శనైశ్చర క్షేత్రాలు
శనైశ్చర క్షేత్రాలు
ఈనాటికీ మనిషికి అంతు పట్టనిదీ, అపార కుతూహలాన్ని కలిగించేదీ, ఒక్కోసారి భయపెట్టేదీ, ఏమైతే అదౌతుందిలే పో అనుకుని చివరకు నిస్సహాయంగా నిట్టూరుస్తూ అనుకునేదీ ఈ శనైశ్చరుని గురించే. చాలామంది శనీశ్వరుడు అని కూడా అంటారు. కానీ అసలు పేరు శనైశ్చరుడు. శనైః, చరః, శని అంటే మందంగా, నెమ్మదిగా, నిదానంగా, చరః అంటే నడిచేవాడు. మొత్తం మీద శనైశ్చరుడంటే, నిదానంగా నడిచేవాడు. అందుకే ఈయనకి మందుడు అనే మరో పేరు కూడా వుంది. శని మిగిలిన గ్రహాలకన్నా కాస్త నిదానస్తుడు, అంతే. శని విషయంలో మాత్రం అందరూ భయపెడుతూనే వుంటారు. కానీ శని అపార కరుణా సముద్రుడు. ఎందుకంటే, శని రాగానే, అందరూ మహా భయపడి పోయి పూజలూ, స్తోత్రాలూ, జపాలూ చేస్తూ, చేయిస్తూ వుంటారు. ఆ భయం వలన పాప కర్మలు చేయటం తగ్గి, సత్కర్మలు చేసి పుణ్యబలం పెంచుకుంటారు. కనుక శని ఎవరిని పడతాడో వారి పుణ్యబలం కచ్చితంగా పెరుగుతుంది. శనిని ధ్యానించి, శనిని మంచి చేసుకుని, అంటే, శనిని ప్రీతితో పూజించి సత్ఫలితాలను పొందాలి. అంతే కానీ, భయపడుతూ కూర్చుని ఇంకోరెవరో మన బదులు పూజలు చేస్తున్నారులే, వాళ్లకు డబ్బులిచ్చి చేయించుకుంటున్నాం కదా, కనుక ఆ ఫలితం మనదే అనుకుంటే పొరపాటే. ఆ గ్రహ ప్రభావం ఎవరిపై ఉంటే వారే స్వయంగా పూజించటం, ధ్యానించటం, భజించటం చేస్తే మంచిది. మనకి మనమే చేస్తే ఎక్కువ ఫలం, మన మంచి కోరే బంధుమితృలు చేస్తే మధ్యమ ఫలం, మన ధనాన్ని ఆశించేవారు చేస్తే తక్కువ ఫలం. శనికి వాహనం కాకి. ఒక్కోచోట దున్న కూడా కనిపిస్తుంది. శనికి తండ్రి సూర్యుడు, అన్న యముడు. అన్నగారి వాహనాన్ని అప్పుడప్పుడు శనికి కూడా వాడుతుంటారు. నల్లగా ఉంటాడు, నువ్వులనూనె అంటే ప్రీతి. అందుకే శనికి తైలాభిషేకాలు చేస్తూ వుంటారు. ఈ కింది ఫోటో నేపాల్ లోని నేపాల్ గంజ్ లోని బాగేశ్వరి అమ్మవారి గుడిలోనిది. ఈ విగ్రహం కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఒకసారి చూస్తే మర్చిపోలేం.
అంతేకాదు, జాతక చక్రంలో శని ఒకటో ఇంట్లో వున్నాడు, రెండో ఇంట్లో వున్నాడు, మూడో ఇంట్లో వున్నాడు వగైరా అనుకుని భయపడటం ఎందుకు, పాపం ఆయన కూడా ఎక్కడో ఒకచోట ఉండాలి కదా, వున్నవి పన్నెండిళ్లు. ఎక్కడికి పోతాడు ఆయన. కనుక అలాంటి భయాలు పడకండి. పూజ చేసుకోండి, తప్పు లేదు. శని కరుణిస్తే, నెత్తిపై పడాల్సిన బండరాయే కాస్త తొలిగి పక్కన పడుతుంది, ఆ మాత్రం కరుణ చాలు కదా మనకి. ఇంకా కూడా భయంగా వున్నవారికి, కింద ఎప్పుడూ చదువుకునేందుకు వీలుగా మూడు శ్లోకాలు ఇస్తున్నా, చదువుకోండి. వీలైతే రోజూ చదువుకోండి, లేకపోతే ప్రతి శనివారం చదువుకోండి. ఆ శ్లోకాలు ఇవే.
"నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్"
ఇది నవగ్రహ స్తోత్రం లోని శ్లోకం. చాలా తేలికగా గుర్తుంచుకోవచ్చు. రెండో శ్లోకం భవిష్య పురాణంలో పిప్పలాద మహర్షి చెప్పిన శ్లోకం. శని ఈశ్వరుడితో సహా అందరినీ బాధిస్తే, పిప్పలాదుడు శనినే బాధించాడు. అటువంటి పిప్పలాదుడు ఈ శ్లోకం ఎవరు చదువుతారో వారిని శని బాధించడు అని చెప్పాడు. ఆ శ్లోకం ఇదీ.
"కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోన్తకో యమః
సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః"
ఇక మూడవది శని మంత్రం, ఇది కూడా చదువుకుంటుంటే మంచిది. మంత్రం అంటే, మననాత్ త్రాయతే ఇతి మంత్రః, అంటే నిత్యం మననం చేస్తుంటే రక్షించేదే మంత్రం అని అర్ధం. కనుక నిరంతరం మననం చేస్తూ వుండండి. "శం శనైశ్చరాయనమః".
ఇప్పుడు మనం, మేము చూసిన కొన్ని శనైశ్చర క్షేత్రాల గురించి చెప్పుకుందాం. ఇక్కడ నేను నా మనసుని కదిలించిన శని క్షేత్రాల గురించి మాత్రం రాస్తాను. ఎందుకంటే దాదాపుగా ఏ శివాలయానికి వెళ్లినా, శక్తి క్షేత్రాలకు వెళ్లినా మనకు ఈ నవగ్రహాల మండపం, దాన్లో శని తప్పక కనపడతారు. అందుకే కొన్ని ప్రత్యేక ప్రదేశాల గురించి మాత్రం రాస్తాను.
ఉడుపి: అన్నింటిలో మొదటిది, ఉడుపిలో మేము చూసిన బన్నంజే శని క్షేత్రం. ఇది కొత్తగా స్థాపించారు. అయినా ఆ విగ్రహం అద్భుతం, పరమాద్భుతం. శని అసలైన లక్షణం, భావం చక్కగా స్పష్టంగా కనిపించేలా వున్నాయి. ఇదీ శని కారెక్టర్ అని ఆయా విగ్రహాన్ని చూసిన వెంటనే చెప్పేయచ్చు. ఆ శిల్పికి నా శత సహస్ర వందనాలు. సరిగ్గా మనసుతో చూస్తే హరి హరులు కూడా ఈ శిల్పంలో కనపడతారు. బన్నంజే మఠం వాళ్ళు, వాళ్ళ మఠాధిపతి శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వామి వారి పర్యవేక్షణలో ఈ ఆలయం కట్టించారని అక్కడి వాళ్ళు చెప్పారు. ఈ విగ్రహం 19 అడుగుల ఎత్తున్న పెద్ద ఏకశిలా విగ్రహం. శనిదశ మొత్తం 19 ఏళ్ళు. ఆ సంఖ్యకి గుర్తుగా 19 అడుగుల విగ్రహం పెట్టామని చెప్పారు. ఇంత పెద్ద ఏకశిల శని విగ్రహం ఇక్కడే ఉందని చెప్పుకుంటారు. ఈ ఆలయంలో ఆ ఎత్తైన శని విగ్రహానికి అటూ, ఇటూ ఇనప మెట్లు కట్టారు. ఆపైన కి చేరాక అక్కడ మనమే స్వయంగా ఆ శనిదేవుడికి తైలాభిషేకం చేసుకోవచ్చు. ఆ సౌకర్యాలన్నీ అక్కడ వున్నాయి. ఏది ఏమైనా మన చేత్తో మనమే స్వయంగా చేసుకుంటే వుండే ఆనందం వేరు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మన బదులు మరొకరు చేస్తే మనకు ఎంతో కొంత ఫలితం వస్తుందేమో కానీ ఈ ఆనందం రాదు. మొత్తం ఆలయం చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. అది చూసి సంతోషం వేసింది. పెద్ద షెడ్ లో పెద్ద విగ్రహం, అందునా అందమైన విగ్రహం. ఎక్కడా శనికి ఇంత అందం లేదండీ, ఇక్కడ ప్రత్యేకత ఏమిటండీ, అని అక్కడ ఉన్న పూజారిని ప్రశ్నించినప్పుడు, "ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ స్తపతులతో చెక్కించాము, అందుకేనేమో ఆ అందం" అన్నారు ఆ పూజారి.
