హాలేబీడు-బేలూరు-శ్రవణబెళగొళ

హాలేబీడు హోయసలేశ్వర 
బేలూరు చెన్నకేశవ 
శ్రవణబెళగొళ బాహుబలి 

ఈ ప్రాంతాలు మేము రెండు సార్లు చూసాం. 1987లో సౌత్ టూర్ వెళ్ళినప్పుడు మొదటిసారి చూసాం, హాలేబీడు లోని ఈ హోయసలేశ్వరుని ఆలయం. మళ్ళీ ఉరవకొండలో వున్న రోజుల్లో 1989 లో మరొకసారి చూసాం. పేరుకి హోయసలేశ్వర ఆలయం అన్నా, లోపల రెండు ప్రధాన లింగాలు ఉంటాయి. ఒకటి హోయసలేశ్వర లింగం, రెండోది శాంతలేశ్వర లింగం. ఆనాటి హోయసల రాణి శాంతలాదేవి పేరుమీద నిర్మించిన ఆలయం. అందుకే ఒక లింగం ఆవిడ పేరు మీదే ఉంటుంది. రెండు లింగాలకూ ఎదుట రెండు బహు చక్కగా చెక్కిన నందులుంటాయి. హోయసలేశ్వరుని నంది వెనుకనే,  ఒక చిన్న సూర్యాలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం ముస్లింల దాడికి బలి అయ్యినప్పుడు వీటి గోపురాలు అన్నీ విరగ్గొట్టారు. కనుక ప్రస్తుతం వీటికి గోపురాలు లేవు. ఏ శిల్పాన్ని చూసినా, కన్నో, ముక్కు, కాలో, చెయ్యో నరకబడి వుంటుంది. కళ్ల నీళ్లొస్తాయి చూస్తుంటే. సృష్టిలో అందమైన వాటిని అపురూపంగా చూసుకుంటామే, ఎంత పరాయి మతం వాళ్ళ ఆలయాలైతే మటుకు, అలా ఎలా నాశనం చేయగలిగారు అనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో జరిగినట్టు దక్షిణ భారత దేశంలో ఆలయాల విధ్వంసం అంత ఎక్కువ జరగలేదు. కానీ కర్ణాటకలో మాత్రం, దాదాపు అన్ని ఆలయాలూ దాడికి గురయ్యాయి. అంత చక్కని శిల్పం భంగమై ఉంటే మనసు పిండేసినట్టు ఉంటుంది. మన వైజాగ్ లో కూడా కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఒక చెయ్యి నరకబడి ఉంటుంది. ఇలాంటి బాధాకరమైన దృశ్యాలు ఎన్నో, ఎన్నెన్నో. ఈ హళేబీడు, బేలూరు ఆలయాలను నిర్మించింది హొయసల రాజు విష్ణువర్ధనుడి కాలంలో. అతని రాణి శాంతలాదేవి స్వతహాగా నర్తకి. ఆమె చూపించిన చొరవ చేత మహారాజు విష్ణువర్ధనుడు ఇంత చక్కటి నృత్య భంగిమలతో కూడిన శిల్పాలతో, ఈ ఆలయాలను నిర్మించాడని చెపుతారు.

   

కర్ణాటకలో శిల్పసౌందర్యం చూడాలంటే మాత్రం బేలూరు, హళేబీడు, శ్రవణబెళగొళ, హంపి  వెళ్లవలసిందే. ఈ శిల్పాలు చూస్తే, నాకు మన వరంగల్ జిల్లాలో వున్న రామప్ప దేవాలయం, నల్లగొండ జిల్లాలో వున్న పచ్చల సోమేశ్వరాలయం, సింహాచలం వరాహనరసింహస్వామి ఆలయాలను గుర్తు వస్తాయి. ఎందుకంటే ఈ శిల్పాలన్నింటి  శైలి సుమారుగా ఒకే విధంగా  ఉంటుంది. ఎంతో నాజూకైన శిల్పం, ప్రతి చిన్న వివరమూ కనబడుతూ,  దాదాపు చూడంగానే అక్కడ నిజంగానే, ఆ వ్యక్తి ప్రాణం పోసుకుని నుంచున్నదా అనిపించేలా ఉంటాయి. ఈ ఆలయాలను భక్తితో కన్నా, కళాత్మక దృష్టి తోనే ఎక్కువ చూస్తాం. శిలలపై శిల్పాలు చెక్కినారూ అని పాటలు విన్నాం కదా, సాక్షాత్తూ ఆ శిల్పాలను చూసాక నోట మాట రాదు. చూస్తూనే ఉండిపోతాం. బేలూరులో ఆలయం లోపల, హళేబీడులో ఆలయం వెలుపల శిల్పాలను చూడాలంటారు. రామాయణ, భారత, భాగవత కథలను చక్కగా చెక్కారు. అంత చిన్న రాతిపై అన్ని డిటైల్స్ చెక్కడం ఎలా సాధ్యమయిందీ, అని ప్రతి శిల్పమూ మనల్ని అబ్బురపరుస్తూ ఉంటుంది. ప్రధాన శిల్పి జక్కనాచార్యుడు అంటారు.  

