ఏకామ్రేశ్వర పృధ్వీలింగం-కంచి
ఏకామ్రేశ్వర పృధ్వీలింగం-శివ కంచి
ఇప్పుడు మనం పంచభూత లింగాల గురించి చెప్పుకుందాం. దాని కన్నా ముందు ఈ పంచ భూతాలేమిటో చూద్దాం. అవే పృధ్వి, ఆపస్, తేజ, వాయు, అగ్ని అనే అయిదు ధాతువులు. మొదటిది పృధ్వి, అంటే భూమి, మట్టి. రెండోది ఆపస్ అంటే జలం, నీరు. మూడవది తేజం అంటే తేజస్సు,ఆకాశం, కాంతి, వెలుగు, Aura, ఇది ఒక రక్షణ కవచం వంటిది. నాలుగవది వాయు అంటే వాయువు, గాలి. అయిదవది అగ్ని, అంటే నిప్పు. ఈ అయిదూ లేకపోతే సృష్టి లేదు. పంచీకృతమైన ఈ ప్రపంచం లోని ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో ఈ అయిదూ ఉంటాయి. ఈ ప్రపంచమే పంచ భూతాత్మికం. అందుకే పంచ భూతాలతో ఏర్పడిన ఈ శరీరాన్ని, ఆ పంచ భూతాలకే అర్పణం చేయాలని చెప్తారు. ఈ పంచ భూతాల తత్వం, శక్తి, ఉనికిని విడివిడిగా తెలుపుతూ శివుడు అయిదు స్థానాల్లో అయిదు లింగాల రూపంలో సాక్షాత్కరించాడు. వీటిల్లో నాలుగు లింగాలు ప్రస్తుత తమిళనాడులో ఉంటే, ఒక ఆలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో వుంది. మొట్ట మొదటిగా మనం పృధ్వీ లింగమైన ఏకామ్రేశ్వరుని గురించి చెప్పుకుందాం.
ఈ ఆలయం కాంచీపురంలో వుంది. కాంచీ అంటే మొలనూలు, మొలతాడు అని అర్ధం. ఎందుకంటే సతీదేవి నాభి పడిన క్షేత్రం కంచి. నాభి చుట్టూ ఉండేది మొలనూలే కదా, వడ్డాణం లాగా. కంచిలో శివ కంచి, విష్ణు కంచి అని రెండు ప్రాంతాలు వున్నాయి. ఈ ఏకామ్రేశ్వర ఆలయం శివ కంచిలో వుంది. కామాక్షీ అమ్మవారు కొలువై వున్న కంచి కూడా ఇదే. కంచి కామకోటి పీఠం కూడా ఇక్కడే వుంది. ఈ శివుడినే ఏకామ్రేశ్వరుడని, ఏకాంబరేశ్వరుడని అంటారు. ఈ ఆలయంలో వేల ఏళ్ళ నాటి ఒక మామిడి ఆమ్ర, వృక్షం వుంది. ఆ చెట్టుకి ఒక ప్రత్యేకత వుంది. ఈ చెట్టుకున్న నాలుగు కొమ్మలకీ నాలుగు వేరు వేరు రుచులతో మామిడికాయలు కాస్తాయిట. ఈ అరుదైన చెట్టు ఈ ఏకామ్రేశ్వర ఆలయంలో కనిపిస్తుంది. ఇది 3000 ఏళ్ళ పాతది. కానీ ఈ మధ్యనే ఆ పురాతన వృక్షం వానకు కూలిపోతే, దాని స్థానే మరొక మామిడి మొలకను వేసి పెంచుతున్నారు. ఆ చెట్టు కింద శివ పార్వతుల విగ్రహాలున్నాయి. అక్కడ పూజలు జరుగుతాయి, మొక్కులు మొక్కుతూ వుంటారు. ఇక్కడి అమ్మవారిని గౌరీదేవిగా కొలుస్తారు. అమ్మవారు ఒకసారి సరదాకి శివుడికి వెనుక నించి చేతులతో కళ్ళు మూసిందట. అప్పుడు శివుడు వెంటనే అమ్మవారి చేతులు లాగేసి, నా కళ్ళు ఒక్క క్షణం మూసిన కారణంగా ఈ జగత్తంతా చీకటి వ్యాపించింది. ఈ తప్పుకి పరిహారంగా, నల్లగా కాళీ రూపం తాల్చమని అమ్మవారిని శపించాడు శివుడు. అప్పటి నుంచీ అమ్మవారు శాపం పోగొట్టుకోవటం కోసం ఈ మామిడి చెట్టు కింద మృత్తికతో ఒక శివ లింగాన్ని చేసుకుని దాన్ని పూజించటం మొదలుపెట్టింది. శివుడు ఆమెని పరీక్షించటానికి పక్కనే వున్న వేగావతీ నది నుంచి వరదను సృష్టించి మట్టితో చేసిన ఈ పృధ్వీలింగాన్ని వరదలో కొట్టుకుపోయేలా చేయటానికి ప్రయత్నించాడు. కానీ అమ్మవారు, అప్పుడు ఆ లింగాన్ని గట్టిగా హత్తుకుని, ఆ లింగం చుట్టూ కవచం లాగా మారి లింగాన్ని కొట్టుకుపోకుండా రక్షించింది. ఆ సమయంలో అమ్మవారి ఆభరణాలు, వక్షస్థలం అదిమిన గుర్తులు ఆ లింగంపై ఏర్పడ్డాయి. ఆ గుర్తులు ఈ రోజుకీ ఆ లింగంపై కనిపిస్తాయిట. మనల్నయితే దగ్గరకు పోనివ్వరు, కనుక మేము ఈ గుర్తులు చూడలేదు. అమ్మవారి దీక్షకు మెచ్చి అమ్మవారిని మళ్ళీ నల్లగా వున్న కాళీ రూపం నుంచి పచ్చగా గౌరవర్ణం లోకి మారమని శివుడు వరం ఇచ్చేశాడు. అందుకే ఇక్కడి అమ్మవారి పేరు గౌరి. ఇన్నేళ్ళల్లో ఆ మట్టితో చేసిన లింగం సాలగ్రామశిల అయిపోయింది, శిలాజం లాగా అన్నమాట. అయినప్పటికీ ఈ రోజుకీ ఈ లింగానికి జలంతో అభిషేకం చేయరు. ఆ జలంతో పానవట్టానికి మాత్రమే అభిషేకం చేస్తారు. ఈ లింగానికున్న ప్రత్యేకల్లో ఇది కూడా ఒకటి.
ఈ ఆలయంలోని ఇతర ప్రత్యేకతలు ఎన్నో. ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఎంతో పెద్ద ప్రాంగణం. ఎన్నో ఉపాలయాలు. వాటిల్లో దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి, వీరభద్రుడు, భద్రకాళి, అర్ధనారీశ్వరుడు, కాలభైరవుడు, నటరాజు, సహస్రలింగం, వేయిస్తంభాల మంటపం, నయనారుల
మంటపం, నంది మంటపం, ఏనాటి నుంచో ఋషులు, మునులు ప్రతిష్టించిన లింగాలు, పెద్ద పెద్ద వసారాలు ఇలా ఎన్నో. ఎంట్రన్సులోనే అటూ ఇటూ వున్న గణపతి, కుమారస్వామి ఆలయాలు కూడా చాలా పెద్దవి. ఇక్కడ మరో విశేషమేమంటే, ప్రతి ఉపాలయంలో వున్న మూర్తి కూడా ఎంతో మహిమాన్వితంగా, శక్తివంతంగా అనిపిస్తుంది. ఇలాంటి విశేషం నేను ప్రొద్దటూరులో వున్న అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో కూడా చూసాను. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడి వసారాలో నడుస్తూ పక్కనే వున్న ఉపాలయాలు చూస్తూ వెళ్తుంటే ఎన్ని గంటలైనా గడిచి పోతాయి. అంత పొడవైన వరండాలు అవి. ఎక్కడైనా అలసిపోయినా, హాయిగా కూర్చుని కాసేపు సేద తీరచ్చు. ఎంత వేసవిలో అయినా, హాయిగా చల్లగా వుండే ఆలయం ఇది. ప్రతి స్తంభం మీదా శిల్పాలు. శివలీలలు, శివ అవతారాలు ఎన్నో కనిపిస్తాయి. నిజంగా ఈ ఆలయంలో అన్ని వివరాలూ చూడాలంటే, వారం రోజులైనా పడుతుంది. అంత విశాలమైన ప్రాంగణం వున్న ఆలయం ఇది.