శింగణాపూర్: ఆ తరువాత నేను చెప్పబోయే శని క్షేత్రం శింగణాపూర్. అసలు ఈ వూరి పేరే శనిశింగణాపూర్. ఏనాడు ఇక్కడ వెలిశాడో తెలియని శనైశ్చరుడు ఇక్కడ ఒక అయిదు ఆరడుగుల పొడుగాటి నల్లని శిలగా దర్శనమిస్తున్నాడు. పెద్ద దేవస్థానం. సాధారణంగా షిరిడి చూట్టానికి వెళ్లిన వాళ్ళు ఈ ఆలయాన్నీ సందర్శించడం అలవాటు. ఈ ఆలయంలో శని శిలకు పైన ఏ కప్పూ ఉండదు. ఈ శిల ఒక పెద్ద వేదిక పై ఉంటుంది. కేవలం మగవారు మాత్రమే, అదీ సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే, వెళ్లి తైలాభిషేకాలూ, పూజలూ చేసుకోవచ్చు. మేము మొదటిసారి ఇక్కడకు వెళ్ళింది 2002 లో. మావారు కూడా దుస్తులు మార్చుకుని, ఆ వేదిక పైకి వెళ్లి తైలాభిషేకం, అర్చన చేయించుకుని వచ్చారు. స్త్రీలకు ఆ వేదిక పైకి ఎక్కే అధికారం లేదు. కానీ పక్కనే వున్న గట్టుపై నుంచుని అన్నీ చక్కగా చూడచ్చు. ఈ శని ప్రభావం వల్ల ఆ వూరిలో ఎక్కడా దొంగతనాలు జరగవట. అందుకే ఏ ఇంటికీ తలుపులు, తాళాలు వుండవు. ఆ కారణం చేతనే ఈ వూళ్ళో బ్యాంకులు కూడా వుండవు, మరి వాళ్ళు తాళాలు లేకుండా వాళ్ల బ్రాంచీలు పెట్టుకోలేరు కదా. ఈ రోజుల్లో మళ్ళీ స్త్రీ వాదులంతా చాలా పోరాడి అందరికీ సమాన హక్కు అని కోర్టుల ద్వారా స్త్రీలకు కూడా ఆ వేదిక నెక్కే హక్కు సంపాదించారు. బాగానే వుంది, ఈ స్త్రీవాదులంతా కలిసి, ఆడవాళ్ళకు బస్సుల్లో ముందు సీట్లు, ఉద్యోగాలలో, చదువుల్లో రిజర్వేషన్స్ లేకుండా అందరినీ కూడా సమానంగా చూడాలని ఎప్పుడంటారో కదా. ఈ కొత్త రూల్స్ వచ్చాక మేము 2019 లో ఒకసారి శింగణాపూర్ వెళ్లాం. అక్కడ చూస్తే ఏముంది, అసలు ఎవ్వరూ వేదిక ఎక్కకుండా చుట్టూ గ్రిల్స్ పెట్టేసి దేవుడి మీదకు ఒక పెద్ద ఇనప గొట్టం, గరాటు పెట్టారు. మాలాంటి వారెవరైనా అభిషేకం చెయ్యాలంటే ఆ గొట్టం మొదట్లో నూనె పోస్తే, అది పారుకుంటూ వెళ్లి ఆ శిలపై పడుతుంది, సోమనాథ్ లో లాగా. ఆహా ఎంత గొప్ప ఏర్పాటు కదా, అని ఏడవలేక నవ్వి, మేము తీసుకు వెళ్లిన తైలం ఆ గొట్టం మొదట్లో వున్న ట్రే లో పోసి వచ్చాం. కానీ ఆ ప్రాంగణంలో ఇప్పుడు చాలా పని నడుస్తోంది. ఇంకొన్ని రోజుల తరువాత వెళ్తే, బహుశా ఆ కొత్త శిల్పాలు, మండపాలూ చూడొచ్చేమో.
తిరునల్లార్: ఇక మూడవది పాండిచ్చేరి లోని కరైకల్ జిల్లాలో వున్న తిరునల్లార్ క్షేత్రం. ఇది కూడా అతి పురాతన క్షేత్రం. నల దమయంతుల కాలం నాటిది. ఇక్కడి దేవుడు శివుడు, ఈ శివుని పేరు దర్భారణ్యేశ్వరర్. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దర్భలు మొలిచే అరణ్యమట. అందుకే ఈ శివునికి దర్భారణ్యేశ్వరర్ అన్న పేరు వచ్చిందట. ఇక్కడ శని దేవుడు ఈ శివుడికి ద్వారపాలకుడు. నల చక్రవర్తి తన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడికి వచ్చి ఈ ఆలయ కోనేరు, నల తీర్థం లోనే స్నానం చేసి ఇక్కడి శనిదేవుణ్ణి దర్శించుకుని ఆ ఫలితంగా శాపం పోయి దమయంతిని కలుసుకున్నాడని చరిత్ర. నలమహాచక్రవర్తి శని దోషం వల్ల రాజ్యాన్ని, భార్యను పోగొట్టుకుని, కర్కోటకుడనే పాము కాటు చేత రూపాన్ని కూడా పోగొట్టుకుని అయోధ్యలో ఋతుపర్ణుడనే రాజు వద్ద బాహుకుడనే పేరుతో కాలం గడుపుతున్నాడు. అప్పుడు తిరిగి కాలం అనుకూలించి ఇక్కడి శనిదేవుని మహత్యం గురించి తెలుసుకుని ఈ ప్రాంతానికి వచ్చి శని దోషం పోగొట్టుకుని భార్యా, పిల్లలు, రాజ్యాన్ని తిరిగి పొంది ఆనందంగా వున్నాడని కథనం. ఈ కథ మనకు మహాభారతంలో కనపడుతుంది. కవి సార్వభౌముడు శ్రీనాథుడి శృంగారనైషధం కావ్యవస్తువు కూడా ఈ నలదమయంతులే. ఇంతకీ నలునకు శని దోషం ఎలా కలిగిందంటే, ఆయన కాళ్ళు సరిగ్గా కడుక్కోలేదట. అందుకే ఈనాటికీ కొంతమంది పెద్దలు, పిల్లలకు 'కాళ్ళు చక్కగా కడుక్కోండి, పూర్తిగా మడమలు తడిసే దాకా కడుక్కోండి', అని చెప్తూ వుంటారు. ఈ విధంగా నలమహారాజుకి శాపం పోగొట్టిన వూరు కనుక ఈ వూరు పేరు తిరునల్లార్. ఇక్కడ ఆలయం చాలా బావుంది, నిర్వహణా బావుంది, కానీ ఎప్పటి లాగే స్థానిక భాష రాక మాకు కొంచెం ఇబ్బంది కలిగింది. మొత్తానికి ఎలాగైతేనేం, మా పూజ, మా దర్శనం నిరాఘాటంగా జరిగాయి. అదో సంతోషం. ఆ నల తీర్ధంలో స్నానం చెయ్యలేదు కానీ కాస్త నీరు ప్రోక్షించుకున్నాం. మేము దిగిన గదిలోకి కూడా ఆ నీరే తెచ్చిపెట్టాడు అక్కడి పిల్లాడు. ఇంతకీ ఇక్కడికి ఎవరు వచ్చినా అందరూ అక్కడికే వెళ్లి స్నానం చేస్తారుట, అందుకని హోటళ్లలో స్నానానికి ఏర్పాటు లేదు. మేము ఇలాంటిదే ఒకసారి బీహార్ లోని రాజగిర్ లో చూసాం. అక్కడ వేడినీటి కుండాలు, పైగా ఔషధ గుణాలున్న నీరుట, ఉండటంతో, ఆ వూళ్ళో కూడా ఎక్కడా ఏ హోటల్లోనూ స్నాన వసతులు లేవు. ఇంతకీ రాజగిర్ అంటే ఆనాటి మగధ చక్రవర్తి జరాసంధుడు పాలించిన రాజగృహ. సరే, ఆ విధంగా స్నానం చేసి ఆలయానికి వెళ్లి దర్శనం, పూజ చేయించుకుని బయటకు వచ్చాం. ఈ తిరునల్లార్ ఆలయంలో ఆన్ లైన్ సేవలు కూడా వున్నాయి. ఇష్టం వున్నవారు ఈ లింక్ లో ప్రయత్నించండి. https://thirunallarutemple.org