   

ఇక బేలూరు చెన్నకేశవ ఆలయం. ఈ ఆలయం కూడా విష్ణువర్ధనుడు, శాంతలాదేవి కట్టించినదే. ఇక్కడ ప్రధాన దేవత చెన్నకేశవుడు. ఈ ఆలయంలో బయటి గోడలు చాలా సీదా సాదాగా సింపుల్ గా ఉంటాయి. గొప్ప ప్రత్యేకత కనబడదు. కానీ ప్రతి స్తంభం దగ్గరా కప్పుకి గోడకు కలుపుతూ, చక్కని శిల్పాలు ఉంటాయి. వాటిని ఎంత చిన్న చిన్న వివరాలు కూడా స్పష్టంగా తెలిసేలా చెక్కారో, ఆ శిల్ప సుందరీ మణులు ఎంత నాజూగ్గా వుంటారో. లోపల అంతరాలయంలో మటుకు ప్రతి స్తంభమూ ఒక అపురూప కళాఖండము. ఎంత చెక్కారో, ఎన్ని చెక్కారో, ఎలా చెక్కారో  చెప్పటం అంత సులువు కాదు. ప్రతి స్తంభం పైన  ఒక చక్కని నాట్య భంగిమలోనో, లేక ముస్తాబు అవుతూనో వున్న అందమైన సుందరాంగుల శిల్పాలుంటాయి. ఈ సుందరీమణులని మదనికలు అంటారు.  శిల్పి మంచి రసికుడై ఉండాలి. అంతే కాదు, భక్తుడు కూడా అయి ఉండాలి. అందుకే ఆ శిల్పాలలో అంత జీవం, అందం, మార్దవం కనిపిస్తాయి. శిల్పాలలో మార్దవాన్ని ఇక్కడే చూడొచ్చు. ఈ ఆలయాలన్నీ సోప్ స్టోన్ తో చెక్కారుట. అందుకే ఎలా కావాలంటే, అలా మలచుకునేంత మృదువుగా ఈ రాళ్లుంటాయిట. రామాయణ, భారత, భాగవత గాధలను ఈ ఆలయంలో కూడా చక్కగా చెక్కారు. ఇక్కడ మరో రెండు ప్రత్యేకతలు వున్నాయి. ఒకటి, మొదటిసారి చెక్కిన చెన్నకేశవుని విగ్రహంలో, రాతిలో కప్ప ఉన్నందువల్ల, మొత్తం చెక్కాక ఆ శిల్పాన్ని ప్రతిష్టించకుండా, మరొక విగ్రహాన్ని తయారు చేశాకే ప్రతిష్ట జరగటం. ఆ పనికి రాదని, దోషముందని, వదిలేసిన శిల్పాన్ని కూడా ఆలయ ఆవరణలో మనం చూడచ్చు. బొడ్డు దగ్గర పగలకొట్టబడి ఉంటుంది ఈ విగ్రహం.  ఇలా లోపం వున్న విగ్రహం పూజకు పనికి రాదు కనుక దీనిని ఆలయం వెలుపలే వదిలేశారు. దీనిని కప్ప చెన్నకేశవ అంటారు. రెండో వింత, ఒక స్తంభం. ఆలయం ప్రాంగణం లోనే ఒక చిన్న ప్లాటుఫారం మీద ఈ స్తంభం ఉంటుంది. ఈ స్తంభం కింద నుంచి ఒక చేతి రుమాలుని అటునించి ఇటూ, ఇటునుంచి అటూ లాగి మనకు గైడ్స్ చూపిస్తూ వుంటారు. అంత పెద్ద స్తంభం ఏదో ఒక చోట మాత్రం నేలకు ఆని  ఉంటుంది, అంతే. ఇన్ని వందల ఏళ్లుగా పడిపోకుండా ఆ స్తంభం స్థిరంగా అలాగే వుంది. సరిగ్గా ఆ స్తంభం గరిమనాభి వద్ద నేలకు ఆని ఉండటంతో ఇన్నేళ్ళుగా పడిపోకుండా వున్నదని చెపుతారు. ఇల్లాంటి వింతలూ, విడ్డూరాలు, అబ్బురాలు ఎన్నో ఈ ఆలయంలో.  లేపాక్షిలో కూడా చూసాం. ఈ రెండు బేలూరు, హళేబీడు ఆలయాలను మనం శంకరాభరణం సినిమాలోనూ, అమరశిల్పి జక్కన్న సినిమాలోనూ కూడా చూడచ్చు. చాలా సినిమాల్లో కూడా ఉంటాయి కానీ, ఈ రెండు సినిమాల్లో బాగా చూపించారు.


ఇక్కడి శిల్పాలన్నీ రాణీ శాంతలాదేవినే ఊహించి చెక్కినవంటారు. ఆమె చాలా అందగత్తె, నర్తకి. ఆమె అందమే అన్ని స్త్రీ శిల్పాలన్నింటిలో ప్రతిఫలిస్తుందంటారు. ముఖ మంటపంలో లోపల ఆలయంలో ఒక స్థంభం వున్నది,  దీనినే నరసింహ స్తంభం అంటారు, ఒకప్పుడు ఇది గుండ్రంగా తిప్పితే తిరిగేదిట, ఇప్పుడు మాత్రం దాని వల్ల గుడి కూలిపోతుందని భయపడి ఫిక్స్ చేసేసారు, హంపి లోని ఏకశిలా రధం చక్రాల లాగా . ఇక ఆ స్తంభాలన్నీ మన రామప్ప ఆలయ స్తంభాలను, వరంగల్ లోని వెయ్యి స్తంభాల ఆలయం స్తంభాలను తలపిస్తూ ఉంటాయి. బహుశా ఆ శిల్పే ఇక్కడా చెక్కాడేమో. అన్నట్టు ఇలాంటి స్తంభాలనే హైదరాబాదు-విజయవాడ రహదారిలో వున్న పిల్లలమఱ్ఱి దేవాలయాల్లో కూడా చూసాను. లేతు మిషన్లు లేకుండా అంత నున్నగా అన్ని వందల ఏళ్ళ క్రితం ఇవన్నీ ఎలా నునుపు చేశారో కదా అనిపిస్తుంది. మామూలుగా రాతి మీద రాతిని రాపాడిస్తే ఆ ఉపరితలాలు నున్నగా అవుతాయి. మరి స్తంభాలు, అందునా ఇంత ఎక్కువగా చెక్కుడు ఉన్న స్తంభాలను అంత నునుపుగా ఎలా చేయగలిగారో. ఈ ఆలయానికి కూడా హాలేబీడు ఆలయం లాగా గోపురం ఉండదు. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఇవన్నీ నాశనం చేశారు. హైందవ రాజ్యాల మధ్య అంతఃకలహాలు, ముస్లిం రాజుల ధన, అధికార దాహాలూ కలిసి, ఎన్నో హైందవ రాజ్యాలు నశించిపోయాయి. మనం ఐకమత్యంగా ఉంటే మన గొప్ప శక్తిగా మారతాం, అదే లేకపోతే ఎవరికైనా అలుసైపోతాం. ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి.

