హంపి-విరూపాక్ష
హంపి-విరూపాక్ష
హంపి మేము 1985లో ఒకసారి, 1989 లో ఒకసారి వెళ్లాం. నాకు కృష్ణదేవరాయలంటే హీరో వర్షిప్. రైల్వేకోడూరులో ఉంటున్న రోజుల్లో అక్కడి లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసుకుని మొత్తం విజయనగర రాజవంశ చరిత్ర, మొత్తం సుమారు 27 భాగాలనుకుంటా, అన్నీ చదివా. అప్పటినించీ నాకు కృష్ణదేవరాయలన్నా, హంపి అన్నా ఇష్టం, గౌరవం పెరిగాయి. పైగా తాను స్వతహాగా తుళుభాష వాడైనా తమిళ, కన్నడ తెలుగు కవులను ఇష్టంగా పోషించాడు. ఎన్నో గొప్ప గొప్ప కావ్యాలు రచించడానికి దోహదపడ్డాడు. తాను స్వయంగా "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి, గోదా కల్యాణాన్ని, 'ఆముక్తమాల్యద' పేరుతో కావ్యంగా తెలుగులో రచించాడు. ఇవి అన్నీ కలిసి నాకు కృష్ణదేవరాయలన్నా, హంపి అన్నా ఇష్టం కలిగేలా చేశాయి. కానీ బాధ కలిగించే విషయం ఒక్కటే, తానెంత యోధుడైనా, కళాపిపాసి అయినా, నిత్యం యుద్ధాలు, కవనాలు, నృత్యాలు, గానాలు, శిల్పాలు, ఆలయాలు అంటూ తన స్వంత అంతఃపురాన్ని కాపు కాచుకోలేకపోయాడు. ఫలితంగా అంతఃపురంలో ఆంతరంగిక కలహాలు పెచ్చుమీరి వారసులు లేకుండా పోయారు. నిజంగా నన్ను బాధించిన అంశమిది.
విద్యారణ్యస్వామి వారు సనాతన సంప్రదాయాన్ని పునరుద్ధరించే శక్తి కలిగిన ఒక రాజ్యాన్ని స్థాపించాలని హరిహరరాయలు, బుక్కరాయలు సోదరుల చేత శంఖుస్థాపన చేయించిన రాజ్యం అది. ఈ హరిహర రాయలు, బుక్కరాయలు సోదరులు, ఇంతకు పూర్వం కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుని వద్ద పనిచేసిన గొప్ప యోధులు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం, తమ గురువు
శ్రీ విద్యారణ్యస్వామి కృపతో, ప్రోత్సాహంతో, ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇక్కడ కుందేళ్లు కుక్కలను తరమటం చూసి, ఈ ప్రాంతాన్ని పౌరుషానికి ప్రతీకగా భావించి ఇక్కడ నగర నిర్మాణం చేశారు విద్యారణ్యుల వారు. విద్యారణ్యస్వామి సన్యాసి, ఎటువంటి స్వార్ధమూ లేకుండా కేవలం సనాతన ధర్మాన్ని పరిరక్షించటమే బాధ్యతగా కృషి చేసిన మహానుభావుడు. ఈయన సంగీతంలోనూ ఒక గొప్ప ప్రయోక్త. ఈ విద్యారణ్యస్వామి పేరు లేకుండా మన భారతీయ సంగీత చరిత్ర రాయటం అసాధ్యం. ఈ రోజుకీ ఈ విద్యారణ్యస్వామి స్థాపించిన విద్యారణ్యపీఠం హంపిలో మనం చూడచ్చు. ఇది శృంగేరి పీఠానికి ఉపపీఠం. హంపికి ముందు ఈ స్వామి పేరు మీద విద్యానగరం అని పెట్టారు, కాలక్రమేణా అది విజయనగరం అయింది. తరువాతి రోజుల్లో అక్కడ ప్రవహిస్తున్న నది పేరు మీద కావచ్చు, లేదా అక్కడ వున్న విరూపాక్షాలయంలో వున్న అమ్మవారి పేరు మీద కావచ్చు, అది పంపగా మారింది. ఈ పంపే పంపి, హంపి అయింది. కన్నడిగులు ప అనే అక్షరాన్ని హ అని పలుకుతారు. పాలు అనాలంటే హాలు అంటారన్న మాట. ఇదీ హంపి పేరు వెనుక కథ.
ఈ హంపి విద్యారణ్య పీఠంతో మాకో మరపురాని అద్భుతమైన అనుభవం వుంది, చెబుతాను. ఆ పీఠంలో పని చేసే ఒక సాధకుడు, పేరు తెలియదు. మా వాళ్ళందరూ ఆయన్ని హంపీ స్వామి అనేవారు. ఉరవకొండలో మా ఫ్రెండ్ ఇంట్లో మాకు పరిచయం అయ్యారు. మా ఫ్రెండ్ ఆయన్ని ఎంతో కాలంగా వాళ్ళింట్లో లక్ష్మీదేవి విగ్రహం ఒకటి పూజ కోసం తెచ్చిపెట్టమని అడుగుతోంది. ఆయన ఇంకా టైం రాలేదని దాట వేస్తున్నాడుట. 'ఆ విగ్రహం తెచ్చి ఆయనే పూజ చేసి మన పూజా గృహంలో పెడతే అది ఇంటికి మంచిది. ఆ లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే, అవసరమైనప్పుడు డబ్బు వస్తుంది. డబ్బుకు ఇబ్బంది పడరు అనేది ఒక నమ్మకంట.' ఇవ్వన్నీ నా ఫ్రెండ్ చెప్పింది. నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన రోజున అనుకోకుండా ఆయన వచ్చారు. ఆ విగ్రహం తెచ్చానని, మరుసటి రోజు నా ఫ్రెండ్ ఇంట్లో ఆ విగ్రహం పెడతానని చెప్పారు. నా ఫ్రెండ్ చాలా సంతోషపడింది. నాకు ఈ సంగతులేమీ ముందు తెలియవు. ఏదో నా రామ మంత్రం, సరస్వతీ మంత్రం చేసుకోవటం తప్ప, నాకు ఆ రోజుల్లో అంత కన్నా పెద్ద పూజా, పద్ధతీ కూడా ఏదీ లేదు. ఆయన నన్ను చూసి 'రేపు మీ ఇంట్లో కూడా విగ్రహం పెడతాను. మడి కట్టుకుని వంట చేసి, అమ్మవారికి నైవేద్యం పెట్టి నాకు భోజనం మడిగా పెట్టు' అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. నేను ఆయన్ని ఏమీ అడగలేదు, మా వారికీ చెప్పలేదు. కొంచం సందేహిస్తున్నా. నా ఫ్రెండేమో వెంటనే నన్ను ఒప్పుకోమంది. నేను చాలా ఏళ్లుగా అడుగుతుంటే, నాకిప్పుడు వచ్చింది. మీకు అడగకుండానే వచ్చింది, ఒప్పుకోండి, అని చెప్పింది. అప్పుడు నేను సరే అన్నా. ఏ నాడైతే ఆ లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందో, ఆ నాటి నుంచి నిజంగా డబ్బు అవసరం ఎప్పుడు వచ్చినా మాకు డబ్బు సక్రమ మార్గాల్లోనే అందుబాటు లోకి వచ్చేది. ఆ లక్ష్మీదేవి కృప మా కుటుంబం పై ఉన్నది. మరుసటి రోజు ఆయన వచ్చాడు, నేను పూజకు ఏర్పాట్లు చేసాను. నాకు చిన్నప్పటి నుంచీ, అంటే నేను ఏడో క్లాస్ లో వున్నప్పటి నుంచీ అవసరమైనప్పుడు మడి కట్టుకుని వంట చెయ్యటం అలవాటే. పిల్లలు స్కూలుకి, మావారు బ్యాంకుకి వెళ్లారు. ఆ సాధకుడు వచ్చారు. పూజకు కూర్చున్నారు. నేను వంటకు ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాను. మా వంటిల్లు చాలా చిన్నది, దాంట్లోనే డైనింగ్ టేబుల్, వాషింగ్ మిషన్ అన్నీ ఉంటాయి. పాపం మా దేవుడు వంటింట్లోనే ఒక గూడులో సద్దుకుని ఉంటాడు. ఆ గూడు పక్కనే, వంట ఇంటి అలమారా వుంది. మధ్యలో నేను వంట చేస్తున్నాను. ఈ చిన్న గూడులో ఆయన పూజ ఏం చేస్తారని, నేను పూర్తిగా పూజ గూడు వున్న వైపుకి ఐమూలగా ఆ గదిలో పాతకాలపు పొయ్యి చిమ్నీ ఒకటి ఉంటే, అది ఖాళీ చేసి ఆ చిమ్నీ గూడు కింద, ఆయనకు పూజకు, అభిషేకానికి, కూర్చోవటానికి అన్నీ ముందే అమర్చిపెట్టాను. ఆయన వస్తూనే కాళ్లు కడుక్కు వచ్చి అక్కడ పూజకు కూర్చున్నారు. నా వైపుకి, పూజ గూడు వైపుకు రాగలిగే అవకాశం, ఆ చిన్నగదిలో ఆయనకు లేనే లేదు. పైగా నా పూజ గూడు, నా వెనుక వైపుకు ఉంటుంది. ఎవరైనా ఆ పూజ గూడుకి చేరుకోవాలంటే, నన్ను దాటే వెళ్ళాలి, అక్కడేమో అంత చోటు లేదు. కాసేపు పూజ చేసి, అభిషేకం చెయ్యాలి, అమ్మవారిని తీసుకురా, అన్నాడు. నేనేమో మీరే కదా తేవాల్సింది అన్నాను. అమ్మవారు ఎప్పుడో వచ్చి నీ ఇంట్లో పూజ గూడులో కూర్చుంది, తీసుకు రా అన్నాడు. నేను మళ్ళీ అదెలాగండీ, మీరు నాకు ఇవ్వనే లేదు, మీరు కూడా ఇటు వైపు రాలేదు కదా అన్నాను. నిజంగానే ఆయన నన్ను దాటితే కానీ నా పూజ గూటి వైపుకి వెళ్ళలేడు. ఆయన, మళ్ళీ వెళ్లి చూడు, చక్కగా జడ వేసుకుని కూర్చుంది అన్నారు. నేను సందేహంగానే వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే చక్కగా జడ వేసుకుని గోడ వైపుకు ముఖం పెట్టి అమ్మవారి విగ్రహం వుంది. తెల్లబోయా, ఆశ్చర్యం, ఆనందం, ఇదేమి మాయో అని భయం. నెమ్మదిగా తెచ్చి ఇచ్చా. చిన్న విగ్రహం, ఒక అంగుళం అంత ఉంటుంది, పంచలోహాలతో చేసింది, అంత అంగుళం విగ్రహంలో కూడా చక్కగా జడ, ఎంత బావుందో, అమ్మవారు మహాకళగా వుంది. ఆయన యధావిధిగా పూజ చేసి, అభిషేకం చేసి, మా ఇంట్లో పూసిన గన్నేరు పూలతో పూజ చేసి, నైవేద్యం పెట్టి, తరువాత ఆ విగ్రహాన్ని మా పూజ గూడులో పెట్టి, రోజూ దీపమో, ధూపమో పెట్టు, చాలు అని చెప్పారు. ఈ నాటికీ ఈ మహాలక్ష్మి మాఇంట్లో పూజలో ఉంటూ నిత్యం మా పూజలందు కుంటోంది.
మేము ఉరవకొండలో వుండే రోజుల్లోనే మొదటిసారి హంపి చూసాం. "గంగా స్నానం, తుంగా పానం, నర్మదా ప్రదక్షిణం" అంటారు. మేము ఈ మూడింటిలోనూ స్నానమూ పానమూ కూడా చేసాం. నర్మదా ప్రదక్షిణమూ చేసాం. ఉరవకొండలో వున్న ఐదేళ్లు, గుంతకల్ లో వున్న మూడేళ్లు మాకు తుంగ నీరే వచ్చేది. బొకారోలో వున్న రోజుల్లో గంగనీరు వచ్చేది. సరే, ఉరవకొండ నుంచి స్నేహితులతో బయలుదేరి బళ్ళారి, హంపి, తుంగభద్రా డాం చూసాం. పంపానది కూడా తుంగభద్రకు ఉపనది. విరూపాక్ష ఆలయానికి దగ్గరలోనే, అర కిలోమీటర్ లోపే పంపానది వుంది. ఈ విరూపాక్షుని ఆలయంలో అమ్మవారు కూడా పంపాదేవి. హంపి చేరుతూనే ముందుగా విరూపాక్షాలయానికి వెళ్లాం. ఆ వెళ్లే దారిలో కృష్ణదేవరాయల కాలంలో రోడ్డుకి అటూ ఇటూ అంగళ్లలో