మాహేశ్వర్-భోజేశ్వర్
మాహేశ్వర్-భోజేశ్వర్
మాహేశ్వర్ మేము 2014 లో మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల యాత్రకి వెళ్ళినప్పుడు చూసాం. మాహేశ్వర్ పేరు వినంగానే వెంటనే గుర్తొచ్చేది ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్. ఇండోర్ రాజ్యమైనప్పటికీ ఆమె మాహేశ్వర్ నే రాజధానిగా చేసుకుని రాజ్యం చేసింది. 8 ఏళ్ళ చిన్న వయసులో పెళ్లి చేసుకుని ఈ మాహిష్మతీ నగరానికి వచ్చింది. మాహేశ్వర్ పూర్వనామం మాహిష్మతి. నర్మదానది ఒడ్డునే ఒక పెద్ద మహల్ కట్టించుకుని నిత్యం నర్మదానదీ స్నానం చేస్తూ ఉండేది. గొప్ప శివ భక్తురాలు. నిత్యం చేతిలో ఒక శివలింగం ధరించి ఉండేది. భర్త చనిపోయాక ఆనాటి ఆచారాల ప్రకారం సహగమనం చేద్దామనుకుంది. కానీ మామగారు ఈ రాజ్యానికి ఆమె అవసరం ఉందనీ, పిల్లలు చిన్నవాళ్ళనీ, తానూ వృద్ధుడనయి పోయాననీ చెప్పి వారించాడు.
ఒక్క కొడుకు పుట్టినా ఎక్కువ రోజులు బతకలేదు. దాంతో తానే పట్టాభిషేకం చేసుకోవాల్సి వచ్చింది. కూతురు, కొడుకు కూడా ఎక్కువ కలం బతకలేదు. భర్త పోతే ఆ కూతురు కూడా సహగమనం చేసింది. అత్తగారు, మామగారు కూడా పరమపదించారు. ఒంటరిగా రాజ్యభారం వహించి ప్రజలను కన్నబిడ్డల వలె పాలించింది. రాజవంశంలో చనిపోయిన వారందరి పేరునా నర్మదానది ఒడ్డున ఛత్రీలు కట్టించింది. ఛత్రీ అంటే, ఒక భవ్యమైన శివాలయం, వాళ్ల విగ్రహం, ఆ గర్భగుడి ముందు జనం సేద దీరటానికి వీలుగా ఎండా వానల నుంచి రక్షిస్తూ ఒక పెద్ద ముఖమంటపం. అక్కడే బీదా బిక్కీ కూర్చుని, పడుకుని కనిపించారు. కానీ ఎవరూ ఎక్కడా అశుభ్రం చేయలేదు. చక్కగా వుంది వసతి. అహల్య తదనంతరం కూడా అహల్యేశ్వర్ మందిరం కట్టించారు అక్కడ. ఈ ఛత్రీలు మనకి ఇండోర్ లో కూడా కనపడతాయి.