జైన తీర్థంకరుడు బాహుబలి విగ్రహం వున్న పుణ్యస్థలం, శ్రవణబెళగొళ, జైనులకు తీర్థస్థలం. ఈ బాహుబలినే గోమఠేశ్వరుడంటారు. జైనుల మొదటి తీర్థంకరుడు ఆదినాథుడి పుత్రుడు బాహుబలి. తండ్రి తదనంతరం రాజ్యాధికారం కోసం బాహుబలి, అతని తమ్ముడు భరతుడు కలహిస్తారు. ఆ పోరులో బాహుబలి గెలుస్తాడు. అయినా తమ్ముడితో కలహం ఏమిటి అన్న బాధతో గెలిచిన రాజ్యాన్ని భరతుడికిచ్చి తాను సన్యసిస్తాడు. వీళ్ళు దిగంబర జైనులు. తాను ఓడిపోయినా కూడా తనకే అధికారం ఇచ్చి అన్న సన్యసించాడని, భరతుడికి కూడా సంతోషంగా ఉండదు. భరతుడూ తదనంతరం సన్యసిస్తాడు. రాజ్యం తరువాతి తమ్ముళ్లకు వెళుతుంది. బాహుబలి తపోనిష్ఠలో నిలబడి ధ్యానంలో ఉండగా అతని పైకి తీగలూ, లతలూ పాకేస్తాయి. ఇవి ఆ విగ్రహం మీద కూడా చెక్కారు. ఈ విగ్రహం ఒక కొండ మీద ఉంటుంది. ఆ విగ్రహం ఎత్తు సుమారు 60 అడుగులు. కొండ పైనున్న విగ్రహం ఎంతో దూరం నుంచి కూడా కనిపిస్తుంది. దీనికీ ఓ కధ చెపుతారు. ఈ విగ్రహం, ఆలయం కట్టించింది అప్పటి రాజు చాముండరాయుడు. తన తల్లికి ఎల్లప్పుడూ బాహుబలి విగ్రహం కనపడేలా వుండాలని అంత ఎత్తుగా ఆ విగ్రహాన్ని చెక్కించాడు.

             
                                                                  
ఈ కొండ పైకి వెళ్ళటానికి మెట్లు వున్నాయి కానీ, ఇన్నేళ్ళలో అవి వాడి వాడి అరిగి నున్నగా అయిపోయాయి. కాలు జారుతూ ఉంటే భయం వేసింది. అటూ ఇటూ తాళ్లు కట్టారు, పట్టుకుని ఎక్కటానికి. జాగ్రత్తగా ఎక్కాం. పై దాకా వెళ్ళాక కూడా ఇంకో రెండు మూడు అంతస్థులు చక్కని శిల్పాలను చెక్కారు. నెమ్మదిగా అవి చూస్తూ పైకి ఎక్కాం. కానీ అప్పటికే మాకు ఓపిక పూర్తిగా అయిపోయింది. అయినా మళ్ళీ మళ్ళీ రాలేమోనని అన్నీ శ్రద్ధగా చూసాం.  ఇక్కడ ఎంత వాన కురిసినా ఈ శిల్పం మొత్తం తడవదుట. ఎన్ని అభిషేకాలు చేసినా మొత్తం విగ్రహానికి చేయటం కష్టం. అంత పెద్ద ఏకశిలా విగ్రహమిది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహానికి మహా మస్తకాభిషేకం చేస్తారు. అప్పుడు ఈ విగ్రహాన్ని పూర్తిగా తడపటానికి ప్రయత్నం చేస్తారు. తమాషా కదా, రాజ్యం కోసం యుద్ధం చేసి, గెలిచి, రాజ్యం వదులుకుని, సన్యసించి, తపస్వియై పరిపూర్ణత్వాన్ని సాధించిన మహా మనీషి బాహుబలి. ఈ బాహుబలికీ, రాజమౌళి సినిమా బాహుబలికీ ఏమీ సంబంధం లేదు. పేరు ఒకటే అంతే. ఇక్కడ వాడిన రాయి గ్రానైట్. బేలూరు హళేబీడు లాగా సోప్ స్టోన్ కాదు. మెట్లు కూడా కొండలోనే తొలిచి వున్నాయి. దీనితో మా హాలేబీడు, బేలూరు, శ్రవణబెళగొళ సందర్శనం పూర్తి అయింది.

ఓం శ్రీ హొయసలేశ్వరాయనమః, ఓం శ్రీ శాంతలేశ్వరాయనమః 
ఓం శ్రీ చెన్నకేశవాయనమః, ఓం శ్రీ గోమఠేశ్వరాయనమః 

ఇక తరువాత మనం హంపి లోని విరూపాక్ష ఆలయం గురించి, విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి శిధిలాల గురించి చెప్పుకుందాం.




భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం