విశ్వకర్మ జయంతి జ్ఞాపకాలు


విశ్వకర్మ జయంతి జ్ఞాపకాలు

నేడు విశ్వకర్మ జయంతి, ఈ సందర్భంగా కొన్ని మధుర జ్ఞాపకాలు నావి. మేము సంబల్పూర్, ఒరిస్సాలో ఉన్నప్పటి రోజుల్లో సంగతి ఇది. అక్కడ హీరాకుడ్ లో ఈ ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహించేవారు. ఆ రోజే అందరూ ఆయుధపూజ చేసేవారు. ఉదయం పూట అన్ని ఫాక్టరీల్లో పూజలు, విందు వినోదాలు ఉండేవి. అది ఆయా ఫాక్టరీల వారు, వారి మట్టుకు చేసుకునేవారు. అసలు హడావుడి అంతా సాయంత్రమే.
హీరాకుడ్ కి 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే మా సంబల్పూర్, బుర్లా ఉండేవి. సంబల్పూర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే, బుర్లా సంబల్పూర్ యూనివర్సిటీ, దీని పేరు జ్యోతీబిహార్, హెడ్ క్వార్టర్స్. సాయంత్రం అయ్యేసరికి ఈ మూడు ప్రాంతాలనుంచీ జనం అంతా కోలాహలంగా హీరాకుడ్ చేరుకునేవాళ్ళు. ఈ వేడుకలు నిర్వహించటానికి అన్ని ఫాక్టరీల వాళ్ళూ, వాళ్ళ వాళ్ల జీతాల నుంచి ఒక రోజు జీతం, కులమతాలకు అతీతంగా, విరాళంగా ఇచ్చేవాళ్ళు. ఆడో సరదా వాళ్లకు. పైగా అందరూ ఈ ఉత్సవాలను ఎంతో వేడుకగా, పోటాపోటీగా చేసేవారు. హీరాకుడ్ పూర్తిగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లాంటిది. దానికి తోడు ప్రపంచ ప్రసిద్ధ హీరాకుడ్ డామ్ కూడా అక్కడే ఉంది. ఆ ఫ్యాక్టరీలన్నీ సాయంకాలం వేళ, దీపాలు పెట్టగానే వాళ్ల ఫ్యాక్టరీ తరఫున టాబ్లూలను ప్రదర్శించేవారు. మన రిపబ్లిక్ డే పెరేడ్ లో ఢిల్లీలో జరిగినట్లు అన్ని టాబ్లూలతో  గొప్ప వూరేగింపు, ప్రోసెషన్, జరిపేవారు. అసలే అందరూ టెక్నికల్ వాళ్లేమో, అన్ని టాబ్లూలు అద్భుతంగా ఉండేవి. సుమారు 2, 3 గంటలు ఆ ఊరేగింపు జరిగేది. ఆ లైటింగ్, ఆ బొమ్మలు, వాటి కదలికలు, మ్యూజిక్, ఎంతో కన్నుల పండుగ గా ఉండేది. 

మానాన్న సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్. ఆ స్కూల్లోనే పుష్పా అబ్రహామ్ మేడం వుండేవారు, సైన్స్ TGT గా. ఆమె భర్త ఆలిండ్ లో చేసేవారు. పైగా ఆ ఊరేగింపు ఈ మేడం వాళ్ళ ఇంటి ముందు నుంచే సాగిపోయేది. (ఈ మేడం వాళ్ళ బ్రదర్ ఇందిరాగాంధీ గారి ముఖ్య అనుయాయుడు శ్రీ జార్జి అబ్రహామ్ గారు). ప్రతిసారీ పుష్పా మేడమ్ మా ఫామిలీని ఆ సాయంత్రం డిన్నర్ కి పిలిచేవారు. మలయాళ శాకాహార భోజనం తానే వండి పెట్టేవారు. అక్కడ భోంచేసి, (వాళ్ళ ఇంటి లోపల గోడ పక్కనే మాకందరికీ కుర్చీలు వేసి వుండేవి)  ఆ కుర్చీలో కూర్చుని ఆ ఊరేగింపు చూసేవారం. తెల్లవార్లూ బోల్డంత సందడి. అంతా అయిపోయాక వాళ్లకు థాంక్స్ చెప్పి తిరిగి సంబల్పూర్ వచ్చేసే వాళ్ళం. 

ఆ టాబ్లూల్లో విశ్వకర్మ విగ్రహాలు, ఇతర దేవీ దేవతల బొమ్మలు అన్నీ ఉండేవి. కాకపోతే, అన్నీ PoP విగ్రహాలే. మట్టి విగ్రహాలు ఉండేవి కావు. ఈ టాబ్లూలకి పోటీ ఉండేది. బెస్ట్ టాబ్లూలకి ప్రైజ్ లు ప్రకటించేవాళ్ళు. పోటాపోటీగా టాబ్లూలను అలంకరించి ఊరేగించే వారు. పైగా ఈ తతంగమంతా ఎంతో ప్రెస్టేజియస్ గా తీసుకునేవారు. సాధారణంగా ఎప్పుడూ ఫస్ట్ ప్రైజ్ ఆలిండ్ కో, ఇండాల్ కో వచ్చేవి. అవి అల్యూమినియం ఫాక్టరీలు. అప్పటి ఇండాల్ ఇప్పుడు Hindalco అనుకుంటా. ఇవాళ విశ్వకర్మ జయంతి అంటే, ఆనాటి మరిచిపోలేని మధుర జ్ఞాపకాలను మళ్లీ ఇలా చెప్పాలనిపించింది. 🙏


భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నిర్వాణషట్కమ్

ఓంకారమమలేశ్వరం

హిమాలయే తు కేదారం