రాణీ అహల్యాబాయి తన జీవితకాలంలో మొత్తం భారతదేశంలో ఓ ముప్ఫయి దాకా పురాతన ఆలయాలను పునరుద్ధరించింది. వాటిల్లో, కాశీ, సోమనాథ్, వైద్యనాథ్, కేదార్నాథ్, బదరీనాథ్ వంటి మహోత్కృష్టమైన ఆలయాలు కూడా వున్నాయి. తాను రాణీ అయినప్పటికీ వితంతువు కనుక తెల్లచీరలే ఎల్లప్పుడూ ధరించేది. తెల్లచీరలో, చేతిలో శివలింగంతోనే, ఆమె గద్దె మీద కూర్చుని రాజ్యం చేసింది. తన రాజ్యంలో 111000 మంది ప్రజలుంటే, మనిషికి ఒక్కటి చొప్పున మట్టితో పార్థివలింగాలను చేయించి వాటికి 111 మంది బ్రాహ్మణులతో నిత్యం సహస్రలింగ అభిషేకం చేయించి, తిరిగి ఆ లింగాలను నర్మదానదిలో నిమజ్జనం చేయించేది. ఆవిడ తన రాజ్యంలో వున్న ప్రతి ఒక్కరి తరపున ఈ అభిషేకాలు చేయించేది. ఎన్ని రాజ్యాలు లేవు, ఎంతమంది రాజులు, రాణులు లేరు, ప్రజలందరి తరఫునా ఎవరిలా అభిషేకాలు చేయించారు. ఆమె ప్రాతః స్మరణీయ. ఏమిటా మాహేశ్వర్ గురించి చెప్తానని అహల్య గురించి చెపుతున్నారంటే, ఏం చెప్పను, మాహేశ్వర్ అనే పేరు తలచుకోంగానే నాకు మాత్రం ఎప్పుడూ వెంటనే ఆవిడే గుర్తొస్తారు. ఆమెను తలచుకోంగానే వెనువెంటనే ఆవిడ చేసిన మహత్కార్యాలు గుర్తొస్తాయి. ఓం అహల్యాబాయినే నమః.
ఊళ్లోకి అడుగు పెట్టంగానే కనిపించేది అహల్యాబాయి గారి నగరానికి స్వాగతం అనే బోర్డు. అచ్చం ఇట్లాగే ధారానగరంలో కూడా 'రాజా భోజ్ కీ నగరీ మే ఆప్ కా స్వాగత్ హై' అనే బోర్డు కనిపించింది. కానీ ఆ వూళ్ళో భోజుడు ఆ బోర్డు మీద తప్ప ఎక్కడా లేడు. అందరూ మహమ్మదీయులే కనిపించారు. వాళ్లకి భోజుడూ తెలియదు, కాళిదాసూ తెలియదు. చాలా బాధ వేసింది. కళ్లనీళ్లు తిరిగాయి. కానీ మాహేశ్వర్ లో అలా కాదు. అహల్యాబాయి అణువణువునా కనిపించింది. ఇక్కడా బాధ కలిగిన విషయం ఒకటుంది, చివర్లో చెప్తాను. మొదట చూసింది రాజరాజేశ్వరమందిరం. దీన్నే సహస్రార్జున మందిరం అని కూడా అంటారు. సహస్రార్జునుడు అంటే, కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి ఓడించి ఈ గుడిలో తెచ్చి కట్టేసాడట. అప్పుడు రావణుడికి శిక్షగా అతని పది తలల మీదా పది, చేతిలో ఒకటి దీపం పెట్టి కదలకుండా ఆరిపోకుండా నుంచోమన్నాట్ట. పాపం రావణుడు. ఆ గుర్తుగా ఆ నాటి నుంచీ ఈ రోజుకీ ఆ 11 దీపాలూ అఖండంగా వెలుగుతూనే వున్నాయి. ఆ దీపాలకు నెయ్యి దానం చెయ్యమన్నారు. డబ్బులు కట్టాం. అక్కడ ఒక మఠం నడుస్తోంది. ఆ పెద్దాయన ఈ వివరాలన్నీ చాలాసేపు చెప్పి అందరికీ కూడా చెప్పండి అన్నాడు. అది ఈనాటికి ఈ విధంగా కుదురుతోంది. ఇక్కడ ప్రధాన దేవుడు రాజరాజేశ్వరుడు. ఈ వూళ్ళో అన్ని ఆలయాల్లో పూజా పునస్కారాలు అమోఘంగా జరుగుతున్నాయి. సంతోషమేసింది. అక్కడినుంచి లక్ష్మీ నారాయణ మందిరానికి వెళ్ళాం. ఆ వూళ్ళో వున్న ఏకైక విష్ణు ఆలయం అది.
ఆ తరువాత చూసింది కాశీ విశ్వనాథ మందిరాన్ని. అక్కడ పెద్ద పెద్ద దీప స్థంభాలున్నాయి. ఆ దీపస్తంభాలు అహల్యాబాయి గుర్తు, లోగో లాగా అన్నమాట. అటువంటి దీపస్తంభాలను ఎక్కడ చూసినా అవి ఆవిడ కట్టించినవే. విశ్వనాథ మందిరం మెట్లు చాలా పెద్దవి. మన ఇప్పటి రెండు, మూడు మెట్లతో సమానం. అలాగే ఆయాసపడుతూ ఎక్కాం. మధ్యాన్నం వేళ కదా, పూజారి లేడు, కానీ దేవుడి దర్శనం మాత్రం అయ్యింది. అక్కడి నుంచి రాజవాడా వెళ్ళాం. అక్కడ ఆ సహస్ర లింగాభిషేకం చేసే హాలు, రాణీ గారు కూర్చునే గద్దే, దేవుడిని ఊరేగించే బంగరు పల్లకీ, ఆవిడ నిత్యం పూజ చేసుకునే బంగారు శివలింగం కనిపించాయి. ఫోటోలు అక్కడ తీసుకోనివ్వలేదు. ఈ రోజుకీ ఒక 11 మంది బ్రాహ్మణులతో 11000 పార్థివ లింగాలు చేయించి నిత్య అభిషేకం, నిత్య నర్మదా నిమజ్జనం జరుగుతూనే వున్నాయి. ఒక ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఇవి అన్నీ జరుగుతున్నాయని చెప్పారు. ఆ రోజు అభిషేకం చేసిన లింగాలను చూసాం. సాయంత్రం నిమజ్జనం చేస్తారుట. నమస్కరించుకుని వచ్చేసాం. తరువాత ఆ పక్కనే వున్న మగ్గాల దగ్గరకు వెళ్లాం. ఈ వూరిలో ప్రజలకు ఆదాయవనరుగా వుండాలని అహల్యాబాయి ఒక ప్రత్యేకమైన శైలితో మాహేశ్వరీ చీరలు, ఇతర వస్త్రాలు నేయించే పరిశ్రమ ప్రారంభించిందట. ఆ పని ఈ రోజుకీ చాలా మందికి జీవనాధారం. కానీ ఆ చీరలు, నేతవీ, పట్టువీ కూడా చాలా ఖరీదు. పదివేలకు తక్కువ ఏమీ కనిపించలా. నేనూ ఆ ధరలకు దడుచుకుని కొనుక్కోలా. అసలు ఈ కోటలో, గుళ్ళల్లో ఎక్కడ చూసినా వందల సంఖ్యలో పెద్ద పెద్ద మెట్లు. ఓపిక అయిపోయేది ఒక్కో కట్టడం చూడగానే. ఇంకా చిన్నప్పుడే రావాల్సింది. కానీ అప్పటి బాధలు అప్పటివి. ఆయనకీ బ్యాంక్, నాకు కాలేజ్, పిల్లలకు చదువులు, ఇన్నింటి మధ్యలో అందరికీ వీలయి వెళ్లి చూడాలి. అలా చూసినవి కూడా చాలానే వున్నాయి కానీ, ఈ మాహేశ్వర్ వంతు ఇప్పటికి వచ్చిందంతే. మధ్యప్రదేశ్ లో పంచ్ మఢీ వెళ్ళినప్పుడు గైడ్ అదే అన్నాడు. మీరు ఓ పదేళ్లు ముందర రావాల్సిందని. అక్కడకూడా ఆ పాంచ్ మఢీ చూడ్డం కోసం అంత పైకి ఎక్కలేక పోయాం. కిందనుంచే చూసాం. తిరుగుతూనే వున్నామయ్యా, ఇన్నాళ్ళకి ఈ వూరు టర్న్ వచ్చింది అంతే, అంటే, ఆ గైడ్ నవ్వాడు. సరే, మనం మళ్ళీ మాహేశ్వర్ వచ్చేద్దాం.
ఆ తరువాత నర్మదానది ఘాట్ ల దగ్గరకు వచ్చాం. పొడవాటి పడవలు, దాల్ లేక్ లోని షికారాల్లాగా పైన కవర్, బాగున్నాయి చూడ్డానికి. పెద్దపడవలు. పది మంది కూర్చోవచ్చు. మేమిద్దరం, మరో ముగ్గురు కూడా మేమూ వస్తాం అన్నారు. తోడుంటుందని రమ్మన్నాం. సుమారు ఒక గంట సేపు ఆ నదిలో తిప్పాడు. అన్ని ఘాట్లూ చూపించాడు. నది మధ్యలో ఒక గుడి వుంది. పూర్తిగా నీళ్ల మధ్యలో వుంది. దిగుతానంటే దగ్గరకు తీసుకెళ్తానన్నాడు. ఆమ్మో, ఇక్కడ దిగటం ఎలా అని వద్దన్నాం. మళ్ళీ వెనక్కి తిప్పి తీసుకొచ్చాడు. మొత్తం మాహేశ్వర్ యాత్రలో కూర్చుంది ఈ బోట్ లో మాత్రమే, అంతా తిరగటం, ఎక్కటం, దిగటం. నెమ్మదిగా బోట్ దిగి మళ్ళీ అన్ని మెట్లూ ఎక్కి పైకి వచ్చాం. అక్కడి నుంచి ఇండోర్ వెళ్లాం. ఇండోర్ లో హోల్కర్ రాజుల అసలైన మహా భవ్యమైన రాజవాడా వుంది. బైట పెద్ద పెద్ద ఏనుగులు, అంబారీ పై దేవీ దేవతల విగ్రహాలు. ఎంత పెద్దవంటే, ఫోటో తీయాలంటే రోడ్డుకి అవతలి వైపుకి వెళ్లి తీయాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడ ఒక శివాలయం, ఆ శివుడి ఎదురుగా చేతిలో శివలింగంతో రాణీ అహల్యాబాయి. ఆ పక్కనే కొద్ది దూరంలో మార్తాండాలయం, రామాలయం. అన్నీ ఎంత వైభవంగా, కన్నులపండుగగా ఉన్నాయో.
కానీ ఒక దుఃఖం కలిగించే విషయం వుందన్నానే, అదేమిటంటే, అహల్యాబాయి తదనంతరం తన హోల్కర్ వంశస్తుడైన సుబేదార్ తూకోజీ రావు గద్దెనెక్కాడు. అప్పటినుంచీ అతని వారసులే ఆ రాజ్యానికి రాజులు. చివరి రాజు యశ్వంత్ రావు హోల్కర్-2 కూడా 1961 లో చనిపోయాడు. ఈ లోపల రాజ్యాలు పోయాయి. వీళ్ళు రాజ్ ప్రముఖ్ లు అయ్యారు. అతని కొడుకు అమెరికాలో చదువుకుని అక్కడి వనితనే పెళ్లి చేసుకుని క్రిస్టియన్ గా మారి పిల్లలను క్రిస్టియన్ గానే పెంచాడు. ప్రస్తుత వారసుడు రిచర్డ్ హోల్కర్. అతని కొడుకు మళ్ళీ యశ్వంత్ హోల్కర్-3. ఏ సనాతన ధర్మాన్ని రక్షించటానికి, పునరుద్ధరించటానికి ఆమె జీవితమంతా ఇష్టంగా కష్టపడిందో, ఆ ధర్మంలో ఆమె వారసులు ఈనాడు లేరు. నిత్యం శివలింగం చేతిలో ఉంచుకుని జీవించిన అహల్యాబాయి వారసులు ఇప్పుడు చేతిలో బైబిల్ పట్టుకుంటున్నారు. ప్రస్తుతం వారసుడు ఆ భవనాలను అందరు రాజుల్లాగే హోటల్ కి లీజ్ కి ఇచ్చాడు. ఎందుకో తెలియదు కానీ కడుపులో ఏదో తెలియని బాధ. ఏదో ఖాళీతనం. అంతే.
తరువాత భోజ్ పూర్ లోని భోజేశ్వర్ మందిరం గురించి చెప్పుకుందాం. ఇది భీమ్ బేత్కా కి దగ్గర. మధ్యప్రదేశ్ లోని భీమ్ బేత్కా గుహలలో సుమారు పదివేల ఏళ్ళ క్రితపు రాతిపై పెయింట్ చేసిన చిత్రాలున్నాయి. అవి చూసి ఆ తరువాత ఈ ఆలయానికి వచ్చాం. దానికి కొద్ధి దూరంలో వున్నది ఈ భోజేశ్వర్ మందిరం. భోజరాజ పరమార్ కట్టించాడని పేరు. ఎందుకో ఒక అద్భుతమైన ఆలయం సగం కట్టి ఆపేసారు. కొంతమంది ఇది భోజమహారాజు కాదు, కుంతీదేవి తండ్రి అయిన కుంతిభోజుడు కట్టించాడని అంటారు. అతి పెద్ద శివలింగం. దాదాపు ఏడెనిమిది అడుగుల లింగం. మంచి పాలిష్ తో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. చిన్న ప్లేస్ లో పెద్ద ఆలయం. కేవలం గర్భగుడి మాత్రం కట్టి ఆపేసారు. ముఖద్వారం దగ్గర స్తంభాల్లో కొన్ని శిల్పాలు కనిపిస్తాయి. లోపల మొత్తం భారాన్ని మోస్తూ చక్కని పనితనంతో, శిల్పంతో నాలుగు స్తంభాలుంటాయి. పైన గోపురం కూడా సగంలో ఆపేస్తే శివుడికి పైన ఆఛ్ఛాదన లేదని, ఎవరో ఫైబర్ గ్లాస్ తో మూశారు. ప్రస్తుతం ASI వాళ్ళ అధీనంలో వుంది ఈ ఆలయం. ఎత్తు ఎత్తు మెట్లు ఈ రోజుల్లో ఎవరూ ఎక్కలేరని మామూలు మన సైజుకి వేరే మెట్లు పెట్టారు. ముందు మూడు చిన్న చిన్న మండపాలు కూడా వున్నాయి. వాటిల్లో సాధువులు కూర్చుని గంజాయి పీలుస్తున్నారు. చాలా మంది పర్యాటకులు వస్తున్నారు. ఇక్కడ ఒక విశేషమేమంటే, గుడి వెనుక భాగంలో రాళ్లు ఎత్తటానికి ఒక రాంప్ కట్టారు. గుడి ముందర రాతిపై మొత్తం గుడి నమూనా, శిఖరం, లింగం, స్తంభాలు, వీటన్నింటి కొలతలు చూపిస్తూ ఒక నమూనా రేఖాచిత్రం, బ్లూ ప్రింట్ లాగా ప్లాన్ మొత్తం అంతా గీసి వుంది. సుమారు పదో శతాబ్దానిదని తెలిసింది. పూజలు జరుగుతున్నాయి. పానవట్టం దగ్గర మనం నించుంటే మొదటి మలుపు దగ్గరకు కూడా రాము, అంత పెద్దది ఈ లింగం. ఇదీ ఈ భోజేశ్వరాలయం విశేషాలు.
ఇంతటితో ఈ రెండు ప్రాంతాలు, మహేశ్వర్, భోజేశ్వర్ గురించి ముగిస్తాను. తరువాత అమరకంటక్, ఖజురహో ఆలయాల గురించి చెప్పకుందాం.
ఓం రాజరాజేశ్వరాయనమః, ఓం కాశీ విశ్వనాథాయనమః
ఓం అహల్యేశ్వరాయనమః, ఓం భోజేశ్వరాయనమః
ఓం అహల్యాబాయినేనమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Chaalaa baagundi description kallaki addinattugaa.
రిప్లయితొలగించండిచాలా బాగా వివరించారు ఫోటోలతో సహా చూస్తున్నట్టే ఉంది ముఖ్యంగా రాణి అహల్యా బాయి గురించి కొత్త విషయాలు చెప్పారు
రిప్లయితొలగించండి