గర్భగుడి పెద్దది. భక్తుల్ని మాత్రం చాలా దూరం గానే ఆపేస్తారు. చిన్నగా వెలుగుతున్న ఆముదం దీపాల కాంతిలో ఆ పృధ్వీ లింగాన్ని వివరంగా చూడాలంటే సమయం సరిపోదు. ఈ ఆలయం ఎప్పుడూ కొంచం రద్దీగానే ఉంటుంది. ఎత్తైన పానవట్టం మీద పొడవైన మృత్తికాలింగం ఈ ఏకాంబరేశ్వరుడు. అన్నట్టు ఏకామ్రేశ్వరుడే కొద్దిగా పదం మారి ఏకాంబరేశ్వరుడు అయ్యింది. ఈ పదానికి అర్ధం చెప్పుకోవాలంటే ఏక-ఒకటి, అంబర- వస్త్ర, ఈశ్వరుడు-ఐశ్వర్యప్రదాత. ఇక్కడ ఒక్క విషయం, ప్రతి శివాలయం లోనూ శివునికి మడి ధోవతులు కడతారు. శివునికి తప్ప, మరే ఇతర దేవుడికీ ఈ విధంగా మడి బట్టలు కట్టడం కనిపించదు. ఇంతే కాకుండా ఈ ఆలయంలో వామన మూర్తి మందిరం కూడా ఉంది. ఈ వామనుడిని ఇక్కడ నీలతింగళ్ తుండం పెరుమాళ్ అంటారు. ఈ వామన మందిరం 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటి. ఇవి కాక కల్యాణమండపం కూడా ఈ ఆలయం లోనే వుంది.
కామకోటి పీఠం: ఆలయం నుంచి కొద్దిదూరంలోనే కంచి కామకోటి పీఠం వుంది. ఈ కామకోటి పీఠం ప్రధానకేంద్రం కుంభకోణంలో ఉండేది. కంచి పరమాచార్యులు, జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి వారి కాలంలో ఈ పీఠం ప్రధాన కేంద్రం కుంభకోణం నుంచి కంచికి మారింది. అప్పటినుంచీ కామకోటి పీఠం కంచి కామకోటి పీఠంగా మారింది. ఈ కామకోటి పీఠం వున్న వీధి మహా రద్దీగా ఉంటుంది. అక్కడే ఒక మార్కెట్, నాలుగు రోడ్ల కూడలి కూడా వుంది. అయినా ఈ మఠం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇది కూడా పెద్ద ప్రాంగణం. ఆది శంకరుల వారి హాలు, అక్కడ వున్న ఆది శంకరుల చిత్రాలు చాలా ప్రసన్నంగా ఉంటూ తమాషాగా ఎంతో సేద తీరుస్తాయి. ఎంత హడావుడిగా ఈ పీఠానికి వచ్చినా సరే, లోపలి ఈ హాల్ వద్దకు రాంగానే ఒక్కసారిగా శాంతంగా అయిపోతాం. మహానుభావులు తపస్సు చేసిన ప్రాంతం కదా, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఇంకా లోపలికి వెళితే, పీఠం వారి పుస్తకాలయం, ఆది శంకరుని మంటపం వున్నాయి. ఆ తరువాత అక్కడే ఒక పెద్ద గదిలో, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారు, శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీస్వామి వారు విశ్రాంతి తీసుకుంటున్న బృందావనాలు వున్నాయి. అవి చూడంగానే మనసు భారమై, కాసేపు మూగదాన్ని అయిపోయాను. ఈ కామకోటి పీఠంలోనే శృంగేరి పీఠం ప్రధమ పీఠాధిపతి అయిన సురేశ్వరాచార్యుల (ఈయనే పూర్వాశ్రమంలో మండనమిశ్రుడు) మందిరం కూడా వున్నది. అంతే కాక ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞపీఠం అధిష్టించి ఇక్కడే శివ సాయుజ్యాన్ని పొందారని ఈ పీఠం వారు చెబుతున్నారు. మరి ఆది శంకరులు సశరీరంగా కేదారనాథ్ నుంచి కైలాసానికి వెళ్లారని ఒక కథనం. ఏది నిజమే ఆ శంకరునికే తెలియాలి.
శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి గురించి ఇక్కడ ఒక గొప్ప విశేషం చెప్పాలి. మా నాన్నగారు, నందివాడ శ్రీరామకృష్ణశర్మగారు పెద్దస్వామి వారికి ఇష్ట శిష్యుడు. వారిని చిన్నప్పుడు ఎన్నిసార్లు చూసామో మాకే లెక్క లేదు. ఆయన ప్రవచనాలను ఎన్నిసార్లు విన్నానో, ఎన్నిసార్లు స్వయంగా వారి చేతి నుంచి తీర్థ ప్రసాదాలను తీసుకున్నానో కూడా గుర్తు లేదు. ఆరోజుల్లో ఆయన ప్రవచనాలను నేను ఒక నోట్ బుక్ లో రాసుకునేదాన్ని. ఇదంతా నేను 6, 7, 8, 9, క్లాసులు చదువుతున్నప్పుడు సంగతి. ఇప్పడు ఆ నోట్స్ ఏమైందో కూడా తెలియదు. తెనాలిలో తాలూకా హైస్కూల్లో చదువుకుంటున్న రోజులవి. ఒకసారి స్వామివారే స్వయంగా మా నాన్నతో మా సొంతవూరు ఆరుగొలను వస్తానని, మా ఇంట్లో బస చేస్తాననీ చెప్పారు. మా తాతగారు శ్రీ ఆనందరామశర్మగారు గొప్ప వేద పండితుడు. తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు వేదం చెప్పేవారు. ఇంటి నిర్వహణా బాధ్యత అంతా, పాపం మా బామ్మే తన ఆడపడుచు సహాయంతో, చేసుకునేది. పైగా డజను మంది పిల్లలు, వచ్చిపోయే బంధువులు, పనివాళ్లు, పొలం పనులు, మధ్యలో తాతగారి దగ్గర చదువుకునే విద్యార్థులు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మా తాతగారు మాత్రం నిత్యం పూజాదికాలలో ఉండేవారుట. ఇంట్లో నిత్య పంచాయతనపూజ, నిత్యాగ్నిహోత్రం, వైశ్వదేవం ఉండేవి. ఆయన చనిపోయే ముందు సన్న్యాసదీక్ష కూడా తీసుకున్నారు. ఈ రకమైన ఆతుర సన్న్యాసం, నందివాడ కుటుంబంలో ఆనవాయితీగా వస్తోంది. చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి, మా ఆ ఇంట్లోనే పీఠం పెట్టి ఒక పది రోజులు ఉంటానని చెప్పారు. దానితో మా నాన్నగారు ఆయన్ను ఒక నెల రోజులు టైం అడిగి ఆ ఇల్లు రెడీ చేయిస్తానని చెప్పారు. ఎందుకంటే మా నాన్నగారి కుటుంబం ఆ ఇల్లు వదిలి చాలా ఏళ్ళు అయ్యింది. అప్పుడప్పుడు మా బామ్మ వెళ్ళి ఇల్లూ వాకిలీ చూసుకుని వచ్చేదంతే. మా నాన్న, నన్ను, మా బామ్మను, ఒక వంటమనిషిని, ఒక పనిమనిషిని ఇచ్చి ఆ ఊరు పంపించారు. నేనప్పుడు ఏడో క్లాస్ లో వున్నా. సుమారు మూడు వారాల పాటు ఆ ఇంటిని శుభ్రం చేయించి, చెత్త సామానంతా పారేసి, మిగిలిన సామాను అంతా ఓ మూల గదిలో పడేసి, తాళం పెట్టి, మఠం వాళ్ళ వంటకు కూడా, వంటిల్లు సిద్ధం చేసి, సున్నాలూ అవీ వేయించి, బావిలో పూడిక తీయించి, పెరడూ, ముంగిలీ అంతా పిచ్చి మొక్కలు పీకేసి, చదును చేయించి, ఇల్లు మొత్తం స్వామివారి పీఠం కోసం సిద్ధం చేయించాం. ఈ మొత్తం ప్రక్రియలో, నేనూ ఒక చేయి వేసినందుకు నేనెంత అదృష్టవంతురాలినో అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తోంది. ఆ ఊరిలోనే మా అమ్మమ్మా వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా సిద్ధం అయ్యాక స్వామివారు, జయేంద్రసరస్వతీ స్వామితో కలిసి కామకోటి పీఠంతో సహా, మావూరు ఆరుగొలను వచ్చి మా ఇంట్లో దిగారు. ఆ పది రోజులూ ఊరు ఊరంతా పండగలా జరిగింది. ప్రతి రోజూ స్వామివారు ప్రవచనం చెప్పేవారు. అర్చన, అభిషేకం చేసి ఊరు ఊరందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చేవారు. నిత్యం హరికథలు, గాన కచేరీలు, ఊరంతా కోలాహలంగా ఉండేది. ములుకుట్ల సదాశివశాస్త్రిగారు చక్కగా శ్రావ్యంగా హరికథలు చెప్పేవారు. అన్నట్టు నేను, నా పెద్ద చెల్లెలు భారతలక్ష్మి ములుకుట్ల వారి దగ్గర కొన్నాళ్ళు సంగీతం కూడా నేర్చుకున్నాం. నాన్నా వాళ్ళు పన్నెండు మందైతే, అమ్మా వాళ్ళు పదిమంది. ఈ 22 కుటుంబాలవాళ్ళూ వీలైనంత మందీ ఆ పది రోజులూ అక్కడే వున్నారు. అందరం మా అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. అదో మత్తు, అదో వింత, అదో సంతోషం, అదో సంబరం.
ఆ తరువాత మళ్ళీ నేను ఎం.ఎస్సీ. లో ఉండగా మరోసారి అందరం సౌత్ టూర్ వెళ్లాం. అప్పుడు మేము సంబల్పూరులో ఉండేవాళ్ళం. నాన్న అక్కడ కేంద్రీయవిద్యాలయ ప్రిన్సిపాల్. ఆ టూర్ లో భాగంగా కంచికి కూడా వెళ్లాం. కానీ అప్పటికి పెద్దస్వామివారు పూర్తిగా పీఠం బాధ్యతలు చిన్నస్వామికి అప్పచెప్పి, ఊరి బయట ఒక చిన్న ఆశ్రమంలో, మౌనవ్రతంతో, తపోదీక్షలో వున్నారు. ఎప్పుడో కానీ బయటకు రావటం లేదుట, ఎవరికీ దర్శనం ఇవ్వటం లేదుట. అందరూ ఆయన దర్శనం కాదని నిరుత్సాహపరిచారు. మా నాన్న మాత్రం ధైర్యంగా, పరవాలేదు, ఆ ఆశ్రమానికి వెళదాం. చూద్దాం. స్వామివారు దయ తలిస్తే, ఆయనే వచ్చి కనిపిస్తారు, అన్నారు. మేమందరం అమ్మ, నాన్నా, మేము ముగ్గురం అక్కచెల్లెళ్ళం, మా తమ్ముడు, ఆరుగురం వెళ్లి ఆ ఆశ్రమం బయట కటకటాల తలుపు దగ్గర నుంచున్నాము. అక్కడ మాలాగా మరికొందరు ముందు నుంచే వున్నారు. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచీ, చాలాసేపటి నుంచీ స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారట. మేమూ వారితో కలిసి నించున్నాము. కాసేపు అవంగానే సాక్షాత్తూ ఆ చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామే స్వయంగా ఆ తలుపు దగ్గరకు వచ్చి దర్శనం ఇచ్చారు. మమ్మల్ని చూసి, ముఖ్యంగా మా నాన్నను చూసి, ఆయన కళ్ళల్లో మెరుపు వచ్చింది. పెదవులపై చిరునవ్వు వచ్చింది. మేము ఆశ్చర్యానందాలతో ఆయనకు అలా దణ్ణం పెడుతూ ఉండిపోయాం. ఆయన మమ్మల్ని చేయెత్తి ఆశీర్వదించారు. అలా కాసేపు నుంచుని ఆయన మళ్ళీ లోపలికి వెళ్లిపోయారు. అందరూ కూడా ఆయన నాన్నను చూడటం గమనించారు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా నాన్నకు థాంక్స్ చెప్పారు. ఇవాళ ఆయన మీకోసమే వచ్చారు అని కూడా అన్నారు. అందుకే నేను నా మొదటి వ్యాసం ప్రయాణోపనిషత్ లోనే చెప్పాను. దేవుడు మనలను చూడాలనుకుంటే మనం ఆలయానికి వెళతాం కానీ, మనం దేవుణ్ణి చూడాలని అనుకుంటే కాదని. ఆయన పిలుపే ముఖ్యం అని. చంద్రశేఖరేంద్రసరస్వతికి మమ్మల్ని చూడాలనిపించి మాకు కనిపించారు, అంతే. ఇదీ మా కుటుంబానికీ కంచి పీఠానికీ వున్న సంబంధం. ఆ తరువాత ఒకసారి తిరుమలలో జయేంద్ర సరస్వతి స్వామివారినీ, రైల్వే కోడూరులో సన్న్యాసదీక్ష తీసుకున్న నెలరోజుల లోపే, వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో బాల శంకర విజయేంద్ర సరస్వతీస్వామినీ చూసాను. ఇదీ ఈ పీఠంతో నా అనుబంధం.
కైలాసనాథర్ మందిరం : ఉజ్జయిని క్షేత్రం గురించి చెప్పినప్పుడు సప్త మోక్షపురుల గురించి చెప్పుకున్నాం కదా. మన దక్షణాపథంలో వున్న ఏకైక మోక్షపురం కాంచీపురం. ఒక్కసారి ఆ శ్లోకం కూడా గుర్తు చేసుకుందాం.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా
పురీ ద్వారవతీ జ్ఞేయా సప్తై తా మోక్షదాయకాః
కాంచీపురం ఆలయాల సముదాయం. కంచిలో ప్రప్రథమ ఆలయంగా చెపుతున్నది కైలాసనాథర్ మందిరం. ఇక్కడ మొదటగా గేటు దగ్గరే మనకు నంది దర్శనమిస్తాడు. అంతేకాదు, లోపల అంతా మట్టితో చేసిన శిల్పాలు, పది, వంద కాదు, వేలల్లో కనిపిస్తాయి ఈ మట్టి విగ్రహాలు. అన్నీ శివ పురాణ ఘట్టాలే. ఈ ఆలయం అంతా ASI వారి అధీనంలో వుంది. బయటి ప్రాకారంలో అంతటా ఈ శిల్పాలు వున్నాయి. లోపలి ప్రదక్షిణా మార్గంలో కూడా ఈ శిల్పాలు వున్నాయి. క్రీ.శ. 600 లో కట్టిన ఈ ఆలయంలో శిల్పాల నుంచి ఇప్పుడిప్పుడే చవుడు మట్టి పొడిపొడిగా రాలుతోంది. ఇవి టెర్రకోటా శిల్పాలు కూడా కావు. మన పాతకాలపు మట్టి ఇళ్ల లాంటివి. మరి ఆ రోజుల్లో ఆ మట్టిలో ఏమి కలిపితే ఇంత గట్టిగా పేస్ట్ లాగా మారి ఆ శిల్పాలు రూపొందించటానికి వీలైయ్యిందో, ఇన్ని శతాబ్దాలు, గాలికి, వానకీ నిల్చి, శిల్పం విచ్చిపోకుండా ఉన్నదో ఇంతవరకూ ఎవరికీ తెలియలేదు. ఈ శిల్పాలు చూసుకుంటూ ఈ ప్రాకారాలు దాటి గర్భగుడి దగ్గరికి వచ్చాం. ఈ గుడి చుట్టూ ఓపెన్ గా వున్న మరో ప్రాకారం వుంది. గర్భగుడి లోపల ఒక పెద్ద లింగం వుంది. ఆ లింగం అష్ట భుజాలతో వుండి స్థూపాకారంలో వుంది. ఈ గర్భగుడి చుట్టూ కింద ఒక ప్రదక్షిణా మార్గం వుంది. ఎవరైతే ఈ ప్రదక్షిణా మార్గంలో ప్రదక్షిణ చేస్తారో వారికి మోక్షం వస్తుందని ఒక నమ్మకం. ఈ ప్రదక్షిణా మార్గంలో ముందు మూడు, నాలుగు మెట్లు ఎక్కి ఒక రెండు అడుగుల చతురస్రాకారపు రంధ్రంలోకి దూరి, మళ్ళీ అక్కడ నాలుగు, ఐదు మెట్లు దిగి లోపల ప్రదక్షిణం చెయ్యాలి. మిగిలిన మార్గం అంతా 20 అడుగుల ఎత్తుగా ఉంటుంది. తేలికగానే మొత్తం ప్రదక్షిణం చెయ్యచ్చు. కానీ తిరిగి బయటకు వచ్చేటప్పుడు ఈ రెండడుగుల చతురస్రాకారపు రంధ్రం సుమారు ఆరు అడుగుల మేర పొడవుగా ఉంటుంది. అంటే, ఒక మనిషి దాంట్లో దూరితే, ఒక కాఫిన్ లాగా ఉంటుందన్నమాట. కానీ అంతా వెలుగు ఉంటుంది. ఆ రంధ్రం నుంచి బయటకు రాంగానే అక్కడ ఒక యమధర్మరాజు శిల్పం వుంటుంది. ఆయన అప్పుడు మనం ఈ ప్రదక్షిణ చేసినట్టు లెక్కించి మనకు మోక్షం ఇస్తాడట. ఈ మొత్తం ప్రదక్షిణంలో లోనికి వెళ్ళే మార్గం జననానికీ, బయటకు వచ్చే మార్గం మరణానికీ, మధ్య మార్గం జీవనం అనీ సంకేతమట. ఇదీ ఈ ప్రదక్షిణం కథ. నేను చూసాను కానీ ప్రదక్షిణ చెయ్యలేదు. ఎందుకంటే, మావారు వద్దనడం, తోడు మరెవరూ లేకపోవటం, బాగా చీకటిపడి ఉండటం. చూద్దాం, ఆ కైలాసనాథుడు మళ్ళీ పిలిస్తే ఈ సారి చేస్తా.
కచ్ఛపేశ్వర మందిరం: ఈ ఆలయంలో శివుడిని కచ్ఛప రూపంలో విష్ణుమూర్తి పూజించాడట. విష్ణుమూర్తి సముద్ర మంథన సమయంలో కచ్ఛప రూపంలో వుండి మేరు పర్వతాన్ని మునిగిపోకుండా ఆపాడు. ఇది కూర్మావతార కథ. అప్పుడు వాసుకి ఆ మంథనాన్ని తట్టుకోలేక హాలాహలం కక్కాడు. అప్పుడు ఆ విషజ్వాలల వల్ల విష్ణువు మాడిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు విష్ణుమూర్తి శివుడిని ప్రార్ధిస్తే, మహాదేవుడు ఆ గరళాన్ని మింగి, తన గొంతులోనే ఉంచాడు. ఆ రకంగా శివుడు గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. తనకు సహాయం చేసిన శివుడిని విష్ణుమూర్తి అర్చించాడు. ఈ ఆలయ గాధ ఇది. ఇది కూడా చాలా పెద్ద మందిరం. లోపల చాలా ఉపాలయాలు కూడా వున్నాయి. అందమైన శిల్పాలు, చక్కని పుష్కరిణి, గొప్ప గోపురం ఇవన్నీ ఈ ఆలయం ప్రత్యేకతలు. మనం శివుడా, కేశవుడా అని తన్నుకుంటూ ఉంటాం కానీ, హరి హరుణ్ణీ, హరుడు హరినీ పూజించుకుంటున్న గాధలెన్నో. అందుకే అంతా భగవత్స్వరూపం అనుకుందాం.
తిరుత్తణి: ఈ ఆలయానికి చాలాసార్లు వెళ్లాం. లేటెస్ట్ గా, 2019 సెప్టెంబర్ లో మేము, మా మనవరాలు షోడశి పుట్టు వెంట్రుకలు తిరుమల హుండీలో వేయాలని వెళ్లాం. తరువాత తిరుమల, తిరుపతి నుంచి కారులో ముందుగా తిరుత్తణి, ఆ తరువాత కంచి చేరాం. తిరుత్తణిలో కొండ మీద వున్న సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి వెళ్ళాం. ఇప్పటికి ఈ ఆలయాన్ని నాలుగైదు సార్లు చూసి ఉంటాం. అక్కడ సుబ్రహ్మణ్యుడు, హనుమంతుడు స్నేహితులు కాబోలు, ఎన్ని కోతులున్నాయో. కానీ అవి ఎవరినీ ఏమీ చేయటం లేదు. నేను మాత్రం నా హనుమత్ మంత్రం మననం చేసుకుంటూ ముందుకెళ్లా. ఆలయంలోకి వెళ్లి అర్చన చేయించాం. ఆలయం వెలుపలే హుండీలో వెయ్యటానికి మొక్కుల కోసం వెండితో చేసిన రకరకాల సామాన్లు అమ్ముతున్నారు. మేమేమీ కొనలేదు. ఆలయంలో సుబ్రహ్మణ్యుడు ఎంత అందంగా, ముద్దుగా వున్నాడో చెప్పలేను. ఒక్కసారిగా ఆ సుబ్రహ్మణ్యుడిపై వాత్సల్య భక్తి కలిగింది. ఈ క్షేత్రం సుబ్రహ్మణ్యుని ఆరు ప్రముఖ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ వల్లీ, దేవసేనా సమేతంగా స్వామి దర్శనమిస్తాడు. దుర్గ, శివ ఆలయాలు కూడా ఇక్కడ వున్నాయి. కొండ మీద వున్నా కూడా పైదాకా కారు వెళ్లే వీలు వుంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యుడిని చూసాక ఎందుకో చాలా తృప్తిగా అయ్యింది, అన్న అనుభూతి కలిగింది.
కంచిలోని మరో ప్రముఖ ఆకర్షణ పట్టు, నేత చీరలు, వస్త్రాలు, ముఖ్యంగా పట్టుచీరలు. కంచిపట్టుచీర కడితే కానీ మనకు ఏ పెళ్లి కానీ, పబ్బం కానీ సంపూర్ణం కాదు. ఇక్కడ మగ్గాలు, సహకార కేంద్రాలు, దుకాణాలు, ఎన్నో. చివరకు సైకిళ్లపై కూడా వచ్చి టవళ్ళు, రుమాళ్ళు, లుంగీలు, దుప్పట్లు అమ్ముతారు. ఏమి కావాలన్నా, మనం డైరెక్టుగా నేతదారుల నుంచే పొందొచ్చు. దళారీల చేతులు తగ్గుతాయి కనుక ధరలు కూడా తక్కువగా ఉంటాయట. నేను కూడా కొన్ని కొన్నాను. ముఖ్యంగా మా వారికీ, పిల్లలకీ ఇక్కడెక్కడా దొరకని రెడీమేడ్ పంచెలు కొన్నా.
నిజాయితీగా చెప్పాలంటే కాంచీపురాన్ని పూర్తిగా చూడాలంటే ఒక నెల రోజులైనా సరిపోవు. ఇంకా నేను కంచిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం వరదరాజస్వామి గురించి కానీ, 108 వైష్ణవ దివ్య దేశాల్లో కంచిలో వున్న 16 క్షేత్రాలు కానీ చెప్పలేదు. అవి వైష్ణవ ఆలయాల గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి కంచి లోని శైవ క్షేత్రాల యాత్రను ముగిస్తూ, ఈ సారి రెండో పంచభూత క్షేత్రమైన జంబుకేశ్వరం, జలలింగం గురించి చెప్పుకుందాం.
ఓం ఏకాంబరేశ్వరాయనమః, ఓం కైలాసనాథాయనమః
ఓం కచ్ఛపేశ్వరాయనమః, ఓం చంద్రశేఖరసరస్వత్యైనమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Very well written. I have enjoyed reading and remembering my experiences. Thank you.
రిప్లయితొలగించండిThank you.
తొలగించండి