కైలాస మానస సరోవరం, త్రివిష్టపం
కైలాస మానససరోవరం-త్రివిష్టపం
శివుడు మాపైన సదా ప్రసన్నుడు. ఎలాగైతే అమరనాథ యాత్ర మాతో అనుకోకుండా నిరాటంకంగా చేయించాడో, అదే విధంగా ఈ కైలాస మానస సరోవర యాత్ర కూడా ఆయనే చేయించాడు. నిజాయితీగా చెప్పుకోవాలంటే నాకు గానీ, మావారికి గానీ ఈ కైలాస మానస సరోవర యాత్ర చేయాలనే ఆలోచనే లేదు. కారణం అది చాలా కష్టమనీ, చాలా ఖర్చుతో కూడిన పని అనీ, ఈ రిటైర్ అయినాక ఇటువంటి యాత్రలు చేయగలమా అనీ, మా కాళ్ళు, మోకాళ్ళు నొప్పులకు ఈ సోకు కూడానా అనీ, ఇలా ఎన్నెన్నో దొంగ భయాలు మా మనసులో ఉండేవి. మామూలుగా 2018 మార్చ్, ఏప్రిల్ నెలలలో ఒక పది రోజులు పాటు అస్సాం, మేఘాలయ, త్రిపుర వెళ్లాలని ఒక ప్లాన్ వేసుకున్నాం. మా చెల్లెలి కూతురు కూడా మాతో వస్తానంది. అది అంతకు ముందు రాజస్థాన్ కి కూడా మాతో వచ్చింది. అన్ని రిజర్వేషన్స్ అయిపోయాయి, హోటల్స్ తో సహా. అప్పుడు అనుకోకుండా మా కింది వాటాలో వుండే అమ్మాయి మామగారు వచ్చి, మా కొలీగ్ ఒకడు భార్యతో కలిసి కైలాస మానస సరోవర యాత్రకి వెళ్తున్నాడండీ, మీరూ వెళ్తారా, మంచి కంపెనీ ఉంటుంది అన్నారు. పైగా ఆ యాత్రా నిర్వాహకుల గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన గత 20 ఏళ్లుగా ఈ యాత్ర చేయిస్తున్నారనీ, పైగా కమ్మర్షియల్ టూర్ గా కాక, ఆధ్యాత్మిక టూర్ లాగా చేయిస్తారని, ఆ మానస సరోవరం దగ్గర కూడా హోమాలు, అభిషేకాలు చేయిస్తారని చెప్పారు. ఈ విషయం ఎందుకో మావారికి, నాకూ కూడా బాగా నచ్చింది. అప్పటికప్పుడే ఆయనే చొరవ తీసుకుని ఆ ఫోన్ నంబర్లు తీసుకుని మాట్లాడించేసి, మరుసటి రోజుకి మాకు అప్పాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసేసారు. అలా మొదలైంది మా కైలాస మానస సరోవర యాత్ర.
అనుకున్నట్టుగానే, మరుసటి రోజు యాత్రా నిర్వాహకుడు, శ్రీ గణపతి స్వామి గారిని కలవటం, అయన చెప్పిన విధానం నచ్చటం, అన్ని విషయాలు మాట్లాడుకోవటం అయిపోయాయి. ఈ యాత్ర జూన్ లో జరుగుతుందని చెప్పారు ఆయన. మేము వెలిబుచ్చిన మా సందేహాలన్నింటికీ అయన ఒకటే మాట చెప్పారు. నాతో వస్తున్నారు. ఇక అన్నీ మర్చిపోండి. ఎవరు చెప్పేవి వినకండి, భయపెట్టే వాళ్లే ఎక్కువ, ధైర్యం చెప్పేవాళ్ళ కన్నా అన్నారు. ఆ విషయం నిజమని మాకూ తెలుసు, ఇష్టకామేశ్వరి విషయం లో కూడా అలాగే జరిగింది కదా. కాకపోతే వెంట వెంటనే రెండు పెద్ద ప్రయాణాలు మాకు. ఆ మరుసటి రోజు, గణపతి గారు అడిగిన అన్ని ఫోటోలు, పాస్ పోర్టులు, చెక్కులు, మా పర్సనల్ ఫోన్ నంబర్లు వగైరా ఇచ్చేసి వచ్చేశాము. పిల్లలకు కూడా చెప్పలేదు. సాధారణంగా వాళ్లకు చెప్పి, ఆ రోజుల్లో వాళ్లకు ఇబ్బంది లేదు అనుకున్నాకే యాత్రలు చేస్తూ ఉంటాం. ఈసారి మాత్రం అన్నీ అయిపోయాక వాళ్లకు ఫోన్ చేసి చెప్పాం. ఇద్దరూ వేరే దేశాల్లో వుంటారు మరి.
