చిదంబరం-వైదీశ్వరం

చిదంబరం-వైదీశ్వరం  

చిదంబర క్షేత్రం పంచభూత శివ క్షేత్రాలలో మూడవది. ముందరే చెప్పా గదా, పంచ భూతాలు, పృధ్విరాపస్తేజోరగ్నిర్వాయుః అని. పృధ్వీ తత్వంతో కంచిలో ఏకామ్రేశ్వరునిగా కరుణిస్తూ, ఆపస్తత్వంతో, అంటే జలతత్వంతో తిరువనైకోయిల్ లో జంబుకేశ్వరునిగా కనిపిస్తుంటే, ఇక్కడ చిదంబరంలో చిదంబరేశ్వరునిగా ఆకాశతత్వంతో కటాక్షిస్తున్నాడు ఆ మహాదేవుడు. ఆకాశతత్వం, అంటే తేజోతత్వం. ఆకాశంలో తేజస్సు, వెలుగు తప్ప ఏముంటుంది. మరో విషయం, మట్టినీ, నీటినీ, నిప్పునీ, తాకచ్చు, గాలి మనను తాకితే అనుభూతి చెందవచ్చు. కానీ ఆకాశం అంటే, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎంత ఎత్తులో ఉంటుంది, ఎంత దూరంలో ఉంటుంది, ఎంత మేర ఉంటుంది అన్న విషయం, పై నాలుగు చెప్పినంత స్పష్టంగా చెప్పలేము. ఆ తెలిసీ తెలియని, కనిపించీ కనిపించని, తత్వమే ఈ చిదంబర ఆకాశతత్వం. ఇక్కడ మనను దేవుడిని తాకనివ్వరనుకోండి, ఇక్కడే కాదు ఈ పంచభూత లింగాలలో ఏ లింగాన్నీ భక్తులను తాకనివ్వరు. శ్రీకాళహస్తి లోనైతే పూజారులు కూడా, ఆ వాయులింగాన్ని తాకరు. ఇప్పుడు తెలుసుకుందాం. చిదంబరుడంటే ఏమిటో, ఎవరో.

    

చిదంబర అంటే చిత్ అంబర అని. చిత్ అంటే కనిపించని మాయ. సత్ అంటే సత్యం, చిత్ అంటే మాయ, జ్ఞానం, అరూపం, అమూర్తం, ఇంగ్లీషులో చెప్పాలంటే, abstract విషయం అది. జ్ఞానాన్ని చూడగలమా, లేదే, ఇదీ అంతే. అనుభవించవచ్చు, తెలుసుకోవచ్చు, కానీ దానికీ యోగ్యత కావాలి. ఆ చిత్ స్వరూపాన్ని చూసే, అర్హత మనకు ఉందా, వగైరా ప్రశ్నలన్నీ మనకు మనమే వేసుకోవాలి. ఇక్కడ ఇంకో పరీక్షకుడు ఉండడు. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఆ ఆకాశం ఎలా ఏమీ లేకుండా శూన్యంగా ఉంటుందో, ఈ చిదంబరుడు కూడా అంతే. ఇప్పడు అంబర అంటే అర్ధం చెప్పుకుందాం. అంబరం అంటే ఆకాశం, అంబరం అంటే వస్త్రం, అంబరం అంటే శూన్యం, అంబరం అంటే అందనిది. ఈ కనిపించని ఆ అరూప చిత్ ని, ఆ అందని ఆకాశంలో అందుకోవాలి. ఇప్పుడు అర్ధం చేసుకోండి చిదంబరంలో చిదంబరేశ్వరుడెవరో. మన పక్కనే ఉంటూ, ఇంకా వివరంగా చెప్పాలంటే, మనలోనే, మనతోనే ఉంటూ మనకు దొరక్కుండా మనతోనే ఆడుకునేవాడు. ఇప్పుడు ఆ చిదంబర ఆలయ విశేషాలు చెప్పుకుందాం.    

శివుడు ఒకసారి తనను పూజించే ఋషుల అజ్ఞానాన్ని పోగొట్టడానికి, ఒక సుందర పురుషుని అవతారం ధరించి, శ్రీ మహా విష్ణువును మోహినీ అవతారంలో పక్కన పెట్టుకుని, ఋషులనూ, ఋషిపత్నులనూ మోహింపచేయటానికి, చిదంబరం దగ్గర వున్న ఒక వనం లోకి ప్రవేశించాడు. అప్పటి వరకూ ఋషులు ఏ దేవుడినైనా, మంత్రాలతో, యజ్ఞ యాగాదులతో వశం చేసుకోవచ్చనే అహంకారపు అజ్ఞానంలో వున్నారు. ఈ సుందరాకారుడైన శివుణ్ణి చూసి, ఋషిపత్నులు మోహంలో శివుని వెంటపడితే, అందమైన మోహినిని చూసి ఋషులు మోహంతో ఆమె వెంటబడ్డారు. కాసేపటి తరువాత ఋషులకు తమ భార్యలను చూసి కోపం వచ్చి, వీడెవడు మాయావి, మా భార్యలను సమ్మోహింప చేస్తున్నాడు, అని శివుని మీదకు మంత్రాలతో భయంకరమైన సర్పాలను వదిలారు. శివుడు ఆ సర్పాలను, అతి తేలికగా మచ్చిక చేసుకుని, వాటిని తన శరీరంపై ఆభరణాలుగా ధరించాడు. శివుడు నాగాభరణుడయ్యాడు. ఆ పాములు శంకరాభరణాలయ్యాయి. ఋషులు మరింత రెచ్చిపోయి ఈసారి శివునిపై పులిని వదిలారు. శివుడు ఆ పులి చర్మం చీల్చి దాన్ని వస్త్రంగా మొలకు చుట్టుకున్నాడు. అప్పుడు కూడా ఋషులు సత్యాన్ని గ్రహించక, అపస్మారుడనే రాక్షసుడిని శివుని పైకి వదిలారు. శివుడు ఆ రాక్షసుడిని తేలికగా జయించి, తన కాలి కింద వేసి తొక్కి పెట్టాడు. అప్పుడు ఆ ఋషులకు మైకం వదిలింది. తమ దగ్గరకు వచ్చింది ఆ మహాదేవుడని గ్రహించి స్తుతించారు. అప్పుడు శివుడు ఆ ఆనందంలో ఆ రాక్షసుడైన అపస్మారుడి వీపుపై ఆనందతాండవ నృత్యం చేసాడు. 

   

ఆ ఆనంద తాండవ నృత్యం చూడటానికి పతంజలి, వ్యాఘ్రపాదుడనే మునులూ వచ్చారు. పతంజలే వ్యాఘ్రపాదుడి రూపంలో వచ్చినట్టు కూడా ఒక గాధ వుంది. అప్పుడు శివుడు చేసిన నాట్యమే అసలైన భరతనాట్యంగా పేరొచ్చింది. ఇక్కడ శివుడు చేసింది ఆనంద తాండవ నృత్యం. ఈ నృత్య భంగిమలన్నీ ఈ  చిదంబర నటరాజాలయంలో అన్ని ద్వారాల పైనా రెండు వైపులా శిల్పాలలో చెక్కి వున్నాయి. ప్రతి ద్వారానికి 32 శిల్పాలు, రెండు వైపులా కలిపితే 64 శిల్పాలు, అలా నాలుగు దిక్కులా కలిపి మొత్తం 108 నృత్య భంగిమల శిల్పాలు, ఏ రెండూ శిల్పాలూ ఒక్కలా వుండవు. అన్నీ వేర్వేరు భంగిమలు. ఆ గొప్ప శిల్పకారులకు పాదాభివందనాలు. అంతే కాదు ఆలయం అంతటా చక్కని రంగుల్లో లోకప్పుపై అద్భుతమైన పెయింటింగ్స్. అసలు ఆ పెయింటింగ్స్ ని ఇన్నేళ్ల నుంచీ అంత బాగా ఎలా సంరక్షిస్తున్నారో కదా. ఆ చిత్రకారులందరికీ శతకోటి వందనాలు.    

                                            
                                                              ఇంతకీ ఆ అపస్మారుడెవడంటే, అజ్ఞానం. మనలోని అజ్ఞానమీ అపస్మారుడు. నిజమే కదా అజ్ఞానం రాక్షసత్వమే కదా. ఒక్కసారి గమనించండి. మనిషి అజ్ఞానంతో యెంత రాక్షసకార్యాలు చేస్తాడో. శివుడు ఆ రాక్షసుడిని ఓడించాడు. కింద పడేసి, అతని వీపుపై నిలిచి తాండవం చేస్తాడు. అజ్ఞానాన్ని జయించాలి, అంతే కానీ అజ్ఞానుడిని చంపకూడదు. అదే ఈ అపస్మారుని వృత్తాంతం నుంచి నేర్చుకోవాల్సింది. మధ్యలో మరో తాండవ నృత్య కథ కూడా చెప్పాలనిపిస్తోంది, చెప్తాను. కాకతీయులనాటి రామప్ప దేవాలయంలో, వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో శివుని యొక్క నృత్య భంగిమలతో ఎన్నో శిల్పాలున్నాయి. ఆ శిల్పాలను చూసిన ప్రసిద్ధ నాట్యాచార్యులు శ్రీ నటరాజ రామకృష్ణ గారు పేరిణి శివ తాండవం అనే కొత్త నృత్య రీతిని కనుగొని, తన శిష్యులకు నేర్పించి, ప్రచారం చేశారు. ఎన్నో ప్రదర్శనలిచ్చారు.


   

శివుడు ఆ విధంగా ఆనంద తాండవ నృత్యం చేసి నటరాజు అయ్యాడు. చిదంబరంలో అమ్మవారి పేరు శివకామసుందరి. ఈ అమ్మవారు స్వామి పక్కనే మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో శివుడు మూడు రూపాలలో కటాక్షిస్తున్నాడు. మొదటి రూపం నటరాజ స్వామి. ఈ నటరాజు రెండు చేతులతో నృత్య భంగిమలో అందరికీ అభయమిస్తూ, మరో చేతిలో దుష్ట సంహారార్ధం అగ్నిని ధరించి, మరో చేతితో ఢమరు వాయిస్తూ, అపస్మారుడనే అజ్ఞానం మీద నర్తిస్తూ ఉంటాడు. ఆ నటరాజు చుట్టూ అగ్నికీలలతో ఒక వలయం ఉంటుంది. ఆ వలయమే ఈ జగత్తు. ఈ జగత్తు మధ్యలో అగ్నిని, ఢమరుని చేత ధరించి, మనకు అభయాన్నిస్తూ అజ్ఞానం మీద ఆనంద తాండవం చేస్తుంటాడు ఆ మహాదేవుడు, నటరాజ స్వామి. ఇక రెండవ రూపం స్ఫటిక లింగ రూపంలోని చంద్రమౌళీశ్వరుడు. ఈ స్పటిక లింగాన్ని నిరంతరం దర్శనానికి ఉంచరు. కేవలం అభిషేక సమయమప్పుడు మాత్రం తీసి తిరిగి ఆ లింగాన్ని ఒక పెట్టెలో పెట్టేస్తారు. చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగానికి చేసే ఈ అభిషేకం, అర్చన ఎంత చక్కగా, దీక్షతో, నియమాలతో చేస్తారో, ప్రత్యక్షంగా చూడవలసిందే. సుమారు గంట సేపు పడుతుంది ఈ సేవకు. ఆ తరువాత నటరాజ మూర్తికి, శివకామసుందరి అమ్మవారికి, చంద్రమౌళీశ్వరుడికి హారతి ఇస్తారు. ఈ హారతి కూడా చాలా డిటైల్డ్ గా, ఎన్నో రకరకాల హారతులు ఇస్తారు. ఇక్కడ మళ్ళీ నేను కొంచం చెప్పాలనుకుంటున్నాను. గుడిలో దేవుడికి హారతి ఇచ్చాక, చాలామంది ఆ హారతిని కళ్ళకు అద్దుకుంటూ వుంటారు, ఒకసారితో కూడా తృప్తి పడక, కొందరు మూడుసార్లు కూడా అద్దుకుంటూ వుంటారు. దేవుడికి దృష్టి దోషం పోవటానికి హారతి ఇస్తారు. ఆ దిష్టిని మన కళ్ళకు అద్దుకోకూడదు. నమస్కరిస్తే చాలు. ఒకసారి దిష్టి తీసాక దానికి విలువ లేదు. కొన్ని ఆలయాల్లో అయితే, హారతి ఇచ్చాక ఒకసారి పైకెత్తి అందరికీ చూపించి, పక్కన కింద పడేస్తారు. కానీ కొంతమంది  అర్చకులు హారతి పళ్లెంలో డబ్బులు వారికి వస్తాయని, ప్రతి ఒక్కరి దగ్గరికీ వచ్చి హారతిచ్చి డబ్బులు తీసుకుంటూ వుంటారు. అదే మన ఇళ్లల్లో దిష్టి తీస్తే మనం కళ్ళకద్దుకుంటామా గమనించండి. ఎంతో మంది దేవుడిని చూస్తూ వుంటారు, అందులో ఎన్ని దిష్టి కళ్ళుంటాయో అని ఆ దేవతలకు దిష్టి తీయటం కోసం గాను, శాస్త్రం ఈ హారతిని షోడశోపచారాలలో ప్రవేశపెట్టింది.   

   

మూడవరూపం, పంచభూతలింగం, ఆకాశలింగం, తేజోలింగం చిదంబరేశ్వరునిది. నటరాజస్వామికీ, శివకామసుందరీదేవికీ, చంద్రమౌళీశ్వరస్వామికీ అభిషేక సమయంలో హారతి ఇచ్చినప్పుడు ఈ చిదంబరేశ్వరునికి కూడా హారతి ఇస్తారు. కేవలం అప్పుడు మాత్రమే ఈ చిదంబరేశ్వరుని "దర్శనం" అవుతుంది. ఇప్పుడు చిదంబరేశ్వరుని గురించి చెప్తా. ఇందాకే అనుకున్నాం కదా, చిత్ అంటే మాయ అని, అంబరం అంటే అందని ఆకాశం అని. గర్భాలయంలో నటరాజస్వామి పక్కనే ఒక తెర ఉంటుంది. ఆ తెర వెనుక బంగరు బిల్వపత్రాల మాలలు పొడవుగా వేళ్ళాడుతూ ఉంటాయి. బిల్వ పత్రాలున్నాయంటేనే అక్కడ శివుడున్నట్టు. హారతి సమయంలో ఆ తెర పక్కకు తొలగించి, ఆ బిల్వ పత్రాలను చేత్తో పక్కకు లాగి పట్టుకుని లోపల వున్న ఆ శూన్యానికి హారతి ఇస్తారు. మనకు ఆ బంగారు బిల్వ పత్రాల గలగల వినిపిస్తుంది. వెనుక వున్న ఖాళీ చీకటి కనిపిస్తుంది. హారతి బయట ఎంతో సేపు ఇస్తారు కానీ, ఇక్కడ మాత్రం ఒక్క నిముషం హారతి ఇచ్చి మళ్ళీ ఆ బిల్వ మాలలు, ఆ తెర దించేస్తారు. అంతే, అదే ఆ చిదంబరేశ్వరుని దర్శనం. ఇదే ఆ చిదంబర రహస్యం. ఆ వెనుక ఏముందీ అనేదే అసలు చిదంబర రహస్యం. బహుశా శివుడు కరుణిస్తే, మనకు ఆ గర్భాలయపు వెనుక గోడపై శివుని రూపం గోచరిస్తుందేమో. చిత్ అనే మాయ తెరను తొలగిస్తే కనపడేది ఆ మహాదేవుడే. అంటే దైవదర్శనం కావాలంటే ఆ మాయ తొలగాలి. ఆ మాయ తొలిగితే అంతా సత్యం శివం సుందరం. 'తెరతీయరా శివా', అని ప్రార్ధిస్తూ ఉంటే ఎప్పుడో ఆయనే మన మాయ అనే తెరను తొలగిస్తాడు. ఓం శివాయ నమః.   

 
          
ఇక ఇదే ఆలయంలో విష్ణుమూర్తి గోవిందరాజస్వామి రూపంలో వున్నారు. ఆయన ఇక్కడ క్షేత్రపాలకుడు. ఆయన దేవేరి పుండరీకవల్లి కూడా ఉంటుంది. ఈ గోవిందరాజస్వామి ఆలయం 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. లెక్క పెట్టలేదు కానీ ఇప్పటివరకూ మేము సుమారుగా ఓ 60 పైనే ఈ వైష్ణవ దివ్యదేశ క్షేత్రాలు చూసాం. ఈ ఆలయంలో గణేశుడు, కార్తికేయుడు, నంది. పార్వతీదేవి, రథంలో వున్న సూర్యుడు, పతంజలి మహర్షి, వ్యాఘ్రపాదుడు, మనకు దర్శనమిస్తారు. అంతే కాదు ఒక పెద్ద పుష్కరిణి కూడా ఈ ఆలయంలో వుంది. దానిపేరు శివగంగ. ఇక్కడ రకరకాల సైజుల్లో వివిధ స్తంభాల మంటపాలు వున్నాయి. వాటిని ఇక్కడ సభలు అంటారు. చిత్సభ, హేమసభ, హిరణ్యసభ, కనకసభ అనే పేర్లతో భక్తులు కూర్చునేందుకు వీలుగా పెద్ద పెద్ద మంటపాలుంటాయి. తమిళనాడులో ఎన్నో ప్రముఖ ఆలయాలు వున్నాయి. అన్ని ఆలయాలూ విశాల ప్రాంగణం వున్నవే. ఇంతంత పెద్ద ఆలయాలు ఇతర రాష్ట్రాల్లో తక్కువ కనిపిస్తాయి. ఇక ఈ ఆలయ ప్రాంగణం ఎంత పెద్దదంటే వర్ణించి చెప్పలేం. సుమారు 40, 50 ఎకరాల స్థలంలో ఈ ఉపాలయాలు, పుష్కరిణి ఉంటాయి. ఎక్కడ చూసినా స్తంభాలు, మళ్ళీ ఆ స్తంభాల మీదా శిల్పాలు, స్తంభాల మధ్యలో మంటపాల్లో శిల్పాలు. నాయనార్ల శిల్పాలు, ఎంత తిరిగినా, ఎన్ని చూసినా ఇంకా మిగిలిపోయిందేమో, అరే, ఆ వైపు చూడలేదేమో అనిపిస్తూ ఉంటుంది. తిరిగీ తిరిగీ కాళ్ళు నొప్పులు పుడతాయి. ఇక్కడ పూజారులను దీక్షితార్ అంటారు. ఈ దీక్షితార్లు భక్తులకు మరొక సదుపాయం కూడా కల్పిస్తున్నారు. అదేమిటంటే, మనం సంవత్సరానికి 1600 రూపాయలు కడితే, మన గోత్ర, నామ, నక్షత్ర వివరాలు రాసుకుని, నెలలో మనం ఎన్నుకున్న ఒకరోజు దేవుడికి అర్చనలు చేసి మనకు కుంకుమ, విభూతి పంపిస్తారు. ఈ సేవ మాత్రం ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పక చేస్తారు. ఈ ఆలయంలో కుజ రాహు కేతు పూజలు, నవగ్రహ పూజలు చక్కగా చేస్తారు. గురుగ్రహానికి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇవీ చిదంబరం ఆలయ విశేషాలు. 

వైదీశ్వరన్ కోయిల్:  శివుడు వైద్యుడి అవతారం ఎత్తిన ప్రాంతం ఈ వైదీశ్వరన్ కోయిల్. కోయిల్ అంటే కోవెల, దేవాలయం అని అర్ధం. చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉంటుంది ఈ ప్రదేశం. ఈ ఆలయం నవగ్రహ క్షేత్రాలలో అంగారక క్షేత్రంగా కూడా ప్రసిద్ధం. ఒకప్పుడు అంగారకుడిపై కుష్టు వ్యాధి వచ్చిందిట. అప్పుడు అంగారకుడు శివుని గురించి తపస్సు చేసి తన వ్యాధిని నయం చేయమని కోరాట్ట. ఆ సందర్భంలో శివుడు వైద్యునిగా మారి అంగారకునికి వైద్యం చేసి ఆ వ్యాధిని పోగొట్టాడుట. అప్పటి నుంచీ ఈ శివుడిని వైదీశ్వరన్, వైద్యనాథ అని అనటం మొదలైంది. ఈ వైదీశ్వరన్ కోయిల్ లో అమ్మవారు తాయాల్నాయకి. ఈమె తన చేతిలో ఔషధ యుక్తమైన తైలం వున్న పాత్ర ఒకటి పట్టుకుని నుల్చుని ఉంటుంది. ఈ ఆలయంలోనే అంగారకుని పెద్ద పంచలోహ విగ్రహం కూడా వుంది. దీనితో పాటు అంగారకుని రాతి విగ్రహం కూడా వుంది. ఇక్కడ వున్న అన్ని ఉపాలయాలూ ఒక్కచోటే పక్కపక్కనే ఉంటాయి. ఆలయం ప్రాంగణం పెద్దదే కానీ, ఎక్కువ భాగం షాపింగ్ కాంప్లెక్స్ వుంది. పూజకి కావాల్సిన అన్ని సంభారాలూ అక్కడే దొరుకుతాయి. ఈ ఆలయంలో వైదీశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు. ఇక్కడ మేము లోపలికి వెళ్ళంగానే ఒక పూజారిని సంప్రదిస్తే, ఆయనే మాకు అన్ని ఆలయాలూ చూపించి ఆ ఆలయ నియమం ప్రకారం, అయిదు దేవతలకూ పూజ చేయించి, ఆలయం అంతా తిప్పి చూపించాడు. 

 

ముందుగా మమ్మల్ని ఒక కొలను దగ్గరకు తీసుకు వెళ్ళాడు. ఈ పుష్కరిణి నీరు అన్నిరకాల చర్మ వ్యాధులనూ పోగొట్టుతుందిట. అందరూ అక్కడ స్నానాలు చేస్తున్నారు. మా పూజాసామగ్రిలో వున్న బెల్లాన్ని ఆ నీటిలో కలపమన్నాడు. తరువాత స్నానం చేస్తే చెయ్యమన్నాడు. నేను, మావారు ఇద్దరం నీరు ప్రోక్షించుకుని నమస్కారం చేసుకున్నాం. తరువాత మా దగ్గర వున్న ఉప్పు మిరియాలు తల చుట్టూ తిప్పుకుని అక్కడ వున్న స్తంభం దగ్గర వెయ్యమన్నాడు. ఇక్కడ ఏ పూజ చేసినా 5 దేవతలకూ విధిగా పూజ చేయాలి. ఆ అయిదు దేవతలెవరంటే, వైదీశ్వరన్, తాయాల్నాయకి, గణపతి, కుమారస్వామి, ధన్వంతరి. ఈ కుమారస్వామికి ఇక్కడ అమ్మవారు శూలం ఇచ్చింది అని చెప్పారు. అందుకని ఈయనను ఇక్కడ ముత్తు కుమారస్వామి అంటారు. సుబ్రహ్మణ్యుడే ఇక్కడ ఈ రూపంలో ఉంటాడు. ముందుగా గణపతికి పూజ చేసి, ఆ తరువాత వరుసగా మిగిలిన అందరు దేవతలకు కూడా పూజ చేయించాడు. ఈ 5 పూజలకీ సరిపడా దుకాణాలలో పూజాసామాగ్రి ఇస్తారు. చివరగా శివయ్య అభిషేకం అయిన తరువాత మమ్మల్ని ఇద్దరినీ కూర్చోబెట్టి, ఆశీర్వదించి బోల్డు ప్రసాదాలు ఇచ్చారు. తినగలినన్ని తిని, మిగిలినవి బిక్షగాళ్లకు ఇచ్చేశాం.  

 

ఈ ఆలయంలో రామ లక్ష్మణులు కూడా పూజలు చేశారట. జటాయువు, సంపాతిల చితా భస్మం ఈ పుష్కరిణిలో రాముడు కలిపాడట. ఇక్కడ ఆ రెండు పక్షులకీ కూడా విగ్రహాలున్నాయి. సాక్షాత్తూ సూర్యుడే ఇక్కడ వైద్యనాథేశ్వరుణ్ణి కొలిచాడుట. ఇక్కడ సోమస్కంధమూర్తికి, నటరాజస్వామికీ, దక్షిణామూర్తికీ, ధన్వంతరికీ, దుర్గాదేవికీ, వేదాలకీ కూడా ఉపాలయాలు వున్నాయి. ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వివిధ సేవలు చేస్తూ పూజారులంతా ఎప్పుడు చూసినా బిజీగానే  వుంటారు. తాయాల్నాయకి అమ్మవారు, గణపతి, ధన్వంతరి, దుర్గ, అంగారక ఆలయాల పక్కనే పుష్కరిణి ఉండటం వల్ల, అక్కడ ఎప్పుడూ కొంచెం తడి తడిగానే ఉంటుంది. కాళ్ళు జారకుండా కాస్త జాగ్రత్తగా నడవాలి. ఆ పక్కనే ఉప్పు మిరియాలు దిగదుడుచుకుని పోస్తూ వుంటారు. అన్నట్టు ఈ విధంగా ఉప్పు, మిరియాలతో దిష్టి తీసుకునే ఆచారం, తిరుత్తణి ఆలయంలో కూడా వుంది. అంతే కాకుండా ఆ పుష్కరిణి లో అందరూ బెల్లం కలపడంతో, దాదాపుగా అది పానకంలాగా అయిపోయింది. దాంతో కాళ్లు నేలకు అంటుకుంటూ ఉంటాయి. కొంచం చూసుకుని జాగ్రత్తగా, మన పురోహితుడు వెనకాలే వెళ్తే అన్ని పూజలూ, సేవలూ చక్కగా జరుగుతాయి. తాయాల్నాయకి అమ్మవారి ఆలయం లోనే అంగారకుని పెద్ద పంచలోహ విగ్రహం ఉంటుంది.  

 

బైటకు రాంగానే, రెండు రథాలు కనిపించాయి. బహుశా అవి ఉత్సవాల్లో వాడతారు కాబోలు. మేము చూసినప్పుడు మాత్రం రంగులు, అలంకరణలు చెదరి కాస్త కళావిహీనంగానే వున్నాయి. అక్కడ ఎదురుగా వున్న వీధిలోనే ఒక హోటల్ ఉంటే, అక్కడ రూమ్ తీసుకుని వున్నాం. ఆ హోటల్ గుడికి చాలా దగ్గరగా ఉండటంతో గుడికి, రావటం పోవటం మాకు తేలిక అయ్యింది. గుడి లోపల మాత్రం చాలా తిరగాలి. ఆ రద్దీలో, రొచ్చులో కొంచం కష్టమే. ఈ దేవుడు ముఖ్యంగా మా ఇంటి దేవుడవటంతో కష్టమైనను ఇష్టమేనని అనుకుంటూ తిరిగాం. ఆలయం ఎంత పురాతనమైనదో చూస్తూనే తెలుస్తుంది. అటువంటి గొప్ప ఆలయం మన కుటుంబానికి సంబంధించినది గదా, అనిపించి కాసేపు ఆనందంగా, గర్వంగా అనిపించింది. మా భట్టిప్రోలు కుటుంబం పూర్వీకుల సంస్కృతీ, సంప్రదాయం ఎంత గొప్పదో కదా అనిపించింది. కాకపోతే భాష బాధలు మాత్రం మామూలే, వాళ్ళ గోల వాళ్ళది, మా గోల మాది. వాళ్లకు ఏమి అర్ధం అయ్యిందో, మాకు తెలియదు. మాకు ఏం కావాలో వాళ్లకు తెలియదు. కాకపోతే ఏ గుడికి వెళ్లినా ఏం చేస్తామో, ఇక్కడా అదే చేసాం. గోత్ర, నామ, నక్షత్రాలతో అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు చేసాం. ఇది మా ఇంటి దేవుడు గదా అని మమ్మల్ని తమిళం వాళ్ళనుకోకండి. అచ్చ తెలుగు 6000 నియోగి బ్రాహ్మణ కుటుంబం మాది. ఇంటిపేరు భట్టిప్రోలు. ఎప్పుడో కొన్ని తరాల క్రితం మావారి పూర్వీకులు భట్టిప్రోలు నుండి శీర్ఘాళి వెళ్లి అక్కడ కొన్ని తరాలు వుండి, మళ్ళీ మా మామగారి తండ్రి తరంలో తెనాలి వచ్చి, మా మామగారి తరంలో హైదరాబాద్ వచ్చి నిజామ్ రైల్వేలో పనిచేసారుట. దాంతో అందరూ తిరిగి మళ్ళీ తమిళప్రాంతం నుంచి తెలుగుప్రాంతానికి వచ్చినట్లయ్యింది. సుమారుగా ఇదంతా 100 యేళ్ళ నాటి సంగతి. అందుకే ఇప్పటికీ మాకు మా మామగారు, వారి తమ్ముడూ, చెళ్ళెళ్ల కుటుంబాలూ, వాళ్ళ ద్వారా ఏర్పడిన బంధుత్వాలూ  తప్ప, మరో బంధువులు తెలియరు. మావారి ముత్తాతగారి పేరు మాత్రం వైద్యనాథ అయ్యర్. అందువల్ల ఈ వైదీశ్వరుడు మా కుల దైవమే కావచ్చునని అనిపిస్తుంది. మాకు మాత్రం మా అత్తగారు చెప్పిన మాటల వల్లే  మా ఇంటి దేవుడు వైదీశ్వరన్ అని తెలిసింది. ఇదీ కథ. 

  

వైదీశ్వరన్ లో మరో ప్రత్యేకత వుంది. అదే నాడీ జ్యోతిష్యం. అది ఈ ఊరికే చెందిన విశేషం. ఇప్పుడైతే అన్ని ప్రధాన నగరాల్లోనూ ఈ నాడీ జ్యోతిషం కేంద్రాలు తెరిచారు కానీ, ఒకప్పుడు కేవలం ఈ వైదీశ్వరన్ కోయిల్ లోనే ఈ తాళపత్రాలు దొరికేవి. ఈ తాళపత్రాలు తంజావూరు లోని సరస్వతీమహల్లో ఉండేవి. అప్పటి బ్రిటిష్ పరిపాలకులు, వీటిని చదివించి ఈ విశేషాలను గ్రహించారు. ఈ నాడీ జ్యోతిషం గురించిన తాళపత్రాలు అగస్త్యుడు రాసినట్టు చెపుతారు. భృగుమహర్షి కూడా కొన్ని నాడీ పత్రాలు రాసినట్టు తెలుస్తోంది. ఇంకా అనేక ఇతర ఋషులు రాసిన నాడీ గ్రంథాలు కూడా వున్నాయి. ఎక్కువ శాతం మాత్రం అగస్త్యుడివే ఇప్పటికీ అందుబాటులో వున్నాయి. ఇప్పటికీ ఇంకా కొన్ని తాళపత్రాలు సరస్వతీ మహల్లో వున్నాయి. కానీ వాటిని చదివేవాళ్ళు ఆ లైబ్రరీలో లేరు. ఈ తాళపత్రాలు చదవటానికి వైదీశ్వరన్ లో అవి చదవగల భాషాజ్ఞానం వున్నవాళ్లు వున్నారు. ఆ తాళపత్రాలు ఒక రకం పురాతన తమిళ భాషలో వుంటాయి. ఆ లిపి కూడా తమిళ, మళయాళ మిళితమైన ఒక రకం పాత లిపి. ఆనాటి భాష వేరు, అదీ పొయెటిక్ గా ఉంటుంది. ఆ లిపి చదివి ఆనాటి భాష అర్ధం చేసుకుని చెప్పేవారు, వైదీశ్వరన్ లో పుష్కలంగా వున్నారు. మన చేతి బొటనవేలి వేలిముద్ర తీసుకుని మన జాతకం రాసి వున్న నాడీ తాళపత్ర గ్రంథం తీస్తారు. ఒక్క కట్ట కాకుండా ఓ పది పన్నెండు కట్టలు తెస్తారు. ఒక్కో కట్ట తీసి ప్రశ్నలు అడుగుతూ వుంటారు, ఆ ప్రశ్నలకీ, మన సమాధానాలకీ సరిపోతే అప్పుడు ఆ కట్ట మనది, అంటే మన జాతకం వున్న తాళపత్రాల కట్ట అని చెబుతారు. అప్పుడు ఆ కట్ట తీసి మన భూత వర్తమాన భవిష్యత్తుల గురించి చెపుతారు.  మనం ఇక్కడ ఒక్కటే జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు సూటిగా, స్పష్టంగా అంతవరకు మాత్రమే సమాధానం చెప్పాలి. ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, మనల్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తారు. సమాచారమూ సరియైనది రాకపోవచ్చు. ఇప్పుడు మా అనుభవాన్ని చెప్తా వినండి.         
                    
 

మాకు నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవాలని ముందుగా ప్లాన్ లేదు. మేము గుడి నుంచి ప్రసాదాల సంచులతో బయటకు రాంగానే, మాకు ఒక వ్యక్తి ఎదురొచ్చి కన్నడా, తెలుంగా అని అడిగాడు. మేము తెలుగు అని చెప్పాం. నాడి చెప్పించుకుంటారా అని అడిగాడు. మావారు వద్దు అన్నారు. కానీ నేను ఈ సామానంతా రూంలో పెట్టాలి, కాస్త ఫ్రెష్ అయ్యాక తిరిగి వస్తాం కదా, అప్పుడు చూద్దాంలే అన్నా. సరే అలాగే రండి అన్నాడు. ఓ గంట రిలాక్స్ అయ్యాక బయటకు వచ్చాం. అతనే మళ్ళీ కనపడి రండి, రండి అన్నాడు, బహుశా బయటే కాపు వేసి ఉన్నట్టున్నాడు. మా హోటల్ వీధిలోనే అతని షాప్. వెళ్లి కూర్చున్నాం. ఏమి తెలుసుకోవాలీ అన్నాడు. మాకేం ప్లాన్ లేదు అని చెప్పాం. అతను నా బొటనవేలి వేలిముద్ర తీసుకుని మామూలుగా 500, కానీ మీకు భాష అనువాదం కూడా కావాలి కనుక 800 అన్నాడు. సరే అన్నా. ఓ అరగంటకి, ఓ పది పన్నెండు కట్టలతో వచ్చాడు. ఒక్కో కట్టా తీసి, నా పేరు, మా అమ్మా, నాన్న పేరు, నా చెళ్ళెళ్ళూ, తమ్ముడూ పేర్లు, తరువాత మావారి పేరు, ఆ తరువాత మా పిల్లల పేర్లు వగైరా కుటుంబం లోని అందరి పేర్లూ ఒక్కొక్కటిగా అడిగాడు. ముందే చెప్పాడు, అవునూ, కాదూ అని చెప్పండి చాలు అన్నాడు. ఎప్పుడు అతను అడిగిన పేరు నేను కాదన్నానో. అప్పుడు మరో రెండు మూడు ఉప ప్రశ్నలు వేసి అవీ సరిపోకపోతే ఈ కట్ట మీది కాదు అనేవాడు. మళ్ళీ ఇంకో కట్ట, మళ్ళీ మొదలు. చివరకు మా నాన్నపేరు శ్రీరామకృష్ణశర్మలో శ్రీ తో సహా చెప్పాడు. అమ్మపేరు కుమారితో సహా లీలాకుమారి అని చెప్పాడు. అన్ని పేర్లూ సూట్ అయ్యాయి. మా పిల్లల పేర్లు తానే చెప్పాడు. ఆ తరువాత గతం చెప్పాడు. అది మ్యాచ్ అయ్యాక వర్తమానం చెప్పాడు. అదీ అయ్యాక జరగబోయేవి చెప్పాడు. ఆ తరువాత ఆ రికార్డు అంతా ఒక CD లో రికార్డు చేసి ఇచ్చాడు. ఆ వివరాలన్నీ ఒక నోటుబుక్ లో జాతకచక్రంతో సహా వేసి ఇచ్చాడు. ఇదీ సంగతి. సరదాగా ఉంటుంది. వెళ్తే చెప్పించుకోండి. కానీ చాలామంది గతం, వర్తమానం సరిపోయాయి కానీ భవిష్యత్ సరిపోవటం లేదు అనే మాట విన్నాను. నా విషయంలో అయితే నేనింక వాటిని ముట్టుకోలేదు. ఇప్పుడు చూడాలి, వినాలి అనిపిస్తోంది. CD ప్లేయర్ కూడా లేదు. ఏం చెయ్యాలో. భవిష్యత్ మ్యాచ్ కావటం లేదంటే, బహుశా అక్కడినుంచీ ఆ కట్ట వీరిది కాదేమో. మొత్తానికి ఈ నాడీ గ్రంథ పఠనం కూడా అయిపోయింది. మొదటిసారి చూపించుకున్నాం కానీ తరువాత మళ్ళీ వెళ్ళినప్పుడు మాత్రం  చూపించుకోలేదు. పైగా భాష గోల. అవతల వ్యక్తి తాను మాట్లాడేది తెలుగే అంటాడు కానీ, మనకేమో ఆ తెలుగు కూడా అర్ధం కాదు. చిన్నప్పుడు మా బామ్మ ఎవరైనా చెప్పింది అర్ధం కాక కోపం వస్తే తిట్టేది 'అరవంధం మనిషి' అని. ఇన్నాళ్ళకి, ఇప్పుడు అర్ధం అయ్యింది ఆ తిట్టేమిటో, అరవ ఆంధ్ర మనిషి అని. ఈ అరవ ఆంధ్ర కలిసి అరవాంధ్ర అయ్యి, తరువాత అరవంధం అయ్యి ఉంటుందని. అంటే అటు అరవమూ కాదు, ఇటు ఆంధ్రమూ కాదు, నడమంత్రం అని. అమ్మయ్య, చిన్నప్పుడు తిట్టిన తిట్టుకి అర్ధం ఇన్నాళ్లకు ఇప్పుడు తెలిసింది, ఇదిగో ఈ నాడీ గ్రంథం చదివే మనిషిలా, ఏ భాషా అర్ధం కాకుండా మాట్లాడితే అలా అంటారని. ఒక తిట్టుకి అర్ధం తెలిసిన మహాదానందంలో ఆ రాత్రి హాయిగా నిద్రపోయా.  

ఇంతటితో మా చిదంబరం, వైదీశ్వరం యాత్రా విశేషాలు ముగిసాయి. ఇక పంచభూత క్షేత్రాలలో తమిళనాడులో వున్న మరో క్షేత్రం తిరువణ్ణామలై అని పిలిచే అరుణాచలం గురించి  చెప్పుకుందాం. 

ఓం చిదంబరేశ్వరాయనమః, ఓం నటరాజాయైనమః,
ఓం చంద్రమౌళీశ్వరాయనమః, ఓం ఆనందతాండవమూర్తయేనమః,
ఓం శివకామసుందరియైనమః, 
ఓం వైదీశ్వరాయనమః, ఓం తాయాల్నాయకియైనమః  
ఓం అంగారకాయైనమః, ఓం అగస్త్యాయనమః 



భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650




కామెంట్‌లు

  1. Excellent. Ambarame vasthram ga dharinche Sivude Chidambareeswarudu.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగా వివరించారు నాడీ జ్యోతిష్యం చాలా బాగుంది చిదంబర రహస్యం కూడా అద్భుతంగా ఉంది

      తొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సుబ్రహ్మణ్య క్షేత్రాలు - ఆరుపడైవీడు

తిరువణ్ణామలై-అగ్నిలింగం

శ్రీశైలే మల్లికార్జునమ్