రత్నాల రాసులు పోసి అమ్మే వాళ్ళంటారు కదా, ఆ అంగళ్ళు చూసాం. ఆ అంగళ్లలోనే కూర్చున్నాం. రోడ్డుకి అటూ ఇటూ ఫుట్ పాత్ లపై వున్న రాతి అరుగులు అవి. అవి మాత్రం విరిగిపోకుండా వున్నాయి. విరూపాక్షుడు, విరూప-అక్షుడు అంటే ఎగుడు దిగుడు కన్నులవాడు, శివుడు అని అర్ధం. బాదామి చాళుక్యులు ఈ విరూపాక్ష ఆలయాన్ని నిర్మించారని అంటారు. కృష్ణదేవరాయలు ఈ ఆలయంలో మిగిలిన హంగులన్నీ చేసాడు. గోపురాలు, మంటపాలు కట్టించాడు. మొత్తం హంపీలో ఈ ఒక్క ఆలయమే దాడికి గురి కాకుండా మిగిలింది. బహుశా బాదామి చాళుక్యులు, దక్కనీ ముసల్మానులకు వున్న స్నేహం వల్ల కావచ్చుననేది ఒక వూహ. భగ్నం కాకుండా మిగిలిపోయి పూజా పునస్కారాలు అందుకుంటున్న ఆలయం హంపీలో ఇది ఒక్కటే. చుట్టూ ఉపాలయాలు కూడా వున్నాయి. ఈ ఆలయంలోని ఒక విశేషమేమంటే, ఆనాటి రోజుల్లో గోడలో చెక్కిన పిన్ హోల్ కెమెరా. ఆలయంలో ఒక గోడలో రంధ్రం ఒకటి ఉంటుంది. ఆ రంధ్రం ద్వారా ఎండ పడినప్పుడు గోపురం నీడ ఎదురుగుండా వుండే గోడపై తలకిందులుగా పడుతుంది. ఇదే ఈనాటి పిన్ హోల్ కెమెరా పనిచేసే సిద్ధాంతం. ఇప్పటికీ ఆ గోడను చూస్తే రంధ్రం నుంచి పడుతున్న గోపురపు తలకిందులు నీడ కనిపిస్తుంది. కానీ ఇది చూడాలంటే కాస్త ఎండ వున్నప్పుడు వెళ్ళాలి.

ఇప్పుడు హంపి శిధిలాల గురించి చెప్పకుందాం. ఇక్కడ ఆనాటి విద్యానగరమూ లేదు, విజయనగరమూ లేదు, హంపీ నగరమూ లేదు, కేవలం హంపి శిధిలాలు మాత్రమే మిగిలున్నాయి. ఇవి యునెస్కో గుర్తించిన పర్యాటక ప్రదేశం. ఆ నాటి కట్టడాలు హృదయవిదారకంగా కనిపిస్తాయి. ఎంత కఠినాత్ముడైనా కన్నుల నీరు పెట్టే లాగా ఉంటుంది. ఆనాటి బ్రహ్మాండమైన కట్టడాలు, అందమైన మహళ్ళు, రథ, గజ, తురగ శాలలు ఎంత బావుంటాయో. రాణి గారి మహల్ ఒక రకపు లేలేత ఆరంజ్ రంగులో ఎంత ముద్దుగా ఉంటుందో, అసలు అటువంటి రంగుని రెండు షేడ్ లలో ఆ రోజుల్లో ఎలా వేయగలిగారో, అనిపిస్తుంది. పైగా ఆ రంగులన్నీ అన్నీ సహజమైన చెట్లు, పూలు, ధాతువుల నుంచి తయారు చేసినవి. ఈనాటి కెమికల్ రంగులు కావవి. అందమైన ఆకారంలో మెట్లున్న ఒక బావి, దసరా దిబ్బ ఎదురుగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో దసరా ఉత్సవాలు విజయనగరంలో అద్భుతంగా, కన్నుల పండువగా నిర్వహించేవారట. ప్రజలందరూ ఈ ఉత్సవాలను తిలకించటానికి, బండ్లు కట్టుకుని గుంపులు గుంపులుగా వచ్చేవారట. వారికి నీటి సౌకర్యార్దం ఈ దిగుడు మెట్లబావిని తవ్వించాడట కృష్ణదేవరాయలు. ఆ దసరా దిబ్బపై కొలువు తీరి అన్ని ఉత్సవ కార్యక్రమాలూ కృష్ణదేవరాయలు చూసేవాడట. జనం అంతా ఆయన్ని చూడటానికే ఎక్కువ వచ్చేవారని పేరు.
ఇప్పుడు హంపి శిధిలాల గురించి చెప్పకుందాం. ఇక్కడ ఆనాటి విద్యానగరమూ లేదు, విజయనగరమూ లేదు, హంపీ నగరమూ లేదు, కేవలం హంపి శిధిలాలు మాత్రమే మిగిలున్నాయి. ఇవి యునెస్కో గుర్తించిన పర్యాటక ప్రదేశం. ఆ నాటి కట్టడాలు హృదయవిదారకంగా కనిపిస్తాయి. ఎంత కఠినాత్ముడైనా కన్నుల నీరు పెట్టే లాగా ఉంటుంది. ఆనాటి బ్రహ్మాండమైన కట్టడాలు, అందమైన మహళ్ళు, రథ, గజ, తురగ శాలలు ఎంత బావుంటాయో. రాణి గారి మహల్ ఒక రకపు లేలేత ఆరంజ్ రంగులో ఎంత ముద్దుగా ఉంటుందో, అసలు అటువంటి రంగుని రెండు షేడ్ లలో ఆ రోజుల్లో ఎలా వేయగలిగారో, అనిపిస్తుంది. పైగా ఆ రంగులన్నీ అన్నీ సహజమైన చెట్లు, పూలు, ధాతువుల నుంచి తయారు చేసినవి. ఈనాటి కెమికల్ రంగులు కావవి. అందమైన ఆకారంలో మెట్లున్న ఒక బావి, దసరా దిబ్బ ఎదురుగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో దసరా ఉత్సవాలు విజయనగరంలో అద్భుతంగా, కన్నుల పండువగా నిర్వహించేవారట. ప్రజలందరూ ఈ ఉత్సవాలను తిలకించటానికి, బండ్లు కట్టుకుని గుంపులు గుంపులుగా వచ్చేవారట. వారికి నీటి సౌకర్యార్దం ఈ దిగుడు మెట్లబావిని తవ్వించాడట కృష్ణదేవరాయలు. ఆ దసరా దిబ్బపై కొలువు తీరి అన్ని ఉత్సవ కార్యక్రమాలూ కృష్ణదేవరాయలు చూసేవాడట. జనం అంతా ఆయన్ని చూడటానికే ఎక్కువ వచ్చేవారని పేరు.
ఇక మిగిలిన ఆలయాలు, విజయ విఠల ఆలయం, హజార రామాలయము, బాలకృష్ణుని ఆలయం, అచ్యుతరాయ ఆలయం, గణపతి ఆలయాలు, లక్ష్మీనరసింహ ఆలయం, బదవి జలలింగాలయం, ఒక్కటేమిటి, ఎక్కడికెళ్లినా శిథిలాలే శిధిలాలు. అందువల్ల ఎక్కడా పూజల్లేవు. కేవలం అవి ఎంత భయంకరంగా నాశనం చేయబడ్డాయో, విరగ్గొట్టబడ్డాయో చూసి కన్నీళ్లు పెట్టుకుని రావటమే. కొన్ని విగ్రహాల ముక్కలు మ్యూజియంలో నేటికీ చూడచ్చు. బాలకృష్ణుని ఆలయం గురించి శ్రీ నోరి నరసింహశాస్త్రిగారు తన ధూర్జటి నవలలో ఎంత బాగా రాసారో. లక్ష్మీనరసింహ ఆలయం లోని ప్రధాన విగ్రహానికి చేతులు తెగనరికి, ఆయన ఒడిలో కూర్చుని వున్న లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని విరగ్గొట్టేసారు. ఇక్కడ నరసింహస్వామి యోగాసనంలో ఉంటాడు. విరగ్గొట్టబడిన అమ్మవారి చేయి మాత్రం ఇప్పటికీ ఈ విగ్రహం పై మనకు కనిపిస్తుంది. ఇంత గట్టి గ్రానైట్ శిలను కత్తులతో, కొడవళ్ళతో నరికారంటే, అవి ఎంత పదునుగా, వాడిగా వుండి ఉండాలో కదా. అలాగే రెండు గణపతి ఆలయాలు, ఒకటి సెనగగింజ గణపతి, ఇంకోటి ఆవగింజ గణపతి. ఎందుకంటే అక్కడ లంబోదరుని ఉదరాలు ఆ గింజల ఆకారంలో ఉంటాయి. వీటికి డామేజ్ కొంచం తక్కువ జరిగింది. ఆలయాలు విరగ్గొట్టేసారు కానీ విగ్రహాలు ఎందుకో ముట్టుకున్నట్టు లేదు. అల్లాగే మరొక విగ్రహం కూడా బాగానే వుంది. అదే జలలింగం, బదవి లింగం, దీనికీ గర్భాలయం తప్ప ఆలయం లేదు. ఇది ఎప్పుడూ నీళ్లలోనే ఉంటుంది. లోపల చీకటిగా ఉంటుంది. దారిలో కృష్ణదేవరాయలు తులతూగే రాతిత్రాసు కనిపించింది. దాంట్లో కృష్ణదేవరాయలు బంగారం, రత్నాలు, మణులు, మాణిక్యాలతో తుల తూగేవాడట. తరువాత అవన్నీ దాన ధర్మాది కార్యక్రమాలకు వాడేవారట. ఇక్కడ మాల్యవంతం అనే ప్రదేశంలో రాముడి ఆలయం వుంది. ఈ ప్రాంతానికి, త్రేతాయుగపు రామాయణానికి ఒక సంబంధం వుంది. ఈ ప్రాంతం అంతా, అప్పటి కిష్కింధ. ఋష్యమూక పర్వతం, కిష్కింధ, పంపానదీ తీరం, ఈ ప్రదేశాలన్నీ మనకు రామాయణం లోని కిష్కింధకాండలో కనిపిస్తాయి. వాలి నుంచి తనను తాను రక్షించుకోవటానికి సుగ్రీవుడు తన సహచరులతో పాటు ఈ ప్రాంతానికి చేరుకుంటాడు. ఇక్కడే రామలక్ష్మణులను వాళ్ళు కలుసుకున్నారు. రాముడు, హనుమంతుడు తొలిసారి కలుసుకున్న ప్రాంతమిది. మిగిలిన రామాయణం మనకు తెలిసిందే. సుగ్రీవుడు దాక్కున్న గుహ కూడా చూపించారు. ఈ కధంతా నిజమేనని చెప్పటానికి సాక్ష్యాలుగా వందలాది కోతులు, కొండముచ్చులు అక్కడ వున్నాయి. అక్కడ పంపానది లోనే చాలా స్తంభాలతో
అందంగా, మళ్ళీ నిరాడంబరంగా వున్న ఒక మంటపం వుంది. పురందరదాసు ఆ మంటపం లోనే కూర్చుని తన కీర్తనలను రచించి గానం చేసేవాడని చెప్పారు. మేమూ ఆ మంటపం లోకి వెళ్లి చూసాం. కానీ అక్కడేమీ శిల్పాలు, శాసనాలు మాత్రం లేవు.
ఇక మిగిలింది మరో అద్భుతమైన ఆలయం, విజయ విఠల ఆలయం. ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్ప శిల్పం వుంది ఇక్కడ. కేవలం శిల్పమే కాదు, ఆనాటి స్థపతులు, రాతితో చేసిన గమ్మత్తులున్నాయి ఇక్కడ. ముందుగా గర్భాలయానికి వెళ్తే చాలా పెద్ద బ్రహ్మాండమైన విఠలుని విగ్రహం, తల లేకుండా. ఆ పక్కనే కింద, ఆ నరికిన తల పెట్టబడి వుంది. ఆ ముష్కరులకు చేతులెలా వచ్చాయో, ఆ కత్తులను నోరూ వాయా లేని రాళ్లపై ఎత్తటానికి, నరకటానికి. గోపురాలు కూడా సరిగ్గా లేవు. బయట ముఖమంటపానికి వస్తే అక్కడ వున్నాయి సంగీతస్తంభాలు. ఈ కింద ఫొటోలో చూడండి, ఆ స్తంభాలు మధ్యలో అరిగిపోయి ఎలా పీలగా అయిపోయాయో. ఆ స్తంభాలని మధ్యలో లయబద్ధంగా తట్టి వాయిస్తుంటే, అవి సరిగమలు పలుకుతాయి. కేవలం సరిగమలే కాదు, రకరకాల వాయిద్యాల ధ్వనులూ చేస్తాయి. ఆ స్తంభాలు అన్నింటికీ లోపల డొల్ల. అందువల్లే ఆ హాలో స్తంభం నుంచి అంత శ్రావ్యమైన శబ్దాలు వస్తాయి. నిజంగా అన్ని స్తంభాలూ అందరూ వాయిస్తుంటే, అదే ఓ కచేరీ. ఎంత సేపున్నా తనివి తీరదు, మనసు నిండదు. కదల బుద్ధి వెయ్యదు. ఆ కృష్ణదేవరాయలు నిజంగానే కళాపోషకుడు, కళాభిమాని, తానూ సహజంగా కళాకారుడు. కళలని, కవులని పోషించి చిరస్మరణీయుడైనాడు. ఎటువంటి స్వార్ధ చింతనా లేకుండా, కళను కళ కోసమే ప్రేమించిన ఆదర్శపురుషుడు. గొప్ప రాజు. ఈ ముఖమంటప సౌందర్యపు మత్తు నుంచి ఇంకా తేరుకోకముందే, ఆ కిందనే వున్న తేరు, అదే ఏకశిలా రధం. సమున్నతంగా, అచ్చం అసలైన రధం లాగానే, కదిలే చక్రాలతో, ఆలయంలో స్థిర ప్రతిష్ట చేసిన రథం. నగరంలో దేవుడి రధోత్సవం జరిగే సమయంలో, ఈ రథంలో కూడా ఉత్సవ విగ్రహాలుంచి, ఈ నాలుగు చక్రాలనూ భక్తులు తిప్పేవారట. రాను రానూ అవి అరిగిపోతున్నాయని, విరిగిపోతాయని ఈ మధ్యనే, (మేము చూసింది 1985లో), అవి సిమెంట్ వేసి కిందనున్న రాతితో బిగించేసారుట. ఆ రథం, ఈ సరిగమ స్తంభాల మంటపం ఎంతగా మనల్ని ఆనందింపచేస్తాయో, ముచ్చట గొలుపుతాయో, అంతగా తల నరకబడిన విఠలుడు బాధపెడతాడు. ఇంత క్రూరత్వమా అనిపించేలా భయపెడతాడు. రాయలవారికి గజసేన ఎక్కువ. వాటి కోసం కట్టిన గజశాలల గోడలపై ఏనుగుల శిల్పాలుంటాయి, అలాగే అశ్వశాలల గోడలపై అశ్వాల శిల్పాలుంటాయి.
ఆ రోజుల్లోనే పంట పొలాలకు నీరు పారించటానికి రాతి స్తంభాలపై రాతి గోలెంలు వున్నాయి. పంటలకు నీళ్లు వదిలినప్పుడు, అవి నేరుగా పంపా నుంచి ఈ గోలెంల ద్వారా కిందకు ప్రవహించి పొలాలను తడిపేవిట. ఎక్కడికక్కడ ప్రాకారాలూ, బురుజులూ వున్నాయి. అన్నీ ప్రస్తుతం విరిగి ముక్కలు ముక్కలుగా పడి వున్నాయి. ఆ ముక్కలనన్నింటినీ ఏర్చి కూర్చి మళ్ళీ ఒక రూపం తీసుకు రావటానికి పురావస్తు శాఖవారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. దసరాదిబ్బ, దాని ఎదురుగా వున్న మెట్ల బావి, మొత్తం మట్టిలో పూడుకు పోయి వుంది కనుక, తవ్వకాల్లో దొరికి ఆ మాత్రమైనా మిగిలాయి. ఇప్పటికీ కృష్ణదేవరాయల సభా గృహం, రాజగృహం, అంతఃపురం, భువనవిజయం, కృష్ణదేవరాయల సమాధి వగైరా కొన్ని కట్టడాలు దొరకలేదు. ఇంకా తవ్వకాలు జరుగుతూనే వున్నాయి. ఒక్క విషయం మాత్రం గమనించాలి. ఇక్కడ గైడ్ లేకుండా చూడటం దాదాపు అసాధ్యం. తవ్వకాలు ఇంకా జరుగుతూనే వున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏమి బయట పడుతుందో తెలియదు. పైగా ఈ ప్రాంతాలు అన్నీ విసిరేసినట్టు దూరదూరంగా ఉంటాయి. ఏ వాహనాలూ పోవటానికి దారి ఉండదు. నడవాలి, అన్నీ చూడాలంటే మైళ్ళు, మైళ్ళు నడవాలి. ఆ శ్రమకు సిద్ధంగా ఉండాలి. తప్పదు. అప్పుడే అన్నీ చూడగలం.
కృష్ణదేవరాయల అల్లుడైన, అళియ రామరాజుని తళ్లికోట యుద్ధంలో ఓడించి, ఆతని తలని నరికి తెచ్చి, దక్కనీ ముసల్మానులు అందరినీ భయభీతులను చేశారు. ఆ విజయం తరువాత నగరాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. ప్రతి మహలునీ, ప్రతి ఆలయాన్నీ, ప్రతి ఇంటినీ, ప్రతి అంగడినీ దోచేశారు. ఏవీ వదలలేదు. మిగిలిన అవశేషాలను తగులపెట్టారు. ఒక్క హంపి నగరమే సుమారు ఆరు నెలల పాటు మండుతూనే ఉందట. అన్నాళ్లు మండాక, ఇక మిగిలేదే ముంటుంది, బూడిద తప్ప. మొత్తానికి ఒక మహా యోగి చేత స్థాపించబడిన నగరం, ఒక మహా పురుషుడు పాలించిన నగరం, ఒక చరిత్ర సృష్టించిన మహా నగరం, మన భారతదేశం, ఎంత గొప్పదో, ఎంత సంపద కలిగిందో, ఎంత ధనిక దేశమో ప్రపంచానికే వెల్లడి చేసిన నగరం, బూడిదైపోయింది. ప్రజలు చేతికి అందినది పట్టుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పారిపోయారు. మరి కొంత మంది ప్రాణ, మానాలకు భయపడి మతం కూడా మారిపోయారు. హంపి నాశనమై పోయింది. హంపిలో ఆనాటి కళలూ లేవు, కళాకారులూ లేరు. కళాపోషకులూ లేరు. ఆనాటి భువనవిజయమూ లేదు, దాంట్లో అష్ట దిగ్గజాలూ లేరు. వాళ్ళ కావ్యాలూ లేవు, పద్యాలూ లేవు. ఆ కవి పండిత పోషకులూ లేరు. మిగిలినవి మాత్రం ఆనాటి గొప్పతనానికి శిధిల సాక్ష్యాలుగా బేలగా, దుమ్మూ ధూళిలో పడి ఉండి, ఎండకూ, వానకూ ఎండీ, తడిసీ, అవి ఏడవలేక, మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి. అన్ని రకాల ఉత్థాన పతనాలనూ, ప్రత్యక్షంగా చూసిన నగరమిది. ఒకప్పుడు కోలాహలంగా వుండే నగరం, ఇప్పుడు హాలాహలం మింగి నిర్జీవంగా పడి వున్నది. విజయనగరమా, నీకు నమస్కారం. ఇంతటితో హంపి చరిత్ర ముగిస్తాను.
ఎంత చెప్పినా, తరగని దుఖఃమది. ఇక్కడితో ఈ దుఃఖాన్ని వదిలి, తరువాత అందరమూ TB డాం కి వెళ్లాం. అదో మధుర మనోజ్ఞ మానవ నిర్మిత సజీవ చిత్రం. డాం లు చాలానే చూసాం కానీ ఈ డాం కింద వున్న పార్క్ మాత్రం పరమ ప్రత్యేకం. దీన్నే TB డాం గార్డెన్స్ అంటారు. మన అన్ని పాత సినిమాల్లోనూ హీరో హీరోయిన్లో, కమెడియన్లో ఎవరో ఒకరిదైనా పాట ఇక్కడ చిత్రీకరింప బడాల్సిందే. మధ్యలో నీళ్లు జలజలా పారుతూనే, ఒకవైపు, హీరో, మరో వైపు హీరోయిన్ చుట్టూ పచ్చటి మొక్కలు, రంగురంగుల పూలు, అబ్బో, కళ్ళు పట్టనంత అందం. తెలుగేమిటి, అన్ని భాషల సినిమాల పాటలూ తీసారట అక్కడ. అవన్నీ చూసి పులకించి పోయాం. అంత అందంలో తడిసి ముద్దై పోయాం. మనసు మళ్ళీ ప్రహ్లాదమైంది. తిరిగి ఉరవకొండ వచ్చేసాం. మా పంపుల్లో తుంగ నీరు తాగొద్దూ మరి.
ఇక ఇప్పుడు మదరాసు, మెడ్రాస్. చెన్నపట్నం, చెన్నై వెళదాము. మద్రాస్ మహానగరంలో పురాతన కాలానికి చెందిన ఎన్నో ఆలయాలు ఈనాటికీ భద్రంగా వున్నాయి. అక్కడి కపాలీశ్వరున్ని చూసి మహాబలిపురం వెళ్ళొద్దాం.
ఓం శ్రీ విరూపాక్షాయనమః, ఓం శ్రీ విజయ విఠలాయ నమః
భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Very well written Vijaya. I am traveling along with you to all the beautiful places. I will be visiting your home one of these days to take blessings of Goddess Mahalakshmi and to see her Jada.
రిప్లయితొలగించండిEntha baga rastunaro aunty....ala chaduvuthu unte aa place lo unate undi aunty...aa shilpa kala/sampada ni destroy chesindi chaduvutu unte kallalo neelochay....
రిప్లయితొలగించండి