మే నెలాఖరులో కాబోలు, ఒకసారి ఇలా ఈ సంవత్సరం యాత్రకు వచ్చే వారందరికీ, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ రోజు శివునికి అభిషేకం చేసి, అందరికీ భోజనాలు పెట్టి, మాకు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్, మా సామాను సర్దుకోవడానికి ఒక పెద్ద బ్యాగ్, ఒక బ్యాక్ పాక్, ఒక పాస్ పోర్ట్ బ్యాగ్, హాట్, షాల్, ఇచ్చారు. ఇక నుంచీ యాత్రలో మా గ్రూప్ వారిని గుర్తించాలంటే, ఈ షాల్, ఈ బ్యాగులే ఆధారం అని కూడా చెప్పారు. అందరినీ పరిచయం చేశారు. షెడ్యూల్ వివరాలన్నీ ప్రింట్ చేసిన పేపర్ ఇచ్చారు. శుభం అనుకుని, కావాల్సిన చలి దుస్తులు, బూట్లు వగైరా కొనుక్కుని బయల్దేరాం. అందరం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నాం. అంతా కూడా చాలా ఎక్సయిటెడ్ గా వున్నాం. మొత్తం 75 మంది. మాలో కూడా ఒక ఏడెనిమిది మంది అంతకు ముందు కూడా వెళ్లిన వాళ్ళే. ఏ క్షణంలో గణపతిగారు మనం అందరం ఒక్క కుటుంబం లాగా ఉండాలి అన్నారో కానీ అది అక్షరాలా జరిగింది. అందరూ చదువుకున్నవారు, సహృదయులు, సంస్కారవంతులు ఆ యాత్ర అంతా ఆడుతూ పాడుతూ జరిగిపోయింది. ఎవ్వరికీ ఏ ఇబ్బంది వచ్చినా అందరూ ముందుకు వచ్చి సహాయం చేశారు. మేము కూడా మా డాక్టర్ కజిన్స్ ని సంప్రదించి మందులు తీసుకెళ్లాం. ఏ సింప్టమ్ వస్తే, ఏ మందులు వాడాలో రాయించుకుని, వీలైనన్ని మందులు పట్టుకెళ్లాం. నిజంగానే అక్కడ ఎవరి అవసరానికి ఏ మందు కావాలో, అది వాళ్ల దగ్గర ఉంటే చాలు పట్టుకొచ్చి ఇచ్చేసేవాళ్ళం. నేను నాకోసం నేర్చుకున్న ఆక్యుప్రెజర్ వైద్యం అవసరమైనప్పుడు చేశా. ఆ టూర్ లో నన్ను కొంతమంది డాక్టర్ గారూ అని కూడా పిలిచారు. సరదాగా తీసుకున్నా. కానైతే ఆ పిలుపు నాకు అలవాటే, ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ వుంది గదా మరి. మొత్తానికి లింగ రూపంలో వుండే శివుడిని కాకుండా, కొండ రూపంలో వుండే శివుడిని చూట్టానికి మా శివపరివారం అంతా బయల్దేరాం. ఆది శంకరుడు అంటాడు, బాంధవాః శివ భక్తాశ్చ, అని. మా శివ భక్తులైన బంధువులతో సందడి సందడిగా, ముందు ఢిల్లీకి, తరువాత ఖాట్మండుకు చేరుకున్నాం.
అసలు సిసలైన ప్రకృతి ఒడి లోకి మా ప్రయాణం మరోసారి ఆరంభమైయింది. ప్రకృతే అసలైన దైవం. ఈ కైలాస మానస సరోవరం యాత్ర వల్ల నేపాల్ ని మరోసారి చూడగలిగే అవకాశం వచ్చింది. రెండు రోజులు అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి అంటూ, లోకల్ గా వున్న గుళ్ళు, గోపురాలు, ఎవరెస్ట్ సందర్శనం అయ్యాక బయల్దేరాం నేపాల్ గంజ్ కి. వెళ్ళబోయేముందు ఒకసారి మళ్ళీ అభిషేక హోమాదులు చేసాం. నేపాల్ గంజ్ లో అందరినీ సగం సామాను మాత్రమే తీసుకుని సగం అక్కడ వదిలేయమన్నారు. ఎందుకంటే అక్కడినుంచీ, అన్నీ చిన్న చిన్న విమానాలు, హెలికాఫ్టర్లు. వాటిల్లో ఎక్కువ సామానుంటే అనుమతించరు. దానితో ఒక డఫెల్ బ్యాగ్, రెండు బ్యాక్ పాక్ లు, సరే, మా పాస్ పోర్ట్ బ్యాగులతో బయల్దేరాం. నేపాల్ గంజ్ నుంచి మొదట సిమికోట్ కి చేరాం. అక్కడ హోటల్ పేరు కూడా మానసరోవర్. సిమికోట్ లో అందరం కాస్త సత్సంగం చేసుకున్నాం. నన్ను మాట్లాడమంటే నేనూ భగవద్గీత గురించి మాట్లాడాను. గణపతి గారు, డా.అనంత రామమూర్తిగారు కూడా మాట్లాడారు. మొత్తానికి సిమికోట్ లో బాగా గడిచింది.
ఇక మొదలయ్యాయి ఇమిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళతో ఎదురుచూపుల తిప్పలు. బ్రిడ్జ్ దాటుతూనే ఒక చిన్న గుడిసె లాంటి గదిలో వాళ్ళు మా అందరి వివరాలు తీరికగా నమోదు చేసుకునే సరికి మాకు నీరసం వచ్చింది. కాస్త కిందికి దిగి కర్ణాళి నది నీళ్లు బాటిల్ లో పట్టుకుంటుంటే గణపతి గారు కేకలేశారు. ఇక్కడి నుంచి మీరు నేను చెప్తే గానీ ఎటూ వెళ్లొద్దు, వీళ్ళదంతా అదో తరహా, పట్టుకుంటే నేను కూడా ఏమీ చేయలేను అని. అమ్మో, నిజమే కదా, చిన్నప్పటి అనువుకాని చోట అధికులమనరాదు అనే పద్యం గుర్తొచ్చింది. చైనా వాళ్ల అధీనంలో వున్న టిబెట్ లో ఉన్నామనే
స్పృహ అప్పుడు కలిగింది. సరే ఆహా ఇమిగ్రేషన్ అయిపొయింది కదా పొలోమని మళ్ళీ బస్సులు ఎక్కాం. కానీ మళ్ళీ ఇంకో చోట, ఈ ఆఫీస్ కొత్తగా కట్టారుట, మళ్ళీ ఆపారు. అక్కడ విస్తృతమైన చెకింగ్ అవుతుందన్నారు. చాలా సేపు వెయిట్ చేయించారు, కుక్కలొచ్చి మా లగేజ్ నీ, మమ్మల్నీ వాసన చూసి వెళ్లాయి. వాళ్ళ సిబ్బంది వచ్చి మీ దగ్గర 'ఫోన్లున్నాయా' అని అడిగారు, 'లేవుగా' అన్నాం. మా ఫోన్లు మా కూలీలు వేరే తెచ్చి మళ్ళీ మాకు తరువాత ఇచ్చారు. ఆ తరువాత నంబర్ ప్రకారం లోపలికి పిలిచి అక్కడ మమ్మల్ని ఫోటో తీసుకుని కంప్యూటర్ లో మా వివరాలు అన్నీ మళ్ళీ ఒకసారి నమోదు చేసుకుని పంపించారు. అమ్మయ్య అనుకుంటుంటే, మళ్ళీ మరో ఆఫీస్ దగ్గర ఆపారు. ఇది పాత ఆఫీస్ ట, ఇక్కడ కూడా అదే ప్రహసనం మళ్ళీ జరగాలన్నారు. కానీ పాపం ఈ ఆఫీస్ వాళ్ళు మొత్తం మా 75 మంది వెరిఫికేషన్ అరగంటలో పూర్తి చేసి పొమ్మన్నారు. అలా ఇమిగ్రేషన్ ప్రక్రియ ముగిసింది. తక్కల్ కోట్ అనే చోటికి వచ్చి రూములు తీసుకున్నాం. అప్పుడు మా వాచీల ప్రకారం రాత్రి 8.30 గంటలు దాటితే, చైనా వాళ్ళ టైం ప్రకారం అప్పుడు రాత్రి 11 అయ్యింది. మనకూ వాళ్లకూ రెండున్నర గంటల తేడా. తెల్లవారి అక్కడినుంచి మానస సరోవరం చేరుకున్నాం.
ముందుగా దారిలో రక్కస్ తల్ అనే సరస్సు కనపడింది. అక్కడి నుంచే మాకు కైలాస పర్వత ప్రధమ దర్శనం జరిగింది. ఒక పడుకున్న సింహం తల లాగా ఆ పర్వతం దర్శనమిచ్చింది. ఈ రక్కస్ తల్, అనబడే రాక్షసతటాకం, రావణుడు తవ్వించాడనీ, ఆ నీళ్లు మంచివి కావనే ఒక నమ్మకం వుంది. మేమెవ్వరం ఆ సరస్సు దాకా పోలేదు. ఒడ్డు నుంచే ఫోటోలు తీసుకున్నాం. వెళ్లాలన్నా కూడా చాలా కిందకి దిగాలి. నీళ్లు, ఆకాశం ఏది ఎక్కువ గాఢమైన నీలం రంగులో ఉందో చెప్పటం కష్టం. కానీ ఈ సరస్సు కూడా స్వచ్ఛంగా నిర్మలంగా కనిపించింది. తరువాత బయల్దేరి మానససరోవరం చేరాం. అందరం ఎంతో ఎక్సయిటెడ్ గా వున్నాం. సరస్సు దర్శనం అయ్యింది. ఏనాడూ ఊహించని అరుదైన దర్శనం, చాలా ఉత్తేజం కలిగింది. కళ్ళు మూయాలంటే ఏమైనా మిస్ అయిపోతామేమోనని భయం, ఆత్రుత, ఆరాటం, ఆనందం. ముందు రూముల దగ్గరకు తీసుకు వెళ్లినా, వాళ్ళు మీరు ముందర సరోవర ప్రదక్షిణ చేసి రండి. ఈ లోపల రెడీ చేస్తాం అన్నారు, దాంతో మేము మానస సరోవర ప్రరిక్రమ మొదలుపెట్టాం బస్సుల్లో. సుమారు 90 కిమీ దూరం. చల్లటి చలిలో, ఒకవైపు హిమవత్ పర్వతాలు, మరో వైపు స్వచ్ఛంగా, నిర్మలంగా, నిశ్శబ్దంగా, నిలకడగా వున్న మానస సరోవరం. ఈ సంవత్సరం నుంచే ఆ సరస్సు లో స్నానాలని చైనా ప్రభుత్వం నిషేదించిందట. కానీ సడెన్ గా గణపతిగారు ఒక చోట బస్సులు ఆపించి అందర్నీ స్నానాలు చెయ్యమన్నారు. ఈ సంగతి సడెన్ గా తెలిసేసరికి మాలో సుమారు ఒక పది పదిహేనుమంది, మేం కూడా వున్నాం దాంట్లో, స్నానాలు చెయ్యలేక పోయాం. కానీ ఆ సమయంలో నేను అక్కడ నీళ్లు పట్టుకున్నా, రాళ్ళేరుకున్నా, మొహం, కాళ్ళు, చేతులు కడుక్కున్నా. ఆ సరస్సుని హాయిగా తిలకిస్తూ కూర్చున్నా. తిరిగి బస్సులో ఎక్కి మళ్ళీ ప్రదక్షిణ మొదలుపెట్టాం. బస్సులో నుంచే చాలా ఫోటోలు తీసా. దాంట్లో ఒక ఫోటో కాస్త ప్రత్యేకం. ఈ కైలాస పర్వతంలో సకల దేవతల చిత్రాలు కనిపిస్తాయని చెప్పారు. నాకు వైష్ణోదేవి దర్శనం అయ్యింది. కింద ఫోటో జత చేస్తున్నా, చూడండి. తిరిగి మానససరోవరం చేరుకున్నాక రూములు తీసుకున్నాం.
వెంటనే మాలాగా స్నానం చేయని వారందరం గబగబా సరస్సులో మునిగాం. కొంచం భయం వేసింది. మా గ్రూప్ లో వున్న మరో దంపతులు గాయత్రి, రాజు. వాళ్లిద్దరూ కూడా సునీత, లక్ష్మీనారాయణ గారి లాగానే మాపట్ల ఎంతో ప్రేమాదరాలతో వున్నారు. రాజు మా వారిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లి స్నానం చేయటానికి సాయం చేస్తే, నేను, మరొకరితో కలిసి సరస్సులో స్నానం చేశా. మళ్ళీ గబగబా బయటకు వచ్చేసి రూంలో బట్టలు మార్చుకుని బయటకు వచ్చేసేసరికి అక్కడ పూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ గణపతి గారు మేము అందరం తెచ్చిన హోమ ద్రవ్యాలతో హోమం అభిషేకం చేశారు. ఆ క్షణం అక్కడ పంచభూతాల దర్శనం ఏకకాలంలో అయ్యింది. లడ్డాఖ్ లో కూడా ఇలాగే పంచభూతాలని ఏకకాలంలో దర్శనం చేసాం. కింద మట్టి, ఎదురుగా సరస్సులో నీరు, చుట్టూ అంతా స్వచ్ఛమైన ఆకాశం, పర్వతాలు, సరస్సు మీద నుంచి వీచే చల్లని గాలి, ఆ పై ఎదురుగుండా హోమగుండంలో జ్వాజ్వల్యమానంగా వెలుగుతున్న హోమాగ్ని. పృథ్విరాపస్తేజోవాయురగ్నిః, ఆ పంచభూతాల మిశ్రమమే గదా మనం అందరం. లోపలా అదే, బయటా అదే, ఎదలో అదే, ఎదుటా అదే. అన్నీ కలిసి అసలు సిసలైన ప్రకృతి లోని దేవుడిని మాకు చూపించాయి. ఓం శ్రీ పంచభూతాయనమః.
ఇక్కడ ఈ కైలాస పర్వతం గురించి కొంచెం చెప్పాలి. చుట్టూ శిఖరాలపై మంచు ఉండదు, ఈ శిఖరం ఒక్కటీ మాత్రం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ శిఖరం పై రకరకాల దేవతా మూర్తుల ఆకృతులు కనిపిస్తాయి. కైలాసానికి దారిలాగా గేట్ వే లాగా కనిపిస్తుంది. చూడంగానే ఒక చక్కటి పిరమిడ్ లాగా కనిపిస్తుంది. మేరుప్రస్తారం వలెనే ఉంటుంది. మరి మన పురాణాల్లో చెప్పిన మేరుపర్వతం ఇదేనా అంటే, కాదు. ఎందువల్లనంటే, ఆ మేరు పర్వత శిఖరం చాలా ఎత్తైనది, దాని కన్నా పెద్ద పర్వతం లేదు. మరి ఈ కైలాసం అలా లేదు. ఈ శిఖరం కన్నా కూడా ఎత్తైన శిఖరాలు పక్కపక్కనే చాలా కనిపిస్తాయి అక్కడ. మొత్తం నాలుగు వైపులా, నాలుగు ముఖాలలో ఒక్కొక్క తీరుగా కనిపిస్తుంది. కానీ అందరికీ అక్కడ శివసాన్నిధ్య అనుభూతి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది, కలుగుతుంది. ఈ పర్వతానికి ప్రదక్షిణ చేయాలంటే మొత్తం 52 కిలోమీటర్లకీ మూడు రోజులు పడుతుందిట. మొదటిరోజు పరిక్రమలో అన్ని దేవతామూర్తుల ఆకృతులు కనబడుతూ చాలా అద్భుతంగా ఉంటుందిట. రెండవరోజు కష్టమైనా దారి, ఎగుడుదిగుళ్లు వుండి, ఎటువంటి వాళ్ళకైనా శివుడు కనబడతాడు. ఆ రోజు గుర్రాలు కూడా కొంతదూరం రాలేవు. గుర్రం ఎక్కిన వాళ్ళూ అక్కడ దిగి ఎక్కాల్సిందే. ఆ రెండవ రోజే శివుని కోసం తపస్సు చేసే సమయంలో హిమవత్ పర్వత రాజ పుత్రి పార్వతి, స్నానం చేసే గౌరీకుండ్ కూడా కనిపిస్తుంది. తమాషాగా ఈ నీరు ఆకుపచ్చ రంగులో వుంది. మూడవరోజు పరిక్రమ తేలిక అని చెప్పారు. ఈ పర్వతం బౌద్ధులకు, చైనీయులకు కూడా చాలా పవిత్రమైనది.
అప్పుడు మా టీమ్ కి కేటాయించిన చైనీస్ హెల్పర్, ఒక అమ్మాయి వచ్చి ఒక నోటిస్ ఇచ్చింది దాని ప్రకారం 60 ఏళ్ళు నిండిన ఎవరూ కైలాస పర్వత పరిక్రమ చేయటానికి వీల్లేదనేది సారాంశం. సరే, నేను, మావారు ఈ పరిక్రమ చెయ్యలేమనేది దాదాపు నిశ్చయమై పోయింది. ఏం చేస్తాం, ఇంతవరకూ చేసిందే మాకు చాలా గొప్ప. ముందు నుంచే ఈ పరిక్రమపై మేము ఎక్కువ ఆశ పెట్టుకోక పోవడంతో, మాకు ఈ విషయంలో గొప్ప నిరాశ అనిపించలేదు. కానీ ఇందువల్లే మా టీం నుంచి, ఆ రాత్రే కొంతమంది వెనక్కు వెళ్లిపోయారని, మర్నాడు పొద్దున్న తెలిసింది. ఆ రాత్రి మాకు, సునీత, లక్ష్మీనారాయణ లకు కలిపి ఒక గది కేటాయించారు. అర్ధరాత్రి లేచిన నాకు ఆకాశంలో నుంచి కాంతులు దిగుతూ కనిపించాయి. వెంటనే రూమ్ లో అందరినీ లేపేశా. దాంతో మేం నలుగురం ఆ కాంతులు చూశాం. చాలా ఆనందం కలిగింది. తృప్తిగా అనిపించింది. ఒక అరగంట సేపు ఆ కాంతులని చూసి తిరిగి నిద్ర పోయాం. మరునాడు అందరం దార్చేన్ అనే ప్రాంతానికి బయల్దేరాం. దారిలో మేమందరం యమద్వార్ అనే ప్లేస్ దగ్గర ఆగాము. అక్కడ నుంచే పరిక్రమకు వెళ్ళేవాళ్ళు వేరే బయల్దేరారు. నడిచేవాళ్ళు ఒక గ్రూప్ గా, గుర్రాలపై వెళ్ళే వాళ్ళు ఒక గ్రూప్ గా బయల్దేరారు. మిగిలిన వాళ్ళం ఆ యమద్వార్ వరకూ వెళ్లాం. అసలు కొన్నాళ్ల క్రితం వరకు, అందరూ ఈ యమద్వార్ వరకు మాత్రమే వెళ్ళేవాళ్ళు. పర్వత పరిక్రమకు చాలా కాలం అనుమతి లేదు. ఆ రోజుల్లో ఈ యమద్వార్ అందరికీ ఒక హద్దు. మేము కనీసం అంతవరకూ వెళ్లగలిగామన్న తృప్తి కలిగింది. ఈ యమద్వార్ ఒక చిన్న పగోడా కట్టడం. రెండు వైపులా ద్వారాలు ఉంటాయి. అందరూ ఒక ద్వారంలో నుంచి వెళ్లి మరొక ద్వారంలో నుంచి బయటకు రావాలి. అక్కడ అందర్నీ ఒక నూలుపోగు వదిలేయమన్నారు. అలాగే చేసాం. ఈ యమద్వార్ లో ఈ విధంగా చేసిన వారికి యమబాధ ఉండదనీ, ఒక జన్మ దాటుతుందనీ చెప్పారు. మేము ఈ రకంగా సప్త మోక్షపురులలో చేసిన యాత్రల వలనా, అందునా కాశీ, కాంచీ, హరిద్వార్ లలో 4, 3, 2 సార్లు యాత్ర చేసినందువల్లా, ఇప్పుడీ యమద్వార్ దర్శనం వల్ల నేను, మావారు బహుశా ఓ పది జన్మలు జంప్ చేసేసి ఉంటాం కదా అనిపించింది. ఈ యమద్వార్ నుంచి కైలాసపర్వతం చాలా దగ్గరగా కనిపిస్తుంది. మొత్తం మీద కైలాసపర్వత పరిక్రమ చేయలేక పోయినా దాదాపు 75% పర్వత దర్శనం జరిగింది.
తిరిగి మిగిలిన అందరం దార్చేన్ చేరుకొని రూములు తీసుకున్నాం. మావారికి ఏదో తేడా చేసి కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యింది. రెండో రోజుకి అంతా సద్దుకుంది. ఈ లోపల పరిక్రమకు వెళ్లిన వారు, రెండో రోజు అక్కడ హోటల్ వసతి దొరకక పోవడంతో, మూడోరోజు పరిక్రమను కూడా ఆ రోజే పూర్తి చేసుకుని జీపుల్లో తిరిగొచ్చారు. దాంతో మూడోరోజే అందరం తిరిగి మానససరోవరం చేరుకున్నాం. మా షెడ్యూల్ ఇంతవరకూ చక్కగా జరిగింది, కానీ షెడ్యూల్ దెబ్బతినటం ఇక్కడి నుంచే ప్రారంభం అయ్యింది. షెడ్యూల్ ప్రకారం మేము మానససరోవరంలో ఈ రాత్రి వుండి జాగరణ చేసి ఆ డివైన్ కాంతులు చూడాలి. అందుకే చాలామంది మొదటిసారి ఆగినప్పుడు ఆ కాంతులను చూడలేదు. మాలాంటి కొద్దిమంది మాత్రం చాలా యాదృచ్ఛికంగా చూసాం, అంతే. మాకు ఈసారి రూములు లేవు, పొమ్మన్నారు. కానీ మా గణపతి గారు ఏదో చెప్పి ఒక పెద్ద హాల్ లాంటిది తీసుకుని వెంటనే అక్కడే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, శివ పార్వతీ కళ్యాణం చేశారు. పురోహిత్ హరికుమార్ గారు ఈ తతంగమంతా చాలా చక్కగా జరిపారు. అప్పుడే మాలో కొందరు, నేను కూడా, లక్షవత్తి దీపాలను ఆ మానససరోవరం ఒడ్డున వెలిగించుకుని ఆనందపడ్డాం. చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు ఆ మానససరోవరానికీ, కైలాసపర్వతానికీ నమస్కరించుకుని, మా పూజల తరువాత అందరం బయల్దేరాం. ఆరాత్రి అక్కడ వుండలేక పోయామే అని అందరి మనస్సులో ఒక రకమైన నిరాశ. ఏది ఎంత ప్రాప్తమో, అంతే కదా దక్కేది. చేసేదేమీ లేక సమాధానపడి బయల్దేరాం.
ఆ రాత్రి మాకు తక్కల్ కోట్ లో కూడా రూములు దొరకక ఇంకొంచెం పైకి వెళ్లి పూరంగ్ లో రూములు తీసుకున్నాం. ఆ రాత్రికి అక్కడ పడుకుని, తిరిగి ఇమిగ్రేషన్ పనులు పూర్తి చేసుకుని హిల్సా చేరుకున్నాం. కిందటిసారి చైనా వాళ్ళు ఆలస్యం చేస్తే, ఈసారి నేపాల్ వాళ్ళు ఈ ఇమిగ్రేషన్ కార్యక్రమం చాలాసేపు చేశారు. దాంతో ఆ రాత్రి అందరం హిల్సా నుంచి సిమికోట్ చేరుకోలేక పోయాం. కొద్దిమంది మాత్రమే సిమికోట్ చేరాం. మిగిలిన వాళ్ళు మరునాడు వచ్చారు. అప్పటికే వాతావరణం పాడవటం ప్రారంభం అయ్యింది. అదృష్టవశాత్తూ రెండోరోజు కల్లా మేమందరం సిమికోట్ కి చేరాం. రకరకాల కారణాలతో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్లిపోగా మిగిలింది 60 మంది. మేము అక్కడ ఆరు రోజులు ఆగిపోవాల్సి వచ్చింది. హెలికాఫ్టర్లు ఫ్లై అవటం లేదనే బెంగ తప్పితే, అంతా బాగానే వున్నాం. మేము అక్కడి నుంచి నేపాల్ గంజ్ వెళ్లి అక్కడి నుంచి ముక్తినాథ్ వెళ్లాల్సి వుంది. గణపతి గారు ముక్తినాథ్ కి ఇదే చివరి అవకాశం, ఇప్పుడైనా డబ్బులు కట్టేవాళ్ళుంటే కట్టమన్నారు. కొంతమంది కట్టారు. ఆ తరువాత వాతావరణం ఇంకా పాడైంది. గణపతి గారి ఫామిలీ రీయూనియన్ ఒకటి నాలుగు రోజుల తరువాత సింగపూర్ లో వుంది. దానితో ఆ భార్యా, భర్తా, కొడుకు ముగ్గురికీ కొంచెం ఆరాటం మొదలయింది. మామూలుగా జరిగిపోతే, మేమంతా ముక్తినాథ్, మనోకామనా, పోఖ్రా, పశుపతినాథ్ చూసుకుని హైదరాబాద్ వెనక్కు చేరిపోయేవాళ్ళం. ఈ ఆరు రోజుల వల్ల మొత్తం షెడ్యూల్ పాడైంది. కాకపోతే ఈ ఆరు రోజుల కాలంలో మేమందరం ఇంకా దగ్గరయ్యాము. ఒకరోజు ఆడవాళ్ళం అంతా బతుకమ్మ కూడా ఆడుకున్నాం. ఒకరోజు కనకదుర్గగారు అందరికీ యోగా నేర్పారు. రకరకాల ఆటలు, పాటలు, మాటలు, వీటిల్తో రోజులు గడిచిపోతున్నాయి. తరువాత హెలికాఫ్టర్లు ఎగిరిన మొదటిరోజు బాధ్యత నంతా సంతోష్ పైన వేసి గణపతిగారు, తన కుటుంబంతో సహా ఒక హెలికాఫ్టర్ లో వెళ్లిపోయారు. దాంతో అందరికీ షాక్ తగిలింది.
దాంతో అందరం ఒక్కసారి ఉలిక్కి పడ్డాం. తెలియని ప్రాంతంలో ఒంటరి అన్న ఫీల్ మొదలైంది. ఎవరికి తెలిసిన సోర్స్ ద్వారా వాళ్ళు భారతదేశం ఫారిన్ మినిస్ట్రీకి సందేశాలు పంపించాం. చివరికి ఆరో రోజున పొద్దున్నించీ కొద్ధి కొద్ధి మందిని పంపించటం మొదలైంది. మా ఇద్దరితో పాటు గాయత్రి, కిరణ్ అని కనకదుర్గ గారి అబ్బాయి, పాపం అతను ఆ రోజే ఆస్ట్రేలియా వెళ్ళాలి కూడాను, మిలటరీ హెలికాఫ్టర్ లో నేపాల్ గంజ్ చేరుకున్నాం. అది కూడా నేపాల్ గంజ్ లో వాతావరణం బాగాలేదని ఒక 30, 40 కిమీ దూరంలో వున్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో దింపింది. ఈ లోపల ఇంకో రెండు మూడు హెలీకాఫ్టర్లలో మరి కొంతమంది వచ్చారు. అందరం బయటకు వచ్చాక ఒక డొక్కాతిడొక్కు బస్సులో, (ఈ పద ప్రయోగం తప్పు, కానీ మరో పదం దొరకలేదు, బాగా అర్ధం అవుతుందని ఈ డొక్కాతిడొక్కు అనే పదం రాశాను) ఒక చెడ్డాతిచెడ్డ రోడ్డులో ప్రయాణం చేసి మేము మొదటిసారి దిగిన హోటల్ కి వచ్చి చేరాం. రాత్రి లోపల ఆరుగురు తప్ప అంతా వచ్చేశారు. వాళ్లలో సునీతా, లక్ష్మీనారాయణ తో పాటు పాపం సంతోష్ కూడా వున్నాడు. మరుసటి రోజున వాళ్ళని మిలటరీ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి, మరీ ఎక్కించుకుని నేపాల్ గంజ్ లో దింపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రత్యేకంగా వాళ్లకి మెసేజ్ పంపించారట. ఎవరి పుణ్యమైతే ఏం కానీ మొత్తానికి అందరం తిరిగి ఒక్కచోట చేరాం. మిగిలిన అందరం, అప్పటికి యాభై మంది, నేపాల్ గంజ్ హోటల్లో కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. మాలో 22 మంది ముక్తినాథ్ వెళ్ళటానికి సిద్ధం అయ్యాము. మిగిలిన మాలాంటి 28 మంది హైదరాబాద్ తిరిగి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాం. ఎందుకంటే ఫ్లయిట్లు లేవు. నిన్న వచ్చిన లాంటి రోడ్లలో ఇంకా హై ఆల్టిట్యుడ్ కి వెళ్లాలి. గణపతిగారు వెళ్ళాక ఒక్క సౌకర్యం కూడా సరిగ్గా జరగలేదు, పాపం సంతోష్ ఎంతో ప్రయత్నం చేసాడు, అయినా సరే, మా కోసమే మాట్లాడి పెట్టిన హెలికాఫ్టర్లు కూడా వేరే వాళ్లను ఎక్కించుకుని వెళ్లిపోయాయి. ఇంకా సాహసాలొద్దు అనుకున్నాం. మా పిల్లలు కూడా ఇప్పటికే మిలటరీ వాళ్ళు వస్తేనే కానీ దిక్కు లేదు, కొత్తగా ఎక్కడికీ వద్దు, వెనక్కు వచ్చేయండి అన్నారు. గణపతి గారు ఉన్నప్పటికీ, లేనప్పటికీ తేడా కూడా స్పష్టంగా తెలిసింది. ఇక ఈ యాత్ర చాలు అనిపించి ముక్తినాథ్ కి రాలేమని చెప్పేశాం.
చివరికి ఆ మరునాడు పొద్దున్న మా 28 మంది బస్సెక్కి లక్నో చేరుకున్నాం. మా ఫ్లైట్ మాత్రం ఏదో టెక్నీకల్ ప్రాబ్లమ్ ట. కాన్సల్ చేశారు. ఒక పదిమందికి మాత్రం, వాళ్ళ ఫ్లయిట్ కాన్సల్ కాలేదు, వెళ్లిపోయారు. ఎంతో రిక్వెస్ట్ చేస్తే, మా 20 మందిలో పదిమందికి హోటల్ ఇచ్చి నెక్స్ట్ డే వయా బెంగుళూరు, హైదరాబాద్ కి, మాకు వయా ఢిల్లీ, హైదరాబాద్ కి టిక్కెట్లు ఇచ్చారు. చివరికి మరునాడు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరాం. మా గొప్ప యాత్ర, సాహస యాత్ర, ఆధ్యాత్మిక యాత్ర, ఖరీదైన యాత్ర ఆవిధంగా ముగిసింది. ముక్తినాథుణ్ణి చూడలేకపోయాం, పశుపతి నాథుడికి అభిషేకాలు చేయించుకోలేక పోయాం, మనోకామనా అమ్మవారిని, వారాహి అమ్మవారిని చూడలేకపోయాం అన్న దిగులుంది. కానీ ఎవరెస్ట్ శిఖరం చూసాం, కైలాసపర్వతాన్ని చూసాం, మానససరోవరంలో స్నానం చేసాం, యమద్వార్ వెళ్లి వచ్చాం, గుహ్యేశ్వరి, బాగేశ్వరి అమ్మవార్ల ఆలయాలు చూసాం. ఈ తృప్తి, చాలు, అనిపించింది. చూద్దాం, ముక్తినాథుడు పిలిస్తే ఈసారి మళ్ళీ వెళ్ళొచ్చేమో. మనిషి ఎప్పుడూ ఆశాజీవే కదా.
ఓం శ్రీ కైలాసనాథాయనమః, ఓం శ్రీ మానస సరోవరాయ నమః,
ఓం శ్రీ యమద్వారాయనమః
ఇంతటితో ఈ కైలాస మానస సరోవర యాత్ర ముగిసింది. తరువాత మధ్యప్రదేశ్ లో మేము చూసిన శివక్షేత్రాలు, మాహేశ్వర్, అమరకంటక్, భోజేశ్వర్, ఖజురహో క్షేత్రాల గురించి చెప్పుకుందాం.
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి