకు మెచ్చి పద్మభూషణ్ బిరుదు నిచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది. వీరేంద్ర హెగ్డే చాలా నిరాడంబరంగా వుండే వ్యక్తి.
ఈ ఆలయంలో నిరంతరం నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. మేము కూడా ఇక్కడ భోజనం చేసాం. మాలాంటి కింద కూర్చోలేని వారికి టేబుల్ సౌకర్యం కూడా వుంది. ఈ ఆలయ దేవస్థానం వారు ఎన్నో పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు నడుపుతున్నారు. "శ్రీ మంజునాథేశ్వర సంస్కృతీ సంశోధన ప్రతిష్ఠాన" అనే సంస్థను స్థాపించి పురాతన తాళపత్రాలు, గ్రంధాలు పరిష్కరిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ఆలయం కోసం కట్టిన కట్టడం కాదు కనుక, ముఖ మండపం వద్ద కొద్దిగా రద్దీగా ఉంటుంది. అక్కడి దాకా వచ్చాక కాస్త తోపుడు జరిగింది. చక్కగా దర్శనం అర్ధం కావాలంటే, ముందుగా ఆలయం గురించి చదువుకునో, తెలుసుకునో వెళ్తే బాగుంటుంది. లేదా రెండోసారి వెళ్తే బావుంటుంది. బయటకు వచ్చాక ఆలయ వుద్యోగి ఒకరు ఎండు కొబ్బరికాయలు ఒక తెల్లని గుడ్డసంచీలో కట్టి ఇస్తున్నారు. అది ఎందుకు అని అడిగితే, ఇంటి గుమ్మానికి కట్టండి, ఇంటికి దృష్టిదోషం తగలదు అని చెప్పారు. నేనూ డబ్బులిచ్చి ఒక సంచీ కొనుక్కుని తిరిగి వచ్చాక మా ఇంటి గుమ్మానికి కట్టాను. ఇదీ మంజునాథాలయం విశేషాలు. ఈ ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం కన్నడిగులకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం.
ఆ తరువాత మేము జైన బాహుబలి విగ్రహమున్న ప్రాంతానికి వెళ్ళాం. ఇది కూడా చాలా అద్భుతంగా వుంది. పెద్ద ప్రాంగణం. ఆ తరువాత నేత్రావతీ నది ఒడ్డుకి వెళ్లాం. అక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు. నది ప్రవాహం చాలా జోరుగా వుంది. అయినా ఎవరూ భయపడటం లేదు. ఆ స్థలంలో కూర్చోవటానికి చక్కగా వుంది. మేము ఇంకా ధర్మస్థలలో ఒక రామమందిరం చూడాల్సి వుంది. ఆ ఆలయం తెరవటానికి ఇంకా కొంచెం టైముండటంతో ఆ సమయాన్ని మేము ఈ నేత్రావతీ నదీ తీరంలో కూర్చుని ఆ నదిని చూస్తూ హాయిగా గడిపాము. తరువాత ఆ శ్రీరామక్షేత్రం చూట్టానికి వెళ్ళాం. ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత పెద్ద ఆలయం అంటే, దీన్ని ఆలయం అనే కన్నా, ఒకే కట్టడంలో వున్న అనేకానేక ఆలయాల సముదాయం అంటే సబబుగా ఉంటుంది. అక్కడ లేని దేవీ దేవతలు లేరు. మొత్తం మూడంతస్థుల ఆలయం. ప్రధాన దేవుడు శ్రీరాముడే. నవగ్రహాలు, అష్ట దిక్కుల దేవతలు, రాముడు, కృష్ణుడు, శివుడు, అన్నపూర్ణ, దుర్గ, సరస్వతి, మహాలక్ష్మి, సప్తఋషులు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఉపాలయాలు ఈ మూడంతస్థుల్లో వున్నాయి. చూసిన కొద్దీ చూస్తూనే ఉంటాం. అంతే కాదు, ఈ ఆలయం అంతా కాచురంగు, బంగారు రంగులలో ఉంటుంది. ఏ వైపు చూసినా, బయటా, లోపలా కూడా అంతా తళతళ, ధగధగ లాడుతూ ఉంటుంది. సిరిసంపదల నిలయమే ఈ ఆలయం అని ఎవరికైనా అనిపిస్తుంది. రిచ్ నెస్ అంతా ఒక్కచోట పోగు పడినట్టు అనిపించింది. ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. అసలు మనకు అన్ని అంతస్తులు ఎక్కుతున్నాం అని కూడా, స్ఫురణకు రానే రాదు. ఎక్కుతూనే ఉంటాం, దిగుతూనే ఉంటాం. అలసట అనిపించదు.
అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ రచించి, హంసధ్వని రాగంలో ఆలపించిన వాతాపి గణపతిమ్ భజేహం అనే కీర్తన అందరూ ఎన్నోసార్లు వినే వుంటారుకదా. నేనూ అలాగే విని ఆ గణపతిని చూడాలనే కుతూహలంతో, మా యాత్రలో బాదామిని కూడా కలిపాను. అప్పటి వాతాపి ఇప్పుడు బాదామి. బాదామి చాళుక్యుల పాలనలో ఉండేది. తీరా అక్కడిదాకా వెళ్ళాక ఆ గణపతి అక్కడ లేడని తెలిసింది. చోళరాజులు చాళుక్యులతో యుద్ధం గెలిచాక, ఆ గణపతిని తంజావూరు తరలించారని, ప్రస్తుతం అది తంజావూరు మ్యూజియంలో ఉన్నదనీ తెలిసింది. కాసేపు నిరాశ పడ్డా, అయితేనేం బాదామి వెళ్లినందుకు మేము అద్భుతమైన ఆ నాటి శిల్పాలు, గుహలు, చిత్రాలు, కొండలపై సహజసిద్ధంగా ఏర్పడ్డ వివిధ ఆకారాలూ చూసాం. ఏనాటికీ మరిచిపోలేనిది బాదామి. అక్కడికి మేము పాట విని వెళితే అక్కడి కొండల బండలు మాకు రకరకాల చిత్రాలు, శిల్పాలు చూపించాయి. దీక్షితార్ గీతం కోసం వెళ్తే శిలాగీతాలు దొరికాయి. నిజాయితీగా రాస్తే ఈ ఒక్క బాదామి మీదే ఒక గొప్ప కథ రాయొచ్చు. చూద్దాం భవిష్యత్తులో రాయగలనేమో.

ఇప్పటి దాకా మురుడేశ్వర, మంజునాథేశ్వర క్షేత్రాల గురించి, ధర్మస్థలలో వున్న మిగతా విశేషాల గురించి, కద్రోలి లో వున్న శ్రీ గోకర్ణ క్షేత్రం గురించి, బాదామి గురించి చెప్పుకున్నాం కదా. ఇక తరువాత గోకర్ణ క్షేత్రంలోని మహాబలేశ్వరుని గురించి, కుక్కి లోని సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి చెప్పుకుందాం.
ఓం శ్రీ మురుడేశ్వరాయనమః, ఓం శ్రీ మంజునాథేశ్వరాయ నమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
చాలా బాగుంది
రిప్లయితొలగించండిVery nice aunty
రిప్లయితొలగించండిThank you.
రిప్లయితొలగించండి