మదనపల్లి: మదనపల్లి అంటే, చిత్తూరు జిల్లా అనుకునేరు, కాదు. ఇది హైదరాబాదులో శంషాబాద్ లో వున్నది. ఇది కూడా కొత్త ఆలయమే. ఒక కోయదొరకి కలలో శని కనిపించి ఇలా ఒక ఆలయం స్థాపించమని చెప్పాట్ట. ఇది కూడా సుమారుగా ఉడుపి ఆలయం లాగానే ఉంటుంది. బాగా ఎత్తయిన విగ్రహం, అదీ ఏకశిలలో. అటూ ఇటూ సిమెంట్ మెట్లు, పైనుంచే అభిషేకం చేసుకునే అవకాశం. ఇక్కడ కూడా ఎవరికి వారే అభిషేకం చేసుకోవచ్చు. తైలం అక్కడే దుకాణాల్లో దొరుకుతుంది. ఈ ఆలయం లోనే జ్యేష్టాదేవికి, శివునికీ కూడా ఉపాలయాలు వున్నాయి. ఇక్కడ శని దేవుడికి కూడా పై కప్పు ఉండదు.
వారాణసి: వారాణసిలో శని మందిరం విశ్వనాథుడి ఆలయం పక్కనే ఉంటుంది. అక్కడ కూడా భక్తులు నిత్య తైలాభిషేకాలు చేస్తూ వుంటారు. అక్కడ ఫోటోలు తీయటం కుదరదు, అనుమతించరు. ఒక చిన్న శని విగ్రహం అక్కడ ఉంటుంది. కాశీ వెళ్ళినప్పుడల్లా విశ్వనాథుడి దర్శనానికి ముందు ఈ శని దేవుడి దర్శనం చేసుకుంటారు అందరూ. ఈ ఆలయం కూడా అనాది నుంచీ వున్నది. శనికీ ఈశ్వరుడికీ వున్న సంబంధం తెలిసినదే కదా. శని ఎక్కడ తగులుకుంటాడో అని మహాశివుడే చెట్టు తొర్రలో దాక్కున్నాడని చెప్తారు కదా. అప్పటినుంచీ శనైశ్చరుణ్ణి శనీశ్వరుడు అని కూడా పిలుస్తున్నారు.
ఇవీ మేము చూసిన, నా మనసుకు తాకిన శని క్షేత్రాలు.
ఓం శనైశ్చరాయనమః, ఓం నమః శివాయ
ఇంతటితో శని క్షేత్రాల గురించి ముగిస్తాను. తరువాత మనం దీనికి జతగా నవగ్రహ క్షేత్రాల గురించి చెప్పుకుందాం. ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఎన్ని నవగ్రహ క్షేత్రాలున్నా, మేము చూసిన, నా మనసుకి దగ్గరైన నవగ్రహ క్షేత్రాల గురించి మాత్రం చెప్తాను.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Very informative..
రిప్లయితొలగించండిThis comment has been removed by the author.
తొలగించండిథాంక్స్ అండీ. నమస్కారం. మిగిలినవి కూడా చదవండి. జయ అక్కయ్య ను కూడా చదవమని చెప్పానని చెప్పండి. మొత్తం 27 పోస్ట్ లు పెట్టాను. పోస్ట్ కింద ఉన్న Hone బటన్ ప్రెస్ చేస్తే ఇండెక్స్ వస్తుంది.
తొలగించండి