జంబుకేశ్వరం-బృహదీశ్వరం
జంబుకేశ్వరం-బృహదీశ్వరం
జంబుకేశ్వరం, దీన్నే తమిళులు తిరువనైక్కోయిల్ అంటారు. శ్రీరంగం శ్రీరంగనాథుని ఆలయానికి దగ్గర లోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ శివ కేశవులిద్దరూ పక్క పక్క వీధుల్లోనే వుంటారు. ఈ జంబుకేశ్వరంలో లింగమే జలలింగం, అప్పులింగం. ఆపస్ అంటే సంస్కృతంలో నీరు. కావేరి నది పక్కనే ఈ ఆలయం ఉంటుంది. ఒకసారి శివుడు పార్వతీదేవిని తపస్సు యొక్క ప్రయోజనాలు తెలుసుకోవటానికి గాను, భూమి మీదకు వెళ్లి తపస్సు చేయమంటాడు. అప్పుడు అమ్మవారు కావేరీ నది ఒడ్డున వున్న ఈ నేరేడు వృక్షాలుండే జంబూక్షేత్రానికి వచ్చి, ఈ కావేరీ నదీ జలాల తోనే ఒక లింగం చేసుకుని పూజించటం మొదలుపెట్టింది. ఈ స్థలంలో ఒక జంబూక వృక్షం కింద శంభుడు అనే ఒక ఋషి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. అతని తలపై నుంచి జంబూక వృక్షం పెరిగింది. అమ్మవారు ఆ పక్కనే తానూ చేసిన జలలింగాన్ని అమర్చుకుని శివుని గురించి తపస్సు చేయసాగింది. కొన్నాళ్ల తపస్సు తరువాత శివుడు ప్రత్యక్షమై పార్వతీ దేవికి శివ జ్ఞానాన్ని బోధ చేశాడు. అందుకే ఈ ఆలయంలో శివుడు, పార్వతి ఒకరికొకరు ఎదురెదురు దిక్కుల్లో కనిపిస్తారు. ఎందుకంటే, శివుడు గురు స్థానంలో వుండి ఉపదేశం చేస్తున్నాడు. అమ్మవారు ఆ ఉపదేశాన్ని ఒక శిష్యురాలి వలె స్వీకరిస్తున్నది. ఇక్కడి అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి.
ఈ అమ్మవారు మొదట్లో చాలా ఉగ్రమూర్తిట. శ్రీ ఆది శంకరులు అమ్మ కోపం తగ్గించటానికి ఉపాయం ఆలోచించి, అమ్మవారి ఎదురుగా ఒక ప్రసన్న గణపతి విగ్రహం స్థాపించారు. కొడుకుని చూస్తే, ఏ తల్లికైనా కోపం పోతుంది కదా. అంతేకాక ఆ అఖిలాండేశ్వరీ అమ్మవారికి చెవులకు తాటంకాలుగా, అంటే, కర్ణాభరణాలుగా, అటూ ఇటూ రెండు శ్రీ చక్రాలు పెట్టారుట. అందుకే "తాటంక యుగళీ భూత తపనోడుప మండలా" అన్న నామం అమ్మవారికి ఇక్కడ సార్ధకమయ్యిందని నాకు అనిపించింది. ఆ రెండు శ్రీ చక్రాలూ, ఒకటి తపనుడు అంటే సూర్యుడు, రెండోది ఉడుప అంటే చంద్రుడు. దీన్ని బట్టి రవి, సోములిద్దరూ అమ్మవారిని సేవిస్తున్నట్టు భావించచ్చు. అంటే అటూ ఇటూ తాటంకాలుగా సూర్య చంద్రులు, ఎదురుగా ప్రసన్నంగా పుత్రుడు గణపతి. అప్పటి నుంచీ ఆ అఖిలాండేశ్వరీ దేవి, తానూ కూడా అందరినీ ప్రసన్న చిత్తంతో కటాక్షిస్తోంది. అక్కడికి వెళ్ళినవారు తప్పక ఈ అంశాలను గమనించండి.
ఇక స్థల గాధ ప్రకారం, ఇక్కడ ఒక ఏనుగు, ఒక సాలీడు శివ పూజకు పరస్పరం కలహించుకుని మృతి చెందాయిట. ఆ సాలీడే మరుజన్మలో చోళ రాజ కుటుంబంలో జన్మించి, శివుని గర్భాలయంలోకి ఎంత చిన్న ఏనుగైనా ప్రవేశించకుండా అతి చిన్న ద్వారం పెట్టి ఆలయం నిర్మించాడుట. జలలింగం వున్న గర్భాలయం కూడా చాలా చిన్నది. ఎక్కువ మంది పట్టరు. మామూలు నేల కన్నా తక్కువ ఎత్తులో ఉంటుంది. మూడు నాలుగు మెట్లు దిగి ద్వారం చిన్నది కనుక వంగి లోనికి ప్రవేశించాలి. లింగం మాత్రం బయట నుంచే గవాక్షాల ద్వారా కనిపిస్తుంది. అభిషేకాదులకు మాత్రమే లోనికి అనుమతిస్తారు. లోపలికి వెళ్ళాక పెద్ద పానవట్టం, దానిపై లింగం, దానికి తడి, మడి బట్టలు కట్టి ఉంటాయి. కింద వున్న నీరు వల్ల ఆ బట్టలు వాటంతట అవే తడిసి పోతాయట. మరి నీరేదీ అని అడిగితే, ఆ ఆలయ అర్చకుడు ఒక ఇనుప చువ్వతో, రెండు బండల మధ్యనున్న పగులు మధ్య, కొంచెం కొట్టి చూపించాడు. వెంటనే కిందనే వున్న నీరు మా మీదకు కూడా చిమ్మింది. అక్కడ అభిషేకం చేయించుకుని అమ్మవారి దగ్గరకు వచ్చాం. నిజానికి ముందు ఎదురుగా అమ్మవారి గర్భగృహమే వస్తుంది. దాని పక్కకు శివాలయ గర్భగృహం ఉంటుంది. అమ్మవారికి కూడా అర్చన చేయించుకుని బయటకు వచ్చాం.
ఇక ఆలయం అతి పెద్ద ప్రాంగణం. సుమారు అయిదు, ఆరు ఎకరాల ప్రాంగణం. శ్రీరంగంలోని రంగనాథాలయం, ఇదీ ఒకే సారి కట్టారుట. రెండింటికీ అయిదు ప్రాకారాలుంటాయి. పెద్ద పెద్ద ఎత్తైన ప్రాకారపు గోడలు, లెక్కపెట్టలేనన్ని స్తంభాలూ ఈ ఆలయం విశేషం. ప్రతి స్తంభమూ ప్రత్యేక శిల్పాలతో చెక్కబడి ఉంటుంది. మేము మొదట ఏదో చిన్న ఆలయం అనుకుని ప్రవేశించాం. కానీ రోడ్డు మీద నుంచి అమ్మవారి సన్నిధికి చేరాలంటే ఈ ప్రాకారాలన్నీ దాటుకుంటూ, కనీసం ఒక కిలోమీటరు దూరం నడవాలి. అమ్మవారి ముఖం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొదట్లో ఈ అమ్మే ఉగ్రమూర్తి అంటే నమ్మ బుద్ధి వేయదు. శివుడు మాత్రం మహా రాజసంగా, మళ్ళీ అందులోనే శాంతంగా ఉంటాడు. ఆ భావాలన్నీ అక్కడికి వెళ్లి చూస్తేనే గానీ తెలియవు. లలిత సహస్ర నామాలలో గల ఆ తాటంక యుగళీభూత తపనోడుప మండలా అనే నామానికి నిలువెత్తు మూర్తి ఇక్కడి అఖిలాండేశ్వరీదేవి.
ఇక అక్కడి నుంచి పక్కనే వున్న తంజావూరు లోని రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వర ఆలయానికి వెళదాం. బృహత్ అంటే పెద్దది అని అర్ధం. ఈ శివుడు నిజంగానే బృహత్ ఈశ్వరుడు. మహా దేవుడు, మహా శివుడు. ఇంత పెద్ద లింగాన్ని చూడటం ఇదే మొదటి సారి. మన శ్రీకాకుళం జిల్లాలోని ఎండల మల్లిఖార్జునుడి లింగం కూడా ఇలాగే చాలా పెద్దది. కానీ మేము మొదటిసారి చూసిన అతి పెద్ద లింగం ఇదే. మన అమరావతి, సామర్లకోట, దక్షారామంలో కూడా పెద్ద పెద్ద లింగాలే ఉంటాయి కానీ అవి సన్నగా పొడవుగా ఉంటాయి. ఇది అలా కాదు. ఏక శిలలో పెద్ద పానవట్టం, దానిపై పెద్ద లింగం. ఇదంతా కనీసం రెండు, మూడంతస్తుల ఎత్తుంటుంది. గర్భాలయమే చాలా పెద్దది. అభిషేకం చేయాలంటే, అర్చకులు కూడా పక్కనే వున్న మెట్లెక్కి పైకి వెళతారు. భక్తులెవ్వరికీ ఈ గర్భాలయంలోకి ప్రవేశం లేదు. ఇక్కడి శివుడి పేరు రాజరాజేశ్వరుడు. పెద్ద ఆలయం కనుక బృహదీశ్వరాలయం అని పేరు వచ్చింది కానీ, ఈ ఆలయం నిర్మించిన రాజరాజ చోళుని పేరు మీద, ఈ దేవుడి పేరు రాజరాజేశ్వరుడు.
ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే, లోపలికి వెళ్ళడానికే చాలా దూరం నడవాలి ఈ ఆలయం యునెస్కో గుర్తించిన కట్టడాల్లో ఒకటి. ప్రస్తుతం ASI వారి అధీనంలో వుంది. మూడు గోపురాలను, ప్రాకారాలను దాటితే గానీ నంది మంటపం కూడా రాదు. ఎప్పుడూ శివలింగం కన్నా నంది పెద్దగా ఉండాలనేది శాస్త్రం. మరి నంది శివునికి వాహనం కదా. అంతటి శివునికి అంతకన్నా పెద్ద నంది. ఈ మంటపం పైకి ఎక్కి నందీశ్వరుని దగ్గరగా చూడవచ్చు. కానీ ఎక్కాలంటే, మోకాళ్ళు పట్టేస్తాయి. రాజరాజ చోళుని కాలంలో అందరూ ఆజానుబాహులు కాబోలు, మెట్లు మాత్రం అన్ని చోట్లా ఎత్తెత్తు మెట్లే. అవి దాదాపు ఇప్పటి మన మూడు మెట్లకి సమానం. నంది ఎంత అందంగా, సాత్వికంగా ఉంటుందో, శివుడొస్తాడేమో, ఎక్కించుకుని ఓ రౌండ్ తిరిగేసి వద్దామని, సదా సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది. ఇక్కడ అన్నీ బృహత్తే. ప్రాంగణం బృహత్, నంది బృహత్, శివుడు బృహత్, మెట్లు బృహత్, లోపల ఒకచోటికి, మరో చోటికి దూరాలు బృహత్, అన్నీ ఎక్కువే. నందిని చూసి వచ్చి, కాసేపు కూర్చుని, సేదదీరి, మళ్ళీ బయల్దేరాం. మళ్ళీ బోల్డు మెట్లెక్కాక లోపల పెద్ద ముఖమంటపం, దానిని దాటి వెళితే అంతరాలయం, గర్భాలయం. మేము వెళ్లిన రోజున ఎవరో స్కూల్ పిల్లలు కూడా టూర్ కి వచ్చారు. పొలోమని ఆ పిల్లలు, వాళ్ళను అదుపు చేయటానికి వాళ్ళ టీచర్లు. వాళ్ళ వల్ల మాకు కొంచం ఆలస్యం అయ్యింది. మామూలుగా ఈ ఆలయంలో అంత రద్దీ ఉండదు. మేము మూడు సార్లు వెళ్ళాం. లోపల మహాదేవుడు. ఇక్కడ ప్రత్యేక పూజలు, అవీ వుండవు. కేవలం దర్శనం మాత్రమే. కాకపోతే, అర్చకులు వాళ్ళ నియమానుసారం అర్చనలు, అభిషేకాలు చేస్తూ వుంటారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు ఇస్తారు. లోపల మెట్లు ఉంటాయి. అవి ఎక్కి అర్చకులు అభిషేకం చేస్తూ వుంటారు. మెట్లు ఎక్కాక గర్భగుడిలో నలువైపులా శివుడి చుట్టూ నిల్చుని అభిషేకం చెయ్యటానికి వీలుగా బాల్కనీ లాంటి కట్టడం ఉంటుంది. అంత పెద్ద శివుడికి, పానవట్టానికే కాక, ఈ బాల్కని పిట్టగోడలకు కూడా మడి బట్టలు కడతారు. చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగానే చూడటానికి రెండు కళ్ళూ చాలవు. అంత పెద్ద పెద్ద బృహత్ కట్టడాలు అవి. నెమ్మదిగా శివుడిని చూసుకుని బయటకు వచ్చాం.
మావారు ఎన్ని ఉపాలయాలు ఉన్నా సరే, అన్నీ చూడందే ఎక్కడా వదిలిపెట్టరు. నేను మాత్రం కాసేపు కూర్చుని వెళ్దాం అన్నా. మళ్ళీ కాసేపు గార్డెన్ లో కూర్చుని అప్పుడు లేచి ఉపాలయాలు చూసాం. పార్వతి, గణపతి, కార్తికేయ, దక్షిణామూర్తి, చండీశ్వరుడు ఇక్కడి ప్రధాన ఉపాలయాలు. ఇంకా ఉపాలయాలు కూడా చాలానే వున్నాయి, మాకే చూసే ఓపిక లేక పోయింది. చూడటానికి ఒకటే క్యాంపస్ కానీ, లోపల ఎంత ఉందో. ప్రతిచోటా లోకప్పు పై అలనాటి పెయింటింగ్స్ వున్నాయి. దేవాలయం గోడల మీద ఆనాటి శిలా శాసనాలు వరుసగా వున్నాయి. మొదటి గోపురం లోనుంచి లోపలికి రాంగానే, మన పాదరక్షలు వదిలేయమంటారు. లోపల ఎండలో నడవాలంటే, కాళ్లు కాలిపోతూ ఉంటాయి. ఒకసారి, బహుశా 2013 లో అనుకుంటాను. మిట్ట మధ్యాన్నం వెళ్లాం. కాలు తీసి కాలు పెట్టాలంటే భయం వేసింది. పరుగు పరుగున ఒక మంటపానికి వెళ్ళటం, అక్కడ కూర్చోవటం, మళ్ళీ ఓపిక వచ్చాక తరువాతి మంటపానికి పరిగెత్తటం, ఇలా జరిగింది. అటువంటప్పుడు గార్డెన్లో లాన్లో కాస్త పచ్చగడ్డి కనిపిస్తే హాయిగా అనిపించింది. కానీ లాన్ మీద నడవనివ్వరు. ఇలాంటప్పుడు కాళ్ళు కాలకుండా ఒక పాచ్ లాగా దారి పొడుగునా వైట్ కూల్ పెయింట్ వేస్తే బాగుండు కదా అనిపించింది. అక్కడ బయట ఒక సావనీర్ షాప్ కూడా వుంది. అక్కడ మేము ఒక స్ఫటిక లింగం కొనుక్కున్నాం. చాలాకాలం అది మా ఇంట్లో నిత్య అభిషేకాలు అందుకుంది. నర్మదా బాణ లింగం వచ్చాక ఈ స్ఫటిక లింగాన్ని మా పెద్దబ్బాయికి ఇచ్చాం. ఆ తరువాత నుంచీ నర్మదా లింగానికే అభిషేకం మా ఇంట్లో.

ఇప్పుడు ఆ ఆలయంలో వున్న మరో బృహత్ విశేషం గురించి చెప్పుకుందాం. అది ప్రధాన ఆలయ గోపురశిఖరం. అంత పెద్ద ఏకశిలా గోపురశిఖరాన్ని ఎక్కడా చూడం, ఎక్కడా లేదు కూడాను. సుమారు 80 టన్నుల గ్రానైట్ ఏకశిల. అసలు ఎవరికైనా దాన్ని అంత పైకి ఎలా ఎక్కించారో కదా అని అనిపించక మానదు. అంతే కాదు ఈ ఆలయం, దాని గోపురశిఖరం రెండూ కూడా ఎంత పెద్దవంటే, ఆ గోపురశిఖరపు నీడ ఎప్పుడూ ఏ కాలంలో కూడా ఆలయపు ప్రాంగణం లోపల పడదట. అంత ఎత్తు గోపురం అది. మొత్తానికి ఆ రాజరాజచోళుడు కన్న బృహత్ స్వప్నానికి సాకార రూపం ఈ బృహదీశ్వరాలయం. ఈ ఆలయంలో ఎన్నో సొరంగాలు ఉన్నాయని అంటారు. ప్రమాదకరమని చాలావాటిని మూసేసారట. పర్యాటకులకు వాటిల్లో ప్రవేశం మాత్రం లేదు.

దీనితో మన జలలింగం దర్శనం, బృహదీశ్వర బృహత్ లింగ దర్శనం, శ్రీచక్ర తాటంకాలు ధరించిన అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనం పూర్తి అయినాయి. తరువాత పంచభూతాలలో మూడవది అయిన తేజోలింగం, అదే ఆకాశ లింగాన్ని చూడటానికి చిదంబరం వెళదామా. దారిలో వైదీశ్వరున్ని కూడా చూసొద్దాం. అందునా ఈ వైదీశ్వరుడు మా ఇంటి దేవుడు కూడాను.
ఓం జంబుకేశ్వరాయనమః, ఓం అఖిలాండేశ్వరీ దేవ్యై నమః
ఓం బృహదీశ్వరాయనమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650











కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి