మద్రాసు-మహాబలిపురం-పక్షితీర్ధం

మద్రాసు-మహాబలిపురం-పక్షితీర్ధం  

మద్రాస్ మహానగరం ఎప్పటినుంచో మన భారతదేశంలో వున్న మహానగరాల్లో ఒకటి. సుమారు వంద, రెండు వందల ఏళ్ళ క్రితం, పట్నం అంటే చెన్నపట్నం ఒక్కటే. రంగం అంటే రంగూన్, పట్నం అంటే చెన్నపట్నం. ఆ చెన్నపట్నమే మధ్యలో మద్రాస్ అయి, ఇపుడు చెన్నై అయ్యింది. యుగాల క్రితం నాటి పట్టణం ఇది. ఇక్కడ హరిహరులిద్దరూ ఏనాటి నుంచో వెలిసి వున్నారు. ట్రిప్లికేన్ అని పిలువబడే తిరువళ్ళికేణిలో పార్థసారథి, మైలాపూర్ అని పిలువబడే మాయిలైలో వెలసిన కపాలి అనే పేరుతో కొలువైన కపాలీశ్వరుడు. రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడి శివుడిని పూజించుకుని వెళ్ళాడని చెప్తారు. అలాగే బలి వామనుడికి దానం ఇచ్చే ప్రక్రియలో కన్ను పోగొట్టుకున్న శుక్రాచార్యుడికి కూడా, ఇక్కడి శివుడిని పూజించాకే ఆ కన్ను మళ్ళీ వచ్చింది అంటారు. ఈ విధంగా ఈ కపాలీశ్వరుని చరిత్ర యుగయుగాల నుంచీ పురాణాలలో కనపడుతుంది. ట్రిప్లికేన్ పార్థసారథి గురించి వైష్ణవ క్షేత్రాలలో చెప్పుకుందాం. హరిహరులిద్దరూ కొలువైన ఈ మద్రాసు మహానగరంలో కపాలీశ్వరుడిని దర్శించుకుందాం. రండి. ఇక్కడి అమ్మవారి పేరు కర్పగంబాల్. ఒకసారి అమ్మవారు శాపవశాత్తూ నెమలి రూపం ఎత్తాల్సి వచ్చింది. ఆడ నెమలి రూపంలో అమ్మవారు శివుడి గురించి తపస్సు చేస్తుంటే, శివుడు మగ నెమలి రూపంలో వచ్చి అమ్మవారిని కరుణించాడుట. ఇప్పటికీ ఈ ఆలయంలో ప్రతీకాత్మకంగా రెండు జంట నెమళ్ళు ఒక పంజరంలో కనిపిస్తాయి. ఆలయ గోపురం పై లింగాన్ని అర్చిస్తున్న నెమలి దృశ్యాలు కనిపిస్తాయి. అసలు గోపురం పై ఎక్కడ చూసినా నెమళ్ళు ఎక్కువ కనిపిస్తాయి. చాలా అందమైన శిల్పాలు వున్న సుందమైన గోపురం వున్న ఆలయం ఇది.

                                                                శివుడు బ్రహ్మ తలని గిల్లేసిన తరువాత, బ్రహ్మ శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఒక పొన్న చెట్టు కింద ఈ కపాలీశ్వర లింగాన్ని స్థాపించి పూజించాడని ఒక కథనం. తరువాత నెమలి రూపంలో శివలింగాన్ని అమ్మవారు పూజించి తిరిగి తన మామూలు రూపం పొందింది. ఈ ఆలయాన్ని మొదటిగా పల్లవరాజులు నిర్మించారు. అన్ని ఆలయాల లాగే ఈ ఆలయం కూడా పోర్చుగీసుల కాలంలో దాడికి గురి అయ్యింది. ఆనాటి గుడిని కూల్చివేసి, పక్కనే సెయింట్ థామస్ సమాధిని కట్టి, చర్చిని నిర్మించారు. శాంథోమ్ బీచ్ లో వున్న సెయింట్ థామస్ చర్చ్ ఇదే. ఆ పక్కనే ఈనాటి మన కపాలీశ్వర ఆలయం వుంది. ఈ రోజుకీ ఆ చర్చిలో ఆలయ శిధిలాలు కనిపిస్తాయి. ఇదే విధంగా ఈ రోజుకీ వరంగల్ లో రిటైనింగ్ వాల్ పై కూడా ఎన్నో శిల్ప శిధిలాలు కనపడతాయి. మచ్చుకి రెండు వరంగల్ ఫోటోలు ఇక్కడ పెడుతున్నాను, చూడండి. తిరిగి ఈ కపాలీశ్వర ఆలయాన్ని ఆ పక్కనే పునః నిర్మించారు. 

  

కపాలీశ్వర ఆలయంలో అమ్మవారు తన కుమారుడు, కుమారస్వామికి శక్తి అనే శూలాన్ని ఆయుధంగా ఇచ్చింది. ఈ శక్తి శూలం ఒకే మొన కలిగి ఉంటుంది. దీన్నే జ్ఞాన శూలం అని కూడా అంటారు. జ్ఞానమనేది వాడిగా, సూటిగా ఉండాలి, దూరం నుంచి కూడా వాడగలిగేదిగా ఉండాలి, మళ్ళీ వెడల్పుగా (బ్రాడ్) ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని పార్వతీదేవి తన కొడుక్కి ఇచ్చింది. ఒక విధంగా తల్లులు అందరూ పిల్లలకు ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలో చెప్పింది ఆ జగజ్జనని. ఈ ఆలయం సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఆలయం నాలుగువైపులా విశాలమైన రోడ్లు ఉంటాయి. ఆలయంలో ఒక పుష్కరిణి కూడా వుంది. ఈ ఆలయం చరిత్ర గురించి జ్ఞానసంబంధర్ నయనారు గారి రచనలలో కూడా కనపడుతుంది. వైష్ణవ సాధువులని ఆళ్వారులంటే, శైవ సాధువులని నయనారులంటారు. ఇప్పుడు మద్రాస్ మహానగరానికి నడిబొడ్డున వున్న ఈ ఆలయ చరిత, ఘనత ఈ రోజు ఆ పక్కనే వున్నా కూడా తెలియని వారు ఎంతమందో. ఇదీ కపాలీశ్వర ఆలయ విశేషం. 


 

పక్షితీర్థం: ఈ ప్రాంతాన్ని ఇక్కడి స్థానికులు తిరుకాలుకుండ్రం అని పిలుస్తారు. తిరు అంటే తమిళంలో శ్రీ అని అర్ధం. అందుకే తమిళనాడు రాష్ట్రంలో ప్రతి పుణ్యక్షేత్రం పేరు తిరు అనే పదంతో ప్రారంభం అవుతుంది. ఈ తిరుకాలుకుండ్రం మద్రాస్ దగ్గర వున్న చెంగల్పట్టు వద్ద వుంది. ఈ ఆలయం కృతయుగం నుంచీ వున్నదని చెబుతారు. నాలుగు వేదాలూ నాలుగు కొండరాళ్ళుగా ఏర్పడి, ఆ నాలుగు రాళ్ళూ కలిసి ఒక కొండ ఏర్పడింది. వేదాలతో ఏర్పడిన కొండ కనుక దానికి వేదగిరి అని పేరు వచ్చింది. పరమేశ్వరుడు ఆ వేదాలకు రక్షకుడిగా ఇక్కడ వేదగిరీశ్వరుడనే పేరుతో, ఈ కొండ మీద వెలిసాడు. దురాశతో, వేదాలను కోరిన ఎనిమిది మంది ఋషులకు, బ్రహ్మ శాపం వల్ల పక్షి రూపం ఏర్పడిందిట. కానీ బ్రహ్మయే కృపతో శాపపరిహారం కూడా ఇచ్చాడుట. వేదగిరీశ్వరుని సేవిస్తే, యుగానికి ఇద్దరు చొప్పున పక్షిరూపం నుంచి విముక్తి పొందుతారని చెప్పాడుట. ఆవిధంగా కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ఆరుగురు ఋషులు స్వంత రూపం పొందారని, ఈ కలియుగంలో ఇంకా రెండు పక్షులు తమ శాప విమోచనం కోసం ప్రతిరోజూ ఈ వేదగిరి వచ్చి, ఈ వేదగిరీశ్వరాలయం పూజారి చేతి నుంచి చక్రపొంగలి తిని వెళ్తుంటాయనీ చెప్పారు. భక్తులందరూ సరిగ్గా ఆ డేగపక్షులు వచ్చే మధ్యాన్న సమయానికి ప్రతిరోజూ వచ్చి, ఆ దేవ పక్షులను దర్శించి సంతోష పడుతుండే వారు. నేను పక్షితీర్థం రెండు సార్లు వెళ్లాను. మొదటిసారి అమ్మానాన్నలతో 1978లో, రెండోసారి మావారు, పిల్లలిద్దరితో 1989లో. రెండు సార్లూ ఈ పక్షులను చూసా. ఈమధ్య విన్న ఒక విశేషమేమంటే, 1988 నుంచీ ఈ పక్షులు రావటం లేదట. బహుశా వాటికీ శాపవిమోచనం అయిపోయిందేమో. హేతువాదులు మాత్రం ఆ పక్షులకు ట్రైనింగ్ ఇచ్చారు, అందుకే అవి వస్తున్నాయి. ఇప్పుడవి చచ్చిపోయాయేమో, అందుకే రావటం లేదు అంటున్నారు. నమ్మితే దైవం, లేకపోతే దైవికం అంతే.

ఈ వేదగిరీశ్వరాలయం కూడా పెద్దది. కొండ మీద శివుడు, కొండ కింద పార్వతి, త్రిపురసుందరి. రెండు ఆలయాలూ పురాతనమైనవి. కింద ఒక పెద్ద పుష్కరిణి కూడా వుంది. ఇంతకీ మన చతుర్వేదాలూ ఈ నాలుగు కొండరాళ్ళతో సమానమట. ఎంత గొప్ప ఋషులైనా, పండితులైనా, వేదాలను పూర్తిగా నేర్చుకోవాలన్నా, ఇంత కొండలంత విజ్ఞానం నేర్చుకోలేక కేవలం గుప్పెడంత మాత్రమే నేర్చుకుంటారని అంటారు. ఇదీ పక్షితీర్థం కథ.

మహాబలిపురం: ఈ వూరు, ఈ శిల్పాలు, గుహలు అన్నింటినీ యునెస్కో పర్యాటక ప్రదేశంగా గుర్తించింది. ఈ మహాబలిపురం పాతపేరు మామల్లపురం. ఈ వూరు, ఈ గుహలు, ఈ ఆలయాలు అన్నీ పల్లవరాజులు నిర్మించారు. పల్లవరాజుల రేవుపట్నమే ఈ మామల్లపురం. ఈ మధ్య మన ప్రధానమంత్రి మోదీగారు, చైనా ప్రెసిడెంట్ జింగ్ పింగ్ వచ్చినప్పటి నుంచీ,ఈ పర్యాటక ప్రదేశం మన దేశంలోని అన్ని ప్రాంతాల లోనూ మరింతగా ప్రచారం లోకి వచ్చింది.

  

హంపీలో ఎలా అయితే ప్రతి రాతిపైనా శిల్పాలు కనిపిస్తాయో, అదే విధంగా ఆనాటి శిల్పులు ఇక్కడ దొరికిన ప్రతి బండా, కొండా, గుహా, ఏది దొరికితే దానిపై శిల్పాలు, మహా భారత గాధలు చెక్కేశారు. అదృష్టమేమంటే, ఈ ప్రాంతం దాడులకు, దోపిడీలకు గురి కాలేదు. మన భాగ్యం, అవి మిగిలాయి, మనం చూడగలుగుతున్నాం. పెద్ద పెద్ద బండలను రథాలుగా చెక్కి వాటికి పంచపాండవులు, ద్రౌపది  పేర్లు పెట్టారు. ఇంకో అతిపెద్ద బండపై శిల్పాలేవీ లేవు  కానీ, దాని పేరు వెన్నముద్ద. భీముడి వెన్నముద్ద అనీ, కృష్ణుడి వెన్నముద్ద అనీ అంటారు. ఇవి అన్నీ ఏకశిలలపై చెక్కినవే. ఏ రెండు రథాలూ ఒకలా వుండవు.


ఈ రథాలే కాకుండా ఒక పెద్ద రాతి గోడపై కూడా చాలా శిల్పాలు కనిపిస్తాయి. గంగావతరణం, అర్జునుని తపస్సు, దేవతలు అందరూ ఆకాశం నుంచి చూస్తున్నట్టు శిల్పాలు చెక్కారు. పెద్ద ఏనుగుల శిల్పాలు కూడా అంతటా కనిపిస్తాయి. గుహల్లో కూడా భారత, భాగవత కథలు శిల్పాల్లో చెక్కారు. ఖాళీగా వున్న రాళ్లు, బండలు, రాతి గోడలు తక్కువ కనిపిస్తాయి. పక్కనే సముద్రం, బంగాళాఖాతం, రారమ్మని పిలుస్తూ ఉంటుంది. నీళ్లు, అలలు చూసాక అక్కడికి వెళ్లకుండా ఉండలేం. ఆ పక్కనే లైట్ హౌస్ వుంది. మహాబలిపురంలో ఒక సౌకర్యం ఏమంటే, శిల్పాలూ. గుహలూ, సముద్రం, లైట్ హౌస్, షోర్ టెంపుల్స్ అన్నీ ఒక్క చోటే ఉంటాయి. ఎక్కువ నడవక్కరలేదు. ఇంత  గట్టి గ్రానైట్ మీద చెక్కారు కనుకేనేమో ఈ శిల్పాలు ఇన్ని వందల ఏళ్ళ తరువాత కూడా చెక్కు చెదరకుండా వుండి, చూపరులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

                                                 
ఈ సముద్రంలో ఎన్నెన్ని శిల్పాలు, ఆలయాలు మునిగిపోయాయో తెలియదు కానీ మూడు ఆలయాలు మాత్రం ఒడ్డు మీద మిగిలిపోయాయి. వాటిలో రెండు శివాలయాలు, ఒకటి వైష్ణవాలయం. ఈ రెండు శివాలయాలు ఒకదాని కెదురుగా ఒకటి ఉంటాయి.  ఒకటి తూర్పు వైపుకు ఉంటుంది, దీని గోపురం కూడా పెద్దది. ప్రతిరోజూ సూర్యుడి ఉదయ కిరణాలు  ఈ శివలింగం పై పడుతూ ఉంటాయి. ఈ ఆలయాలలో శివుడు పల్లవేశ్వరుడు. ఈ రెండు ఆలయాలకీ మధ్యలో విష్ణు ఆలయం ఉంటుంది. ఇక్కడ విష్ణువు శేషశయన మూర్తి. ఈ మూడు ఆలయాలలో శివ, స్కంధ, శక్తి, వరాహ మూర్తుల శిల్పాలు ఉంటాయి. శివాలయాల ప్రాకారాలపై పెద్ద పెద్ద నంది శిల్పాలుంటాయి. ఈ మధ్య వచ్చిన సునామీలో కొన్ని శిల్పాలు బయట పడ్డాయి. ఇప్పటికీ అక్కడ తవ్వకాలలో ఇసుకలో నుంచి కట్టడాలు, శిల్పాలు బయటపడుతూనే వున్నాయి. ఇంకా సముద్రంలో నుంచి ఇంకెన్ని విశేషాలు బయటపడాలో. ఈ ప్రాంతమంతా ASI వారి అధీనంలో వుంది. ఇవీ మహాబలిపురం విశేషాలు.

అయ్యప్ప ఆలయం, రాజా అణ్ణామలై పురం:  మద్రాస్ లోని రాజా అణ్ణామలైపురంలో చెట్టినాడ్ రాజకుటుంబం వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పూర్తిగా శబరిమల ఆలయం నమూనాలో నిర్మించారు. అందుకే ఎన్ని అయ్యప్ప ఆలయాలు చూసినా ఈ ఆలయం మాత్రం మనసులో ఉండిపోయింది. శబరిమలలో వున్నట్టే పదునెట్టాంబడి, మాలికాపురత్తమ్మ మందిరం, గణపతి మందిరం, ధ్వజస్తంభం, గర్భ గృహం అన్నీ అచ్చం శబరిమల ఆలయం లాగే ఉంటాయి. ఇరుముడి కట్టుకుని వచ్చిన వారు పదునెట్టాంబడి ఎక్కి దర్శనానికి వెళ్ళచ్చు. ఇరుముడి లేని వారు వెళ్లే దారి కూడా ఉంది. మేము అలానే వెళ్లి చూసాం. మూలమూర్తి కూడా పంచలోహ మూర్తి. శబరిమల దాకా వెళ్లలేని వారు, ఈ ఆలయాన్ని చూస్తే అసలు శబరిమల ఆలయాన్ని చూసిన అనుభూతిని  పొందొచ్చు. 

ఇక్కడితో ఈ మద్రాస్, మహాబలిపురం, పక్షితీర్థం యాత్రను ముగించుకుని, మహాదేవుని పంచభూత లింగాల ఆలయాల యాత్ర చేద్దామా. ఈ పంచ భూత ఆలయాలు నాలుగు తమిళనాడులో ఉంటే, ఒకటి ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ కాళహస్తి. ఇక నుంచీ వరుసగా ఈ పంచభూత ఆలయాలు చూద్దాం. ముందుగా కంచిలో వున్న పృధ్వీ లింగమైన ఏకామ్రేశ్వరుని ఆలయానికి  వెళదాం. 
  
ఓంకపాలీశ్వరాయనమః,  ఓం కర్పగంబాల్ నమః,
ఓం వేదగిరీశ్వరాయనమః, ఓం త్రిపురసుందరిదేవ్యైనమః 
ఓం పల్లవేశ్వరాయనమః, ఓం అయ్యప్పదేవాయనమః 


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650


  
















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం